ఈ సంగతి చూచాయగా గంట క్రితమే తెలిసినా ఆ దుర్వార్తను ధ్రువపరచుకోవడానికి ఇంత సమయం పట్టింది. హైదరాబాదు ఆలిండియా రేడియో, దూరదర్సన్ వార్తా విభాగాల అధిపతిగా సుదీర్ఘ కాలం పనిచేసిన పిదప, పదవీవిరమణ అనంతరం వైజాగ్ లో సెటిల్ అయ్యారు. గత కొద్దికాలంగా అస్వస్థులుగా ఉంటూ, ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆలిండియా రేడియోలో ఆయనతో కలిసి అనేక సంవత్సరాల ప్రయాణం నాది. మంచి స్నేహితుడు. అవసరానికి ఆదుకోవడంలో ముందువెనకలు చూసే రకం కాదు.
1987 లో
నాకు రేడియో మాస్కోలో పనిచేసేందుకు మాస్కో వెళ్ళే అవకాశం వచ్చింది. కేంద్ర
ప్రభుత్వం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు రావాల్సి వుంది. ఈ నేపధ్యంలో, రామాయణంలో
పిడకల వేటలా, హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటర్ నడుపుతున్నందుకు నన్ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లో
నిర్బంధించడం, ఫలితంగా
శాసన సభ ఒక రోజు వాయిదా పడడం, జర్నలిస్టుల సామూహిక ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం సంబంధిత పోలీసు అధికారిని బదిలీ చేయడం, అప్పటి
ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ సంఘటనపై న్యాయ
విచారణకు ఆదేశించడం, మాజీ
హై కోర్టు న్యాయమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీకావడం చకచకా జరిగిపోయాయి. ఈ
పరిణామాలతో కలత చెందిన నాకు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా మాస్కో వెళ్ళిపోవాలని
మనసులో పడింది. ఢిల్లీ వెళ్లి ఆర్డర్ పట్టుకొద్దామని ఆకిరి రామకృష్ణారావు
చెప్పడంతో ఇద్దరం కలిసి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ చేరి ఏపీ భవన్ లో
దిగిపోయాము. బ్రేక్ ఫాస్ట్ కు ముందే ఆకిరి అప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్న
మంత్రి పి. శివశంకర్ గారికి ఫోన్ చేస్తే, ఆయన మమ్మల్ని వారి ఇంటికి రమ్మన్నారు. ఆటో
పట్టుకుని పొతే, ఇంటి బయట పటిష్టమైన బందోబస్తు. పలానా అని చెప్పగానే తలుపులు
తెరుచుకున్నాయి. వరండా పక్క గదిలో శివశంకర్ ఒక్కరే కూచుని పనిచేసుకుంటున్నారు. ఆకిరిని చూడగానే ఆయన
సాదరంగా లేచి ఆహ్వానించారు. నన్ను పరిచయం చేయబోతే ఆయన నవ్వి నాకు తెలియదా,
రేడియో శ్రీనివాస రావు అన్నారు. ఆకిరి
మీనమేషాలు లెక్కబెట్టకుండా సూటిగా
వచ్చిన విషయం చెప్పేశారు. మా డైరెక్టర్ జనరల్ కు ఫోన్ కలపమని ముందు పియ్యేకి
చెప్పి మళ్ళీ వద్దులే అని RAX
ఫోన్లో అంటే పియ్యేలతో సంబంధం లేకుండా నేరుగా మాట్లాడడానికి
వీలుండేది. ప్రధాని, కొందరు
ముఖ్యమైన మంత్రులకు, ఉన్నతాధికారులకు మాత్రమే ఈ సదుపాయం వుండేది) మాట్లాడి నా వివరాలు చెప్పారు.
మేము ధన్యవాదాలు చెప్పి
మా డీజీ ఆఫీసుకు వెళ్ళే సరికి అంతా హడావిడిగా కనిపించింది. మా డైరెక్టర్ (పి) గుంటూరు
రఘురాం గారు మమ్మల్ని చూడగానే, అమ్మయ్య వచ్చారా, హైదరాబాదు వాళ్ళు పంపిన మీ
దరకాస్తు కోసం వెతుకుతున్నాము, ముందు ఈ ఫారం పూర్తి చేసి సంతకం పెట్టి ఇవ్వండి, అరగంటలో ఆర్డరు ఇస్తామని డీజీ, మంత్రి గారికి మాట ఇచ్చారు’ అని తొందర పెట్టారు.
అంతే! ఆయన అన్నట్టు
అరగంటలోపలే నా ఆర్డరు కాగితం నా చేతిలో పెట్టారు. అలా వుంటుంది, ఆకిరి అడగకుండా చేసే సహాయం.
ఆకిరికి దైవభక్తి మెండు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి
అంటే అంతా ఇంతా కాదు. స్వామికి ప్రీతికరమైన మంగళవారంనాడే ఆకిరి గారు కన్ను మూయడం
విధి విచిత్రం.
ఆకిరి రామకృష్ణారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని
ఆ అంజనీపుత్రుడినే ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.
(18-04-2023)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి