4, ఏప్రిల్ 2023, మంగళవారం

మాయ తివాచి – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 02-04-2023, SUNDAY)

 

ఈనాటి లోకం యావత్తు కార్పొరేట్ ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తోంది. లోకం పోకడలూ, విలువలు అన్నీ కార్పొరేట్ ప్రపంచానికి అనుగుణంగానే మారిపోతున్నాయి.

ఎదగడానికెందుకురా తొందరా!’ అనే పాటలకు ఈనాటి కార్పొరేట్  ప్రపంచంలో స్తానం లేదు. ఎదుగుదలకు అవకాశం లేని విలువలకు కూడా అందులో చోటు లేదు. ఎంత త్వరగా ఎదగాలన్నదే కార్పొరేట్ సంస్థల ధ్యేయం. అదే బాట వాటిల్లో పనిచేసే బుద్ధి జీవులది కూడా. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా!

జీవితంలో చకచకా ఎదగడం ఎలా అనే అంశంపై అనేక భాషల్లో అనేక పుస్తకాలు వచ్చాయి. కొందరు కార్పొరేట్ గురువులు ఇదే అంశాన్ని తీసుకుని ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూడా.

వాళ్ళందరూ చెప్పే బోధనల సారాంశాన్ని క్రోడీకరిస్తే ఇలా వుంటుంది.

విజయం అంటే మాటలు కాదు. చేతలతో కూడిన వ్యవహారం. గెలుపే ధ్యేయంగా పనిచేసేవాడు తనని తాను పెంచుకుని,  భూతద్దంలో దాన్ని మరింత  పెద్దది చేసి చూపుకోగల సామర్ధ్యం కలిగివుండాలి. పనిచేసే సంస్థలోనే కాకుండా బయట కూడా అతగాడి గురించి నలుగురికీ తెలిసి ఉండేలా ప్రచారం చేసుకోగలగాలి. అయితే సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు పైకి తెలియకూడదు. ఆ ప్రచారం చాలా సుతారంగా సాగాలి.. ఇదంత సులభమేమీ కాదు. దీనికి ఎన్నో తెలివితేటలు కావాలి. పెద్ద పెద్ద కంపెనీలే తమ గురించి తాము ప్రచారం చేసుకుంటూ వుండడం మనం చూస్తున్నాం. అలాటప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళు కూడా ఈ స్వీయ ప్రచార కార్యక్రమానికి సిద్ధపడే వుండాలి. పువ్వుమీద వాలిన భ్రమరం, పువ్వుకు కూడా తెలియనంత సుకుమారంగా మధువును గ్రోలినట్టు ఈ ఆత్మస్తుతి, పరనింద తంతును అత్యంత నైపుణ్యంతో నిర్వర్తించగలగాలి.



నిన్ను గురించి నువ్వు ఎప్పడూ చెప్పుకోకు. నిజం చెప్పుకుంటే నమ్మేవారెవరూ వుండరు. నీ గురించి అబద్ధాలు చెప్పుకుంటే మాత్రం ఇంకా ఎంతో వుంది, కావాలనే తగ్గించి చెప్పుకుంటున్నారని అనుకుంటారు”.

అయితే ఇది పాతకాలం మాట. కార్పొరేట్ కాలంలో ఇది ఎంతమాత్రం చెల్లుబడి కాదు. ఎందుకంటే, ఇతరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే మంచితనం కలికానికి కూడా దొరికే కాలం కాదిది. ఫక్తు కలికాలం.  అందుకని ఈ రోజుల్లో  మనకి మనమే పీ.ఆర్.వో. లం అన్నమాట. మన గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. అవతల మనిషి నమ్మడం లేదని నమ్మకంగా తెలిసినా సరే, మన గురించి మనమే చెప్పుకుని తీరాల్సిన రోజులివి. ఎదుటివాడు నమ్మినా నమ్మకపోయినా, మన అదృష్టం బాగుంటే ఎదుటివాడి పక్కవాడయినా మన మాటలు నమ్మే ఛాన్స్ వుంటుంది.అది చాలు, ఓ మెట్టు ఎగబాకడానికి”


మిమ్మల్ని మీరే ఒక ఉత్పాదక వస్తువుగా ఊహించుకోండి. మిమ్మల్ని మీరే మార్కెట్ చేసుకోండి. మీరు పనిచేస్తున్న సంస్థలో గానీ, లేదా పనిచేయడానికి అవకాశంవున్న మరో సంస్థలో గానీ నిర్ణయాత్మక పాత్ర పోషించే అధికారులకు మీ గురించి తెలిసే విధంగా ప్రయత్నాలు చేయండి. ఈ విషయంలో వెనుకబడేవాళ్ళు వెనుకనే వుండిపోతారు. ఈ సూత్రం హమేషా గుర్తుంచుకున్నవాళ్ళే ముందుకు పోగలుగుతారు. ఆ ఉన్నతాధికారులు తమ సంస్థలో ఏదయినా ముఖ్యమయిన ఉద్యోగాన్ని భర్తీ చేసే సమయంలో తటాలున మీరు గుర్తుకొచ్చే రీతిలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. లేని పక్షంలో మీరు ఎంత ప్రతిభావంతులన్నది లెక్కలోకి రాదు. వున్న చోటనే వుండిపోతారు. ఈ రకమయిన తెలివితేటలున్నవాళ్ళు మాత్రం సులువుగా మిమ్మల్ని దాటి, నిచ్చెనలెక్కి కెరీర్ లో ఉన్నత స్తానాలకు ఎదిగిపోతారు.  ఇప్పుడున్న కార్పొరేట్ సూత్రాల ప్రకారం ఇవన్నీ నీతిబాహ్యమయిన చర్యలు కాదు. ఒకరకంగా చెప్పాలంటే వీటికి అందరి ఆమోదం వుంది. కాలమాన పరిస్తితులకు అనుగుణంగా మారడం ఈ నాటి నీతి. మారకపోతే, కెరీర్ లో కూడా మార్పు వుండదు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు.

మీ గురించి మీరే తెలియచేప్పుకోవడానికి కొన్ని పద్ధతులు వున్నాయి.


మీరు పనిచేసే సంస్థకు అవసరమయ్యే రెండు మూడు ప్రధానమయిన విషయాలను ముందు బాగా ఆకళింపు చేసుకోవాలి. వాటిని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. వీలుచిక్కిన ప్రతి సందర్భంలో ఏమాత్రం సంకోచించకుండా వాటిని గురించి మాట్లాడుతుండాలి. సందర్భం, అసందర్భం అని ఆలోచించ కూడదు. వాక్చాతుర్యంతో అందర్నీ కట్టిపడేయాలి. మనం చెబుతున్నదానిని అంతా నమ్ముతున్నారా లేదా అన్న సంశయం పెట్టుకోకూడదు. ధారాళంగా ఒక విషయం గురించి చెప్పగలిగినప్పుడు ఆ మాటల ప్రభావం శ్రోతలపై కొంతకాలం వుంటుంది. విడిపోయిన తరువాత కూడా కొంతమంది వాటిని గురించే మాట్లాడుకుంటారు. మన గురించి వారి అవగాహన కొంత సానుకూలంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మన పట్ల చులకనభావం వున్న వాళ్ళు కూడా పరోక్షంలో మన గురించి మాట్లాడేటప్పుడు వొళ్ళు దగ్గర పెట్టుకోవాల్సివుంటుంది.

అలాగే, సీనియర్ మేనేజ్ మెంట్ వ్యక్తులతో సంభాషించే అవకాశం వచ్చినప్పుడు మీరు ఈ చిట్కాను మరింత ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ఉన్నతాధికారులు తలపెట్టే ప్రాజెక్ట్ లలో స్వచ్చందంగా పాలు పంచుకోవాలి. మీ పనిలో ఎంత చిన్న విజయం సాధించినా మొహమాటపడకుండా ఆ విషయం మొత్తం ప్రపంచానికి చాటిచెప్పుకోవాలి. ఇవన్నీ మీ వ్యక్తిత్వ శోభను మరింత పెంచుతాయి. మీ చుట్టూవున్న వారు మీ పట్ల ఆరాధనాభావం పెంచుకోవడానికి తోడ్పడతాయి.

కెరీర్ గురించి అంతా మరచిపోయిన మాట ఒకటుంది. ‘జీవితంలో సరయిన సమయంలో సరయిన స్తానాన్నిఅందుకోగలగడాన్ని లోగడ కెరీర్ కు అర్ధం గా చెప్పుకునే వారు.


“ఈ నాడు దీని అర్ధం పూర్తిగా మారిపోయింది. ‘సరయిన స్థానం ఏదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. దాన్ని సంపాదించుకునే పద్ధతులను స్వయంగా నిర్ణయించుకోవాలి. అందుకు అవసరమయ్యే అవకాశాలను కూడా సొంతంగా సృష్టించుకోవాలి. అంతే కానీ సరైన తరుణం అంటూ వృధాగా ఎదురు చూస్తూ ఉన్న విలువైన సమయాన్ని వృధా చేసుకోరాదు.

“ఇప్పటికే మీరు ఇవన్నీ చేసివుంటే, మీరు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో వున్నట్టే లెక్క.

“మాయ తివాచీ మీ చేతికి దొరికినట్టే. దాని మీద కూర్చోవడమే తరువాయి, అదే మిమ్మల్ని మీరు కోరుకున్న శిఖరాలకు చేరుస్తుంది.”

త్వరత్వరగా మెట్లెక్కి ఉన్నత స్థానానికి చేరుకోవాలని తాపత్రయ పడే వారికోసం కార్పొరేట్ గురువులు  ప్రవచించిన ఈ చిట్కాలను ఇప్పుడు రాజకీయ రంగంలోని వారు కూడా ఆశ్రయిస్తున్నారు. తమని గురించి తామే చెప్పుకునే స్వోత్కర్ష,  ప్రస్తుతం వారి ప్రచార అస్త్రాలలో చేరిపోయింది.

చట్టబద్ధం కాని హెచ్చరిక: ఈ రకం కార్పొరేట్ గురువులు చెప్పే చిట్కాలన్నీ  నూటికి నూరుపాళ్లు ఫలితాలు ఇస్తాయని నూటికి నూరు శాతం గేరంటీ లేదు.




(02-04-2023)

 

కామెంట్‌లు లేవు: