9, జులై 2012, సోమవారం

ఒరులేయవి యొనరించిన........


ఒరులేయవి యొనరించిన........
క్షౌర శాలలకు మంగళవారం సెలవు. సంప్రదాయాల ప్రకారం మంగళ వారం మంగళకరమైనదంటారు. అలాటి శుభకరమయిన రోజున క్షౌర శాలలకు మాత్రమే సెలవెందుకు ఇస్తారు? సరే! ఆ సంగతి వొదిలేద్దాం. కానీ జవాబు దొరకని మరికొన్ని ప్రశ్నలు కూడా తరచూ నా మదిలో రొద చేస్తూంటాయి.
బార్బర్ షాపుకు వెళ్ళేవారిలో చాలామంది పాత దుస్తులు ధరించి వెడుతూ వుండడం కద్దు. మడత నలగని ఇస్త్రీ బట్టలు వేసుకుని క్షౌరానికి వెళ్ళే వాళ్లు బహు కొద్ది మంది మాత్రమే కానవస్తుంటారు. ఎందుకిలా? అన్నది మరో ప్రశ్న.
స్నానం చేసి క్షౌరానికి వెళ్ళేవాళ్ళు కలికానికి కూడా దొరకరేమో. బహుశా క్షౌర కార్యక్రమం అన్నది ఒక రకం  మైలగా భావించే మనస్తత్వం చాలామందిలో వుండడమే దీనికి కారణమేమో.
క్షౌరం సంగతి పక్కనపెట్టండి. ఇల్లు వూడ్చేటప్పుడు కానీ, కడిగి తుడిచేటప్పుడు కానీ శుభ్రమయిన దుస్తులు ధరించకుండా వుండడం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఎందుకంటే ఇల్లు వూడ్చేటప్పుడు ఎలాగూ మురికి అంటుకుంటుంది. అందుకని ఆ పని పూర్తి చేసిన తరువాతే కాళ్ళూ  చేతులు కడుక్కుంటే పోలా అన్న భావన మనల్ని ఆ పని చేయిస్తుంది.
ఇదేదో మన దేశానికి మాత్రమే పరిమితమయిందన్న నా ఆలోచన తప్పని ఈ మధ్యనే తెలుసుకున్నాను. అమెరికాలో సెటిల్ అయిన నా భారతీయ మిత్రుడొకరు ఇటీవల మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో నేను బార్బర్ షాపుకు వెళ్ళే పనిలో వున్నాను. శుభ్రంగా గడ్డం చేసుకుని, స్నానం చేసి బార్బర్ షాపుకు బయలుదేరుతున్న నన్ను చూసి అతగాడు రవ్వంత ఆశ్చర్యపోయినట్టు అతడి ముఖ కవళికలను బట్టి అర్ధం అయింది.
అయితే, ఈ విషయంలో నా అభిప్రాయాలు నాకున్నాయి.
క్షౌర శాలలో కూర్చున్నప్పుడు నా వొంటినుంచి వెలువడే చెమట వాసన వల్ల  నాకు క్షౌరం చేస్తున్న వ్యక్తికి ఇబ్బంది కలిగించరాదన్నదే నా ఉద్దేశ్యం. అలాగే జుట్టును కత్తిరించే క్రమంలో, మాసిపోయిన నా కాలర్ ను వెనక్కి మడిచేటప్పుడు దాని దుర్గంధం అతగాడికి సోకరాదని కూడా నేననుకుంటాను.  మనం ఏవయితే  అసహ్యించుకుంటామో వాటిని  ఇతరులు  కూడా ఏవగించుకునే అవకాశం వుంది. మహాభారతంలోని  – ‘ఒరులేయవి యొనరించిన’  పద్యపాదం మనకు బోధించిన నీతి ఇదే.

బార్బర్ షాపుకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా వెళ్ళాలన్న జ్ఞానోదయంకలగడానికి  మరో  అంశం కూడా  దోహదం చేసింది.
కొన్నేళ్ళక్రితం ఓ మాగజైన్ లో ఓ  విషయం చదివాను.
జపానులో ఓ కార్ల తయారీ సంస్త యజమాని తన కంపెనీకి సర్వీసింగ్ కోసమో మరమ్మత్తుల కోసమో   వచ్చే వాహనాలను  ఆయా విభాగాలకు  పంపేముందు వాటిని శుభ్రంగా కడిగించేవాడు.
ఇలా చేయడం అవసరమా? రిపైర్  చేసేటప్పుడో, సర్వీసింగ్ చేసేటప్పుడో ఎలాగో మురికి అవడం తధ్యం. మళ్ళీ వాటిని శుభ్రంగా కడగడం కూడా తప్పనిసరి. అలాంటప్పుడు ముందుగా కడిగి పంపడం అనే కంచి గరుడ సేవ ఎందుకనే డౌటేహంకలగడం కూడా అంతే తధ్యం.
ఈ రకం సందేహాత్ములకు ఆయన ఇచ్చే వివరణ ఈ విధంగా వుంటుంది.
నా కంపెనీలో పనిచేసే వారికి నేను ఇచ్చే గౌరవం అది. వారు పనిచేసే వాతావరణం పని చేయడానికి అనువుగా  వుండాలన్నది నా అభిప్రాయం. దీనితో విభేదించేవారు సర్వీసింగు నిమిత్తం వచ్చే వాహనాల అడుగు భాగాన్ని చూసివుండరని నా ఉద్దేశ్యం. బురద, మట్టి కొట్టుకుని  నానా చండాలంగా వుంటుదది. అక్కడ బిగుసుకుపోయిన నట్లు,బోట్లను వొట్టి చేతులతో వూడదీసి బిగించడం అనే ప్రక్రియ యెంత  దుర్భరమో తెలిసినవాళ్లెవరూ ఈ రకమయిన  ప్రశ్నలు వేయరు.’
ఈ వార్త చదివినప్పటినుంచి  బార్బర్ షాపుకు వెళ్ళేటప్పుడు నా తీరు పూర్తిగా మారిపోయింది. స్నానాదులను ముగించుకుని, శుభ్రమయిన దుస్తులు ధరించి ఆఫీసుకు యెలా వెడుతున్నామో, అలాగే బార్బర్ షాపుకు కూడా వెళ్లాలనే నియమాన్ని ఆ రోజు నుంచి  ఖచ్చితంగా పాటిస్తూ వస్తున్నాను.
అద్దంలో  ముఖ సౌందర్యం ఎలావుండాలని  మనం కోరుకుంటామో ఆవిధంగా మనల్ని తీర్చి దిద్దే బార్బర్లకు,  ఎంతో కొంత టిప్పుఇచ్చి సరిపుచ్చుకోవడం  మాత్రమే కాకుండా, చెమట వాసన వేయని కాలర్ ను, మెడను వారికి అప్పగించడంలో వున్న తృప్తి ఎలాటిదో  అప్పటినుంచి నాకు అనుభవం లోకి వచ్చింది.  నేను క్రమం తప్పకుండా నెలనెలా  క్షౌరం చేయించుకునే  మహేష్’ - నాలో వచ్చిన ఈ మార్పుని గమనించాడో లేదో నాకు తెలియదు. అయితే నాకు క్షౌరం చేసేటప్పుడు, తోటి పనివారిని చూస్తూ గర్వంగా కాలర్ ఎగరేయడం ఓసారి నా కళ్ళబడింది. ఆ క్షణంలో అతడి కళ్ళల్లో కానవచ్చిన కాంతిని నేను నేరుగా చూడలేకపోయినా నా అంతర్నేత్రంతో పరికించగలిగాను.  ఇతరుల శ్రమను, ఇబ్బందులను గుర్తించి నడుచుకోవడంలో ఎంతో తృప్తి  వుంది అన్న వాస్తవం  తెలుసుకోగలిగాను. అది బోధ పడిన తరువాత ఈ విషయంలో  నేను కొంత అధికంగా పడుతున్న శ్రమలెక్కలోకి రావడం లేదు.  
(18-03-2012)
(‘నెట్లో’ చదివిన ఆంగ్ల మూలానికి స్వేచ్చానువాదం. – భండారు శ్రీనివాసరావు)                 

కామెంట్‌లు లేవు: