“నేనొక లక్ష రూపాయలు కన్నయ్య లాల్ కి
ఇద్దామని అనుకుంటున్నాను. మరి మీ సంగతి ఏమిటి”
అంటూ భార్యాబిడ్డల వైపు చూశాడు ఏకాంబరం.
అతగాడు ఏమంటున్నాడో వాళ్లకు ఓ పట్టాన
అర్ధం కాక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు. ఈనెల ఇంటి అద్దే ఇంకా
కట్టలేదు. లక్ష రూపాయలుట, ఎవడో ముక్కూ
మొహం తెలియని వాడికి ఇస్తాను అంటున్నాడు అంటే అర్ధం ఏమిటి? పైగా మీ సంగతేమిటి అంటూ
నొక్కుళ్ళు కూడా.
భార్యాపిల్లలకు తాను చెబుతున్నది అర్ధం కాకపోగా ఏవేవో ఊహించుకుంటూ
అపార్ధాల సీనులోకి వెళ్లి పోతున్నారని అర్ధం చేసుకున్న ఏకాంబరం విలాసంగా ఓ నవ్వు
నవ్వి అప్పటివరకు చదువుతున్న దిన పత్రికను వారి వైపు విసిరాడు.
అందులో ఇలా వుంది.
“రూ. 15 లక్షల హామీపై సమాధానమివ్వనున్న పీఎంవో. ఈనాడు,దిల్లీ: విదేశాల్లో
మూలుగుతున్న నల్ల ధనాన్ని స్వదేశానికి రప్పించి ప్రతి ఒక్క భారతీయుడి బ్యాంకు ఖాతాలో
రూ. లక్షల చొప్పున జమచేస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన
వాగ్దానంపై సమాధానం ఇచ్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సన్నద్దమవుతోంది.
రాజస్థాన్ కు చెందిన కన్నయ్య లాల్ అనే దరఖాస్తుదారుడు
పెట్టుకున్న అర్జీపై కేంద్ర సమాచార కమీషన్ స్పందించింది. మోదీ ప్రధాన మంత్రి అయి
రెండేళ్ళు గడిచినందువల్ల ఆ హామీకి ఏమయిందో తెలపాలనీ, తన ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ
అవుతాయో చెప్పాలనీ కన్నయ్య లాల్ కోరాడు”
ఆ వార్తలో ఇంకా ఏదేదో రాశారు కానీ,
ఏకాంబరం వున్నట్టుండి కన్నయ్య లాల్ ప్రసక్తి ఎందుకు తెచ్చాడో అర్ధం అయి హాయిగా నవ్వుకున్నారు.
