29, మార్చి 2016, మంగళవారం

ఎన్టీఆర్ పార్టీ పేరు ప్రకటించిన విధంబెట్టిదనిన


మంగళవారం సాయంత్రం రెండు ఛానళ్ళ  నుంచి ఆహ్వానాలు. ఈరోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక చర్చకు రావాల్సిందని ఎక్స్  ప్రెస్ టీవీ, టీవీ ఫైవ్ నుంచి. అయితే ఇంటికి కొంతమంది అతిధులు రావాల్సి ఉన్నందున వెళ్ళలేని పరిస్తితి.
1982 మార్చి  29 టీడీపీ శ్రేణులకే కాదు ఆనాటి నాబోటి జర్నలిష్టులకు కూడా గుర్తుండిపోయే రోజు.


ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నట్టు అప్పటికి వారం క్రితమే ఆయనే స్వయంగా సూచనప్రాయంగా విలేకరుల సమావేశంలో వెల్లడించినందువల్ల ఆ విషయానికి సంబంధించి ఆసక్తి లేదు. కానీ ఒక సినీ నటుడు పెట్టబోయే పార్టీ పేరు ఎలా వుంటుంది అన్న విషయంలోనే   అందరికీ ఉత్సుకత. పొలోమని హైదరాబాదులోని విలేకరులం చాలామందిమి ఆఘమేఘాల మీద న్యూ  ఎమ్మెల్యే  క్వార్టర్స్ చేరుకున్నాము.  పార్టీ పేరు ప్రకటనలో కూడా  ఎన్టీఆర్  ఓ కొత్తదనం చూపారు. పార్టీ ‘పేరేమిటి’ అన్న ప్రశ్నకు ‘నేను తెలుగు వాడిని, నా పార్టీ తెలుగు దేశం పార్టీ’ అంటూ జవాబు. అంతవరకూ తెలుగునాట అలాంటి పార్టీ ఉంటుందని ఊహకు కూడా అందని రోజుల్లో అటువంటి పేరు తన పార్టీకి పెట్టిన తీరు ఆ రోజుల్లో విస్మయాన్ని కలిగించింది. ‘ఇదేమి పేరు, ఒక రాజకీయ పార్టీకి ఇలాంటి పేరు పెడతారా ఎవరన్నా’ అని నొసళ్ళు నొక్కుకున్నవారు కూడా వున్నారు.
సరే! ఒక సస్పెన్సుకు తెర పడింది. ముహూర్తాల పట్ల బాగా నమ్మకం వున్న  మనిషి కాబట్టి కరెక్టుగా విలేకరుల సమావేశం   మధ్యాన్నం  రెండున్నరకి నిర్ణయించారు. అదేమో కానీ ఆ ముహూర్తం రేడియోకి బాగా కలిసివచ్చింది. ఈ వార్త సాయంత్రం ఆరుంబావు వార్తల్లో ఎలా ఇవ్వాలి, యెంత వివరంగా ఇవ్వాలి అని చర్చించుకునే వ్యవధానం మాకు దొరికింది.
అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్లా కాంగ్రెస్ ప్రభుత్వ్వాలే. ఎలా ఇస్తే ఏం చిక్కు వస్తుందో తెలవదు. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందని పార్టీల పేర్లు రేడియోలో చెప్పడానికి వీల్లేదని కొందరి అభ్యంతరం. కానీ అప్పటికే జనంలోకి బాగా పోయిన వ్యవహారం. నిబంధనల పేరుతొ వార్త ఇవ్వకపోతే ఇంకా పెద్ద విమర్శలు వస్తాయి. చివరికి వార్త ఇవ్వాలని నిర్ణయం జరిగిపోయింది. న్యూస్ ఎడిటర్  కీర్తిశేషులు నర్రావుల సుబ్బారావు గారు ఆ వార్తను మొదటి హెడ్  లైన్ గా పెట్టాలని నిర్ణయించారు. బహుశా డీ. వెంకట్రామయ్య గారు అనుకుంటాను, ఆరోజు వార్తలు చదివింది. ఆయన  నోట రేడియోలో ఈ సమాచారం సాయంత్రానికల్లా తెలుగు నేల నాలుగు చెరగులా చేరిపోయింది.    (29-03-2016) 

       

కామెంట్‌లు లేవు: