28, జూన్ 2020, ఆదివారం

అచ్చమైన భారత రత్నం




(జూన్ 28 న  పీవీ శతజయంతి ఉత్సవాలు మొదలవుతున్న సందర్భంగా సాక్షి దినపత్రిక ప్రచురించిన నా వ్యాసం)

ఈరోజు అంటే జూన్ ఇరవై ఎనిమిది మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు జయంతి. ఇప్పటినుంచి  మొదలు పెట్టి ఒక ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ముదావహం. 
అత్యంత అదృష్టవంతుడు, బహు దురదృష్టవంతుడు అయిన  రాజకీయనాయకుడు ఎవరయ్యా అంటే చప్పున తట్టే పేరు  పీవీ నరసింహారావు.
ఆయన  ప్రధానిగా వున్నంతకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు.
పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన
సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యాబలం  బొటాబొటిగా
వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై వుంచిన
‘అపర చాణక్యుడ’ని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయి, పదవి
నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్లతోనే  ఆయన్ని  తెగడడం
ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం
కాగానే వాళ్ళూ దూరం జరిగారు. పోనీ  ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన
వ్యక్తి సీతారాం కేసరికి పీవీని  మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ
‘పదవే’ సర్వస్వమయిన  కాంగ్రెస్ వారికి  ‘కేసరి భజనే’ సర్వస్వమయిపోయింది.
మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి మొదలుపెట్టిన కాంగ్రెస్  పార్టీ
‘పత్తిత్తులకు’ ఆయన దేశానికి చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు.

అయిదేళ్ళు ‘తెలుగువాడి’ లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన
‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’
నిలబడినప్పుడు,  ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ
తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’  మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాములో
జరిగిన తప్పులనో, పొరబాట్లనో  సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు.
రాజకీయాల్లో ‘కృతజ్ఞత’, ‘విధేయత’  అనే పదాలకి  తావు లేకుండా పోయిందన్న
విషయాన్ని విశదం చేయడానికే ఈ వివరణ. గాంధీ, నెహ్రూల కుటుంబానికి చెందని ఒక కాంగ్రెస్ నాయకుడు  భారత ప్రధానిగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని తన తెలివితేటలతో, మేధస్సుతో పూర్తికాలం అయిదేళ్ళు నడపడమే కాదు, అప్పటికే ఆర్ధికంగా కునారిల్లుతున్న దేశాన్ని ఒడ్డున పడేసిన కృతజ్ఞత కూడా ఆయనకు తన సొంత పార్టీ నుంచి లభించలేదు. ఇదీ కాంగ్రెస్ పార్టీలో కృతజ్ఞతకు వున్న స్థానం. ఇదీ ఆ పార్టీలో విధేయతకు లభించే ప్రాధాన్యం. 
ఒక సాధారణ నాయకుడు చనిపోయినా అతడి పార్దివదేహాన్ని  పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు దర్శించి  కడపటి వీడ్కోలు ఇచ్చేందుకు వీలుగా పార్టీ ఆఫీసులో కొంత సేపు వుంచడం అనేది అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయం. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన పట్ల ఆ మాత్రం కనీస మర్యాద చూపాలన్న సోయికూడా  లేకుండాపోయింది.      


పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ప్రతి ఏటా  బేగంపేటలోని
ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు.
ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. ప్రధాని పదవి నుంచి
దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన
హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...'
అనే పద్యపాదం  జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు
అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో  అర్ధం అయ్యేది కాదు.
పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో పదిలంగా వుండిపోయింది.
పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని
హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ
దిగినప్పుడు కనబడే హడావిడి ఎలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన
చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ
మార్బలాలు, వందిమాగధులు,  ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు.
ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
మాజీ ప్రధానిగా పీవీ  రాజభవన్ లో వున్నప్పుడు, నేనూ , ఆకాశవాణిలో నా
సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం
వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత,  రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా
తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు
మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము.  ‘పీవీ
గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భధ్రతాదికారిని  అడిగాము.
అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూనే
లోపలకు అడుగు పెట్టాము.

పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని
టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న
ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను
మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ, 'మీ అన్నయ్య
పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది.
ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు,
రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు
ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు  ముఖ్యమంత్రిగా
ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం
ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ
పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు
‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది,  కొన్నేళ్ళ
క్రితంవరకు దేశాన్ని వొంటిచేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం
వల్ల  కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య
గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.
రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి
ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా
తాజాగానే వుంది.
మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిసాను. రేడియో
మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత
ఉచ్ఛస్థానంలో వున్న  పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా
నీరవ నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ గారిని కలవడానికి
వీలుంటుందా' అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది
చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు.
ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు
ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు.
'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో
భావాలు ఏమీ తెలియకుండా.
‘మాస్కో ఎందుకయ్యా! వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం.
పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా
మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు
ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.
కనీసం ఆయన శతజయంతి సంవత్సరంలో అయినా కేంద్ర ప్రభుత్వం పీవీకి భారత రత్న ప్రకటిస్తే, ఆ అత్యున్నత పురస్కారానికే శోభస్కరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ విధంగా  ఆ మహనీయుడికి జాతి యావత్తూ కృతజ్ఞత తెలిపినట్టవుతుంది కూడా.     

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సోనియా గాంధీ పీవీకి అవమానం చేసింది. భాజపా పీవీ కి భారత రత్న ఇచ్చి అవార్డు ప్రదాన సభకు సోనియమ్మ ను ఆహ్వానించాలి. అయితే కేసీఆర్ అడిగితే భాజపా ఇవ్వదేమో. ఇదంతా రాజకీయ లెక్కలతో ముడి పడి ఉంటుంది.

శ్యామలీయం చెప్పారు...

అవార్డుల పంపకం అంతా రాజకీయమే మనదేశంలో. నెహ్రూ-గాంధీల కుటుంబంలో పుట్టటమే అర్హత అన్నట్లు పంచారని అనిపిస్తుంది. కాంగీలే‌ మరికొన్నాళ్ళుంటే రాహుల్, సోనియా, ప్రియాంకలకూ భారతరత్నలు వచ్చేవి. రాహుల్ పెళ్ళి చేసుకొని ఉంటే అయన కొడుక్కూ‌ ఇచ్చేవారేమో. ఇక పీవీ కాంగ్రసు వాడే ఐనా నెహ్రూ-గాంధీల కుటుంబంలో పుట్టలేదు కాబట్టి, ఏదో అవసరార్ధం ప్రథాని అంటే సోనియా ఆజ్ఞాను సారం వర్తించక స్వతంత్రించాడు కాబట్టి పగబట్టి చచ్చిన పిదప కూడా ఘోరాతిఘోరంగా సాధించారు! ఇప్పుడు వాళ్ళూ చేస్తారట పీవీ శతజయంతి ఉత్సవాలు. తమాషాగా ఉంది. పీవీని అవమానించి నందుకే కాంగ్రెసును భూస్థాపితం చేయవచ్చును.

నీహారిక చెప్పారు...

బాబ్రీ మసీదు కూల్చివేత వల్లనే పీవీ భూస్థాపితమైనారని బ్లాగు రచయిత మరియు వ్యాఖ్యాతలు మరచిపోతే ఎలా ?

అజ్ఞాత చెప్పారు...

Generally, Indian media including the journalists have a tendency to glorify some selected living and deceased national figures (Gandhi, Nehru, Indira, Rajiv, Sonia, Modi, NTR, PV) as demigods. We must be mature enough to acknowledge that they are all humans who made some bad mistakes as well as some very good things. It is never an unmixed record. I think it is important to present an honest, objective, and balanced account of both rather than a one-sided record of history. We have much to learn in this regard from the Western biographers.

Regards

అజ్ఞాత చెప్పారు...

Agree with you. Still we can say PV Garu positive contributions are more and praiseworthy

అజ్ఞాత చెప్పారు...

అన్న గారిని వెన్నుపోటు పొడిచి మనో వేదన తో ఆయన మరణానికి కారకులై తరువాత నిస్సుగ్గు గా ఆయన జయంతి వర్ధంతి చేస్తున్న వారు ఉన్నారు.చనిపోయిన వారిని రాజకీయం గా ఉపయోగించు కోవడం జరుగుతుంది.