(Published in SURYA telugu daily in it’s edit page, SUNDAY, 18-11-18)
“సీబీఐ కి భయపడే మనిషిని కాదు. అది కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే కీలుబొమ్మ సంస్థ. ఆ బూచిని చూపి బెదిరించాలంటే నాతో కుదరదు. జాగ్రత్త!”
ఈ మాటలు అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకుంటే పొరబాటు పడ్డట్టే. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, అచ్చం ఇలాగే కాకపోయినా ఇదే అర్ధం వచ్చేట్టు మాట్లాడారు. అప్పట్లో ఆయన గోద్రా మారణ హోమం వంటి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత చంద్రబాబునాయుడు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ‘ జాతిని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ అంటూ మొదలుపెట్టిన ఉద్యమానికి ఊతం ఇస్తూ ఒకనాడు మోడీ మహాశయులు చెప్పిన మాటలనే తిరిగి వల్లె వేస్తున్నారు.
దీన్నిబట్టి సామాన్యుడికి అర్ధం అయ్యేది ఏమిటంటే కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఒకరకంగా, లేనప్పుడు మరో రకంగా, కేంద్రంతో రాష్ట్రాల సంబంధాలు బాగున్నప్పుడు ఒక రకంగా, చిట్లిపోయినప్పుడు ఇంకోరకంగా రాజకీయ నాయకులు తమ నాలుకలను మడతవేసి మాట్లాడతారని.
ఈఏడాది మార్చి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మార్గం పట్టాయి. అప్పటివరకు నాలుగేళ్ళుగా అధికార తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి ఒక్క వై ఎస్ ఆర్ సీపీ మాత్రమే. ఇప్పుడు దానికి తోడుగా బీజేపీ కలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి మిత్రపక్షం అంటూ లేకుండా పోయింది, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ను మినహాయిస్తే.
1994 చివర్లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన దాదిగా ఒకేసారి అన్ని వైపుల నుంచి ఎదురయ్యే రాజకీయ ప్రత్యర్ధి శిబిరాలతో పోరాడాల్సి వచ్చిన సందర్భం చంద్రబాబునాయుడుకు ఎదురు కాలేదు. అటు కేంద్రంతో కయ్యం. ఇటు అనుక్షణం కయ్యానికి కాలుదువ్వడానికి అవకాశం కోసం ఎదురు చూసే ప్రధాన ప్రత్యర్ధి వైసీపీ. మరో వైపు చీటికీ మాటికీ చీకాకు పెడుతున్న పవన్ కళ్యాణ్ జనసేన.
2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రులుగా వున్నవాళ్ళందరూ ఈ నాలుగేళ్ల కాలంలోనే ప్రత్యర్దులుగా రూపాంతరం చెందారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమే అని సరిపుచ్చుకున్నా చంద్రబాబుకు ఇది సరికొత్త అనుభవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, తదుపరి ఎన్నికల్లో గెలిచి మరోమారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలతో చక్కని సయోధ్య వుండేది. వాజ్ పాయ్ ప్రధానిగా వున్నప్పుడు బాబు మాటకు తిరుగుండేది కాదు. ఢిల్లీ వెళ్ళాల్సిన పనిలేకుండానే కావాల్సిన పనులన్నీ నోటిమాటతో హైదరాబాదు నుంచే చక్కబెట్టుకోగల్గిన పరిస్తితి వుండేది. టీడీపీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ మొదటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ రామారావుకు కూడా ఈ వైభోగం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా వున్నన్నాళ్ళూ తాను కలలో సయితం వ్యతిరేకిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వుండడం చేత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాటిని ఎదుర్కోవడానికి రకరకాల రాజకీయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. నేషనల్ ఫ్రంట్ నాయకుడిగా వున్నప్పుడు కేంద్రంలో ఆ కూటమి అధికారంలోకి రాగలిగింది కానీ, దురదృష్టం రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరం అయ్యింది. దీనికి పూర్తి విరుద్ధ రాజకీయ పరిస్తితులు చంద్రబాబుకు కలిసి వచ్చాయి. తద్వారా జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల ప్రతిభావంతుడనే కితాబు ఆయన ఖాతాలో చేరింది.
ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు కాలంలో సుమారు తొమ్మిదిన్నరేళ్ళ పాటు అధికారానికి దూరమై, పార్టీని కాపాడుకుకునే క్రమంలో అనేక ఆటుపోట్లు ఎదురుకున్న చంద్రబాబుకు రాష్ట్ర విభజన అంశం కూడా అనుకోకుండా కలిసివచ్చింది. విడివడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో సమర్ధుడని సంపాదించుకున్న మంచి పేరు మరోసారి కలిసివచ్చి మరోమారు ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా వెలుగులు విరజిమ్మిన మోడీ ప్రభావం, అప్పుడే కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి నేరుగా దిగకుండా అందించిన స్నేహహస్తం, ఆయన వ్యక్తిగత ఆకర్షణ, ఇవి సయితం, చేజారిపోతుందేమో అని ఒక దశలో సందేహపడ్డ రాజకీయ అధికారం ఆయన చేతికి అందేలా తోడ్పడిన మాట కూడా నిజం.
రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్తితులు ఊహించలేనంత వేగంతో మారిపోవడం మొదలయింది. కేంద్రంలో కుదురుకున్న భారతీయ జనతా పార్టీ చూపు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పాగా వేయడం వైపు మళ్ళింది. రాష్ట్రంలో దొరికిన అధికారాన్ని పదిలపరచుకుని శాశ్వతం చేసుకునే దిక్కుగా తెలుగుదేశం రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి.
రాజకీయ స్నేహాలకు కూడా ఒక పరిమితి వుంది. అధికారం దక్కేవరకు, స్వప్రయోజానాలు దెబ్బ తిననంతవరకు ఆ స్నేహాలు చెక్కుచెదరకుండా వుంటాయి. అధికారం ఒకసారి చేతికి దొరికిన తర్వాత తామే సర్వంసహా పరిపాలకులు కావాలనే దుగ్ధ మొదలవుతుంది. అది స్నేహానికి చీడ పురుగుగా తయారవుతుంది. మామూలుగా చంద్రబాబు కావాలని ఎవరితో పేచీ పెట్టుకునే మనిషి కాదు. మనసులోనే దాచుకుని అనువయిన సమయం వచ్చినప్పుడు ఎదురుదెబ్బ తీయాలని ఆలోచించే చాణక్య నీతిని వొంటబట్టించుకున్న రాజకీయ దురంధరుడు. అందుకే మొదటి నాలుగేళ్ళు మిన్నకుండిపోయి, కేంద్రమే రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే భావాన్ని ప్రబలనిచ్చి, రాష్ట్ర ప్రయోజనాలకోసమే తాను కేంద్రంపై యుద్ధం చేస్తున్నాడనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి ఆ తర్వాతనే తన ప్రణాళికను కట్టుదిట్టంగా అమలుచేసినట్టు కానవస్తోంది. అందులో బాగమే ఇప్పుడు తాజాగా రగిలించిన సీబీఐ వివాదం.
సీబీఐ వంటి ఉన్నత దర్యాప్తు సంస్థల పనితీరు మీద సామాన్య జనంలో కంటే రాజకీయ వర్గాలలోనే ఎక్కువ భయసందేహాలు వున్నాయి. ఎందుకంటే దర్యాప్తు సంస్థలను గురించి సామాన్యులు భయపడే అవసరం వుండదు. సమాజంలోని బడాబడా వర్గాల వ్యవహారాలపైనే ఆ సంస్థలు ఓ కన్ను వేసి ఉంచుతాయి. దీనికి తగ్గట్టు రాజకీయ ప్రత్యర్ధులపై సీబీఐ అస్త్రాన్ని కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలు ప్రయోగించడం అనేది కొత్త విషయమూ కాదు. ఇది తెలిసిన వాళ్ళు కనుకనే రాజకీయ నాయకులు సీబీఐ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అప్పటి తమ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. దీనికి ఉదాహరణే ముందు ప్రస్తావించిన మోడీ మాటలు, చంద్రబాబు తాజాగా ప్రయోగించిన జీవో అస్త్రం.
ఈ జీవో పై మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. ఏపీ లోని రాజకీయ పార్టీలు తమ తాజా విధానాలకు తగ్గట్టుగా విషయాన్ని అన్వయించుకుని భాష్యాలు చెబుతున్నాయి. ఏపీలో సీబీఐకి ‘నో ఎంట్రీ’ అంటూ వెలువడిన వార్తలు సంచలనం సృష్టించాయి. మరి రాష్ట్రాలలో కేంద్ర ఉద్యోగుల అవినీతి కేసులను ఎవరు చూడాలి అనే ప్రశ్నకు ఈ జీవోను సమర్ధిస్తున్న వర్గాలే సమాధానం చెబుతున్నాయి. కేంద్ర సిబ్బంది అవినీతి అక్రమాలు కనిపెట్టే బాధ్యత కేవలం సీబీఐకి మాత్రమే దఖలు పరచినట్టు చట్టంలో ఎక్కడా లేదని, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అవినీతి నిరోధక శాఖ కూడా ఈ పని చేయవచ్చనీ ఆ వర్గాల వాదన. బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ ఘర్, హరియాణా తో సహా పందొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానమే అమల్లో వుందని నొక్కిచెబుతున్నారు. మెజారిటీ రాష్ట్రాల్లో వున్న పద్ధతినే ఆంధ్రప్రదేశ్ ఎంచుకున్నప్పుడు అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇన్ని వివరణలు ఇస్తున్న ఈ వర్గాలు జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటుంది. అది ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంచుకున్న సమయం. ఆంధ్రాలో ఇటీవల ఐటీ దాడులు జరిగినప్పుడు, తెలుగుదేశం పార్టీవాళ్లు ఇదే ప్రశ్న లేవనెత్తారు. టీడీపీ ఎన్డీయే తో కలిసివున్నప్పుడు జరగని దాడులు, సంబంధాలు తెగతెంపులు చేసుకున్న తర్వాతనే ఎందుకు జరుగుతున్నాయని వాళ్ళు సంధించిన ప్రశ్న గుర్తుండే వుంటుంది.
సీబీఐ పరిధి గురించి మూడు మాసాల క్రితం సార్వత్రిక అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకోవడానికి దారి తీసిన పరిస్తితులు ఏమిటన్నది జీవో గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు వేస్తున్న ప్రశ్న. వీళ్ళూ వాళ్ళూ చేస్తున్న ఆరోపణలు, వేస్తున్న ప్రశ్నలు రాజకీయ ప్రేరేపితం కాబట్టి దానిమీద చర్చించి ప్రయోజనం వుండదు.
ప్రత్యర్ధుల పీచమణచడానికి, రాజకీయ ప్రయోజనాలను పొందడానికి వాడుకుంటూ తన అధీనంలోని సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనే వాదన ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. గతంలో యూపీఏ అధికారంలో వున్నప్పుడు ఇదే మాట ప్రతిపక్షం నోట వినబడింది. ఇప్పుడు అదే బాణీ ప్రతిపక్షంగా మారిన మిత్ర పక్షం నుంచి వినబడుతోంది. మళ్ళీ ఎన్నికల్లో పాత్రలు తారుమారయితే ఇదే తంతు కొనసాగుతుంది.
‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. దేశాన్ని కాపాడాలి’ అనే నినాదంతో విభేదించేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అయితే జనం కాపాడాల్సింది ఈ నినాదాలు ఇస్తున్న నాయకులనా, దేశాన్నా అనే దగ్గరే సందేహాలు పొటమరిస్తున్నాయి. ఎందుకంటే గతంలోకి చూస్తే ఏఒక్క రాజకీయ పార్టీ కూడా అధికారం దఖలు పడిన తర్వాత చెప్పిన మాటని నిలబెట్టుకున్న దాఖలా లేదు.
భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి దూరదృష్టి కలిగిన వెనుకటి తరం నేతలు, తమతో ఏమాత్రం పోల్చలేని రాజకీయ నాయకులు తమ తరవాతి తరంలో పుట్టుకొస్తారని ఎంతమాత్రం ఊహించి వుండరు. అంచేతే కేంద్ర, రాష్ట్ర సంబంధాలను నిర్వచించే విషయంలో విశాల దృక్పధాన్ని ప్రదర్శించారు. రాజ్యాంగంలో పొందుపరచిన వ్యవస్థలన్నీ తమ పరిధుల్లో వ్యవహరిస్తూ, ఇతర వ్యవస్థల వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకోబోవు అనే నమ్మకంతో రాజ్యాంగాన్ని తయారు చేసివుంటారు.
ఇప్పుడు పరిస్తితి తద్విరుద్ధంగా ఉంటోంది. అలనాటి ఆ మహా నాయకులు ఆశించిన స్థాయిలో ఈనాటి రాజకీయ నాయకులు లేరన్నది నిర్వివాదాంశం. ప్రజలు తమకు కట్టబెట్టిన అధికారం శాశ్వతం అని భ్రమించేవాళ్ళూ, ఆ భ్రమల్లో కూరుకుపోయి ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని ఆరాటపడే వాళ్ళు ఈ రోజు రాజకీయ రంగాన్ని ఏలుతున్నారు. ప్రతిదీ తమ కనుసన్నల్లో, తాము కోరుకున్నట్టు జరగాలని శాసిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేదు. ఎవరికి వారు తమ అధీనంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాలను తమ ఇచ్చవచ్చిన రీతిలో అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రయోజనాలకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా భంగం వాటిల్లినా సరే, దాని దుష్ప్రభావాన్ని ఎదుటివారి మీదకు నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు.
అంతరిక్షంలో వేలాది గ్రహాలు కళ్ళు తిరిగిపోయే వేగంతో తమ నిర్ణీత కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయని సైన్సు చెబుతుంది. ఏ ఒక్క గ్రహమూ తన నిర్ణీత కక్ష్యను దాటి రావడం అంటూ జరగదు. జరిగితే అది విశ్వ వినాశనమే. అయినా అన్ని గ్రహాలు గతి తప్పకుండా భ్రమిస్తుంటాయి.
రాజ్యాంగ వ్యవస్థలు కూడా అలాగే గతి తప్పకూడదు. తప్పితే రాజ్యాంగానికే ముప్పు. మన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, అధికారులు అందరూ పదవీ స్వీకార సమయంలో రాజ్యాంగ బద్ధులుగా ఉంటామని ప్రమాణం చేస్తారు. కుర్చీ మీద కూర్చోగానే ఆ ఒట్టు తీసి గట్టున పెడతారు.
‘దేశాన్ని కాపాడాలి, రాజ్యాంగ వ్యవస్తలని పరిరక్షించాలి’ అనే వారు జాతికి మాట ఇవ్వాలి. తమ అధికారంలో ఉన్న వ్యవస్థలని అదే చిత్తశుద్ధితో కాపాడతామని, వాటిలో తమ జోక్యం ఉండదనీ. అలా ఇచ్చిన మాటని త్రికరణ శుద్ధిగా నిలబెట్టుకోవాలి.
ఇది జరగని నాడు ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. వ్యవస్థలు ఇలాగే అధికారంలో ఉన్నవారికి అణిగిమణిగి పనిచేస్తూనే వుంటాయి. ప్రజల అవస్థలు అలాగే కొనసాగుతుంటాయి.
ఇలా చేసే ఈ ప్రయత్నాలన్నీ తమని మభ్య పెట్టడానికి పన్నే రాజకీయ వ్యూహాల్లో భాగాలని, తమకు ఒరిగేది ఏమీ లేదని ప్రజలు గ్రహించిన నాడు, ఇక సరిదిద్దుకోవడానికి రాజకీయులకు వ్యవధానం మిగలదు.
కాబట్టి రాజకీయం చేసేవాళ్ళు ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి.
‘రాజ్యాంగాన్ని మీరు కాపాడండి. ఆ రాజ్యాంగమే మిమ్మల్ని కాపాడుతుంది”
3 కామెంట్‌లు:
నిజానికి ప్రభుత్వనాయకుల కంటే ఆయా సంస్థల ఉద్యోగులు అధికారుల వైఖరి మరింత విస్తుగొలిపేలా ఉంది. వృత్తి నిబద్ధత కంటే వ్యక్తిగత లక్ష్యాలే ఎక్కువైపోయాయి. పై అధికారితో కానీ ప్రభుత్వాధినేతలతో కానీ ఏ కాస్త చెడినా సంచలన నిజాలు అనబడే ఆరోపణలతో మీడియా ముందుకొస్తున్నారు. నిబద్ధత ఉన్నవారైతే అవినీతి జరుగుతోందని తెలిసినపుడే ప్రతిఘటించేవారు. కానీ తమకు అనుకూలమైన చర్యలు జరగని పక్షం లొనే వారికి గతకాలపు అవినీతి జ్ఞాపకాలు వస్తున్నాయంటే ఎంత ముదిరిపోయారో కదా!
అయినా మాబోటి సామాన్యుల పిచ్చి గాని పేరుమోసిన జర్నలిస్టులే పక్కదారిలో తిరుపతి ప్రసాదాలనుంచి ఫ్లయిట్ టిక్కెట్లవరకు చేజిక్కించుకుంటుంటే ఈ ఉద్యోగులనుంచి మాత్రం నిజాయితీ ఆశించగలమా!
// “తమకు అనుకూలమైన చర్యలు జరగని పక్షం లొనే వారికి గతకాలపు అవినీతి జ్ఞాపకాలు వస్తున్నాయంటే ఎంత ముదిరిపోయారో కదా!” //
ఇదొక రకపు MeToo అనచ్చేమో?
ఈ జింతాత జిత జిత చర్చల కంటా కె ఎ పాల్ బండ్ల గణేశ్ చర్చలు బాగున్నాయి. కామెడీ గా అనిపించినా వారి మాటల్లో నిజాయితీ భోళాతనం ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి