నేను జీవితంతో సమాధాన పడలేదు. పరిస్థితులతో కూడా రాజీ పడలేదు. నన్ను నేను మార్చుకున్నాను. అదీ నాకోసం. అంతే!
‘శ్రీనివాసరావు
ఈ మధ్య చాలా మారిపోయాడు, అతడు
మాత్రం ఏమి చేస్తాడు. మారిన రోజులతో మారక తప్పదు కదా’ అనేవారికి లేదా
అనుకునేవారికి నా జవాబు ఇదే!
డెబ్బయి తొమ్మిది సంవత్సరాలకు పైగా నా జీవన శైలి
ఒక రకంగా గడిచింది. అలాంటి దాన్ని గత కొద్ది నెలలుగా నాకు నేనై మార్చుకున్నాను.
అయితే నా ఆహార పానీయాలు, అలవాట్లు
ఏవీ మార్చుకోలేదు. మారింది నా నడత మాత్రమే. ఇతరులతో నా వ్యవహార శైలి మాత్రమే.
నా ఈడు వాళ్ళతో పోలిస్తే నా ఆరోగ్యం చాలా మెరుగైన
పరిస్థితి లోనే వుంది. రెండేళ్ల క్రితం శారీరక పరిస్థితి కొంత ఆటుపోట్లకు
గురయింది. షుగర్, బీపీ
బాగా ఇబ్బంది పెట్టాయి. చిన్నా చితకా వాటికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తే అలవాటు
లేని నేను తరచుగా స్పెషలిస్టులను సంప్రదించాల్సిన అవసరం ఏర్పడింది. ఎప్పటికప్పుడు
వైద్య పరీక్షలు చేయించుకోవడం, వాటిని డాక్టర్లకు చూపించి వాడే మందుల్లో
మార్పులు చేసుకోవడం ఇలా కొన్నాళ్ళు సాగింది. పని వాళ్ళపై, వంట
మనిషిపై చీటికీ మాటికీ చీకాకు పడడం, డ్రైవర్లతో లేనిపోని వాగ్వాదాలు ఇలా శారీరక
మానసిక ఇబ్బందులతో ఏమిటో అంతా అస్తవ్యస్తంగా వుండేది. భార్య మరణం, ఎదిగొచ్చిన
కొడుకు ఆకస్మిక కాలధర్మం,
ఎవరి
మీదా ఆధారపడకుండా జీవించలేని అశక్తత ఇవన్నీ కొన్ని కారణాలు అయినా, అసలు
మర్మం ఇవేవీ కాదనీ, కారణం
నా మనసే అని నెమ్మదిగా బోధపడింది.
కొంత మార్పుకోసం ఈ
ఏడాది జూన్ లో రెండు మాసాలు అమెరికా వెళ్లి పెద్దవాడు సందీప్ దగ్గర వుండి వచ్చాను.
ఒక ఏడాది వ్యవధిలో వెళ్ళడం అది రెండో పర్యాయం. అంతకు ముందు చాలా సార్లు వెళ్లాను
కానీ మా ఆవిడ తోడుగా వుండేది. గత రెండు పర్యాయాలు అది పెద్ద లోటుగా అనిపించి
కొన్ని వారాల్లోనే తిరిగి వచ్చేశాను. అయితే ఈసారి తిరిగి వచ్చింది నేను కాదు.
మారిపోయిన మరో నేను. కారణం నా పెద్ద కోడలు భావన. భావన బోధించిన భగవద్గీత.
హైదరాబాదులో నాకే లోటు లేదు. మూడు గదుల ఇల్లు.
వంటమనిషి, పని
మనిషి. తిరగడానికి కారు. పెన్షన్ డబ్బులకు తోడు ప్రతినెలా మా వాడు పంపించే
డబ్బులు.
మరి ఏమిటి సమస్య. నేనే నాకు సమస్య.
ఒక్కోరోజు వంటావిడ చెప్పాపెట్టకుండా మానేస్తుంది.
నాకు స్టవ్ వెలిగించడం కూడా రాదు.
ఎక్కడికో పోవాలి. డ్రైవర్ సమయానికి రాడు.
అందరి గుమ్మాల ముందు రంగవల్లులు. మా
పనిమనిషి రాదు.
కోపం వస్తుంది. చీకాకు వేస్తుంది. గయ్యిమని
అరవాలని అనిపిస్తుంది. ఏమిటీ జీవితం అనే నైరాశ్యం. శరీరం త్వరగా అలసి పోయేది.
నిస్సత్తువ ఆవరించేది. పడుకుని లేవాలంటే నీరసం. ఆకలి పూర్తిగా మందగించింది. రకరకాల
టాబ్లెట్లు. గంట గంటకు బీపీ చెక్ చేయాల్సి వచ్చేది. డాక్టర్లకే అర్ధం కానంత
దారుణమైన రీడింగులు. విపరీతమైన హెచ్చుతగ్గులు. పనివాళ్ల మీద అరవడాలు.
చెప్పాకదా మార్పుకోసం అమెరికా వెళ్లాను. నిజానికి
ఆరోగ్యం బాగా లేనప్పుడు పొరపాటున కూడా వెళ్లకూడని దేశం ఏదైనా వుంటే అది అమెరికానే. అక్కడ
ఆరోగ్యానికి ఏదైనా అయితే ఇక అంతే సంగతులు.
సియాటిల్ విమానాశ్రయంలో దిగిన నన్ను చూడగానే భావన
అంది, మీరు
బాగా చిక్కిపోయారు పాపా! అని. అబ్బే అదేమీ లేదు దూరప్రయాణం కదా అని సర్ది
చెప్పాను. తను అలా అడగడానికి కారణం ఇంటికి వెళ్ళిన తర్వాత మాటల్లో చెప్పింది.
అంతకు కొద్ది నెలల క్రితమే నేను అమెరికా వచ్చి వెళ్లాను. అప్పుడు నా సైజుకు
సరిగ్గా సరిపోయే ప్యాంటు చొక్కాలు కొన్నారు. అవే దుస్తులు వదులుగా వుండడం, ప్యాంటు
కిందికి జారిపోవడం గమనించి అడిగిన మాట అది.
అయిదు వారాలు వున్నా. ఇంట్లో అమర్చినట్టు అన్నీ
వున్నాయి. బ్రష్ చేసుకోవడం తరువాయి ఒక పెద్ద జార్ లాంటి కప్పులో
ఎన్స్యూర్ కలిపిన పాలు ఇచ్చేది. వేడి నీటి టబ్బులో ఒక గంటకు పైగా జలకాలాడిన
తర్వాత వేడివేడి ఇడ్లీ సాంబారు, దోశలు ఇలా రోజుకో తీరుగా చేసిపెట్టి వాళ్ళిద్దరూ
ఆఫీసుకు వెళ్ళిపోయేవారు. ఒటీటీ లో సినిమాలు. పెద్ద మనుమరాలికి కూడా ఉద్యోగం.
చిన్నదానికి గ్రాడ్యుయేషన్ పూర్తయింది. నిజానికి ఆ కార్యక్రమం కోసమే
నేను మళ్ళీ అమెరికా వెళ్లాను. భోజనం అయిన తర్వాత కారులో నన్ను ఊరంతా తిప్పేది. తను
వెళ్ళే పెద్ద పెద్ద లైబ్రరీలకు తీసుకు వెళ్ళేది. కారు పార్కింగులో పెట్టి మెట్రోలో
ఒక గమ్యం లేకుండా అటూ ఇటూ తిరిగే వాళ్ళం. స్టార్ బక్స్ లో కూర్చుని కాఫీ
తాగేవాళ్ళం. మేము ఇంటికి చేరేసరికి ఆఫీసుల నుంచి మిగిలిన ముగ్గురూ వచ్చేవారు.
తర్వాత సినిమాకో షికారుకో అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. రాత్రి భోజనం సిద్ధం చేసే
లోపు ఒటీటీ సినిమా చూస్తూ నా సాయం కాలక్షేపం పూర్తి చేసుకునే వాడిని. పడక
ఎక్కగానే అలెక్సాలో ఘంటసాల పాత పాటలు.
నిజానికి హైదరాబాదులో నా దినచర్య కూడా కొంచెం
ఇంచుమించు ఇదే. కాకపోతే అక్కడ థర్డ్ ఏసీ, ఇక్కడ అమెరికాలో ఫస్ట్ ఏసీ వాతావరణం.
హైదరాబాదులో నా శారీరక, మానసిక
వైపరీత్యాల గురించి కొంత సమాచారం అమెరికాలోని మా కొడుకు కోడలికి కూడా చేరింది.
నా హైదరాబాదు ప్రయాణం దగ్గర పడడానికి రెండు రోజుల
ముందు భావన, ‘ఈరోజు
మీకు ఒక అద్భుతమైన ప్రదేశం చూపిస్తాను మీరు బ్లాగులో రాసుకోవడానికి బాగుంటుంది’
అని బెల్ వ్యూ లోని ఒక పెద్ద పార్కుకు తీసుకు వెళ్ళింది. చాలా విశాలమైన పార్కు.
దాన్ని గురించి రాయాలంటే చాలా వుంది. అది కాదు నా ఉద్దేశ్యం. నా లోని మార్పుకు
అక్కడే బీజం పడింది.
ఏడాది నిండని పసిపిల్లల నుంచి ఎనభయ్, తొంభయ్ ఏళ్ళ ముదివొగ్గుల
వరకు అక్కడ ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు. బాగా వృద్ధులైన వారు చేతికర్ర సాయం
లేకుండా చురుగ్గా వాకింగ్ చేస్తున్నారు. సాయంకాలపు నీరెండలో నడవలేక నేను ఒక
చప్టా మీద కూలపడ్డాను. భావన చేతి సంచీ నుంచి వాటర్ బాటిల్ తీసి తాగమని ఇచ్చింది.
అది తాగిన తర్వాత కొంత అలసట నుంచి తేరుకున్నాను.
అప్పుడు మొదలు పెట్టింది భావన భగవద్గీత.
“పాపా !
అక్కడ మీరొక్కరు ఒంటరిగా వుండడం మాకు బాగా లేదు. మా దగ్గర పరిష్కారం వుంది కానీ
నిర్ణయం మీది. ఒకటి మీరు వచ్చి వుంటాను అంటే గ్రీన్ కార్డుకు అప్లయి
చేస్తాము. కానీ కొంత టైం పడుతుంది. అప్పటివరకు ఆరు మాసాలకోసారి వచ్చి కొంతకాలం
వుండి వెడుతుండాలి. కానీ మీ టెంపర్ మెంటు మాకు తెలుసు. మీకు మీ స్నేహితులు
వుండాలి. నిషాకు చిన్నపిల్ల జీవిక సమస్య. మీరు దాన్ని ఆడించగలరు, దాంతో కాలక్షేపం
చేయగలరు కానీ దాన్ని పెంచ లేరు. అత్తయ్య వుండి వుంటే ఆ పరిస్థితి వేరు. నిషాకు
ఆఫీసు పని ఒత్తిడి ఎక్కువ వుంటుంది. కేర్ టేకర్ ని పెట్టినా జీవిక పెద్దవాళ్ల
ఆపేక్షకు దూరం అవుతుంది. ఈ వయసులో దానికి అమ్మమ్మ తాతయ్యల అవసరం ఎక్కువ. తనకు
వర్క్ ఫ్రం హోం కాబట్టి కటక్ లో వుంటే జీవికకు పెద్దవాళ్ల ప్రేమ దొరుకుతుంది. ఇది
మీరు అర్ధం చేసుకోవాలి.
కాబట్టి ముందు వున్నవి రెండు ఆప్షన్స్. మీరు
అమెరికాలో వుండడం. లేదా హైదరాబాదులో వుండడం.
మీరు రెండోదానికే ప్రాధాన్యత ఇస్తే ముందు నేను
చెప్పినట్టు చేయగలగాలి. లేకపోతె మీ ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం.
మీ సమస్యలు వంట మనిషి, పనిమనిషి
హఠాత్తుగా రాకపోతే ఎలా. నిజానికి ఇవి సమస్యలు కావు ఇబ్బందులు. రాకపోతే ఏమౌతుంది
ఏమీ కాదు అనుకోండి. అదే పరిష్కారం. ఫిగ్గీ వుంది. చేతిలో కారు వుంది, అలా
వెళ్లి బయట మంచి హోటల్లో మీ స్నేహితులతో కలిసి భోజనం చేయండి. ఎందుకు రాలేదని
మర్నాడు ఆమె మీద అరిస్తే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిజానికి అదే పెద్ద
సమస్య. డబ్బుకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి మేమందరం ఉన్నాము. ఈ లోపల గ్రీన్
కార్డు వచ్చింది అనుకోండి. అసలు సమస్యే లేదు. కానీ ఈ లోపల మీ ఆరోగ్యం, అది
జాగ్రత్తగా కాపాడుకోండి. దీనికి ఒకటే చిట్కా. ఏం కాదు, కొంపలు
అంటుకు పోయే సమస్య కాదు అని మనసులో గట్టిగా అనుకోండి. అది మంచులా
కరిగిపోతుంది."
ఇలా చెప్పుకుంటూ పోయింది. నేను వింటూ పోయాను.
తిరిగి వచ్చిన తర్వాత ఇంతవరకు డాక్టర్ ని
చూడలేదు. అసలు వైద్య పరీక్షల అవసరమే పడలేదు.
మరో సంగతి. ఎవరి మీదా నోరు పారేసుకోలేదు. కోపం
పూర్తిగా పోయిందని చెప్పలేను కానీ చాలావరకు తగ్గింది.
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి