6, జులై 2015, సోమవారం

నేటి రాజకీయులకు స్పూర్తి - శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి ఇక లేరు

   
(Published in Andhra Bhoomi, Telugu daily on 07-07-2015)

'తానమ్మిన సత్యాన్నే బోధించిన ధీశాలి, బోధించిన సత్యాన్నే పాటించిన వ్రతశీలి' అనే దానికి నిలువెత్తు నిర్వచనం శ్రీ భాట్టం శ్రీరామమూర్తి. నిండు జీవితం గడిపి, గడిపిన జీవితానికి చరితార్ధత కల్పించిన ధన్యజీవి. జయప్రకాష్ నారాయణ్, రాంమనోహర్ లోహియా వంటి అగ్రనేతలకు సన్నిహితుడిగా మెలిగిన ఈ పాత తరం   వృద్ధ రాజకీయవేత్త, మారిన రాజకీయాన్ని, మారిన విలువలను  కళ్ళారా చూసి, తానుమాత్రం మారకుండా   తన ఎనభయ్ తొమ్మిదో ఏట ఈరోజు (సోమవారం)  విశాఖపట్నంలో  కన్ను మూశారు. 1926 లో ధర్మవరం గ్రామంలో, ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో, నన్నయ పంతులు, తరుణమ్మల సంతానంగా   జన్మించిన భాట్టం శ్రీరామమూర్తి,  స్వయం కృషితో ఎదిగి  ఇరవై ఏళ్లకు పైగా శాసన సభ్యుడిగా పనిచేశారు. 1957లో జరిగిన విజయనగరం అసెంబ్లీ  ఉపఎన్నికలో శ్రీ భాట్టం శ్రీరామమూర్తి, సోషలిష్టు పార్టీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు. అంతకుముందు ఎమ్మెల్యేగా వున్న శ్రీ పీవీజీ రాజు లోకసభకు ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. ఆ తరువాత 1962 లో జరిగిన ఎన్నికల్లో కూడా భాట్టం అదే నియోజక వర్గంనుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి  అసెంబ్లీకి రెండో పర్యాయం ఎన్నికయ్యారు. తరువాత విశాఖ జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి వరసగా రెండు సార్లు (1972, 1978)కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు.  ఎనిమిదేళ్ళు మంత్రిగా, ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా వున్నారు. శ్రీ పీవీ నరసింహారావు, శ్రీ జలగం వెంగళరావు, శ్రీ మర్రి చెన్నారెడ్డి, శ్రీ అంజయ్య మంత్రివర్గాల్లో శ్రీరామమూర్తి కీలకమైన వివిధ శాఖలు నిర్వహించారు. రెండు ప్రపంచ తెలుగు మహాసభలు ఆయన సారధ్యంలోనే జరిగాయి. కౌలాలంపూర్ లో నిర్వహించిన ప్రపంచ సభలకు నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు కారణాంతరాలవల్ల వెళ్ళలేక పోవడంతో సాంస్కృతిక శాఖ మంత్రిగా వున్న శ్రీ భాట్టం ఆ సభల్లో కీలక ప్రసంగాలు చేసి సభికులను తన అసాధారణ వక్తృత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పీవీ మంత్రివర్గంలో వున్న ఈ ఇద్దరు మంత్రుల్ని 'జంట కవులు' అని పిలిచేవాళ్ళు. తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి అయినప్పుడు వీరి శాఖల్ని మార్చి ఒకరిది మరొకరికి కట్టబెట్టారు. 'జలగం గారు  మాకు కుండ మార్పిడి చేశారు' అనేవారు శ్రీరామ మూర్తిగారు హాస్యోక్తిగా.    
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి వ్యక్తిత్వం నచ్చిన నాటి టీడీపీ అధ్యక్షుడు శ్రీ ఎన్టీ రామారావు, ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో టీడీపీ టిక్కెట్టు మీద శ్రీ శ్రీరామమూర్తి, విశాఖ నియోజకవర్గం నుంచి  తొలిసారి లోకసభకు ఎన్నికయి పార్లమెంటులో తన స్వరం వినిపించారు.  

(నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విశాఖ వచ్చిన సందర్భంలో ఆ నాటి ముఖ్యమంత్రి  కాసు బ్రహ్మానందరెడ్డితో భాట్టం శ్రీరామ మూర్తి)

రాజకీయ జీవితంలో డబ్బుకు దూరంగా, ప్రజలకు దగ్గరగా గడిపిన చరిత్ర శ్రీ శ్రీరామ మూర్తిది. రాజకీయ శత్రువులు సయితం ఆయన నిజాయితీని శంకించలేని స్తితి.  హోదాలు కోరుకోలేదు. ఆస్తులు కూడబెట్టలేదు. విశాఖపట్నంలో ఏ చిన్న ఇంట్లో వున్నారో, జీవిత చరమాంకం వరకు అదే ఇంట్లో గడిపారు.    మంత్రిగా వున్నప్పుడు అత్యంత నిరాడంబరంగా కుమారుడు విద్యాసాగర్  పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి శుభలేఖలు కూడా అచ్చు వేయించలేదు. తన కుటుంబసభ్యులను తీసుకుని ఒక ప్రైవేటు వాహనంలో పెళ్ళికి వెళ్ళి వచ్చారు. డాబూ దర్పాలూ లేవు, వందిమాగధులూ లేరు. అదీ భాట్టం శ్రీరామమూర్తి గారు  పాటించిన జీవన విధానం.
తాను నమ్మింది ఆచరించి చూపడం అన్నది శ్రీరామ మూర్తి గారు తన పెళ్ళిలో కూడా ప్రదర్శించి చూపారు. ఆయనది కులాంతర వివాహం. మద్దూరి అన్నపూర్ణయ్య గారి పౌరోహిత్యంలో శ్రీమతి సత్యవతితో జరిగిన ఆ పెండ్లితంతుకయిన ఖర్చు కేవలం పదిహేను రూపాయలు.          
 ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా పనిచేసిన తరువాత మరో సారి శ్రీ రామారావు విశాఖ నుంచి రెండో మారు పోటీ చేయాలని  శ్రీ శ్రీరామ మూర్తిని  కోరారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న శ్రీ భాట్టం, రామారావుగారి కోరికను సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచీ ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక వ్యవహారాలకు దగ్గరగా  వుంటూ వచ్చారు. ఏళ్ళు మీద పడి, కాళ్ళూ చేతులూ సరిగా ఆడని వాళ్లు కూడా పదవులకోసం వెంపర్లాడుతున్న ఈ రోజుల్లో భాట్టం వంటి వారిని ఊహించుకోవడం కూడా కష్టం. అంతేకాదు, అయన తన కుటుంబ సభ్యులనెవ్వరినీ రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. తన టిక్కెట్టు తన భార్యకు ఇమ్మని కూడా దేబిరించలేదు. ఆ పుణ్యాత్మురాలు సత్యవతి గారు కూడా భర్తకు తగ్గ భార్య. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా, ఆశయాలకు తగినట్టుగా ఆయన వెంట నడిచారు.
భాట్టం శ్రీరామ మూర్తి గారు ఓ అయిదారేళ్ళ క్రితం కాబోలు,  మిత్రుల కోరికపై తన ఆత్మ కధ రాశారు. దానికి అయన పెట్టుకున్న పేరు 'స్వేచ్చాభారతం'.  సాధారణంగా రాజకీయ నాయకులు రాసే ఆత్మ కధల్లో 'ఆత్మ స్తుతి పరనింద' తొణికిసలాడతాయి. కానీ భాట్టం తరహానే వేరు. ఆయన అన్ని విషయాలు చాలా నిక్కచ్చిగా రాసుకున్నారు.
చివర్లో తనకు తానే 'తుది పలుకులు' కూడా  రాసుకున్నారు.
'కోహం (నేనెవర్ని) అంటూ పుట్టావు. సోహం (నేనే నువ్వు అంటే భగవంతుడు)  అంటూ ఆ ఎరుకతో మరణించు. పుట్టిన చోటు చేరడానికి  ఏడుపెందుకు?'      
శ్రీ భాట్టం శ్రీరామ మూర్తికి ఒకనాటి రాజకీయ సహచరుడు, ముఖ్యమైన స్నేహితుడు కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు. అయన కుమారుడు, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా వున్న శ్రీ మండలి బుద్ధ ప్రసాద్  ఈ గ్రంధానికి 'ముందు మాట' రాశారు. మహాకవి,  సంస్కృత పండితుడు భవభూతి సూక్తిని శ్రీ బుద్ధ ప్రసాద్ అందులో ఉటంకించారు.
'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'. విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.'
ఆ కొద్దిమందిలో ఒకరు శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి. (06-07-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595


               

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

>'కోహం (నేనెవర్ని) అంటూ పుట్టావు. సోహం (నేనే నువ్వు అంటే భగవంతుడు) అంటూ ఆ ఎరుకతో మరణించు. పుట్టిన చోటు చేరడానికి ఏడుపెందుకు?'

సత్యం. అక్షరలక్షలవిలువైన మాటలు అనటం ఆ మాటల్ని తక్కువ జేసి చెప్పటమే!

>ఏళ్ళు మీద పడి, కాళ్ళూ చేతులూ సరిగా ఆడని వాళ్లు కూడా పదవులకోసం వెంపర్లాడుతున్న ఈ రోజుల్లో భాట్టం వంటి వారిని ఊహించుకోవడం కూడా కష్టం

యదార్థం వచించారు. (ఎవరో ఒక మాజీ గవర్నరుగారు గుర్తుకు వచ్చారు నాకు!)

>ఆయనది కులాంతర వివాహం. మద్దూరి అన్నపూర్ణయ్య గారి పౌరోహిత్యంలో శ్రీమతి సత్యవతితో జరిగిన ఆ పెండ్లితంతుకయిన ఖర్చు కేవలం పదిహేను రూపాయలు.

రాజకీయప్రముఖుల్లో ఇంత నిరాడంబరమూర్తులు కలికానికి కూడా కనబడరే. ఒక శాస్త్రిగారూ, ఒక నందాగారు తప్ప.

ఈ మధ్యకాలంలో భాట్టంవారిని తలచినవారే లేరంటే అతిశయోక్తి కాదు. రోజూ అనేకమంది నాయకమ్మన్యుల కాకిగోలలు చూడలేక, వినలేక ఆ టీవీ జోలికి పోవటం మానేసాను. పత్రికలు చూడటం మానేసాను.

ఆయనకు నివాళులర్పించటం మన పవిత్రకర్తవ్యం