30, జులై 2015, గురువారం

కట్టుటా? పడగొట్టుటా? - భండారు శ్రీనివాసరావు


(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 30-07-2015, THURSDAY)

కీర్తిశేషులు ఎన్టీ రామారావు కొత్తగా తెలుగు దేశం అనే ప్రాంతీయ పార్టీ పెట్టి, పెట్టి తొమ్మిది నెలలు తిరక్కుండానే అధికారాన్ని కైవసం చేసుకుని రాజకీయాల్లో ఒక కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుకున్నారు. అలాగే తన తొలివిడత పాలనలో కొత్త అడుగులు వేస్తూ పాత సంస్థలను, పురాతన వ్యవస్థలను పెక్కింటిని, కాలం చెల్లినవిగా పరిగణించి వాటిని రద్దు చేస్తూ వరుస నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తమది  'రద్దుల ప్రభుత్వం' అనే అపఖ్యాతిని కూడా కొంత మూటగట్టుకున్నారు.     
సాధారణంగా కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయినప్పుడు, కొత్త పాలకులు పరిపాలనలో తమదయిన శైలి కనబరచడానికి, విధానాలలో తమదయిన సొంత ముద్ర కనిపించేలా చేయడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయడం అసాధారణమేమీ కాదు. అయితే తాము తీసుకునే నిర్ణయాలు, కొన్ని  సందర్భాలలో వివాదాలకు కేంద్ర బిందువులుగా మారే అవకాశం వుంటుందన్న వాస్తవాన్ని వాళ్లు మరచిపోతుంటారు.
అయితే, ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ద్వారా  ప్రభుత్వాలు మారే అవకాశం వున్నప్పుడు, ప్రతి కొత్త ప్రభుత్వం తనకు తోచిన రీతిలో మార్పులు చేస్తూ పోతుంటే చివరికి మార్పే శాశ్వితం అయ్యే ప్రమాదం వుంటుంది.
పూర్వం సోవియట్  యూనియన్ అనే పేరుతొ దిగద్దంతాలకు వెలుగులు విరజిమ్మిన రష్యాలో ఏలికలు మారినప్పుడల్లా మార్పులు చోటుచేసుకోవడం ఓ ఆనవాయితీగా మారిపోయింది. ఒకప్పుడు స్టాలిన్ విగ్రహాలు లేని వూరంటూ ఆ దేశంలో వుండేది కాదు. కానీ ఆయన శకం అంతరించి కృశ్చేవ్ పాలన మొదలు కాగానే ఒక్కమారుగా స్టాలిన్ బొమ్మలన్నీ మంత్రం వేసినట్టు మాయం అయిపోయాయి. రెండో ప్రపచ యుద్ధ సమయంలో స్టాలిన్ గ్రాడ్ అని పేరు మార్చుకున్న పట్టణం కాస్తా కృశ్చేవ్ కాలంలో మళ్ళీ పాత పేరు 'ఓల్గా గ్రాడ్' కు మారిపోయింది. అల్లాగే లెనిన్ గ్రాడ్ అని పేరు మారిన సెంట్ పీటర్స్ బర్గ్ తదనంతర కాలంలో తిరిగి పూర్వపు పేరుతోనే కొనసాగుతోంది. ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల పేర్లే మారిపోయాయి. ఉదాహరణకు ఒకప్పటి రొడీషియా ఇప్పుడు జాంబియా అయిపొయింది.
మన దేశంలో కూడా ఇటువంటి పేర్ల మార్పిడి కొత్తేమీ కాదు. బొంబాయి ముంబైగా, మద్రాసు చెన్నైగా, కలకత్తా కోల్ కతాగా మారాయి. ఇక మైసూరు రాష్ట్రం ఏకంగా  కర్ణాటకగా పేరు మార్చుకుంది. అలాగే ఒరిస్సా ఒడిశా అయింది. ఆంధ్ర, తెలంగాణాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ గా విలీనం అయి ఇటీవలే మళ్ళీ తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు పుష్కరాల పుణ్యమా అని రాజమండ్రి పట్టణం  రాజమహేంద్రవరంగా మారుతోంది. ఏలూరు, నెల్లూరు పేర్లను కూడా హేలాపురి, సింహపురి గా మార్చాలనే డిమాండ్లు వూపందుకుంటున్నాయి.                
సంస్కృతీ పరిరక్షణలో భాగంగా మార్పులు జరిగితే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు. మార్పుకోసమే  మార్పు చేస్తున్నాం అనే వాదన చేస్తేనే అడ్డు చెప్పాల్సిన పరిస్తితి వస్తుంది.
పోతే, పేర్ల మార్పిడి ఒక ఎత్తు. పాత ప్రభుత్వ పధకాలకు, పాత వూర్లకు కొత్త పేర్లు పెట్టడం వల్ల ప్రజాధనం కొంత వృధా కావడం తప్పిస్తే వేరే ఇబ్బంది ఏమీ వుండదు. ఇలాటి మార్పులను కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు.
ఈ సుదీర్ఘ నేపధ్య వివరణకు దోహదం చేసిన అంశం గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ, తన పాలనలో, పధకాలలో, నిర్ణయాలలో  ఏదో ఒకరకమైన కొత్తదనం కొట్టవచ్చినట్టు కనబడాలనే ఆసక్తి కనబరచడం రహస్యమేమీ కాదు. సచివాలయం తరలింపు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఎన్టీయార్ స్టేడియం వున్నచోట సాంస్కృతిక భవన సముదాయాల నిర్మాణం మొదలయిన సరికొత్త ప్రతిపాదనలతో ఎప్పటికప్పుడు  చర్చలకు తెర లేపుతూ వస్తున్నారు. ఇప్పుడు సరికొత్తగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను కూలగొట్టి, సరికొత్త భవనాలను నిర్మించాలనే నిర్ణయాన్ని ఆఘమేఘాల మీద తీసుకున్నారు. పాత భవనం శిధిలావస్థకు చేరుకుందనీ, అక్కడ వుండే రోగులకు, సిబ్బందికీ ఎంతమాత్రం క్షేమం కాదనీ, అంచేత ఆ భవనం పడగొట్టి కొత్త భవనాన్ని నిర్మించడం ఒక్కటే పరిష్కారమనీ ఈ నిర్ణయానికి మద్దతుగా వివరణ ఇస్తున్నారు.
నిజమే. రోగుల ప్రాణాలు నిలబెట్టడానికే ఆసుపత్రులు కాని,  ప్రాణాలు తీయడానికి కాదు. శిధిలావస్థకు చేరిన భవనాలను కూలగొట్టడం, ప్రత్యేకించి అవి ఆసుపత్రులు అయినప్పుడు మరింత జాగరూకతతో వ్యవహరించడం ప్రభుత్వాల విధి.

అయితే, ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి సాంస్కృతిక పరమైన ఒక చరిత్ర వుంది. హైదరాబాదు అనగానే తటాలున గుర్తుకు వచ్చే పేర్లలో అదొకటి. మనోఫలకంపై కదలాడే రూపాల్లో ఉస్మానియా ఆసుపత్రి భవనం ఒకటి. అటువంటి భవనం, తెలంగాణా సాంస్కృతిక పరిరక్షణకు నడుం కట్టిన కేసీఆర్ వంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూల్చివేతకు గురవడం ఎంతవరకు సమంజసం అన్నదే ప్రశ్న. ఆయనే స్వయంగా ఉస్మానియా భవనం కూల్చివేతకు ఉత్తర్వు చేయడం అంటే నమ్మశక్యంగా లేదని సోషల్ మీడియాలో తెలంగాణా అభిమానులు అనేకులు అభిప్రాయపడుతున్నారు.
భవనం శిధిలం అయితే అక్కడ ఆసుపత్రిని కొనసాగించడం యెంత మాత్రం మంచిది  కాదు. అయినా ప్రత్యమ్నాయం ఆలోచించకుండా ఏకబిగువున భవనం పడగొట్టడం కూడా వారసత్వ సంపదని చేజార్చుకోవడమే అవుతుంది. ప్రభుత్వం తలచుకుంటే, ఆసుపత్రికోసం మరో మరో భవనం నిర్మించి,  ఇప్పుడు వున్న పాత   భవనాన్ని భావి తరాలకోసం పరిరక్షించడం సబబయిన చర్య అవుతుంది. చారిత్రిక సంపదను పరిరక్షించడం కూడా ప్రభుత్వ కర్తవ్యం అని మరచిపోకూడదు. 
మరికొద్ది సంవత్సరాల్లో నూరేళ్ళు నిండబోతున్న ఉస్మానియా ఆసుపత్రి భవనం అప్పుడూ ఇప్పుడూ కూడా భాగ్య నగరానికి ఒక ప్రతీకగా వుంటూ వస్తోంది. ఆ భవనం శిల్ప వైభవం చారిత్రిక విలువలకు అద్దం పడుతోంది. ఆ భవనానికి సకాలంలో సరయిన మరమ్మతులు జరగక శిధిలావస్థకు చేరిన భవనాల జాబితాలో చేరిపోవడం చాలా దురదృష్టకరం.
మూసే నది ఒడ్డున దాదాపు ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో నెలవయిన ఉస్మానియా ఆసుపత్రి పదునాలుగు వందల పడకలతో రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చే వేలాదిమంది పేద రోగుల వైద్య అవసరాలను తీరుస్తోంది. సుమారు నాలువందలమంది డాక్టర్లు, వందలాదిమంది సిబ్బంది పనిచేస్తున్నారు. శిధిల భవనంలో ఇంతమంది పనిచేయడం అనేది క్షేమకరం కాని మాట నిజమే. కానీ, అలాగని హైదరాబాదు నగరానికి తలమానికంగా వుండే ఇటువంటి చారిత్రిక భవనాలను కూలగొట్టుకోవడం కూడా ఆహ్వానించతగ్గ పరిణామం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యేమార్గం అన్వేషించాలి. రోగుల క్షేమం ముఖ్యమే, అదేసమయంలో వారసత్వ సంపద పరిరక్షణ కూడా అంతే ప్రధానం.
పోతే, ఇటువంటి చారిత్రిక భవనాలే హైదరాబాదు నగరానికి విశ్వవ్యాప్తంగా  విశిష్టతను సమకూర్చి పెట్టిన విషయం మరువకూడదు. విశ్వనగర నిర్మాణానికి కంకణం కట్టుకున్న వారు, చారిత్రిక వైశిష్ట్యం కలిగిన నిర్మాణాలను కనుమరుగు చేసుకోరాదు. ఒక జాతి చరిత్రకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దాలే ఈ భవనాలు. ప్రాచీన కట్టడాలు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. తరువాతి తరాలకి పాత చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపగలిగే సజీవ సాక్ష్యాలు.
ప్రపంచ వ్యాప్తంగా మనకు ఇదే రీతి కానవస్తుంది. పూర్వపు సోవియట్ యూనియన్, పేరుకు కమ్యూనిష్టు రాజ్యం అయినా, వారి చారిత్రిక వారసత్వ సంపదని వారు చాలా  పదిలంగా కాపాడుకున్నారు. పుష్కిన్, టాల్ స్టాయ్, గోర్కీ, మయకోవేస్కీ వంటి మహా రచయితల పేరిట ఆ దేశంలో మ్యూజియంలు ఏర్పాటు చేశారు. పుష్కిన్ పేరు వూళ్ళకీ, వీధులకీ పెట్టుకున్నారు. మాస్కో నగరంలో అర్బాత్ స్కయా అనే పేరుతొ ఒక వారసత్వ వీధి వుంది. అందులోకి పాదచారులను మినహా ఎటువంటి వాహనాలను అనుమతించరు. పాదచారులు మాత్రమే తిరుగాడగలిగే ఇటువంటి ప్రాచీన వీధులు లండన్, ప్యారిస్ నగరాల్లో కూడా వున్నాయి. అలాగే హైదరాబాదుకు సంబంధించి చార్మినార్ వంటి ప్రాంతాలను ఆ విధంగా పరిరక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా జరగాలి. భవన నిర్మాణ రంగంలో వ్యాపారం చేసేవారికి పాత భవనాల్లో వారసత్వ విలువలు కానరావు. వారికి ఆ శిధిల భవనాల్లో తమ పెట్టుబళ్లకు తగ్గ లాభాలు తెచ్చి పెట్టే వాణిజ్య విలువలే కనిపిస్తాయి. అందుకే ఉస్మానియా మొదలయిన చారిత్రిక వారసత్వ భవనాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలే భుజానికి ఎత్తుకోవాలి.
ఈ సందర్భంలో తెలంగాణా ప్రభుత్వ నేతలకి  ఒకటే విజ్ఞప్తి.
రోగుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని ఉస్మానియా ఆసుపత్రిని ఆలశ్యం చేయకుండా మరో చోటికి మార్చండి. దానికి కొత్త భవనం కట్టండి. కానీ, హైదరాబాదు చారిత్రిక వారసత్వ సంపదకి  గుర్తుగా నిలిచిన ఉస్మానియా ఆసుపత్రి పాత  భవనాన్ని కూలిపోకుండా ప్రభుత్వ నిధులతో నిలబెట్టండి. తెలంగాణా సంస్కృతీ పరిరక్షణకు పెట్టని కోటగా నిలబడండి. (29-07-2015)

NOTE: Courtesy Image Owner                                        

2 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

అద్వానీలాగా చారిత్రాత్మక భవనాలను అనవసరంగా కూల్చే సాహసం కే సీ ఆర్ గారికి ఉందనుకోను.రెండు మూడేళ్ళకన్నా ఎక్కువ రోజులు ఉస్మానియా భవనం ఉండదు అని చెపుతున్నారు. 400 సంవత్సరాల చరిత్రకల చార్మినార్ మరమ్మతులు చేయడానికి భాగ్య లక్ష్మి ఆలయం తొలగించమని నేను మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

283 మంది చావులకు కారణం అయిన యాకూబ్ కి ఉరి అయితే 2000 మంది చావులకు కారణం అయిన అద్వానీకి ఏ శిక్ష వేయాలి ? ఈ రోజు యాకూబ్ మెమన్ కి ఉరివేయడానికి చూపించే ఉత్సాహం అద్వానీ ని విచారించడానికి చూపించి ఉండి ఉంటే చరిత్ర గురించీ,చారిత్రక భవనాల గురించీ ఆలోచించే పని ఉండేదే కాదు.


Unknown చెప్పారు...

సార్,

మీ సోవియట్ యూనియన్ పోలికలు ఇక్కడ నప్పవు. TDP ప్రభుత్వం NTR ఎయిర్‌పోర్ట్ అని పేరు పెడితే, కాంగ్రెస్ వచ్చి రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ అని పేరు పెట్టినటువంటి విషయాలకు మాత్రమే నప్పుతుంది.

ఇక్కడ కూల్చేది శిధిలావస్థలో ఉన్న బంగళాని.
అది ఏ విధంగానూ వాసయోగ్యం కాదని తేల్చబడింది.
అటువంటి బిల్డింగు ఊరికే రెస్టోర్ చేసి పెట్టడం వల్ల ఉపయోగం లేదు. కనీసం మ్యూజియంలా వాడేందుకు కూడా అది పనికిరాదు.

ఆ పరిథితులలొ దాన్ని కూల్చడమే సబబుగా అనిపిస్తోంది. అందుకు బాధ్యత వహించ వలసింది సరైన సమయంలో సంరక్షించని గత ప్రభుత్వాలు తప్ప ప్రస్తుత ప్రభుత్వం ఎంతమాత్రం కాదు.