18, నవంబర్ 2018, ఆదివారం

పార్టీ టిక్కెట్లు, ఓ జ్ఞాపకం


1999 ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అసెంబ్లీకి, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు రావడంతో ఢిల్లీలో పార్టీ టిక్కెట్ల హడావిడి అంతాఇంతా కాదు. ఢిల్లీలోని ఏపీ భవన్, హోటళ్ళు పార్టీ టిక్కెట్లు ఆశి౦చేవారితో వారి మద్దతుదారులతో కిటకిటలాడిపోయాయి. నేనప్పుడు ఏదో పనిమీద వెళ్లి ఢిల్లీ ఏపీ భవన్ లో వున్నాను. చివరి నిమిషం వరకు పార్టీ అధిష్టానం టిక్కెట్లు ఖరారు చేయకపోవడంతో అభ్యర్ధులు చాలా టెన్షన్ పడ్డారు. మిగిలిన రాష్ట్రాల అభ్యర్ధులను నిర్ణయించి ఏపీ వంతు వచ్చేసరికి నామినేషన్ల దాఖలుకు ఆఖరు ఘడియ దగ్గర పడింది. ఎట్టకేలకు అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. వాళ్ళు హైదరాబాదు వెళ్లి గాంధీ భవన్ లో బీ ఫారాలు తీసుకుని మళ్ళీ వారి వారి నియోజకవర్గాలకు వెళ్ళాలి. చుట్టుపక్కల అయితే పర్వాలేదు. ఉమ్మడి రాష్ట్రం కనుక అటు ఆదిలాబాదు నుంచి శ్రీకాకుళం వరకు దూర ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళు మరింత ఉడ్డుగుడుచుకున్నారు. ముందు ఢిల్లీ నుంచి హైదరాబాదు చేరడం పెద్ద పరీక్షగా మారింది. అందరికీ రిటర్న్ టికెట్స్ వున్నాయి కానీ అవి కన్ఫర్మ్ కావడం అసాధ్యం. అప్పట్లో ఇప్పట్లా విమాన సౌకర్యాలు లేవు. హైదరాబాదు నేరుగా వెళ్ళే విమాన సర్వీసులు చాలా తక్కువ. అవన్నీ చాలావరకు బుక్కయిపోయాయి. ఢిల్లీ నుంచి కలకత్తానో, బెంగళూరో, చెన్నయో వెళ్లి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లయిట్ పట్టుకోవాలి. ఎక్కడ లెక్క తప్పినా మొత్తం అన్నాళ్ళు పడిన శ్రమ వృధానే.
ఆ సమయంలో నాకు తెలిసిన ఒక రాజకీయ మిత్రుడు ఎయిర్ లైన్స్ లో ఎవరయినా తెలుసా అని నన్ను వాకబు చేసారు. ఆ సమయంలో ఆంధ్రాలో తుపాను ప్రమాదం వచ్చి పడింది. ఎయిర్ లైన్స్ బుకింగ్ కౌంటర్ లో అడిగితే, నేను రేడియో విలేకరిని కనుక నా టిక్కెట్టుకు ఇబ్బంది లేదనీ,  ఎమర్జెన్సీ కోటాలో కన్ఫర్మ్ చేసి ఇస్తామని చెప్పారు. కానీ అవసరం ఆయనది కదా!
ఈ మీమాంసలో వున్నప్పుడు నాకు ఒక వ్యక్తి చటుక్కున గుర్తుకు వచ్చారు. ఆయన నేను మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు మాస్కోలో ఎయిర్ ఇండియా ఆఫీసులో పెద్ద అధికారిగా వుండేవారు. తరచూ కలుస్తూ వుండేవాళ్ళం.
ఇద్దరం కలిసి ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాం. ఆయన ఇప్పుడు జనరల్ మేనేజర్ అయ్యారు. బయట పియ్యేని కలిసి నా ప్రవర చెప్పుకుని ఆయన్ని కలవాలని చెప్పాను. నా మాస్కో పరిచయం గురించి తెలిసిన తర్వాత ఆ పియ్యే లోపలకు ఫోను చేసి పలానావారిని పంపించమంటారా అని అడిగి, అనుమతి తీసుకుని ఒక బంట్రోతును ఇచ్చి  లోపలకు పంపారు. పంపేముందు, వచ్చిన విషయం ఏమిటని అడిగితే ఓపెన్ టిక్కెట్టు కన్ఫర్మేషన్  కోసం వచ్చామని చెప్పాము. ఆ పియ్యే చిరునవ్వు నవ్వి, ‘ఆయన్ని కలిసి ఈ చిన్నపని అడగకండి, అదేదో నేనే చేసి పెడతానని, అప్పటికప్పుడే ఎవరికో ఫోను చేసి టిక్కెట్లు కన్ఫర్మ్ చేసాడు. వచ్చిన పని అయిపొయింది కనుక ఆ పియ్యేకి కృతజ్ఞతలు చెప్పి, మాస్కో పెద్దమనిషిని లోపల కలిసినప్పుడు టిక్కెట్ల విషయం ఎత్తకుండా ఇతరత్రా పిచ్చాపాటీ మాట్లాడి వచ్చేసాము. చాలా  ఏళ్ళ తర్వాత కలిశాను కనుక ఆయన కూడా బాగా సంతోషపడ్డారు.
ఇక మా మిత్రుడి సంగతి చెప్పక్కర లేదు. అధిష్టానం ఆఖరు నిమిషంలో పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. ఆఖరు నిమిషంలో విమానం టిక్కెట్టు కన్ఫర్మ్ అయింది.
తరువాత ఆయన తన ప్రతిభతో ఎమ్మెల్యే అయ్యారు. తదనంతర  కాలంలో మంత్రి కూడా అయ్యారు.


కామెంట్‌లు లేవు: