23, మే 2020, శనివారం

పెద్దలకు పొద్దెలా గడుస్తోంది


కరోనా లాక్ డౌన్ కట్టడి కాలంలో సినిమా తారలు ఎలా కాలం గడుపుతున్నారో ఏ ఛానల్ పెట్టినా తెలుస్తుంది. ఎప్పుడూ అలవాటు లేని వంటలు చేస్తూనో, ఇల్లు ఊడుస్తూనో కాలక్షేపం చేస్తున్న తారల కధనాలకు, ఛాయా చిత్రాలకు, టిక్ టాక్ చిట్టి పొట్టి చిత్రాలకు కొదవేలేదు.
ఈ సమయంలో ఆంధ్రజ్యోతి సంపాదక వర్గానికి ఓ మంచి ఆలోచన వచ్చి, తొమ్మిది పదుల వయసు దాటిన పెద్దలకు పొద్దెలా గడుస్తోంది అనే విషయాన్ని వారినే అడిగి తెలుసుకుని నిన్నా మొన్నా ఈరోజూ కొన్ని కధనాలు ప్రచురించారు. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత వారి జీవనశైలి ఎలా వుందో వివరించారు.
ముందుగా ప్రసిద్ధ విద్యావేత్త తొంభయ్ అయిదు సంవత్సరాల  చుక్కా రామయ్య గారితో మొదలు పెట్టారు. వారిలా  చెప్పారు.
“ఒంట్లో ఓపిక మునుపటిమాదిరిగా లేదు. నేను డయాబిటీస్ పేషెంటుని. అంచేత మరింత జాగ్రత్తగా ఉంటూ డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటిస్తున్నాను. ఉదయం ఏడు గంటలలోపే రెండు ఇడ్లీలు. కాస్త మినప్పొడితో బ్రేక్ ఫాస్ట్. మధ్యాన్నం ఒంటి గంటకి ఒకపుల్కా, చిన్నకప్పు అన్నంతో భోజనం. సాయంత్రం ఓ గ్లాసు మజ్జిగ. రాత్రి ఏడు లోపల భోజనం. చిన్న కప్పు రైసు, ఓ చపాతి. అంతే! తర్వాత  గంట వాకింగ్ చేసి తొమ్మిదింటికల్లా పడక.   
 “నా సొంతూరు జనగామ జిల్లా గూడూరు. 1920లో గత్తర (కలరా)వచ్చిందని పెద్దలు చెప్పగా విన్నాను. అప్పుడు చాలామంది చనిపోయారట. తర్వాత అయిదేళ్లకు నేను పుట్టాను. డిగ్రీ చదువుల కోసం  1946లో హైదరాబాదు వచ్చాను. అప్పటికే ప్లేగు విలయతాండవమాడుతోంది. ఎలుకలు ఉన్న ఇళ్ళు ఖాళీ చేసేవారు. ప్లేగుతో ఎవరైనా చనిపోతే వారి ఇళ్ళకు ఎవ్వరూ వెళ్ళకపోయేది. వ్యాధి భయంతో శవాలను దహనం చేయకుండా ఖననం చేసేవాళ్ళు. ఏదైనా గల్లీలో ప్లేగు ప్రబలితే అక్కడ వుండే ఆరోగ్యవంతులను ప్లేగు క్యాంపులకు తరలించేవాళ్ళు. విద్యానగర్ లో ప్రస్తుతం దుర్గాబాయి హాస్పిటల్ ఉన్న చోట ప్లేగు క్యాంపు వుండేది.
“నలుగురు పిల్లలూ అమెరికాలో స్థిరపడ్డారు. ఇంట్లో నేను, నా సహాయకుడు వుంటాం. ఒకప్పుడు ఈ ఇంట్లో ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి, గురువారెడ్డి, వాసుదేవ్ వంటి మహానీయులు వుండేవారు. నాకు ఈ ఇల్లంటే ప్రాణం.  పిల్లలు రమ్మని బతిమాలినా వెళ్లకపోవడానికి ప్రధాన కారణం ఇదే.”     
     

కామెంట్‌లు లేవు: