8, ఏప్రిల్ 2023, శనివారం

తెలుసుకోవాలని వుందా!

 ఎప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరినప్పుడు అప్పుడు ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్న నండూరి రామమోహన రావు గారు, ఆయన దగ్గరే సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నన్ను అడిగిన ప్రశ్న ఇది.

జర్నలిస్టుగా రాణించాలి అంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస వుండాలన్నది ఆయన ప్రశ్నలోని అంతరార్ధం. రాణించడం సంగతి దేవుడికి ఎరుక. కానీ ఏదైనా తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం నండూరి వారి ఉపదేశం కారణంగా అలవడింది. నా ఫేస్ బుక్ రాతల్లో సింహభాగం అలా ఇతరులు చెప్పగా విని రాసినవే.

ఫేస్ బుక్ మిత్రుడు Ramnath Kampamalla వృత్తి రీత్యా జర్నలిస్టు కాకపోయినా ప్రవృత్తి రీత్యా పాత్రికేయుడే. ఆయనలో నాకు నచ్చింది ఏమిటంటే  తెలుసుకోవాలనే ఆసక్తి. ఏది రాసినా క్షుణ్ణంగా తెలుసుకుని రాయాలనేది రాంనాద్ గారి పట్టుదల. అదే ఆయన్ని కొన్ని పర్యాయాలు మా ఇంటికి రప్పించింది. ఈ రాకపోకలు ఇప్పటివి కావు, మా ఆవిడ వున్న రోజుల నుంచి సాగుతున్నవే. ఆయన వస్తే నాకు ఒక సంతోషం. ఆడపిల్లలు లేరనే కొరత మా దంపతులకు వుంది.వుండేది అనాలేమో! ఆయన ఎప్పుడు వచ్చినా పిల్లల్ని వెంటబెట్టుకు తీసుకువస్తారు. ఇద్దరూ  చక్కని చుక్కలు. రీతూ ప్రియ, రియా దేవకి. ఎలిమెంటరీ స్కూలు అనుకుంటా. వచ్చినప్పుడల్లా మీ పేర్లు ఏమిటమ్మా అని అడుగుతా. ప్రతిసారీ ఈ ప్రశ్న ఏమిటి అంటూ నా మతిమరపును ప్రశ్నించకుండా పాపం  బుద్దిగా మైనేమ్ ఈజ్ రీతూ ప్రియ, మై నేమ్ ఈజ్ రియా దేవకి అని ప్రతిసారీ జవాబు చెబుతారు. వచ్చినప్పుడల్లా మా మనుమరాలి మోచేతి పొడుగంత క్యాడ్ బరీస్ చాక్లెట్లు తెస్తారు. వాళ్ళ నాన్నగారు నాతొ మాట్లాడుతూ వుంటే వాళ్ళిద్దరూ మొదటి ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ స్కూల్ మేట్ ఇంటికి వెళ్లివస్తారు. ఈలోగా దేశ కాలమాన పరిస్థితుల గురించి మా చర్చలు సాగుతాయి. ఆయనకు తెలుసుకోవాలనే కోరికా, ఎవరైనా ఏదైనా అడిగితే తెలిసింది చెప్పాలనే నా ఆతృత మా  సంభాషణకు ఉపకరిస్తాయి. ఆయన పుణ్యమా అని పాత సంగతులు నెమరు వేసుకోవడం వల్ల తగ్గిపోతున్న నాజ్ఞాపక శక్తి కాసింత మెరుగుపడే అవకాశం వుండడం వల్ల, రామనాద్ రాక నాకే బాగా ఉపయోగం అని చెప్పాలి.

అయితే ఆయన్ని చూసినప్పుడల్లా నాలో కలిగే అసూయ ఇంతా అంతా కాదు. ఇంత మంచి తండ్రిని నేను ఎందుకు కాలేక పోయాననే  బాధ నన్ను వేధిస్తూ వుంటుంది. నా పిల్లలు చిన్నప్పుడు ఏమి అడిగినా నా నుంచి సానుకూల స్పందన వుండేది కాదు. ఎంతసేపూ నా ఫ్రెండ్సూ, వాళ్ళతో కాలక్షేపాలు. ఒక సినిమాకు తీసుకు వెళ్ళడం, ఒక హోటల్ కు తీసుకువెళ్లి వాళ్ళు కోరిన టిఫిన్స్ పెట్టించడం నాకయితే గుర్తు లేదు. రాంనాద్ అలా కాదు. సెలవు దొరకడం తడవు పిల్లల్ని వెంటబెట్టుకుని శిల్పారామాలు, సినిమాలు, హోటళ్ళు ఒకటేమిటి వాళ్ళు తితగని ప్రదేశాలు లేవు. అవన్నీ చెబుతుంటే మా పిల్లలు పెరిగిన తీరు గుర్తుకువచ్చి  మనసులో ఎక్కడో  ముల్లు గుచ్చుకున్న ఫీలింగు.

నేనో బాడ్ ఫాదర్. సందేహం లేదు.  అందుకే రాంనాద్ ని చూస్తే అంత అసూయ.

కింది ఫోటో: ఈ సాయంత్రం వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు తీసిన ఫోటో. Courtesy: Ramnath Kampamalla



(08-04-2023)       

 

 

కామెంట్‌లు లేవు: