ఆనందం, విచారం ఒకేసారి పెనవేసుకుని వచ్చిన సమాచారం వస్తే దాన్ని మించిన విషాదం ఏముంటుంది?
అరుణ్ మొహంతి. ముప్పయ్యేళ్ళ క్రితం రేడియో మాస్కోలో సహోద్యోగి. ఒరిస్సా (అప్పుడు అదే పేరు) నుంచి చదువుకోవడానికి మాస్కో వెళ్ళాడు. చదువుకుంటూనే మాస్కో రేడియోలో అప్పుడప్పుడూ ఒరియాలో వార్తలు చదివేవాడు. చివరికి అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు. నేను తెలుగులో వార్తలు చదవడానికి కుటుంబంతో సహా మాస్కో వెళ్ళినప్పుడు పరిచయం. మృదుస్వభావి. మార్క్సిజాన్ని ఆపోసన పట్టాడు. పుస్తకాల పురుగు. ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకంతోనే కానవచ్చేవాడు. సాయంకాలక్షేపాల్లో సయితం మాటలు తూకం వేసుకుని మాట్లాడేవాడు. నేను సరదాగా ప్రొఫెసర్ అని పిలిచేవాడిని. మేము అక్కడికి వెళ్ళిన రెండేళ్లకు కాబోలు పెళ్లయింది. వధువు నమిత. ఒరియా అమ్మాయి. బాగా చదువుకున్నది. కొత్త సంసారం. అప్పటికి మా ఆవిడే ఆమెకు పెద్ద దిక్కు. ఎక్కడికి వెళ్ళినా కలిసే తిరిగే వాళ్ళు.
పంజాబీ, హిందీ, బెంగాలి, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడంతో సహా పద్నాలుగు భారతీయ భాషల్లో మాస్కో రేడియో వార్తలు ప్రసారం అయ్యేవి. అందరం కుటుంబాలతో కలిసి రేడియో మాస్కో వారు ఏర్పాటు చేసిన పలు అంతస్తుల భవనంలో కాపురం వుండేవాళ్ళం. కమ్యూనిస్ట్ శకం ముగిసి సోవియట్ యూనియన్ అంగ,వంగ కళింగ దేశాల మాదిరిగా విడివడ్డ తరువాత మేము మాస్కో నుంచి హైదరాబాదు వచ్చేసాము. అరుణ్ దంపతులు మాస్కోలోనే వుండిపోయారు. తరవాత మా నడుమ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవీ లేవు. చూస్తుండగానే ముప్పయి రెండేళ్ళు గడిచిపోయాయి.
పీ. ఎస్. మూర్తి. ఒకప్పుడు రాష్ట్రపతి సంజీవరెడ్డి గారి దగ్గర అయిదేళ్ళపాటు ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన కూచి సూర్యనారాయణ గారి అల్లుడు. వ్యాపారపనుల నిమిత్తం మాస్కోలో మేమున్న రోజుల్లో అక్కడికి వచ్చి వెడుతుండేవారు. సూర్యనారాయణ గారు మా ఆవిడకు వరసకు బాబాయి అవుతారు. అంచేత మూర్తిగారు కూడా మాస్కోలో మాఇంటికి వచ్చేవారు. అక్కడే మూర్తి గారికీ, అరుణ్ మొహంతితో పరిచయం అయింది. మేము ఇండియా తిరిగి వచ్చిన తరువాత కూడా అనేక ఏళ్ళపాటు ఆ స్నేహం కొనసాగింది. మాస్కో వెళ్ళినప్పుడల్లా మొహంతిని కలిసేవారు. వ్యాపార విషయాల్లో తనకు తోచిన సలహాలు మూర్తికి చెబుతుండేవాడు అరుణ్.
తరువాత మూర్తి కుటుంబంతో సహా ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాదులో సెటిల్ అయ్యారు. ఆయన ద్వారానే మూడు రోజుల క్రితం ఓ విషాద వార్త తెలిసింది, అరుణ్ చనిపోయాడని. ఆయన ఇచ్చిన నెంబరుకు ఒక మెసేజ్ పెట్టాను, నేను పలానా అని పరిచయం చేసుకుంటూ.
నమిత నుంచి వెంటనే జవాబు వచ్చింది.
మాస్కో రేడియోలో భారతీయ ప్రసారాలు నిలిపివేసిన తర్వాత కూడా పద్నాలుగేళ్ళు అరుణ్ దంపతులు అక్కడే వుండిపోయారట. తరువాత ఢిల్లీ వచ్చేశారు. అరుణ్ మొహంతికి జేఎన్యూలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. భార్య నమిత కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరుగా చేరారు. బాగా సెటిల్ అయ్యామని అనుకుంటున్న తరుణంలో అరుణ్ కిడ్నీవ్యాధిబారిన పడ్డాడు. నిరుడు ఫిబ్రవరిలో కన్నుమూశాడు. అతడి తలితండ్రులు ఇద్దరూ ఏడాదిలోపలే మరణించారు.
అరుణ్ కుటుంబంతో మూడు దశాబ్దాల తరువాత సంబంధాలు ఏర్పడ్డాయని సంతోషించాలో, అరుణ్ ఇక లేడని తెలిసి బాధపడాలో ఏమీ తెలియని స్థితి.

(రేడియో మాస్కోలో పనిచేసిన భారతీయుల శ్రీమతులు. ఎడమ నుంచి మొదటి వ్యక్తి నా శ్రీమతి నిర్మల, ఆమె పక్కన నమిత మొహంతి, కుడివైపు చివర శ్రీమతి సరోజ రామకృష్ణ)