1, ఆగస్టు 2020, శనివారం

స్వరయవ్వన రహస్యం

ఒకానొక కాలంలో రేడియో చిన్నక్కగా తన సుస్వరంతో లక్షలాదిమంది శ్రోతలను అలరించిన రతన్ ప్రసాద్ కొద్దిసేపటి క్రితం ఫోను చేశారు. జర్నలిస్ట్ డైరీ ఫేం సతీష్ బాబు రూపొందించిన వీడియో చూసారట. అందులో తన గురించిన ప్రస్తావన వుందని మురిసిపోతూ చెప్పారు. ప్రస్తుతం ఆవిడ ఢిల్లీలో మనుమల దగ్గర వుంటున్నారు. సతీష్ కు థాంక్స్ చెప్పు బాబూ అని కోరారు.  

“మేమెవ్వరం రేడియోలో ఉద్యోగం అనుకుని చేయలేదు. కళాకారులకి కావాల్సింది కాసింత ప్రశంశ. అది మంచి టానిక్కులా పనిచేస్తుంది” అని అంటూ కొన్నేళ్ళ క్రితం సంఘటనను గుర్తుచేసుకున్నారు.

రేడియో న్యూస్ రీడర్ డి. వెంకట్రామయ్య గారు ఆకాశవాణిలో చిరకాలం పనిచేసిన వారితో ఒక ఇష్టాగోష్టి సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికి కొద్ది రోజుల క్రితం రతన్ ప్రసాద్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ‘నువ్వు నమ్మవు కానీ బాబూ నేను చావు ముఖంలో అడుగు పెట్టి మళ్ళీ బయటకు వచ్చాను. మా పిల్లలు ఆ మీటింగుకు ఇప్పుడు వెళ్లకపొతే ఏం’ అంటూ అభ్యంతర పెట్టారు. నా పోరు పడలేక తీసుకువచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన నన్ను చూస్తూనే నువ్వొక మాట అన్నావు, ‘ఏమండీ రతన్ ప్రసాద్ గారూ, మీ స్వర యవ్వన రహస్యం ఏమిటో చెబుదురూ’ అని. నిజం చెప్పొద్దూ! నేను ఎనభయ్ ఎనిమిదేళ్ళకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు నువ్వన్న ఆ ఒక్క మాటే కారణం. అది మంచి టానిక్కులా పనిచేసింది. అంతకుముందు అనారోగ్యంతో చాలా అవస్థలు పడ్డాను. కానీ ఆరోజు నుంచి నేను మళ్ళీ మామూలు మనిషిని కాగలిగాను. మా పిల్లలతో ఎప్పుడూ అంటుంటాను, శ్రీనివాసరావు ఆ ఒక్క మాటతో నాకు పునర్జన్మ ఇచ్చాడు అని. రేపోమాపో ఎనభయ్ తొమ్మిది వస్తుంది. ఈ కరోనా కాలం ముగిసి మళ్ళీ హైదరాబాదు ఎప్పుడు వస్తానో తెలవదు. ఈరోజు నీ పోస్టు చూసి ఫోన్ చేయాలనిపించింది. సతీష్ కు కూడా చెప్పు. ఈ వయస్సులోవున్న మాలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని ప్రోగ్రాం లో చేర్చినందుకు. వుంటాను నాయనా! ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆవిడను అడిగానని చెప్పు అనడానికి  నాకు నోట మాట రావడం లేదు. పాపం చిన్న వయసులోనే పోయింది. ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నవ్వుతూ, ఆప్యాయంగా మాట్లాడేది.  ప్రసాద్ గారు పోయిన తర్వాత నాకూ ఒంటరితనంలో బాధ ఏమిటో తెలుస్తోంది”

ఆవిడ అలా మాట్లాడుతూనే వున్నారు. నా ఆలోచనలో నేను వున్నాను.

ఒక మంచి మాటలో ఇంతటి శక్తి ఉందా!  

Image may contain: Ramarao Bondada and Bhandaru Srinivas Rao, people standing and indoor 

(01-08-2020)      

 


కామెంట్‌లు లేవు: