20, డిసెంబర్ 2025, శనివారం

చిన్న చిన్న సంతోషాలు



రాత్రి జ్వాలా పుస్తకం ఆవిష్కరణ సభకు వెళ్లి ఇంటికి చేరే సరికి పన్నెండు గంటలు దాటింది. సభ నిరాడంబరంగా జరిగినా దానికి హాజరైనవారు ఆషామాషీ బాపతు కాదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ రామ సుబ్రమణియన్, మంత్రి శ్రీ శ్రీధరబాబు, బీజేపీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ ఘంటా చక్రపాణి, ఎమ్మెల్సీ శ్రీమతి వాణి మొదలైన వారితో వేదిక కళకళ లాడింది.  వేదిక మీద వారే కాదు, ఆహూతులుగా వచ్చి వేదిక కింద కూర్చున్న వారు కూడా తమతమ రంగాల్లో సుప్రసిద్దులు.  తెలంగాణా ఆవిర్భావ తులాభారంలో  తులసి దళంలా ఉపయోగ పడ్డ ప్రముఖ రాజకీయ కురువృద్ధుడు శ్రీ కే. కేశవ రావు,  తెలంగాణా మొట్టమొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్. వీ. సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి, శ్రీ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ అధికారులు శ్రీ లక్ష్మీనారాయణ,  శ్రీ రావులపాటి సీతారామారావు, ఇన్ కం టాక్స్ ప్రధాన కమిషనర్ గా పదవీ విరమణ చేసిన భాస్కర రెడ్డి, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ శ్రీ దేవులపల్లి అమర్, స్టేట్ బ్యాంక్ మాజీ సీజీఎం భండారు రామచంద్ర రావు,  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విజయ రాఘవాచారి, తొలి పుస్తక గ్రహీత మా మేనల్లుడు, జ్వాలా బావమరిది డాక్టర్ అయితరాజు వేణు గోపాల రావు మొదలైన వారు సభాకార్యక్రమానికి కొత్త సొగసులు అద్దారు.
వక్తలు జ్వాలా గురించి ప్రశంశల వర్షం కురిపిస్తుంటే బాల్య స్నేహితుడిగా గొప్పగా గర్వపడ్డాను. 

వచ్చిన వాళ్ళు అందరూ కార్యక్రమం జయప్రదంగా జరిగిన తీరును, జ్వాలా నిర్వహణ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ తిరుగుముఖం పట్టారు. 
 ఇరవై ఏళ్లుగా కలవని వ్యక్తులు, అధికారులు చాలా మంది కలిసి గుర్తుపట్టి పలకరించడం నాకు కూడా సంతోషాన్ని కలిగించింది. ఇంతమందిని ఒక్కచోట చేర్చిన గొప్పతనం దండలో దారం జ్వాలాదే. సందేహం లేదు. 

ఎన్నో ఏళ్ళ తర్వాత కలిసిన మాజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి వాత్సల్యంతో ఏర్పాటు చేసిన విందును ఆస్వాదించాము.

'ఎనభయ్ ఏళ్ళా నమ్మలేము' అని పాత పరిచయస్తులు నాతో అంటుంటే  ఓ రెండు అంగుళాలు పెరిగిన ఛాతీ, ఇంటి దగ్గర కారు దిగినప్పుడు అర అంగుళానికి కుంచించుకు పోయింది.

మా ఇంటి ఎదుట రోడ్డు నిర్మాణంలో ఉన్నందున అడ్డంగా వేసిన కాంక్రీటు స్థంభాలకు తగిలి కాలి బొటన వేలు చిట్లి దేవతలు కనపడ్డప్పుడు వయసు చేసే వింతలు అనుభవం లోకి వచ్చాయి. 

అంతటితో సరి అనుకోకుండా
లిఫ్ట్ నాలుగో అంతస్తులో ఇరుక్కుపోయి పనిచేయడం లేదు. ఈసురోమంటూ ఆ రాత్రి వేళ మూడు అంతస్తులు ఎక్కి ఫ్లాటు తాళం తీయబోతే అది తెరుచుకోలేదు. ఇంట్లో మా పెద్ద కోడలు భావన, కటక్ నుంచి వచ్చిన చిన్నకోడలు కజిన్ నందిక మంచి నిద్రలో వున్నారు. నా దగ్గర తాళం చెవి వుందని చెప్పాను కానీ లోపల నుంచి తలుపు గడియ పెట్టవద్దని చెప్పలేదు. ఇద్దరికీ కొత్త. తెలియక గడియ పెట్టుకుని పడుకున్నారు. ఇన్నాళ్లు కాలింగ్ బెల్ తో అవసరం పడక, అది సరిగా పనిచేయడం లేదన్న సంగతి అప్పుడు తెలిసింది. ఇద్దరూ ఐ టీ రంగం వాళ్ళు కాబట్టి మొబైల్స్ సైలెంట్ మోడ్ లో పెట్టుకుని పడుకున్నట్టున్నారు. బయట చలి. ఏం చేయాలో తెలియలేదు. ఈ పరిస్థితిలో తెల్లార్లు జాగారం చేయడం ఎల్లారా అనుకుంటూ మధ్య మధ్య కాలింగ్ బెల్ నొక్కుతున్నాను. వేడి పెనం మీద నీళ్లు పడితే సువ్వు మన్నట్టు అది నీరసంగా వినీవినపడని చప్పుడు చేస్తోంది. పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూ పోయాను. 
కొంతసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. మధ్యలో నిద్ర లేచిన నందికకు కాలింగ్ బెల్ చప్పుడు లీలగా వినపడి తలుపు తీసింది.

బతుకు జీవుడా అనుకుంటూ లోపలకు వెళ్లి కాలి బొటన వేలికి ఆయింటు మెంటు రాసుకుని మంచం మీద నడుం వాల్చిన తర్వాత తెలిసి వచ్చింది వయసు నిజంగా ఎనభయ్యే అని, లేనిపోని బడాయిలు పనికి రావని.

ఇలాంటివన్నీ ఇబ్బందులే, కష్టాలు కావని పెద్ద కోడలు భావన బోధించిన భగవద్గీత గుర్తుకు వచ్చిన తర్వాత స్వాంతన కలిగింది.

ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగిందని దాన్ని గురించి రాయకుండా మధ్యలో ఈ ఉపాఖ్యానం.

ఎలాగూ నిద్ర ఎగిరిపోయింది. 
అందుకే అర్ధరాత్రి ఈ అంకమ్మ శివాలు.
నిద్ర అంటారా! 
రేపు అనేది ఒకటి వుంది కదా నిద్ర పోవడానికి.

తోక టపా:
సభా కార్యక్రమం నడుమ ఒక దృశ్యం నా కంటిని ఆకట్టుకుంది. 
జ్వాలా అందరి ప్రసంగాలకు ఉచిత రీతిలో జవాబు చెప్పి కూర్చోగానే దాహం వేసిందేమో, నీళ్ల కోసం సైగ చేశాడు. సభామధ్యంలో వున్న జ్వాలా ఏకైక కుమారుడు ఆదిత్య, కోడలు పారుల్  ఆ విషయం గమనించి వెంటనే వాటర్ బాటిల్ తెచ్చి అందించారు. 

ఇదేమంత పెద్ద విషయం అంటారా.
అతి పెద్ద బహుళ జాతి కంపెనీల్లో మేమెవ్వరం ఊహించలేనంత అతి పెద్ద హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళు. అయినా ఎలాంటి భేషజం లేకుండా బయటకు వెళ్లి నీళ్ల బాటిల్ వెతికి పట్టుకు వచ్చి ఇవ్వడం నాకు చాలా సంతోషం కలిగించింది.
ఒక వయసు వస్తే కానీ ఇటువంటి విషయాల్లో దాగున్న మధురిమ ఏమిటో అర్ధం కాదు.

కామెంట్‌లు లేవు: