9, జులై 2015, గురువారం

భాట్టం శ్రీరామమూర్తి, మరికొన్ని జ్ఞాపకాలు

  
అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఒకసారి శాసనసభలో  ఇలా అన్నారు. 'ఈ శ్రీరామమూర్తి ఏదో సభలో మాట్లాడుతూ నన్ను రావణాసురుడితో పోల్చాడు. ఇదేమన్నా బాగుందా శ్రీరామ్మూర్తీ'.
భాట్టం  లేచి 'పాయింట్ ఆఫ్ పర్సనల్ క్లారిఫికేషన్'  లేవనెత్తారు. 'శతకోటి రుద్రాభిషేకాలు భక్తి ప్రపత్తులతో చేసే రావణబ్రహ్మతో ఈ సంజీవరెడ్డిని పోల్చేటంత తప్పిదం నేను  చేస్తానా' అనగానే అందరూ గొల్లున నవ్వారు.


(కీర్తిశేషులు భాట్టం శ్రీరామ్మూర్తి  1926 - 2015)

ఒకసారి కుసుమ గజపతి రాజు మాట్లాడుతూ 'నిజాం షుగర్ ఫాక్టరీ షేర్ విలువ పడిపోయింది మంత్రుల మార్కెట్ విలువ పడిపోయినట్టు' అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి  సంజీవరెడ్డికి విపరీతమైన కోపం వచ్చింది. 'ఈ రాజు (రాణి) సమావేశాలకు సరిగ్గారారు.  ఎప్పుడో ఓసారి వస్తారు. వచ్చి ఏదేదో మాట్లాడతారు. మగవాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు కాని, కాని ఆడ మనిషి కూడా..' అంటూ ఏదో అనబోయారు. భాట్టం లేచి అడ్డుతగిలారు. ఈ మాట వెనక్కి తీసుకోవాలన్నారు.  స్పీకర్ సీఎం వైపు చూసారు. వారు లేవలేదు. అప్పుడు స్పీకర్,  'నేనూ అలాగే అనుకుంటూ వుంటాను మగవాళ్ళు అప్పుడప్పుడూ పిచ్చిగా వ్యవహరిస్తూ వుంటారని' అన్నారు. భాట్టం వెంటనే లేచి చెప్పారు. 'అవును నేనూ మీలాగే! మగవాళ్లు పిచ్చిగా మాట్లాడుతారని ఇప్పుడే గ్రహించగలిగాను.'  సభ ఒక్కసారిగా గొల్లుమంది. కళా వెంకటరావు లేచాడు. ఆయన సామాన్యుడు కాదు. తిప్పికొట్టారు. 'అటువంటి మగవాళ్ళు అందరికీ శ్రీరామమూర్తి ఏకైక ప్రతినిధా అన్నట్టు యెందుకు ఇంతగా ఉలిక్కి పడి లేస్తున్నాడు' అంటూ. భాట్టం నోరు మూతపడింది.
భాట్టం చెప్పిన చిమటా సాంబు కధ
అప్పుడు భాట్టం లోకసభలో టీడీపీ సభ్యుడిగా వున్నారు, బోఫార్స్ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తున్న రోజులు. వరస వాయిదాలతో లోకసభ సమావేశాలు పేరుకు మాత్రమే సాగుతున్నాయి. 'గల్లీ గల్లీ మే హోర్ హై. రాజీవ్ గాంధీ చోర్ హై' అనే నినాదాలు సభలో మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం సభ్యుల సంగతి చెప్పక్కరలేదు. సభ వాయిదా వేసేవరకు ఒకటే అరుపులు కేకలు. పాలకపక్షం ఇది పనికాదనుకుని  సభ వాయిదా వేయకుండా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించింది. 'ప్రశ్నలు అన్నీ అడిగినట్టే, జవాబులన్నీ చెప్పినట్టే భావించాల'ని స్పీకర్ అంటున్నారు. టీడీపీ సభ్యుడు చిమటా సాంబు ఒక్కసారిగా లేచి వెళ్ళి మంత్రి చిదంబరం చేతిలో వున్న కాగితం లాగాడు. అది చినిగిపోయింది. ఏదో కొట్లాట జరుగుతోందని అంతా చూస్తున్నారు. ఇంతలో ఎవరో గట్టిగా సాంబుతో అన్నారు. 'ఎవరో కొడుతున్నారు అని గట్టిగా  అరిచి కిందపడిపొమ్మ'ని. అన్నట్టే సాంబు కిందపడ్డాడు. 'అమ్మో చంపేశారు మా వాడ్ని' అంటూ మరొకరెవ్వరో గావుకేక పెట్టారు. ఒకరు చేయి పట్టుకుని నాడి  చూస్తుంటే, మరొకరు మొహం మీద నీళ్ళు చల్లుతున్నారు. ఈలోగా డాక్టరు, స్ట్రెచర్  సిద్ధం. 'ఇంజెక్షన్ చేస్తారేమో' అని  సాంబు భయం. 'అదేం లేదు కళ్ళు మూసుకుని పడుకో' మరొకరి ఆదేశం. సాంబుని స్ట్రెచర్ పై తీసుకుని వెళ్లారు. మర్నాడు జాతీయ పత్రికలు అన్నింటిలో ఇదే ప్రధాన వార్త. సాంబు ఒక్కసారిగా హీరో అయిపోయాడు. పార్లమెంటులో పార్టీ కీర్తి ప్రతిష్ట ఇనుమడింపచేసిన సాంబుకి  ఏదో చేయాలని టీడీపీ అధినాయకులు నిర్ణయించారు. సాంబు కోరుకున్నట్టు పౌర విమాన యాన శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిని చేశారు. అలా  అయితే ఉచితంగా అనేక దేశాలు చుట్టి రావచ్చన్నది సాంబు ఆలోచన. పార్టీ నాయకత్వం అనుగ్రహించింది. ఆశీర్వదించింది.
చేజారిన పీయేపీ పదవి
భాట్టం విశాఖలో వుండగా ముఖ్యమంత్రి ఎన్టీఆర్  కబురు పెట్టారు, ఢిల్లీ వెళ్ళే ముందు హైదరాబాదు వచ్చి కలిసి వెళ్ళమని. భాట్టం ఆయన ఇంటికి వెళ్ళి కలిసారు. ఎన్టీఆర్  అప్పుడు  విద్యాశాఖ మంత్రి  కోటేశ్వర రావుతో మాట్లాడుతున్నారు. బయట చంద్రబాబు నాయుడు  కూర్చుని ఏదో రాసుకుంటూ, చదువుకుంటూ వున్నారు. మంత్రి వెళ్ళిపోయిన  తరువాత ఎన్టీఆర్, భాట్టంతో  అన్నారు. 'లోకసభలో పీయేపీచైర్మన్  గా మిమ్మల్ని  నామినేట్ చేస్తున్నాం. బాగా పనిచేసి పార్టీకి మంచి పేరు తెండి' అని భుజం తట్టారు.  భాట్టం మనసులో అనుమానం. ఉపేంద్ర ఇది జరగనిస్తాడా. అదే పైకి అన్నారు.ఎన్టీఆర్  చిరాకు పడ్డారు. చంద్రబాబును పిలిచారు. వెంటనే ఫోను చేసి ఉపెంద్రతో చెప్పండి, భాట్టం గారే  చైర్మన్ అని. బాబుకు ఉపేంద్ర ఫోనులో దొరకలేదు. 'అన్నగారు చెప్పిన పని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రండి' అంటూ బాబు షేక్ హాండ్ ఇచ్చారు.  భాట్టం ఢిల్లీ చేరుకునేసరికి అక్కడ సీను మారింది. ఉపేంద్ర మాధవరెడ్డితో మాట్లాడి, 'మాకు  (టీడీపీకి) పీయేపీ చైర్మన్ అక్కరలేదు, సీపీఎం సభ్యుడికి  ఇవ్వండి' అని స్పీకర్ కు ఉత్తరం రాశారు.  భాట్టం ఆరాత్రి ఎన్టీఆర్ కి ఫోను చేసి విషయం వివరించారు. 'అనుకున్నంత పనీ చేసాడా. చూస్తాను యెందుకు చెయ్యడో... మీరే చైర్మన్' అంటూ టేబుల్ మీద చరిచారు. ఎన్టీఆర్'  అంటూ భాట్టం తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఎన్టీఆర్  తెల్లవారు ఝామునే నిద్ర లేస్తారు. భాట్టం ఢిల్లీ నుంచి మళ్ళీ మరునాడు ఉదయమే ఫోను చేశారు. ఈసారి ఎన్టీఆర్ మాటలో తేడా. 'చూడండి శ్రీరామమూర్తి గారు, ఇందులో చాలా పెద్ద జాతీయ విధానాలు ఇమిడి వున్నాయి'  ఈసారి సర్దుకు పొండి అన్నట్టు మాట్లాడారు.  అనుకున్నట్టే పీఏపీ పదవి అందినట్టే అంది భాట్టం చేజారి సీపీఎం సభ్యుడిని వరించింది. ఈ సంఘటనతో భాట్టంకు రాజకీయాల పట్ల విరక్తి కలిగింది. తదుపరి ఎన్నికల్లో పార్టీ లోకసభ టిక్కెట్టు  ఇస్తానన్నా అయన ఒప్పుకోలేదు.
కాంగ్రెస్ అధినాయకత్వంపై ఇందిరాగాంధీ తిరుగుబాటు దరిమిలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చీలిపోయింది. అప్పుడు రాష్ట్రంలో జలగం వెంగల రావు ముఖ్యమంత్రి. ఆయన సంస్థా కాంగ్రెస్ లోనే వుండిపోయారు. ఆయన  మంత్రివర్గంలో అనేకమంది రాజీనామా చేసి ఇందిరా కాంగ్రెస్ లో చేరిపోయారు. జీ రాజారాం, మాణిక్య రావు, లుకలాపు లక్ష్మణ దాసు రాజీనామా చేసినవారిలో వున్నారు.
టియ్యే బిల్లు తెచ్చిన చిక్కు
భాట్టం మంత్రిగా వున్నప్పుడు విశాఖ నుంచి హైదరాబాదు మకాం మార్చినప్పుడు,  దొంగ బిల్లు పెట్టి డబ్బులు డ్రా చేసారని రాజకీయ ప్రత్యర్ధులు దుమారం లేపారు. అదెంత మొత్తం అరువందల చిల్లర. ఆ పిర్యాదు ఢిల్లీ వరకు వెళ్ళింది. తరువాత కేంద్రం నియమించిన విమదలాల్ కమీషన్ కూడా విచారణ జరిపిండి. భాట్టం అధిక మొత్తం  క్లెయిం చేయకపోగా,  తన సొమ్మే కొంత అదనంగా  కోల్పోయాడని కమీషన్ తేల్చి చెప్పింది.
మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ ఎస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఆయన వైపు మళ్లిపోతున్నారు. అసెంబ్లీలో భాట్టం అన్నారు. 'చెన్నారెడ్డి గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా. ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతో, మధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి లేచిపోతున్నట్టుగా  వుంది'
ఈ వ్యాఖ్య సభలో దుమారం రగిలించింది. పార్టీ మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. లేచిపోవడం అనే పదానికి అభ్యంతరం తెలిపారు. అది సభలో వాడతగ్గ పదమా కాదా అన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది.
తోకతపా:
పార్టీ మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన  భాట్టం శ్రీరామ్మూర్తి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు.          


కామెంట్‌లు లేవు: