“ఆకాశవాణి, జీవన స్రవంతి, ప్రత్యేక వార్తలు, చదువుతున్నది భభండారు శ్రీనివాసరావు.....”
“ఇంటి పేరు అంతగా ఒత్తి పలకాలా ! భండారు అంటే సరిపోతుందిగా!’
యాభయ్ ఏళ్ళ క్రితం రేడియో సహోద్యోగి వ్యాఖ్య.
ఇలా స్వరం పెంచి, నా ఇంటి పేరులో మొదటి అక్షరం వత్తు భ ను మరింత గట్టిగా వత్తి పలికినా ఫలితం లేకుండా పోయింది.
అదేమిటో నేనే కాదు చాలామందికి పేరు మీదే కాదు, ఇంటి పేరు మీద కూడా వల్లమాలిన మమకారం. బహుశా వ్యక్తిగత గుర్తింపుకు అది దగ్గరి దారి కావచ్చు.
శ్రీనివాసరావులు చాలామంది వుండవచ్చు. భండారు శ్రీనివాసరావులు పెక్కురు వుండకపోవచ్చు. వుంటే ఎడ్వర్డ్ చక్రవర్తుల మాదిరిగా ఎడ్వర్డ్ వన్, ఎడ్వర్డ్ టు అని తగిలించుకోవాలేమో!
ఇంతకీ నా ఘోష ఏమిటంటే నేను (ఒకప్పుడు) ప్రతి రోజూ వెళ్ళే టీవీల్లో కానీ, కధాచిత్ గా నా పేరు పడే పేపర్లలో కానీ ఏనాడూ నా పేరును చిత్రవధ చేయకుండా ఒదిలిన దాఖలా లేదు. బందరు శ్రీనివాస్ అనీ, బండారు శ్రీనివాసరావనీ, బండారి శ్రీనివాస్ అనీ ఇలా పలు రూపాల్లో నా పేరు దర్శనమిస్తూ వుంటుంది.
టీవీల్లో చర్చ ప్రారంభానికి ముందు మైక్ టెస్ట్ చేసేటప్పుడు అందరూ మైక్ టెస్టింగ్ వన్, టు, త్రీ అని చెబితే నేను మాత్రం ‘భండారు శ్రీనివాసరావు, భ వత్తు భ. Is it OK?’ అని అడుగుతూ వుంటాను. అయినా సరే అనేక సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు వెళ్ళే టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ‘బండారు’ అని వత్తు లేకుండానే వేస్తుంటారు. వారిది చాలా సరళ హృదయం. పరుషపు గుండె కాదని నేనే సమాధానం చెప్పుకునేవాడిని. పోనీలే వచ్చే జన్మలో అయినా లక్ష వత్తుల నోము నోచుకుంటారులే సమాధాన పడేవాడిని.
ఓసారి ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమం గురించి మర్నాడు పత్రికల్లో వచ్చింది.
నా పేరు ‘షరా మామూలే’. పైగా ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ మూర్తి గారు ఫొటోలో నా పక్కనే వున్నారు.
ఆ రాత్రి ఇంటికి చేరి, లిఫ్ట్ లో వుండగానే, జేబులో సెల్ మోగింది.
చిన్ననాటి స్నేహితుడు. ఆప్యాయంగా పలకరించాడు.
‘ఇన్నేళ్ళ స్నేహంలో నిన్ను ఏమీ కోరింది లేదు. ఆ మాటకు వస్తే కాలేజీ వదిలిన తర్వాత నిన్ను కలిసింది కూడా లేదు. మన కామన్ ఫ్రెండ్ స్వామి దగ్గర నీ నెంబరు తీసుకున్నాను’
‘నేను రిటైర్ అయి చాలా ఏళ్ళయింది. అయినా నా చేతిలో వున్నది అయితే నిక్షేపంగా చేస్తాను. ఎక్కడ పని? ఏం పని? అవుతుందో లేదో కానీ తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాను’
‘నీ చేతిలో పనే! నీ ఇంజినీరింగ్ కాలేజీలో మా మనుమడికి సీటు కావాలి’
‘నా ఇంజినీరింగ్ కాలేజీలోనా!’ నోరెళ్ళబెట్టాను.
‘భలేవాడివే! హైదరాబాదులో ప్రతి రోడ్డు మీదా మీ కాలేజీ బస్సులే కనబడుతుంటాయని చాలామంది చెప్పారు. భలే జోకులు పేలుస్తావే’ అన్నాడు అతగాడు.
అప్పటి నుంచి రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ బస్సును కనిపెట్టి చూడడం మొదలు పెట్టాను. చివరికది దొరికింది. దానిమీద “బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కాలేజి’ అని రాసి వుంది.
ఏమి చేతురా లింగా! అనుకున్నా.
నా ఇంటి పేరును ఇలా చిత్రవధ చేస్తుంటే కలిగిన బాధ కన్నా మించిన వేదన, నా పేరును ఒక పత్రిక సరిగ్గా ప్రచురించిన రోజు అనుభవంలోకి రావడం నా జీవితంలో గొప్ప పేరడీ.
స్వాతి వారపత్రిక వారే ఓ మాస పత్రికను కూడా అదే పేరుతొ ప్రచురిస్తూ వుంటారు. ఇప్పుడు వస్తున్నదో లేదో తెలియదు.
ఒకసారి ఫేస్ బుక్ మిత్రులు ఒకరు నాకు స్వాతి మాస పత్రిక సంచికను పంపారు. ‘అందులో ప్రచురించిన ‘మమజీవన హేతునా’ అనే నవలికలో మీ ప్రస్తావన వుంది చూసుకోండి’ అని పేజి నెంబరుతో సహా తెలియచేశారు.
నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక నవలలో ప్రస్తావించ తగిన స్థాయి నాకు లేదన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఆసక్తిగా తిరగేశాను.
ఆ నవలలో ‘బండారి’ అనే పాత్ర వుంటుంది. ఆ పాత్ర పరిచయం ఇలా జరుగుతుంది.
“....వాళ్లకు ఏదో సోర్స్ వుంటే వేస్తారు. మనం అడిగితే ఇంకాస్త న్యూస్ జోరు పెంచుతారు. వదిలేద్దాం’ అన్నాడు బండారి. ఆయన పూర్తి పేరు బండారు శ్రీనివాస్ రావు. ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ విభాగంలో పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు.......బండారి ముఖంలో రంగులు మారడం గమనించాడు భరద్వాజ.
“పిచ్చివాళ్ళు. ఆ న్యూస్ మీడియాకు నేనే ఇచ్చానని తెలీదు” అనుకున్నాడు అతడు. అతడ్ని రెండు మూడు సార్లు మీడియా చర్చల్లో కూడా చూసిన గుర్తు”
ఇదీ ఆ పత్రిక ప్రచురించిన ఆ నవలికలోని ఒక పేరా.
ఎన్నిసార్లు చదివినా నా పేరు, చేసిన ఉద్యోగం తప్ప నాకేమీ అర్ధం కాలేదు.
ఇంటి పేరులో వత్తు మినహాయిస్తే మిగిలిన వర్ణనలు అన్నీ నాకు వర్తించేలానే వున్నాయి. నేను రేడియోలో వార్తా విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాను. అప్పుడప్పుడు టీవీ చర్చల్లో కనబడుతుంటాను. నా గురించి కాదని ఎలా అనుకుంటాను?
నిజానికి ఆ పాత్రకు నా నేపధ్యం లేకున్నా తేడా ఏమీ రాదు. మరి ఆ నవల రాసిన రచయిత్రి నన్నెందుకు ఈ నవల్లోకి దింపారు.
వివరాలు చూసాను. అది రాసింది శ్రీమతి తటవర్తి నాగేశ్వరి. ఊరు కొవ్వూరు. ఫోన్ నెంబరు కూడా ఇచ్చారు.
ఫోన్ చేసి అడిగాను.
ఒక జర్నలిస్ట్ పాత్రకు నా వివరాలు వాడుకున్నామని వివరణ ఇచ్చారు.
ఆ నవలలో రాష్ట్రపతి పాత్ర కూడా వస్తుంది. దానికి అరుణ్ ముఖర్జీ అని పేరు పెట్టారు. ముఖ్యమంత్రి పేరు శేఖర్ నాయుడు. నా పేరునేమో ఇలా మార్చారు. అదీ వారి వివరణ.
రచయిత్రి తటవర్తి నాగేశ్వరి గారు కూడా బాధ పడ్డారు. అది ఆవిడ కంఠంలో ధ్వనించింది. నాకిచ్చిన మెసేజ్ లో కూడా మరోమారు కనబడింది.
“శ్రీనివాస్ రావు గారి కి నమస్కారాలు.
మీ పేరు ఒక పాత్రకు వాడాను. అన్యధా భావించకండి
మన్నించండి.
ఒక వేళ మీరు మనస్థాపానికి గురి అయితే నన్ను హృదయ పూర్వక న్గా ఛమించండి.."
(నాగేశ్వరి గారు పేరున్న రచయిత్రి. మరి ఈ భాషాదోషాలు ఏమిటి? వాట్సప్ లో తెలుగు టైప్ చేసేటప్పుడు కొన్ని ముద్రారాక్షసాలు దొర్లుతూనే వుంటాయి, అది సహజం అని సరిపుచ్చుకున్నాను)
ఇలా కూడా జరుగుతాయా అంటే జరుగుతాయి.
ఎందుకంటే ఇది జీవితం. కల్పన కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి