14, ఫిబ్రవరి 2015, శనివారం

జల జగడం

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 15--02-2015, SUNDAY)

ఒక స్పందన - ఒక ప్రతిస్పందన ఈ రెండూ,  రెండు తెలుగు రాష్ట్రాల పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోకుండా కాపాడాయి. రెండు ఫోను సంభాషణలు రెండు తెలుగు రాష్ట్రాలలో నివసించే ప్రజల్లో చెలరేగిన భయాందోళనలను సమసిపోయేలా చేయగలిగాయి. ఏమైతేనేనేం మొత్తం మీద, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నడుమ తారాస్థాయికి చేరిన 'జలజగడం'  సుఖాంతం దిశగా మలుపు తీసుకుంది.
మొన్న  శుక్రవారంనాడు ప్రధాన తెలుగు దినపత్రికల్లో కనపడ్డ పతాక శీర్షికలు చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పడ్డ సంబరం ఆ రోజు సాయంత్రానికల్లా ఆవిరై పోయింది. 'మాట్లాడుకుందాం రండి, సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందాం' అంటూ తెలుగుదేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 'గతం గతః , ఆంధ్ర తెలంగాణా గొడవలేవీ  మనసులో పెట్టుకోవద్ద'ని  టీ.ఆర్.యస్. అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నట్టు పత్రికల్లో చదివి 'ఆహా! మంచి రోజులు వచ్చేస్తున్నాయ'ని  అటుపక్కా, ఇటు పక్కా జనాలు  మురిసి ముక్కచెక్కలయ్యారు. కానీ ఇరవై నాలుగ్గంటలు కూడా గడవకముందే నాగార్జున సాగర్ దగ్గర రెండు రాష్ట్రాల అధికారుల నడుమ మొదలయిన సంభాషణ సంఘర్షణగా మారిపోయి, కొద్దిసేపట్లోనే  ముదిరిపాకాన పడింది. సాగర్ లో నీటిమట్టం మాదిరిగానే మాటలు తగ్గిపోయి, బాహాబాహీ  చేతులు కలుపుకునే  దుస్తితి దాపురించింది. అంతటితో  ఆగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు రంగం లోకి దిగి, పరిస్తితిని చక్కదిద్దకపోగా మరింత ఆజ్యం పోసారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల శాంతి భద్రతల పరిరక్షకులే   ఒకరిపై మరొకరు లాఠీలు ఝలిపించుకుంటూ కానవచ్చిన దృశ్యాలను టీవీల్లో చూసిన జనం బిత్తరపోయారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పిన 'మంచి' ముక్కలు ఉదయం పత్రికల్లో అయితే వచ్చాయి కానీ, వాళ్ల మాటల్లో కానవచ్చిన 'మంచితనం' కింది స్థాయి దాకా చేరిన దాఖలా కానరాలేదు. 'రెండు దేశాల సరిహద్దుల్లో  సైనికుల్లా ఈ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు తలపడితే ఏమవుతుందో' అని ప్రజలు తలలు పట్టుకున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే,  వాస్తు, ముహూర్తాలపట్ల నమ్మకాలు  లేనివాళ్ళకు కూడా రాష్ట్ర విభజన 'మంచి ముహూర్తం'లో జరగలేదేమో అని అనుమానించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
కధ ఇలా క్లైమాక్స్ కు చేరిన దృశ్యాలు టీవీల్లో చూసారో, సమాచారం తెలుసుకున్నారో తెలియదు కాని ముందుగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుతో ఫోనులో మాట్లాడారు. పరిస్తితిని వివరించి చక్కదిద్దడంలో సాయం కోరారు. కేసీఆర్ కూడా అందుకు తగ్గట్టే ప్రతిస్పందించారు. గవర్నర్ సముఖంలో విషయాలను చర్చించి, వివాదాలను పరిష్కరించుకునేందుకు సంసిద్ధత తెలిపారు. ఆ వెంటనే, గవర్నర్ నరసింహన్ కు ఫోను చేసి శనివారం ఉదయమే గవర్నర్ సమయం తీసుకుని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి మార్గం సుగమం చేశారు. ఈ వ్యాసం రాసే సమయానికి ఈ సమావేశం జరుగుతోంది. ఇది ఫలప్రదం కావాలని  ఉభయ రాష్ట్రాల్లో నివసిస్తున్న,  రాజకీయాలతో సంబంధం లేని తెలుగు ప్రజలందరూ మనఃస్పూర్తిగా కోరుకుంటున్నారు. ఈ విధంగా స్వతంత్ర భారతంలో రెండు రాష్ట్రాల నడుమ సాయుధ సంఘర్షణకు తాత్కాలికంగా అయినా తెర పడింది. శుభం.  గతంలో కూడా కావేరి  జల వివాదాల కారణంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఉదంతాలు లేకపోలేదు. కానీ, మొన్న శుక్రవారం నాడు కృష్ణమ్మ సాక్షిగా నాగార్జున సాగర్ దగ్గర రెండు రాష్ట్రాల పోలీసులు లాఠీలతో తలపడ్డ సందర్భం గతంలో ఎన్నడూ అనుభవంలోకి రాలేదు.
ఈ రకమైన దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోవడానికి ముందు ఉభయ రాష్ట్రాల సేద్యపు నీటి అధికారుల మధ్య పలు పర్యాయాలు చర్చలు, సంప్రదింపులు జరిగాయి. కుడి కాల్వకు నీళ్ళు విడుదల చేయాల్సిన అవసరాన్ని గురించి ఆంధ్ర ప్రదేశ్ అధికారులు, అలా చేయడానికి  యెందుకు కుదరదో తెలంగాణా అధికారులు పరస్పరం తెలియచేసుకున్నారు. ముందే నిర్ధారణకు వచ్చి జరిపే సంప్రదింపుల్లో ఎలాటి ఫలితం రాదన్నది సామాన్యుడికి కూడా తెలిసిన విషయమే. అదే జరిగింది. జరిగిన తరువాత ఏం జరగాలి? పైవారికి విషయం ఎరుక పరచాలి. 'ఏం చెయ్యాలి' అన్నదానిపై పైనుంచి ఆదేశాలు తీసుకోవాలి. కానీ విచిత్రం ఏమిటంటే వారు అన్నింటికీ సిద్ధపడే వచ్చినట్టు తరువాత పరిణామాలను బట్టి  తెలుస్తోంది.


సాగర్ వద్ద సాగుతున్న సంఘర్షణ వాతావరణం గురించి మీడియాలో కధనాలు వెలువడుతున్న సమయంలోనే ఆంధ్ర ప్రదేశ్ సాగునీటి శాఖామంత్రి దేవినేని ఉమా, తెలంగాణా సేద్యపు నీటి శాఖ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశాల్లో తమ తమ వైఖరులను పునరుద్ఘాటిస్తూ బుల్లి తెరలపై కానవచ్చారు. సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశ్యం వెల్లడిస్తూనే, మరో పక్క తద్విరుద్ధ అంశాలను ప్రస్తావించారు. కృష్ణా జలాలను వెంటనే విడుదల చేయాలని, రైతుల తక్షణ అవసరాల దృష్ట్యా తెలంగాణా అందుకు అంగీకరించాలని కోరుతూనే, కృష్ణానదీజలాల ట్రిబ్యునల్ కు రాసిన ఉత్తరాన్ని దేవినేని విలేకరులకు చూపించారు. హరీష్ రావుతో ఫోనులో మాట్లాడినట్టు కూడా వెల్లడించారు.
ఇవన్నీ చూసిన వారికి అనుసరించవలసిన విధివిధానం ఇదేనా అనిపించక మానదు. నీటి అవసరం ఆంధ్ర ప్రదేశ్ రైతులది. అయినప్పుడు, రాజధాని ఇంకా హైదరాబాదులోనే వున్నప్పుడు, సచివాలయాలు కూడా పక్కపక్కనే ఒకే ఆవరణలో వున్నప్పుడు, ఉత్తరాలు రాసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫోనులో మాట్లాడే బదులు ఇద్దరు మంత్రులు  కలిసి కూర్చుని మాట్లాడుకుంటే పోయేదేముంటుంది ?  విద్యుత్ సరఫరా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ని  మిగులు రాష్ట్రంగా చేయడానికి కేంద్రంతో పలుమార్లు సంప్రదింపులు జరిపామనీ, విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందాలు సకాలంలో చేసుకోవడం వల్లనే ఇరవై నాలుగు గంటలు సరఫరా చేయగలుగుతున్నామనీ, తమ మాదిరిగా చేయకపోవడం వల్లనే తెలంగాణకు విద్యుత్ కష్టాలు చుట్టుముట్టాయనీ చెప్పుకుంటున్న ఆంధ్ర పాలకులు,  సేద్యపు నీటి విషయంలో రైతుల ఇబ్బందులను తీర్చడానికి అదే విధమైన సంప్రదింపుల విధానాన్ని ఎంచుకోకుండా కేవలం ఉత్తరాలకు,  ఫోను సంభాషణలకు పరిమితం కావడంలో అంతరార్ధం ఏమిటి? అలాగే, మరోపక్క,  'ఇప్పటికే కృష్ణా జలాల్లో ఆంధ్ర ప్రదేశ్ తన వాటాను మించి వాడుకుంద'ని నొక్కి చెబుతున్న తెలంగాణా మంత్రి హరీష్ రావు, పరిస్తితి బాగా విషమించిన తరువాత కానీ సానుకూల ప్రకటన చేయలేకపోయారు. ఆంధ్ర రైతుల అవసరాలకు యెంత నీరు అవసరమో లిఖిత పూర్వకంగా తెలియచేస్తే సామరస్యంగా వ్యవహరించడానికి సిద్ధమని  దరిమిలా ప్రకటించారు. తెలంగాణా భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సర్దుబాటు చేయాలన్న  షరతు కూడా పెట్టారు.  
మంత్రుల ప్రకటనలను బట్టి సామాన్యులకి  అర్ధం అయ్యేది ఏమిటంటే, ఇది పరిష్కారానికి అనువుకానంత జటిలమైన సమస్య ఏమీ కాదని. ఉభయపక్షాలు బెట్టుసరికి పోయి మెట్టు దిగడానికి సంసిద్ధంగా లేకపోవడమే విషయం ఇంతగా చిక్కుముడి పడిపోవడానికి కారణం అయివుంటుందని.
మంచిది. సాగర్ సంఘర్షణ పుణ్యమా అని ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలకు కూర్చున్నారు. తమ వాదనలను సిద్ధం చేసుకునే వచ్చారు. వాదనల వల్ల  ఎవరు రైటో తెలుస్తుంది. చర్చల్లో ఏది రైటో తేలుతుంది.
ఈ చర్చల్లో శాశ్విత పరిష్కారం దొరక్కపోయినా తాత్కాలిక ఉపశమనం లభించడానికి ఆస్కారాలు బాగా వున్నాయి. గవర్నర్ ప్రమేయం వుంది కాబట్టి ఏదో ఒక మార్గం కనుక్కుని తీరతారు. ఇప్పటికే సరే!కానీ,  ఈ రెండు రాష్ట్రాల నడుమ పరిష్కారం కావాల్సిన అనేక ఇతర సమస్యలు వున్నాయి. ఈ సమావేశం వాటి పరిష్కారానికి కూడా దోహదం చేయగల తొలి సోపానం కాగలిగితే అంతకన్నా కావాల్సింది లేదు. 
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాకతాళీయంగా 'ప్రేమికుల దినం' నాడు కలిసారు. నిజమైన 'ప్రజా ప్రేమికులు' అనిపించుకోవాలంటే ఇరువురూ ఒక మెట్టు దిగి ఆలోచించాలి. అప్పుడే వారు, చుట్టుముడుతున్న సమస్యలనుంచి తమ రాష్ట్రాలను గట్టెక్కించగలుగుతారు.
'కాదుకూడదు, ఇలాగే మొండిగా వ్యవహరిస్తాం' అనే ధోరణిలోనే ఇక ముందు కూడా  ముందుకు సాగితే, రాజకీయంగా తమ పార్టీలకి లాభించవచ్చునేమో కానీ, ప్రజల దృష్టిలో చులకన అవడం ఖాయం.  (14-02-2015)                     

IMAGE  COURTESY 'ABN' 

2 కామెంట్‌లు:

sarma చెప్పారు...

మహాభారత యుద్ధానికి ముహుర్తం శ్రీకృష్ణుడు నిర్ణయించారు. దీనికెవరు పెట్టేరో తెలియదు కాని బహుళ నవమి శుక్రవారం బహు దివ్యంగా ఉంది... ఏకోత్తర వృద్ధి...

అజ్ఞాత చెప్పారు...

మన బోండాం పోలీసులు బాహాబాహీ కూడా చేయగలరని తెలిసి సంతోషమైంది. కాల్పులు జరుకుని, నలుగురు అటు ఇటూ క్షతగాత్రులై వుంటే రంజుగా వుండేది. .. నారాయణ.. నారాయణ..