28, సెప్టెంబర్ 2016, బుధవారం

రేడియో

https://www.youtube.com/watch?v=MioiJOEZh0s&feature=share&list=UUfiN9LVu6amzjETTGmYfnkg

రెండేళ్ళు అవుతోంది మితృడు సతీష్, టీవీ 9 తన జర్నలిష్టు డైరీలో రేడియో మీద ఒక ప్రత్యేక ప్రోగ్రాం చేసి. ఈరోజు ట్విట్టర్ లో దొరికింది. నాతో రెండు ముక్కలు మాట్లాడించాడు కూడా. నా పేరుకు 'రేడియో కార్మికుడు' అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించాడు. అతడికి ధన్యవాదాలు.

27, సెప్టెంబర్ 2016, మంగళవారం

హైదరాబాదులో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సాధ్యమేనా?

హైదరాబాదులో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు  సాధ్యమేనా? మహా న్యూస్ ఛానల్ లో మంగళవారం ఉదయం న్యూస్  అండ్  వ్యూస్ ప్రోగ్రాంలో చర్చ.
https://www.youtube.com/watch?v=-Edf_Ux0fbU&feature=youtu.be



24, సెప్టెంబర్ 2016, శనివారం

నగరానికి ఏమైంది! ఎవరు ఇందుకు కారణం?


రెండు తెలుగు రాష్ట్రాల పట్ల వరుణుడు ‘సమన్యాయం’ చూపిస్తున్నట్టు వుంది. మొన్నమొన్నటి వరకు చినుకుకోసం ఎదురుచూపులు. ఇప్పుడు  ఆ మాట  వింటేనే ఒణుకు. ఒకే దృశ్యాన్ని టీవీల్లో పదేపదే చూపిస్తూ వుండడం వల్ల కాబోలు, పరిస్తితి వున్నదానికంటే భయంకరంగా కానవస్తోంది. మళ్ళీ కొన్నాళ్ళు వానలు తప్పవనీ, కొన్ని చోట్ల కుంభ వృష్టి కురుస్తుందనీ వస్తున్న వార్తలు జనం గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పరిస్తితి అదుపులోనే వుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. సరే! ఈ పరిస్తితిని  ఇలానే వుంచి, కాసేపు టైం మిషన్ లో కొన్నేళ్ళు వెనక్కి వెళ్లి వద్దాము.
1975 వ సంవత్సరం.
రేడియోలో విలేకరి  ఉద్యోగంలో చేరడానికి హైదరాబాదు వచ్చాను. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద  నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.
నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను. పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దగ్గర అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే ఒంటరిగా నిలబడి వుంది. అది  దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. దానికి చివర్లో పెద్ద లోయ. అందులో నిండుకుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.
ఇప్పుడా లోయాలేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల కాలనీ, లోయని పూడ్చేసి  సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని  ప్రభుత్వాలను, ప్రజలను  శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు. అవీ ప్రభుత్వం వారికి కారు చౌకగా ఇచ్చిన స్థలాల్లో.
హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో  అన్ని చెరువులూ  మంత్రం వేసినట్టు మాయమయిపోయాయి. వాటిల్లో చిన్నవాళ్ళు కట్టుకున్న  చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, వున్నవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి.   హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.
గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. సరే ఇప్పుడంటే వానల పుణ్యమా అని నీళ్ళు  నిండాయి. నిన్న మొన్నటి వరకు రాళ్ళు తేలి, నీళ్ళు లేని చెరువు గర్భమే కానవచ్చెది.  
గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దయిన హైదరాబాదు నగరం దృశ్యాలను టీవీల్లో చూస్తుంటే ఈ  వెనుకటి జ్ఞాపకాలు మనసులో తిరిగాయి. అలాగే నిరుడు డిసెంబరులో చెన్నై కంటినీరు కళ్ళలో మెదిలింది.
 తెలుగు రాష్ట్రాలకు పొరుగున వున్న తమిళనాడు రాజధాని చెన్నై నగరం  వరుస వర్షాలకు కుదేలయిపోయింది. పక్కనే వున్న సముద్రంలోని నీళ్లన్నీ వాన రూపంలో నగరాన్ని యావత్తు ముంచెత్తి వేశాయా అన్నట్టు చెన్నపట్నం తల్లడిల్లి పోయింది. వందేళ్ళ కాలంలో ఇలాటి పెనువృష్టిని చూసి ఎరగమంటూ అప్పుడు లెక్కలు చెప్పారు. టీవీ తెరలపై అక్కడి దృశ్యాలను చూసిన వారికి  అది నిజమే అనిపించింది.
ఈ భీకర వృష్టి, దాని భయంకర ఫలితం మానవ తప్పిదం కాదు. ఇవి ప్రకృతి ఉత్పాతాలు. ఇలాటివి జరిగినప్పుడు, వాటి ఉధృతిని గమనించినప్పుడు ప్రకృతి ప్రతాపం ముందు తను యెంత అల్పుడన్నది మనిషికి తెలిసి రావాలి. కానీ ఈ గుణపాఠం నేర్చుకుంటున్న దాఖలాలు లేవు.
ప్రభుత్వాలు కల్పించుకుని యెంత సాయం అందించినా ఇంతటి విపత్తులు వాటిల్లినపుడు అవి అరకొరగానే అనిపించడం సహజం.
ఇలాటి వాటి గురించి వింటున్నప్పుడు, చేస్తున్నది సరే, ఇంతకంటే మించి చేయలేమా అనిపిస్తోంది. నిజమే.  వరదలు, భూకంపాలు, తుపానులు, సునామీలు, కరవులు వీటన్నిటినీ సమర్ధవంతంగా ఎదుర్కోవడం మనిషి శక్తికి మించిన పని. ఉపశమన కార్యక్రమాలు మినహా వాటి పరిణామాలనుంచి, పర్యవసానాలనుంచి  పూర్తిగా బయట పడడం అసాధ్యం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విషయం మరిచి పోకూడదు. ఉత్పాతాలు, ఉపద్రవాలు ప్రకృతి ప్రసాదం కావచ్చు. కానీ వాటి పర్యవసానాలు, దుష్పరిణామాల స్థాయి, ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరడం అన్నది మాత్రం మనిషి పుణ్యమే. అతగాడి స్వయంకృతాపరాధమే.  ఇక్కడ మనుషులంటే చెన్నై నగర పౌరులే  కారు. అధికారగణం. వారిని శాసించే రాజకీయ శక్తుల సమూహం కూడా.
బ్రిటిష్ వారి  కాలంనుంచి ప్రఖ్యాత నగరంగా విలసిల్లిన చెన్నపట్నం, అభివృద్ధి పేరుతొ విచ్చలవిడిగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్ధపు ఆలోచనలకు బలయిపోయింది. ప్రణాళికా బద్ధంగా సాగాల్సిన భవననిర్మాణాలు, రాజకీయ పార్టీల వత్తాసుతో, అధికారుల కుమ్మక్కుతో నిబంధనలకు మంగళం పాడాయి. వరద నీరు, మురుగు నీరు సులభంగా పారాల్సిన  ప్రాంతాలన్నీ అక్రమార్కుల ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. కూమ్, అడయార్ వంటి నదులు ఆక్రమణల కారణంగా కుంచించుకు పోయి మురికి నీటి కాసారాలుగా తయారయ్యాయి. అనుకోని వరదలు వచ్చినప్పుడు పొంగి పొరలకుండా అడ్డుకునే కరకట్టలు కలికానికి కూడా కానరాకుండా పోయాయి. ఏతావాతా ఇదిగో చెన్నైలో నిరుడు జరిగింది అదే! ఇప్పుడు  హైదరాబాదులో  జరుగుతోందీ అదే!
చెన్నైలోనే కాదు, హైదరాబాదులోనే కాదు  అన్ని రాష్ట్రాలలోను, అన్ని నగరాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్తితి. రెండువేల సంవత్సరంలో హైదరాబాదులో పడ్డ వర్షాలకు ట్యాంక్ బండ్ పొంగిపొరలి వచ్చిన   వరదలు, సృష్టించిన భయంకర పరిస్తితులు దరిమిలా  రాష్ట్రాన్ని  పాలించిన ఏలికలు  మరచిపోయారేమో కానీ ఆ చేదు అనుభవాలు, అనుభవించిన  జనాలకు మాత్రం ఇంకా జ్ఞాపకం వున్నాయి. అక్రమ నిర్మాణాలు తొలగించి ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం  కనుగొంటామని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. నిజానికి కావాల్సింది ఇదే. అయితే ఇటువంటి   నిర్మాణాలు అరికట్టాలంటే  రాజకీయ దృఢ సంకల్పం కావాలి. దానికి ప్రజల సహకారం కావాలి. ఈ రెండింటికీ  మీడియా వత్తాసు కావాలి. న్యాయపరమయిన చిక్కులు ఎదురు కాకుండా వుండాలి. ఇన్ని సమకూడితే కానీ అటువంటి సత్సంకల్పం సిద్ధించదు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇటువంటి కొత్త పుంతలు తొక్కాలనే కోరుకుందాం.   
ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది  మరోటి వుంది.
జలదిగ్బంధంలో చిక్కుకు పోయిన ప్రజలకు ఆహారం సరఫరా చేసే క్రమంలో వారికి హెలికాప్టర్ల ద్వారా పులిహోర పొట్లాలు జారవిడుస్తుంటారు. పులిహార అయితే కొన్ని రోజులు నిలవ ఉంటుందన్న అభిప్రాయం కావచ్చు. కానీ చుట్టూ నీళ్ళు వున్నా తాగడానికి వీల్లేని ఆపన్నులకు ప్రధమంగా కావాల్సింది శుభ్రమైన నీరు. లేనిపక్షంలో, కాలుష్యమైన నీళ్ళు తాగి లేనిపోని అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి వుంటుంది. రోజుల తరబడి నీళ్ళు నిలవ వుండే పరిసరాల్లో అంటువ్యాధులు ప్రబలితే వాటిని అరికట్టడం ఒక పట్టాన సాధ్యం కాదు. ప్రభుత్వ అధికార వర్గాలు సహాయక చర్యల విషయంలో ఇటువంటి కీలకమైన  అంశాలను గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించి ఆహార పదార్ధాలను ఇతర నిత్యావసర సామాగ్రిని బాధితులకు అందించే ప్రయత్నం చేయగలిగితే ఉత్తరోత్తరా పర్యావరణానికి వాటిల్లే ముప్పును తగ్గించిన వారవుతారు.
కష్టాలు కలకాలం వుండవు. ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వాలకంటే ప్రజలే నిబ్బరంగా వ్యవహరించిన దాఖలాలు అనేకం. నష్టం భారీ స్థాయిలో సంభవించినప్పుడు ప్రభుత్వాలు యెంత పెద్ద ఎత్తున సాయం అందించినా అది జరిగిన నష్టాన్ని పూడ్చలేదు.
ప్రకృతి ప్రకోపాలు జీవితాల్లో భాగం అయిపోయాయి. అలాగని  చేతులు  ముడుచుకుని  కూర్చోవడం  పనికిరాదు. మరోసారి ఇటువంటి పరిస్తితి  రాకుండా  చూడడం  ప్రభుత్వాల ధర్మం.
అయితే  ఇటువంటి దుస్తితికి కారణం ఎవ్వరు అంటే జవాబులు అనేకం.
పట్టించుకోని ప్రభుత్వాలా! లంచాలు పట్టి, అడ్డమైన కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులా! కనబడ్డ చోటల్లా వెంచర్లు వేసి, ప్రజల డబ్బుతో, తగిన అనుమతులు లేకుండానే  అపార్ట్లు మెంట్లు కట్టేసి కోట్లు సంపాదిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులా! అనుమతులు ఉన్నాయా లేవా అని చూసుకోకుండా, చూసినా లెక్కపెట్టకుండా ఇళ్ళు కట్టుకున్న, కొనుక్కున్న ప్రజలా!
ఒక్క ముక్కలో చెప్పాలంటే  ఇది పాపం అనుకుంటే, ఇందులో వీరందరికీ భాగం వుంది. వాటాల్లోనే తేడా!
(24-09-2016)   



23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

బెజవాడ రైల్వే స్టేషన్

రాత్రీ పగలూ  తేడా  లేకుండా అనునిత్యం ప్రయాణీకులతో, రైళ్ళ రాకపోకలతో సందడిగా వుండే బెజవాడ రైల్వే స్టేషన్  ని రూట్  రిలే  ఇంటర్ లాకింగ్  పనుల కోసం తాత్కాలికంగా మూసివేసారు.


ఈ వార్త చదివినప్పుడు  ఎన్నో ఏళ్ళక్రితం నా ఈ బ్లాగులో రాసిన కొన్ని విషయాలు స్పురణకు వచ్చాయి.
అవే ఇవి:
(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతేప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్నిజ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సునుఅనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు -  భండారు శ్రీనివాసరావు )
బెజవాడ గురించి చెప్పుకునే ముందు ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి. ఎందుకంటె అనేక విషయాల్లో దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషను లోకి ప్రవేశించే  గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి.
జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజను ఆవిర్లు చిమ్ముతూబిగ్గరగా  కూతపెడుతూ ప్లాటుఫారం మీదకు వేగంగా వస్తుంటే ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడడానికి వందలమంది  స్టేషను ఫుట్ బ్రిడ్జ్  మీద గుమికూడేవారని చెబితే ఈనాటి వారు నమ్మడం కష్టమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ పేరుకు తగ్గట్టే దాని కూత కూడా ప్రత్యేకంగా వుండేది. దూరం నుంచి కూడా కూత విని ఆ రైలును గుర్తుపట్టేవారు.
ఇక స్టేషను విషయానికి వస్తే అది యెంత పెద్దదంటే బెర్లిన్ గోడ మాదిరిగా బెజవాడ పట్టణాన్ని తూర్పుపడమర దిక్కులుగా విభజిస్తూ వుంటుంది. రెండు పక్కలా రెండు విభిన్న సంస్కృతులు పరిఢవిల్లుతుండేవి. 1941 లో కాబోలు గానన్  డంకర్లీ అండ్ కంపెనీ,  రైలు పట్టాల కిందుగా అండర్ పాస్ వంతెన నిర్మించేంతవరకు బెజవాడ రెండు  భాగాలుగా వుండేది. ఇక ఆ స్టేషనులో రద్దీ గురించి చెప్పాల్సిన పని లేదు.  ఆ రోజుల్లోనే పది నిమిషాలకు ఒక రైలు రావడమోపోవడమో జరిగేది. రైలు గేటు  వేసినప్పుడల్లా అటునుంచి ఇటు రాకపోకలు సాగించేందుకు జనం నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ఈ చిక్కులు తొలగిపోయాయి.  
ఆ రోజుల్లో  నిజాం పాలనలో వున్న హైదరాబాదు స్టేట్ నుంచి రైళ్ళు బెజవాడ వచ్చేవి. నిజాం రైళ్ళను గురించి జనం గొప్పగా చెప్పుకునే వారు. సమయపాలనకు అవి పెట్టింది పేరు. అలాగే శుభ్రత. మూడో తరగతి బోగీల్లో కూడా పంకాలుస్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్లు వుండేవి.
బెజవాడ రైల్వే స్టేషన్ చూస్తే ఏకత్వంలో భిన్నత్వం అంటే ఏమిటో బోధ పడుతుంది. దేశం నలుమూలలకు  చెందిన  విభిన్న భాషలవాళ్ళు బెజవాడ ప్లాటుఫారం పై కానవస్తారు. కొత్తవాళ్ళకు కృష్ణా పుష్కరం మాదిరిగా గుంపులు గుంపులుగా వున్న ఆ జనసందోహం కనబడేది. (బెజవాడ  గురించి ఇంకా అనేక విషయాలు రాశారు, అవి మరో సారి)

( అమెరికాలో వుంటున్న శ్రీ దాసు కృష్ణ మూర్తిగారి ఇంగ్లీష్ జ్ఞాపకాలకు తెలుగు అక్షర రూపం)

20, సెప్టెంబర్ 2016, మంగళవారం

విభజన బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారా? ఉండవల్లి ఊహాగానం


సమైక్య ఆంధ్ర  ప్రదేశ్  రెండు  రాష్ట్రాలుగా   విడిపోయి  రెండేళ్ళు  దాటిపోయింది. విభజనకు పూర్వం చాలా కాలం,  తరువాత కొన్నాళ్ళు విభజానంతర పరిణామాల పట్ల చాలామందిలో, ప్రత్యేకించి  హైదరాబాదులో స్థిరపడిన సీమాంధ్రుల మనస్సుల్లో వున్న  భయసందేహాలు  చాలా వరకు సద్దుమణిగాయి. ఏవో రాజకీయ  సంబంధమయిన  చిటపటలు మినహా  మొత్తం మీద  చూస్తే అటూ, ఇటూ  జనాలు సర్దుకుపోయారనే చెప్పాలి.  ఇలాంటి నేపధ్యంలో విభజన కధ పేరుతొ  అలనాటి విషయాలను తవ్వి తీస్తూ ఏకంగా  ఒక పుస్తకం రాయడం ఎందుకు? అంత అవసరమా ?  అనే  ప్రశ్నలు  సహజంగానే తలెత్తుతాయి.



ఈ గ్రంధం రాసిన వ్యక్తి ఉండవల్లి  అరుణ్ కుమార్. పరిచయం అవసరం లేని వ్యక్తి. నేను మొదటిసారి ఆయన్ని కలుసుకున్నది నడుస్తున్న రైల్లో. కడప జిల్లా, పులివెందులలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్  రెడ్డి వివాహానికి హైదరాబాదు నుంచి కొందరు  పాత్రికేయులం వెడుతున్నాము. అదే రైల్లో ప్రయాణం చేస్తున్న ఉండవల్లి మాతో చాలాసేపు గడిపారు. ఆయన మాటకారితనం మొదటిసారి తెలిసివచ్చింది అప్పుడే.  ఏ విషయం మీద అయినా సాధికారంగా మాట్లాడగల నేర్పును గమనించాను. తదనంతర కాలంలో అనేక సభల్లో ఉండవల్లి ప్రసంగాలు ఆయన్ని జనాలకు దగ్గర చేశాయి. వేదిక ఎక్కి మైకు పట్టుకుంటే చాలు అనర్ఘల ప్రసంగాలు అలవోకగా ఆయన నోటివెంట జాలువారేవి. వాగ్దాటితో   జనాలను సమ్మోహితం చేసే ప్రసంగకారుడనే ట్యాగ్ లైన్ ఆయన సొంతం చేసుకున్నారు. రాజీవ్  గాంధీ, సోనియా గాంధి, రాహుల్ గాంధి వంటి కాంగ్రెస్ పార్టీ  అగ్రనాయకులు బహిరంగ సభల్లో  చేసే ఇంగ్లీష్, హిందీ  ప్రసంగాలకు తెలుగు అనువాదం చేసే అవకాశాన్ని వైఎస్ఆర్  కల్పించిన దాదిగా ఇక ఆయనకు అడ్డులేకుండా పోయింది. ఈ విషయాన్ని ఆయనే  స్వయంగా ఎన్నోసార్లు వెల్లడించి వైఎస్  పట్ల తన కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసుకున్నారు కూడా. అయాచితంగా లభించిన  ఈ బంగారు అవకాశానికి  తన  కుశాగ్రబుద్ధితో మరింత పదును పెట్టి  ఆ విషయంలో ఎంతో  దిట్ట అనిపించుకున్నారు.
 ఈ దిట్టతనమే కాంగ్రెస్  పార్టీ కేంద్ర అధినాయకుల కళ్ళల్లో పడేలా  చేసింది. అంగబలం, అర్ధబలం, సామాజిక బలం ఇసుమంత కూడాలేని ఉండవల్లిని రెండు పర్యాయాలు లోక్  సభకు కాంగ్రెస్  సభ్యుడిగా పంపింది. మొదటి గెలుపు గుడ్డేటు అని ఎద్దేవా  చేసిన వాళ్లకు ఆయన  రెండో గెలుపు కళ్ళు తెరిపిళ్ళు పడేలా చేసింది. రాజకీయం అన్నాక ప్రత్యర్ధులు  ఎట్లాగో వుంటారు. కాంగ్రెస్ వాళ్లకు ఇంటి పోరు అదనం. వాళ్ళు కూడా ఉండవల్లి నీతి, నిజాయితీల పట్ల నోరు మెదపరు. అటువంటి నేపధ్యం కలిగిన గళం వీరుడు  ఉండవల్లి  అరుణ్  కుమార్ ఇప్పుడు ఈ పుస్తకంతో కలం వీరుడిగా మారారు. అందుకే అయన రాసిన ఈ పుస్తకం పట్ల చాలామందికి అంత నమ్మకం. రాజకీయం కోసం కూడా ఆయన అబద్ధాలు రాయడు అనే ఆ  నమ్మకమే ఆయన రాసిన ‘విభజన కధ’ అనే పుస్తకం గురించి ఆవిష్కరణకు ముందే అంచనాలను పెంచింది. ‘మాట మార్చను, మడమ తిప్పను’ అంటుండే  వైఎస్ రాజశేఖరరెడ్డి  ఆప్తవర్గంలోని మనిషి కావడం వల్లనేమో ఆయనకూ తాను మాట మార్చను అనే ఓ నమ్మకం. పుస్తకం అట్ట వెనుక  అదే రాసుకున్నారు. 25-01-2013 రాజమండ్రి సభలో ‘విభజన బిల్లు పాసవ్వదు’ అని ఉండవల్లి  చెప్పారు. అప్పటినుంచి ఎక్కడ మాట్లాడినా ఇదే మాట. ఆఖరికి 18-02-2014 న బిల్లు  సభ ఆమోదం పొందిన తరువాత  కూడా ఆయన తీరులో మార్పు లేదు. కాకపొతే ‘బిల్లు పాసవ్వదు’ అనే పదం కాస్తా కొద్దిగా  మారి ‘బిల్లు పాసవ్వలేదు’ అనే రూపం సంతరించుకుంది. బిల్లు పాసు  కాకుండానే తెలంగాణా  ఏర్పడిందా! అదెలా సాధ్యం? అది  చెప్పడానికే ఈ పుస్తకం. అందుకే విభజన ‘కధ’ అనే పేరు పెట్టారేమో.    
వినే వాళ్లకి ఆయన వాదన విచిత్రంగా  తోచవచ్చు. కానీ  ఉండవల్లి  మాత్రం ఈ విషయంలో  ఉడుంపట్టుతో వున్నట్టు అనిపిస్తుంది, ఈ  పుస్తకం చదివిన తరువాత.
ఈ విషయంలో  ఆయనకు ఎంతో స్పష్టత ఉన్నట్టే వుంది. అయితే అదే సమయంలో ఆయన  మరో విషయంలో కూడా స్పష్టత ఇస్తున్నారు.
“బిల్లు పాసవలేదు అని చెప్పడం అంటే  ఇప్పుడు ఏర్పడ్డ  తెలంగాణాను వ్యతిరేకించడం కాదు. ఆనాడు చట్ట సభలో జరిగిన విషయాలను ప్రజల దృష్టికి  తీసుకువచ్చేందుకు, అప్పుడు చోటుచేసుకున్న పొరబాట్లను ఎత్తి చూపి మళ్ళీ  భవిష్యత్తులో అటువంటివి పునరావృతం కాకుండా వుండేందుకు మాత్రమే ఈ గ్రంథరచన” అని ఆయన చెప్పడం విశేషం.
రాష్ట్ర విభజనను ఆయన ఎంతగా వ్యతిరేకించింది అర్ధం చేసుకోవడానికి ఈ పుస్తకం అక్కరలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో తన వాదన వినిపించడానికి ఆయన కలవని మనిషి లేదు. ఆఖరికి  రాష్ట్రపతి ప్రణబ్  ముఖర్జీతో కూడా వాగ్వాదానికి దిగి అక్షింతలు వేయించుకున్నారు. విభజనను వ్యతిరేకించడంలో ఆయన అనుసరించిన కొన్ని పద్ధతులు మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడనే కితాబును కూడా కట్టబెత్తాయి. అయినా ఆయన తన ధోరణి మార్చుకోలేదు, ఈనాటికీ కూడా. మొండితనం మాదిరిగా కనిపించే ఈ నిజాయితీయే ఆయన్ని వ్యతిరేకించే వారిలో కూడా కొంత సానుభూతిని రగిలించింది.
ఆ రోజుల్లో  తాను డైరీలో రాసుకున్న విశేషాల ఆధారంగా ఆయన ఈ  పుస్తకం రాశారు. కొన్ని తేదీల వారీగా వున్నాయి. మరి కొన్ని తనకు సంబంధం లేని, అంటే తాను ప్రత్యక్షంగా లేని, చూడని సన్నివేశాలను, సంభాషణలను తన ఊహాశక్తితో  రచించారు. ఆయా వ్యక్తుల స్వభావాలను అర్ధం చేసుకున్న వ్యక్తిగా, వారు కొన్ని సందర్భాలలో  ఎలా, యేమని మాట్లాడుకుని వుంటారో ఊహించి రాయడం, అదీ జీవించి వున్న వ్యక్తుల విషయంలో ఇటువంటి ప్రయోగం చేయడం నిజంగా సాహసమే. ముఖ్యంగా విభజన  బిల్లు ఓటింగు విషయంలో స్పీకర్  ఛాంబర్లో జరిగిన సమావేశం. స్పీకర్, జైపాల్  రెడ్డి నడుమ జరిగిన సంభాషణ ఉండవల్లి కల్పనాశక్తికి చక్కని ఉదాహరణలు.  కొన్ని పేజీలకు విస్తరించిన ఈ సంభాషణల పర్వం ఈ పుస్తకానికి హైలైట్. ఉండవల్లి నిజంగానే పరకాయ ప్రవేశం చేసి రాశారా అన్నట్టుగా వుందా ఘట్టం. విషయ విస్తరణ భీతి వల్ల ఆ మొత్తం వ్యవహారాన్ని   యథాతధంగా పేర్కొనడానికి వీలుండదు కనుక, మచ్చుకు కొన్ని మాత్రమే ప్రస్తావించాల్సి వస్తోంది.  (ఒక స్థాయిలో రాజకీయాలు ఏ తీరుగా సాగుతాయో అనడానికి ఇవి తార్కాణం కూడా).
తాను లేని స్పీకర్  ఛాంబర్లో జై పాల్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని ఉండవల్లి  ఎలా ఊహించి రాశారో గమనించడానికి  ఓ ఉదాహరణ.
జైపాల్ రెడ్డి: (స్పీకర్ ను ఉద్దేశించి) – “కంగారు పడకమ్మా! ఫిఫ్టీ యియర్స్ ఇక్కడ. యాభయ్ ఏళ్ళ  ఎక్స్  పీరియన్స్ తో  చెబుతున్నా. నువ్వు అధ్యక్ష స్థానంలో కూర్చోగానే అకస్మాత్తుగా టీవీ  ప్రసారాలు ఆగిపోతాయి. అవి  బాగు చేసేలోగా బిల్లు పాసయిపోతుంది. కొత్త లోక సభ ఏర్పడి ఎంక్వయిరీ చేస్తారనే భయం అక్కరలేదు. యూపీఏ, కాకపొతే ఎన్డీయే. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ బిల్లు విషయం ఇంతటితో ముగిసిపోతుంది.
“కట్టేకాడ్ ప్రాంతంలో ఒక తెగ వాళ్ళు ఆడపిల్ల పుట్టగానే నోట్లో, ముక్కులో బియ్యం గింజలు వేసి చంపేస్తారు. తల్లీ తండ్రీ ఏకమై పసిగుడ్డును చిదిమేస్తే  ఎవరేం చేయగలరు. కంప్లైంట్ లేనప్పుడు విచారణ ఏమిటి? శిక్ష ఎక్కడ? 
“ఇంత దారుణమైన పోలిక తెస్తున్నందుకు బాధపడకండి. ఈ పార్లమెంటు కూడా ఆ తెగ లాంటిదే.
“తండ్రి లాంటి అధికారపక్షం, తల్లి లాంటి ప్రతిపక్షం కలిసి బిడ్డను చంపేయాలని అనుకుంటే స్పీకర్ ది మంత్రసాని పాత్రే అమ్మా!
“అంచేత మీ విధి మీరు నిర్వర్తించండి. మొదట్లో అదోలా అనిపించినా తర్వాత మీకే అనిపిస్తుంది ఇంత సులువా అని.
“ఆఖరి మాట. మీరేం తప్పు చేయడం లేదు. రూల్  ప్రకారం తలలు లెక్క  పెడుతున్నారు. ఎవరి సీట్లలో వాళ్ళు ఉంటేనే  లెక్కపెడతామని మధ్య మధ్యలో చెబుతూ వుండండి.
“....బిల్లు పాసయి రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని గురించి మాట్లాడేవాళ్ళు కానీ, అసలు ఆలోచించేవాళ్ళు కానీ ఉండనే ఉండరు.
“పదేళ్ళు ఉమ్మడి రాజధాని సరిపోదేమో అనుకుంటున్నారు. పది నెలల్లో రాజధాని మార్చేస్తామనకపొతే నన్నడగండి.
“నేను చెప్పిన దాంట్లో ఏదైనా కటువుగా, రాజ్యాంగ విరుద్ధంగా, అధర్మంగా మీకనిపిస్తే అది మీ అవగాహనాలోపమే తప్ప, నా ఆలోచనా అపరికత్వత మాత్రం కాదు.
“నేను చెప్పదలచుకున్నది ఇంతే!”
ఇలా చెప్పాల్సింది  నీళ్ళు నమలకుండా చెప్పేసి, జైపాల్ రెడ్డి  స్పీకర్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన తరువాత  టీ. కాంగ్రెస్ ఎంపీలతో ఆయన చెప్పిన మాటలు కూడా ఉండవల్లి ఊహాగానమే.  అది ఇలా సాగింది ఈ పుస్తకంలో:
“స్పీకర్  చాంబర్లో జరిగింది మరిచిపొండి. ఆ మాటలు నేను అనలేదు, మీరు వినలేదు. ధర్మ సంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. నేనూ అదే చేసాను. తెలంగాణా ఏర్పడడం తక్షణ అవసరంగా భావించే ఇలా ప్రవర్తించాను. నౌ ఆర్ నెవ్వర్. ఇప్పుడు అయితే అయినట్టు. లేకపోతే తెలంగాణా ఎప్పటికీ రాదు. నా  బాధ్యత నేను నిర్వర్తించాను. కేసీఆర్ పార్టీని కాంగ్రెస్  లో విలీనం చేయించడమే మీ బాధ్యత. ఆ పని చేయండి”
జైపాల్ రెడ్డి మాటల్ని ఊహించి రాసినట్టు ఉండవల్లి మరోమారు చెప్పుకొచ్చారు. జైపాల్ రెడ్డి  ఉపన్యాస శైలి తో పరిచయం వుండడం చేత, ఆఖరి గంటలో స్పీకర్ చాంబర్లో ఆయన ఎలా మాట్లాడి ఉంటారో ఊహించి రాసానని పేర్కొన్నారు.   
ఏతావాతా ఉండవల్లి ఈ పుస్తకం ద్వారా చెప్పదలచింది ఒక్కటే. రాష్ట్ర  విభజన జరిగిన తీరు నియమానుసారంగా లేదని. అనేక అధికారిక డాక్యుమెంట్లు, పార్లమెంటులో నమోదయిన పత్రాలు, రాజకీయ పార్టీల ఉత్తర ప్రత్యుత్తరాలు ఇలా అనేకం జోడించి ఈ గ్రంధానికి కొంత సాధికారత  కల్పించే ప్రయత్నం చేసారు. ఒక రిఫరెన్స్ పుస్తకంగా పనికొచ్చేట్టు కూడా రూపొందించారు. అదేసమయంలో, నేరుగా కాకపోయినా తెలంగాణా ఏర్పడడంలో టీఆర్ ఎస్ తో పాటు కాంగ్రెస్ కు కూడా పాత్ర వుందని పరోక్షంగా చెప్పే ప్రయత్నం ఇందులో కానవస్తుంది.
పుస్తకావిష్కరణ  సభలో మాట్లాడుతూ ఉండవల్లి చాలా ఉద్వేగంగా తన మనసుని విప్పి చెప్పారు. “సీమాంధ్రుల కాల్లో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పడం ద్వారా వారి మనసుల్లోని భయసందేహాలను కేసీఆర్ దూరం చేసారు” అంటూ ముక్తాయింపు ఇచ్చారు.  
అది నిజమే. ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలను ఓసారి మననం  చేసుకుంటే నిజమే అనిపిస్తుంది. లేకపోతె, విభజన బిల్లు ఆమోదం పొందలేదు అని నిర్ధారిస్తూ  నగరం నడిబొడ్డులో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం మామూలు విషయం  కాదు.
ఎందుకంటే,  రాష్ట్ర విభజన జరిగిపోయిందని తెలంగాణా జనం నమ్ముతున్నారు. ఎవరయినా నమ్మకపోయినా దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. శుభపరిణామం.

ఏదిఏమైనా, ఈ పుస్తకంలోని విషయాలతో ఏకీవభించినా లేకపోయినా, తెలుగు ప్రజల జీవితాలతో ముడిపడిన ఒక చారిత్రిక సందర్భానికి సంబంధించిన అనేక విషయాలకు అక్షర రూపం కల్పించడం శ్లాఘనీయం. అందుకు రచించిన ఉండవల్లి, ప్రచురించిన ఎమెస్కో విజయ కుమార్ అభినందనీయులు.   (20-09-2016)


16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

కాలం చెరపలేని సంగీత విదుషీమణి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి

ఈ వ్యాసానికి ప్రేరణ అయిన మితృలు ఆర్వీవీ కృష్ణారావు గారు ఈ ఏడాది మొదట్లో అనుకుంటాను, అమెరికా నుంచి వచ్చిన వారి అమ్మాయి కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్ళారు. కొండమీదకు కారులో వెడుతుంటే దారిలో పూర్ణకుంభం కూడలిలో వున్న ఓ విగ్రహాన్ని చూపించి అది ఎవరు తాతయ్యా అని అడిగాడు ఆయన మనుమడు. చేతిలో తంబుర ధరించి ఎంతో భక్తీ ప్రపత్తులతో తన గానంతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తున్నట్టు జీవకళ ఉట్టిపడుతున్న ఆ కాంస్య విగ్రహాన్ని చూసి మనుమడికి జవాబు ఇవ్వబోయే లోపు అక్కడి టాక్సీ డ్రైవరే చెప్పాడు , దేశం గర్వించే ఒక గొప్ప గాయకురాలు ఎం ఎస్ సుబ్బులక్ష్మి అని. సంవత్సరంలో మే 29 వతేదీన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ మహానుభావురాలికి ఒక స్మారక చిహ్నం ఏర్పాటుచేయడంలో తెలుగునేల వెనుకబడిలేదని, సంగీతం వంటి కళలు, కళాకారులను గౌరవించే విషయంలో ప్రాంతీయ, భాషా బేధాలకు తావులేదని నిరూపించారు.


(ఈ విగ్రహానికి సంబంధించి మరోప్రహసనం పత్రికల్లో వచ్చింది. ఓపదేళ్ళ తరువాత కాబోలు ప్రసిద్ధ గాయకుడు ఎస్.పీ. బాలసుబ్రమణ్యం దైవదర్శనం కోసం తిరుపతివెళ్ళారు. దారిలో ఆ కూడలిలోఆగి ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారికి శ్రద్ధాంజలి ఘటించారు. కళ వ్యాపారం కాకున్నా ప్రతిదీ వ్యాపారం అనుకునేవాళ్ళకు ఈసమాజంలో కొదవలేదు. ఆప్రసిద్ధ గాయకురాలి విగ్రహం చేతవున్న తంబురకు కేబుళ్ళు వేలాడుతున్నాయి. పదిమంది కంటపడుతుంది అనే భావనతో కాబోలు ఆవిగ్రహం కనబడకుండా హోర్డింగులు దాని చుట్టూ
గోడకట్టాయి.ఈ పరిస్తితిగమనించి ఎస్పీ కలత చెందారు. కన్నీరు పెట్టుకున్నారు. స్వాీమి దర్శనం చేసుకున్న వెంటనే ఆయనచేసిన మొదటిపని టీటీడీ అధికారులని కలిసి పిర్యాదుచేయడం. ఈవో సాంబశివరావుగారు వెంటనే స్పందించారు. సిబ్బందిని పంపి పరిస్తితిని చక్కదిద్దారు. ఎమ్మెస్ శత జయంతిని పురస్కరించుకుని విగ్రహంవున్న ఆకూడలిని సుందరంగా తీర్చిదిద్దారు.)
ఇక విషయానికి వస్తే-
ఈరోజు సెప్టెంబర్ పదహారు సుబ్బులక్ష్మి శతజయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సంగీతాభిమానిగా సుబ్బులక్ష్మి గారి గురించిన కొన్ని జ్ఞాపకాలని కృష్ణారావు గారు నెమరు వేసుకున్నారు.
కేంద్రప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారిగా రిటైరయిన కృష్ణారావుగారితో ఒక సహోద్యోగిగానే కాకుండా ఒక శ్రేయోభిలాషిగా కూడా నాకు కొన్ని దశాబ్దాల పరిచయం. బెజవాడలో చదువుకుంటున్నరోజులనుంచి ఆయనకు మొదలయిన ఈ సంగీతాభిమానం ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మరిన్ని మొగలు తొడిగింది. సంగీతం పట్ల యెంత అభిరుచి అంటే సంగీత సభల కోసం ఎంతో ఖర్చు పెట్టుకుని, ఉద్యోగానికి సెలవు పెట్టుకుని అనేక దూర ప్రాంతాలకు వెళ్ళేవారు. కృష్ణారావు గారింట్లో ఒక హెచ్.ఎం.వీ. గ్రామఫోన్ వుంది. చాలామంది ఇళ్ళల్లో కూడా చూశాను, దాన్ని ఒక అలంకరణ వస్తువుగా. కానీ ఆర్వీవీ గారింట్లో వున్న ఆ పాత గ్రామఫోన్ ఇప్పటికీ పనిచేస్తూ వుంది. కొలంబియా వారు తయారు చేసిన గ్రామఫోన్ ప్లేట్లు అనేకం వున్నాయి. సుబ్బులక్ష్మి గారి రికార్డు కూడా వుంది. ఒక వైపు ఆవిడ కళ్యాణి రాగంలో పడిన 'నీదు చరణములే...' అనే కీర్తన, రెండో వైపు 'బృహు ముకుందే..' కీర్తన వున్నాయి.

ఆ రికార్డులని పదేపదే వినడంలో కూడా ఆయనదే ఒక రికార్డు. సంగీతం పట్ల అభినివేశం కలగడానికి సుబ్బులక్ష్మి గారు పాడిన ఆ కీర్తనలే కారణం అంటారు కృష్ణారావు గారు.

ఆయన బెజవాడలో పనిచేస్తున్నప్పుడు దగ్గరలో తెనాలికిసుబ్బులక్ష్మి గారు వస్తున్న కబురు అందింది.

తెనాలిలో నారుమంచి సుబ్బారావు గారనే మరో సంగీత అభిమాని వున్నారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద సీతారామ గాన సభను నడుపుతుండే వారు.
బెజవాడలో కృష్ణారావు గారు కూడా త్యాగరాజ సంగీత కళాసమితి అనే పేరుతొ ఒక సంగీత సభ నిర్వహించేవారు. ఎలాగైనా బెజవాడలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి సంగీత కచేరీ పెట్టించాలన్నది ఆ సభవారి కోరిక.
ఆయనా, మోహన రావుగారనే మరో సంగీత అభిమాని కలిసి రెక్కలు కట్టుకుని తెనాలిలో వాలిపోయారు.కచేరీ మొదలు కావడానికి ముందే సుబ్బారావు గారిని కలుసుకుని తమ మనసులో మాట ఆయన చెవిన వేసారు. కనుక్కుని చెబుతా అని ఆయన మాట ఇచ్చారు. లోపల ఎమ్మెస్ సుబ్బులక్ష్మి తన బృందంతో కలిసి కచ్చేరీకి సిద్ధం అవుతున్నారు. ఏదో మొక్కుబడిగా కాకుండా కచేరీ చేయడంలో ఆవిడగారికి వున్న నిబద్దతత అలాంటిది మరి. కచేరీ అయిన తరువాత ఎమ్మెస్ వారిని కలుసుకుని మాట్లాడారు. తనను ఇంతకు ముందే సౌందర రాజన్ అనే పెద్దమనిషి కలిసి బెజవాడ కచేరీ గురించి సంప్రదించారని, ఆయనకు మాట ఇవ్వడం వల్ల మీ మాట మన్నించలేక పోతున్నాననీ ఆవిడ ఎంతో నమ్రతగా, నొచ్చుకుంటూ చెప్పిన తీరు వారిని కదిలించింది. ఏ సభ వారు పిలిస్తే ఏమిటి, ఆవిడ బెజవాడలో కచేరీ చేయబోతున్నారు అదే పదివేలనుకుని వీళ్ళు బెజవాడ తిరిగి వెళ్ళారు.

బెజవాడలో కచేరీ చాలా గొప్పగా జరిగింది. గవర్నర్ పేట, రాజగోపాలచారి వీధిలో మా బావగారు, సీనియర్ వకీలు తుర్లపాటి హనుమంత రావు గారు చాలాకాలం నివసించిన ఇంటి ఎదురుగా ఒక పెద్ద శ్వేత సౌధం వుండేది. చక్రవర్తి అనే లాయరు గారిది. ఆ భవనంలోనే సుబ్బులక్ష్మి గారి విడిది చేసారని చెప్పారు కృష్ణారావు గారు.

తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదిక. హాలు కిటకిట లాడింది. బెజవాడలో సంగీత శ్రేష్ఠులు అయిన వారంతా మొదటి వరుసలో వున్నారు. అన్నవరపు రామస్వామి, దండమూడి రామ్మోహన్ రావు, ఓలేటి వెంకటేశ్వర్లు, ఎన్.సి. హెచ్. కృష్ణమాచార్యులు,మల్లిక్ మొదలయిన వాళ్ళు ఎమ్మెస్ వేదిక మీదకి రాగానే వారంతా లేచి గౌరవపురస్సరంగా నిలబడి అభివాదం చేశారు.

ఆవిడ చేతులు జోడించి వారందరికీ నమస్కారాలు చేసి కచేరీకి సిద్ధం అవుతూ వేదిక మీద నుంచే కనక దుర్గ గుడి దిశగా ఓ నమస్కారం పెట్టి కచేరీ మొదలు పెట్టారు. ప్రేక్షకుల్లో కృష్ణారావు గారు ఒడిలో టేప్ రికార్డర్ పెట్టుకుని సిద్ధంగా వున్నారు.దక్షిణామూర్తి శ్లోకంతో ప్రారంభించి, ఏకబిగిన మూడుగంటలు కూర్చున్న భంగిమ మార్చకుండా కచేరీ ఇచ్చారు. సభికులూ అంతే. పారవశ్యం తప్ప మరో కదలిక లేదు. ముందు కూర్చున్న సంగీతకారులను, వెనుక వరసల్లో వున్న సాధారణ సంగీత అభిమానులను ఆవిడ ఒకే స్థాయిలో అలరింప చేశారు.


సుబ్బులక్ష్మి గారిలోని మరో ఉత్కృష్ట కోణాన్ని తెలుసుకునే అవకాశం ఆయనకు చెన్నై లో దొరికింది. మద్రాసు మ్యూజిక్ అకాడమీ నిర్వహించే కార్యక్రమం. ఆరోజు కచేరీ చేయాల్సిన సంగీత విద్వాంసుడు వేదిక మీదకు రాగానే ముందు వరసలో కూర్చున్న వ్యక్తికి అభివాదం చేయడం వెనుక వరసలో కూర్చున్న ఆర్వీవీ గమనించారు. సంగీత కళానిధి బిరుదు పొందిన ఆ విద్వాంసుడు నమస్కరించింది ఎవరికో కాదు, సభ మొదలు కావడానికి ముందుగానే వచ్చి కూర్చున్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారికి. తోటి కళాకారులని గౌరవించే సమున్నత వ్యక్తిత్వం ఆవిడకే సొంతం.

14, సెప్టెంబర్ 2016, బుధవారం

పోలవరం ! వరమా! శాపమా !!



(రెండేళ్ళ క్రితం రాసింది)

దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు మాదిరిగా నడుస్తోంది పోలవరం కధ. ఈ పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కంచికి చేరని కధలా సాగిపోతోంది. బాలారిష్టాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. రెండు మూడేళ్ళలో ఒక కొలిక్కి వస్తుందని సర్కారు ధీమాగా చెబుతున్నా, ఈ ప్రాజెక్ట్ వాస్తవరూపం దాల్చడానికి ఏండ్లూ పూండ్లూ పట్టేట్టు వుంది.
దేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941 జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్ మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. ఆరోజుల్లో మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ కు నామకరణం కూడా చేశారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న భద్రాచలం సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు, పోలవరం కుడి గట్టు కాల్వని, కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం 2004 కల్లా ఎనిమిదివేల ఆరువందల కోట్లకు పెరిగిపోయింది. 1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న పోలవరానికి, వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం వున్న ఆయకట్టు స్థిరీకరణతో సహా సేద్యపు నీటి సౌకర్యం కల్పించడం ప్రాజెక్ట్ లక్ష్యం. పోలవరం నుంచి మళ్లించిన గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ప్రకాశం బరాజ్ ఎగువన కొత్తగా మరో బరాజ్ నిర్మించడం కూడా ఈ పధకంలో ఓ భాగం. ఇందువల్ల హైదరాబాదు నుండి తొమ్మిదో నెంబరు (ఈ నెంబరు మారినట్టువుంది) జాతీయ రహదారిలో ప్రయాణించే వారు విజయవాడ వరకు పోకుండానే ఆ బరాజ్ పైనుంచి గుంటూరు జిల్లాకు చేరడానికి వీలుపడుతుంది. ఇవీ ఈ ప్రాజెక్ట్ వల్ల అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కానీ, విభజన అనంతరం ఏర్పడ్డ కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వొనగూడే ప్రయోజనాలు. కొద్దో గొప్పో తెలంగాణాలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు కూడా ప్రయోజనం వుంటుంది.
అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా గోదావరి నదులే ప్రధాన సేద్యపు నీటివనరులు. ఇందులో కృష్ణానది నుంచి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. పోతే, గోదావరిలో మిగులు జలాలు ఎక్కువ. ఏటా కొన్ని వందల వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళించడం ద్వారా కృష్ణానదీ జలాలను వాటి అవసరం ఎక్కువగా వున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడం సాధ్య పడుతుంది. ఈ కోణంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే పోలవరం. అసలు ఏ సేద్యపు నీటి ప్రాజెక్ట్ అయినా కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందించడం లక్ష్యంగా రూపుదిద్దుకుంటుంది. కానీ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా సరఫరా అయ్యే జలాలు ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో వున్న ఆయకట్టు స్థిరీకరణకు మాత్రమే ప్రధానంగా ఉపయోగపడతాయి. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల మునకకు గురయ్యే ప్రాంతాలు మాత్రం తెలంగాణలో వున్నాయి. వాటిల్లో చాలావరకు ఆదివాసీలు నివసించే ప్రదేశాలు. ప్రధానమైన అడ్డంకి ఇదే.
రాష్ట్రంలో పలు జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ ప్రాజెక్ట్ కు కొన్ని సహజ సిద్ధమైన బాలారిష్టాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల సుమారు రెండువందల డెబ్బయ్ ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయి. దాదాపు నలభయ్ వేల పైచిలుకు కుటుంబాలవారు నిరాశ్రయులవుతారు. వారికి పునరావాసం కల్పించాల్సి వుంటుంది. ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఈ తిప్పలు తప్పవు. కానీ పోలవరం వల్ల నిరాశ్రయులయ్యేవారిలో సగం మంది అక్కడి నేలను, అడివినీ నమ్ముకున్న షెడ్యూల్ల్ తెగలవారు కావడం గమనార్హం. దీనికితోడు ఈ ప్రాజక్ట్ తలపెట్టినప్పుడు రాష్ట్రం ఒకటిగా వుంది. తరువాత రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సమయంలో కూడా పోలవరం అంశం ప్రధాన అవరోధంగా నిలిచింది. ప్రాజెక్ట్ ఒక రాష్ట్రంలో, ముంపుకు గురయ్యే ప్రాంతాలు మరో రాష్ట్రంలో వుండే విచిత్ర పరిస్తితి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు విభజన నిర్ణయం తీసుకున్న నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణాలోని అనేక గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ కు బదలాయించే ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఆఖరి క్షణంలో ప్రయత్నించినా అది కుదరలేదు. ఆ తరువాత వచ్చిన మోడీ నాయకత్వంలోని ఎండీయే సర్కారు ఆ ఆర్డినెన్సు తీసుకురావడమే కాకుండా దాన్ని లోకసభలో ఆమోదింపచేసుకోవడంతో తెలంగాణా ప్రాంతంలో అగ్గి రాజుకుంది. పోలవరం డిజైన్ మార్చాలని, తద్వారా ముంపుకు గురయ్యే ప్రాంతాల విస్తీర్ణం తగ్గేలా చూడాలని మొదటి నుంచి పట్టుబడుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులకు కేంద్రం వైఖరి మింగుడు పడలేదు. పోలవరం బిల్లుకు నిరసనగా తెలంగాణా జేయేసీ ఇచ్చిన పిలుపుకు పాలక పక్షం అయిన టీఆర్ఎస్ మద్దతు పలికింది. 1956 నుంచి తెలంగాణలో భాగంగా వున్న ప్రాంతాలను పొరుగు రాష్ట్రంలో కలపడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పొరుగునవున్న ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజక్ట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల తమ రాష్ట్రాల్లో భూములు విస్తారంగా మునకకు గురవుతాయని, మునుపటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణంతో ముందుకు పోతోందని ఆరొపిస్తూ ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు గతంలోనే సుప్రీం కోర్టులో కేసు వేశాయి.
పోలవరం ప్రాజెక్ట్ పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో వున్నట్టు కానవస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో దీన్ని జాతీయ ప్రాజక్ట్ గా చేపట్టి పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు. మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా దీని వూసు లేదు. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.
ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వరంగా మారుతుంది. ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా పూర్తి చేస్తే దానివల్ల ఆట్టే లాభం లేని తెలంగాణా రాష్ట్రంలోని అనేక లక్షలమంది సాధారణ ప్రజల జీవనం అతలాకుతలమవుతుంది.
రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారిన ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా, అనుకున్న వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే. ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం అంచనాలకు మించి పెరిగిపోవడం మాత్రం ఖాయం. (12-07-2014)

8, సెప్టెంబర్ 2016, గురువారం

నవ్వుకుందాం రండి



“నేనొక లక్ష రూపాయలు కన్నయ్య లాల్ కి ఇద్దామని అనుకుంటున్నాను. మరి మీ సంగతి ఏమిటి”
అంటూ భార్యాబిడ్డల వైపు చూశాడు ఏకాంబరం.
అతగాడు ఏమంటున్నాడో వాళ్లకు ఓ పట్టాన అర్ధం కాక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు. ఈనెల ఇంటి అద్దే ఇంకా కట్టలేదు. లక్ష రూపాయలుట,  ఎవడో ముక్కూ మొహం తెలియని వాడికి ఇస్తాను అంటున్నాడు అంటే అర్ధం ఏమిటి? పైగా మీ సంగతేమిటి అంటూ నొక్కుళ్ళు కూడా.
భార్యాపిల్లలకు తాను  చెబుతున్నది అర్ధం కాకపోగా ఏవేవో ఊహించుకుంటూ అపార్ధాల సీనులోకి వెళ్లి పోతున్నారని అర్ధం చేసుకున్న ఏకాంబరం విలాసంగా ఓ నవ్వు నవ్వి అప్పటివరకు చదువుతున్న దిన పత్రికను వారి వైపు విసిరాడు.

అందులో ఇలా వుంది.
“రూ. 15 లక్షల హామీపై సమాధానమివ్వనున్న పీఎంవో. ఈనాడు,దిల్లీ: విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని స్వదేశానికి రప్పించి ప్రతి ఒక్క భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ. లక్షల చొప్పున జమచేస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానంపై సమాధానం ఇచ్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సన్నద్దమవుతోంది. రాజస్థాన్  కు చెందిన కన్నయ్య లాల్ అనే దరఖాస్తుదారుడు పెట్టుకున్న అర్జీపై కేంద్ర సమాచార కమీషన్ స్పందించింది. మోదీ ప్రధాన మంత్రి అయి రెండేళ్ళు గడిచినందువల్ల ఆ హామీకి ఏమయిందో తెలపాలనీ, తన ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో చెప్పాలనీ కన్నయ్య లాల్  కోరాడు”

ఆ వార్తలో ఇంకా ఏదేదో రాశారు కానీ, ఏకాంబరం వున్నట్టుండి కన్నయ్య లాల్  ప్రసక్తి ఎందుకు  తెచ్చాడో అర్ధం అయి హాయిగా నవ్వుకున్నారు.               

2, సెప్టెంబర్ 2016, శుక్రవారం

మరపురాని మనీషి వైఎస్ఆర్

ఈరోజు  వైఎస్ఆర్ వర్ధంతి

(PUBLISHED IN SAKSHI TELUGU DAILY ON 02-09- 2016, FRIDAY)
 “కాంతమ్మకు కాళ్ళూచేతులూ ఆడడం లేదు. మూడేళ్ళ పిల్ల వున్నట్టుండి కాళ్ళూచేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది. సమయానికి మొగుడు కూడా ఊళ్ళో లేదు. టైము చూస్తె అర్ధరాత్రి. పొరుగూరుకు వెడితే కానీ డాక్టరు దొరకడు. దిక్కుతోచని కాంతమ్మకు ఏం చేయాలో తోచడం లేదు”
“రామనాధానికి సర్కారు మీద చెప్పరాని కోపం వస్తోంది. కూతురు, అల్లుడు పండక్కి వచ్చారు. ఒక్కగానొక్క  మనవాడికి వొళ్ళు కాలిపోయే జ్వరం.  వూళ్ళో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉందన్న మాటే కానీ, డాక్టరు ఎప్పుడూ కంటికి కనిపించడు. మిగిలిన సిబ్బంది అందించే సేవలు అంతంతమాత్రమే. మందులు మచ్చుకు కూడా దొరకవు. ఆందోళనలో వున్న రామనాధం, వాకబు చేస్తే అలవాటయిన జవాబే వచ్చింది.  డాక్టరూ లేడు, సిబ్బందీ లేరు. దూరాన వున్న బస్తీకి టాక్సీ కారులో తీసుకువెళ్ళి వైద్యం చేయించాల్సి వచ్చింది. నానా హైరానా పడిన రామనాధానికి కోపం రాకుండా ఉంటుందా? కానీ ఎవరి మీద  చూపించాలి కోపం? ఎవరిమీద పిర్యాదు చేయాలి పాపం?”
“వెంకటరావు వుంటున్న వూరు ఒకమోస్తరుగా పెద్దదే. అక్కడ పెద్ద ఆసుపత్రులతో పాటు పెద్ద పెద్ద డాక్టర్లూ  వున్నారు. భార్యకి గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే,  పెద్ద డాక్టరు వద్దకి వెళ్లి, పెద్ద ఫీజులు చెల్లించి పెద్ద వైద్యమే చేయించాడు. కాస్త నెమ్మదించిన తరువాత ఆ పెద్ద డాక్టరు రాసిచ్చిన పెద్ద మందుల జాబితాలో కొన్ని ఆ వూళ్ళో ఎన్ని మందుల దుకాణాలు గాలించినా దొరకలేదు. దొరికే షాపు ఎక్కడ వుందో తెలియక తల పట్టుకున్నాడు వెంకటరావు.”
“జోగయ్యకు వున్నట్టుండి భరించలేని కడుపు నొప్పి పట్టుకుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళారు. అదృష్టం డాక్టరు వున్నాడు. వెంటనే  ఎక్సరే తీయించాలని అన్నారు. ఇంకో అదృష్టం అక్కడ ఎక్సరే యంత్రం వుంది. దురదృష్టం కూడా వెంటే వుంది. ఎక్సరే తీయాల్సిన టెక్నీషియన్  లేడు. పొరుగూరికి బస్సులో తీసుకువెళ్ళారు. దురదృష్టం అక్కడ కూడా  కాచుకుని వుంది. కరెంటు లేదు. ఎప్పుడు వస్తుందో తెలవదు. పూటంతా తిరిగినా పూట కూలీ పోయింది కానీ అవసరమైన వైద్యం మాత్రం దొరకలేదు. “ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి”
“మూర్తికీ, సైలజకూ కొత్తగా పెళ్లయింది. కొత్తగా కొన్న కారులో హానీమూన్  కి వెళ్లి వస్తుంటే దోవలో అడవిలాంటి చోట కారు ఆగిపోయింది.  దానికితోడు వర్షం. దగ్గరలో ఓ చిన్న టీ పాక కనిపిస్తే వెళ్ళారు. డ్రైవరు  కారు రిపేరు పూర్తిచేసే లోగా, తాగిన టీ వికటించిందో ఏమో మూర్తికి వాంతులు మొదలయ్యాయి. మనిషి  డీలా పడ్డాడు. కొత్త  పెళ్లి కూతురికి భయంతో దిగ చెమటలు పట్టాయి. ఏం చెయ్యాలో తెలియక విలపించడం మొదలు పెట్టింది”
ఇలాంటి కాంతమ్మలు, రామనాధాలు, వెంకట రావులు, జోగయ్యలు,  మూర్తులు, శైలజలు ఇంకా ఎందరో వున్నారు. అందరిదీ ఒకటే సమస్య. “ఏం చెయ్యాలి”
ఆనాడు ముఖ్యమంత్రిగా వున్న, స్వయంగా డాక్టరు అయిన వై ఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ఈ ప్రశ్న వేసుకున్నారు. అధికారులతో, సంబంధిత వైద్య నిపుణులతో మాట్లాడారు. సమాధానం అన్వేషించారు. ఫలితంగా రూపు దిద్దుకున్నవే   108, 104, ఆరోగ్య శ్రీ.
104 నెంబరుకు ఫోను చేయగానే ఆ కాల్  సెంటరులో సిబ్బంది రేయింబవళ్ళు అందుబాటులో వుంటారు. సమస్య చెప్పగానే దాని తీవ్రతను బట్టి డాక్టరుతో మాట్లాడిస్తారు. లక్షణాలను బేరీజు వేసుకున్న వైద్యుడు రోగనిర్ధారణ చేసి  రోగి పరిస్తితిని బట్టి సూచనలు చేస్తారు. కొన్ని లక్షణాలు చిన్న చిట్కాలతో తగ్గిపోతాయి. కొన్నింటికి చికిత్స అవసరమవుతుంది. ఇవి నిర్దారించగలిగింది, సలహా  ఇవ్వగలిగిందీ డాక్టరు మాత్రమే. అర్ధరాత్రి అపరాత్రి వైద్యుడిని సంప్రదించగల అవకాశం కల్పించడమే కాల్  సెంటరు ధ్యేయం. ఏ వూళ్ళో డాక్టరు వుంది, లేదా సెలవులో వుంది, ఎక్కడ రోగ నిర్ధారణ పరికరాలు పనిచేస్తున్నాయి, ఎక్కడ పనిచేయడం లేదు, దగ్గరలో ఆ సదుపాయం ఎక్కడ వుంది, ఎక్కడ కరెంటు వుంది, ఎక్కడ ఏ సమయంలో వుండదు (కోతల సమయాలు గురించిన సమాచారం సంబంధిత విభాగాలనుంచి సేకరించి సిద్ధంగా ఉంచుకుంటారు) ఇటువంటి విషయాలు గురించి అడిగిన వారికి ముందే తెలియచేస్తారు కాబట్టి రోగి తాలూకు వారి  మనసుల్లో ఆందోళన సమసి పోతుంది. అనవసరంగా సమయం  వృధా చేసుకునే అవసరం, అక్కడకూ ఇక్కడకూ తిరిగే ప్రయాస కూడా  వుండవు.
రోగి పరిస్తితి బాగా లేదనుకుంటే 104 కాల్ సెంటరు వాళ్ళే ఆ విషయాన్నీ 108 కి తెలియచేస్తారు. అంబులెన్సు నిమిషాల్లో వచ్చి రోగిని ఆసుపత్రికి చేరవేస్తుంది. అప్పటి నుంచి ఆరోగ్య శ్రీ ఆదుకుంటుంది. యెంత ఖరీదయిన వైద్యం చేయాల్సివచ్చినా అదే రక్షణ కవచంలా, సంజీవనిలా అభయ హస్తం అందిస్తుంది.
మరోపక్క, సంచార వాహనాలు నెల నెలా ఒక నిర్దిష్ట దినం నాడు ఊళ్లకు వెళ్లి పరీక్షలు చేసి, అవసరమైన  మందులు ఇస్తాయి. ఆ విధంగా బీపీ,  చక్కర వంటి వ్యాధులు  ప్రాణాంతకంగా పరిణమించకుండా కట్టడి చేయడానికి వీలుపడుతుంది.   
పైగా ఇవన్నీ పూర్తిగా ఉచితం.
వై ఎస్ హయాములో అందుబాటులోకి వచ్చిన ఈ పధకాలు కొన్ని పూర్తిగా, కొన్ని అరకొరగా అమలు జరిగాయి. పూర్తిగా అమలు అయిన పధకాల్లో కొందరు స్వార్ధపరుల మూలంగా కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నాయి. అధికారుల అలసత్వం కారణంగా మరికొన్ని సంపూర్ణ ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఈ లోగా ఈ  పధకాలకు రూప కల్పన చేసిన మనిషే అంతర్ధానం అయిపోయారు. ఆయన అనుకున్నట్టు ఇవి రూపుదాల్చి వుంటే వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించి సమాజంలో అన్ని వర్గాలకు చక్కని ప్రయోజనం దక్కి వుండేది.
నాకు బాగా గుర్తుంది. అవి 2004 లో మొదటిసారి వై ఎస్  ముఖ్యమంత్రిగా పరిపాలనా పగ్గాలు చేపట్టిన రోజులు. పార్టీల కార్యకర్తలు, అభిమానుల సంగతి తెలవదు కానీ చదువుకున్న కొందరిలో ఆయన పట్ల ఓ రకమైన వైమనస్యభావం వుండేది. నలుగురి నడుమ  సంభాషణల్లో అది కొట్టవచ్చినట్టు కనబడేది కూడా. మా బంధువర్గంలో ఒకాయనకు వై ఎస్ అంటే గిట్టేది కాదు. ఆయన బాగా  చదువుకున్నాడు, పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేసాడు. వూరికి దూరంగా పెద్ద ఇల్లే కట్టుకున్నాడు. పిల్లలు పెద్దయి రెక్కలొచ్చి విదేశాల్లో స్థిరపడ్డా ఆయన మాత్రం భార్యతో ఆ ఇంట్లో ఉంటూ  రోజులు వెళ్లబుచ్చుతున్న సమయంలో ఆయనకో పెద్ద కష్టం వచ్చిపడింది.  ఓ అర్ధరాత్రి భార్యకు గుండె పోటువచ్చి విలావిలా కొట్టుకుంటోంది. ఆయనగారికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఇంట్లో కారు వుంది కాని ఆ సమయంలో డ్రైవర్  లేడు. తనకు డ్రైవింగు  రాదు. ఇరుగూ పొరుగూ వున్నా పట్టించుకునే తత్వం లేదు. జరూరుగా ఆసుపత్రికి తీసుకుకు వెళ్ళాలి.  ఆటోలు దొరికే  ప్రాంతం కాదు. ఎందుకో ఏమిటో  కాని ఆ సమయంలో ఆయనకు, వై ఎస్ బహిరంగసభల్లో ‘కుయ్ కుయ్’ అంటూ 108  అంబులెన్సు గురించి చెప్పే  మాట గుర్తుకువచ్చి ఫోను చేసాడు. ఆశ్చర్యం ఆ అర్ధరాత్రివేళ పదంటే పదే నిమిషాల్లో అంబులెన్సు వచ్చి, ఈ నిమిషమో, మరు నిమిషమో అనే పరిస్తితిలో వున్న ఆయన భార్యను నిమిషాల వ్యవధిలో ఆసుపత్రికి చేర్చింది. సకాలంలో,  అమృత ఘడియలలో తీసుకువచ్చినందువల్ల  ఆమె ప్రాణాలు కాపాడగలిగామని ఆ తరువాత డాక్టర్లు చెప్పడంతో వై ఎస్ పట్ల అప్పటివరకు ఆయన పెంచుకున్న అకారణ నిరసన  భావం అదృశ్యమై పోయింది. దాని స్థానంలో ఆరాధనాభావం  చోటుచేసుకుంది.
నాకు తెలిసి ఇటువంటి సందర్భం ఒక్కటే కావచ్చు. కానీ నిజానికి    ఇలాంటి వాళ్ళు ఎందరో! ఇటువంటి సందర్భాలు ఎన్నో!
అటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుని బయటపడ్డ జనాలు నిత్యం తలచుకునే ఆ మనిషి పోయి ఏడేళ్ళయింది. అయినా నేటికీ ఎక్కడ 108 అంబులెన్సు ‘కుయ్ కుయ్’ అంటూ వెడుతున్నా వెంటనే గుర్తుకు వచ్చేది వైయస్సారే!  
ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఆయన హయాములో రూపుదిద్దుకున్న పధకాలు 108, 104, ఆరోగ్యశ్రీ. వైఎస్ కలలు కన్నవిధంగా ఈ మూడు పధకాలు  సంపూర్ణంగా ఆచరణలోకి వచ్చి వుంటే పరిస్తితి ఎలా వుండేదో రాజకీయాలకు అతీతంగా  చెప్పడమే ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
పధకాల ఉద్దేశ్యం మంచిదయినప్పుడు, అవి పదిమందికి మంచి చేస్తాయి అని గురి కుదిరినప్పుడు, వాటిని మంచిగా అమలుచేయడమే మంచి ప్రభుత్వాలకు మంచి చేస్తుంది.  (01-02-2016)