21, ఆగస్టు 2020, శుక్రవారం

ఏడాది క్రితం ఉష ఓదార్పు మాటలు

ఉష నాకు రేడియోలో సహోద్యోగి మాత్రమే కాదు. కుటుంబ స్నేహితురాలు. గురుతుల్యులైన తురగా జానకీరాణిగారి ముద్దులపట్టి. పిన్న వయసులోనే పెద్ద పెద్ద కష్టాలను భరిస్తున్న మనిషి. పిన్నతనంలోనే తండ్రి కృష్ణమోహనరావుగారు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అండగా వుంటాడు అనుకున్న జీవనసహచరుడు అర్ధాంతరంగా జీవితం నుంచి అదృశ్యమైపోయాడు. తండ్రి పోయినప్పటినుంచి కనురెప్పలా కనిపెట్టుకుని చూస్తూ వచ్చిన కన్నతల్లి కనుమరుగైంది.

పుట్టెడు కష్టాలను పంటిబిగువన సహిస్తూ పెద్ద ఆరిందాలా నన్ను ఓదారుస్తోంది చూడండి.
ఉషా! నీ పెద్ద మనసుకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు మాటలు రావడం లేదమ్మా!

"నేను మహా దుఃఖంలో ఉన్న రోజుల్లో నన్ను చూసి చాలా మంది ఆందోళన పడేవారు. నీ కళ్ళు ఖాళీగా ఉన్నాయి...నాకు భయమేస్తోంది నిన్ను చూస్తుంటే అనేవాడు ఒక ఫ్రెండ్. మనసులో వ్యాకులత physicalగా కనిపిస్తుంది అని ఎవరు చెప్పినా నాకు అప్పుడు తెలీలేదు.
.
"నిన్న అలాంటి ఒక మహా దుఃఖాన్ని మళ్ళీ చూశా. అది కూడా ఎప్పుడూ చిరునవ్వు చెదరకుండా, చీకు చింతా లేకుండా...కాదు, కనిపించకుండా ... ఉండే ఒక మనిషిలో.
.
"భండారు నిర్మలగారు మొన్న వెళ్లిపోయారు. వెళ్ళిపోతూ భండారు శ్రీనివాసరావు గారిని చాలా ఒంటరిని చేశారు. అసలు ఆవిడ వెళ్లిపోవాల్సిన వయసు కాదు. టైం కాదు. పధ్ధతి కాదు. కానీ, లాజిక్ అనేది లేని విషయం మృత్యువు ఒకటే అని స్వానుభవం మీద తెలుసు కనుక, బాధపడ్డా 'ఇంతే కదా జీవితం' అనుకున్నా.
.
"శ్రీనివాసరావుగారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన మా అమ్మకి కొలీగ్. మా నాన్నగారి పేరు మీద ఆయనకీ అవార్డు ఇచ్చే గౌరవం మాకు దక్కింది. నేను కూడా ఆయనతో కలిసి పని చేశాను.
.
"ఆయన అంటే నాకు గౌరవం అన్నది మామూలుగా చూపించినా, నాకు ఎంత admiration అన్న విషయం ఎప్పుడూ చెప్పలేదు. కులాసాగా పని చేసుకోవడం, efficientగా టైం manage చేసుకోవడం, ఇంకోళ్ళ నెత్తిన pressure పెట్టకుండా సరదాగా కబుర్లు చెప్తూ పని పూర్తి చేయడం...ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నవే. రేడియో ఒక్కటే breaking news ఉన్న రోజుల్లో ఆయన చేసిన రిపోర్టింగ్ ఈరోజు జర్నలిజం schoolsలో ఒక కోర్సు కావాలి. సరసంగా మాట్లాడడం, సరళంగా విషయం చక్కబెట్టడం, ఆత్మీయంగా అందరితో కలిసిపోతూనే తనదైన unique వ్యక్తిత్వం...శ్రీనివాసరావు గారు నిజంగా కోటిమందిలో ఒకరు.
.
"Smart appearance, హాయిగా నిదానంగా నడుస్తూ, కళగా కనిపించే ఆయన నిన్న కలిసినప్పుడు వివర్ణంగా ఉన్నారు. భుజాలు వొంగిపొయాయి. ఏంటో దిక్కుతోచని చిన్నపిల్లాడిలా, అదే సమయంలో సడన్ గా తన వయసు గుర్తొచ్చినట్లుగా ఉన్నారు.
.
"నిర్మలకి వేరే పుట్టిల్లు లేదు, నేనే అన్నీ... అన్నారు ఆయన. దాదాపు 50 ఏళ్ళ సాంగత్యం. అసలు వాళ్లిద్దరూ వేరే ఇద్దరు వ్యక్తులంటే ఎలా నమ్మడం? ఆయనకి ఆవిడ మీద ఉన్న ప్రేమ, వారి స్నేహం, సంసారంలో సరిగమలు... జగద్విదితమే. ఒక రకంగా చెప్పాలంటే, అలా ప్రేమ పొందుతూ, ఒంటరితనం తెలీకుండా ఆవిడ వెళ్లిపోవడం ఆవిడకి అదృష్టమే. నాకు తెలుసు.
.
"ఇవాళ నేను నీ స్థానంలో ఉన్నా, ఉషా! అన్నారు ఆయన. స్వరం గద్గదం అయిపోయి, కళ్ళల్లో తడితో మాట్లాడుతున్న ఆయనని చూస్తే సీతావియోగ దుఃఖం అనుభవిస్తున్న శ్రీరాముడు గుర్తొచ్చాడు.
.
"శ్రీనివాసరావుగారు నాకు అన్ని విధాలా గురుతుల్యులు. మా అమ్మా నాన్న మీద అభిమానంతో పాటు నేనంటే ఎంతో ఆత్మీయంగా నాకు ఎన్నో సార్లు life advice ఇచ్చారు.
.
"కానీ, జీవితంలో మన సర్వస్వం అనుకున్న వ్యక్తి హఠాత్తుగా విడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అన్న ఎరుకలో నేను సీనియర్ ని కనుక, ఆయనని చూస్తూ ఎంతో దుఃఖపడుతూనే, 'అయ్యో...ఇంకా జీవితం ముందుంది.. ఈయన ఎలా ఉంటారు ఆవిడ లేకుండా?' అని కళవెళపడ్డాను.

"జీవితమే నేర్పిస్తుందిలే ఆ పాఠం కూడా. రోజుకో చాప్టర్ చొప్పున"

నిజమే ఉషా! జీవితం నేర్పుతోంది. నెమ్మది నెమ్మదిగా ఒక్కో పాఠం నేర్చుకుంటూనే వున్నాను.
.

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“ఋణానుబంధ రూపేణా పశు పత్ని సుతాలయా
ఋుణక్షయే క్షయయాంతి తత్ర పరివేదనా”

అన్నారు పెద్దలు, మీకు తెలియనిదేముంది.