పొద్దున్న సాక్షి నుంచి ఇంటికి
వస్తుంటే పాశం యాదగిరి ఫోను.
‘బాగా రాశావు ‘బడు’ ధాతు గురుంచి’
అన్నాడు.
యాదగిరి బాగుంది అన్నాడు అంటే అది ఓ
సర్టిఫికేట్. అతడికి తెలియని సబ్జెక్ట్ లేదు. అన్ని భాషల్లో ప్రావీణ్యం. చాలా
విషయాలు జ్ఞాపకం వుంటాయి. కానీ ఎప్పుడో
కాని కాగితం మీద కలం పెట్టడు. అయితే ఒక సుగుణం వుంది. ఫోను చేసి చాలావాటిని
నాలాంటి వాళ్ళతో పంచుకుంటాడు. ఇక నాకా రోజు రాసుకోవడానికి ముడి సరుకు దొరికినట్టే.
ఇవ్వాళ కూడా పాత కబుర్లు అనేకం
చెప్పాడు. నేను రాసిన నార్లగారి ‘బడు’ ధాతువు ప్రధానాంశం. ‘బడు’ అని రాసేవాడు పెద్ద బడుద్దాయి అని నార్ల చీవాట్లు
పెట్టేవాడట. ఇన్నయ్య గారితో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 8 లో వున్న నార్లగారి ‘లుంబిని’ ఇంటికి వెడుతుండేవాడట. ఒకసారి మాటల్లో ఈ బడు
ధాతు గురించిన ప్రస్తావన వస్తే హిందీ ఉర్డూ భాషల్లో కూడా ఈ బడు ధాతువు లేదని
యాదగిరి చెప్పాడు. ‘మై ఖానా ఖాయా హు.’ (అన్నం తిన్నాను) అంటారు కానీ ‘ఖానా మేరే
ద్వారా ఖాయా గయా’ (అన్నం నాచేత తినబడినది)
అనరు అనేది ఉదాహరణగా చెబితే నార్లవారు సంతోషపడి, కుర్రాడివయినా బాగా చెప్పావు అని
మెచ్చుకున్నారట. ఆయన ఎవరికో ఫోను చేసి ఈ బడు ధాతువు వేరే ఏదైనా భారతీయ భాషల్లో
ఉందా అనే విషయం ఆరా తీసారట. ఆర్య, ద్రావిడ భాషల్లో ఎక్కడా లేదని లేదని
సూత్రీకరించారట. ‘ఇదంతా అనువాదకులు తెచ్చిన అబర్ధం. ఇంగ్లీష్ వాడు తను చేసిన
తప్పును కప్పిపుచ్చుకోవడానికి అతితెలివికి పోయి చేసిన పని’ అని అన్నారట. ‘కోహినూరు
వజ్రం ఇండియా నుంచి ఎత్తుకు రాబడినది’ అని
నిజం ఒప్పుకోవడం వారికి ఇష్టం వుండదు.
అందుకే “Kohinoor came from India” (కోహినూర్ ఇండియా నుంచి వచ్చింది)
అంటారు. భగత్ సింగ్ ను ఉరి తీసారు (Bhagath
Singh was hanged) అనకుండా ‘ఉరితీయపడ్డాడు’ అంటారు. నేరాలు చేసేవాళ్ళు సృష్టించిన పద ప్రయోగం ఇది. మోడరన్ ఇంగ్లీష్ లో కూడా ఈ బడు ధాతు నిషిద్దం’
అని నార్లవారు విశదం చేసారని యాదగిరి చెప్పాడు.
3 కామెంట్‌లు:
Passive voice నాకూ ఇష్టం లేదు. ఆఫీస్ వ్యవహారాల్లో ఎక్కువగా వాడతారనీ, impersonal గా ఉంటుందనీ, దాని వలన వాక్యనిర్మాణం సొగసుగా ఉండదనీ నా అభిప్రాయం. అయితే దాన్ని పూర్తిగా తప్పించుకోలేం.
ఇతర భారతీయభాషల్లో లేదని ఎలా తీర్మానించారో ఆశ్చర్యంగా ఉంది. హిందీలో విపరీతంగా వాడతారు. కియా జాతా హై, కహా జాతా హై ... వగైరాలు కోకొల్లలు. అంతెందుకు “కౌన్ బనేగా కరోడ్-పతి” టీవీషోలో చూడండి ... అమితాభ్ బచ్చన్ ఎంత విరివిగా వాడతాడో కనిపిస్తుంది. మరి హిందీ భాషలో ఆ ధాతువే లేదని మీ యాదగిరి గారు ఎట్లా అంటున్నారో తెలియడం లేదు. నేను నార్ల. యాదగిరి గార్లంత భాషాకోవిదుడను కాదు గానీ వారి వాదనేమిటో నాకైతే బోధపడడం లేదు. పైన చూపించిన ఉదాహరణ ఒక poor example అనిపిస్తుంది.
“బడు” లాంటి పదప్రయోగం మరొకటి ఉంది. అదే “జరగడం”. రాజకీయనాయకులకు చాలా ఇష్టమైనది. మంత్రి గారిని కలవడం “జరిగింది” వారితో మాట్లాడడం “జరిగింది”. మన సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం “జరిగింది”. వారు పరిశీలిస్తామని హామీ ఇవ్వడం “జరిగింది”. దీనికన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు.
మీ వ్యాసం యొక్క కవిహృదయం నేను అర్థం చేసుకోలేదని మీకనిపిస్తే I am sorry.
అసలు పోస్టు చదవడం "జరగలేదు"కాని మీ కామెంట్ చదవడం"జరిగింది"!
మీకూ ఆ లక్షణాలు అలవడుతున్న “పరిస్ధితి” కనిపిస్తోంది 🙂.
(“పరిస్ధితి” = ప్రైవేట్ న్యూస్ ఛానెల్స్ లో వి.ఐ.పి. హోదా దక్కిన పదప్రయోగం 😡)
కామెంట్‌ను పోస్ట్ చేయండి