14, సెప్టెంబర్ 2016, బుధవారం

పోలవరం ! వరమా! శాపమా !!(రెండేళ్ళ క్రితం రాసింది)

దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు మాదిరిగా నడుస్తోంది పోలవరం కధ. ఈ పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కంచికి చేరని కధలా సాగిపోతోంది. బాలారిష్టాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. రెండు మూడేళ్ళలో ఒక కొలిక్కి వస్తుందని సర్కారు ధీమాగా చెబుతున్నా, ఈ ప్రాజెక్ట్ వాస్తవరూపం దాల్చడానికి ఏండ్లూ పూండ్లూ పట్టేట్టు వుంది.
దేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941 జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్ మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. ఆరోజుల్లో మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ కు నామకరణం కూడా చేశారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న భద్రాచలం సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు, పోలవరం కుడి గట్టు కాల్వని, కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం 2004 కల్లా ఎనిమిదివేల ఆరువందల కోట్లకు పెరిగిపోయింది. 1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న పోలవరానికి, వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం వున్న ఆయకట్టు స్థిరీకరణతో సహా సేద్యపు నీటి సౌకర్యం కల్పించడం ప్రాజెక్ట్ లక్ష్యం. పోలవరం నుంచి మళ్లించిన గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ప్రకాశం బరాజ్ ఎగువన కొత్తగా మరో బరాజ్ నిర్మించడం కూడా ఈ పధకంలో ఓ భాగం. ఇందువల్ల హైదరాబాదు నుండి తొమ్మిదో నెంబరు (ఈ నెంబరు మారినట్టువుంది) జాతీయ రహదారిలో ప్రయాణించే వారు విజయవాడ వరకు పోకుండానే ఆ బరాజ్ పైనుంచి గుంటూరు జిల్లాకు చేరడానికి వీలుపడుతుంది. ఇవీ ఈ ప్రాజెక్ట్ వల్ల అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కానీ, విభజన అనంతరం ఏర్పడ్డ కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వొనగూడే ప్రయోజనాలు. కొద్దో గొప్పో తెలంగాణాలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు కూడా ప్రయోజనం వుంటుంది.
అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా గోదావరి నదులే ప్రధాన సేద్యపు నీటివనరులు. ఇందులో కృష్ణానది నుంచి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. పోతే, గోదావరిలో మిగులు జలాలు ఎక్కువ. ఏటా కొన్ని వందల వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళించడం ద్వారా కృష్ణానదీ జలాలను వాటి అవసరం ఎక్కువగా వున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడం సాధ్య పడుతుంది. ఈ కోణంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే పోలవరం. అసలు ఏ సేద్యపు నీటి ప్రాజెక్ట్ అయినా కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందించడం లక్ష్యంగా రూపుదిద్దుకుంటుంది. కానీ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా సరఫరా అయ్యే జలాలు ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో వున్న ఆయకట్టు స్థిరీకరణకు మాత్రమే ప్రధానంగా ఉపయోగపడతాయి. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల మునకకు గురయ్యే ప్రాంతాలు మాత్రం తెలంగాణలో వున్నాయి. వాటిల్లో చాలావరకు ఆదివాసీలు నివసించే ప్రదేశాలు. ప్రధానమైన అడ్డంకి ఇదే.
రాష్ట్రంలో పలు జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ ప్రాజెక్ట్ కు కొన్ని సహజ సిద్ధమైన బాలారిష్టాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల సుమారు రెండువందల డెబ్బయ్ ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయి. దాదాపు నలభయ్ వేల పైచిలుకు కుటుంబాలవారు నిరాశ్రయులవుతారు. వారికి పునరావాసం కల్పించాల్సి వుంటుంది. ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఈ తిప్పలు తప్పవు. కానీ పోలవరం వల్ల నిరాశ్రయులయ్యేవారిలో సగం మంది అక్కడి నేలను, అడివినీ నమ్ముకున్న షెడ్యూల్ల్ తెగలవారు కావడం గమనార్హం. దీనికితోడు ఈ ప్రాజక్ట్ తలపెట్టినప్పుడు రాష్ట్రం ఒకటిగా వుంది. తరువాత రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సమయంలో కూడా పోలవరం అంశం ప్రధాన అవరోధంగా నిలిచింది. ప్రాజెక్ట్ ఒక రాష్ట్రంలో, ముంపుకు గురయ్యే ప్రాంతాలు మరో రాష్ట్రంలో వుండే విచిత్ర పరిస్తితి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు విభజన నిర్ణయం తీసుకున్న నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణాలోని అనేక గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ కు బదలాయించే ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఆఖరి క్షణంలో ప్రయత్నించినా అది కుదరలేదు. ఆ తరువాత వచ్చిన మోడీ నాయకత్వంలోని ఎండీయే సర్కారు ఆ ఆర్డినెన్సు తీసుకురావడమే కాకుండా దాన్ని లోకసభలో ఆమోదింపచేసుకోవడంతో తెలంగాణా ప్రాంతంలో అగ్గి రాజుకుంది. పోలవరం డిజైన్ మార్చాలని, తద్వారా ముంపుకు గురయ్యే ప్రాంతాల విస్తీర్ణం తగ్గేలా చూడాలని మొదటి నుంచి పట్టుబడుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులకు కేంద్రం వైఖరి మింగుడు పడలేదు. పోలవరం బిల్లుకు నిరసనగా తెలంగాణా జేయేసీ ఇచ్చిన పిలుపుకు పాలక పక్షం అయిన టీఆర్ఎస్ మద్దతు పలికింది. 1956 నుంచి తెలంగాణలో భాగంగా వున్న ప్రాంతాలను పొరుగు రాష్ట్రంలో కలపడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పొరుగునవున్న ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజక్ట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల తమ రాష్ట్రాల్లో భూములు విస్తారంగా మునకకు గురవుతాయని, మునుపటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణంతో ముందుకు పోతోందని ఆరొపిస్తూ ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు గతంలోనే సుప్రీం కోర్టులో కేసు వేశాయి.
పోలవరం ప్రాజెక్ట్ పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో వున్నట్టు కానవస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో దీన్ని జాతీయ ప్రాజక్ట్ గా చేపట్టి పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు. మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా దీని వూసు లేదు. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.
ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వరంగా మారుతుంది. ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా పూర్తి చేస్తే దానివల్ల ఆట్టే లాభం లేని తెలంగాణా రాష్ట్రంలోని అనేక లక్షలమంది సాధారణ ప్రజల జీవనం అతలాకుతలమవుతుంది.
రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారిన ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా, అనుకున్న వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే. ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం అంచనాలకు మించి పెరిగిపోవడం మాత్రం ఖాయం. (12-07-2014)

9 కామెంట్‌లు:

sarma చెప్పారు...

నేను పుట్టినప్పుడు పుట్టిన ఆలోచన. మా నియోజకవర్గం మొదటి ఎమ్.ఎల్.ఎ గా ఎన్నికైన శ్రీ పుసులూరి కోదండరామయ్య గారిచ్చిన మొదటి ఎన్నికల హామీ, ప్రాజెక్ట్ గురించి :) ఈ హామీ వినేనాటికి నావయసు 11 :) ప్రాజెక్ట్ చూస్తానా :)

Jai Gottimukkala చెప్పారు...

ఈ ప్రాజెక్టు దేశానికి ఖఛ్చితంగా శాపమే. దీన్ని అడ్డుకొని తీరాలి.

అజ్ఞాత చెప్పారు...

గొట్టిముక్కలా, ఒక రాష్ట్రానికి అన్నం పెట్టే ప్రాజెక్టు దేశానికి శాపమా? అవునులే తెలంగాణా వాళ్ళు ఒక ఆంద్రావాళ్ళ ప్రాజెక్టు గురించి ఇంతకంటే ఎలా అంటారూ. అసలు తెలంగాణాయే కుట్రలూ దొంగనిరాహారదీక్షల నేపథ్యంలో పుట్టింది కదా - అదీ నిజంగా ఈ‌దేశానికి శాపం. అ తెలంగాణా సర్వనాశనం కావాలని ఎవరూ కోరుకోకపోయినా చేసిన తప్పులకు శిక్షగా చివరకి దానికి దక్కేది అలా దుంపనాశనమే.

అజ్ఞాత చెప్పారు...

Well said అజ్ఞాత గారు. ఎన్నంటే మాత్రం గొట్టిముక్కల లాంటి కరడు గట్టిన తెలంగాణావాదులు మారతారు? తలుపులు మూసి తెచ్చుకున్న రాష్ట్రం కదా. అసలు ఆంధ్ర్రాయే లేకుండా పోతే ఎంత బాగుంటుందని కూడా వాళ్ళు కోరుకుంటున్నారేమో అనిపిస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

చింతకాయలకి ఆజ్ఞగాని గుటకలకి ఆజ్ఞ అక్కరలేదు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మూడో అజ్ఞాత గారు సామెత అర్ధం కాలేదు, కాస్త వివరిస్తే బాగుంటుంది. థాంక్స్.

sarma చెప్పారు...

అసలే పోలవరం ప్రాజక్టు, మా నియోజకవర్గంలోది, నేను పుట్టినపుడు పుట్టిన ఆలోచన, ఏమవుతుందోననే ఆసక్తి. వీటికి తోడు అజ్ఞాత సామెత, దాన్ని వివరించమని మిత్రుల కోరిక, ఆసక్తిగా వివరణ కోసం ఎదురు చూస్తున్నా!

Jai Gottimukkala చెప్పారు...

శర్మ గారూ దొరికితే ఇంజినయర్ భూమయ్య గారి పుస్తకం చదవండి అన్ని విషయాలూ అర్ధం అవుతాయి. కుదిరితే కేఎల్ రావు గారే ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన లింకులు కూడా చదవండి.

అజ్ఞాత చెప్పారు...

ఓ గొట్టిముక్కలా, గట్లైతే తెలంగాణావాదాన్ని ఇందిరాగాంధీ వ్యతిరేకించిన సంగతికూడా కాస్త చదవండి. అప్పుడే ఈ దిక్కుమాలిన తెలంగాణా విడిపోయుంటే ఈరోజున ఆంధ్రప్రాంతం సర్వతోముఖాభివృధ్ధితో ఉండేది - అక్కడి సంపదనంతో దోచి హైదరాబాదు నెత్తిన పెట్టించారు మనరాజధాని అని. ఇప్పుడు అంతా దొంగవేషాలతో స్వార్థంతో లాగేసుకొని ఇంకా ఉన్నది ఏమన్నా ఉంటే కూడా ఆంధ్రావాళ్ళకు భోజనం దొరక్కుండా ఎలాచేయాలా నిత్యం పడి ఏడుస్తుంటారు. ఛీ. ఎక్కడపడితే అక్కడ మీ‌అక్కసు ఏడుపులేనా - ఏం బతుకులయ్యా మీవి. మీకు భవిష్యత్తులో మంచి శిక్షలే కాచుకొని ఉంటాయిలే.