21, ఆగస్టు 2020, శుక్రవారం

ఫణి అంటేనే పని

 

మా మేనకోడలు ఫణికి (చిత్రకారుడు రాంపా భార్య) మా ఆవిడకి జన్మజన్మల సంబంధం ఏమో తెలవదు. ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు  ఒక్కటే. మొన్న శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం నాడు మా కోడలు నోముకు ముత్తయిదువుగా ఎంతో దూరం నుంచి వచ్చింది. మా ఆవిడ వుండగా ప్రతి శ్రావణ శుక్రవారానికి ఫణి ముత్తయిదువుగా వచ్చేది. అత్తయ్య పెట్టిన ఇరవై ఎనిమిది చీరెలు ఇప్పటికీ  తన వద్ద భద్రంగా వున్నాయని చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

మా లాగే వాళ్ళదీ ప్రేమ వివాహం. ప్రేమ పెళ్ళిళ్ళలో ఏమి వున్నా ఏమి లేకపోయినా కష్టాలు కామన్. కష్టాలు అంటే ఆర్ధిక ఇబ్బందులు కాదు,  రెండు వైపులా వారికీ సర్దిచెప్పడం, కొత్త కాపురాన్ని సొంతంగా నిభాయించుకు రావడం, ఈ సంబడం ఎన్నాళ్ళో చూద్దాం అనే వారి చూపుల్ని తట్టుకోవడం ఒకటా రెండా! అదొక భారతం.

అన్నీ తట్టుకున్నారు. ఇందులో ప్రధాన భూమిక నా మేనకోడలిదే. మాస్కో వెడుతూ మా ఆవిడ వదిలిన 'అమ్మవొడి'ని ఫణి తన భుజాల మీదకు ఎత్తుకుంది.

అదృష్టం పిల్లలు ఎదిగి వచ్చారు. కొడుకు, కుమార్తె బాగా చదువుకున్నారు. మంచి కోడలు, అంతకంటే మంచి అల్లుడు లభించారు. హాయిగా అందరూ సెటిల్ అయ్యారు.

ఇప్పుడే బుంటీ (జర్నలిస్ట్  ప్రేమ, మరో మేనకోడలు విజయలక్ష్మి కుమార్తె) పోస్ట్ చూశాను. కరోనా కాలక్షేపానికి తనకు చేతయిన కాలక్షేపాన్ని ఫణి ఎంచుకుంది అని. కారా స్నాక్స్ పిండి వంటలు చేయడం. ఇందులో ఫణిని కొట్టేవాళ్ళు అరుదు. అసలు మా మేనకోడళ్ళు అందరికీ వంటలు రుచికరంగా చేయడం వెన్నతో పెట్టిన విద్య.

పనిలో పనిగా ఫణి విదేశాలకు కూడా తన వంటల అంటే పిండి వంటల రుచి చూపించాలని అనుకుంటున్నట్టు బుంటీ  

పోస్టు వల్ల తెలిసింది.

ఇంకేం! శుభం భూయాత్!    

కామెంట్‌లు లేవు: