12, జులై 2012, గురువారం

నువ్వెవరివో నాకు తెలుసు
నువ్వెవరివో నాకు తెలుసు 

గొర్రెల కాపరి లొల్లాయి పదాలు పాడుకుంటూ గొర్రెల్ని కాసుకుంటూ వెడుతున్న సమయంలో ఓ పొడవాటి కారు అతడి పక్కగా వచ్చి ఆగింది. అందులోనుంచి ఓ పొడవాటి మనిషి సూటూ బూటూ వేసుకుని దిగాడు.
గొర్రెల కాపరిని చూడగానే అతగాడికి ఆట పట్టించాలని అనిపించింది. అనిపించి అతడితో ఇలా అన్నాడు.
ఇదిగో అబ్బీ! నీ దగ్గర చాలా గొర్రెలు వున్నట్టున్నాయి. అవి ఎన్ని వున్నాయో నేను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పాననుకో, వాటిల్లో ఒకదాన్ని నాకిచ్చేస్తావా?’
సూటు ఆసామీ మాటలు గొర్రెల కాపరికి వింతగా అనిపించాయి. తనను ఆట పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి కూడా కాపరి అతడి పందేన్ని ఒప్పుకున్నాడు.
సూటు దొరవారు వెంటనే కారులోనుంచి లాప్ టాప్ తీసాడు. మొబైల్ ఫోనుకు, ఫాక్స్ మిషన్ కు కలిపాడు.నెట్ కనెక్ట్ చేసి నాసా వెబ్ సైట్ లోకి వెళ్లి జీపీఆర్ ఎస్ సిస్టం తో గొర్రెలమంద వున్న ప్రదేశాన్ని స్కాన్ చేసాడు.  
          కంప్యూటర్లో ఏవేవో అంకెలు వేసాడు. ఎన్నెన్నో లెక్కలు కూడాడు. చివరికి ప్రింటర్ నుంచి నూటయాభై పేజీల ప్రింటవుట్ తీసాడు.అంతాచేసి చివరికి గొర్రెల లెక్క తేల్చాడు. అయ్యా! కాపరిగారూ! మీవద్ద వున్న గొర్రెలు చిన్నా పెద్ద ఆడా మగా అన్నీ కలిపి అక్షరాలా పదిహేనువందల నలభై మూడుఅన్నాడు.
అతడంత ఖచ్చితంగా గొర్రెల సంఖ్యను చెప్పడంతో ముందు కంగారు పడ్డా కాపరి తొందరగానే తేరుకున్నాడు.
 అయ్యా దొరవారూ! చాలా బాగా లెక్క చెప్పారు. పందెం ప్రకారం నా మందలోనుంచి మీకు నచ్చిన గొర్రెను తీసుకెళ్లండి
దొర తన తెలివితేటలకు తానే మురిసిపోతూ మంద నుంచి ఓ బలిసిన గొర్రెను ఎంపిక చేసుకుని తన కారు వెనుక సీటు కింద పెట్టుకున్నాడు.   
           కారు స్టార్ట్ చేసి వెళ్ళబోయేలోగా వెనుకనుంచి గొర్రెల కాపరి స్వరం వినిపించింది.
అయ్యా! మీరెవరో ఏంచేస్తుంటారో నాకు తెలవదు. కానీ నేనూ మీలాగే మీ వృత్తి ఏమిటో వూహించి చెప్పగలను. సరిగ్గా చెబితే నా గొర్రెను నాకిచ్చి వెడతారా?’
పందెం గెలుచుకున్న సంతోషంలో దొర వెంటనే దానికి ఒప్పుకున్నాడు.
గొర్రెల కాపరి కాసేపు ఆలోచించినట్టు   నటించి మీరు ఆడిటర్ అయివుంటారు. అవునా! నా అంచనా కరెక్టే కదా!అన్నాడు.
దొరకు మతిపోయినంత పనయింది.
అవును. నేను ఆడిటర్నే. అంత సరిగ్గా యెలా చెప్పగలిగావుఅడిగాడు గొర్రెను తిరిగి ఇచ్చేస్తూ.  
            కాపరి ఇలా జవాబు చెప్పాడు.
అదేమంత పని. చాలా సులభం.
నేను అడగకుండానే ముందు మీరే నా వద్దకు వచ్చారు. అది మొదటి సంగతి.  నాకు తెలిసిన విషయం నాకే చెప్పడానికి పందెం రూపంలో ఫీజు అడిగారు చూసారు అక్కడ దొరికిపోయారు.  మూడో పాయింటు ఏమిటంటే  నా వృత్తి గురించి  మీకు ఎంతమాత్రం తెలియదని మీకు మీరే రుజువు చేసుకున్నారు. మీరు ఆడిటర్ అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.

(నెట్ ఇంగ్లీష్ కధనానికి అనువాదం) 

12-07-2012

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

hahaha