18, మార్చి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో ( 119 ) – భండారు శ్రీనివాసరావు

 ‘ఇగ్నోటం పెర్ ఇగ్నోటియస్’

అనువాదం ముఖ్యోద్దేశం అర్ధం కావడం అనేవారు కీర్తిశేషులుపదప్రయోగ దురంధరులుఆర్వీయార్ గా సుప్రసిద్దులయిన  రాళ్ళభండి వెంకటేశ్వరరావు గారు. ఆయనా నేనూ కొన్నేళ్ళు మాస్కోలో కలిసి వున్నాము ఆర్వీయార్ రష్యన్ ప్రచురణ సంస్థ రాదుగాలో అనువాదకులుగా పనిచేసేవారు. రష్యన్ సాహిత్యాన్ని, కధలను, నవలలను అనేకం తెలుగులోకి అనువదించారు. రష్యా వచ్చిన తెలుగు వారికి ఉపయోగపడే రష్యన్ తెలుగు నిఘంటువు రచించారు. మాస్కో రావడానికి ముందు ఆయన లెక్చరర్ గా పనిచేసేవారు. మాస్కో వచ్చిన తర్వాత కూడా అక్కడి తెలుగు విద్యార్ధులకు గురువుగా మారిపోయారు.  నిత్యం ఆయన ఇల్లు విద్యార్ధులతో కళకళలాడేది. ఆర్వీయార్ భార్య సుందరమ్మ గారిని వాళ్ళు గురుపత్నిగా గౌరవించేవారు. ఆయన పక్కా వామపక్షవాది. గోర్భచేవ్ సంస్కరణలు ఆయనకు నచ్చేవి కాదు.

అనువాదాలు గురించి కదా చెప్పుకుంటున్నాం.   

మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు  అనువాద సమస్యలు నాకూ ఎదురయ్యాయి. ఎందుకంటే ప్రతిరోజూ  గంట వ్యవధికి సరిపోను రేడియో కార్యక్రమాలను తెలుగులో రూపొందించాల్సిన బాధ్యత నాపై వుండేది. రష్యన్ రేడియో అధికారులు కార్యక్రమాల మూలప్రతిని ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. దాదాపు ఎనభయ్ కి పైగా  ప్రపంచ భాషలకు ప్రాతినిధ్యం  వహిస్తూ అక్కడ పనిచేసే మేమందరం,  వాటిని ఎవరి భాషలోకి వాళ్ళం  అనువాదం చేసుకుని ప్రసారం చేసేవాళ్ళం. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం  భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసం  ఏర్పాటు.  అందువల్ల కొన్ని కొరుకుడుపడని వాక్య నిర్మాణాలుపదజాలాలు అక్కడ  పనిచేసే వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా వుండేవి.  నేపధ్యంలో,  మాస్కోలో నేనున్న రోజుల్లోనే  మాస్కో ‘రాదుగ’  ప్రచురణ సంస్థలో పనిచేసే ఆర్వీయార్ గారు నాకు ‘అనువాద సమస్యలు’ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.

‘రారా’ గా ప్రసిద్ధులయిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన  పుస్తకానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. (రెడ్డిగారు  కూడా అనేక సంవత్సరాలపాటు  మాస్కోలో  అనువాదకుడిగా  పనిచేశారు) అనువాద సమస్యలు అన్నింటికీ  పుస్తకం పరిష్కారం చూపలేకపోవచ్చు.  కాని అనువాదాల పట్ల అనురక్తి వున్న ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం అని నా ఉద్దేశ్యం. అనువాదం ఎలా చేయాలోఎలా చేస్తే మూలానికి దూరం జరగకుండా చదువరికి అర్ధం అయ్యేలా సుబోధకంగా అనువాదం ఎలా చేయొచ్చో తెలుసుకోవాలంటే    పుస్తకం చదివి తీరాలి. విశాలాంధ్ర ప్రచురణాలయంలో  పుస్తకం దొరికే అవకాశం వుంది.

 మాస్కోలో వారాంతపు రోజుల్లో సాయంకాలక్షేపాలు చేసేటప్పుడునాకూ ఆర్వీయార్  కు నడుమ   తెలుగు భాషఅనువాదాలకు చెందిన అనేక విషయాలు  దొర్లేవి.

ఆయన అనేక కబుర్లు ఆసక్తికరంగా చెప్పేవారు.

“పరమహంస  విద్యానాధ స్వామివారుషేక్స్పియర్ పేరుని ‘శూలపాణి’ అని అనువదించారుట. కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్రలోడిస్ట్రిక్ట్  జడ్జ్ కి ‘ప్రాడ్వివాకుడు’ అనిమెయిన్ రోడ్  కి ‘ప్రధాన రధ్య’ అనీరైల్వే లైన్  కి ఇనుపదారిఅయోమార్గం అనీ ఇలా అనువాదాలు కనిపిస్తాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా హోం వర్క్ కి ‘గైహికము’ అనీడిక్టేషన్  కి ‘ఉక్త లేఖనం’ అనీ తెలుగు పదాలు ఇచ్చారట.

అయితే తెలుగు ప్రయోగాలకంటే ఇంగ్లీష్ పదాలే వాడుకలో  ప్రాచుర్యం పొందాయి.

వాటి అర్ధం అందరికీ తెలిసేటప్పుడు ఇక అయోమయ పదకల్పన ఎందుకన్నది ఆర్వీయార్ అభిప్రాయం.

విద్యార్ధి కల్పతరువు అనే పుస్తకం వుంది. ఇప్పుడు దొరుకుతున్నదో లేదో తెలవదు. అందులో ధర్మామీటర్ (తాపమానిని)కెమెరా (ఛాయాగ్రాహక యంత్రం)టెలిగ్రాఫ్ ( తాజావార్తా యంత్రం)ఇలా అర్ధ వివరణ ఇచ్చారు. అయితే అర్ధం అవడం ముఖ్యమా అనువాదం ముఖ్యమా  అనే ప్రశ్నకు జవాబు దొరకాలి.

సర్వీస్ కమీషన్ కి తెలుగేమిటిదాన్ని మక్కికి మక్కి అనువాదం చేసి అదే ప్రశ్న అడిగితే ఎవ్వరికీ ఉద్యోగాలు రావు.

పోతేఅనువాదాలకు సంబంధించి సంస్మరించుకోవాల్సిన మరో మహనీయుడు ‘కలం కూలీ’ జీ.కృష్ణ గారు. అనువాదం చేసేటప్పుడు తెలుగులో ఆలోచించమని చెప్పేవారు. ఒక భాషలో వుండే పదాలు ఆయా ప్రాంతాల లేదా సంస్కృతుల ప్రాతిపదికగా  భాషల్లోకి  చొరబడతాయి. మరో భాషలోకి అనువదించేటప్పుడు వాటి సమానార్ధక పదాలు లభ్యం కాకపోవచ్చు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని పల్లెపట్టుల్లో ప్రజలు ఇలాటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఎటువంటి పదాలు వాడతారు అని కాసేపు ఆలోచిస్తే చక్కటి సమానార్థక పదాలు దొరికి తీరుతాయి. కాని మన అనువాద నిపుణులకు  తీరిక వుండదు. వారికి అప్పటికప్పుడు తట్టిన పదాలను జనం మీద  ప్రయోగించి అవే ప్రామాణికం పొమ్మంటారు. అందువల్లనే, అలాటి వాటి గురించి నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్తితి ఎదురవుతోంది. పిల్లి అంటే మార్జాలం అంటూ  సరిపెట్టుకోమంటున్నారు.

సరే! ఇదొక కధ.

అర్ధం కానిదాన్ని గ్రీక్ అండ్  లాటిన్  అనే ఒక్క మాటతో కొట్టేయడం మనకు తెలిసిందే.

లాటిన్  భాషలో ‘ఇగ్నోటం పెర్ ఇగ్నోటియస్’ అని ఒక పద ప్రయోగం వుంది.  ఒక పట్టాన కొరుకుడు పడని  లాటిన్ పదప్రయోగానికీ   అర్ధం వుంది. వివరించబోయిన విషయం కంటే వివరణ క్లిష్టంగా వుండడం అనేది దీని  మూలార్ధం.

నెట్ ప్రపంచం ఆవిష్కరణ అనంతరం తెలుగు వినియోగం వేగంగా పెరుగుతోంది.  నేపధ్యంలో అనువాద సమస్యలు మరింత పెరిగే అవకాశం వుంది. వీటిని ఎదుర్కోలేక సమాధానపడితేపుట్టతేనె వంటి  తియ్యటి తెనుగు  తన స్వరూపాన్నే కోల్పోయే ప్రమాదం వుంటుంది.

కాబట్టిరాసేది  అనుసృజన అయినా, అనువాదం అయినా తెలుగులో ఆలోచించి తెలుగులో రాయాలి. 

అనువాద సమస్యలు వుండవచ్చు,  కాని అనువాదమే చదువరికి  సమస్యగా మారకూడదు.

ఉపశృతి:

పూర్వం నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే రోజుల్లో ఒకసారి ‘బాధ’ అని రాయడానికి పొరబాటున ‘భాద” అని భా కు ఒత్తు తగిలించాను. అది చూసిన ఎడిటర్  నండూరి  రామమోహన రావు గారు, ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత భాదా’ అంటూ సుతారంగా  ఆ తప్పును ఎత్తి చూపించారు. యాభయ్ ఏళ్ళ తరువాత కూడా  నాకిప్పటికీ ఇది  జ్ఞాపకం వుంది.

అది సరే! ఈ ‘భాద’ మహాకవి కాళిదాసుకు కూడా తప్పలేదని చెప్పే ఒక ఐతిహ్యం వుంది.

ఓ పండితుడు ఎలాగైనా సరే పాండిత్యంలో కాళిదాసును ఓడించి తీరాలని పట్టుదలతో వచ్చాడు. ఆయన్ని ఆస్థానానికి తీసుకురావడానికి వెళ్ళిన పల్లకీ బోయీల్లో ఒకడుగా కాళిదాసు కూడా కావాలనే వెడతాడు. పల్లకీ మోత అలవాటులేక మాటిమాటికీ భుజం మార్చుకుంటున్న కాళిదాసుని గమనించి, పల్లకీలో విలాసంగా కూర్చున్న ఆ పండితుడు అంటాడు,  ‘ఏమయ్యా పల్లకీ మోయడం భాదగా ఉందా’ అని. భాద అన్న ముక్క వినగానే బోయీ వేషంలో వున్న కాళిదాసు, ‘’భాద అనే నీ అపశబ్దం కంటే పల్లకీ కొమ్ము మోయడం బాధగా లేదులే’ అంటాడు.

దానితో పండితుడికి గర్వభంగం కావడం, కాళిదాసు కాళ్ళమీద పడడం వేరే కధ. 

కింది ఫోటో:

మూడు దశాబ్దాల క్రితం మాస్కోలో ఆర్వీయార్ తో కబుర్లతో సాయంకాలక్షేపాలు



(ఇంకావుంది)  

 

17, మార్చి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో ( 118 ) – భండారు శ్రీనివాసరావు

 


ఊలిచ్చ వావిలోవా . ఇది మాస్కోలో మేము వున్న ప్రాంతం. ఊలిచ్చ అంటే రష్యన్ భాషలో స్ట్రీట్ (వీధి) అని అర్ధం. వావిలోవా స్ట్రీట్ లో రేడియో మాస్కోకు 14 అంతస్తులు కలిగిన ఒక నివాస భవనం వుంది. రేడియో మాస్కో విదేశీ విభాగంలో ప్రపంచంలోని 86 భాషల్లో ప్రసారాలు సాగుతుండేవి. ఇందులో తెలుగుతో సహా 14 భారతీయ భాషలు ఉండేవి. వీటికి సంబంధించిన విదేశీ భాషా నిపుణులను ఆయా దేశాలనుంచి ఆహ్వానిస్తుండేవారు. వీరంతా కుటుంబాలతో సహా నివసించడానికి ఈ భవనాన్ని ఏర్పాటు చేశారు. మేము ఇండియా నుంచి రాగానే తీసుకువచ్చి దింపిన భవనం,  రేడియో మాస్కవా దోం,  ఇదే. ( మాస్కోని మాస్కవా అంటారు. దోం అంటే రష్యన్ లో భవనం ) . బయటకు వెళ్ళే పని లేకుండా ఇందులోనే రెస్టారెంట్, హెయిర్ కటింగ్ సెలూన్ మొదలయిన వసతులతో పాటు, ఎలాంటి అవసరం వచ్చినా సాయపడడానికి, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ మొదలైన  సిబ్బంది రేయింబవళ్ళు సిద్దంగా వుంటారు.

 ఇంటికి కూతవేటు దూరంలో 'ప్రోదుక్తి' దుకాణం వుంది. ఇందులో అన్ని రకాల పాల పదార్ధాలు, పాల ఉత్పత్తులు దొరుకుతాయి. మరికొద్ది దూరంలో, 'రీనక్' అనే మార్కెట్ వుంది. గోర్బచేవ్ ప్రవచించి అమలు చేసిన గ్లాస్నోస్త్, పెరిస్త్రోయికా సిద్దాంతాల నేపధ్యంలో ఆవిర్భవించిన 'నయా' మార్కెట్ 'రీనక్'. ఇక్కడ అన్ని రకాల ఆహార పదార్ధాలు దొరుకుతాయి. అయితే, బయట షాపుల్లో కంటే ధరలు ఎక్కువ. ఉత్పత్తి ఖర్చుని బట్టి వస్తువు ధర ఉండాలనే సూత్రం ప్రాతిపదికగా ఈ మార్కెట్లు కొత్తగా వెలిసాయి.

చవక అనే పదం కన్నా చవక

మా బామ్మ చెబుతూ వుండేది , 'తన చిన్న తనంలో పుట్టెడు వడ్లు (పది బస్తాలు) రూపాయికి అమ్మేవారని.

మాస్కోకి వచ్చిన తరవాత బామ్మ చిన్ననాటి రోజులు మా అనుభవంలోకి కూడా వచ్చాయి.

మేము వచ్చిన కొత్తల్లో ఇండియాకు ఫోన్ చేసినప్పుడు,  'అక్కడ చవగ్గా ఏమి దొరుకుతాయి?' అని మా వాళ్ళు అడిగేవారు. 'అన్నీ చవకే' అని జవాబు చెబుతుండేవాళ్ళం.

మన రూపాయికి నూరు పైసలు మాదిరిగానే రష్యన్ రూబుల్ కు వంద కోపెక్కులు. ఒక కోపెక్కుకు దొరికే వస్తువులు కూడా వున్నాయి. అగ్గిపెట్టె, కోడిగుడ్డు లాంటివి ఒక కోపెక్కు పెట్టి కొనుక్కోవచ్చు. గాలన్ పెట్రోలు ముప్పయి కోపెక్కులు. పది రూబుళ్ళు మనవి కావనుకుంటే కారు ట్యాంక్ నింపుకోవచ్చు. పాలకూ, పెట్రోలుకూ ధరలో తేడా వుండదు. ఒక్క మాస్కోలోనే కాదు,  దేశ వ్యాప్తంగా ధరవరలన్నీ ఒకే మాదిరిగా వుండడం మరో విశేషం. పల్లెల్లో, బస్తీల్లో అంతా సమానమే. పైగా ప్రతి వస్తువు మీదా దాని ధర ముద్రించి వుంటుంది. ఆఖరికి ప్రతి కోడిగుడ్డుపై కూడా.  బేరసారాలకు తావు లేకపోవడం, ధర గురించిన బాధ లేకపోవడం,  ఇవన్నీ భాష తెలియని మా బోంట్లకి వరంగా మారింది.

అయితే , పెరిస్త్రోయికా, గ్లాస్నోస్త్ సిద్దాంతాల అమలు ప్రభావం కొద్ది కొద్దిగా ధరవరలపై పడుతూ వచ్చి అయిదేళ్ళ తరువాత ఇండియాకు తిరిగి వచ్చే నాటికి మేము వచ్చిన మాస్కో ఇదేనా అన్నంతగా మారిపోయింది. ఇంతకుముందు పేర్కొన్న 'రీనక్' వంటి మార్కెట్లు అన్ని రంగాల్లో ప్రవేశించి,  దశాబ్దాలతరబడి 'మార్పు' అంటే తెలియని సోవియట్ పౌరుల జీవితాలను అతలాకుతలం చేసాయి.

మాస్కో గోంగూర

మాస్కోలో పనిచేసే విదేశీయులకు వేతనాలు అధికంగా లభిస్తాయి కాబట్టి, రీనక్ వంటి మార్కెట్లలో వాళ్ళే ఎక్కువగా కనిపిస్తుంటారు. కాకపొతే, అక్కడ లభించే ఆహార పదార్ధాలలో తొంబయి శాతం మాంసాహారులకి పనికివచ్చేవే. ఒకటీ అరా కానవచ్చే ఆకుకూరల్లో,  కొన్నింటిని మా ఆవిడ 'శబరి' లాగా కొరికి చూసి,  గోంగూర 'పులుపు' కు కాసింత అటూఇటూ గా వున్న ఒక ఆకుకూరకు 'గోంగూర' అని నామకరణం చేసింది. ఆ తరవాత, మాస్కోలో మేమున్న అయిదేళ్ళూ,  వచ్చిన అతిధులకు ఆ గోంగూరతోనే ఆతిధ్యం. అంతే కాకుండా,  మాస్కోలో వున్న ఇతర  తెలుగు కుటుంబాల్లో కూడా 'రీనక్ గోంగూర' ప్రధాన అధరువుగా మారిపోయింది.

అలనాటి సోవియట్ యూనియన్  లో కొత్తగా వెళ్ళిన మా వంటి వారికి అక్కడ చాలాకాలంగా ఉంటున్న మన  వాళ్ళు ఓ నీతి బోధ చేసేవాళ్ళు.

‘కనబడిన క్యూలో నిలబడు. దొరికిన ప్రతిదీ కొనుక్కో. కొన్న వస్తువు పనికొస్తుందా రాదా, అసలు అదేమిటి  అన్నది ఇంటికి వెళ్లి చూసుకో”

దీనికి కారణం వుంది. ఆ దేశంలో ప్రతిదీ బీరు నుంచి కారు వరకూ అన్నీ కారు చౌకే. లీటరు పాలు ముప్పయి కోపెక్కులు. (మన పైసల వంటివి). లీటరు పెట్రోలూ   ముప్పయి కోపెక్కులే. కార్లూ, రిఫ్రేజ్ రేటర్లు ఏవీ ఖరీదు కావు. చౌక అనే దానికి తోడు ప్రజల కొనుగోలు శక్తి కూడా అపరిమితం. దానాదీనా  జనాలు అవసరం వున్నా లేకపోయినా, అవసరానికి మించి కొనుగోళ్ళు చేసేవాళ్ళు. అంచేత వచ్చిన సరుకులు వచ్చినట్టు క్షణాల్లో అయిపోయేవి. మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు.

అవసరానికి మించి కొనుగోళ్ళు జరపడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడేది. దానితో పాటే క్యూలు పెరిగిపోయేవి. మనిషికి ఇన్నే అనే నిబంధన పెడితే అందరికీ దొరికేవేమో. కానీ ప్రజా సంక్షేమం పేరుతొ అలాంటి ఆంక్షలు ఉండేవి కావు.

ఏతావాతా జరిగింది ఏమిటంటే ఏ కొరతా లేని దేశంలో అన్నిటికీ కొరతలు ఏర్పడ్డాయి.

కొరత మాట ఎలా వున్నా ఏదీ ఖరీదు కాదు. అంచేత దొరికిందే కొనుక్కుందామని క్యూలలో కాలక్షేపం చేయడం జనాలకు అలవాటయింది. అదృష్టం బాగుంటే ఆ రోజు క్యూబా నుంచి దిగుమతి అయిన  తాజా తాజా అరటి పండ్లు డజన్ల కొద్దీ ఇంటికి తెచ్చుకోవచ్చు. అదృష్టం మరీ పుచ్చితే జర్మనీలో తయారయిన నాణ్యమైన ఎలెక్ట్రానిక్ వస్తువులు దొరకొచ్చు. ఖరీదు మాత్రం రూబులు (రూపాయ్) దాటితే గొప్ప.

ఒకసారి ఇలానే ఓ క్యూలో నిలబడి చాలా చవగ్గా కనబడ్డది ఒకటి కొని ఇంటికి తెచ్చాను. చాలా బరువున్న ఆ  ప్యాకెట్ మీద రష్యన్ లో ఏదో  రాసుంది. అదేమిటో తెలియక పక్కన పడేశాను. తీరా ఎవరో చెప్పారు, అది చెకొస్లవేకియాలో  కట్ గ్లాస్ తో తయారుచేసిన  విస్కీ సెట్ (డికా౦టర్) అని. మనదేశంలో దాని ఖరీదు వేలల్లో వుంటుందని.

(ఇన్నేళ్ళ తరువాత కూడా, ఇన్ని ఇళ్ళు మారిన తరువాత కూడా అదిప్పుడు మావద్ద భద్రంగా వుంది, ఆ నాటి మా వైభవానికి ఓ తీపి గుర్తుగా) 

కింది ఫోటో

చెకొస్లవాకియా కట్ గ్లాస్ డికాంటర్



(ఇంకావుంది)

 

 

ఏకాంత శయనం

ఏకాంత శయనం – భండారు శ్రీనివాసరావు 

జీవితంలో ఎదగడానికి చాలా చాలా కష్టపడాలి. ఆ ఎదుగుదలలోనే  కొంత సంయమనం అవసరం. ఎదిగే వయస్సులో సమవయస్కులు, సహోద్యోగులు, మితృలు, బంధువులు అందరూ తోడుంటారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు చుట్టూ వున్న సన్నిహితులు,  స్నేహితులు, శ్రేయోభిలాషుల  సంఖ్య తరిగిపోతూ వుంటుంది. ఎందుకంటే ఎక్కేది పిరమిడ్. పైకి పోతున్న కొద్దీ, చుట్టూ వున్న చుట్టుకొలత చిన్నది అవుతూ వుంటుంది. వారికి జాగా వుండదు.
చివరికి చివరి మెట్టు ఎక్కిన తర్వాత చూసుకుంటే చుట్టూ ఎవ్వరూ కనబడరు.
ఏమి సాధించినట్టు?