“మృత్యువుతో సహజీవనం చేస్తున్న విషయం మనిషికి మరణించేవరకు తెలియదు”
అని ఎందుకు రాశానో ఇప్పుడు చెబుతాను.
మాకు తెలిసిన ఒకావిడ ఈ మధ్య అమెరికాలో ఉన్న పిల్లల్ని చూడడానికి వెళ్ళారు. ఆ దేశానికి పలు పర్యాయాలు ఒంటరిగా వెళ్లి వచ్చిన అనుభవం కూడా వుంది. ఈసారి తిరిగి వస్తూ దుబాయ్ లో దిగి షాపింగ్ చేశారు. అక్కడినుంచే హైదరాబాదులో వున్న తన కుమార్తెకు ఫోను చేసి ఏమి కావాలో కనుక్కుని మరీ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశారు. దుబాయ్ లో విమానం ఎక్కిన తర్వాత కూడా మరోసారి ఫోన్ చేసి హైదరాబాదు ఎప్పుడు చేరేది వివరాలు చెప్పారు.
హైదరాబాదులో ఉంటున్న ఆవిడ కుమార్తె తన భర్తతో కలిసి శంషాబాదు వెళ్ళారు, తల్లిని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకు రావడానికి. విమానం లాండ్ అయింది. ప్రయాణీకులందరూ ఒక్కొక్కరుగా ట్రాలీలు తోసుకుంటూ బయటకు వస్తున్నారు. ఆఖరి ప్రయాణీకుడు కూడా వచ్చారు కానీ తల్లి జాడ లేదు. వేచివున్న కుటుంబ సభ్యుల్లో ఆందోళన. పెరుగుతోంది. ఇంతలో అనౌన్స్ మెంటు.
‘పలానా ప్రయాణీకురాలి తరపువాళ్ళు ఎవరైనా వచ్చివుంటే దయచేసి వచ్చి ఆవిడ బాడీ తీసుకువెళ్ళండి’
వినగానే వాళ్ళ గుండె జారిపోయింది. ఫోన్లో మాట్లాడి కొన్ని గంటలు కూడా కాలేదు. ఇలా ఎలా జరిగింది?
అసలు జరిగిందేమిటంటే....
దుబాయ్ లో విమానం ఎక్కిన కొద్ది సేపటి తర్వాత ఆవిడ వాష్ రూమ్ కు వెళ్ళింది. యెంత సేపైనా బయటకి రాకపోవడంతో తోటి ప్రయాణీకులు విమాన సిబ్బందికి చెప్పారు. వారు గట్టి ప్రయత్నం చేసి తలుపు తెరిస్తే అక్కడ నిర్జీవంగా పడి వుంది. మాసివ్ హార్ట్ అటాక్ మరణానికి కారణం అని నిర్ధారించారు.
అందుకే అంటారు మృత్యువుకు బహు రూపాలు. ఎవరిని ఏ రూపంలో, ఎప్పుడు దగ్గరికి తీసుకుంటుందో ఎవరికీ తెలియదు.
2 కామెంట్‌లు:
అనాయాసేన మరణం 🙏.
ఇటువంటి సంఘటనే నాకు తెలిసినదొకటి క్రిందటేడు (2018) సరిగ్గా నవంబర్ నెలలోనే జరిగింది. తేడా ఏమిటంటే మీరు చెప్పినావిడ పోవడం దుబాయ్ కు హైదరాబాద్ కు మధ్యలో జరిగింది, పైగా ఆవిడ భారతీయురాలేనేమో కూడా అందువల్ల పార్థివదేహాన్ని భారతదేశంలో దిగిన వెంటనే త్వరగానే అప్పగించినట్లున్నారు. నా మిత్రుడి విషయంలో అంత త్వరగా జరగలేదు.
వివరాల్లోకి వెడితే ... నా క్లాస్-మేట్, అమెరికాలో స్థిరపడినవాడు అయిన నా చిరకాల స్నేహితుడు తన తల్లిగారు మరణించారని కబురు తెలిసి హైదరాబాదుకు ప్రయాణమయ్యాడు. అతని వెంట భార్య, కూతురు కూడా ఉన్నారు. దుబాయ్ లో విమానం మారాల్సి ఉంది. మరో గంటలో దుబాయ్ జేరుతారనగా బాత్ రూం కు వెళ్ళాడట. దాంట్లోంచి తిరిగి బయటకు వస్తూ కుప్పకూలి పోయాడట. విమానంలోని ప్రయాణీకుల్లో ఒక డాక్టర్ ఉంటే, అతను పరీక్షించి చనిపోయాడని చెప్పాడట. పైలట్ గారు దుబాయ్ విమానాశ్రయానికి సమాచారం ఇచ్చాడట.
దుబాయ్ లో విమానం దిగగానే దుబాయ్ పోలీసులు వచ్చి శరీరాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారట. అక్కడి నుండి హాస్పిటల్ కు (పోస్ట్ మార్టం నిమిత్తం). తరువాత ఆ రిపోర్ట్ ను మేజస్ట్రేట్ గారికి దాఖలు చెయ్యడం, వారు శరీరాన్ని అప్పగించడానికి అనుమతినివ్వడం, ఆ అనుమతి పత్రం అరబ్బీ భాషలో ఉండడం మూలాన దాన్ని official translator తో ఇంగ్లీషులోకి అనువాదం చేయించుకోవడం, ఆ అనువదింపబడిన పత్రాన్ని అమెరికన్ ఎంబసీ వారికి సమర్పించుకోవడం (నా మిత్రుడు అమెరికన్ పౌరుడు కాబట్టిన్నూ, శరీరాన్ని వెనక్కు అమెరికాకు తీసుకువెళ్ళిపోదామని కుటుంబసభ్యులు నిర్ణయించుకోవడం వల్లనూ), శరీరాన్ని అమెరికా తీసుకువెళ్ళడానికి ఎంబసీ వారు అనుమతి పత్రం ఇవ్వడం ... జరిగాయట. ఆ అనుమతి పత్రం ఉంటే గానీ ఎయిర్ లైన్స్ వారు శరీరాన్ని విమానం లగేజ్ లో బుకింగ్ చెయ్యరట. ఆ పత్రాన్ని ఎయిర్ లైన్స్ ఆఫీసుకు తీసుకువెళ్ళి చూపించి శరీరాన్ని లగేజ్ లోను, తమ ఇద్దరికీ ప్రయాణీకులుగా టిక్కెట్లనూ (చేతిలో ఉన్న రిటర్న్ టికెట్ మీద తేదీని మార్పించుకోవడం) బుకింగ్ చేయించుకోగలిగారట నా మిత్రుడి భార్య, కూతురూ. ఇక అప్పుడు తిరుగు ప్రయాణం చేశారట. ఇదంతా చదువుతుంటే ఒకటి రెండు రోజుల్లో అయిపోయిందనుకునేరు, నో నో నో. పూర్తిగా వారం రోజులు పట్టిందట మొత్తం వ్యవహారం ఓ కొలిక్కి రావడానికి. అన్ని రోజులూ దుబాయ్ లో హోటల్ లో ఉంటూ పోలీసులు చుట్టూ, ఇతర సంబంధిత ఆఫీసుల చుట్టూ తిరిగారట నా మిత్రుడి భార్య, కూతురూ.
తలుచుకుంటే దిగులనిపిస్తుంది కదా 🙁.
ఇటీవలి (అర్ధాత్ శంషాబాదు విమానాశ్రయం ఉద్ఘాటన తరువాత కానీ, ఎమిరేట్స్ హైదరాబాదు ప్రయాణాలు మొదలయ్యాక కానీ) కాలంలో ఇటువంటి ఉదంతం ఏదీ జరిగినట్టు వార్తలు రాలేదు. ఒకవేళ ఏమయినా జరిగున్నా పోస్ట్-మార్టం, కస్టమ్స్ ఫార్మాలిటీలు లాంటివి లేకుండా కనీసం టికెట్ కోసం ఇచ్చిన next-of-kin emergency contact నంబర్లను సంప్రదించకుండా కేవలం మైకులో అనౌన్స్ చేయడం విడ్డూరం.
విన్నకోట నరసింహా రావు గారి వ్యాఖ్యలో బోలెడంత తతంగం కనిపిస్తుంది. దేనికయినా due process అంటూ ఉంటుంది, ఈ వ్యాసంలో అవేవీ కనిపించకపోవడం వలన ఇది కల్పితమో లేదా highly oversimplified account అనే అనుమానం రావాలి.
సాంఘిక మాధ్యమాలలో ఎన్నెన్నో వస్తాయి, అందుట్లో సింహభాగం అబద్దాలు లేదా అభూతకల్పనలే. ఒక వార్తను స్వీకరించే ముందు నిజనిర్ధారణ/ధ్రువీకరణ చేయాలని ఒక సీనియర్ పాత్రికేయులుగా మీరే చెప్తూ వస్తున్నారు. ఈ వ్యాసంలో ఆ లోటు కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది.
పెద్దలు భండారు శ్రీనివాసరావు గారు నన్ను మన్నించాలి. I apologize if my remarks are disrespectful in any manner.
కామెంట్‌ను పోస్ట్ చేయండి