18, ఫిబ్రవరి 2015, బుధవారం

హననం కాదు కావాల్సింది సహనం

(Published in 'SURYA' telugu daily on Thursday, 19-02-2015)

కాకతాళీయం అనండి యాదృచ్చికం అనండి ఇంకేదయినా అనండి పరస్పర విరుద్ధం, పరస్పర సంబంధం వున్న వార్తలు నిన్న బుధవారం వార్తాపత్రికల్లో దర్శనం ఇచ్చాయి.
అందులో ఒకటి ఢిల్లీలో క్రైస్తవ మతాధికారుల కార్యక్రమానికి హాజరయిన సందర్భంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం.
ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాటి సందర్భాలలో  ఏవిధంగా మాట్లాడుతారో అదే విధంగా అది  సాగిపోయింది, కాకపోతే మోడీ తరహా కొన్ని చమత్కారాలతో (సబ్ కా సాత్ ...సబ్ కా వికాస్).
ప్రధాని ప్రసంగం సాగిన తీరు పత్రికల్లో ఇలా వచ్చింది.
'మతపరమైన హింసపై కఠినంగా వ్యవహరిస్తాము. మత విద్వేషం ప్రేరేపించేవారు ఎవరయినా సరే సహించేది లేదు. ఈ దేశంలో ఎవరయినా తమకు నచ్చిన మత విశ్వాసాలను పాటించేందుకు పూర్తి స్వేచ్చ వుంది. ఈ విషయంలో ఎలాటి వొత్తిళ్లు పనిచేయవు. మెజారిటీ వర్గం అయినా, మైనారిటీ వర్గం అయినా బాహాటంగా కాని, చాటుమాటుగా కాని అన్య మతానికి వ్యతిరేకంగా విద్వేషానికి పాల్పడినా, కుట్రలు చేసినా సహించేది లేదు. అలాటి చర్యలను ఉక్కు పాదంతో అణచి వేస్తాము'
మన దేశానికి చెందిన కురియా కోస్  అలియాస్ చవర, మదర్ యాప్రేసియాలకు సెయింట్ హుడ్ ప్రకటించిన సందర్భంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కాబట్టి దానికి అనుగుణంగానే ప్రధాని ప్రసంగించారు. ఇటీవల ఢిల్లీలో క్రైస్తవులకు చెందిన చర్చీల మీద జరిగిన దాడుల నేపధ్యం దృష్టిలో వుంచుకుంటే,  ప్రధాని వ్యక్తపరచిన ఈ అభిప్రాయాలకు ప్రాముఖ్యం వుంటుంది. ఈ విషయంలో ఆయన మొదటిసారి పెదవి విప్పారని అనుకోవాలి. మోడీ భారతీయ జనతా పార్టీకి నాయకుడు అయినప్పటికీ, మొత్తం దేశానికీ అయన ప్రధాన మంత్రి. అంచేత అటువంటి సమావేశాల్లో వేరే విధంగా మాట్లాడే అవకాశం లేదు. మత ఘర్షణలు జరక్కుండా చూడడానికి, మతం పేరుతొ ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందనీ, అటువంటి అనాగరిక చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామనీ ప్రతి ప్రధానమంత్రి నొక్కివక్కాణించడం  ఒకరకంగా పరిపాటిగా మారిపోయింది. సరే. అదలా వుంచితే, లౌకిక రాజ్యంగ  వ్యవస్థను ఎంచుకున్న భారత దేశాన్ని పాలించేవారికి దేశంలోని మైనారిటీ ప్రజల్లో అభద్రతా భావాన్ని దూరం చేయడం కూడా ఒక కర్తవ్యమే. ఆవిధంగా ప్రధాన మంత్రి మోడీ మాటలవల్ల అలాటి ఫలితాలు వస్తే అంతకంటే కావాల్సింది లేదు.
కానీ అదే రోజు పత్రికల్లో మరో వార్త వచ్చింది. అదే ఈ వ్యాసానికి ప్రేరణ.
'భారత దేశాన్ని హిందూ దేశం చేస్తారా' అంటూ సున్నీ ఉలేమా కౌన్సిల్, ఆర్.యస్,యస్. మైనారిటీ వ్యవహారాల ఇంచార్జ్  ఇంద్రేష్ జీ ని   నిలదీసినట్టు ఆ వార్త సారాంశం.
కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి హాజీ మహమ్మద్ నేతృత్వంలో కొంత మంది మత పెద్దలు ఇంద్రేష్ జీని కలుసుకున్నారు. ఈ సమావేశంలో మైనారిటీలలో పెరుగుతున్న అభద్రతాభావాన్ని గురించి తెలియచేశారు.
'మా దేశ భక్తిని  నిరూపించుకోవాలంటే ఏం చెయ్యాలి? వందేమాతరం గీతాన్ని ఆలపించాలా? ఇది మా దేశం  అనుకుంటున్నాము.  గాంధీని మా నాయకుడిగా భావిస్తున్నాము' అని ఈ సమావేశంలో తెలియచెప్పినట్టు ఆ తరువాత హాజీ మహమ్మద్ విలేకరులతో చెప్పారు.
'1947 లో దేశ విభజన సమయంలో మా పూర్వీకులు జిన్నా వాదనతో, పాకీస్తాన్ వైఖరితో  ఏకీభవించకుండా ఈ దేశంలోనే  వుండిపోయారు. భారత రాజ్యాంగంపై  విశ్వాసం వుంచారు. ఇలా భారత్ నే నమ్ముకునివున్న  మావంటి ముస్లిం ల నుంచి ఆర్.యస్.యస్.  ఏమి ఆశిస్తోంద'ని  ఆయన ప్రశ్నించారు.
ఎం.ఐ.ఎం. నాయకుడు అసదుద్డీన్ ఒవైసీ వ్యాఖ్యలపట్ల యెలా స్పందిస్తారని ఇంద్రేష్ తమని ఎదురు ప్రశ్నించినట్టు చెబుతూ, 'సాధ్వీ నిరంజన్ జ్యోతి, సాక్షి మహారాజ్ ఎలాగో ఒవైసీ కూడా అంతే. ఒక ఎంపీ మాత్రమే' అని హాజీ మహమ్మద్ బదులిచ్చారు.   
ఇంతవరకు బాగానే వుంది, ఓ పక్క తాము భారతీయులమని చెబుతూనే, ఆర్.ఆర్.యస్. రూపం ఇచ్చిన భరతమాత చిత్ర పఠానికి నమస్కరించడం తమకు సుతరామూ మనస్కరించదని తేల్చి చెప్పారు. అలా చేయడం ఇస్లాం కు విరుద్ధం అన్నారు.
మన దేశం సంగతి ఇలా వుంటే అటు అమెరికాలో హిందూ దేవాలయం గోడలమీద విద్వేషం రెచ్చగొట్టే నినాదాలు కానరావడం మరో వివాదాంశం అయింది. అక్కడి హిందూ సంఘాలు ఈ సంఘటనపై మండిపడుతున్నట్టు వార్తలు వచ్చాయి.


కాగా, గత ఆదివారం మరో భయంకరమైన ఉగ్రవాద చర్య చోటు చేసుకుంది. దాదాపు ఓ డజను మంది ఈజిప్షియన్ క్రిష్టియన్లను, ముస్లిం ఉగ్రవాద సంస్థ - ఐ.యస్.ఐ.యస్. కు చెందిన వారు,  సముద్ర తీరంలో బహిరంగంగా తలలు నరికి మట్టుబెట్టారు. ఆ దృశ్యాలను  యూ ట్యూబ్ లో పెట్టారు. ఇవి  చూసిన వారికి 'మనం నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నామా లేక పాత  రాతి యుగంలోనే వుండిపోయామా' అనే సందేహాలు తలెత్తుతున్నాయి.     
ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు.
కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.

మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుంది అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం. ఇప్పుడు మానవాళికి కావాల్సింది మానవ  హననం కాదు, కాసింత సహనం.
'సహనావవతు' అనేది వేద కాలం నుంచి వినవస్తున్న హితోక్తి.

(18-02-2015)
NOTE: Courtesy Image Owner 

6 కామెంట్‌లు:

విసుకి వాడి మనస్సె ఒక విశ్వం... చెప్పారు...

మీరు చాలా బాగా వ్రాసారు. కాని ఫార్మేట్ సరిగా లేదు. కొంచెం FORMAT చెయ్యండి paragraphsni.

విసుకి వాడి మనస్సె ఒక విశ్వం... చెప్పారు...

మీరు చాలా బాగా వ్రాసారు. కాని ఫార్మేట్ సరిగా లేదు. కొంచెం FORMAT చెయ్యండి paragraphsni.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విసుకి వాడి మనస్సే ఒక విశ్వం - రాస్తూ పోతున్నాను కాని, కంప్యూటర్ అవగాహన తక్కువ. ఫార్ మాట్ (FORMAT) చేయడం అంటే ఏమిటో కాస్త తెలియచేస్తారా? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవడ్డ్డు - భండారు శ్రీనివాసరావు (bhandarusr@gmail.com)

అజ్ఞాత చెప్పారు...

శ్రీనివాస రావు గారూ,

పేరాగ్రాఫుల్ని ఫార్మాట్ చెయ్యటం అంటే "విసుకి వాడి మనస్సె ఒక విశ్వం..." గారు వివరిస్తారేమోలెండి (బహుశా పేరాగ్రాఫుల మధ్య గాప్ - పేరాగ్రాఫ్ బ్రేక్ - ఇవ్వటం అయ్యుంటుందని నేను అనుకుంటున్నాను. కాని వారినే చెప్పనివ్వండి).

ఈలోగా మీరు మాత్రం కంప్యూటర్ ముందు కూర్చుని ఫార్మాట్ అనే కమాండ్ క్లిక్ చెయ్యకండి - కొంప కొల్లేరవుతుంది :)

- విన్నకోట నరసింహారావు

అజ్ఞాత చెప్పారు...

Format cheyyavalasina panemundi?No need.It is a well written article.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

పై పొస్టుకు సంబంధం లేని ప్రశ్న. సచివాలయం లోనికి మీడియాను అనుమతించరాదని (అధికారిక ప్రెస్ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మినహాయించి) కేసీఆఋ ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఈరోజు పత్రికల్లో వార్త చూశాను. అనుభవజ్ణుడైన జర్నలిస్టుగా దీన్ని గురించి మీరో బ్లాగు పోస్ట్ వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

(దీని మీద టీవీ చర్చా కార్యక్రమాలేమన్నా వెంటనే జరిగాయేమో, మీరు వాటిల్లో కనిపించారేమో నాకు తెలియదు. టీవీ చర్చలు నేను చూడను. ఆ హోరు, అరుపులు, కేకలు, గందరగోళం భరించలేను.)