30, జనవరి 2023, సోమవారం

మీడియాకు దూరంగా .... భండారు శ్రీనివాసరావు

“నేను పత్రికలు, చదవను, టీవీ చర్చలు చూడను” అని ఓ మిత్రుడు వాట్స్ అప్ సందేశం పంపాడు. నిజానికి ఈ మాటను ఒకప్పుడు మన దేశానికి ప్రధాన మంత్రిగా స్వల్పకాలం పనిచేసిన చరణ్ సింగ్ ఎప్పుడో చెప్పారు. కాకపొతే అప్పటికి ఈ టీవీలు లేవు. అంచేత ఆయన ఇలా అన్నారు.
“నేను పేపర్లు చదవను, రేడియో వినను. అదే నా ఆరోగ్య రహస్యం”
సరే అదలా వుంచి మా వాట్సప్ మిత్రుడి గురించి చెప్పుకుందాం.
టీవీలు, చూడకపోవడానికి, పత్రికలు చదవక పోవడానికి ఆయన చెప్పిన కారణం విచిత్రంగా వుంది. తనకు వచ్చిన ఓ మెసేజ్ తననీ నిర్ణయానికి ప్రొద్బలపరచిందని చెప్పాడు. నిజానికి ఈ సందేశం ఇప్పటికే చాలా సార్లు చాలా మందికి చేరిపోయింది కూడా.
అదేమిటంటే, Nathan Zohner అనే పెద్దమనిషి, తనకు తెలిసిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఇతరుల అజ్ఞానాన్ని అవహేళన చేయడానికి ప్రయోగిస్తుంటాడు. ‘డైహైడ్రోజన్ మోనాక్సైడ్ (diyhydrogen monoxide) అనేది చాలా ప్రమాదకరం అని, దాన్ని తక్షణం నిషేధించాలని ఆయన చెబుతుంటాడు. తీరా చూస్తే diyhydrogen monoxide అంటే మామూలు నీళ్ళు (water). అదొక రసాయనిక నామం మాత్రమే. శాస్త్రవేత్తలు కూడా చాలా అరుదుగా వాడే పదం ఇది. అలాంటి శాస్త్రీయ పదాల పట్ల అవగాహన లేనివాళ్లు నిజమే, అది ప్రమాదకరం కాబోలు అనుకుంటారు అమాయకంగా. ఇలా తమ ప్రజ్ఞతో సాధారణ విషయాలను కూడా మసిపూసి మారేడు కాయ చేసే వ్యవహారాలు ఈనాటి మీడియా చేస్తోందనేది ఆ మితృడి అభిప్రాయం. అందుకే ‘పేపర్లు చదవను, టీవీలు చూడను’ అనే నిర్ణయానికి ఆయన వచ్చాడు.
కానీ మీడియా మీద ఎంత చెడుగా అనుకున్నా, అది necessary evil అంటాడు మరో మిత్రుడు. ఆయన ఓ అయిదు రోజుల పాటు నగరానికి దూరంగా వున్న ఫాం హౌస్ లో గడిపివచ్చారు. ఆయనకి పొద్దున్నే పత్రిక చూడనిదే గడవదు. అక్కడ పత్రిక దొరకదు. ఫాం హౌస్ లో ఉన్న టీవీకి నెట్ సమస్య వచ్చి మౌన ముద్రదాల్చింది. మొదటి రోజు కష్టంగా గడిచింది. మర్నాడు మనసుకు ప్రశాంతంగా వున్నట్టు తోచింది. ఆ మర్నాడు అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయా అనిపించింది. అక్కడే అలానే వుండిపొతే బాగుండు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా అని కూడా అనిపించిందట. షుగర్, బీపీ అదుపులో వుందని పరీక్ష చేసుకుంటే తెలిసిందట.
అయితే ఇంటికి తిరిగి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, గుమ్మం ముందు పడి వున్న పత్రికలను అన్నింటినీ వరసపెట్టి తిరగేయడం.
మరొక మిత్రుడు మరీ విచిత్రమైన విషయం చెప్పాడు. కరోనా గురించిన సమాచారం అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న రోజులు. అది గాలి ద్వారా, ధూళి ద్వారా కూడా వ్యాపిస్తుందని అప్పుడు అనేక రకాలుగా చెప్పుకునేవారు. పేపర్ల ద్వారా కరోనా రాదు అని పత్రికల వాళ్ళే ప్రకటనలు ఇచ్చుకోవాల్సిన స్థాయికి ఈ పుకార్లు చేరుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పేపరు మొహం చూడలేదు. పొరబాటున కూడా పత్రికను చేతితో తాకలేదు. పుట్టడమే పత్రికాసమేతంగా పుట్టాడని ఆయన చుట్టపక్కాలు చెప్పుకొనేవారు. ప్రతిరోజూ రోజూ మూడు నాలుగు పత్రికలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచీ వుంది. అలాంటి మనిషి దాదాపు మూడేళ్లుగా పేపరు చేత్తో పట్టుకోలేదు, ముట్టుకోలేదు అంటే ఆశ్చర్యమే మరి.
ఈ విషయాలన్నీ తలచుకుంటూ వుంటే ఎప్పుడో జ్వాలా చెప్పిన ఓ విషయం జ్ఞాపకం వచ్చింది.
అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కుముద్ బెన్ జోషీ గవర్నర్. తెలుగు దేశం అధికారంలో వుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో. కాంగ్రెస్ గవర్నర్ కాబట్టి టీడీపీ అనుకూల పత్రికలు కొన్ని గవర్నరు ఏం చేసినా వాటిని తూర్పార పడుతూ కధనాలు రాసేవి. ఆవిడ వ్యవహార శైలి కూడా అందుకు దోహదం చేసి వుంటుంది. అది రాజ్ భవన్ కాదు, గాంధీ భవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం) అనే వారు. కాంగ్రెస్ నాయకులు చాలామందికి రాజ్ భవన్ ఓ అడ్డాగా మారింది అని గుసగుసలు వినిపించేవి.
ఉపరాష్ట్రపతి వెంకట్రామన్ గారు కాబోలు, ఒకసారి హైదరాబాదు వచ్చి రాజభవన్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. గవర్నర్ కుముద్ బెన్ జోషీ, గవర్నర్ కార్యదర్శి చంద్రమౌళిగారు వెళ్లి ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
మాటల సందర్భంలో వెంకట్రామన్ అడిగారు జోషీ గారిని, ‘ఏమిటి అలా వున్నారు ఒంట్లో బాగుండలేదా అని.
చంద్రమౌళిగారు గారు కల్పించుకుని అసలు విషయం చెప్పారు, ఆరోజు ఉదయమే ఒక పత్రిక గవర్నర్ కు వ్యతిరేకంగా ఒక కధనం ప్రచురించిందని.
అప్పుడు వెంకట్రామన్ గారు ఇచ్చిన సలహా ఇది.
‘ఓ మూడు రోజులు పత్రికలు చదవడం మానేసి చూడండి, మనసుకు ఎంతటి ప్రశాంతత లభిస్తుందో అర్ధం అవుతుంది”

29, జనవరి 2023, ఆదివారం

ఎవరీ గాంధి? – భండారు శ్రీనివాసరావు

 (జనవరి 30  మహాత్మాగాంధీ వర్ధంతి)

1969

మహాత్మాగాంధీ శతజయంతి సంవత్సరం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జర్మని నుంచి ఒక ప్రొఫెసర్ భారత దేశానికి వచ్చారు. ఆయన ఆ దేశంలోని అతి పురాతనమైన విశ్వవిద్యాలయం హైడల్ బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. పేరు డాక్టర్ మర్ల శర్మ. వారిది కాకినాడ. పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. గాంధి గారు పుట్టి వందేళ్ళు గడుస్తున్న సందర్భంలో భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల వాళ్ళు గాంధీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఒక పరిశోధనా పత్రం తయారు చేసే పని పెట్టుకుని వచ్చారు. ఆరోజుల్లో నేను విజయవాడ ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను. ఆయన పరిశోధనలో చేదోడువాదోడుగా వుండే అవకాశం నాకు లబించింది. అందులో భాగంగా నేను శర్మ గారితో కలిసి (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాలు తిరిగాను.

మహాత్మాగాంధి ఎవరు?’ అనేది శర్మగారు ముందే తయారు చేసుకొచ్చిన ప్రశ్నావళిలో మొట్టమొదటిది. వూరి పేరు గుర్తు లేదు కానీ పట్టుమని పాతిక గడప కూడా లేని ఓ మారుమూల గ్రామంలో ఒక నడికారు మనిషిని ఇదే ప్రశ్న అడిగితే, ఆమె జవాబుగా తన కుమారుడిని చూపించింది. అతడి పేరు గాంధి. మహాత్మాగాంధీ హత్యకు గురైన తర్వాత పుట్టిన తొలిచూలు బిడ్డడు అతడు. మహాత్ముడి మీది గౌరవంతో కొడుక్కి గాంధి అని పేరు పెట్టుకుంది. స్వాతంత్ర ప్రదాత అనే కృతజ్ఞతతో ఆ రోజుల్లో వేలాదిమంది తమ సంతానానికి గాంధీ పేరు పెట్టుకున్నారు. వారిలో ఎంతమంది తమ నడవడికతో ఆ పేరుకు న్యాయం చేకూర్చారో తెలుసుకోవాలంటే మరో విదేశీ యూనివర్సిటీ పూనుకోవాలి.

అది అప్పటి మాట.

దశాబ్దాలు గడిచిన తర్వాత మా పక్కింటి పిల్లవాడు తల్లిని అడుగుతుంటే విన్నాను, ‘మమ్మీ! గాంధి అంటే ఎవరు? ఈరోజు నేను స్కూల్లో మాట్లాడాలి. నా ఫ్రెండ్ గోపి ఏమో, రాహుల్ గాంధి గ్రాండ్ పా అంటున్నాడు, కరక్టేనా!’

ఈ పిల్లవాడి ప్రశ్న కంటే ఆ తల్లి ఇచ్చిన జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ‘నన్ను విసిగించకురా! వెళ్లి గూగుల్ లో వెతుక్కో’

ఈ నేపధ్యంలో మహాత్మా గాంధి ఆయన బోధనలు, ప్రబోధాలు నేటి తరానికి ఏ మేరకు శిరోధార్యాలు అనే పెద్ద ప్రశ్న నా ముందు నిలిచింది.

మహాత్మాగాంధీ తన జీవిత కాలంలో ఎన్నో చెప్పారు. ఎన్నో రాశారు. ఈ విషయంలో ఆయనది ఒక రికార్డు అనే చెప్పాలి. తన దృష్టికి వచ్చిన ప్రతి ఉత్తరానికీ, సామాన్యులు, అసామాన్యులు అనే బేధం లేకుండా స్వదస్తూరీతో ఓ కార్డు ముక్కపై జవాబు రాయడం ఆయనకు ఓ అలవాటు. ఆయన సూక్తులూ, బోధనలు వర్తమానానికి కూడా వర్తిస్తాయంటూ గాంధి జయంతి, వర్ధంతి రోజుల్లో నాయకులు చేసే షరామామూలు ప్రసంగాలతో జాతి జనుల చెవులు చిల్లులు పడివుంటాయి. ఆచరణకు వచ్చేసరికి హళ్లికి హళ్లి. సున్నకు సున్నా.

భారతీయ సమాజంలో వైరుధ్యాలు, అసమానతలు నానాటికి పెరిగిపోతున్నాయి. పెరగడమే కాదు, మరింత తీవ్రస్వరూపం ధరిస్తున్నాయి. సంపదలు పెరుగుతున్నా దేశంలో కోట్లాది సామాన్య ప్రజలకు వాటి పంపిణీ సక్రమంగా జరగడం లేదు. పేదలు నిరుపేదలు అవుతున్నారు. సంపన్నులు కోట్లకు పడగెత్తుతున్నారు. సామాన్యుల జీవన ప్రమాణాలు పాతాళంలోకి దిగజారుతుంటే, కలవారి జీవన ప్రమాణాలు అంతరిక్షాన్ని తాకుతున్నాయి. దేశంలో సంపదలు పెరిగాయి. సంపదలతో పాటు వైరుధ్యాలు, అసమానతలు పెరిగాయి. పెరిగిన సంపదలలో 73 శాతం భారత జనాభాలో కేవలం ఒక శాతం వున్న శ్రీమంతుల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు గాంధి పుట్టిన దేశమా ఇది? అనే అనుమానం కలక్కమానదు. బహుశా ఆయన మళ్ళీ పుట్టి ఈ దేశాన్ని చూస్తుంటే ఆయనకు కూడా తప్పకుండా ఇలాంటి సందేహమే పొటమరించి వుండేదేమో! ఎందుకంటే ఆయన స్వతంత్ర భారతం గ్రామీణ భారత పునాదులపై నిర్మించబడాలి అని బలంగా కోరుకున్నారు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని నమ్మిన నాయకుడాయన.

అలా అని దేశం పరిస్తితి మరీ ఘోరంగా వుందని అర్ధం కాదు. ఎన్నో అవలక్షణాల నడుమ కూడా పురోగతి చుక్కల్ని తాకుతున్నమాట సైతం అవాస్తవం కాదు. కాకపోతే ఆనాడు మహాత్మా గాంధి కన్న కలల ప్రకారం సాగుతోందా అంటే అనుమానమే.

మహాత్ముడి బోధనలలో సర్వకాలాలకు వర్తించేవి వున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సినవీ వున్నాయి. మహాత్ముడు రాట్నం వడికి తీసిన నూలు దుస్తులు ధరించమని ప్రజలకు చెప్పారు. ఆనాడు ఆయన ఉద్దేశ్యం ఖద్దరును ప్రోత్సహిస్తే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం వుండదు అన్నది కావచ్చు. మరి నేటి తరం ‘రాటం మాకిప్పుడు కాదు వాటం’ అంటోంది. విదేశీ వస్తు బహిష్కరణకు గాంధి నాడు పిలుపు ఇస్తే దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్వెత్తున స్పందించి తమ దుస్తులు మూటలు కట్టి తీసుకొచ్చి నడి వీధుల్లో రాశులుగా పోసి తగలబెట్టారు. మహాత్ముడి మాటకు జనాలు ఎలాంటి విలువ ఇచ్చారో తెలుసుకోవడానికి ఇలాంటి దృష్టాంతాలు కోకొల్లలు.

గమ్యం (లక్ష్యం) ఎంత గొప్పదిగా పరిశుద్ధంగా వుండాలని కోరుకుంటామో, ఆ లక్ష్య సాధనకు మనం అనుసరించే మార్గాలు కూడా అంతే పవిత్రంగా వుండాలి’ అని మహాత్ముడు చెప్పిన సూక్తిని, ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా ప్రపంచం పరిగణించిన అమెరికన్  నల్ల జాతి నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ తరచూ పేర్కొంటూ వుండేవారు. మహాత్ముడు ప్రబోధించిన అహింసావాదాన్ని ఆయన మనసా వాచా కర్మణా నమ్మి ఆయన తన ఉద్యమాన్ని నడిపారు. ఏ దేశంలో అయితే వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటాన్ని మహాత్ముడు ప్రారంభించారో, ఆ దేశమే తదనంతర కాలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి నివాళులు అర్పించిందంటే ఆయన బోధనలలోని ప్రభావం అంత గొప్పదని అవగతమవుతుంది.

నిజానికి మహాత్ముడి బోధనల అవసరం ఆనాటి రోజులకంటే ఈనాడే ఎక్కువగా వుంది. కానీ వాటిని విదేశాల్లో వారు పాటిస్తూ, గౌరవిస్తుంటే, మనం మాత్రం జయంతులు, వర్ధంతుల సందర్భాల్లో ఇచ్చే సందేశాలకు పరిమితం చేసి సంతోషపడుతున్నాం. మోహన్ దాస్ కరం చంద్ గాంధి అనే మహానీయుడు నడయాడిన నేలమీదనే మనమూ నడుస్తున్నాం అనే స్పృహను కోల్పోతున్నాం. పైగా ఆయనకు మహాత్ముడు అనే బిరుదు ఎవరిచ్చారు అనే అర్ధరహితమైన చర్చలతో కాలక్షేపం చేస్తున్నాం.

ఇది తగునా!’ అనే ప్రస్తావన మనకు రాదు. ఎందుకంటే మహాత్మా గాంధి అంటే ఎవరు అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే గూగుల్ వెతుక్కోవాల్సిన దుస్తితిలో వున్నాం. ఇక ముందు కూడా వుంటాం. కారణం గాంధీతో కానీ, ఆయన సూక్తులతో కానీ నేటి యువతరానికి అవసరం లేదు. పాత తరం పట్టించుకునే పరిస్తితిలో లేదు.



(28-01-2023)

 

27, జనవరి 2023, శుక్రవారం

యాత్రకు వేళాయెరా ! – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA today, 27-01-2023, THURSDAY)

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి  కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ పాదయాత్రల్లో సరికొత్త రికార్డు స్థాపనకు నడుం బిగించారు. నలభయ్ ఏళ్ళ పిన్న వయసులో  నాలుగు వందల రోజుల్లో నాలుగువేల కిలోమీటర్ల దూరం యువగళం పేరుతో సాగే  ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈరోజున మొదలయింది.

2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ‘ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. అప్పటికి దూతదర్సన్ విలేకరిగా వున్న కారణం కావచ్చు, కొంత దూరం వై.ఎస్.ఆర్. తో కలిసి నడిచే అవకాశం, రెండు మూడు చోట్ల ఆయనతో ముచ్చటించే సావకాశం నాకు లభించాయి. చంద్రబాబువస్తున్నా ..మీకోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340 కిలోమీటర్లు సాగి విశాఖ పట్నంలో ముగిసింది. పాదయాత్రకు గుర్తుగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు చంద్రబాబుకు వెండి పాదరక్షల జతను బహుకరించారు.

వై.ఎస్. జగన్ మోహనరెడ్డి తన ప్రజాసంకల్ప యాత్రను 2017నవంబరు ఆరో తేదీన వై.ఎస్.ఆర్. కడప జిల్లాలోని స్వగ్రామం ఇడుపులపాయలో మొదలుపెట్టి, 13 జిల్లాలగుండా 341 రోజులపాటు 3648 కిలోమీటర్లు నడిచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించారు.

తెలుగు రాష్ట్రాలలోనే కాదు, యావత్ దేశంలో సాగిన రాజకీయ పాదయాత్రల్లో అప్పటికి  ఇదొక రికార్డు. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాద యాత్రలు చేసిన దరిమిలా జరిగిన ఎన్నికల్లో విజయలక్ష్మి ఆయా పార్టీలని వరించడంతో వారిరువురు ముఖ్యమంత్రులు కాగలిగారు. ఆ విధంగా పాదయాత్రాఫలం వారికి సిద్ధించింది. దానితో ఎన్నికల్లో విజయానికి తోడ్పడే అనేక ప్రధాన అంశాలలో పాదయాత్రలు కూడా చేరిపోయాయి. అంతేకాదు, పాదయాత్ర చేసిన వారు ముఖ్యమంత్రి అవుతారనే ఓ గుడ్డి నమ్మకం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుంది. అదే కోవలో జగన్ మోహన రెడ్డి  కూడా తన  పాదయాత్ర దరిమిలా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కావడంతో  ఈ నమ్మకం మరింత బలపడింది.

సాధారణంగా రాజకీయ నాయకులు పాదయాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా దాని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా దాగే వుంటుంది. అయితే,  చేసేది రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది.

వస్తున్నా మీకోసం పేరుతొ చంద్రబాబు నాయుడు సాగించిన పాదయాత్రకు  నాలుగు దశాబ్దాలకు పూర్వమే ఆయన తొలి పాదయాత్ర చేశారు. దానిని గురించి తెలిసిన వారు తక్కువ. నిజానికి అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే పేరున్న రాజకీయ నాయకుడు ఒకడున్నాడని తెలిసిన వారే తక్కువ.

అప్పట్లో స్థానికులకు సయితం అంతగా పరిచయం లేని చంద్రబాబు నాయుడు, కాణిపాకం నుంచి కాలి నడక ప్రారంభించారు. గడప గడప తొక్కారు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించారు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించారు. ప్రతి వూరిలో ఆగి ఆ ఊరి సమస్యలను అడిగి  తెలుసుకున్నారు.

రచ్చబండల మీద,  ఇళ్ళ అరుగుల మీద సేద తీరారు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల వద్దే అడ్డంకులు ఎదురయినా మడమ తిప్పలేదు. ఓ జత దుస్తులు, కాలికి చెప్పులు, తోడుగా కొందరు యువకులు. అంతే! ఇంతకు మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియతిరిగారు. రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని ఎన్నికల్లో గెలిచారు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు.

అప్పటికింకా నిండా మూడుపదులు నిండని ఆ యువకుడే, మళ్ళీ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆరుపదులు పైబడిన వయస్సులో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పునర్వైభవం కోసం తిరిగి కాలినడకనే విజయానికి మార్గంగా ఎంచుకున్నారు.. ‘వస్తున్నా మీకోసం’ అంటూ సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నారు.

అంతకుముందు వై ఎస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్ర,  దానితో సాధించిన విజయం రాజకీయ నాయకులను పాదయాత్రలకు పురికొల్పేలా చేసాయి. అంతకు ముందు రెండుమార్లు ప్రయత్నించి అందుకోలేని ఎన్నికల విజయాన్ని, ఆ పాదయాత్ర దరిమిలా ఆయన తన ఖాతాలో వేసుకోవడంతో పాదయాత్రలకు కొంత సెంటిమెంటు రంగు కూడా అంటుకుంది.

ఇక జగన్ మోహన రెడ్డి సాగించిన పాదయాత్ర ఏవిధంగా చూసినా ఒక రికార్డే. సుమారు రెండుకోట్ల మంది ప్రజలను ఆయన ముఖాముఖి కలుసుకోగలిగారు అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన సాధించినది చిన్న విషయం ఏమీకాదు. నడిచిన దూరం, వెంట నడిచిన జనం, మాట్లాడిన సమావేశాలు, ప్రసంగించిన బహిరంగ సభలు, హాజరయిన ప్రజలు ఇలా చెప్పుకుంటూ పొతే అన్నీ రికార్డులే. ఈ యాత్ర సందర్భంగా వై.ఎస్. జగన్, ఆకాశమే హద్దుగా  కురిపించిన వాగ్దానాలు, హామీల సంఖ్య కూడా ఒక రికార్డే అని చెప్పుకోవాలి.

ఇక్కడ మరో విషయం ప్రస్తావించడం అప్రస్తుతం కాదనుకుంటాను. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు, జగన్ మోహన రెడ్డి పిలిపించుకుని మాట్లాడిన కొద్దిమంది జర్నలిస్టుల్లో నేను కూడా వున్నాను. జనాలకు ఇచ్చే హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసే విషయంలో ఫాలో అప్ మెషినరీ వంటి వ్యవస్థను పార్టీ పరంగా ముందుగానే ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించాను.

 

ఈ పాదయాత్రల వల్ల రాజకీయ పార్టీలకు వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమిటనే విషయం పక్కనపెడితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి అనేది రాజకీయనాయకులు గుర్తిస్తున్నారు అనుకోవాలి. ఊళ్లను చుట్టబెడుతూ సాగే ఇటువంటి సుదీర్ఘ పాదయాత్రల్లో, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తమ కళ్ళతో గమనించి నేరుగా అర్ధం చేసుకోవడానికీ, సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు కనుగొనడానికి చక్కటి అవకాశం రాజకీయ నాయకులకు దొరుకుతుంది.

తమ నడుమ వుండేవారికే పట్టం కట్టడానికి జనం క్యూలు కడుతున్నారు అనేది అపోహ కావచ్చు కానీ అందులో కొంత నిజం లేకపోలేదని, ఏసీ గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారని గత అనుభవాలు తెలుపుతున్నాయి.

ప్రజల ఇబ్బందులను, కడగండ్లను కళ్ళారా చూడగలిగే అవకాశం ఈ పాదయాత్రల వల్ల రాజకీయ నాయకులకు లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా పరిష్కరించగలిగితే ప్రజలకు కూడా వారి యాత్రాఫలసిద్ధి ప్రాప్తిస్తుంది.

ఇది జరిగింది కూడా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానంలో తనకు ఎదురయిన అనుభవాల ఫలితంగా రూపొందించినఆరోగ్య శ్రీ, 108, బడుగువర్గాల విద్యార్ధులు చెల్లించిన ఫీజు తిరిగి ఇచ్చే పధకం’ వంటివి రాష్ట్ర ప్రజానీకానికి దక్కాయి. చంద్రబాబు’ వస్తున్నా.. మీకోసం..’ యాత్ర వల్ల రైతులకు రుణ మాఫీ జరిగింది.

ఏదయితేనేం,  ఏ పేరుతొ అయితేనేం, నాయకులు ఏసీ గదులు వదిలిపెట్టి  కొద్దికాలం అయినా ప్రజలతో మమేకం అయ్యే వీలు ఈ యాత్రల వల్ల ఏర్పడింది. రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి.

ముందే చెప్పినట్టు ఈ రాజకీయ పాదయాత్రలు భవిష్యత్తులో కూడా ఇబ్బడిముబ్బడిగా సాగే అవకాశం వుంది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో సరిపుచ్చితే పర్వాలేదు కానీ ఇరువైపుల పారావారాలు శృతిమించి వ్యక్తిగత దూషణభూషణలకు దిగకుండా వుంటే అదే పదివేలు.

జగన్ మోహన రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఆకాశాన్ని దాటిపోయాయని, రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో వాటిని అమలుచేయడం మానవ మాత్రుడికి కూడా సాధ్యం కాదని ఆ రోజుల్లో అధికార పార్టీ విమర్శలు చేసింది. ‘వస్తున్నా మీకోసం..’ పాదయాత్ర సమయంలో’ చంద్రబాబు ఇస్తూ పోయిన వాగ్దానాలు గురించి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బాబు రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికీ  ఉదహరిస్తుంటారు. ‘వాకింగ్ ఫ్రెండ్’ (చంద్రబాబు) ఇస్తూ పోతున్న హామీలను అమలు చేయాలంటే, రాష్ట్ర బడ్జెట్ అటుంచి మొత్తం కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదని ఆనాడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తుంటారు.

రాజకీయ విమర్శలను కొంత అర్ధం చేసుకోవచ్చు . కొందరు వ్యక్తిగతంగానే కాకుండా చాలా చౌకబారుగా కూడా చేసే  వ్యాఖ్యల  తీరు బాధాకరం. చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఆయన ధరించిన బూట్లు గురించి, దారిపొడుగునా దుమ్ము రేగకుండా నీళ్ళు చల్లించే ఏర్పాట్ల గురించీ ఎద్దేవా చేస్తూ ఆయన ప్రత్యర్ధులు చేసిన వ్యాఖ్యలు బహుశా వారికి గుర్తుండి ఉండకపోవచ్చు.

రాజకీయ యాత్రలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయపరమైన హామీలు పార్టీలన్నింటికీ తప్పనిసరి రాజకీయ విన్యాసాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో, రాజకీయ నాయకులు ఒకింత సంయమనంగా మాట్లాడడం వారికే మంచిది. ఏమో ఎవరికెరుక? ఇలాంటి కువిమర్శలను తామే ఎదుర్కోవాల్సిన దుస్తితి భవిష్యత్తులో తమకే ఎదురు కావచ్చు.

దీనికి ఓ మంచి మార్గాన్ని కవి బ్రహ్మ తిక్కన మనకేనాడో బోధించాడు.

ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమమైన ధర్మంగా మహాభారతంలో విదుర నీతి పేరుతో ఆ మహాకవి చెప్పినదాన్ని పాటిస్తే చాలు. అదేంటంటారా!

‘‘ఒరులేయవి యొనరించిన, నరవర అప్రియంబు తన మనంబునకగు, తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్’’.

ఇతరులు ఏం చేస్తే మనకు ఇష్టం ఉండదో, దాన్ని మనం ఇతరులపట్ల చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమ ధర్మం అన్నది ఈ పద్య తాత్పర్యం.

ఇతరులకు నీతులు చెప్పే రాజకీయ నాయకులకు ఈ నీతిపాఠాలు తలకెక్కుతాయా!

అనుమానమే!




(27-01-2023)

25, జనవరి 2023, బుధవారం

ఈ ఏడాది బడ్జెట్ లో హల్వా – భండారు శ్రీనివాసరావు

ఢిల్లీ నార్త్ బ్లాక్ అంటే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కొలువై వుండే కార్యాలయం. బడ్జెట్ తయారీ కార్యక్రమం అంతా అక్కడే జరుగుతుంది. దాదాపు ఓ వారం, పది రోజులపాటు సంబంధిత సిబ్బంది ఆల్ మకాం, అంటే తిండీ తిప్పలు, పడకా, విశ్రాంతి పూర్తిగా అక్కడే. బడ్జెట్ పూర్తి అయ్యేదాకా ఇళ్లకు పోకుండా రాత్రింబవళ్ళు ఆ కార్యాలయంలోనే వుండిపోతారు. చివరి రోజున అంటే బహుశా రేపు గురువారం కావచ్చు అంటున్నారు, మొత్తం సిబ్బందికీ కేంద్ర ఆర్థికమంత్రి స్వయంగా అక్కడే హల్వా చేసి అందరికీ పంచుతారు. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న వేడుక ఇది. స్వయంగా అంటే మంత్రిగారే హల్వా చేస్తారని కాదు. కడాయిలో తయారైన హల్వాను పెద్ద గరిటతో అలా అలా పైపైన ఒకసారి కలుపుతారని అర్ధం చేసుకోవాలి. కోవిడ్ కారణంగా నిరుడు, అంతకు ముందు ఏడాది హల్వా తయారీకి స్వస్తి చెప్పారు. మిఠాయిలతోనే సరిపుచ్చారు.
బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక అనేది సార్వత్రికంగా ఉన్న అభిప్రాయం. అసలీ పదానికి అర్ధం తోలు సంచీ. బడ్జెట్ ప్రతిని ఓతోలు సంచీ (లెదర్ బ్యాగ్) లో పెట్టుకుని ఆర్ధిక మంత్రి సభకు వస్తారు. నాకు తెలిసి నార్త్ బ్లాకులోనే ఒక ముద్రణాయంత్రం వుండేది. ఇప్పుడు వుందో లేదో తెలియదు. డిజిటల్ శకం మొదలయిన తర్వాత లెదర్ బ్యాగు సైజు, స్వరూపం పూర్తిగా మారిపోయాయి.
ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ సమర్పణ. చూడాలి బడ్జెట్ లో హల్వా వడ్డిస్తారా! అంతకు మించింది ఏమైనా జనాలకు అందిస్తారా!




PHOTO COURTESY : ANI
25-1-2023