జీవితం నేర్పే పాఠాలు బహుచిత్రంగా వుంటాయి.
ఆసక్తి వుండాలే కాని జీవితం నుంచి ప్రతిరోజూ ఓ కొత్త పాఠం నేర్చుకోవచ్చు. వయస్సు దీనికి ఎంతమాత్రం అడ్డంకి కాదు.
జీవితం అన్నాక కుటుంబం ఒక్కటే కాదు. ఎంతోమంది మనకు తారసపడుతుంటారు. కొందరి గొప్పతనం వారి హోదాలను బట్టి, వారి వారి జీవనశైలిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
అధాటున కనబడి మళ్ళీ జీవితంలో కనబడరేమో అనే గొప్పవారు మరి కొందరు వుంటారు. వారి గొప్పతనం వారి హోదానిబట్టి కాదు, ప్రవర్తనను బట్టి తెలుస్తుంది.
నా జీవితంలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఇలా తమ ప్రవర్తన ద్వారా నన్ను బాగా ఆకట్టుకున్నారు. వృత్తి రీత్యా వాళ్ళు డ్రైవర్లు. నా వద్ద పనిచేసే వాళ్ళు కాదు, క్యాబ్ డ్రైవర్లు.
ఆకాశవాణి, దూరదర్శన్ లలో పనిచేసేరోజుల్లో ప్రైవేటు టీవీ చానళ్ళ చర్చాకార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ చేసిన అనంతరం మాత్రం అనేక ఛానళ్ళు నిర్వహించే చర్చల్లో పాల్గొంటూ ఉండేవాడిని. (వారానికి ఉదయం సాయంత్రం కలిపి పద్నాలుగు టీవీ చర్చలు. అలా ఓ పదేళ్లకు పైగా జీవితం బిజీ బిజీగా గడిచిపోయింది)
వీటికోసం ప్రతిరోజూ తెల్లవారుఝామునే లేచి తయారు కావాల్సివచ్చేది. నేనయితే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెళ్ళేవాడిని. కాని, నన్ను స్టూడియోలకు తీసుకు వెళ్లడానికి వచ్చే ఛానల్ కారు డ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి అలా పొద్దున్నే వచ్చే డ్రైవర్లకు కొంత ‘టిప్పు’ ఇవ్వడం అలవాటు చేసుకున్నాను.
ఈ డ్రైవర్లలో రకరకాల వయస్సుల వాళ్ళు వుంటారు. పొరుగుజిల్లాలనుంచి హైదరాబాదు వచ్చి స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని బతుకు బండి లాగించే వాళ్ళే వీళ్ళల్లో ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీగా నేను ఏనాడు అనుకోలేదు. వాళ్లు కూడా అపార్ధం చేసుకోలేదు. కొందరు యెందుకు సార్ ‘మా డ్యూటీ మేం చేస్తున్నాం’ అంటూ మృదువుగా అనేవారు.
కొంతకాలం క్రితం ఓ టీవీ స్టూడియో నుంచి తిరిగొస్తూ ఓ కూడలివద్ద సిగ్నల్ పడ్డప్పుడు నేను పర్సు తీసి డ్రైవర్ కు ఓ నోటు తీసి ఇచ్చాను. అతగాడు ఆ నోటు తీసుకుని జేబులో పెట్టుకోకుండ, అదే చేత్తో స్టీరింగు పట్టుకుని నడుపుతూ ఒక చోట కారు వేగం తగ్గించి, రోడ్డుపక్కన ఒక ముసలి బిచ్చగత్తె చేతిలో ఆ నోటు పెట్టాడు. అతని ప్రవర్తన చిత్రంగా అనిపించి నేను నోరు తెరిచేలోగా అతడు 'మాఫ్ కీజియే సాబ్’ అంటూ తన మనసులో మాట చెప్పాడు.
‘ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచయినా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు వుంటే నీకంటే అవసరం ఎక్కువ వున్నవాళ్ళకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడం అనేదే కొద్దిగా కష్టం. అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకోకండి’ అన్నాడు.
అనుకోవడానికి ఏముంది. ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను.
ఇక నసీర్ ఆలం! అతడికి తెలుగు రాదు, అతడి భాష నాకు రాదు. కానీ ఇద్దరం ఓ రోజు అనేక సార్లు ఫోనులో మాట్లాడుకున్నాం. అవసరం అన్ని పనులు చేయిస్తుంది అంటారు. నిజానికి ఈ అవసరం నాదీ కాదు, అతడిదీ కాదు. హరి అనే ఓ అనంతపూర్ పెద్దమనిషిది. అతనెవరో తెలియదు.
ఆ రోజు ఓలా క్యాబ్ లో ఇంటికి వస్తున్నాను. డ్రైవర్ పేరు నసీర్ ఆలం. ఒక మొబైల్ చూబెడుతూ ఏదో చెబుతున్నాడు. నాకు కొంత అర్ధం అయింది. చాలా కాలేదు. ఒక్కోసారి వేరే కస్టమర్లు ఫోన్ చేసి ఎంత దూరంలో ఉన్నదీ తెలుసుకోవడానికి క్యాబ్ డ్రైవర్లకు కాల్ చేస్తుంటారు. నాది పూల్ వ్యవహారం కాదు. అప్పుడే ఎక్కాను కనుక వేరే బుకింగులు అంత త్వరగా వచ్చే వీలు లేదు. మరి ఈ క్యాబ్ డ్రైవర్ మాటిమాటికీ ఎందుకు ఆ మొబైల్ నాకు చూబెడుతున్నాడు. అర్ధం కాని విషయం మనకెందుకని నేను నా నెట్లో మునిగిపోయాను.
ఇంతలో ఆ ఫోను మోగింది. డ్రైవర్ నాకిచ్చి మాట్లాడమని సైగ చేసాడు.
అవతల నుంచి ఆదుర్దాగా పలకరింపు. 'ఎవరూ నసీరా' అని.
అమ్మయ్య. తెలుగే. కాబట్టి జవాబు చెప్పాను. ‘నేను నసీర్ ను కాను, కానీ అతడిచ్చిన ఫోన్లో మాట్లాడుతున్నాను’
‘నా పేరు హరి. మా ఊరు నుంచి వచ్చిన స్నేహితుడు అనంతపూర్ వెడుతుంటే పంపడానికి క్యాబ్ బుక్ చేసాను. లగేజి దించుకోవడంలో కార్లో నా మొబైల్ మరచిపోయాను. మీరు మాట్లాడుతున్నది నా ఫోనే. ఇప్పుడు ఎక్కడ వున్నారు. నేను నాంపల్లిలో. మీరెక్కడ వున్నారు. ఇక్కడ నుంచి ఎంత దూరం, త్వరగా చెప్పండి’
స్వరంలో ఆదుర్దా తెలుస్తూనే వుంది.
నేను దాదాపు ఎల్లారెడ్డి గూడాలోని మాఇంటి దాకా వచ్చేసాను. అతడు రావడానికి శ్రీనగర్ కాలనీ చాలా దూరం.
‘ఒక పని చేయండి. మీరు అక్కడే వుండండి. ఈ క్యాబ్ డ్రైవర్ చాలా మంచివాడులా వున్నాడు. అడిగిచూస్తాను’
నెమ్మదిగా నాకొచ్చిన హిందీలో చెప్పాను. వాళ్ళు నాంపల్లి స్టేషన్ దగ్గర వున్నారు. నన్ను దింపిన తర్వాత అక్కడికి వెళ్ళగలవా. వెడతానంటే చెప్పు వాళ్లకు చెబుతాను’
‘తప్పకుండా. మిమ్మల్ని దింపగానే క్లోజ్ చేసుకుని వెడతాను’ అన్నాడా డ్రైవర్.
నేను హరి గారితో చెప్పాను. ‘మీ అదృష్టం బాగుంది. భాష రాకపోయినా మంచి డ్రైవర్ దొరికాడు. మీరు అక్కడే వుండండి’
ఎందుకయినా మంచిదని ఇద్దరి నెంబర్లు తీసుకుని, నా నెంబరు హరికి ఇచ్చి నేను నా ఇంటి వద్ద దిగిపోయాను.
అరగంట తర్వాత హరి నుంచి ఫోను అతడు ఇంకా రాలేదని.
నేను నసీర్ ఆలంకు ఫోన్ చేసి ఎక్కడ వున్నావని అడిగాను.
‘హై టెక్ సిటీ. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి క్లోజ్ చేసే లోపలే నాకు హై టెక్ సిటీ బుకింగ్ వచ్చింది. చేసేది లేక వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను సికిందరాబాదు వెడుతున్నాను. స్టేషన్ లో మా ఓలా ఆఫీసు వుంది. అక్కడ ఈ మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. వాళ్లకు చెప్పండి, నాకు తెలుగు రాదు’
ఆమాటే మళ్ళీ హరిగారికి చెప్పాను. సికిందరాబాదు వెళ్ళమని చెప్పాను.
వీళ్ళిద్దరూ కలుస్తారా! నాకయితే అనుమానం లేదు. నాకా డ్రైవర్ నిజాయితీ మీద యెనలేని నమ్మకం అప్పటికే ఏర్పడింది.
ఓ గంట గడిచింది. మళ్ళీ హరి నుంచి ఫోను.
‘చాలా థాంక్స్ అండీ. మొబైల్ దొరికింది. మీరు చెప్పినట్టే ఆ డ్రైవర్ చాలా మంచివాడు’
‘వున్నాడా! నేనూ థాంక్స్ చెబుతాను’
‘లేడండీ! మళ్ళీ బుకింగ్ వచ్చిందని వెళ్ళిపోయాడు’
నసీర్! నీ దగ్గర నుంచి మాలాంటివాళ్ళం నేర్చుకోవాల్సింది చాలా వుందయ్యా! అని మనసులో అనుకున్నాను.
(అతడి మొబైల్ నెంబర్: 9704248652)
మరో రోజు మరో క్యాబ్ లో.
పట్టుమని పాతికేళ్ళు వున్నట్టు లేవు. చేసేది డ్రైవర్ పని. ఇంటర్ చదివాడు. మునిసిపల్ కార్పొరేషన్ లో తాత్కాలిక ఉద్యోగం కొన్నాళ్ళు చేశాడు. అదీ ఒదిలేశాడు. జీతం చాలక కాదు. ఎక్కువై. వినడానికే వింత అనిపించేలా వున్నాయి అతడి మాటలు. నెలకు ఆరువేలు ఇచ్చేవారు. అదేమంత పెద్ద జీతం కాదు, కానీ అందుకు తగ్గ పని వుండేది కాదు, రెండు గంటలు పనిచేయడం, ఆరుగంటలు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం. ఆరువేలు తీసుకుని రోజుకు రెండు గంటలే పనిచేయడం అతడికి అస్సలు నచ్చలేదు. అందుకే ఒదిలేసి ఉబెర్ డ్రైవర్ పనిలో చేరాడు. పేరు మోడరన్ గా ప్రభాత్ కుమార్. కానీ కదిలిస్తే అన్నీ ఆధ్యాత్మిక భావాలు.
తీరిక దొరికినప్పుడల్లా ఇందిరా పార్కు దగ్గర రామకృష్ణ మఠంలో గడుపుతాడు. రామకృష్ణ ప్రభకు ఏడాది చందా కట్టాడు. కానీ రెండు నెలలు గడవక ముందే ఇల్లు మారాల్సి వచ్చింది. ఆ పత్రిక చదవకపోతే అతడికి తోచదు. అందుకని మళ్ళీ వెళ్లి కొత్త చిరునామాతో మరో ఏడాది చందా కట్టాడు. నిజానికి ఆ పత్రిక తిరగేయడానికి ఎంతో టైం పట్టదు. కానీ అతడు తిరగేయడు. చదువుతాడు. అదీ మనసు పెట్టి. కొత్తా పాతా తేడా లేకుండా ఆ మాసపత్రికను నెలంతా చదువుతూనే ఉంటాడు. చదివినదే అయినా మరోసారి, మరోసారి, అలా చదువుతూనే ఉంటాడు.
బిజినెస్ మేనేజ్ మెంట్ లాగా ఫ్యామిలీ మేనేజ్ మెంట్ కోర్సులు పెట్టాలంటాడు. చిన్నాభిన్నమైపోతున్న కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలంటే అలాంటి చదువులు అవసరమంటాడు ప్రభాత్ కుమార్.
చిన్నవాడయినా మంచి మాట చెప్పాడు.
ఉబెర్ డ్రైవర్ పుణ్యమా అని ఓ కొత్త పాఠం నేర్చుకున్నాను.
కానీ పాటిస్తున్నానా! ఏమో అనుమానమే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి