30, జూన్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో ( 186 ) – భండారు శ్రీనివాసరావు

 

స్వేచ్ఛను చూశాను
ఈ రోజు జులై 29 వ తేదీ అమెరికాలో అనేక నగరాల్లోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రైడ్ పెరేడ్లు (PRIDE PARADES) జరిగాయి. సియాటిల్ నగరం డౌన్ టౌన్ నాలుగో ఎవెన్యులో జరిగిన ఈ పెరేడ్ ని మూడు లక్షలమంది తిలకించారని ఒక అంచనా.
PRIDE అంటే Professionalism, Respect, Integrity, Diversity and Excellence. ఇవన్నీ లేస్బియన్లు, గే, ట్రాన్స్ జెండర్స్ (LGBTQ) మొదలైన వారి హక్కుల సాధన కోసం. వాళ్ళూ సమాజంలో భాగమేనని సాగిస్తున్న ఉద్యమంలో ఈ ప్రైడ్ పెరేడ్ ఒక భాగం.
ఈ పెరేడ్ లో ప్రధానంగా కనిపించేది స్వేచ్ఛ. అసలు అమెరికన్ సమాజమే స్వేచ్ఛను కోరుకుని, గౌరవించే సమాజం. ప్రపంచంలోని అన్ని జాతులవాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు అవకాశాలు వెతుక్కుంటూ ఈ దేశం వచ్చి దేశాభివృద్ధిలో భాగంగా మారి, తమ దేశాల్లో కంటే ఎక్కువగా స్వేచ్ఛను అనుభవిస్తున్నారు.
అయితే ఈనాటి పెరేడ్ ని తిలకించిన తర్వాత రాను రాను ఈ సమాజం ఏ దిక్కుగా పయనిస్తోంది అనే సందేహం కాదు భయం కూడా కలిగిన మాట వాస్తవం. వెర్రితలలు వేయనంతవరకు ఏ మార్పును అయినా స్వాగతించవలసిందే. నేను మార్పుకు వ్యతిరేకం కాదు.
అయితే...
స్థానికంగా కొందరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్ధం అయింది ఏమిటి అంటే లక్షలమంది హాజరయ్యారు కాబట్టి దీనికి బహుళ జనుల ఆమోదం వున్నట్టు లెక్కకాదు. ఈ పోకడలను వ్యతిరేకించేవారు కూడా అధిక సంఖ్యలో వున్నారు. ఆడ మగ స్వలింగ సంపర్కాన్ని సమర్థించేవారు, ఆడామగా కాని వారి హక్కులకోసం పోరాటం చేసేవారు ప్రైడ్ వంటి ఉద్యమాలకు వత్తాసు పలుకుతున్నారు. స్వేచ్ఛకు తమదైన భాష్యాలు చెబుతున్నారు. దేశం అంటే గర్వపడ్డట్టే, మిమ్మల్ని గురించి మీరు గర్వపడండి. మీ శరీరాన్ని గురించి గర్వపడండి. అది మీది. మీరు మీరే. వేరే ఎవరో కారు. మీరు ఎలా తిరగాలి ఎలా పెరగాలి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, అసలు దుస్తులు ధరించకపోతే ఇతరులకు కలిగే ఇబ్బంది ఏమిటి? ఇలాంటి స్వేచ్ఛ లేని జీవితం ఎందుకు? ఇలా సాగుతాయి వారి ఆలోచనలు.
ఇంతటితో ఆగలేదు.
ఒక మనిషి తాను ఆడా మగా అన్నది తేల్చాల్సింది సమాజం కాదు, డాక్టర్లు కాదు, తలితండ్రులు కూడా కాదు. ఎవరికి వారే తాము ఎవరు అనేది నిర్ణయించుకోవాలి అనే మరో వాదన కూడా మొదలైంది. ఒక మగవాడు, ఇక నుంచి తాను మహిళను అని ఏకపక్షంగా ప్రకటించుకుని, మహిళ మాదిరిగానే దుస్తులు ధరించి జీవిస్తాను అనడాన్ని కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ తనను తాను మహిళగా భావించు కొంటున్నాను కాబట్టి స్త్రీలకు ప్రత్యేకించిన రెస్ట్ రూములు (టాయిలెట్లు) స్వేచ్ఛగా వాడుకుంటానని అనడమే విడ్డూరం.
‘నా శరీరం నా ఇష్టం. నాకు కాళ్ళు చేతులు ఉన్నట్టే ప్రైవేటు పార్ట్స్ వున్నాయి. శరీరంలోని ఇతర భాగాల వంటివే అవి కూడా. తమని చూసేవారు వాటిని కూడా తమ కాళ్ళు చేతులను చూసినట్టే, నిర్వికారంగా పాజిటివ్ దృష్టితో చూడాలి’ అంటూ ఒంటి మీద నూలుపోగు లేకుండా బహిరంగ స్థలాల్లో తిరగడం ఒక హక్కుగా చెప్పుకోవడాన్ని కొందరు ఈ ఉద్యమ వ్యతిరేకులు తప్పుపడుతున్నారు.
ఈ ధోరణి మరింత శృతి మించింది. నేను పిల్లిని, గుర్రాన్ని అనుకుంటూ వాటిలాగే జీవించడం. నేను ఒక చెట్టును అని గట్టిగా నమ్మి ఎటూ కదలకుండా ఒంటరిగా ఒక జడ పదార్ధం మాదిరిగా తలితండ్రులకు భారం కావడం. వీటిని ఎలా అర్ధం చేసుకోవాలి.
వీటన్నిటికి ఈ నాటి పెరేడ్ అద్దం పట్టింది. దాదాపు వందమంది ఆడా మగా బృందం పూర్తి నగ్నంగా ఊరేగింపులో పాల్గొని నృత్యాలు చేశారు. పిల్లులు, కుక్కలు, గుర్రాల మాదిరిగా వేషాలు వేసుకుని, పిల్లిలా మ్యావ్ అంటూ, కుక్కలా మొరుగుతూ, గుర్రంలా సకిలిస్తూ మరి కొందరు పెరేడ్ లో పాల్గొన్నారు. తప్పూ ఒప్పూ చెప్పడానికి మీరెవ్వరు అనేది వారు సంధించే మొదటి ప్రశ్న.
సరే! నాణానికి మరో వైపు చూద్దాం.
‘నిన్నను గురించి మరచిపోండి. రేపటి గురించి ఆలోచించకండి. ఈ రోజే నిజం. ఇదొక్కటే నిజం. ఈ నిజాన్ని పూర్తిగా ఆస్వాదించండి. భయాలు, బాధలు మరచిపోయి ప్రస్తుత క్షణాన్ని అనుభవించండి. నవ్వుతూ బతకండి. మీరు హాయిగా వుండండి. ఇతరులను హాయిగా వుంచండి. మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోకండి’ (BE TRUE TO YOU)
ఈ పెరేడ్ నిర్వాహకుల ప్రకటనలు ఈ తీరులో సాగాయి. సియాటిల్ లో నివసిస్తూ లెస్బియన్ ఉద్యమాన్ని సమర్థించే భారతీయుల బృందం కూడా ఈ ప్రదర్శనలో పాల్గొనడం విశేషం. మైక్రోసాఫ్ట్ వంటి అనేక కార్పొరేట్ సంస్థలు ఈ పెరేడ్ కు స్పాన్సర్ చేయడం ఇంకో విశేషం. రెండేళ్ల పాపాయిల దగ్గర నుంచి ఎనభయ్ ఏళ్ళ వృద్ధులవరకు పెరేడ్ లో పాల్గొన్నారు. అందరూ నవ్వుతూ తుళ్ళుతూ, ఆనందమే జీవిత పరమానందం అన్నట్టు పెరేడ్ ను రక్తి కట్టించారు.
వస్తూ వస్తూ చిపోటిలే (CHIPOTLE) అనే మెక్సికన్ రెస్టారెంటులో లంచ్, భావన ఇంటి నుంచి తెచ్చిన పులిహోర, పెరుగుతో అదే హోటల్లో నా భోజనం.
కొసమెరుపు:
ఎనభయ్ ఏళ్ళ వృద్ధురాలు ఒకావిడ నోటికి, ముక్కుకీ ఆక్సిజన్ పైపులు పెట్టుకుని ఆనందంగా చేతులు ఊపుతూ, తనని చూస్తున్న ప్రేక్షకుల మీదకు గుప్పెళ్ళతో చాక్ లెట్లు విసరడం చూసి ఇది కదా! జీవితం! ఇది కదా! ధైర్యం అనిపించింది.
ఇన్ని లక్షలమంది వచ్చినా, అక్కడక్కడా ఒకరిద్దరు మాత్రమే పోలీసులు కన్పించారు. పెరేడ్ ముగిసిన తర్వాత రోడ్ల మీద చెత్త తీసేయాల్సిన అవసరం రాలేదు. అంత శుభ్రంగా వున్నాయి.
ఇంటికి రాగానే గాంధీ మహాత్ముడి ఫోటోలో ఆయన సూక్తి కనిపించింది.
(Live as if you were to die tomorrow, Learn as if you were live forever)
కింది ఫోటోలు’
ప్రైడ్ పెరేడ్, సియాటిల్
29-06-2025
(ఇంకావుంది)

Comment
Share

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

వినాశ కాలే విపరీత బుద్ధి.

ఆడ మగ రెండు జెండర్స్ మాత్రమే దైవం సృష్టి. ట్రంప్ ఈ విషయం లో సరైన నిర్ణయం తీసుకున్నాడు.

జంతువులు ఇతర జీవ రాశులు ఈ విషయం లో ప్రకృతి సహజం గా జీవిస్తున్నాయి. వొకిజం ప్రభావం వల్ల కొందరు వక్రమార్గం పడుతున్నారు.