25, జులై 2015, శనివారం

మళ్ళీ మొదలయిన పాదయాత్రలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 26-07-2015, SUNDAY)

సాధారణంగా రాజకీయ నాయకులు పాద యాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా దాని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా దాగేవుంటుంది. అయితే, చేసేది రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది.


కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాద యాత్ర చేసి తిరిగి చక్కాపోయారు. నడిచింది పది కిలోమీటర్లు మాత్రమే కానీ రాజకీయంగా చతికిల పడివున్న  తన పార్టీకి ఓ మేరకు జవసత్వాలను అందించిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం నిజానికి కాంగ్రెస్ పార్టీకి  సీమాంధ్ర ప్రాంతంలో నూకలు చెల్లిపోయాయనే అంతా అనుకున్నారు. నిరుడు అసెంబ్లీకి, లోక సభకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని నిట్ట నిలువునా మట్టి కరిపించారు. విభజన నిర్ణయంలో అన్ని పార్టీలకి ఎంతో కొంత పాత్ర వున్నప్పటికీ సీమాంధ్ర ఓటర్లు మాత్రం ఒక్క కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా పెట్టుకుని దాన్ని  ఘోరాతిఘోరంగా ఓడించారు. ఇది ఆ పార్టీకి నిజంగా మింగుడు పడని విషయం. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ అని పేరున్న కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం వచ్చిన దాదిగా ఇంతటి స్థాయిలో ఘోర పరాజయం ఎన్నడూ దాపురించలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఇక ఆ పార్టీకి సీమాంధ్రలో పుట్టగతులు వుండవని ఆ పార్టీవారే బలంగా నమ్మే స్తితి ఏర్పడింది. కొంత కాలం  క్రితం తెలంగాణా రాష్ట్రంలో పర్యటించి వెళ్ళిన రాహుల్ గాంధీ, అదే సమయంలో సీమాంధ్ర పర్యటనను దానితో  జత చేసుకోవడానికి సంకోచించాల్సిసిన పరిస్తితి ఏర్పడిందంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ దీనస్తితి అర్ధం చేసుకోవచ్చు. మరి రాష్ట్ర విభజన జరిగి ఏడాది తిరగగానే ఆ విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ  అదే ప్రాంతంలో ఒకరోజు పాదయాత్ర చేసి వెళ్ళగలిగారంటే, అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఏమైనా మెరుగు పడిందా అంటే అదీ లేదు. అంటే ఏమిటి? అలా తిరగగలిగిన పరిస్తితి విపక్ష నేతకు కల్పించింది అక్కడి పాలక పక్షమే. అందుకే  రాహుల్ పర్యటనలో ఆయన చేసిన ప్రసంగాలపై తెలుగుదేశం అధినేత స్వయంగా కల్పించుకుని వ్యాఖ్యానాలు చేయాల్సిన పరిస్తితి ఆ పార్టీకి ఏర్పడింది. ఈసారి రాహుల్ తన పర్యటనకు రైతుల ఆత్మహత్యలను కీలక అంశంగా తీసుకున్నారు. రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యల పాపం పూర్తిగా తెలుగుదేశానిదే అని సూత్రీకరించారు. నిజానికి రైతుల ఆత్మహత్యలకు ఏఒక్క ప్రభుత్వాన్నో కారణంగా చూపించడం సమంజసం కాదు. ప్రభుత్వాలు ఏ పార్టీకి చెందినా అవి తీసుకునే నిర్ణయాలు లేదా వాటి ఆలోచనలు దీర్ఘ కాలంలో ఇటువంటి పర్యవసానాలకు, పరిణామాలకు  కారణం అవుతాయి. అంటే, రైతన్నల ఉసురు తీయడంలో అన్ని  పార్టీలకి ఎంతో కొంత పాత్ర వుండే తీరుతుంది. కానీ ఈ రోజుల్లో రాజకీయాల రంగూ రుచీ వేరు. అధికారంలో లేనప్పుడు చెప్పే మాటలు వేరు. చేసే ఆరోపణలు వేరు. అదే పార్టీ అధికారంలోకి రాగానే అదే అంశంపై మాట్లాడే మాటలు వేరు, చేసే ప్రత్యారోపణలు వేరు. అధికారానికి రాకముందు రైతే వారికి  దేముడు. రైతులకు ఏంచేసినా తక్కువే అనే రీతిలో నాయకుల ప్రసంగాలు సాగుతాయి. 'మీకు నేనున్నా' అనే భరోసాలకు కొదవే వుండదు. అదే అధికారపీఠం ఎక్కగానే మాటలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం కనిపించదు. అన్నీ ఆ తానులో ముక్కలే.   ఇందుకు చరిత్ర పుటలను గాలించాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఏన్నర్ధం క్రితమో అంతకు కాస్త ముందో ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి తనకున్న అనేక రాజకీయ రికార్డులకు మరోటి జోడించారు. ఇటీవలి సంగతే కనుక చాలామందికి ఇది గుర్తు వుండి వుండవచ్చు. కానీ ఆయన అంతకు ముందు ముప్పయి అయిదు సంవత్సరాలకు పూర్వం జరిపిన పాదయాత్ర గురించి తెలిసిన వారు తక్కువ. నిజానికి అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే పేరున్న రాజకీయ నాయకుడు ఒకడున్నాడని తెలిసిన వారే తక్కువ.             

అప్పట్లో స్థానికులకు సయితం అంతగా  పరిచయం లేని చంద్రబాబు నాయుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించారు. గడప గడప తొక్కారు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించారు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించారు. ప్రతి వూరిలో ఆగి ఆ ఊరి సమస్యలను అడిగి అడిగి  తెలుసుకున్నారు.
రచ్చబండ్లమీద,  ఇళ్ళ అరుగుల మీద  సేద తీరారు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల వద్దే అడ్డంకులు ఎదురయినా  మడమ తిప్పలేదు. ఓ జత దుస్తులు, కాలికి చెప్పులు, తోడుగా కొందరు యువకులు. అంతే! ఇంతకు  మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా  కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ దిరిగారు. రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని   ఎన్నికల్లో గెలిచారు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు.



ప్పటికింకా  నిండా  మూడుపదులు నిండని ఆ యువకుడే మళ్ళీ నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు పూర్వం  ఆరుపదులు పైబడిన  వయస్సులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పునర్వైభవం కోసం తిరిగి కాలినడకనే మార్గంగా  ఎంచుకున్నారు.. వస్తున్నా మీకోసంఅంటూ సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నారు. కాకపొతే, అప్పటికీ ఇప్పటికీ ఎన్నో తేడాలు కొట్టవచ్చినట్టు కానవస్తాయి. అప్పుడు జత దుస్తులు, చెప్పులతో, వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో  కార్యకర్తలను వెంటేసుకుని,  మందీ మార్భలం, హంగూ ఆర్భాటం  లేకుండా తిరిగిన చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో జరిపిన  పాదయాత్రలో అంతా కొత్తదనమే.   విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న డ్యూమాక్స్ స్పోర్ట్స్ షూ ధరించి, కుడియెడమల పార్టీ  నాయకులు, కార్యకర్తలు వెంట నడుస్తుండగా ,  ప్రత్యేకంగా రూపొందించి రికార్డు చేసిన పాదయాత్రా గీతాలు హోరెత్తిస్తుండగా, ‘రాజువెడలె రవితేజములడరగ’  అన్నట్టు పాదయాత్రకు నడుం కట్టారు. ఇప్పటి  పరిస్థితుల్లో ఇవన్నీ తప్పనిసరి ఆర్భాటాలు. పైగా తొమ్మిదేళ్ళ పైచిలుకు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. రెండు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో వోడించి సమర్ధుడైన  ముఖ్యమంత్రిగా దేశవిదేశాల్లో మన్ననలందుకున్న రాజకీయ నాయకుడు. ప్రచారం ద్వారా రాజకీయ లబ్ది పొందే విషయంలో ఆయువుపట్లన్నీ  తెలిసిన వాడు.  తెలుగుదేశం పార్టీకి  పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలలో  ఏఒక్క చిన్న అంశాన్ని కూడా విస్మరించినా అది కూడదీసుకోలేని  తప్పిదం కాగలదన్న ఎరుక గలిగిన రాజకీయ దురంధరుడు. అందుకే, ఈ యాత్రకు పేరు పెట్టడం దగ్గరనుంచి, యాత్రసాగే మార్గం నిర్ణయించే వరకు ఆయన  అనేక రోజులపాటు సహచరులతో మంతనాలు జరిపారు. పార్టీకి  చెందని వృత్తి  నిపుణులను  కూడా విశ్వాసంలోకి తీసుకుని, యాత్ర సందర్భంగా చేసే ప్రసంగాలు, ప్రజలను ఆకట్టుకునే హావభావాలు మొదలయిన అంశాల్లో  కూడా గట్టి కసరత్తు చేసారని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. సుదీర్ఘ  పాదయాత్రల్లో  ఎదురయ్యే సాధకబాధకాలు, శారీరక ఇబ్బందులు  అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పిమ్మటనే ఆయన ఈ సాహస నిర్ణయం తీసుకున్నారు. పార్టీ  ఎదుర్కుంటున్న క్లిష్ట పరిస్తితిని దృష్టిలో వుంచుకుని ఆలోచిస్తే,  తెలుగు దేశాన్ని  వొడ్డున పడేయడానికి ఇంతకంటే మరో దారి కనిపించని స్తితిలోనే,   ఆయన ఇంతటి ధైర్యం చేశారని అనుకోవాలి. నాటి  ఉప ఎన్నికల్లో వరస పరాజయాలు, కట్టుతప్పుతున్న పార్టీ శ్రేణులు, నాయకత్వ పటిమపట్ల  తలెత్తుతున్న సందేహాలు, ప్రాంతాల పరంగా  నాయకుల్లో  రగులుతున్న విద్వేషాలు, రాజకీయ వారసత్వం గురించి కుటుంబ సభ్యుల్లో పొటమరిస్తున్న విభేదాలు ఇలా వొకటి కాదు రెండు కాదు అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు పాదయాత్రకు మించిన ప్రత్యామ్నాయం  కనిపించకనే అలవికి మించిన ఈ భారాన్ని తలకెత్తుకోవాల్సివచ్చింది.
ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర అంత తేలికయిన విషయమేమీ  కాదు. శారీరక శ్రమతో పాటు ఎన్నో  వ్యయ ప్రయాసలు ఇందులో ఇమిడి వున్నాయి. ఒక రోజు యాత్రకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. షష్టిపూర్తి దాటిన  వయస్సులో ఇంతంత దూరాలు నడవడం ఆషామాషీ కాదు. కాకపొతే, వ్యక్తిగత క్రమశిక్షణకు, దినవారీ వ్యాయామాలకు, యోగాభ్యాసాలకు   మారుపేరు చంద్రబాబు అన్న పేరు తెచ్చుకున్న మనిషి కాబట్టి  కాలి నడకలో ఎదురయ్యే శారీరక శ్రమను ఆయన కొంత మేర అధిగమించి  తన గురుతర లక్ష్యాన్ని సాధించడమే కాకుండా అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆరోజుల్లో ఇది సాధ్యం అని ఎవరయినా అన్నా ఎవరూ నమ్మలేని పరిస్తితి.


అంతకుముందు దశాబ్దం క్రితం  వై ఎస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్ర, దానితో సాధించిన విజయం  రాజకీయ నాయకులను  పాదయాత్రలకు పురికొల్పేలా చేసాయి. ఆ యాత్ర చేసిన రాజశేఖర రెడ్డి, అంతకు ముందు రెండు మార్లు ప్రయత్నించి అందుకోలేని ఎన్నికల విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాదయాత్రలకు కొంత సెంటిమెంటు రంగు కూడా అంటుకుంది.  
ఈ పాదయాత్రల  వల్ల రాజకీయ పార్టీలకు  వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమీ వుండకపోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక  ఎన్నికలకు ఇంకా బోలెడు వ్యవధానం వుంది. అయితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలాంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి. తమ నడుమ  వుండేవారికే జనం ఈ నడుమ పట్టం కడుతున్నారు. ఏసీ  గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారు. కాపపోతే, యాత్ర సందర్భంలో ప్రజల సమస్యలు ప్రస్తావనకు తెచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వుండాల్సి వస్తుంది. అంతకు ముందు అధికారంలో వున్నప్పుడు  ఏం చేసారన్న ప్రశ్న సహజంగా జనం నుంచి ఎదురయ్యే అవకాశం వుంటుంది.
ప్రజల ఇబ్బందులను, కడగండ్లను కళ్ళారా చూడగలిగే అవకాశం ఈ పాద యాత్రల  వల్ల రాజకీయ నాయకులకు లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా పరిష్కరించ గలిగితే  యాత్రా ఫలసిద్ధి కూడా  ప్రాప్తిస్తుంది. 
2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ప్రజా ప్రస్తానంపాదయాత్ర  రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది.  చంద్రబాబు  ‘వస్తున్నా ..మీకోసంపాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్  నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340  కిలోమీటర్లు సాగి  శ్ర్రీకాకుళంజిల్లా ఇచ్చాపురంలోనే ముగిసింది. మనోవాంఛాఫలసిధ్యర్ధం ఈ ఇద్దరు నాయకులు తమ తమ యాత్రలకు తుది మజిలీగా ఇచ్చాపురాన్ని ఎంపిక చేసుకున్నారేమో అనిపిస్తుంది. వారు తలపోసినట్టుగానే ఇద్దరికీ కోరిక నెరవేరింది. దానితో రాజకీయ నాయకుల్లో పాదయాత్రల సెంటిమెంటు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఏదయితేనేం, ఏ పేరుతొ అయితేనేం నాయకులు ఏసీ గదులు ఒదిలి కొద్ది కాలం అయినా ప్రజలతో మమేకం అయ్యే వీలు ఏర్పడింది. రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి. (25-07-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE : Courtesy Image Owner   


కామెంట్‌లు లేవు: