25, మార్చి 2022, శుక్రవారం

మత్తిచ్చే కొలువులు

 

కొన్ని ఉద్యోగాలు ఎంత మత్తుని కలిగిస్తాయి అంటే, అది తప్ప వాళ్ళు మరో కొలువు చేయలేరు అనడానికి నాకు రేడియోలో కొలీగ్ గా వున్న వ్యక్తి  ఒక కధ చెప్పేవారు.

రైల్వే ప్లాట్ ఫాం మీద తిరిగే ఒక కుక్క ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఒక కాలు పోగొట్టుకుంటుంది. ఆ తర్వాత కూడా అది ప్లాట్ ఫారం వదిలిపెట్టదు. మూడు కాళ్ళ మీదనే గెంతుకుంటూ అక్కడే తిరుగుతుంటుంది.

జీతాలు ఇవ్వకపోయినా కొందరు ఉద్యోగం వదులుకోకపోవడానికి ఇదొక కారణం అని ఆయన మనసులోని మాట.

ఆయన సరదాకు చెప్పిన మాట. సరదాగానే  తీసుకోండి.

మరొకాయన మరో కారణం చెప్పాడు.

వెనుకటి రోజుల్లో పాల వాడుక అనే పద్దతి వుండేది. పాలవాడు కేన్లలో పాలు ఇంటికే తెచ్చి కొలిచి పోసేవాడు. ఓ నెల సర్దుబాటు కాక డబ్బు ఇవ్వకపోయినా అతడు పాల వాడుక వదిలే వాడు కాదు, కాకపోతే ఆ నష్టం పూడ్చుకోవడానికి పాలల్లో నీళ్ళు కలిపేవాడు. ఉన్నట్టుండి మానేస్తే పాత బాకీ రాదని అతడి భయం. అంచేత వాడుక కొనసాగిస్తూ దాన్ని వాయిదాల పద్దతిలో వసూలు చేసేవాడు.

జీతాలు ఇవ్వకపోయినా ఉద్యోగాలు మానక పోవడానికి ఇదొక కారణం అంటాడు ఆయన.  మానేస్తే జీతం పాత బకాయిలకు నీళ్ళు వదులు కోవాల్సి వస్తుందని భయంట.

24, మార్చి 2022, గురువారం

అసెంబ్లీ నాడు నేడు – భండారు శ్రీనివాసరావు

 

ఈ అంశం మీద మాట్లాడమని భారత్ టు డే టీవీ వాళ్ళు అడిగితే చెప్పిన నాలుగు మాటలు ఇవి:

“శాసన సభలు అప్పుడు ఎలా పనిచేసేవి  ఇప్పుడెలా పనిచేస్తున్నాయి అన్నది కదా  మీ ప్రశ్న.

1975లో నేను రేడియో విలేకరిగా  మొదటిసారి శాసన సభ ప్రెస్ గ్యాలరీలో అడుగుపెట్టాను. అప్పటినుంచి 2005లో దూరదర్సన్ లో రిటైర్ అయ్యేవరకు అసెంబ్లీ ఇంచుమించు నా రెండోఆఫీసు అయింది. దాని ఎదురుగానే నేను పనిచేసే ఆకాశవాణి వుండడం వల్ల  అనుబంధం పెరిగింది. అన్ని  పార్టీల సభ్యులతో సాన్నిహిత్యం కూడా పెరిగింది.  కాలక్రమంలో వీరిలో అనేకులు మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కానీ వారితో పరిచయం చెక్కుచెదరలేదు.

“అప్పుడు అసెంబ్లీ పాత భవనంలో వుండేది.  ప్రెస్ గేలరీ మొదటి అంతస్తులో వుండేది. పైకి వెళ్ళడానికి రాజభవనంలో మాదిరిగా తివాచీ పరచిన  చెక్క మెట్లు ఉండేవి.  కింద శాసన సభ ప్రధాన మందిరం. స్పీకర్ స్థానం నుంచి  సభ్యుల సీట్ల వరుసలు కొంచెం కొంచెం  ఎత్తు పెరుగుతూ, సినిమా థియేటర్లలో సీట్ల వరుసలు మాదిరిగా,  అంచెలంచెలుగా  పైకి వచ్చేవి. సభ్యుల పై వరుసకు, ప్రెస్ గెలరీలోని విలేకరుల కింది వరుసకు నడుమ కొయ్యతో చేసిన గోడ మాత్రమే అడ్డం. మాట్లాడుకోవడానికి కూడా వీలుండేది.  అప్పుడప్పుడు ఆఖరి  వరుసలోని సభ్యులు తల వెనక్కు తిప్పి విలేకరులతో గుసగుసలాడేవారు. స్పీకర్ చూస్తున్నారు అనే అనుమానం కలగగానే తల ముందుకు తిప్పేవారు. సభలో క్రమశిక్షణ ఎలా ఉండేదో తెలియచెప్పడానికే ఇది చెప్పాల్సి వస్తోంది.

“ఇక్కడ ఒక మాట చెప్పాలి.

“సరిగా వినకుండా రాంగ్ రిపోర్ట్ చేస్తే సభాహక్కుల తీర్మానం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భయం విలేకరులకు వుండేది. అలాగే, సభలో వున్న సభ్యులు కూడా భయపడేవారు. ఏదైనా  ఎక్కువ తక్కువ మాట్లాడితే స్పీకర్ తమ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తే చిన్నతనంగా ఉంటుందని గుంజాటన పడేవారు.

“యాభయ్ ఏళ్ళ ముందు శాసన సభ నడిచిన  తీరు అది. యాభయ్ ఏళ్ళ తరువాత ఎలా నడుస్తున్నాయో ప్రత్యక్ష ప్రసారాల్లో జనం చూస్తూనే వున్నారు కదా!  

“ఏం రాసినా చెల్లుతుందని వీళ్ళూ, ఏం మాట్లాడినా ఏమీ కాదని వాళ్ళూ.

“స్థూలంగా చెప్పాలి అంటే అప్పటికీ ఇప్పటికీ నాకు కనబడుతున్న తేడాఇదే”



24-03-2022

 

   

  

23, మార్చి 2022, బుధవారం

యూనిసెఫ్ యాడ్స్

 ఆ చేత్తోనే యూనిసెఫ్ యాడ్స్ మీద కూడా ఒక కన్నేస్తే బాగు. క్రాస్ రోడ్స్ లో పసిపిల్లలను ఎండలో తిప్పుతూ ముష్టి అడిగే వాళ్లకు, ఎండిపోయిన డొక్కలతో పిల్లల్ని చూపిస్తూ కేవలం నెలకు ఎనిమిది వందలు మాత్రమే విరాళాలు ఇవ్వండని దేబిరించే వీళ్లకు నాకు తేడా కనపడడం లేదు. నిజం నిష్టూరంగా నే వుంటుంది మరి.

(Central Consumer Council imposed Rs 10 lakh fine on the manufacturers of SENSODYNE tooth paste for misleading ads )

https://www.ndtv.com/business/sensodyne-fined-rs-10-lakh-by-consumer-body-over-misleading-ads-2836394?amp=1&akamai-rum=off&fbclid=IwAR1cOaR7E9_Mfp9AV7PfV6qy-uvu1EMRvIms-4WTb1rMXWttnjdKvUFnTJw



అయ్యొస్తుండు బిడ్డా ఇమానంలో – భండారు శ్రీనివాసరావు

 ఏడ్చి ఏడ్చి ఎర్రబారిన కళ్ళతో, పూర్తిగా  సోయలేని స్థితిలో బయటకు వచ్చిన ఆమెకు ఇంటి ముందు సర్కారు వాళ్ళు పంపిన కారు కనబడింది. కార్లు కొత్త కాదు కానీ  కారులో ఎక్కడం కొత్త. ఆమె అవస్థ గమనించి ఎవరో డోరు తెరిచి ఎక్కించారు.  ఏమి జరిగిందో తెలియని పిల్లలు దిగాలుగా నిలబడ్డారు.

వాళ్లకు యేమని చెప్పాలి? అయ్యొస్తుండు బిడ్డా ఇమానంలో  అని చెప్పాలా! ఏమి చెప్పకుండానే కారు కదిలింది.  విమానాశ్రయం చేరింది. అక్కడ గుమికూడిన మరికొందరు  ఆడవాళ్ళ  రోదనలతో ఆ ప్రదేశం  మారుమోగుతోంది. ఆమెకూ దుఖం ఆగడం లేదు.

కాసేపటికి తెల్లటి గుడ్డలో చుట్టిన మనిషిని ఆమెకు  అప్పగించారు. గుడ్డ తొలగించి చూసింది. తెల్లటి రంగులో మెరిసిపోయే తన పెనిమిటి మంటల్లో కాలిపోయి మసి బొగ్గులా వున్నాడు.

‘ఈయనేనా మీ ఆయన. గుర్తు పడతావా’ ఎవరో అడుగుతున్నారు. యేమని చెప్పేట్టు. గుర్తు పట్టలేని విధంగా కాలిపోయిన మనిషిని గుర్తు పట్టాను అని ఎలా చెప్పేట్టు? 

ఉబికి వస్తున్న కన్నీటి పొరల నడుమ ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఆమె కంట్లో మెదిలారు. ఈ మనిషిని ఇలా తీసుకువెళ్లి వాళ్లకు యేమని చెప్పాలి?

“అయ్యొచ్చిండు  బిడ్డా ఇమానంలో” అని చెప్పాలా!

(సికిందరాబాదు బోయిగూడాలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన పదకొండు మంది బీహారు  కార్మికులను ప్రభుత్వం విమానంలో స్వరాష్ట్రానికి పంపుతోందన్న సమాచారం తెలిసిన నేపధ్యంలో)

(23-03-2022)  

 

ఆ గాలీ .....ఆ నేలా...... భండారు శ్రీనివాసరావు

 

అరవై అయిదేళ్ళ పైమాటే. అప్పటికి నాకు పదేళ్లు ఉంటాయేమో! ఆనాటి జ్ఞాపకాలు  స్పష్టాస్పష్టంగా మనసు పొరల్లో మెదులుతున్నాయి. గురుతుల మడతల్లో కదులుతున్నాయి.

మా ఊరు కంభంపాడు. అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు, వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి ఆ కొసగొట్టు పల్లెటూళ్ళో.

మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువు గట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగువైపులా ఇనుప  గిలకలు ఉండేవి. ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు  కషాయం. స్నానాలకు, ఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడేవాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మ, మా చిన్న మేనత్త చిదంబరం తడి మడి చీరెలతో వెళ్లి మంచినీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చేవాళ్ళు.

అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళే వాడిని. దోవలో వీరబ్రహ్మం ఇల్లు. ఆయన ఉలీ, బాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ కూర్చుండేవాడిని. బండి చక్రాలు, వాటికి ఆకులు అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారు చేసేవాడు.

ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.

ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసేవాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దేవాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు ధోతులు నేసేవాళ్ళు.

చిన్నిరాములు కొట్లో మిఠాయి ఉండలు, లౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లు, చిమ్నీ(బుడ్డి) దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో గొట్టం లాంటి సాధనం వుంచి పైకీ కిందికీ ఒక తీగతో లాగుతూ వుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది.

ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పేవాళ్ళు. తడి చేతి వేళ్ళతో ఆ మట్టి ముద్దను సుతారంగా తాకుతూ చిత్రవిచిత్రంగా కుండలు తయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.

సత్యమూర్తి అని నా చిన్న నాటి నేస్తం. ఆయన అన్నయ్య నాగలింగాచారి  బంగారు నగలు చేసేవాడు. బడికి వెళ్ళే దోవలోనే  వాళ్ళ ఇల్లు. బుగ్గలు బూరెలు అయ్యేలా గొట్టంతో ఊదుతూ ఎర్రటి కొలిమిలో బంగారం కరిగించి వస్తువులు తయారు చేసేవాడు.

సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడనుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.

మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలో, తెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు.

మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లింల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు.

షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన  జంధ్యాల హరి నారాయణ  కృష్ణాజిల్లా కలెక్టరుగా వున్నప్పుడు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు అక్కడ కొత్త కాలనీ నిర్మాణం కోసం సుమారు ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు. చక్కటి విశాలమైన కాలనీ ఏర్పడింది. జిల్లా మొత్తంలో అదే పెద్ద కాలనీ అని చెప్పుకునేవారు.

ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరే టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, సుద్ద బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.

అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నానసంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో ఆలపించే కృష్ణ శతకంలోని పద్యాలే ఊరంతటికీ కోడికూత.

పంచాయతీ రేడియోలో  సాయంత్రం అయ్యే సరికి తెలుగు వార్తలు వినేవాళ్ళం. బెజవాడ నుంచి అంధ్రపత్రిక దినపత్రిక రెండో రోజు సాయంత్రానికి పోస్టులో మా ఊరికి వచ్చేది. అప్పయ్య మాస్టారు పత్రికలో వచ్చిన వార్తలను బిగ్గరగా చదివి వినిపించేవారు. ఆయనే మా ఊరికి రేడియో న్యూస్ రీడర్. తర్వాత అందరూ అరుగుల మీద కూర్చుని తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు.

మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. ఒకటి శివుడి గుడి. వాసిరెడ్డి జమీందారు ఆ ప్రాంతంలో కట్టించిన అనేక శివాలయాల్లో ఇదొకటి. మరొకటి ఆంజనేయుడి గుడి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది. ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేది, కానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు.

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకు, అది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.

ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువు, రెండోది మునేటి కాలువ. ఒకప్పుడు ఈ రెంటి కిందా అధిక భాగం భూములు మావే. ఐదో అక్కయ్య భర్త కొమరగిరి అప్పారావు గారిది  పొరుగూరు పెనుగంచి ప్రోలు. ఆ బావగారు వచ్చినప్పుడల్లా గుర్రపు సవారీ. రాగానే గుర్రాన్ని మేతకు వదిలేసేవాడు. అది మేసినంత మేరా మామగారి (అంటే మా నాన్నగారు) తాలూకు పొలాలే, ఏం పరవాలేదు అని చెప్పుకునే వారు నా చిన్నతనంలో.

ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవు, జ్ఞాపకాలు తప్ప.

వీరబ్రహ్మం లేడు, ఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లు  లేవు. ఎడ్లూ లేవు. ఇంటికి రెండు చొప్పున మోటారు సైకిళ్ళు, పదో పాతికో ఏసీ కార్లు. నాటి మగ్గాలు లేవు, బట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామాను, ఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.

లాంతర్లు లేవు, అందరి ఇళ్ళల్లో విద్యుత్ దీపాలే. కాలక్షేపానికి బ్యాండ్ మేళాలు లేవు, ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీలే.

పంచాయతి రేడియో లేదు. అరుగుల మీద ముచ్చట్లు లేవు. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్. ఎవరి గోల వారిదే!

స్వయంసమృద్ధి కాకపోయినా స్వయంపోషకంగా వుండే మా ఊరు, ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!

పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.

(23-03-2022)

కింది ఫోటో: ఓవర్ హెడ్ ట్యాంకు, మంచి నీటి పంపులు వచ్చిన తరవాత మసకబారిన మంచి నీళ్ళ బావి



 

22, మార్చి 2022, మంగళవారం

99– భండారు శ్రీనివాసరావు

 

 

'డెబ్బయి అయిదేళ్లు  వచ్చాయి. సొంత ఇల్లంటూ వున్నట్టు లేదు. ఇలా ఎన్నాళ్ళు' అని శ్రేయోభిలాషులు తరచూ అడిగే ప్రశ్న. మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర వరసగా అయిదేళ్ళ పాటు పీఆర్వో గా పనిచేశారు. రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పదవీవిరమణ చేసి, సొంత గూడంటూ లేకుండా, సిటీ బస్సుల్లో తిరిగేవాడు. ఏవీ కూడబెట్టుకోకుండానే దాటిపోయాడు. ఆయన ముందు పిపీలికాన్ని నేనెంత? పిల్లలు బాగా చూసుకుంటున్నారు. అదే పదివేలు. పోతే, ఈ ప్రశ్న ఎదురయినప్పుడల్లా ఎప్పుడో చదివిన ఓ ఇంగ్లీష్ కధ జ్ఞాపకం వస్తుంది. ఆ కధకు నా స్వేఛ్చానువాదం.

"అనగనగా ఓ రాజుగారు. ఆ రాజుదగ్గర ఓ పనివాడు. వాడిని చూసినప్పుడల్లా రాజుగారికి ఆశ్చర్యంతో కూడిన సందేహం. 'నాకింత హంగూ ఆర్భాటం వుంది. లేదనేది లేదు. అయినా ఏదో లోటు ఎప్పుడూ తొలుస్తూనే వుంటుంది. వీడేమిటి ఎప్పుడూ చూసినా మొహంలో అంత నిశ్చింత. రేపు యెలా గడుస్తుంది అన్న బాధ కనిపించదు. ఏవిటి వీడి వ్యవహారం?'

"రాజుగారి చింత మంత్రిగారు కనిపెట్టాడు. రాజుగారికి చెప్పి తొంభయ్ తొమ్మిది బంగారు మొహరీలు తెప్పించాడు. వాటిని ఓ సంచీలో వుంచి ఆ పనివాడి గుమ్మం ముందు వొదిలి పెట్టి రమ్మని భటులను ఆదేశించాడు.

"తెల్లారి లేచిన తరువాత పనివాడికి తన గుమ్మం ముందు పడివున్న సంచీ కనబడింది. లోపలకు తీసుకు వచ్చి విప్పి చూశాడు. కళ్ళు జిగేల్ మన్నాయి. అన్నీ బంగారు కాసులు. లెక్కబెట్టాడు. 99 వున్నాయి. అనుమానం వచ్చి మళ్ళీ లెక్కించాడు. పొరబాటు ఏమీ లేదు. 99 నాణేలు మాత్రమే వున్నాయి. మరి ఆ ఒక్క మొహరీ ఏమైంది?

"పనివాడికి మరోపని లేకుండా పోయింది. మరో ఆలోచన లేకుండా పోయింది. ఎలాగైనా ఆ ఒక్క నాణెం సంపాదించి మొత్తం నూరు నాణేలు సొంతం చేసుకోవాలి అన్న ధ్యాస పెరిగింది. ఈ యావలో పడి పెళ్ళాం పిల్లలతో అచ్చట్లు ముచ్చట్లు తగ్గిపోయాయి. సర్వం కోల్పోతున్న భావన. తెలియని దిగులుతో నిద్ర పట్టేది కాదు. అన్నం సయించేది కాదు.

"పనివాడిలో కనబడుతున్న మార్పు రాజుగారు గమనించాడు. మంత్రిగారు వచ్చి టీకా తాత్పర్యం చెప్పకుండానే ఆయనకు విషయం బోధపడింది.

ఏవీ లేనప్పుడు అ పనివాడికి ఏ చింతా లేదు. 99 నాణేలు సొంతం కాగానే వాటిని నూరు చేయాలన్న తాపత్రయం బాగా పెరిగిపోయింది. ఆశ దురాశగా మారితే మనుషులు యెలా మారిపోతారన్నది రాజు గారికి తెలిసివచ్చింది."



(22-03-2022)

21, మార్చి 2022, సోమవారం

గరికపాటి - భండారు శ్రీనివాసరావు

 “గరికపాటి నరసింహారావును మాట్లాడుతున్నాను, భండారు శ్రీనివాసరావు గారేనా!”

నిన్న అంటే మార్చి ఇరవై సాయంత్రం ఫోన్ రిసీవ్ చేసుకోగానే వినబడ్డ మాట. నా చెవులని నేనే నమ్మలేకపోయాను ఒక క్షణం.
ముఖ పరిచయం వుండదు, కానీ కొందరు వ్యక్త్లులు బాగా పరిచయం వున్నవారిలా కనబడతారు. ఆధ్యాత్మిక ప్రబోధనలు చేసే గరికపాటి వంటి వారు సదా ఇళ్ళల్లో ఏదో ఒక టీవీలో ఏదో ఒక సమయంలో కనబడుతూనే వుంటారు. వారి స్వరం వినబడుతూనే వుంటుంది. గరికపాటి వారి సుస్వరం చిరపరిచితమే కనుక క్షణంలోనే తేరుకున్నాను.
“నేను ప్రస్తుతం ఢిల్లీలో వున్నాను. రేపు సాయంత్రం ఫంక్షన్ చూసుకుని హైదరాబాదు వస్తాను” అన్నారు ఆయనే. నిజమే! సోమవారం నాడు వారు పద్మశ్రీ అవార్డ్ తీసుకోబోతున్న సంగతి చటాలున గుర్తుకు వచ్చింది.
స్వయంగా
అభినందనలు
నేరుగా చెప్పే అవకాశాన్ని చక్కగా వాడుకున్నాను.
క్లుప్తంగా ధన్యవాదాలు చెప్పి ఆయన సంభాషణ కొనసాగించారు.
“అది అలా వుంచండి. నేను ఫోన్ చేసిన ఉద్దేశ్యం వేరే వుంది. ఉదయం ఫ్లయిట్ లో ఢిల్లీ వస్తుంటే తెలుగు పత్రికలు కనిపించాయి. ఆంధ్రప్రభ తీసుకుని తిరగేస్తుంటే మీరు రాసిన పురుషుల్లో పుణ్య పురుషులు కనిపించింది. ఆసక్తిగా చదివాను. ఒక్క చప్పిడి వెంగయ్య గారు మినహా మీరు పేర్కొన్న మిగిలిన నలుగురితో నాకు వ్యక్తిగత పరిచయం వుంది.
“ఎనభయ్ ఎనిమిదిలో వావిలాల గోపాల కృష్ణయ్య గారి గురించి ఒక సభలో పరిచయం చేసే బాధ్యత నా మీద పడింది. వారిని గురించి పెద్దగా తెలియదు. అసెంబ్లీకి మొదటిసారి ఎప్పుడు ఎన్నికయ్యారు, ఎప్పటిదాకా కొనసాగారు, ఎక్కడ పుట్టారు వంటి సంగతులు తెలుసు. కానీ ఒక పెద్దమనిషిని పరిచయం చేసేటప్పుడు ఈ వివరాలు సరిపోవు. అందుకే వారినే అడిగి తెలుసుకుందామని వావిలాల వారిని కలుసుకుని వారినే అడిగాను.
ఆయన అదోమాదిరిగా నవ్వి నా గురించి ఏమీ తెలియనప్పుడు ఎలా పరిచయం చేస్తావు అని ఎదురు ప్రశ్నించారు. ఏం జవాబు చెప్పాలో అర్ధం కాలేదు. నా మొహం చూసి ఆయనే అర్ధం చేసుకుని చెప్పారు. “సరే! నా గురించి మొదట ఎలా తెలిసింది, నా పేరు ఎప్పుడైనా విన్నావా! అని.
తటాలున గుర్తుకు వచ్చింది. రేడియోలో విన్నాను. అదే చెప్పాను.
“చిన్నప్పటి నుంచి నాకు రేడియో వినడం అలవాటు. రేడియో వార్తల్లో తరచుగా మీ పేరు, మరో సభ్యుడు సీ.వీ. కె. రావు గారి పేరు వినబడుతుండేవి. మీ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు గురించి ప్రస్తావిస్తూ వుండేవారు.”
అప్పుడు వావిలాల వారు ఇలా అన్నారు.
“మరి ఇకనేం! ఇవే చెప్పు. ఇంతకంటే పరిచయం చేసేది ఏముంటుంది కనుక. ఎప్పుడు పుట్టామో, ఎప్పుడు గెలిచామో ఎవరికీ కావాలి. ప్రజలకు ఏమి చేశామో, ఏమి చేద్దామనుకున్నామో అది ముఖ్యం” అని భుజం తట్టి పంపించారు. ఆయన చెప్పిన విషయం నాకు తరువాత జీవితంలో అనుభవానికి వచ్చింది. టీవీ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు స్టూడియోలో మోడరేటర్ అడుగుతాడు, మీ గురించి ఎలా పరిచయం చేయాలని. ఏమీ తెలియకుండా ఎలా పరిచయం చేస్తావని వావిలాల వారు గతంలో అన్న మాటలు గుర్తుకు వస్తాయి” అన్నారు గరికపాటి వారు.
అనుకోకుండా గరికపాటివారు రేడియో ప్రస్తావన తీసుకురావడం, ఆయన పేర్కొన్న వావిలాల, సీ.వీ. కె. రావుల ప్రకటనలు వార్తల రూపంలో ప్రసారం అయిన కాలంలో నేను రేడియో విలేకరిగా వుండడం కాకతాళీయం కావచ్చు కాని మనసుకు సంతోషం అనిపించింది.
“మనం ఒకసారి కలుద్దాం” అన్నారు ముగింపులో.
ఇది మరీ సంతోషం కలిగించింది.

NOTE: Courtesy Image Owner




(21-03-2022)