24, సెప్టెంబర్ 2016, శనివారం

నగరానికి ఏమైంది! ఎవరు ఇందుకు కారణం?


రెండు తెలుగు రాష్ట్రాల పట్ల వరుణుడు ‘సమన్యాయం’ చూపిస్తున్నట్టు వుంది. మొన్నమొన్నటి వరకు చినుకుకోసం ఎదురుచూపులు. ఇప్పుడు  ఆ మాట  వింటేనే ఒణుకు. ఒకే దృశ్యాన్ని టీవీల్లో పదేపదే చూపిస్తూ వుండడం వల్ల కాబోలు, పరిస్తితి వున్నదానికంటే భయంకరంగా కానవస్తోంది. మళ్ళీ కొన్నాళ్ళు వానలు తప్పవనీ, కొన్ని చోట్ల కుంభ వృష్టి కురుస్తుందనీ వస్తున్న వార్తలు జనం గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పరిస్తితి అదుపులోనే వుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. సరే! ఈ పరిస్తితిని  ఇలానే వుంచి, కాసేపు టైం మిషన్ లో కొన్నేళ్ళు వెనక్కి వెళ్లి వద్దాము.
1975 వ సంవత్సరం.
రేడియోలో విలేకరి  ఉద్యోగంలో చేరడానికి హైదరాబాదు వచ్చాను. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద  నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.
నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను. పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దగ్గర అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే ఒంటరిగా నిలబడి వుంది. అది  దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. దానికి చివర్లో పెద్ద లోయ. అందులో నిండుకుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.
ఇప్పుడా లోయాలేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల కాలనీ, లోయని పూడ్చేసి  సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని  ప్రభుత్వాలను, ప్రజలను  శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు. అవీ ప్రభుత్వం వారికి కారు చౌకగా ఇచ్చిన స్థలాల్లో.
హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో  అన్ని చెరువులూ  మంత్రం వేసినట్టు మాయమయిపోయాయి. వాటిల్లో చిన్నవాళ్ళు కట్టుకున్న  చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, వున్నవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి.   హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.
గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. సరే ఇప్పుడంటే వానల పుణ్యమా అని నీళ్ళు  నిండాయి. నిన్న మొన్నటి వరకు రాళ్ళు తేలి, నీళ్ళు లేని చెరువు గర్భమే కానవచ్చెది.  
గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దయిన హైదరాబాదు నగరం దృశ్యాలను టీవీల్లో చూస్తుంటే ఈ  వెనుకటి జ్ఞాపకాలు మనసులో తిరిగాయి. అలాగే నిరుడు డిసెంబరులో చెన్నై కంటినీరు కళ్ళలో మెదిలింది.
 తెలుగు రాష్ట్రాలకు పొరుగున వున్న తమిళనాడు రాజధాని చెన్నై నగరం  వరుస వర్షాలకు కుదేలయిపోయింది. పక్కనే వున్న సముద్రంలోని నీళ్లన్నీ వాన రూపంలో నగరాన్ని యావత్తు ముంచెత్తి వేశాయా అన్నట్టు చెన్నపట్నం తల్లడిల్లి పోయింది. వందేళ్ళ కాలంలో ఇలాటి పెనువృష్టిని చూసి ఎరగమంటూ అప్పుడు లెక్కలు చెప్పారు. టీవీ తెరలపై అక్కడి దృశ్యాలను చూసిన వారికి  అది నిజమే అనిపించింది.
ఈ భీకర వృష్టి, దాని భయంకర ఫలితం మానవ తప్పిదం కాదు. ఇవి ప్రకృతి ఉత్పాతాలు. ఇలాటివి జరిగినప్పుడు, వాటి ఉధృతిని గమనించినప్పుడు ప్రకృతి ప్రతాపం ముందు తను యెంత అల్పుడన్నది మనిషికి తెలిసి రావాలి. కానీ ఈ గుణపాఠం నేర్చుకుంటున్న దాఖలాలు లేవు.
ప్రభుత్వాలు కల్పించుకుని యెంత సాయం అందించినా ఇంతటి విపత్తులు వాటిల్లినపుడు అవి అరకొరగానే అనిపించడం సహజం.
ఇలాటి వాటి గురించి వింటున్నప్పుడు, చేస్తున్నది సరే, ఇంతకంటే మించి చేయలేమా అనిపిస్తోంది. నిజమే.  వరదలు, భూకంపాలు, తుపానులు, సునామీలు, కరవులు వీటన్నిటినీ సమర్ధవంతంగా ఎదుర్కోవడం మనిషి శక్తికి మించిన పని. ఉపశమన కార్యక్రమాలు మినహా వాటి పరిణామాలనుంచి, పర్యవసానాలనుంచి  పూర్తిగా బయట పడడం అసాధ్యం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విషయం మరిచి పోకూడదు. ఉత్పాతాలు, ఉపద్రవాలు ప్రకృతి ప్రసాదం కావచ్చు. కానీ వాటి పర్యవసానాలు, దుష్పరిణామాల స్థాయి, ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరడం అన్నది మాత్రం మనిషి పుణ్యమే. అతగాడి స్వయంకృతాపరాధమే.  ఇక్కడ మనుషులంటే చెన్నై నగర పౌరులే  కారు. అధికారగణం. వారిని శాసించే రాజకీయ శక్తుల సమూహం కూడా.
బ్రిటిష్ వారి  కాలంనుంచి ప్రఖ్యాత నగరంగా విలసిల్లిన చెన్నపట్నం, అభివృద్ధి పేరుతొ విచ్చలవిడిగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్ధపు ఆలోచనలకు బలయిపోయింది. ప్రణాళికా బద్ధంగా సాగాల్సిన భవననిర్మాణాలు, రాజకీయ పార్టీల వత్తాసుతో, అధికారుల కుమ్మక్కుతో నిబంధనలకు మంగళం పాడాయి. వరద నీరు, మురుగు నీరు సులభంగా పారాల్సిన  ప్రాంతాలన్నీ అక్రమార్కుల ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. కూమ్, అడయార్ వంటి నదులు ఆక్రమణల కారణంగా కుంచించుకు పోయి మురికి నీటి కాసారాలుగా తయారయ్యాయి. అనుకోని వరదలు వచ్చినప్పుడు పొంగి పొరలకుండా అడ్డుకునే కరకట్టలు కలికానికి కూడా కానరాకుండా పోయాయి. ఏతావాతా ఇదిగో చెన్నైలో నిరుడు జరిగింది అదే! ఇప్పుడు  హైదరాబాదులో  జరుగుతోందీ అదే!
చెన్నైలోనే కాదు, హైదరాబాదులోనే కాదు  అన్ని రాష్ట్రాలలోను, అన్ని నగరాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్తితి. రెండువేల సంవత్సరంలో హైదరాబాదులో పడ్డ వర్షాలకు ట్యాంక్ బండ్ పొంగిపొరలి వచ్చిన   వరదలు, సృష్టించిన భయంకర పరిస్తితులు దరిమిలా  రాష్ట్రాన్ని  పాలించిన ఏలికలు  మరచిపోయారేమో కానీ ఆ చేదు అనుభవాలు, అనుభవించిన  జనాలకు మాత్రం ఇంకా జ్ఞాపకం వున్నాయి. అక్రమ నిర్మాణాలు తొలగించి ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం  కనుగొంటామని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. నిజానికి కావాల్సింది ఇదే. అయితే ఇటువంటి   నిర్మాణాలు అరికట్టాలంటే  రాజకీయ దృఢ సంకల్పం కావాలి. దానికి ప్రజల సహకారం కావాలి. ఈ రెండింటికీ  మీడియా వత్తాసు కావాలి. న్యాయపరమయిన చిక్కులు ఎదురు కాకుండా వుండాలి. ఇన్ని సమకూడితే కానీ అటువంటి సత్సంకల్పం సిద్ధించదు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇటువంటి కొత్త పుంతలు తొక్కాలనే కోరుకుందాం.   
ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది  మరోటి వుంది.
జలదిగ్బంధంలో చిక్కుకు పోయిన ప్రజలకు ఆహారం సరఫరా చేసే క్రమంలో వారికి హెలికాప్టర్ల ద్వారా పులిహోర పొట్లాలు జారవిడుస్తుంటారు. పులిహార అయితే కొన్ని రోజులు నిలవ ఉంటుందన్న అభిప్రాయం కావచ్చు. కానీ చుట్టూ నీళ్ళు వున్నా తాగడానికి వీల్లేని ఆపన్నులకు ప్రధమంగా కావాల్సింది శుభ్రమైన నీరు. లేనిపక్షంలో, కాలుష్యమైన నీళ్ళు తాగి లేనిపోని అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి వుంటుంది. రోజుల తరబడి నీళ్ళు నిలవ వుండే పరిసరాల్లో అంటువ్యాధులు ప్రబలితే వాటిని అరికట్టడం ఒక పట్టాన సాధ్యం కాదు. ప్రభుత్వ అధికార వర్గాలు సహాయక చర్యల విషయంలో ఇటువంటి కీలకమైన  అంశాలను గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించి ఆహార పదార్ధాలను ఇతర నిత్యావసర సామాగ్రిని బాధితులకు అందించే ప్రయత్నం చేయగలిగితే ఉత్తరోత్తరా పర్యావరణానికి వాటిల్లే ముప్పును తగ్గించిన వారవుతారు.
కష్టాలు కలకాలం వుండవు. ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వాలకంటే ప్రజలే నిబ్బరంగా వ్యవహరించిన దాఖలాలు అనేకం. నష్టం భారీ స్థాయిలో సంభవించినప్పుడు ప్రభుత్వాలు యెంత పెద్ద ఎత్తున సాయం అందించినా అది జరిగిన నష్టాన్ని పూడ్చలేదు.
ప్రకృతి ప్రకోపాలు జీవితాల్లో భాగం అయిపోయాయి. అలాగని  చేతులు  ముడుచుకుని  కూర్చోవడం  పనికిరాదు. మరోసారి ఇటువంటి పరిస్తితి  రాకుండా  చూడడం  ప్రభుత్వాల ధర్మం.
అయితే  ఇటువంటి దుస్తితికి కారణం ఎవ్వరు అంటే జవాబులు అనేకం.
పట్టించుకోని ప్రభుత్వాలా! లంచాలు పట్టి, అడ్డమైన కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులా! కనబడ్డ చోటల్లా వెంచర్లు వేసి, ప్రజల డబ్బుతో, తగిన అనుమతులు లేకుండానే  అపార్ట్లు మెంట్లు కట్టేసి కోట్లు సంపాదిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులా! అనుమతులు ఉన్నాయా లేవా అని చూసుకోకుండా, చూసినా లెక్కపెట్టకుండా ఇళ్ళు కట్టుకున్న, కొనుక్కున్న ప్రజలా!
ఒక్క ముక్కలో చెప్పాలంటే  ఇది పాపం అనుకుంటే, ఇందులో వీరందరికీ భాగం వుంది. వాటాల్లోనే తేడా!
(24-09-2016)   5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Population explosion is the root cause. In India 130 crore people are fighting for limited resources meant for maybe 20 crores max.

Zilebi చెప్పారు...నగరానికి యేమయ్యిం
ది ? కుండ పోతయ్యె వరద దిగ్భ్రమ చేర్చె
న్నగణిత కట్టడములతో
అగత్యముల తెచ్చుకున్న హైదరబాదూ !

జిలేబి

Chandrika చెప్పారు...

తన దాకా వస్తే అంటారు. నన్నడిగితే ప్రభుత్వం అంటే ఎవరో కాదు ప్రజలే. కష్టాలుపడుతున్నపుడు ముందు తిట్టేది ప్రభుత్వం ని. ఈ భవనాలు కట్టినపుడు ఆమోదించడానికి లంచాలు అడిగేది ప్రభుత్యోగాలు చేసే ప్రజలే కదా. చక్కటి ఇళ్ళు అపార్టుమెంట్ లకి ఇచ్చేస్తున్నారు. దాని పేరు కూడా పైగా 'డెవలప్మెంట్'. ప్రతి ఒక్కరికి ఒక్క ఇల్లు కాదు పది కావాలి. ఆశకి కూడా అంతూ పొంతూ లేకుండా ఉంది. విజయవాడ దగ్గరే చూడండి ఎన్ని పచ్చటిపొలాలు ప్లాట్లు , అపార్టుమెంట్ లు గా మారిపోయాయో. తిండి దొరకకుండా పోయిన రోజున కాంక్రీట్ తిని బతుకుతారేమో

Goutami News చెప్పారు...

My intention from the core is we Indians forgot how to rule a vast country since our slavery back from Greeks,Turks,Mughals,and British made us boneless.Just we are learning through experiments ..let it be.

sreeram chaturvedula చెప్పారు...

తిలా పాపం తలా పిడికెడు