23, సెప్టెంబర్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (222): భండారు శ్రీనివాసరావు

 

చీరే మేరే సప్నే
నా నలభయ్ అయిదేళ్ళ వైవాహిక జీవితంలో రెండే రెండు సార్లు మా ఆవిడకు చీరెలు కొన్న సందర్భాలు వున్నాయి.
అంటే ఇన్నేళ్ళుగా ఆవిడ ఆ రెండు చీరెలతోనే నెట్టుకొచ్చిందని అర్ధం కాదు. నేను మళ్ళీ ఎప్పుడూ నాకు నేనుగా చీరెలు కొన్న పాపాన పోలేదని మాత్రమే దీని తాత్పర్యం. ఆ రెండు సందర్భాలు బాగా గుర్తుండి పోవడానికి కూడా కారణాలు వున్నాయి.
చాలా ఏళ్ళక్రితం ఒక బ్యాంకు తాలూకు మనిషి పనికట్టుకుని మరీ మా ఆఫీసుకువచ్చి వివరాలు అడిగి తీసుకుని పోస్టులో ఓ క్రెడిట్ కార్డు పంపించాడు. క్రెడిట్ కార్డులు అప్పుడే రంగ ప్రవేశం చేస్తున్న రోజులవి. అది నా గొప్పదనం అనుకున్నాకాని, నేను చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంటు నౌఖరీ కాబట్టి ఆ బ్యాంకు అంత ఉదారంగా ఆ కార్డు మంజూరు చేసిందన్న వాస్తవం అప్పట్లో నాకు బోధపడలేదు.
కార్డు చేతికి వచ్చింది కానీ దాన్ని వాడి చూసే అవకాశం మాత్రం వెంటనే నాకు రాలేదు.
అప్పట్లో ఇప్పట్లా ఏటీఎం లు లేవు. ఏదయినా వస్తువు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కార్డు వాడే వీలుండేది. ఓసారి బెజవాడ టూర్ వెళ్ళినప్పుడు మా ఆవిడకోసం బీసెంటు రోడ్డు షాపులో అయిదారొందలు పెట్టి, ఆ క్రెడిట్ కార్డు వాడి, ఓ చీరె కొన్నాను. అంత వరకు బాగానే వుంది.
మరుసటి నెల నుంచీ ఆ బ్యాంకు తాఖీదులు రావడం, ఆ కిస్తీ కట్టే బ్యాంకు ఎక్కడో సికిందరాబాదులో వుండడం, అంతంత దూరాలు పోయి ఓ వందో, యాభయ్యో చెల్లు వేసి రావడానికి సహజ బద్ధకం అడ్డం రావడం ఇత్యాది కారణాలతో నాకూ ఆ బ్యాంకుకూ నడుమ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా చెడిపోయాయి.
చీరె తాలూకు అప్పు మొత్తం వడ్డీలతో పేరుకు పోయి, అయిదారువేలకు చేరడం, చివరికి ఆఫీసులో పీఎఫ్ అడ్వాన్సు తీసుకుని ఆ అప్పు తీర్చి కార్డు ఒదిలించుకోవడం ఓ వ్యధాభరిత అధ్యాయం. అయిదారువందల నెల జీతగాన్ని పెళ్ళానికి అయిదారువేల రూపాయల (అసలు వడ్డీలతో కలిపి) చీరె కొనగలిగానన్న తృప్తితో ఆ మొదటి చీరె అంకం అలా ముగిసిపోయింది.
అలాగే మరోసారి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లి, తిరిగి వచ్చే రోజు పాలికా బజారులో నచ్చిన చీరె సెలక్టు చేసి, వచ్చీరాని హిందీలో, గీసి గీసి బేరం చేస్తున్న సమయంలో, అప్పటివరకు శుద్ధ హిందూస్తానీలో మాట్లాడుతున్న షాపు వాడు అచ్చ తెలుగులోకి తిరిగిపోయి ‘అందరికీ నూట ఇరవై, మీకొక్కరికే అరవై సాబ్’ అంటూ నన్ను మారుమాట్లాడనివ్వకుండా మొహమాట పెట్టి ఆ చీరె పొట్లం చేతిలో పెట్టాడు. హైదరాబాదు వచ్చిన తరువాత ఎందుకయినా మంచిదని యాభయ్ రూపాయలకే కొన్నట్టు ఫోజు పెట్టి నా ప్రయోజకత్వాన్ని ప్రదర్శించాను. చీరె రేటు చెబుతున్నప్పుడు మా ఆవిడ ‘అలాగా’ అంటూ చిన్నగా నవ్వుకున్న సంగతి గమనించలేకపోయాను. తరువాత ఇరుగు పొరుగు ఆడంగుల మాటలు చెవిన పడ్డప్పుడు కానీ అసలు విషయం బోధపడలేదు. అదేమిటంటే అరవై రూపాయలకు నేను కొన్న చీరె లాంటిది, మూడు నెలసరి వాయిదాలలో నలభయ్ రూపాయలకే అమ్మే షాపులు చిక్కడపల్లిలో అయిదారు వున్నాయట.
దాంతో బోధి చెట్టుతో అవసరం లేకుండానే తత్వం తలకెక్కింది. ఇక అప్పటి నుంచి ఆ తర్వాత ఎప్పుడూ మా ఆవిడకు చీరె కొనే ప్రయత్నం మళ్ళీ చేయలేదు.
నడిచి వచ్చిన జీవితం బాగా గుర్తుంది అని చెప్పడం పెద్ద అబద్ధం కాకపోయినా మన మనస్సుని మోసం చేసుకోవడమే.
1975 లో హైదరాబాదు వచ్చిన కొత్తల్లో చిక్కడపల్లిలోని మా ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో మెయిన్ రోడ్డుమీద, సుధా హోటల్ వద్ద సిటీ బస్ స్టాపు వుండేది. అక్కడి నుంచి నేరుగా రేడియో స్టేషన్ కు కాని, సెక్రెటేరియేట్ కు కానీ వెళ్ళాలంటే రామ్ నగర్ నుంచి విజయనగర్ కాలనీకి వెళ్ళే 139 నెంబరు బస్సు ఒక్కటే దిక్కు. ఒక్కటే అవటాన దానికి టెక్కు సహజం. అంచేత దాని రాకపోకలు అనూహ్యం. కావున, మన రూటుది కాకపోయినా మరో బస్సును పట్టుకుని ప్రయాణం చేయడం తప్పనిసరి. పైగా జేబులో ‘అన్ని సిటీ రూట్లలో ఉచిత ప్రయాణానికి సర్కారు (ఆర్టీసీ) వారిచ్చిన జర్నలిస్టు పాసు సిద్ధంగా వుండేది. అలా నిత్యం బస్సుల్లో తిరిగే రోజుల్లో సిటీ బస్సు ప్రయాణీకుల పాట్లు బాగా అర్ధం అయ్యేవి.
ఆ తరువాత కొన్నాళ్ళకు ఆటో శరణ్యం అయింది. అప్పుడు కానీ నాకు ఆటో బాధలు (ఆటో వారితో ప్రయాణీకుల బాధలు అన్నమాట) అర్ధం కాలేదు. రమ్మన్న చోటుకు రావడం వాళ్లకు ఇష్టం వుండేది కాదు. వాళ్ళు అలా రాననడం నాకు నచ్చేది కాదు. వాళ్ళతో ప్రతిరోజూ నా పొట్లాటలు మా ఆవిడకు నచ్చేవి కావు. సినిమాకని బయలుదేరి, ఆటోవాడు రానంటే, అతడు చెప్పిన చోటుకే తీసికెళ్ళమని అందులో ఎక్కి కూర్చుని మధ్యలో పోలీసు స్టేషన్లకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉండేవి. రోడ్డు మీద మన మాట చెల్లకపోయినా, పోలీసుల దగ్గర విలేకరిగా చెల్లుబాటయ్యేవి. ఇంతా చేసి మనం అడిగే ఫేవర్ ఒక్కటే, మీటరు మీద వచ్చే ఆటో మాట్లాడి పెట్టమని. వాళ్ళకది చిటికెలో పని. ఆ విధంగా ముందుకు పోతూ, కొంతమంది ఆటో డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసేంతవరకు నా చేష్టలు శృతిమించడంతో, మా ఇంటిల్లిపాదీ స్కూటర్ కొనుక్కోవడం ఒక్కటే దీనికి తరుణోపాయమని ఒక ఏకగ్రీవ తీర్మానం చేసారు.
కొన్నాళ్ళకు ఆ ముచ్చటా తీరింది. స్కూటర్ నడపడం మొదలెట్టాక, ఇక ద్విచక్ర వాహనదారుల కడగండ్లన్నీ కళ్లకు కట్టినట్టు కనిపించడం మొదలయింది. హెల్మెట్ ఉదంతంతో ఆ అధ్యాయమూ ముగిసింది.
జీవితం అన్నాక ఒక్కోమెట్టు నింపాదిగానో, హడావిడిగానో ఎక్కుతుంటాం.
మరి అదేమి చిత్రమో, చూపు ఎక్కే పైమెట్టు మీదనే కానీ, ఎక్కివచ్చిన కింది మెట్టు మీద వుండదు.
కొసమెరుపు
1975 లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను రోజు వారీ రాసి వడ్డించిన వాక్టూన్లలో ఒక వంటకం:
చీరే మేరే సప్నే
పండక్కి ఈ మారయినా
షాపులో చేసి అరువయినా
కనీసం కంచిపట్టు చీరయినా
కొని తీరాలి ఆరునూరయినా





(ఇంకావుంది)

20, సెప్టెంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (221): భండారు శ్రీనివాసరావు

 ‘నిన్ను కలుసుకోవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ అన్నారు మా న్యూస్ యూనిట్ లో  నా బల్లకు ఎదురుగా వున్న ఒక మామూలు ఫేమ్ కుర్చీలో కూర్చొంటూ మా సమాచార శాఖ జాయింట్ సెక్రెటరీ, మొత్తం ఆలిండియా రేడియో, దూరదర్సన్ లతో కూడిన ప్రసార భారతి సీ ఈ ఓ  కె.ఎస్. శర్మ గారు. అంతవరకూ ఆయన మీద గొంతు వరకూ కోపం పెంచుకున్న నేను, ఆయన మాటలతో ఒక్కసారిగా చల్లబడిపోయాను.

అప్పటికి ఒక పదేళ్లు వెనక్కి వెడదాం.

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి మా డైరెక్టర్ కు ఫోన్ వచ్చింది.

‘మీ దగ్గర భండారు శ్రీనివాసరావు అనే పేరుగల వాళ్ళు పనిచేస్తున్నారా అని కలెక్టర్ గారు కనుక్కోమన్నారు అని వాకబు. అప్పుడు అక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్నది ఐ ఎ ఎస్ అధికారి శ్రీ కంభంపాటి సుబ్రమణ్య శర్మ. ఆయన బెజవాడలో చదువుకునే రోజుల్లో ఒక శ్రీనివాసరావు ఆయనకు స్కూల్లో క్లాసుమేటో, జూనియరో అట.  ఆ రోజు ఉదయం  రేడియోలో నా జీవన స్రవంతి ప్రోగ్రాం విన్న తరువాత కలెక్టర్ గారికి నా గురించి తెలుసుకోవాలని అనిపించిందట. సాయంత్రం ఆఫీసుకు వెళ్ళిన తరువాత ఈ విషయం నా చెవిన వేశారు. ఆ తరువాత ఆ సంగతి ఆయనా మరచిపోయారు, నేనూ మరచిపోయాను.

కరీంనగర్ కలెక్టర్ గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా. అక్కడ ఒక పాడుపడ్డ చెరువును పూడ్పించో , లేదా  ఆ జాగాను వేలం వేయించో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే గొడుగు కింద వుండేలా విశాలమైన పరిపాలనా విభాగాల సముదాయాన్ని నిర్మించారు. ఇటువంటి నిర్ణయాలను ప్రజలు హర్షించారు,  ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. ఏమైతేనేం సమర్ధుడు అయిన కలెక్టర్ గా పేరొచ్చింది. తరువాత ఆయన్ని హైదరాబాదుకు బదిలీ చేశారు,  విద్యుత్ బోర్డు కార్యదర్శిగా. ఒకటి రెండు సార్లు వెళ్లి కలిశాను వార్తల పనిమీద. ఒక క్లాసు మేటుగా ఆయన నన్ను గుర్తుపట్టలేదు. పట్టినా పైకి ఆ మాట అనలేదు. నా  సంగతి సరే!

చిన్నప్పుడు స్కూలుకు సరిగానే వెళ్ళే వాడిని కానీ అందరితో స్నేహం చేసే అవకాశం లేదు. మా బావగారు ఈ విషయంలో చాలా స్ట్రిక్టు.

ఆ తరువాత నా మకాం, చదువు ఖమ్మానికి మారాయి. ఆ తరువాత మళ్ళీ కాలేజి చదువుకు బెజవాడ. మధ్యలో ఎమ్మెసెం బండి (మార్చి – సెప్టెంబరు- మార్చి). ఈ లోగా క్లాస్ మేట్స్ సీనియర్లు, జూనియర్లు క్లాస్ మేట్స్, ఆ క్లాస్ మేట్స్ సీనియర్లు అయ్యారు. నా లాంటి వాళ్లకు క్లాస్ మేట్స్ ఏం గుర్తుంటారు?

ఖమ్మంలో చదివేటప్పుడు వెంకటేశ్వర రావు అనే తెలివికల విద్యార్థి నా క్లాసు మేట్. ఎంత తెలివి కలవాడు అంటే, నేను రేడియోలో ఉద్యోగం చేసేటప్పుడు నన్ను వెతుక్కుంటూ హైదరాబాదు వచ్చాడు. భోజనం చేసేటప్పుడు విషయం చెప్పాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం. బదిలీ అయింది. ‘నీకు శర్మగారు తెలుసు కదా! ఒక మాట చెప్పవా’ అన్నాడు. అదెంత భాగ్యం అని  వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాను. అతడిని బయట కూర్చోమని, నన్ను అడిగారు శర్మగారు, ‘మీ ఫ్రెండ్ ఎక్కడికి అంటే ఏ విభాగానికి బదిలీ కోరుతున్నాడో నీకేమైనా తెలుసా’ అని. ‘తెలియదు, శర్మగారు నీకు తెలుసా అంటే తెలుసు అని తీసుకువచ్చాను’ అన్నాను. ‘అది నాకు ముందే అర్ధం అయింది. ఈ బదిలీ చేయడం నాకు చిటికెలో పని. కానీ అతడు కోరుతున్నది నాలుగు రాళ్లు అదనంగా వచ్చే పోస్టు. తరువాత నీకూ నాకూ చెడ్డపేరు రాదని నువ్వు హామీ ఇవ్వగలవా!’ అన్నారు. ‘నాకు ఇవన్నీ తెలియదు, ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వదిలేయండి, నేను అతడికి సర్ది చెబుతాను’ అని వచ్చేశాను.

తరువాత కొన్నాళ్ళకు మా వాడికి కోరిన చోటుకు కోరిన పోస్టులో బదిలీ అయింది.  థాంక్స్ చెబుదాము అనుకుంటే శర్మగారు బదిలీపై కేంద్ర సర్వీసులకు ఢిల్లీ వెళ్ళారు.

ఇదొక కధ.

ఆ తరువాత నేను కుటుంబంతో సహా మాస్కో వెళ్లాను, రేడియో మాస్కోలో పనిచేయడానికి.

అక్కడ ఒక చిక్కొచ్చిపడింది.

రష్యన్ స్కూళ్ళలో విద్య పూర్తిగా ఉచితం. ప్రతి ఏరియాలో ఇంటి నుంచి నడిచిపోయే దూరంలో వుంటాయి ఆ స్కూళ్ళు. ఎక్కడైనా కొంచెం దూరంగా వుంటే, ఉచితంగా తీసుకువెళ్ళే స్కూలు  బస్సులు వుంటాయి. మధ్యాన్న భోజనంస్కూలు యూనిఫారాలు,  పుస్తకాలతో సహా అన్నీ ఉచితం. పోతే, మేము వెళ్ళిన సంవత్సరమే ఇండియన్ ఎంబసీ సిబ్బంది పిల్లకోసం మాస్కోలో కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ వారు  ఇండియన్ స్కూల్ ప్రారంభించారు.  అయితే ఫీజులు వుంటాయి.   రష్యన్ స్కూళ్ళలో చేర్పిస్తే ఇండియాకు తిరిగి వెళ్ళిన తరవాత చదువులకు ఇబ్బంది అవుతుందని ఇండియన్ స్కూల్ నే ఎంచుకోవాల్సి వచ్చింది.  

 అక్కడా ఎడ్మిషన్లు  అంత సులభంగా రాలేదు. మేము రష్యన్ ప్రభుత్వం పనుపున వచ్చాము కాబట్టి హార్డ్ కరెన్సీ లో అంటే డాలర్లలో ఫీజు కట్టాలని ప్రిన్సిపాల్  గంగల్  కండిషన్ పెట్టారు. మాకిచ్చే జీతం మీలాగా డాలర్లలో కాదు, రూబుళ్ళలో ఇస్తారని యెంత మొత్తుకున్నా ఆ బెంగాలీ బాబు గారు వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక,  ఆ రోజుల్లో ఢిల్లీలో  కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ కు డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న కె యస్ శర్మ గారికి మాస్కోనుంచి ఫోన్ చేసి విషయం వివరించాను.

 ఆయన కూల్ గా విని,  రేపు ఉదయం పోయి ప్రిన్సిపాల్ ని కలవమని తాపీగా చెప్పారు. మర్నాడు నేను వెళ్లేసరికి స్కూలంతా చాలా హడావిడిగా కానవచ్చింది. మాస్కో రేడియో శ్రీనివాసరావు వచ్చాడా అని ప్రిన్సిపాల్ అప్పటికే వాకబు చేయడం మొదలు పెట్టారు. నిబంధనలు ఏ గాలికి పోయాయో తెలియదు కానిమా ఇద్దరు పిల్లలకు మేము అనుకున్న పద్దతిలో ఎడ్మిషన్ లభించింది.

శర్మగారి మీద గొంతు వరకూ కోపం వచ్చిందన్నాను కదా! ఎందుకో ఇప్పుడు చెబుతాను.

కేంద్ర సమాచార శాఖ జాయింట్ సెక్రెటరీగా వున్నప్పుడు ఒకసారి రేడియో స్టేషన్ కు వచ్చారు. డైరెక్టర్ గదిలో ఉన్నతాధికారుల సమావేశం. శర్మగారు వచ్చిన సంగతి తెలిసి చూడడానికి వెళ్లాను. తలుపు తెరుచుకుని లోపలకు వస్తున్న నన్ను చూసి తర్వాత కలుద్దాం అన్నారు శర్మగారు. నాకు తలకొట్టేసినట్టు అయింది. చెప్పలేని ఉక్రోషంతో మా గదికి వచ్చి కుర్చీలో కూలబడ్డాను. ఇదేమిటి! ఎందుకిలా జరిగింది? ముళ్ళపూడి వారి భాషలో చెప్పాలి అంటే బల్లపై పెట్టి ఉన్న నీళ్ళ గ్లాసులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.

మీటింగు అయిన తర్వాత ఆయనే నా దగ్గరకు వచ్చి అన్నారు, ‘నిన్ను కలుసుకోవాల్సింది ఇక్కడ, అక్కడ కాదు’ అని. మనసు తేలికపడింది. కృష్ణుడు, కుచేలుడు గుర్తుకు వచ్చారు.

ఇంతకీ నేను వారికి స్కూల్లో క్లాసు మేటునా కాదా! అవునో కాదో కానీ ఒక బాదరాయణ సంబంధం వుంది. మా స్వగ్రామం పేరు కంభంపాడు. శర్మగారి ఇంటిపేరు కంభంపాటి.

అలాంటి వ్యక్తి, అడగకుండానే వరాలిచ్చే దేవుడు అని ప్రసార భారతి సిబ్బంది చెప్పుకుని మురిసిన ఒక ఉత్తమ ఐ.ఎ.ఎస్. అధికారి శ్రీ కంభంపాటి సుబ్రమణ్య శర్మ గారు ఈరోజు  హైదరాబాదు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో   మరణించారనే విషాద వార్త నుంచి తేరుకోవడానికి, వారికి నివాళిగా  ఈ నాలుగు ముక్కలు రాస్తున్నాను.

(20-09-2025)

కింది ఫోటో:  అప్పటి  తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు,  కే. ఎస్.శర్మగారితో నేను




(ఇంకా వుంది)

19, సెప్టెంబర్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (220): భండారు శ్రీనివాసరావు

రాత్రి ఏదో ఛానల్ లో పాత చిత్రం ఈడూ జోడు వచ్చింది.

కొల్లిపర బాల గంగాధర తిలక్ అంటే ఎవరు వారు అనే వాళ్ళు వుండవచ్చేమో కానీ, కె.బీ.తిలక్ అంటే గుర్తుపట్టని వాళ్ళు వుండరు.
తెలుగు చిత్రసీమ గ్రంథంలో ఆయనకో పేజీ వుంది. అంతటి దిగ్డర్శకుడు. తాను తీసిన భూమికోసం సినిమాలో ప్రముఖ నటి జయప్రదకు తొలిసారి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత. ముద్దుబిడ్డ, ఎమ్మెల్యే, అత్తా ఒకింటి కోడలే, ఉయ్యాల జంపాల మొదలైన అనేక చిత్రాలు ఆయన ఖాతాలో వున్నాయి. హిందీలో ఛోటీ బహు, కంగన్ చిత్రాలు తీశారు.
ఈ చిత్రాలు గురించి కేబీ తిలక్ తనకు చెప్పిన విశేషాలతో,’అనుపమ గీతాల తిలక్’ అనే పేరుతొ మిత్రుడు జ్వాలా నరసింహారావు ఏకంగా ఒక పుస్తకాన్నే రచించాడు.
2010 లో అమెరికా వెళ్లి, కొన్ని మాసాలు మా పిల్లల దగ్గర గడిపి హైదరాబాదు తిరిగి వచ్చేందుకు సియాటిల్ విమానాశ్రయానికి బయలుదేరడానికి సిద్ధం అవుతున్న సమయంలో పిడుగులాటి దుర్వార్త తెలిసింది ‘తిలక్ గారు ఇక లేర'ని. నేను హైదరాబాదు చేరడానికే గంటలు పడుతుంది. చివరి సారి ఆయన్ని చూడగలుగుతానో లేదో అనే ఆందోళనతో, ఆయన గురించిన జ్ఞాపకాలతో నా ప్రయాణం సాగింది.
తెలుగు సినిమా పరిశ్రమకు కురువృద్ధుడయినా మా దగ్గర మాత్రం ఒక పిల్లవాడిలా వుండే వారు. ఒకరకంగా ఆయనా నేనూ ఇరుగుపొరుగు. నేను పనిచేసే రేడియో స్టేషన్ ను ఆనుకునే నిజాం క్లబ్. ఆ క్లబ్ సభ్యుడిగా తిలక్ గారు ఎక్కువ సమయం అక్కడే గడుపుతుండేవారు. ఆయనకదో కాలక్షేపం.
పేకేటి శివరాం, కేబీ తిలక్ మంచి స్నేహితులు. రేడియో స్టేషన్ కు మరో వైపున వున్న ఫతే మైదాన్ క్లబ్ లో శివరాం సభ్యులు. ఆయన సభ్యత్వం సంఖ్య, నాకు గుర్తు వున్నంతవరకు మూడంటే మూడు. అంటే ఆ క్లబ్ మొదలయినప్పటి నుంచి అందులో పేకేటి సభ్యులు అన్నమాట. అంత సీనియర్ సభ్యుడు కాబట్టి అక్కడ పనిచేసేవాళ్ళు అందరూ ఆయన్ని ఇట్టే గుర్తు పట్టేవాళ్ళు. నిజాం క్లబ్ లో తిలక్ గారి పలుకుబడి కూడా అంతే.
సాయంత్రం మా ప్రాంతీయ వార్తలు ముగిసే సమయంలో ఈ ఇద్దరూ కలిసి న్యూస్ యూనిట్ కు వచ్చేవారు. మా క్యాంటీన్ టీ తాగుతూ మేము చెప్పే కబుర్లు వినే వారు. ఆరూ ఇరవై అయిదుకి ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే పదండి పోదాం అనే వారు. ఈ లోపల మా పక్కనే యువవాణి కార్యక్రమాలు చూసే డాక్టర్ పీ ఎస్ గోపాల కృష్ణగారు వచ్చి పొద్దుటి నుంచి (వార్తలకోసం) పడ్డ శ్రమ గాలిలో కలిపేసారు కదా! అనేవారు నవ్వుతూ. (ఆయన ఆ తర్వాత ఆలిండియా రేడియో అడిషినల్ డైరెక్టర్ జనరల్ గా రిటైర్ అయ్యారు)
ఈ లోపల బీ హెచ్ ఈ ఎల్ లో పనిచేస్తున్న మిత్రుడు జ్వాలా నరసింహారావు వచ్చి కలిసేవాడు. న్యూస్ ఎడిటర్లు ఆకిరి రామకృష్ణారావు, ఆర్వీవీ కృష్ణారావు అందరం కలిసి అటు ఫతే మైదాన్ క్లబ్ కో, ఇటు నిజాం క్లబ్ కో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. బహుశా ఆ క్లబ్ లకి కాలినడకన వెళ్ళింది మేమే అనుకుంటా.
క్లబ్ లు సరే! కేబీ తిలక్ వంటి పెద్ద వాళ్ళు మా ఇళ్లకువచ్చి పోతుండేవారని చెబితే జనం ఒక పట్టాన నమ్మేవారు కాదు.
జ్వాలా ‘తిలక్ జ్ఞాపకాలు’ రాస్తున్నప్పుడు, తిలక్ గారు తెలతెల వారుతూనే, ఎక్కడో రెడ్ హిల్స్ నుంచి ఖైరతాబాద్ వరకూ మార్నింగ్ వాక్ లాగా జ్వాలా ఇంటికి నడుచుకుంటూ వచ్చి కాఫీ తాగి, తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని వెడుతుండడం నాకు తెలుసు. ఆ జ్ఞాపకాలు పుస్తకరూపంలో రావడానికి పూర్వం ప్రజాతంత్ర పత్రికలో సీరియల్ గా వచ్చాయి.
24x7 టీవీ ఛానళ్ళు రాకపూర్వమే, ఏరోజు వార్తలను ఆ రోజే వీడియో కేసెట్లో రికార్డ్ చేసి కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేయించాలని ఆయన చేసిన ఒక చిరు ప్రయత్నంలో జ్వాలా, నేనూ, ఎమ్మెస్ శంకర్ ప్రధాన సూత్రధారులం.
ఆ ప్రోగ్రాం పేరు స్పందన. అప్పట్లో ఇండియా టుడే వాళ్ళు ఇలానే న్యూస్ ట్రాక్ పేరుతో ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళు. కాకపోతే తిలక్ గారి ఆలోచన ఒక అరగంట కార్యక్రమం విజువల్స్ తో రికార్డు చేసి ఆ కేసెట్ కాపీలను స్థానిక కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఉదయం ఆరుగంటలకల్లా ప్రసారం అయ్యేలా చూడడం. కేసెట్ రికార్డింగ్ విషయంలో మా అందరికి కామన్ ఫ్రెండ్ శ్రీ అట్లూరి సుబ్బారావు సాయపడేవారు.
కానీ అది పూర్తి స్థాయిలో కార్యరూపం ధరించలేదు. మ్యాన్ పవర్ వున్నా, మనీ పవర్ లేకపోవడమే ప్రధాన కారణం.
ఈ కార్యక్రమం కోసం నాచేత నాలుగు ముక్కలు రాయించడానికి ఆయన ఎంతో ప్రయాసపడేవారు. ‘నీ వెంటబడి రాయించడం నా చేతకావట్లేదు. నీకంటే సినిమా రైటర్లే ఎంతో నయం’ అనేవారు.
మా ముందు కూర్చున్నది ఎవరో కాదు, ఒకనాడు తన అద్భుత చిత్రాలతో తెలుగు చిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పిన పెద్ద మనిషి అని తెలిసి కూడా మేము లైట్ తీసుకునేవాళ్ళం. అది మా అజ్ఞానం. మమ్మల్ని ఓపికగా భరించగలగడం ఆయన గొప్పతనం. వయస్సులో చాలా తేడా వున్నా, మాతో ఆయన చాలా పొద్దుపోయేదాకా గడిపేవారు.
అహంకారం, అభిజాత్యం సుతరామూ లేని మనిషి. అంతటి పెద్ద మనిషితో, అంత పెద్ద మనసున్న ‘మహా మనీషి’ తో కొన్నేళ్లపాటు అతి సన్నిహితంగా మెలగగలిగిన అవకాశం రావడాన్ని మించిన అదృష్టం ఏముంటుంది?
కింది ఫోటో:
కీర్తిశేషులు కేబీ తిలక్



(ఇంకావుంది)

18, సెప్టెంబర్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (219): భండారు శ్రీనివాసరావు

1975 లో పుట్టి 1985 లో చనిపోయాను.

అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా వృత్తి జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..
అప్పటివరకు పదిమందిలో ప్రథముడిని కాకపోయినా, మొదటి వరసలో వుండేవాడిని, తరువాత మూడు దశాబ్దాలు ఇంగువకట్టిన గుడ్డ మాదిరి. పాత వాసనలతో వృత్తి జీవితం గడిచిపోయింది.
నిజానికి నిండు జీవితం నూరేళ్లు అంటారు కానీ మనిషి తన జీవితంలో గొప్పగా బతికే కాలం అన్నేళ్ళు వుండదు. నా విషయంలో అది పదేళ్లకు కుంచించుకుపోయింది.
విలేకరుల సమావేశాలు మొదలుపెట్టేముందు రేడియో శ్రీనివాసరావు వచ్చాడా లేదా అని ఆరాలు తీసిన రోజులు చూశాను. వచ్చే వుంటాడులే అనుకున్న రోజులు చూశాను. మీడియా విస్తృతి అంత వేగంగా పెరిగిపోయింది. గుర్తింపు కోసం చేసిన ఉద్యోగం కాదు కనుక ఈ పరిణామాలు నా మనసును తాకలేదు.
నా విషయంలోనే కాదు, ప్రతి వృత్తిలో ఇది సహజం. ఎన్నో చూశాను, ఎందరెందరినో చూశాను. ఒక ఉదాహరణ చెబుతాను.
పి. నరసారెడ్డి. అరవై ఏళ్ళ క్రితమే ఆయన రాష్ట్ర స్థాయిలో సీనియర్ రాజకీయ నాయకుడు. ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా, అదీ అతి ప్రధానమైన రెవెన్యూ మంత్రిగా, ఎంపీగా , ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు. రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది.
చాలా కాలం తరువాత మళ్ళీ అదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా, మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.
“హైకోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ కు వెడతాను. నేను ఎవరన్నది మా పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుందని అన్నారు. అయితే, గొప్ప గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే తన పరిస్తితి చాలా మెరుగని కూడా చెప్పారు.
కంటి చూపుతో దేశ రాజకీయాలని, ఒంటి చేత్తో జాతీయ పార్టీ కాంగ్రెస్ ని శాసించిన ఇందిరాగాంధీ దివి తుపాను బాధితులను పరామర్శించడానికి రాష్ట్రానికి వస్తే, కొంతకాలం క్రితం వరకు ఆమె కనుసన్నల్లోనే పనిచేసి ఎమర్జెన్సీ పుణ్యమా అని సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు, మాజీ ప్రధాని అని కూడా చూడకుండా ఆమెకు గెస్ట్ హౌస్ సౌకర్యం కల్పించడానికి నిరాకరించిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. ఆవిడతో పోల్చుకున్నప్పుడు తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు. ఇందిరాగాంధీకి జరిగిన అవమానానికి నిరసనగా ఆనాడు వెంగళరావు మంత్రివర్గం నుంచి కార్మిక మంత్రి టి.అంజయ్య రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు.
నర్సారెడ్డి గారితో నాకు ఓ పర్సనల్ టచ్ వుంది.
నేను రేడియో విలేకరిగా హైదరాబాదు వచ్చిన కాలంలో ఆయన రెవెన్యూ మంత్రి. నగరానికి కొత్తగా వచ్చాను కనుక రేషన్ కార్డు అవసరం పడింది. ఆ రోజుల్లో ఇన్నిన్ని సంక్షేమ కార్యక్రమాలు లేకపోయినా రేషన్ కార్డు అవసరం అనేది అన్ని వర్గాలకు వుండేది. పాస్ పోర్టు కావాలన్నా రేషన్ కార్డు కావాలి. అంచేత ఆ కార్డు కోసం నా స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేశాను. తహసీల్ దారు (మధ్యలో ఎమ్మార్వో గా మారి మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు పూర్వ నామం వచ్చినట్టుంది) ఆఫీసు చుట్టూ అనేక సార్లు తిరిగి వేసారి, చివరకు రెవెన్యూ మంత్రి నర్సారెడ్డి గారికి విషయం చెప్పాను. ఆయన నన్ను కూర్చోమని చెప్పి, పియ్యేకు ఏం చేయాలో చెప్పారు. కాసేపట్లో ఆ అధికారి ఉరుకులు పరుగుల మీద మంత్రి పేషీకి వచ్చారు. ముందే చెప్పడం వల్ల ఆయన తన ఆఫీసు స్టాంపు, స్టాంపు ప్యాడ్ తో సహా వచ్చారు. అక్కడికక్కడే నా వివరాలు తీసుకుని రేషన్ కార్డు మంజూరు చేస్తూ సంతకం చేశారు. మర్నాడు నేను ఆఫీసుకు వెళ్ళే సరికి రేషన్ కార్డు పుస్తకం టేబుల్ మీద వుంది.
కొన్ని నెలల క్రితం క్రితం మళ్ళీ ఒక రెవెన్యూ మంత్రి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కలం కూలీ జి.కృష్ణ గారి గురించి నేను సభ్యుడిగా వున్నవయోధిక పాత్రికేయ సంఘం వారు ఒక పుస్తకం వేశారు. దాని ఆవిష్కరణ కోసం మంత్రిని కొందరం వెళ్లి కలిశాము. ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచీ నాకు తెలుసు.
మంత్రి నివాసం సందర్శకులతో కిటకిట లాడుతోంది. వచ్చిన విషయం సంబంధిత సిబ్బందికి తెలియచేసి బయట ఆవరణలో తచ్చాడుతున్నాం. నేను ఎక్కువసేపు నిలబడ లేక, బయట ఫుట్ పాత్ పై కూలపడ్డాను. లోపలనుంచి కబురు లేదు. ఎందుకు వుంటుంది. అందరం రిటైర్డ్ హర్ట్ పాత్రికేయులం.
ఎట్టకేలకు కలిశాము.
మాజీ మంత్రి నరసారెడ్డి గారితో పోల్చుకుని నయమే అనుకున్నాను. మమ్మల్ని వెయిట్ చేయించినందుకు నొచ్చుకున్నారు. విషయం చెప్పాము. ఈ మధ్యకాలంలోనే పనిచేసిన సీనియర్ పాత్రికేయులతోనే ఆయనకు పరిచయం లేదు. ఎప్పుడో జవహర్ లాల్ నెహ్రూ, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి వంటి వారితో సన్నిహిత పరిచయం వున్న జీ కృష్ణ గారు తెలిసే అవకాశమే లేదు.
అయినా కలిసారు, మాట్లాడారు,. ‘మీరంతా పెద్దవాళ్లు, చల్లగా వుండండి’ అని చెప్పి పంపేశారు. జర్నలిస్టులు అందులో వయోధికులు, అల్ప సంతోషులు కదా! అంత మాత్రానికే సంతోషించి వెనక్కి వచ్చేశాము.
తోకటపా:
కృష్ణగారి పుస్తకావిష్కరణ ఇంతవరకు జరగలేదు. వ్యక్తిగత పరిచయాలు, వృత్తిగత పరిచయాలు కూడా ‘మనకేమిటి ఇందులో’ అనే దగ్గరే ఆగిపోతున్నాయి.
(ఇంకా వుంది)

17, సెప్టెంబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (218): భండారు శ్రీనివాసరావు

 ఇల్లాలి ముచ్చట్లు

 

చిన్న స్థాయి జర్నలిస్టులకు కొత్త ఏడాది రావడానికి కాస్త ముందుగానే డైరీలు,  కాలెండర్లు గిఫ్టులుగా ఇచ్చేవాళ్ళు. వాటిల్లో అట్ట మందంగా  వున్న డైరీలో మా ఆవిడ ఇంటి పద్దులు రాసేది. బోడి మూడు వందలు, అందులో కోతలు పోను  చేతికి వచ్చేది రెండువందలకంటే తక్కువ. ఇంతమాత్రం దానికి జమాఖర్చులు రాయడం ఎందుకు అనేది నా వాదన. ఆఫీసులోనే ఒక జీవితానికి సరిపడా రాసి ఇంటికి వచ్చే వాళ్లకు ఇక డైరీల్లో రాసుకునే విషయాలు ఏముంటాయి కనుక.  

అయితే  డైరీల్లో ఇంటి  ఖర్చుల లెక్కలతో పాటు తన మనోభావాలు కూడా కొన్ని  రాసుకునేది అనే విషయం నాకు మొన్న మొన్నటి వరకూ తెలియదు. ఇతరుల డైరీలు చదవడం మర్యాద కాదని తెలుసు. కానీ ఆ రాసిన మనిషే ఇప్పుడు లేదు.  

అక్కడక్కడా కనిపించిన కొన్ని ముచ్చట్లు. నాతో  చెప్పినవి కాదు, బహుశా  నాతొ చెప్పాలనుకున్న సంగతులు కావచ్చు. పెళ్ళికి ముందు గలగలా మాట్లాడుతుందని మా ఆవిడకు పేరు. ఘలఘలా మాట్లాడుతాడని నాకో పేరు. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటే పొరుగు వాళ్లకు కాలక్షేపం అనుకుందో ఏమో తాను మాట్లాడడం బాగా తగ్గించింది.

మా ఆవిడ రాసుకున్న ఆ డైరీల్లో కొన్ని పేజీలు :

 

“1968 ప్రాంతాల్లో నేను (అంటే మా ఆవిడ నిర్మల) బెజవాడ మాంటిసోరి స్కూల్లో చదివేదాన్ని. (అప్పటికి మా పెళ్ళికాలేదు) సరస్వతి వొదినె గారి పిల్లలు సత్యవతి, విజయ అంతా ఆ స్కూలే. ఆ స్కూల్లో పిల్లల్ని చదివించడం అనేది ఆ రోజుల్లో చాలా గొప్పగా వుండేది. దానికి కారణం ప్రిన్సిపాల్  కోటేశ్వరమ్మగారు. బెజవాడ కనకదుర్గమ్మ మాదిరిగానే  కోటేశ్వరమ్మ పేరు కూడా అంతే ప్రసిద్ధి.

తుర్లపాటి  హనుమంతరావు అన్నగారి మనుమడు, విజయ కుమారుడు (కార్తీక్) పుట్టినప్పుడు బారసాలకు కోటేశ్వరమ్మగారు కూడా వచ్చారు. మేమంతా ఆవిడ  స్టూడెంట్లం కాబట్టి భోజనాల సమయంలో (ఆ రోజుల్లో ఎవరొచ్చినా నేల మీదనే భోజనాలు, పీటలు వేసి వడ్డించేవారు) ఆమె చుట్టూ కూర్చున్నాం. చాలా ఏళ్ళ తరువాత కలిసినా, ఆవిడ పేరు పేరునా అందర్నీ ఆప్యాయంగా పలకరించారు.

ఏం చేస్తున్నావని’  నన్నడిగితే,  హైదరాబాదులో ‘అమ్మవొడి’ పేరుతొ చిన్నపిల్లల కోసం  కేర్ సెంటర్ నడుపుతున్నాను’ అని చెప్పా. బహుశా ఆమె దగ్గర చదువుకున్నవాళ్ళల్లో  చదువులో ఎక్కిరానిదాన్ని నేనే అనుకుంటా. కానీ ఆవిడ మాత్రం నన్ను అభినందించారు. ‘స్త్రీలు స్వతంత్రంగా ఏదో ఒకటి చేయడం చాలా అవసరమ’ని చెప్పారు. నేను ఏదో మా అవసరాలకు కేర్ సెంటర్  పెట్టుకుంటే, ఆవిడ పెద్ద మనస్సుతో ఆశీర్వదించిన విధానం నేను మరిచిపోలేను.

"ఇంకో విషయం. తెలుగు సినిమా రంగంలో హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న ‘జంధ్యాల’ (జేవీడీఎస్ శాస్త్రి) కూడా మాంటిసోరి స్కూల్లో నా  క్లాసుమేటు. దీనికి కొనసాగింపు లాంటి ముగింపు ఏమిటంటే జంధ్యాల తదనంతర కాలంలో బెజవాడ ఎస్సారార్ కాలేజీలో మూడేళ్ళు బీకాంలో మా వారికీ క్లాసుమేటు."

 

“అప్పుడు మేము చిక్కడపల్లి త్యాగరాయ గానసభ దగ్గర్లో  పర్చా కిషన్ రావు గారింట్లో అద్దెకు ఉంటున్నాము. మా వారికి రేడియోలో ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. దగ్గరలో ఉన్న  సెంట్ ఆంథోని స్కూల్లో చేర్చాము. రానూ పోనూ నెలవారీగా రిక్షా మాట్లాడాము.

“ఆ రోజుల్లో ఆదాయ వ్యయాలు ఎలా ఉండేవి అంటే  జీతానికిజీవితానికీ పొంతన వుండేది కాదు. అంచేత కరెంటు బిల్లు (అప్పట్లో రెండు నెలలకోమారు వచ్చేది) కడితేఆ నెల ఇంటి రెంటు బాకీ పడేది. పాపం ఆ పెద్దాయన  ప్రతి నెలా  మొదటివారంలో తను ఉంటున్న బర్కత్ పురా ఇంటి నుంచి చేతికర్ర  పొడుచుకుంటూజాగ్రత్తగా  నడుచుకుంటూ చిక్కడపల్లి వచ్చేవారు అద్దె వసూలు కోసం.  మళ్ళీ ఉసూరుమంటూ వెళ్ళిపోయేవారుసమయానికి  అద్దె కట్టలేని మా పరిస్థితి చూసి కొంత జాలిపడిమరికొంత చీకాకు పడి.

“ఈ నేపధ్యంలో మరో దారి కనపడక ఈ అమ్మఒడి దారి ఎంచుకున్నాను.

“ఉన్న రెండు గదుల్లో ఒకదాన్ని ఈ కేర్ సెంటర్ కోసం కేటాయించాము. బయటరోడ్డు మీద వెళ్ళే వారికి కనబడేటట్టు ‘తల్లి ఒడి విడలేని చిన్నారుల బడి’ అనే ట్యాగ్  లైన్ తో  ‘అమ్మవొడిచైల్డ్ కేర్ సెంటర్’ అనే బోర్డు రాయించాము.

“రెండు వారాలు గడుస్తున్నా  అమ్మ ఒడిలో తమ పిల్లల్ని చేర్చడానికి ఎవరూ ముందుకు రాలేదు. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కానీఉయ్యాలలు  కానీ లేవు. కనీసం ఆయా కూడా లేదు. అలాంటి సెంటర్ లో ఎవరు మాత్రం తమ పిల్లల్ని వదిలి వెడతారుకానీ అవన్నీ అమర్చడానికి ఆర్ధిక వనరులు లేవు.

“అలా ఎదురు చూస్తుంటే ఒక రోజు ఉదయం ఇంకా ఎనిమిది కూడా కాలేదు ఒక జంట హడావిడిగా వచ్చి నా  చేతిలో వాళ్ళ నెలల పిల్లవాడినిఓ పాలసీసాను పెట్టి, ‘ఇప్పుడు టైము లేదుసాయంత్రం ఆఫీసు నుంచి వచ్చినప్పుడు వివరాలు చెబుతామంటూ’ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు.

“వాళ్లెవరో తెలియదు. ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు. ఆ పిల్లవాడి పేరేమిటో తెలియదు. గంటలు గడిచిపోతున్నాయిసాయంత్రం అయింది. మా పిల్లలు స్కూలు నుంచి వచ్చారు. మా వారు కూడా ఆఫీసు నుంచి వచ్చారు.  ఏడుస్తున్న పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని  సముదాయిస్తూ  ఒక్కత్తినీ  అలా కూర్చుని వున్నాను. రాత్రి తొమ్మిది దాటుతోంది. కానీ ఆ తలితండ్రుల జాడ తెలియదు. మా వారు నా పరిస్థితి చూసి ‘పోలీసులకు చెప్పనా!’ అన్నారు.  తల అడ్డంగా ఊపాను. ‘వద్దు. వాళ్ళ మొహాలు చూస్తే మంచివాళ్ళుగానే అనిపించారు. ఏమి ఆటంకం వచ్చిందో తెలవదు కదా! చూద్దాం. మీరు అన్నట్టు రేపటికి కూడా రాకపోతే ముగ్గురు పిల్లలు అనుకుని వీడిని కూడా మన పిల్లలతో పాటే పెంచుతాను’ అన్నాను  స్థిరంగామరో మాట లేదన్నట్టు.

“అన్నట్టే వాళ్ళు చాలా మంచివాళ్ళు. రాత్రి పదిన్నరకు వచ్చారుబోలెడు క్షమాపణలు చెప్పుకుంటూ. ఆయనకి  ఆఫీసు ఆరుకే అయిపోయిందట. కానీ ఆమెకు పెండింగ్ ఫైల్స్ పని పడి పొద్దు పోయిందట. ఈ సంగతి చెబుదామంటే మా ఫోను నెంబరు పొద్దున్న హడావిడిలో తీసుకోవడం కుదరలేదట.

“బాబు పేరు జేమ్స్. మా అమ్మఒడిలో చేరిన  మొదటి పిల్లవాడు.

“తరువాత కొన్ని రోజులకి మరో పిల్లవాడు. అలా రెండు నెలలు తిరిగేసరికి పనిపిల్లను పెట్టుకునే స్థాయిలో పిల్లల సంఖ్య పెరిగింది. పని భారము పెరిగింది. పని మనిషి  రాని రోజున చూడాలి అవస్థ. పదిమంది తల్లుల పాత్రలతో ఏకపాత్రాభినయం చేయాలి. కావాలని కోరి ఎంచుకున్న మార్గం కాబట్టి కష్ట నష్టాలులాభ నష్టాలు చూసుకోలేదు. ఎవరినీ ఇంత కావాలని అడిగింది లేదు. ఇచ్చినది పుచ్చుకోవడమే. కొందరు పద్దతిగా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏమీ అనేదాన్ని కాదు.

“మేమూ అంతేగా! నెలనెలా  అద్దె కట్టడానికి ఇబ్బంది పడడం లేదా. వాళ్ళూ అలాగే. ఖర్చులకు సరిపోకనే కదాఇద్దరూ ఉద్యోగాలు చేసేది.

“అలా మొదలైన అమ్మఒడి క్రమంగా పేరు పెంచుకుంటూ పెరుగుతూ వచ్చింది. చిక్కడపల్లిలో ఒక లాండ్ మార్కుగా మారింది. మేము 1987లో మాస్కో వెళ్ళిన తర్వాత అమ్మఒడి బాధ్యతలు  మా వారి  మేనకోడలు ఫణి కుమారి తన భుజాలకు ఎత్తుకుంది.

“అమ్మఒడిలో పెరిగిన పిల్లలు చాలా మంది ఇప్పుడు విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ తలితండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకు పిలుస్తుంటే  చాలా సంతోషంగా వుండేది.

“అలా మొత్తం మీదఅనాథాశ్రమంలో నర్స్  కావాలనుకున్న నా చిన్ననాటి కోరిక  అమ్మఒడి ద్వారా కొంత తీరింది”

ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు నా  కంట నీరు తిరగాలి. కానీ బండ రాతిలో నీటి ఊటని ఎప్పుడైనా చూసామా!

నేనూ అంతే!

కింది ఫోటో:



(ఇంకా వుంది)

15, సెప్టెంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (217): భండారు శ్రీనివాసరావు

 


ఆరు రాత్రులు – ఆరు పగళ్ళు

ఇదేమీ వెనుకటి రోజుల్లోని మళయాళం డబ్బింగు సినిమా టైటిల్ కాదు. అచ్చంగా నా సొంత గొడవ. ఎవరితోనూ పెట్టుకున్న గొడవ కాదునాకై నేను, నాతో నేను  పెట్టుకున్న గొడవ. పైగా అయిదేళ్ళ కిందటిది కూడా.

మా ఆవిడ చనిపోయిన ఏడాదికి హైదరాబాదులోనే వుంటున్న మా రెండో అన్నయ్య కొడుకు, కోడలు లాల్, దీప కొంచెం మార్పుగా వుంటుందని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు.

పెద్ద ఇల్లువిశాలమైన పడక గదులుఅన్నింటికీ మించి అతి విశాలమైన మనసులు కలిగిన దంపతులు దీపలాల్ బహదూర్,  తమ మాటలతో చేతలతో ఆకట్టుకునే పిల్లలు వారి  స్పురిత, హసిత.(ఇప్పుడు అమెరికాలో వుంటున్నారు, ఒకరు ఉద్యోగం చేస్తూ, మరొకరు పై చదువులు పూర్తి చేస్తూ) నాకు తోడుగా నా మేనల్లుడు రామచంద్రంఅతడి భార్య కరుణ. ఆ దంపతుల ఏకైక కుమార్తే దీప.

అందరికీ ఎవరి పడక గదులు వారికే వున్నాయి. కరోనా రోజులు. అందరూ ఎడం ఎడంగా  కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా విశాలమైన హాలు. చుట్టూ పూలమొక్కలుకూరగాయల పాదులుఅన్ని రకాల ఫల వృక్షాలు. అన్ని రకాల వసతులతో ఒక చక్కని పల్లెటూరులో వున్నట్టు వుంటుంది. వాళ్ళు ఆ విల్లా కొనుక్కున్నప్పటినుంచీ నన్నూ మా ఆవిడనూ వారి దగ్గరికే వచ్చి కొన్నాళ్ళు గడపాలని పోరుపెట్టేవారు. కానీ మా ఆవిడ వుండగా వీలుపడలేదు.

ఓ శుక్రవారం వచ్చి నన్ను కారులో తీసుకుపోయారు. తెలిసిన ఇల్లే. తెలిసిన మనుషులే.

అక్కడ ఉండగానే నాకేమీ తెలియదనే  నిజం ఒకటి తెలిసివచ్చింది. అది తెలియగానే సెల్ ఆఫ్ చేసాను. పత్రికలు ముట్టుకోలేదు. టీవీ వార్తలు చూడలేదు. ఇన్నాళ్ళూ జీవించిన ప్రపంచానికి కొంచెం  దూరం జరిగాను.

దీనికి కారణం మా మేనల్లుడు రామచంద్రం. నాకంటే చాలా చిన్నవాడు.

మరో కారణం, నాలో మరో నేను వున్నాడు అనే సంగతి తెలియరావడం.

ఆ రెండో నేను నాలో  ఉన్నాడని తెలిసింది కానిఎవరో ఏమిటో  తెలియదు.

అది తెలియడానికే ఈ ఆరు రాత్రులుఆరు పగళ్ళు ఖర్చు చేయాల్సివచ్చింది. తెలిసిందా అంటే ఏమి చెప్పాలి,  మహామహులకే సాధ్యం కాలేదు ఆ సంగతి తెలుసుకోవడం.  నాకెలా వీలుపడుతుంది?

సత్సంగత్వే నిస్సంగత్వం

ఆధ్యాత్మికంఆముష్మికం ఈ పదాలు చిన్నతనం నుంచి అనుక్షణం వినబడే కుటుంబ నేపధ్యం అయినప్పటికీ వాటిపట్ల అభిలాష కానీ అనురక్తి కానీ ఏర్పడలేదు. అలా అని వాటిని తృణీకరించే స్వభావమూ నాకు అలవడలేదు. జీవితంలో అనేక విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. వాటిల్లో ఇవీ ఒక భాగమే అనే తత్వం.

“సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం

నిర్మోహత్వే నిశ్చలత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తి:” 

మంచి మనసున్న మనుషులతో సాంగత్యం మనసుపై మంచి సానుకూల ప్రభావం చూపుతుంది. ఆది శంకరాచార్యులు తన భజగోవింద స్త్రోత్రంలో చెప్పిన ఈ శ్లోకం అంతరార్ధం ఇదే.

ఈ ఆరు రాత్రులుఆరు పగళ్ళ కాలంలో మంచి మాటలు వినడానికీమంచి రచనలు చదవడానికీమంచి మనుషులతో గడపడానికీ ఓ మంచి అవకాశం లభించింది. సందేహాలుసమాధానాలతో కూడిన అర్థవంతమైన చర్చలకు ఆస్కారం దొరికింది. గూడుకట్టుకుని ఉన్న సందేహాలు తీరాయాదొరికిన సమాధానాలు సంతృప్తి ఇచ్చాయా అంటే చప్పున జవాబు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు  ముందు దాదాపు డెబ్బయి సంవత్సరాల నుంచీ కూడబెట్టుకున్న  సంచితం మెదడులో నిక్షిప్తమై గడ్డకట్టి వుంది. ఇలా అయిదారు రోజుల ప్రయత్నంతో దాన్ని పెకలించడం కష్టం.

వయసులో పెద్ద అయిన నావి సందేహాలు. నాకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడయిన నా మేనల్లుడు రామచంద్రం వాటిని తీర్చే ప్రయత్నం చేసేవాడు. ఇదో వైచిత్రి.

ఉదయం మొదలయిన వాదసంవాదాలు ఒక పెట్టున తేలేవి కావు. అపరాహ్నం వరకూ సాగి వాటి నడుమనే ఉపాహారాలుఅల్పాహారాలుమధ్యాన్న భోజనాలు.  ఇక సాయంసమయంలో మొదలయితే అర్ధరాత్రివరకూ అంతువుండేది కాదు.  ఇద్దరు ప్రాసంగికులే. ఇద్దరూ శ్రోతలే. జవాబుల అన్వేషణలో ప్రశ్నలు,  సందేహాల నివృత్తిలో మరిన్ని ప్రశ్నలు.

మా మేనల్లుడు రామచంద్రానికి పూర్వజన్మ వాసనలతో కూడిన ఆధ్యాత్మిక భావజాలం వుంది. అది బహుశా వారి నాన్నగారు కొమరగిరి అప్పారావు బావగారి నుంచి వారసత్వంగా లభించి వుంటుంది. చేసింది గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం అయినా రామాయణభారత భాగవతాలు నాలుకపై ఆడుతుంటాయి. చిన్నవయసులోనే ఇలాంటి అధ్యాత్మిక వాసనలు ఉన్న వారిని తోటివారు చిన్నచూపు చూడడం కద్దు. కానీ రామచంద్రం విషయం కొంత విభిన్నం. మా కుటుంబంలో  అందరికీ రామచంద్రం చెప్పే విషయాలు వినడంలో ఆసక్తి వుంది. నా ఒక్కడికీ కొంత మినహాయింపు ఇవ్వాలేమో. ఎందుకంటే నాదంతా అనుమానాలతో కూడిన ఆరాలు. దేవుడు అంటే భక్తీ లేకా కాదుదేవుడు అంటే నమ్మకం లేకా కాదు. ఏ విషయాన్ని వెంటనే నమ్మేయడం ఎందుకనే సాధారణ ప్రాపంచిక విషయ పరిజ్ఞానం  తాలూకు  ప్రభావం నామీద ప్రబలంగా ఉన్న కారణంగా వచ్చిన తిప్పలు ఇవి. మూఢ నమ్మకాల మీద అతిమూఢ౦గా పెంచుకున్న అయిష్టతఏహ్యత ఒక కారణం కావచ్చు.

ఈ నేపధ్యంలో ఈ ఆరు రాత్రులుఆరు పగళ్ళ అధ్యాయం మొదలయింది.

 

భండారు శ్రీనివాసరావు అనే నేను ...

బాగానే వుంది, నువ్వే శ్రీనివాసరావువి. మరి ఆ ఆ పేరు తీసేస్తే నీవెవరు?

నిన్ను గుర్తు పట్టేది ఎల్లా? నీ రూపం చూశా? నీ మాటలు వినా? నీ రాతలు చదివా? ఎలా?

ఈ శరీరానికి ఆ పేరు ఉందా! లేదా పేరును బట్టి శరీరానికి శ్రీనివాసరావు అనే అస్తిత్వం వచ్చిందా!

ఈ నేను కాని దాన్ని నేను, నేను అనుకోవడం అజ్ఞానం అవుతుందా!

అంటే ఈ నేను, నేను కాదని బోధపరచుకోవాలా!

సత్యం బోధ పడడానికి ఎంత దూరం దృష్టి సారించాలి. అంత దూరం దృష్టి ఆనుతుందా!

పెంజీకటి కావల అన్నాడు పోతన,

అంటే పెనుచీకటికావల వెలుగు ఉంటుందా! అసలు ఈ కటిక చీకటిని చీల్చి చూడడం ఎల్లా!

దేహంలో ఆరు కోశాలు అని అంటారు.

అన్నమయ కోశం (అన్నంతో జీవించేది), ప్రాణమయ కోశం ( శరీరంలో వున్న వ్యవస్థ), మనోమయ కోశం(ఆలోచింప చేసేది), విజ్ఞానమయ కోశం ( జ్ఞానం కలిగించేది), ఆనందమయ కోశం ( దివ్యానుభవం కలిగించేది).

మొదటి అయిదు దాటి చూస్తే చివరిదానికి చేరుకుంటాడు మానవుడు. దాన్ని కూడా దాటి చూడగలిగితే సర్వం ఆనందమయం. అక్కడ గోచరిస్తుంది ప్రకాశంతో విరాజిల్లే ఆత్మ.

అదే అసలయిన నేను అంటారు భగవాన్ రమణ మహర్షి.

గీతలో చెప్పినట్టు చంపేదెవరు? చచ్చేదెవరు?

అంతా నీ భ్రమ.

అన్నీ నేనే అనే పరమాత్మ ఒకటి వుంది. మిగిలినవన్నీ భ్రాంతులే.

నేనెవరు అని ఓమారు మనల్ని మనం ప్రశ్న వేసుకుని నిశ్చల ధ్యానంతో జవాబు వెతుక్కుంటే ..

ప్రతి మనిషి శరీరంలో మూడు భాగాలు. ఒకటి ఉపాధి (శరీరంతో కూడిన నేను), రెండోది స్థూల శరీరం (రక్తమాంసాలు కలిగినది), మూడోది సూక్ష్మ శరీరం (జీవుడు)

కంటికి కనబడే స్థూల శరీరాన్నే నేను అనే ఓ మిథ్యా భావనలో, భ్రమలో ఉంటాము.

జీవుడు అనే సూక్ష్మ శరీరము, జన్మజన్మల కర్మఫలాలను అనుభవించడానికి స్థూల శరీరాన్ని ధరిస్తుంది. ఆ కర్మ ఫలాలు కూడా మూడు.

ప్రారబ్ధం, ఆగామి, సంచితం.

ప్రస్తుత శరీరంలో జీవుడు అనుభవిస్తున్న కర్మని పుణ్యం, ప్రారబ్ధం అంటారు.

అనాదిగా తెచ్చిపెట్టుకున్న కర్మని ఆగామి అంటారు.

కర్మశేషం వుంటే అది సంచితంగా మరో జన్మలో దఖలు పడుతుంది.

కర్మశేషం తొలగిన రోజున జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. అంటే పాపపుణ్యాలు రెండింటినీ క్షయం చేసుకోవడం అన్నమాట.

ఏమి అర్ధం అయింది? అంత తేలికగా అర్ధం కానిది, అంతం లేనిది కనుకే వేదాంతం అన్నారు.

అర్ధం అయినా కాకపోయినా ఈ వయస్సులో అప్పుడప్పుడైనా కొన్ని ఆముష్మిక విషయాలు గురించి ఆలోచించడం మంచిదనిపించింది. అంతే!

 

“అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః

ప్రాణాపాన సమాయుక్తః  పచామ్యన్నం చతుర్విధం”

(శ్రీ మద్భగవద్గీత, పంచ దశాధ్యాయం,  పురుషోత్తమ ప్రాప్తి యోగము)   

తాత్పర్యం: నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని  ప్రజ్వలింప చేసే ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనే నాలుగు  విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను.

ఇప్పుడీ గీతా ప్రవచనం ఎందుకంటే నేను ఓ అరవై, డెబ్బయ్  ఏళ్ళు వెనక్కి పోవాలి.

 

నా చిన్నతనంలో మా బామ్మగారు రుక్మిణమ్మ గారు ప్రతిరోజూ అపరాహ్ణకాలంలో భోజనానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్ద చేతిలో పట్టుకుని ఈ గీతా వాక్యాన్ని చదివేది. అది ఎందుకు చదివేదో నాకు అర్ధం అయ్యేది కాదు. ఆ శ్లోకం పూర్తి పాఠం కూడా నాకు గుర్తులేదు, అక్కడక్కడ ఒకటి రెండు పదాలు మినహా.

నాకు గుర్తున్న ఆ ఒకటి  రెండు పదాలు ( ‘అహం వైశ్వా..... పచామ్యన్నం...... చతుర్విధం...) గురించి అడిగాను రామచంద్రాన్ని.  అతడు వెంటనే ఈ పదాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవని చెప్పి పైన చెప్పిన విధంగా  టీకాతాత్పర్యాలు వివరించాడు.

 

అరవై ఏళ్ళకు పైగా  నా మనసును తొలుస్తున్న సమస్యకు పరిష్కారం దొరికింది. సత్సంగం వల్ల ప్రయోజనం ఇదే!

 

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నన్ను కష్టపెట్టడానికే పుట్టారు’ అనేది ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నాకున్న ఓ నిశ్చితాభిప్రాయం.

అది చిన్నప్పుడు బలవంతాన కలరా సూదిమందు ఇచ్చిన సర్కారు మనిషి కావచ్చు, అడిగిన అప్పచ్చులు వెంటనే పెట్టలేదని నేను కోపం పెంచుకున్న మా బామ్మ కావచ్చు, హోం వర్కు చేయలేదని నా వీపు వాయగొట్టిన లెక్కల మాస్టారు కావచ్చు, దాచిపెట్టుకున్న గోలీలు కాజేసిన నా బెస్టు ఫ్రెండు కావచ్చు ఇలా ఈ డెబ్బయి ఏళ్ళ పైచిలుకు సాగిన నా ఈ జీవితంలో, ప్రతి దశలో ఎవరో ఒకరు నన్ను కష్టపెడుతూనే వచ్చారని అదేమిటో ఓ పిచ్చి నమ్మకం. ఆ నమ్మకంతోనే వాళ్ళతో పెరుగుతూ విరుగుతూ వచ్చిన మానవ సంబంధాలు.

ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏమిటో అంతా విష్ణుమాయ.

ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నన్ను సుఖపెట్టడానికే పుట్టారు’ అనేది కొత్తగా మొగ్గ తొలుస్తున్న భావన.

అది పొరుగింటివారు కావచ్చు, ఆటో డ్రైవరు కావచ్చు, ఇంట్లో పొద్దున్నే పత్రికలు వేసే పేపరు బాయి కావచ్చు, ఇలా ఎందరెందరో వాళ్ళ సుఖాల్ని వదులుకుని నన్ను సుఖపెడుతున్నారనే అభిప్రాయం నాలో నాకే ఒక కొత్త మనిషిని చూపిస్తోంది.

ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ వల్ల నాకు సిద్ధించిన ఫలితం ఇదే!

ఈ ఎరుక నలభయ్ ఏళ్ళ క్రితమే కలిగివుంటే ఈనాడు నాకు ఎటు చూసినా మంచి మిత్రులే వుండేవాళ్ళు. అలాంటి విలువయిన సంపదను నేనే చేతులారా పోగొట్టుకున్నానన్నమాట.

ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం?

కింది ఫోటో:

మా బామ్మగారు భండారు రుక్మిణమ్మ గారు




(ఇంకా వుంది)