29, మే 2020, శుక్రవారం

జగన్ ఓ సీతయ్య...ఎవరిమాటా వినడు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 30-05-2020, Saturday)

వై.ఎస్. జగన్ మోహన రెడ్డి గురించి తెలియనివాళ్ళు చెప్పుకునే మాట ఇది.  దీనికి కారణం ఆయన్ని గురించి పూర్తిగా తెలిసినవాళ్ళు లేకపోవడమే. చుట్టూ చాలామంది వుంటారు. కానీ ఎవర్నయినా అడిగి చూడండి. ఒకటే మాట, ‘ఆయన చాలా లోతయిన మనిషి.  జనం చెప్పేది  తప్ప పరిజనం మాట  ఆయనకు పట్టదు”.
ఒక నిజం చెప్పుకుందాం. ఎవరి మాటయినా వినాల్సిన అవసరం ఏముంది? ఆయనకు తన గమ్యం తెలుసు. వెళ్ళాల్సిన మార్గం తెలుసు. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి సొంత పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి ఏమి చేయాలి? ఎలా చేయాలి అనే విషయంలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఆయన సిద్ధంగా ఉంచుకుని ముందుకు సాగుతున్నట్టు ఆయన వ్యవహార శైలి గమనించిన వారికి అర్ధం అవుతుంది.
జగన్ మోహన రెడ్డి జనాలకు కొన్ని వాగ్దానాలు చేశారు. ప్రజలు నమ్మి అధికారం అప్పగించారు. వాటిలో చేయగలిగినవి ఏమిటి? చేయలేనివి ఏమిటి అని ఆయనే ఆలోచించుకుని ఒక కాల పట్టిక తయారు చేసుకుని పలానా రోజులోగా ఈ పనులు చేయాలి అని వాటిని చేసుకుంటూ, చేసిన వాటిని టిక్కు పెట్టుకుంటూ, చేయాల్సిన వాటిని ఎప్పుడు చేసేది ప్రజలకు చెప్పుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఇక తనకూ ప్రజలకూ నడుమ ఎవరూ లేరని, వారికి తానే జవాబుదారుననీ అనుకుంటూ ముందుకు పోతున్నారు. ఇక ఒకరి మాట వినాల్సిన అవసరం ఏమిటనే ధీమా ఆయన్ని సీతయ్యని చేసివుంటుంది.
గుర్తుండే వుండాలి. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న తొలిరోజుల్లో ఆయన ధోరణి కూడా అచ్చు ఇదే విధంగా వుండేది.  ప్రజలకు తప్ప ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అగత్యం తనకు లేదనే పద్దతిలో శ్రీ రామారావు వ్యవహరించేవారు. నిజానికి ప్రజల అభిమానంతో విజయాలను మూటగట్టుకున్న ఏ రాజకీయ నాయకుడి తరహా అయినా ఇదే విధంగా వుంటుంది. జరిగే తప్పులకీ, ఒప్పులకీ తనదే బాధ్యత అనే తీరులో వుంటుంది. గతంలో ఇందిరా గాంధీ, ప్రస్తుత కాలంలో నరేంద్ర మోడీ కేవలం తమ వ్యక్తిగత ఆకర్షణతో, ప్రతిభతో, ప్రజాభిమానంతో గద్దె ఎక్కారు. తమను నమ్ముకున్న ప్రజానీకానికి ఏది మేలు చేస్తుందని వాళ్ళు నమ్ముతారో అదే చేస్తూ పోతారు. ఈ విషయంలో ఏవిధమైన శషభిషలకు, సమాలోచనలకు తావు లేదనే దోవ వారిది.
ఇప్పుడు జగన్ మోహన రెడ్డిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవారు ఈ కోణంలో ఆలోచించాలి. అప్పుడే ఆయనలో తెలియని కోణాలు తెలుసుకోగల అవకాశం లభిస్తుంది.
సరే! ఇదొక కోణం.
చెప్పిన వాటిలో తొంభయ్ శాతం పూర్తి చేశాను అనేది ఫుల్ పేజి పత్రికాప్రకటనలకు పనికొస్తుంది. ఏడాది పాలనలే కాదు, వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాలలో కూడా పాలకులు గతంలో ఇలాంటి ప్రచార ఆర్భాటాలే చేసారు. అది కాదు విషయం. ప్రభుత్వ పధకాల వల్ల ప్రయోజం పొందేవారికి మళ్ళీ ఇలా ప్రకటనల ద్వారా చెప్పుకోవాల్సిన పనిలేదు. వాళ్లకి ప్రభుత్వ పనితీరే కొలమానం. సాధారణ ప్రజలకు నిత్యం ప్రభుత్వంతో పని పడని పాలన అందించ గలిగిన ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం అవుతుందని చాణక్యుడు ఏనాడో చెప్పాడు.
గత ఏడాది పాలనలో జగన్ మోహన రెడ్డి తలెత్తుకుని చెప్పుకోగల పనులు  కొన్ని చేసారు. తల బొప్పికట్టే పనులు కూడా చేసారు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. రాజకీయ నాయకుల  నిర్ణయాలు రాజకీయ కోణంలో వుంటాయి. కోర్టు తీర్పులు న్యాయశాస్త్ర పరిధికి లోబడి వుంటాయి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాబట్టి రాజకీయులు తమ చర్యలు ధర్మ బద్ధం అనుకుంటారు. కానీ ఒక్కోసారి అవి చట్టబద్ధం కాకపోవచ్చు. ఇలాంటి తేడాలే వ్యవస్థల నడుమ ఘర్షణలకు దారితీస్తాయి.  ఇది ఒక్క జగన్ ప్రభుత్వానికి మాత్రమే పరిమితంకాదు. ఇందిరాగాంధీ, మోడీ, కేసీఆర్ వంటి వారికి సైతం ఈ తలనొప్పులు తప్పలేదు. అయితే ఒకేరోజు అనేక వ్యతిరేక తీర్పులు కోర్టులు వెలువరించిన రికార్డు జగన్ మోహన రెడ్డి ఖాతాలో చేరడం వల్లనే  ఈ అంశానికి ఇంతటి ప్రాధాన్యం. 
ఇక గత ఏడాదిగా జగన్ మోహన రెడ్డి ప్రభుత్వ సాఫల్య, వైఫల్యాల జాబితా వేస్తే అది ఇలా వుంటుంది.
విజయాలు: తాను ప్రజలకు వాగ్దానం చేసిన నవరత్నాల అమలుపై పూర్తి దృష్టి పెట్టడం. ఇంతవరకు ఏ రాష్ట్ర చరిత్రలో ఎరుగని గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం. విద్య, వైద్య రంగాల్లో నాడు నేడు పధకం ద్వారా గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం, పెన్షన్లను ఖచ్చితంగా ప్రతినెలా నిర్దిష్టమైన తేదీన బట్వాడా చేయడం, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో మొహల్లా క్లినిక్ ల పద్దతిలో క్లినిక్కులు ఏర్పాటు చేయడం, స్కూలు పిల్లలకు మధ్యాన్న భోజన పధకంలో నాణ్యతకు ప్రాధాన్యత లభించేలా చూడడం, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధితులకు కనీ వినీ ఎరుగని ఉదార పరిహారాన్ని ప్రకటించి అందచేయడం, సమీక్షల పేరుతొ పొద్దుపోయేవరకు అధికారుల సహనానినికి పరీక్షలు పెట్టకపోవడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పేదల ఇళ్ళ స్థలాలకోసం భూసేకరణ విషయంలో వచ్చిన కొన్ని ఆరోపణలు మినహాయిస్తే పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగు చూడకపోవడం   మొదలైనవి వున్నాయి.
మైనస్ పాయింట్ల జాబితా కూడా చిన్నదేమీ కాదు.
పార్టీ మార్పిళ్ళకు సంబంధించి తొలి రోజుల్లో చేసిన గంభీరమైన ప్రకటనకు కట్టుబడి వ్యవహరించడం లేదేమో అన్న అనుమానాలు కలగడం, అల్లాగే అసెంబ్లీ నిర్వహణలో గత అనుభవాలు పునరావృతం కావని సభాముఖంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండకపోవడం,  గడప దాటిన ముగ్గురు ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో జగన్ మోహనరెడ్డి అనుసరించిన వైఖరి సాంకేతికంగా తప్పుపట్టలేనిది కావచ్చేమోకానీ నైతికంగా సమర్ధించుకోలేని పరిస్తితి తలెత్తడం, అధికారులకు సముచిత స్థానాలు కల్పించడంలో ఒక సామాజికవర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలకు సరయిన రీతిలో సమాధానం చెప్పలేని స్తితిలో వుండడం,  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి ఆసక్తిని అధికారంలోకి వచ్చిన తర్వాత కనబరచకపోవడం, ఇలా అనేకం. ముందే చెప్పినట్టు ఈ జాబితా కూడా పెద్దదే.
జగన్ మోహన రెడ్డికి  గతంలో అధికార పీఠానికి దగ్గరగా మెసలగలిగిన అనుభవం వుంది. కానీ అధికార పీఠం అధిష్టించిన సందర్భం కానీ అవకాశం కానీ లోగడ లేదు. అంచేత కొన్ని పొరబాట్లు దొర్లడం సహజం. కాబట్టి, కాసేపు ఆగి, నిలబడి, వెనక్కి తిరిగి చూసి, విషయాలను సాకల్యంగా పునః సమీక్ష చేసుకుని  మళ్ళీ ముందుకు సాగడానికి ఇది చక్కటి అవకాశం. పొరబాట్లు తప్పులుగా, తప్పులు తిరిగి సరిదిద్దుకోలేని  ఘోర తప్పిదాలుగా మారకముందే జాగ్రత్త పడడానికి కూడా ఇదొక మహత్తర అవకాశం.    
జగన్ మోహన రెడ్డి 2014లో ఓటమి అంటే ఏమిటో రుచి చూసారు. అదే జగన్ మోహన రెడ్డి 2019లో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. పరాజయం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో విజయాన్ని సాధించారు. విజయం నేర్పే పాఠాలను కూడా ఒంటబట్టించుకుంటే మరో విజయం సాధ్యం అవుతుంది. రాజకీయ పార్టీ అన్నాక రాజకీయం తప్పదు. కానీ రాజకీయమే సర్వస్వం కాకూడదు.
చివరిగా ఒక మాట.
అనుభవాన్ని మించిన సలహాదారుడు ఈ లోకంలో వుండరు. (EOM)

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“సీతయ్య ...... ఎవరి మాటా వినడే” అనిపించుకోవడం ..... సినిమాల్లో బాగానే ఉంటుంది కానీ .... నిజ జీవితంలో గొప్పేమీ కాదండి.

సరే, వేరే కోణం గురించి కుతూహలం కొద్దీ అడుగుతున్నాను .... మీరు ఐదేళ్ల పాటు అలనాటి సోవియట్ యూనియన్ లో నివసించి వచ్చారు కదా, ఇక్కడి పాలనలో ఆ ఛాయలేమన్నా కనిపిస్తున్నాయంటారా (ప్రభుత్వాన్ని విమర్శించడం, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ... ఇటువంటి ప్రజాస్వామ్య పద్ధతులను కూడా సహించక పోవడం అనే విషయంలో)??

Jai Gottimukkala చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు:

"ప్రభుత్వాన్ని విమర్శించడం, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ... ఇటువంటి ప్రజాస్వామ్య పద్ధతులను కూడా సహించక పోవడం అనే విషయం"

దీనికి జవాబు టపా మొదట్లోనే ఉంది: వై.ఎస్. జగన్ మోహన రెడ్డి గురించి తెలియనివాళ్ళు చెప్పుకునే మాట ఇది. దీనికి కారణం ఆయన్ని గురించి పూర్తిగా తెలిసినవాళ్ళు లేకపోవడమే.

ఎల్లో మీడియా & పచ్చ భజనపరులు అనునిత్యం "విమర్శించడం, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం"
చేస్తూనే ఉన్నారుగా. కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిని చంద్రబాబు కాల్చినట్టు ఒక్కళ్ళనీ చంపకపోవడమే మీ ఉద్దేశ్యంలో "సహించక పోవడం" అన్నట్టా?

అజ్ఞాత చెప్పారు...

mana maha medhavi uthamothamalu ayindi Jai gari kallatho chesthe kaani Jagan ento ardh kaaru. Papam eeyanni evarikayina chupinchandi please ala vadileyakandi.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత : దయచేసి విమర్శ వెక్కిరింతలా మారకుండా చూసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. విన్నకోట వారు, Jai Gottimukkala వారు తమ అభిప్రాయాలను హుందాగా చెప్పారు. అలా వుంటే చర్చ పద్దతిగా వుంటుంది. అందరూ మన అభిప్రాయాలతో ఏకీవభించాలని రూలేమీ లేదు