25, ఏప్రిల్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (149) – భండారు శ్రీనివాసరావు

 పేరులో ‘నేముంది?'

ఒక కధలో నాలుగు పాత్రలు వుంటే వాటికి పెట్టిన పేర్లు మరో కధలో పునరావృతం కాకుండా చూసుకోవడం రచయితలకు ఎదురయ్యే ఒక ప్రధాన సమస్య. మరి అలాంటిది రామాయణ, మహాభారత, భాగవతాల వంటి ఇతిహాసాల్లో కానవచ్చే కొన్ని వందల పేర్లను గమనిస్తే వ్యాస, వాల్మీకి వంటి వారు మహానుభావులు ఎలా అయ్యారన్నది చిటికెలో అర్ధం అవుతుంది. ఒకరి పేరు మరొకరికి లేకుండా, రాకుండా వందమంది కౌరవులకు పేర్లు వున్నాయి. సుగ్రీవుని కపిసేనలో వీరులకు సైతం పేర్లు వున్నాయి. రాక్షస సైన్యంలోని వారికి పేర్లు వున్నాయి. విచిత్రం ఏమిటంటే వీరిలో ఎవ్వరికీ ఇంటి పేర్లు లేవు. ఇవి లేకుండానే ప్రసిద్ధులు అయ్యారు. గుర్తింపు పొందారు.

ఈ రోజుల్లో ఒకే పేరు కలిగినవారు వందలు వేలల్లో వుంటారు. ఒకే ఇంటి పేరు కలిగినవారు కూడా చాలామంది వుంటారు. ఇంతమందిలో మనకు కావాల్సిన ఒక వ్యక్తిని గుర్తించాలి అంటే అసలు పేరుకు ఇంటిపేరు జత కలిసినప్పుడే సులభం అవుతుంది. ఇంటి పేరుకు ఇంతటి పేరు, ప్రాధాన్యత రావడానికి ప్రధాన కారణం ఇదే.

ఈ పేర్ల గోల ఎందుకంటారా! ఎందుకంటే అది నా సొంత గోలే కాబట్టి.

బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ప్రతి శుక్రవారం ఒక సినిమా విడుదల అయ్యేది. ఒక రోజు ముందు ఆ సినిమా ఫ్రీవ్యూ (FREE VIEW) చూసి, మర్నాడు దాని మీద ప్రీవ్యూ (PREVIEW) రాయడం నాకు ఒప్పగించిన బాధ్యతల్లో ఒకటి. అలా రాసిన రివ్యూలకు ఏదైనా కలం పేరు పెట్టుకుంటే బాగుంటుందని బాగా ఆలోచించి నా కలం పేరు, సినిమాలకు సంబంధించినది అని అర్ధం అయ్యేలా, ‘స్క్రీనివాస్’ అని పెట్టుకున్నాను. అప్పుడు నండూరి వారు పిలిచి చెప్పారు. దాదాపు ఇదే పేరుతో మద్రాసులో మరో సినిమా జర్నలిస్ట్ రాస్తుంటాడు, అంచేత తికమక రాకుండా మీ ఇంటి పేరే పెట్టుకోండి అని సలహా చెప్పారు. అప్పటి నుంచి నేను రాసే వాక్టూన్లకు, సినిమా, పుస్తక సమీక్షలకు భండారు అని నా ఇంటి పేరే పెట్టుకునేవాడిని. అలా ఆ అయిదేళ్ళ కాలంలో డజన్ల కొద్దీ సినిమాలకు, కొన్ని వందల పుస్తకాలకు సమీక్షలు రాశాను.

అదేమిటో నేనే కాదు చాలామందికి పేరు మీదే కాదు, ఇంటి పేరు మీద కూడా వల్లమాలిన మమకారం. బహుశా వ్యక్తిగత గుర్తింపుకు అది దగ్గరి దారి కావచ్చు. శ్రీనివాసరావులు చాలామంది వుండవచ్చు. భండారు శ్రీనివాసరావులు పెక్కురు వుండకపోవచ్చు. వుంటే ఎడ్వర్డ్ చక్రవర్తుల మాదిరిగా ఎడ్వర్డ్ వన్, టు అని తగిలించుకోవచ్చు.

హైదరాబాదు ఆలిండియా రేడియోలో చేరిన తర్వాత ప్రాంతీయ వార్తలు, వారానికి రెండు పర్యాయాలు వార్తావాహిని, వారానికోమారు జీవన స్రవంతి ప్రత్యేక వార్తలు చదవడం వృత్తిలో అదనపు బాధ్యతలుగా మారాయి.

ఆకాశవాణి, జీవన స్రవంతి, ప్రత్యేక వార్తలు, చదువుతున్నది భభండారు శ్రీనివాసరావు.....”

ఇంటి పేరు అంతగా ఒత్తి పలకాలా ! భండారు అంటే సరిపోతుందిగా!’

నలభయ్ ఏళ్ళ క్రితం రేడియో సహోద్యోగి వ్యాఖ్య.

ఇన్నేళ్ళుగా పరిస్తితి ఏం మారినట్టు లేదు.

ఇంతకీ నా ఘోష ఏమిటంటే నేను ప్రతి రోజూ వెళ్ళే టీవీల్లో కానీ, కదాచిత్ గా నా పేరు పడే పేపర్లలో కానీ ఏనాడూ నా పేరును చిత్రవధ చేయకుండా ఒదిలిన దాఖలా లేదు. బందరు శ్రీనివాస్ అనీ, బండారు శ్రీనివాసరావనీ, బండారి శ్రీనివాస్ అనీ ఇలా పలు రూపాల్లో నా పేరు దర్శనమిస్తూ వుంటుంది.

కొండొకచో, ఇందువల్ల కొన్ని తలనొప్పులు కూడా తప్పడం లేదు. ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి, వాళ్లకు తెలిసిన పిల్లవాడికి మా ఇంజినీరింగ్ కాలేజీలో సీటు ఇప్పించమని అడిగాడు. ' నా కాలేజీ ఏమిటి అని అడిగితే, ' 'భలే వారే! హైదరాబాద్ లో ప్రతి రోడ్డు మీదా మీ కాలేజీ బస్సులు కనబడుతుంటే మీరు భలే జోకులు వేస్తారే' అన్నాడు భలేగా!

అప్పటినుంచి రోడ్డు మీద వెళ్లే ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ బస్సును కనిపెట్టి చూడడం మొదలు పెట్టాను. చివరికది దొరికింది. దానిమీద పెద్ద అక్షరాలతో ' బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కాలేజీ' అని రాసుంది.

ఓసారి ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమం గురించి మర్నాడు పత్రికల్లో వచ్చింది.

నాపేరు ‘షరా మామూలే’. పైగా ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ మూర్తి గారు ఫొటోలో నా పక్కనే వున్నారు.

బీ.ఎస్.రామకృష్ణ. జర్నలిస్ట్ సర్కిల్ లో బీ.ఎస్.ఆర్. అంటారు. ఫేస్ బుక్ లో బుద్ధవరపు రామకృష్ణ. మంచి జర్నలిస్టు. మంచి రాయసకాడు. చక్కని ధారణశక్తి. నా కంటే వయసులో చిన్న అయినా, నేనూ జర్నలిస్టునే అయినా, అతనికి వున్న ఈ గొప్ప లక్షణాలు ఏవీ నాలో లేవు. ఆ మధ్య ఫోన్ చేసి, ఫోన్లోనే ఓ పెద్దగీత గీసి, ఇంటి పేరు విషయంలో నేను మధన పడుతున్న అంశాన్ని రబ్బరు పెట్టి చెరిపేసినట్టు చెరిపేసాడు.

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారికే తప్పలేదు, ఈ ఇంటి పేరు గొడవ ఇక మనమెంత’ అంటూ ఎంత పెద్దగీత గీసి చూపెట్టాడో.

ఆంధ్రపత్రిక పెట్టిన కాశీనాధుని నాగేశ్వరరావు గారు భారతి సాహిత్య మాసపత్రిక మొదలుపెట్టి రెండు చేతులూ మోచేతుల దాకా కాల్చుకున్నారు. మంచి సాహిత్య పత్రికని నడిపారనే మంచి పేరుతో పాటు భారీ నష్టాలు కూడా ఆయన ఖాతాలో పడడానికి భారతి కూడా కారణమనేవారున్నారు. గొప్ప సాహితీవేత్త అయిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు భారతి సాహిత్య మాస పత్రికకి అడపాదడపా చక్కటి వ్యాసాలు రాస్తుండేవారు. అయితే ఆయన ఇంటి పేరును ఎప్పుడూ ఇంద్రగంటి బదులు ఇంద్రకంటి అని ప్రచురిస్తూ వుండేవారు. ఆయన ఇంటి పేరులో వున్నది ‘గంటి’ నా, ‘కంటి’ నా అని విడమర్చి చెప్పడానికి ఆయన కుమారుడు, ప్రసిద్ధ రచయిత అయిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (గతంలో నేనూ శర్మగారు ఆంధ్రజ్యోతిలో సమకాలీకులం) ఇప్పుడు లేరు. అయితే అలనాటి భారతి పత్రిక సంచికలు కష్టపడి సేకరించానని రామకృష్ణ చెప్పాడు. చెబుతూ మరో మాట చెప్పాడు. మీ ఇంటి పేరు భండారు లేక బండారు ఇలా ఎలా రాసినా చింతించడం అనవసరం అంటూ గీతాబోధ చేశాడు.

ఇలాంటి సమాచారాలు బోలెడు సేకరిస్తూ వస్తున్నానని, ఎప్పుడో సమగ్ర వ్యాసం రాస్తానని ఒక హామీ కూడా ఇచ్చాడు.

అలాగే నా మరో జర్నలిస్ట్ మిత్రుడు పాశం యాదగిరి.

పాశం యాదగిరి కేవలం జర్నలిస్ట్ మాత్రమే కాదు, ఓ నడయాడే ఎన్ సైక్లోపీడియా. లోగడ జీ. కృష్ణగారు మా బోంట్లకి అనేకానేక సంగతులు చెబుతుండేవారు. ఇప్పుడు ఆయన లేని లోటును యాదగిరి తీరుస్తున్నాడు.

నా భండారు ఇంటిపేరు గొడవ చదివి, విని ఫోను చేసాడు. యాదగిరి ఫోన్ చేశాడంటే రాసుకోవడానికి మంచి ముడి సరుకు దొరికినట్టే.

ఆయన చెప్పడం మొదలు పెట్టగానే నేను దాన్ని అక్షరరూపంలో పెట్టడం ఎల్లాగా అనే ఆలోచనలో పడిపోయాను.

పుణే నగరానికి ఓ యాభయ్ కిలోమీటర్ల దూరంలోని చిన్న పట్టణం జెజూరి. అక్కడ ఖండోబా గుడి వుంది. ఏడో శతాబ్దానికి చెందిన ఖండోబా అనే రాజు పేరిట ఈ దేవాలయం నిర్మించారు. మహాశివుడి మహత్తు ఖండోబాలో వుందని అనేకుల విశ్వాసం. ఆయన్ని కుల దైవంగా కొలుస్తారు. గుడిలోని ఖండోబా దేవుడికి నాలుగు హస్తాలు. ఒక చేతిలో పెద్ద భండారా (పసుపు) పాత్ర వుంటుంది. దాని నిండా పసుపు పొడి. ఈ దేవతను భక్తులు పసుపుతో, ఉల్లిపాయలతో, ఇతర కూరగాయలతో పూజించడం ఆచారం. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు విధిగా ఈ గుడిని సందర్శించి, ఖండోబా దైవాన్ని పూజించి, పసుపు, కూరగాయలు ముడుపులుగా చెల్లించడం ఆనవాయితీ. అలాగే సంతానలేమితో బాధపడేవాళ్ళు కూడా ఖండోబాను పూజించి తమ మనసులోని కోరికను వెల్లడిస్తారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో అనేక చోట్ల ఖండోబా దేవాలయాలు వున్నాయి కాని, జెజూరి దేవాలయానికి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ. ఏటా ఆ దేవాలయంలో భండారా ఉత్సవం జరుగుతుంది.

ఆ రోజున ఆ దేవాలయ ప్రాంగణం పసుపుతో బంగారంలా మెరిసిపోతుంది. భక్తులు కూడా ఒకరిపై ఒకరు పసుపు చల్లుకుంటారు.

ఏతావాతా యాదగిరి చెప్పేది ఏమిటంటే మా ఇంటి పేరు పవిత్రమైన పసుపు వర్ణానికి గుర్తుగా వచ్చిందని.

శుభం! మంచిమాటే చెప్పాడు, ఎప్పటిలాగే.

కింది ఫోటో:



ఒకసారి ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీనియర్ పాత్రికేయులు ‘బండారు శ్రీనివాస్’. చిత్రంలో సాక్షి ఈడీ రామచంద్ర మూర్తి, ఆర్వీ రామారావు, చక్రధర్, సీనియర్ పాత్రికేయులు శ్రీరామ మూర్తిని సన్మానిస్తున్న వరదాచారి.

(ఇదీ ఆ పత్రిక పెట్టిన ఫోటో క్యాప్షన్)

(ఇంకావుంది)

24, ఏప్రిల్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (148) – భండారు శ్రీనివాసరావు

 వ్యాసుడు, కార్ల్ మార్క్స్ వాహ్వ్యాళి

 

మంచి రచయితలు చక్కని పాత్రికేయులు కాగలుగుతారా! మంచి జర్నలిస్టులు చక్కని రచయితలు కాగలుగుతారా! రచయితలు అందరూ పాత్రికేయులు కాలేక పోవచ్చు కానీ, జర్నలిస్టులలో చాలామంది చక్కని రచనలు చేయగలుగుతారని ఒకప్పుడు చెప్పుకునే వారు. ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా శకంలో ఇక ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారం లేకపోవచ్చు. ఈ మాధ్యమాలలో పోస్టులు పెడుతున్న చాలామందికి జర్నలిజం నేపధ్యం లేకపోయినా సమకాలీన అంశాలపై  సవివరమైన విశ్లేషణలు చేయగలుగుతున్నారు. రచనల మీద రచయితలకు, జర్నలిజం మీద జర్నలిస్టులకు  పరంపరగా వస్తున్న గుత్తాధిపత్యానికి గండి పడే రోజులు దగ్గరలోనే వున్నాయని అనిపిస్తోంది. ఒకరకంగా  మంచిదే.   

 

ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ఓ ఆదివారం  సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఉషశ్రీ గారి సంస్మరణ కార్యక్రమం జరిగింది. మనసులో గట్టిగా వెళ్ళాలని అనుకున్నా, చివరికి వెళ్ళలేక పోయాను. తన కలంతో ‘కలంకారీ’ చేసే చమత్కార రచయిత శ్రీ రమణ గారిని కలవలేకపోయాను. మిత్రులు కేవీఎస్  సుబ్రహ్మణ్యం గారిని అడిగి శ్రీరమణ గారి  కాంటాక్టు నెంబరు తీసుకున్నాను. చాలా రోజులయింది, గుర్తు పడతారో లేదో అని ‘నేను, భండారు శ్రీనివాసరావును’ అని మెసేజ్ కూడా పెట్టాను.

మర్నాడు ఉదయం ఫోను మోగింది. ఏదో కొత్త నెంబరు.

‘హలో! నేను శ్రీ రమణను మాట్లాడుతున్నాను’

ఎంతో సంతోషం అనిపించింది చాలా కాలం తర్వాత ఆయన గొంతు విని.

‘ఇదేమిటి, సుబ్రహ్మణ్యం మరో నెంబరు ఇచ్చాడే’ అన్నాను.

‘అదీ నాదే! ఆఫీసు వాళ్ళు ఇచ్చింది. ఇది నా పర్సనల్’

అదీ శ్రీ రమణ అంటే! పర్సనల్ కాల్స్ పర్సనల్ ఫోన్లో  మాట్లాడాలి అనే నియమం పెట్టుకున్నారేమో తెలియదు.

చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లేదు లేదు, ఆయన చెబుతూ పోయారు, నేను వింటూ పోయాను. నండూరి రామమోహన రావు గారు, పురాణం సుబ్రమణ్య శర్మ, బాపూ రమణలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, రావిశాస్త్రి  ఎందరెందరో మహానుభావులు, వారందరి కబుర్లు కలబోసారు. నండూరి రామమోహన రావు గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా వున్నప్పుడు నేను ఆయన వద్ద అయిదేళ్ళు పనిచేసాను. తరువాత ఆలిండియా రేడియోలో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చేసాను. ఆ తర్వాతనే  శ్రీ రమణ గారు, నేను పనిచేసిన  జ్యోతిలో చేరారు. అంచేత ముకహపరిచయం లేదు.

ఉషశ్రీతో కదా మొదలు పెట్టింది.

శ్రీ రమణ గారు ఓ సంగతి చెప్పారు, మాటల మధ్య.

ఉషశ్రీ ఆధునిక భావాలు కలిగిన ఆధ్యాత్మికవేత్త. రామాయణ మహా భారతాలను కాచి వడబోసి వాటి సారాంశాన్ని రేడియో శ్రోతలకు తనదయిన బాణీలో వినిపించేవారు. వాల్మీకి రామాయణం మాదిరిగా ఉషశ్రీ రామాయణం అని చెప్పుకునేవారు.

శ్రీ రాఘవాచార్య. విశాలాంధ్ర ఎడిటర్ గా చాలా కాలం పనిచేసారు. ఒక తరం జర్నలిస్టులకు మార్గదర్శి. వామపక్ష భావజాలం నరనరాన నింపుకున్న వ్యక్తి. ఆరోగ్యం అంతగా సహకరించక పోయినా ఉషశ్రీ మీది అభిమానంతో శ్రీ రాఘవాచార్య  ఆ సమావేశానికి వచ్చారు. పత్రికల్లో చదివాను.

ఉత్తర దక్షిణ ధ్రువాల వంటి భావజాలం కలిగిన  వీరిరువురూ మంచి స్నేహితులు.

విజయవాడ రోడ్ల మీద సరదాగా కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసి, ‘వ్యాసుడు, కార్ల్ మార్క్స్’ చెట్టాపట్టాలేసుకుని వస్తున్నట్టు వుందని జనం అనుకునేవారట!

శ్రీ రమణ చెప్పారు.

ఆయన ఒక్కరే ఇటువంటి చక్కటి కబుర్లు చెప్పగలరు. ముందే చెప్పినట్టు మంచి రచనలు చేసే మంచి జర్నలిస్టు శ్రీ రమణ. ఆయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మిధునం. దాన్ని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి గారు  అదే పేరుతో సినిమాగా తీశారు. ఆ పుస్తకాన్ని మొదటినుంచి చివరివరకు బాపూ తన  చేతిరాతతో రాసి ముద్రించిన మిధునం నవలను శ్రీ రమణ నాకు కానుకగా ఇచ్చారు.

శ్రీ రమణ గారికి  రెండు పేర్లు, అదనంగా మరో  రెండు ఇంటి పేర్లు కూడా. పుట్టినప్పుడు తలితండ్రులు పెట్టిన పేరు రాధాకృష్ణ. ఇంటి పేరు వంకమామిడి. కాలేజీ చదువులో వున్నప్పుడు, మగసంతు లేని ఆయన తాతగారు ఆయన్ని దత్తత తీసుకున్నారు. ఆ విధంగా మరో ఇంటి పేరు, అసలు పేరు  శ్రీ రమణ పరమయ్యాయి. ఆ పేరు కామరాజు రామారావు. ఈ తికమక నుంచి బయటపడడానికి ఆయన తనకు తానుగా పెట్టుకున్న మూడో పేరే శ్రీ రమణ. ఈ పేరే ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది.  హాస్యాన్ని, పేరడీలను ఆదరించే తెలుగు చదువరుల దురదృష్టం, 2023లో డెబ్బయ్యవ ఏట ఆయన కాలం చేశారు.    

మంచి పాఠకులు వున్నప్పుడే మంచి రచనలు వస్తాయి. ఇందుకు ఉదాహరణ దేవినేని మధుసూదన రావు గారు. మాస్కో గురించి ఎప్పుడో దశాబ్దాల క్రితం నా బ్లాగులో నేను రాసుకున్న నా పోస్టులు చదివి వారి శ్రీమతిని వెంటబెట్టుకుని మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన విషయం నేనెప్పటికీ మరచిపోలేను. ఆయన పుస్తక ప్రియుడు. అంతే కాదు సొంత ఊరు అంటే ప్రాణం. ఉద్యోగరీత్యా  హైదరాబాదు లో ఉద్యోగం చేసినా, ఆ ఉద్యోగ పర్వం ముగిసిన వెంటనే పల్లెకు పోదాం ఛలో ఛలో అంటూ, భార్యను తీసుకుని, ముచ్చటపడి కొనుక్కున్న ఇంటిని వచ్చిన ధరకు అమ్మేసి పొలోమంటూ తమ స్వగ్రామానికి వెళ్ళిపోయారు. ఆయనలో నాకు నచ్చిన విషయం ఇదే.

'పల్లెకు పోదాం పదండిఅని నేను 2005 లో  రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారు, వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు  మాత్రమే ఈ పని చేసి చూపించారు.  హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తి కాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,   పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నామని మాటల మధ్యలో చెప్పారు. చదువుల కోసమోఉద్యోగాల కోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా,  స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత అనవసర భారం ( జనాభానీళ్ళువాహనాలువిద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో
ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.

కృష్ణాజిల్లా తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదనరావు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ ఛార్టర్డ్‌ అక్కౌంటెన్సీ చదివారు. హైదరాబాద్‌లో 'ఎపి రేయాన్స్‌', 'విజయ ఎలక్ట్రికల్స్‌తదితర కంపెనీల్లో పదేళ్లపాటు ఛార్టర్డ్‌ ఎక్కౌంటెంట్‌గానూ పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత,  చిన్నతనంలో తన ఉన్నతికి దోహదపడిన అంశాలను ఈ తరానికి అందించే కృషి ప్రారంభించారు. ఇందుకు ఆయన ఎంచుకున్న ఆయుధం,  విలువలు పెంచే పుస్తకాలను పంపిణీ చేయడం.

'ప్రతి తెలుగు బాలుడూ నూరు పద్యాలు నేర్చుకోవాలి. పద్యాల్లో ఉండే నీతివిలువలు జీవితానికి ఉపయోగపడడమే కాకఅతడికి తెలుగు భాషా ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేసినవాళ్ళమవుతాం.’  అంటారు దేవినేని మధుసూదనరావు. ఊరికే మాటలు చెప్పే రకం కాదు.

 

 ‘పుస్తకాలు కొని, వాటిని స్నేహితులతో పంచుకుంటున్నా. నేనిచ్చిన పుస్తకాలను వారితో చదివింపజేయడం హాబీగా మార్చుకున్నా’ అని 2014లో  ప్రజాశక్తి  దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
2010లో మా అమ్మాయి పెళ్లి జరిగింది. ఇక్కడో కొత్త ప్రక్రియ ప్రవేశపెట్టాను. 2010లో వెలువరించిన కథల సంకలనమొకటి పెళ్లికొచ్చిన వారందరికీ పంపిణీ చేశాను. అందరూ సంతోషించారు.
2011లో విజయవాడలో నా స్నేహితుడు ఫణి ప్రసాద్‌ షష్టి పూర్తి సందర్భంగా శ్రీరమణ రచించిన 'మిథునంపుస్తకాన్ని అచ్చు వేయించి, 1500 కాపీలను అక్కడికి వచ్చిన అతిథులందరికీ పంపిణీ చేశాను. 2012లో నా స్నేహితుడు 'శాంతా బయోటెక్‌వరప్రసాద్‌రెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా ఐదారు కథలతో సంకలనం వేయించిఅక్కడకొచ్చిన అతిథులందరికీ ఇచ్చాను. నా భార్య చెల్లెలి కుమార్తె పెళ్లి సందర్భంగా  కూడా పెళ్లిపిల్లలుజీవితానికి సంబంధించిన ఐదు కథలతో సంకలనం వేసి రెండు వేల కాపీలను పంచిపెట్టాను. దీనికి మంచి స్పందన వచ్చింది.
‘ఇక పిల్లలకు పద్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో 2012 మార్చి నుంచి శతకాలు పంపిణీ చేయడం ప్రారంభించాను. ఈ రెండేళ్లలో దాదాపు 45 వేల పుస్తకాలు ('పద్య పారిజాతాలుబాలగేయాలు') పంచిపెట్టానని తన పుస్తక వితరణ గురించి ఒకింత గర్వంగా చెప్పారు మధుసూదన రావు గారు ఆ ఇంటర్వ్యూలో.  

పుస్తక దాతా సుఖీభవ!

కింది ఫోటోలు:


శ్రీ రమణ 


దేవినేని మధుసూదన రావు దంపతులు 





(ఇంకావుంది)

23, ఏప్రిల్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (147) – భండారు శ్రీనివాసరావు

 

ఏం చేసినా కలెక్టర్ గానే.... 

 

మేము ఏం చేసినా, మంచి పేరు తెచ్చుకున్నా అది జిల్లా అధికారులుగా పనిచేసినప్పుడే. ఒక్కసారి సచివాలయంలో అడుగు పెట్టాము అంటే మొత్తం సమయం విధానాల రూపకల్పనకూ, వాటి అమలు పర్యవేక్షణకే సరిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే సెక్రెటరీ ఉద్యోగం పేరుకు పెద్దదే కావచ్చుకాని నిజానికి అది గ్లోరిఫైడ్ క్లర్క్”

 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి మాటల సందర్భంలో చెప్పిన మాట ఇది.

 

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కలెక్టర్లుగా పనిచేసి తరువాత సచివాలయంలో డిప్యూటీ సెక్రెటరీలుగా, కార్యదర్శులుగా విధులు నిర్వహించిన అనేకమంది ఐఏఎస్ అధికారులతో వృత్తిరీత్యా ఏర్పడ్డ అనుబంధాలలో భాగంగా చోటుచేసుకున్న ముచ్చట్లలో అధిక భాగం వాళ్ళు కలెక్టర్లుగా పనిచేసినప్పటి విషయాలే కావడం నన్ను అబ్బురపరిచేది.

 

అరవై ఏళ్ళ కిందట సయ్యద్ హషీం ఆలీ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు ఆయన వద్ద జిల్లా పౌర సంబంధాల అధికారిగా వుండేవారు. (తదనంతర కాలంలో ఆ శాఖకు డైరెక్టరుగా, అయిదుగురు ముఖ్యమంత్రులకు, 'చెన్నా టు అన్నా' - పీఆర్వోగా పనిచేశారు) ఆ కలెక్టర్ గారు ఎప్పుడు దౌరా వెళ్ళినా మా అన్నయ్యను వెంటబెట్టుకుని వెళ్ళేవారు. పత్రికల్లో వార్తలు, ఫోటోలు వేయించుకోవడం ఆయనకు సుతరామూ ఇష్టం వుండేది కాదు. మరి, ఎందుకు తనని కూడా తీసుకువెడుతున్నట్టు.

అసలు విషయం ఏమిటంటే జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు సామాన్య ప్రజలు, ప్రధానంగా బీదాబిక్కీ ఆయన్ని కలుసుకుని తమ సమస్యలు చెప్పుకునే వారు. హషీం ఆలీ గారి తెలుగు భాషా పరిజ్ఞానం అంతంత మాత్రం. కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది తర్జూమా చేసి చెప్పేటప్పుడు తనని తప్పుదోవ పట్తిస్తారేమో ఆయనకు అనుమానం. అందుకని ఆ పనిలో తోడ్పడడం కోసం మా అన్నయ్యను వెంట ఉంచుకునే వారు. ఈ సాన్నిహిత్యాన్ని కొందరు అపార్ధం చేసుకున్నారు కూడా. కలెక్టర్ గారితో మీకు బాగా పరిచయం వున్నట్టుందే అని అడుగుతుండేవారు. మా అన్నయ్య స్వతహాగా హాస్య ప్రియుడు. ‘అవునండీ. బాత్ రూమ్ అవసరం లాంటిది మా పరిచయం. బాత్ రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడే వుండిపోరు కదా. అలాగే నేను కలెక్టర్ గారిని రోజూ ఎన్నిసార్లు కలుసుకున్నా అవసరం మేరకే. అది పూర్తి కాగానే బయటకు వస్తాను’ అనేవారు.

 

ఆ రోజుల్లో ఖమ్మం కలెక్టర్ ఆఫీసు ట్రంకు రోడ్డులో వుండేది. చాలా చిన్న భవంతి. మెట్లు ఎక్కగానే చిన్న వసారాలో ఎదురుగా స్వింగ్ డోర్. దాని వెనుక ఒక నీలంగుడ్డ పరచిన మేజా బల్ల. వెనుక ఫేము  కుర్చీలో కలెక్టర్. అదీ పరిస్తితి. అటాచ్డ్ బాత్ రూమ్ కూడా వుండేది కాదు. వెనక పెరట్లో ఎక్కడో దూరంగా వుండేది.

 

ఆ రోజు కలెక్టర్ ని కలవడానికి భద్రాచలం దగ్గర ఓ పల్లెటూరు నుంచి ఓ రైతు వచ్చాడు. గుమ్మం ముందు హమేషా వుండే డవాలా బంట్రోతు ఆ సమయంలో ఏదో పనిమీద వెళ్ళాడు. లోపల కలెక్టర్ గారు బాత్రూంకు పోవడానికి లేచి పెరటి ద్వారం వైపు వెడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో రైతు స్వింగ్ డోర్ తెరుచుకుని ‘కలెక్టర్ దొరగారెక్కడ?’ అని అడిగాడు. తాను అడుగుతున్నది సాక్షాత్తు కలెక్టర్ నే అని అతడికి తెలియదు. హషీం ఆలీగారు ఏమాత్రం నొచ్చుకోకుండా, అతడిని కూర్చోబెట్టి విషయం తెలుసుకుని సమస్యను పరిష్కరించే విషయంలో తన కింది సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి పంపేశారు.

ఆ రోజుల్లో రెవెన్యూ బోర్డు సభ్యుడుసీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు. రెవెన్యూ బోర్డు సభ్యుడు అందులోను మొదటి సభ్యుడు అంటే చీఫ్ సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన ఆఫీసరు. ఆ కాలంలో ఉన్నతాధికారులు కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే రైల్లో ఖమ్మం చేరుకున్న అనంత రామన్ ని జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ రిసీవ్ చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి గృహం హిల్ బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు అధికారిక సమావేశాలుసమీక్షలు ముగించుకున్న తర్వాత అనంత రామన్ గుట్ట మీద నరసింహస్వామి గుడి చూడాలని వుందన్న  కోరిక వెలిబుచ్చారు. కలెక్టరు  జీపులో అనంత రామన్ గుడికి వెళ్లి పూజలు అవీ ముగించుకుని వచ్చారు. హైదరాబాదు రైలెక్కేముందు అనంత రామన్ కలెక్టర్ చేతిలో కొన్ని నోట్లు పెట్టి చెప్పారు.

మీరు జీపు ఇచ్చి నన్ను గుడికి పంపారుసంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం. కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయించండి’.

ప్రభుత్వ ధనం అంటే పాముగా పరిగణించే రోజులవి.

పక్కనే వున్న మా అన్నయ్య అన్నాడు, నేను కూడా వారితో కలిసి ప్రభుత్వ వాహనంలో దేవాలయానికి వెళ్ళిన వారిలో వున్నాను. కాబట్టి అందుకయిన ఖర్చులో నా వాటా కూడా ట్రెజరీలో జమచేయించండి

 

 

మరో  కలెక్టర్ కధ!

ఒకానొక కాలంలో జిల్లా మొత్తాన్ని తమ కనుసన్నల్లో శాసించే  జిల్లా కలెక్టర్లకు తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్  పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే పాతతరం విల్లీస్ జీపులు.

అలాటి కాలంలో, ఒకానొక  జిల్లాలో,  కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్. అధికారి జీపు తీసుకుని  ఓ రోజు ఉదయం ఏదో గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే, దారిలో  జీపు టైరు పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద  వూరికి వెళ్ళాడు. కలెక్టర్ గారి వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల నీడన వున్న ఒక మోరీ చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న  కలెక్టర్ గారి దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తూ  కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం  ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి నీటి  బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు   ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్ వేయించుకుని డ్రైవర్  తిరిగివచ్చాడు. కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి ఇల్లాంటి అధికారి కాదు కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్ ని నేరుగా  జిల్లా కేంద్రానికి పంపించి తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్ గారి సిబ్బంది, స్థానిక తాసిల్దారు  టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి, వారి గూడెం లోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని  సర్పంచు నుంచి ఓ అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను తక్షణమే  మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే  కూర్చుని సంతకం చేసి, కింద స్టాంపు వేసారు.  ఆ వెనువెంటనే  కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి  పని మొదలయింది. అంతకుముందు ఆ ఊరి జనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు. అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.

ఆ జిల్లా ఖమ్మం జిల్లా. ఆ వూరు రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ వూరి సర్పంచ్ మా రెండో బావగారు కొలిపాక రామచంద్ర రావు. ఆ కలెక్టర్ గారి పేరు ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి లేరు.  కానీ ఆ గూడెం ప్రజల మనస్సులో ఇంకా జీవించే వున్నారు.

 

మరో మంచి అధికారి కధ

సురేష్ చందా అనే ఓ ఐ.ఏ.ఎస్. అధికారి కూడా  ఈ కోవలోకే వస్తారు. తెలంగాణా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ అధికారి గురించి కొన్నేళ్ళ క్రితం పత్రికల్లో అనేక కధనాలు వచ్చాయి. వాటి ఆధారంగా రూపొందించిన వ్యాసం ఇది.

గత అరవై ఏళ్ళలో అనేక మార్పులు వచ్చాయి. జిల్లాకు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి మాత్రమే  వుండే  పద్దతి మారి జిల్లాకు ముగ్గురు నలుగురు వచ్చారు. టార్పాలిన్ పట్టాలు వున్న జీపులు పోయి అధునాతన వాహన శ్రేణి వచ్చి చేరింది. జిల్లా మొత్తంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలియచెప్పే సమాచార  వ్యవస్థ చేతికి అంది వచ్చింది. సిబ్బంది పెరిగారు. జనం ఇబ్బందులూ పెరిగాయి. మరీ అంతలా కాకపోయినా, రాజకీయ అవరోధాలను అధిగమించి, పదిమందికి పనికి వస్తాయని తాము అనుకున్న మంచి పనులను అనుకున్న రీతిలో చేసి పెట్టే అధికారులు కూడా మన మధ్యనే వున్నారు. సురేష్ చందా అనే ఈ  ఐ.ఏ.ఎస్.  అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పనిచేసేవారు. రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య, వైద్య సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే బాధ్యత ఆయనది. యువకుడు  కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన శాఖ పని తీరు మెరుగు పరుచుకోవడానికి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని ఆయన భావించారు. తెలంగాణాలో పేరొందిన గాంధి ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో  సచివాలయంలోని తన చాంబర్ నుంచే కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండు వందల నిఘా కెమెరాలను అమర్చాలని తలపెట్టారు. కింద వాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం ఆయన  బాధ్యతల్లో ఒకటి. కానీ, తాను  ఎలా పనిచేస్తున్నది కూడా  నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ ప్రయోగాన్ని ఆయన తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా రికార్డు చేసేది, చూసేది  తను ఒక్కరే కాకుండా ఎవరయినా సరే  చూడగలిగేలా, ఇంటర్నెట్తో దాన్ని  అనుసంధానం చేయడం ఇందులోని ఒక ప్రత్యేకత. 'సమాచార చట్టం ప్రకారం ప్రజలకు తెలుసుకునే హక్కు వచ్చింది. వాళ్ళు అడిగితే  ఇవ్వడం కాకుండా అడక్కుండానే యావత్ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచితే తప్పేమిట'నేది ఈ అధికారి అభిప్రాయం. తన దృష్టికి వచ్చిన ఫైళ్ళపై తాను  రాసిన నోట్ వివరాలను కూడా వెంట వెంటనే ఆయన ఇంటర్నెట్లో పెడుతుంటారని  పత్రికల్లో చదివినవారికి ఒకింత ఆశ్చర్యం కలగడం సహజం. అవసరానికి మించిన గోప్యతను అధికారులు పాటించడం వారికో అలవాటని జనంలో ఒక అభిప్రాయం బలంగా నాటుకుని ఉండడమే ఇందుకు కారణం. తాము చెప్పినది సావకాశంగా విని, కోరిన సమాచారం ఓ మేరకయినా అధికారులు అందించగలిగితే, తమ సమస్య సగం పరిష్కారం అయిందని సంతోషించే సామాన్యుల సంఖ్య కూడా అధికమే.

'అనుమతి లేకుండా పురుగు కూడా ప్రవేశించలేని అతి శీతల గదుల్లో కూర్చుని అధికారులు ఏం చేస్తుంటారు?' అనే అనుమానం సాధారణ జనంలో వుంది. అ అధికారుల గదుల్లోకి కనీసం తొంగి చూడడానికి కూడా వీలుపడని  వారికి సురేష్ చందా అనే ఈ అధికారి చేస్తున్నది అబ్బురం అనిపించడంలో సందేహం లేదు.   

అడగగానే మెచ్చి వరాలు ఇచ్చే దేవుళ్ళకు మన పురాణాల్లో కొదవలేదు. అడగకుండానే సమాచారం ఇవ్వాలనే అభిమతం కొందరు అధికారుల్లో అయినా ఊపిరి పోసుకోవడం  అభిలషణీయం. ఆహ్వానించదగ్గ పరిణామం .

మొత్తం పరిపాలన ఇలా ప్రజల  కళ్ళ ముందు జరగడం అంటూ జరిగితే పాలకుల పట్ల ప్రజల్లో పేరుకుపోతున్న అసహనం ఓ మేరకయినా తగ్గడం కూడా  ఖాయం. 

 తోకటపా: ఇది జరిగి పదేళ్లు దాటింది. ఏ హోదాలో వున్నా  ఆ అధికారి ఇప్పటికీ  అలానే వ్యవహరిస్తున్నారని ఆశిద్దాం.

(ఇంకావుంది)