11, మార్చి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (109 ) – భండారు శ్రీనివాసరావు

 బస్సులో బంధువులు

ఆ రోజు మాస్కోలో  మా ఇంటికి అనుకోకుండా బస్సులో వచ్చిన వాళ్ళెవ్వరూ మా బంధువులు కాదు. కనీసం ముఖ పరిచయం వున్న వాళ్ళు కూడా కాదు. కానీ ఒక్క పూట మా ఇంట్లోగడిపిన 'పుణ్యానికి' ఆత్మ బంధువులుగా మారారు.
నిజానికి అది మా ఆవిడ చేసుకున్న పుణ్యం.ఇంకా చెప్పాలంటే - ఆమెను కట్టుకుని నేను చేసుకున్న పుణ్యం. ఇది మూట కట్టుకోవడానికి చాలా రోజులముందు బందరు నుంచి నాకో రోజు ఓ కార్డు ముక్క వచ్చింది.

నిజానికి రాలేదు. నేనే వెళ్లి తెచ్చుకున్నాను. మాస్కోలో వుండే విదేశీయులెవరికీ నేరుగా ఇళ్ళకు ఉత్తరాలు రావు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వస్తాయి. అంటే  హైదరాబాదులో వున్న మా వాళ్ళెవారయినా నాకు ఉత్తరం రాయాలనుకుంటే నా పేరు రాసి  తరవాత  కేరాఫ్ మాస్కో రేడియో అని రాసి డిల్లీలో వున్న మన విదేశాంగ శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాలి. అలా వచ్చిన ఉత్తరాలనన్నింటినీ 'డిప్లొమాటిక్ బాగ్ లో' వారానికోసారి మాస్కోకు విమానంలో పంపుతారు.


 మన ఎంబసికి చేరిన ఉత్తరాలను మనమే వెళ్లి వెదికి తెచ్చుకోవాలి.అలా ఉత్తరాలను గాలించి తెచ్చుకోవడంలో వున్న తృప్తి అనుభవిస్తే కానీ అర్ధం కాదు. చుట్టపక్కాలనుంచివచ్చే  ఉత్తరం ముక్కకోసం ఎంతగా మొహం వాచిపోయేవాళ్లమో ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.   మేము జవాబు రాయాలన్నా ఇదే వరస. ఇందులోవున్న ఏకైక సౌలభ్యం ఏమిటంటే మనకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎయిర్ మెయిల్ స్టాంప్  ఖర్చులు పెట్టుకోనక్కరలేదు. మామూలు తపాల స్టాంపులతో డిల్లీకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడనుంచి రాయాలన్నప్పుడు మాకూ అంతే. అందుకే ఎవరయినా వస్తున్నప్పుడు ఏమి పట్టుకురావాలని అడిగినప్పుడు ఇండియన్ స్టాంపులు తెమ్మని అడిగేవాళ్ళం. ఈ ఉత్తరాలతో పాటే ఇండియా నుంచి  ఇంగ్లీష్ దినపత్రికలు వచ్చేవి. వాటిల్లో బెంగళూరు నుంచి వెలువడే హిందూ వుండేది.



.మన రాష్ట్రం సమాచారం తెలియాలంటే హిందూలో హైదరాబాద్ నుంచి వారం వారం హెచ్ జే రాజేంద్రప్రసాద్ గారు రాసే ఆంద్ర ప్రదేశ్ న్యూస్ లెటర్ ఒక్కటే శరణ్యం.  


 తరువాతి రోజుల్లో మాస్కోకు వచ్చిన అప్పటి ఆంద్రజ్యోతి ఎడిటర్,   ఐ. వెంకట్రావు గారు  తెలుగు పత్రిక కోసం అక్కడి తెలుగువాళ్ళు పడుతున్న  ఆరాటాన్ని గమనించి,  హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే ఎంబసీ ద్వారా ఆంధ్రజ్యోతి దినపత్రికను నా పేరు మీద పంపడం ప్రారంభించారు.

మాస్కోలో ఉంటున్న తెలుగు వారిలో నా పరపతి పెరగడానికి ఇది దోహదం చేసింది కూడా.

 ఇక ఆ పోస్టు  కార్డు విషయానికి వస్తే,

బందరులో నరసింహమూర్తి గారనే  ఒక పెద్దమనిషి గారున్నారు. ఇస్కస్ (ఇండో సోవియట్ సాంస్కృతిక సంస్థ)ద్వారా  సోవియట్ యూనియన్ పర్యటనకు రావాలనుకుంటున్న ఆంద్ర ప్రదేశ్ ప్రతినిదివర్గంలో ఆయన వున్నారు. శాకాహారి అయిన ఆయన రష్యాలో తిండీ తిప్పలు గురించి ముందే వాకబు చేసుకుని, నా అడ్రసు తెలుసుకుని ఆ కార్డు రాసారు. ఫలానా రోజున మాస్కోలో ఫలానా హోటల్ లో ఉంటాననీవచ్చికలుసుకోవాల్సిందనీ అందులో కోరారు.


 దాని ప్రకారమే  ఆ ఫలానా రోజున ఆ ఫలానా హోటల్ కు వెళ్లి ఆయన్ని కలుసుకున్నాను. మాస్కో రావడానికి ముందే రష్యాలోని మరో రెండు మూడు నగరాలు  వారిని తిప్పి తీసుకువచ్చారు. బడలికతో నీరసించివున్న   ఆయన నన్ను పక్కకు తీసుకువెళ్లి,  'ఈ రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఏమయినా అభ్యంతరమాఅని అడగలేక అడిగారు. పరిస్తితిని అర్ధంచేసుకుని వెంటనే ఆ పెద్దమనిషిని మా ఇంటికి  బయలుదేరదీసాను. ఈ విషయం ఎలాతెలిసిందో ఏమో,  ఒక్కొక్కరుగా వచ్చి అదే కోరిక కోరారు. ఇప్పట్లోలాగా ఆ రోజుల్లో సెల్ ఫోనులు లేవు. ఇంటికి ఫోను చేసి ఇంతమంది వస్తున్నారని ముందస్తుగా కబురు చేసే వీలులేదు. ఏమయితే అయిందని  వాళ్ళతో వున్న రష్యన్ దుబాసీతో సహా  అందర్నీవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన  బస్సులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లాను.

బిలబిలమంటూ ఇంటికి వచ్చిన అతిధులను చూసి మా ఆవిడ ముందు కంగారు పడినా,  తరవాత తమాయించుకుని  అందరికీ పచ్చళ్ళుసాంబారు, పెరుగుతో భోజనాలు పెట్టింది. 'అన్నదాతా సుఖీభవా' అని అంతా ఆశీర్వదిస్తుంటే,  ‘ఇచ్చుటలో వున్న హాయీ వేరెచ్చటనూ లేనేలేదనీ,  లేటుగ తెలుసుకున్నానుఅన్న బాపూ రమణల బుద్దిమంతుడి పాట గుర్తుకు వచ్చింది. ఆ రోజు మా ఇంట్లో నాలుగు మెతుకులు తిన్న వారందరూ పోతూ పోతూ  ఇచ్చిన టీ పొట్లాలుకాఫీ పొడి  పాకెట్లువక్కపొడి మొదలయిన- 'అమూల్య కానుకలతో' ఆ తరవాత  కొన్నాళ్ళు మాకు పండగే పండగ.

దేశం కాని దేశంలో ఇలా సంతర్పణలు ఎలా అనే అనుమానం రావచ్చు

మాస్కోలో పాలకు కొదవలేదు. ఉన్నదల్లా పెరుగుకే. అక్కడ దొరికే కిఫీర్ అనేది అటు పెరుగు ఇటు మజ్జిగ కాని బ్రహ్మపదార్ధం. పాలు తోడు పెట్టి పెరుగు చేసుకోవచ్చు. కానీ తోడుకు పెరుగేదీ?
డిల్లీనుంచి ఎవరో తెలిసిన పెద్దమనిషి వస్తుంటే ఓ గిన్నెడు పెరుగు పట్రమ్మని కోరాము. అలా దిగుమతిచేసుకున్న పెరుగుతో ప్రారంభించిన 'తోడు' ప్రయోగాలు కొద్దిరోజుల్లోనే విజయవంతమయి, సొంతంగా ఇంట్లోనే పెరుగు ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించగలిగాము.దాంతో  ఇక మాస్కోలోని తెలుగులోగిళ్ళలో  పెరుగు వడలు, పెరుగు పచ్చళ్ళు , ఆవకాయకారంతో పెరుగన్నాలు,  మజ్జిగ పులుసులు  స్వైరవిహారం చేయడం మొదలెట్టాయి. 


పెరుగు సమస్య తీరిపోవడంతో బియ్యంపై దృష్టి పెట్టాము. అక్కడ దొరికే బియ్యం చాలా చాలా కారు చవక. అయితే పేరుకు బియ్యమే కానీ వండితే వచ్చేది అన్నం కాదు. తినడానికే కాదు చూడడానికి కూడా పసందుగా లేని రష్యన్ బియ్యం బదులు మామూలు బియ్యం సంపాదించడం ఎల్లా అన్నది మా దినసరి సమస్యగా మారింది.

 ఆ సమయంలో మాస్కో వచ్చిన రాజ్య సభ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు  ఒక రోజు సాయంత్రం నగరంలోని డిల్లీ రెస్టారెంట్ లో తెలుగు వాళ్ళందరికీ విందు ఇచ్చారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఆ హోటల్ లో బాస్మతి బియ్యంతో చేసిన ఫ్రయిడ్ రైస్ వడ్డించారు.


వెంటనే  ఆ రెస్టారెంట్ మేనేజర్ ను కదిలించి చూసాను.
 వాళ్లకు డిల్లీ నుంచి వారానికి ఒకసారి బియ్యం బస్తాలలో వస్తుంటాయట. బియ్యంకోసం మేము పడుతున్నపాట్లు విన్నవాడయి,  మనసు కరిగిన వాడయి  నెలకిన్ని కిలోలని బియ్యం (ఖరీదుకు) ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలాగే ఐ టీ డీ సీ నడిపే బాంబే రెస్టారెంట్ నుంచి మరికొంత నెలసరి బియ్యం కోటా సంపాదించుకునే తెలివితేటలను 'అవసరమే' మాకు నేర్పింది.

మాస్కోలో అన్నీ చవకే కాని శాకాహారులకే కొద్దిగా ఇబ్బంది. మంచు దేశం కాబట్టి కూరగాయలు దొరకవు. దొరికినా మనవైపు అలవాటయినవి అసలే దొరకవు. ఒకటీ అరా కానవచ్చే ఆకు కూరల్లో కొన్నింటిని మా ఆవిడ శబరి మాదిరిగా కొరికి చూసి,  గోంగూర పులుపుకు కాసింత దగ్గరగా వున్న ఒక ఆకు కూరకు ‘గోంగూర’ అని నామకరణం చేసింది. ఆ తరువాత మాస్కోలో వున్న అయిదేళ్ళూ వచ్చిన అతిధులకు ఆ గోంగూరతోనే ఆతిధ్యం.


.కొంత ఎక్కువ ఖర్చయినప్పటికీ, భోజనానికి సంబంధించిన కొన్ని ప్రధాన సమస్యలు తీరిపోవడంతో, మాస్కోలో చదువుకునే తెలుగు పిల్లలకు శనాదివారాల్లో  మా ఇల్లు తెలుగు భోజనశాలగా మారిపోయింది. వాళ్ళంతా మా ఆవిడను అన్నపూర్ణ అని పిలిచేవాళ్ళు. ఇళ్ళకు దూరంగాఇంటి భోజనానికి  మరీ దూరంగా నాలుక చవిచచ్చిన ఆ పిల్లలు,  మా ఆవిడ వడ్డించే  'రీనక్ గోంగూర పచ్చడి, గడ్డపెరుగు అన్నం' తినడానికి చాలా చాలా దూరాలనుంచి చచ్చీచెడీ వచ్చేవారు. వాళ్ళ ఆటా పాటలతో మా ఇల్లు సందడే సందడి.  రెండు రోజులు యిట్టే సరదాగా గడిచిపోయేవి. ఒకరికి పెట్టడంలోవున్న హాయినీ, ఆనందాన్నీ ఒక జీవితానికి సరిపడా మాస్కో జీవితం మాకు అందించింది. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి?

కింది ఫోటోలు:

మాస్కో యూనివర్సిటీలో చదువుకుని డాక్టర్లు అయిన సమత, రాజ్యలక్ష్మి. ఇతర విద్యార్ధులతో మా ఆవిడ నిర్మల 






(ఇంకా వుంది)

10, మార్చి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (108) – భండారు శ్రీనివాసరావు

 రోడ్డు మీద పోతుంటే పోలీసు ఆపి, నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు. జేబులోనుంచి ఓ ఫోటో గుర్తింపు  కార్డు తీసి, ఇదిగో ఇది నేను అని చెప్పాలి. అప్పుడే అతడు నమ్మే వీలుంది, నమ్ముతాడని నమ్మకం లేకపోయినా. అంటే ఏమిటన్నమాట. మనమెవరో మనమే మన నోటితో చెప్పినా నమ్మని వాడు, మనం మన కార్డు తీసి ఇచ్చి నేను పలానా అంటే నమ్మే చాన్స్ వుంది. అందుకే ఈ కలియుగంలో మనుషులకన్నా కార్డులకే విలువ ఎక్కువ. అవి మనకి ఒక గుర్తింపు ఇస్తాయి.

జ్ఞానపీఠాలు, పద్మశ్రీలు, దాదా సాహెబ్ లు, స్వర్ణ నందులు ఒక రకం గుర్తింపులే. అవి పెట్టిపుట్టిన వారికి.

పుట్టి కూడా పుట్టినట్టు దాఖలా కోసం కావాల్సిన గుర్తింపులు మరి కొన్ని. ఉదాహరణకు బర్త్ సర్టిఫికేట్. స్కూలు ఫైనల్ లేదా టెన్త్ క్లాస్ (పుట్టిన తేదీ నిర్ధారణ కోసం), కులం సర్టిఫికేట్ (అవసరాన్ని బట్టి), నివాస స్థలం గుర్తింపు, బ్యాంకు (ఏటీఎం) కార్డు, ఇక ఆధార్ సరేసరి. ఇవన్నీ ఓ మోస్తరు బతుకులకోసం. ఇంకొంచెం డబ్బు ముదిరితే పాస్ పోర్టు, వీసా, బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్లాటినం, గోల్డ్ ఎట్సెట్రా ఎట్సెట్రా.

పాతికేళ్ళు వచ్చేవరకు ఈ కార్డుల గోల పెద్దగా లేదు. పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికేట్ లోనే వుంది కాబట్టి ఉద్యోగ పర్వం వరకు దానితోనే నెట్టుకొచ్చాను.

హైదరాబాదులో రేడియో విలేకరి ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట అవసరం పడింది రేషన్ కార్డు. బియ్యం, గోధుమలకోసం కాదు. గుర్తింపు కోసం. పాస్ పోర్టుకు దరఖాస్తు పెట్టుకోవాలన్నా, ఆ రోజుల్లో రేషన్ కార్డు అడిగేవాళ్ళు. అందరిలాగే దానికోసం  ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చేస్తున్న ఉద్యోగం దుర్వినియోగం చేయక తప్పలేదు. వెళ్లి అప్పటి రెవెన్యూ మంత్రి పి. నరసారెడ్డి గారితో చెప్పాను. ఆయన పియ్యేను పిలిచి నాకు సంబంధించిన ఏరియా తాసీల్దారును ఆఫీసుకు పిలిపించారు. అధికార ముద్రతో సహా రమ్మని చెప్పారు. ఆయన ఆఘమేఘాల మీద సచివాలయానికి వచ్చారు. నన్ను కూర్చోబెట్టుకుని వివరాలు తీసుకుని స్టాంపు వేసి రసీదు ఇచ్చారు. సాయంత్రం కల్లా రేషన్ కార్డు నాకు ఆఫీసులో ఇచ్చి వెళ్ళారు.

తరువాత కౌలాలంపూర్ తెలుగు మహాసభలకు వెళ్ళడానికి పాస్ పోర్టు అవసరం వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య గారు. సీఎం ఆఫీసు చొరవతో అది ఇంటికే వచ్చింది, ఇరవై నాలుగ్గంటల్లో.

అమెరికా వెళ్ళడానికి పదేళ్ల వీసా కూడా చెన్నై వెళ్ళకుండా, ఇంటర్వ్యూ కు హాజరు కాకుండా చెన్నై ఎంబసీ వాళ్ళే పోస్టులో పంపారు. అలాగే మా ఆవిడ వీసా కూడా. అది నేను చేస్తున్న ఉద్యోగం చలవే.  

బ్యాంకు కార్డు వద్దనుకున్నాను. కానీ ఒక బ్యాంకు వాళ్ళు ఆఫీసుకు వచ్చి మొహమాట పెట్టి మరీ ఇచ్చారు. ఇవ్వడం ఇచ్చారు కానీ దానితో పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఆ క్రెడిట్ కార్డు లేకపోతే  బహుశా నాకు జీవితంలో బీపీ రోగం వచ్చేది కాదేమో! అది మాత్రం ఆ బ్యాంకు వాళ్ళ పుణ్యమే. బ్యాంకుల వాళ్ళు కూడా డబ్బు(బాకీ) వసూళ్ళకు ప్రైవేటు ఏజెన్సీల (గూండాల) ను నియమించుకుంటారని అప్పుడే తెలిసింది. దాంతో క్రెడిట్ కార్డు వదుల్చుకుని డెబిట్ కార్డు తీసుకున్నాను.

ఆధార్ కార్డుకు పెద్ద ప్రయాస పడలేదు. ఆధార్ కార్డుల శకం మొదలయిన కొత్తల్లోనే తీసుకున్నాను, పెద్ద ఇబ్బంది పడకుండా. ఇంటిపక్కనే ఆధార్ నమోదు కేంద్రం పెట్టారు. వెళ్లి పదిహేను నిమిషాల్లో నేనూ మా ఆవిడా వేలిముద్రలు, కనుపాప ముద్రలు ఇచ్చి కార్డులు తెచ్చేసుకున్నాం. కాకపోతే దానిమీద ఫోటో మాది అంటే మేమే నమ్మే పరిస్థితి లేకుండా, కింద పేరు రాస్తే కాని పలానా అని గుర్తు పట్టడానికి వీలు లేకుండా, ఆ పేరు కూడా ఇంగ్లీష్ లో ఒక రకంగా, తెలుగులో మరో రకంగా,  గొప్ప అసహ్యంగా వచ్చింది. కొన్నేళ్ళు ఆ ఆధార్ ఆధారంగానే రోజులు నెట్టుకువచ్చి, సాంకేతికంగా పరిస్థితులు కాస్త బాగుపడ్డ తర్వాత ఇంటి నుంచి కంప్యూటర్ ద్వారా ప్రయత్నించి మరో కార్డు తీసుకున్నాము. అలాగే ఓటరు గుర్తింపు కార్డు.

విధిగా తీసుకోవాల్సి వచ్చిన మరో రెండు కార్డులు వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, PAN కార్డు, స్కూటర్ కొన్న కొత్తల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు. మూడు కూడా పెద్ద కష్టపడకుండానే నా కార్డుల సంతానంలో చేరాయి.

ఇక వృత్తి రీత్యా అవసరమైన ప్రెస్ అక్రిడేషన్ కార్డు. 1975 నుంచి ఇప్పటివరకు అవిచ్చిన్నంగా కొనసాగుతోంది, గత యాభయ్ ఏళ్ళుగా. దానికి అనుబంధ కార్డులు మరి కొన్ని వుంటాయి. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఉచిత సిటీ బస్సు కార్డు, రాష్ట్రంలో ఎక్కడికైనా మూడో వంతు టిక్కెట్టు ధరతో బస్సుల్లో తిరిగే మరో కార్డు.  స్కూటరు యోగం పట్టిన తర్వాత సిటీ బస్సు పాసు వదిలేసాను. కారు కొన్న తర్వాత రెండోదానికీ నీళ్ళు వదిలాను. 

వృత్తికి అవసరమైన మరో కార్డు వుంది. ఆఫీసు వాళ్ళు మూడు సింహాల బొమ్మతో ఇచ్చే విజిటింగ్ కార్డు. ఈ శ్రీనివాసరావు పలానా సుమా అని తెలియచెప్పే కార్డు. అయితే దానితో నాకు ఎప్పుడూ అవసరం పడలేదు. నా పేరే నా విజిటింగ్ కార్డు అనుకునేవాడిని. ఎవరినైనా కలవాల్సినప్పుడు చీటీ మీద నా పేరు రాసి పంపేవాడిని. అయితే ఈ పప్పులు ఈ కాలంలో ఉడకవు అనుకోండి.

పొతే, సగం ధరతో దేశంలో ఏ తరగతిలో అయినా ప్రయాణించే రైల్వే పాసు. అదేదో గుర్తుకోసం అన్నట్టుగా వుండేది కానీ వాడిన సందర్భాలు బహు తక్కువ.

నేను సుదీర్ఘ కాలం పనిచేసిన హైదరాబాదు రేడియో, దూరదర్శన్ లలో కూడా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ నేను తీసుకోలేదు. ఇక ప్రెసిడెంట్, ప్రధాని వంటి వీవీఐపీల పర్యటనల సందర్భంలో ప్రత్యేకంగా జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డులు. సరే. ఇవి తాత్కాలికం అనుకోండి.

రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ కార్డు, సీ.జీ.హెచ్.ఎస్. కార్డు అదనంగా వచ్చి పర్సులో చేరాయి.

మరోటి వుంది. అది ప్రెస్ క్లబ్ కార్డు. ఢిల్లీ, బెంగుళూరు క్లబ్బుల్లో పనికొస్తుంది కాబట్టి అదొకటి వుంటుంది ఎప్పుడూ.

జేబులు కొట్టేవాడి కన్ను నా వాలెట్ మీద పడితే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అన్ని కార్డులు కడుపులో పెట్టుకుని నా పర్సు బలిసిన పిల్ల పందిలా వుండేది. కానీ అదేమిటో విచిత్రం చాలా ప్రాంతాలు తిరిగాను, కొన్ని దేశాలు కూడా తిరిగాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా జేబు కొట్టే జేబుదొంగ నాకు తారసపడలేదు. బహుశా ఈయన పర్సులో కార్డులు తప్ప పనికొచ్చే సరుకు ఏమీ ఉండదని వాళ్లకు తెలుసేమో!

ఇప్పుడు కొన్ని కాలనీల్లో నివసించేవారికి లోపలకు వచ్చేందుకు కొత్తరకం ఎలెక్ట్రానిక్ కార్డులు ఇస్తున్నారట. వుండేది మామూలు కాలనీ కాబట్టి ఇంతవరకు ఆ కార్డు అవసరం పడలేదు.

ఒక్క బతుక్కి, ఒక్క మనిషికి ఇన్ని కార్డులు అవసరమా!

ఈ కార్డుల పురాణం దేనికంటే, మాస్కోలో గుర్తింపు కార్డు లేకుండా రోజు గడవదు అని చెప్పడానికి.

నేను మాస్కో రేడియోలో చేరిన మొదటి రోజునే ఆఫీసువాళ్ళు మా కుటుంబంలో ఉన్న నలుగురికీ ప్రొపుస్కాలు (ఫోటో గుర్తింపు కార్డులు) తయారు చేసి ఇచ్చారు. వాటిని హమేషా దగ్గర ఉంచుకోవాలని, లేని పక్షంలో ఇబ్బందులు పడతారనే హెచ్చరిక కూడా చేసారు. నేను నా పద్దతిలో ఆ హెచ్చరికను చాలా మామూలుగా తీసుకున్నాను.

ఇప్పుడు పరిస్తితులు ఎలావున్నాయో తెలియదు కానీ, నలభయ్ ఏళ్ళ క్రితం మేమున్న రోజుల్లో,  సోవియట్ యూనియన్ లో నిబంధనల అమలు చాలా ఖచ్చితంగా వుండేది. సంక్రాంతికి వచ్చే  గంగిరెద్దుల మీద కప్పే బట్టల మాదిరిగా చలి దుస్తులు ఒకదాని మీదొకటి వేసుకుని వెళ్ళే హడావిడిలో,  ఆ ప్రోపుస్కాను కోటులో ఏ జేబులో పెట్టుకున్నానో మరచిపోయేవాడిని. ఒక రోజు ఆఫీసు ప్రధాన ద్వారం దగ్గరే నన్ను నిలిపేశారు, ప్రొపుస్కా లేదని. అక్కడ వుండే గార్డులు నన్ను రోజూ చూస్తుండేవాళ్ళే. గుర్తు పట్టేంత పరిచయం వుండేది. అయినా లోపలకు పంపడానికి వాళ్ళు సుతరామూ ఒప్పుకోలేదు. వార్తలకు టైం అవుతోంది, నన్ను వెళ్ళనివ్వకపోతే ఇబ్బంది అవుతుందని సైగలతో చెప్పి చూసినా లాభం లేకపోవడంతో రిసెప్షన్ నుంచే కొంచెం కొంచెం తెలుగు తెలిసిన మా రష్యన్ సహోద్యోగి గీర్మన్ కు ఫోన్ చేసి విషయం చెప్పాను. అతడు వెంటనే కిందికి వచ్చాడు. అతడి చేతిలో నేను తర్జూమా చేయాల్సిన వార్తలు, కొన్ని తెల్ల కాగితాలు బాల్ పాయింటు పెన్ను వున్నాయి. రిసెప్షన్ గదిలో ఓ కుర్చీలో కూర్చోబెట్టి పని చేసుకోమని చెప్పాడు. ఇంటికి ఫోన్ చేసి ప్రొపుస్కా తెప్పించుకోమని సలహా ఇచ్చాడు. వార్తలకు సమయం ఆట్టే లేదని అంటే పర్వాలేదు, అవసరం అయితే నిన్నటి వార్తల రికార్డు వుంది, అంటాడు కాని నన్ను లోపలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి చెప్పి చూడమంటే, గీర్మన్ అటువైపు చూడమని సైగ చేశాడు. ద్వారం దగ్గర ఓ పొడవాటి పెద్దమనిషి నిలబడి తన ప్రోపుస్కా చూపించి లోపలకు వెడుతున్నాడు. అతడ్ని చూపుతూ గీర్మన్, ‘ఆయన ఎవరో తెలుసా! మన రేడియో మంత్రి. ఎవరైనా సరే రూలు రూలే’ అన్నాడు. నాకు పరిస్తితి అర్ధం అయింది. ఈ నిబంధనల పాటింపు చూస్తుంటే మెదడు మోకాల్లో వుంది అనే సామెత గుర్తుకు వస్తుంది. లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు గేటు దగ్గర వారికి గుర్తింపు కార్డు చూపాలి. రెండు మెట్లు దిగి ఏదైనా మరచిపోయి మళ్ళీ లోపలకు  వెళ్ళాలన్నా చూపించాలి. ఇప్పుడే కదా బయటకు వచ్చింది అంటే కుదరదు.

ఇక చేసేది లేక ఇంటికి ఫోన్ చేసి చెప్పాను. పిల్లలు స్కూలుకు వెళ్లిపోయారు. మా ఆవిడే టాక్సీ వేసుకుని ఆఫీసు కు వచ్చి ప్రోపుస్కా నా చేతిలో పెట్టి అదే టాక్సీలో ఇంటికి పోయింది. ఇదంతా అయ్యేసరికి వార్తల సమయం ముంచుకు వచ్చింది. పైకి వెళ్లి స్టూడియోలో వార్తలు ఆ పూటకు మమ అనిపించేసరికి తలప్రాణం తోకకు వచ్చింది.

 

తోకటపా: ఒకరోజు  ఇంట్లో కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నాను. కార్మికుల కార్యక్రమం మాదిరిగా ఆడామగా ఇద్దరు కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే ప్రోగ్రాములను మాస్కో రేడియో ప్రసారం చేసేది. ఆడ పాత్ర సంభాషణలు నాతో కలిసి లిదా స్పిర్నోవా చదివేది. దాని అనువాదం పని అన్నమాట నా హోం వర్క్.

పిల్లలు స్కూలుకు పోయారు. మా ఆవిడ కన్నడ రామకృష్ణ గారి భార్య సరోజ గారితో కలిసి ఏవో కొనడానికి బయటకు పోయింది. నేను ఆఫీసుకు వెళ్ళడానికి ఇంకా సమయం వుంది. ఆ సమయంలో డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే,  ద్వారం ఎత్తు వున్న భారీ  మిలీషియా (పోలీసు), పక్కన మా రెండో పిల్లవాడు సంతోష్. అతడు ఏదో చెబుతున్నాడు. అర్ధం కావడం లేదు. ఈ లోగా మా ఆవిడా, సరోజ గారు తిరిగి వచ్చారు. చాలా రోజులుగా వుంటున్నారు కనుక ఆవిడకు కొంచెం రష్యన్ బోధపడుతుంది. పోలీసు చెప్పేదాన్ని విని మాకు ఇంగ్లీష్ లో తిరిగి చెప్పింది.

మా వాడు మెట్రో ఒకటి ఎక్కబోయి మరోటి ఎక్కాడట. దిగిన తర్వాత ఎటు పోవాలో తెలియక దిక్కులు చూస్తూ ఈ పోలీసు కంట పడ్డాడుట, జేబులో ప్రొపుస్కా ని బట్టి మా చిరునామా తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చి ఒప్పచెప్పాడు. ఇదీ కధ.

విడ్డూరంగా అనిపించే ఇలాంటి సంఘటనలు అక్కడ జరుగుతుంటాయి. అందుకే ప్రతి పనికి, అవసరానికి  ప్రభుత్వ ఆఫీసులు, పోలీసు స్టేషన్ల గుమ్మం తొక్కాల్సిన అవసరం వుండదు.

ఎక్కడయితే, ప్రభుత్వ ప్రమేయం లేకుండా సామాన్యుడు తన నిత్య జీవితాన్ని గడపగలుగుతాడో అది ఉత్తమ ప్రభుత్వం, ఉత్తమ పరిపాలన  అనే భావన నాలో ప్రబలడానికి ఇదే కారణం.      

కింది ఫోటో :

రేడియో మాస్కో ప్రొపుస్కా (గుర్తింపు కార్డు)  కోసం తీయించుకున్న ఫోటో:



 

(ఇంకా వుంది)

           

9, మార్చి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (107) – భండారు శ్రీనివాసరావు

 

నువ్వు ఇక్కడ మాట్లాడకుండా బతకలేవు, అక్కడ మాట్లాడితే బతకలేవు ఎలా?

హైదరాబాదు నుంచి ఇనుపతెర (ఐరన్ కర్టెన్) దేశంగా పేరుపడిన సోవియట్ రష్యాకు వెళ్లబోయేముందు ఒక జర్నలిస్టు మిత్రుడు హాస్యస్పోరకంగా చేసిన హెచ్చరిక ఇది.

రష్యన్ గూఢచారి వ్యవస్థ కేజీబీ గురించి, ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో పసికట్టగల ఆ సంస్థ సమర్ధత గురించి ఊహాగానాలతో కూడిన అనేకానేక కధనాలు అప్పటికే చాలా ప్రచారంలో ఉండేవి.

నేను మాస్కో వెళ్ళిన కొత్తల్లో పరిస్థితులు గమనిస్తే ఆ కధనాల్లో వాస్తవం ఉందేమో అనిపించేది.

మేము నివాసం వుంటున్న ఊలిచ్చ వావిలోవా నుంచి రేడియో మాస్కో ఆఫీసుకు వెళ్ళడానికి దగ్గరలో ప్రాఫ్తు యూజినయా అనే నోరుతిరగని మెట్రో స్టేషన్ వుండేది. అక్కడ మెట్రో ఎక్కితే సరిగ్గా పద్నాలుగు నిమిషాల్లో రేడియో స్టేషన్ చేరవచ్చు. మా అపార్ట్ మెంట్ వెనుక ఒక విశాలమైన మంచు మైదానం వుండేది. ఆ మంచు దారి మెట్రో స్టేషన్ కు అడ్డదారి. అలాకాకుండా మెయిన్ రోడ్డు దారిలో వెళ్ళాలి అంటే చాలా సమయం పట్టేది. అంచేత మా సహోద్యోగులు ఆ మంచు బాటనే వెళ్ళేవాళ్ళు. వాళ్ళ వెంట అడుగులో అడుగు వేసుకుంటూ నేను.

మాస్కో వెళ్ళిన మొదట్లోనే నన్ను, మాపిల్లలను హెచ్చరించారు, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వేగంగా నడవ వద్దని. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా కాలుజారడం తథ్యం. అందుకే సరదాగా అనేవాళ్ళు, మగవాళ్లు కూడా కాలు జారే ప్రమాదం మాస్కోలో వుందని. ఆఫీసుకు అని బయలుదేరి కాలో చేయో విరగగొట్టుకుని, ఆసుపత్రి పాలయిన వాళ్ళ కధలు చాలా చెప్పేవాళ్ళు. కాలు విరుగుతుందని భయం లేదు కానీ ఆ మంచులో నడక చాలా కష్టం. కాలు తీసి కాలు పెట్టినప్పుడు మోకాలు పై వరకు మంచులో దిగబడేది. అలా మంచులో కూరుకు పోయిన కాలిని పైకి లాక్కుని నడవడం నాకు ఇబ్బందిగా వుండేది. మరో సమస్య తెల్లగా మెరిసే ఆ మంచు. నల్ల కళ్ళ జోళ్లు లేకుండా బయటకు వెడితే  సూర్యరశ్మిలో ధగధగలాడే ఆ మంచు మైదానం కళ్ళు మిరుమిట్లు కొలిపేది. మరో విచిత్రం ఏమిటంటే అక్కడ ఎండ కూడా  చల్లగా వుంటుంది. మంచు కూడా ఆ ఎండకు కరగదు.  

ఈ బాధలు పడలేక నేను నెమ్మదిగా మరో రూటు ఎంచుకున్నాను. మా ఇంటి ముందే బస్ స్టాపు. ఒకటే బస్సు అరవై ఆరో నెంబరు. అది ఎక్కితే తరువాత రెండో స్టాపు నేను వెళ్ళాల్సిన మెట్రో స్టేషన్. ఆ రూట్లో ఒకరో ఇద్దరో   చాలా అరుదుగా కనిపించేవారు. దాదాపు నేను ఒక్కడినే ఆ బస్ స్టాపులో కనిపించే ప్రయాణీకుడిని. ఆ ఒక్క బస్సు తన చిత్తం వచ్చినప్పుడు వచ్చేది. అయినా నేను ఓపికగా నిలబడేవాడిని. మెట్రో స్టేషన్ దగ్గర దిగి మెట్రోలో కొంచెం ఆలస్యంగా రేడియో స్టేషన్ కు వెళ్ళేవాడిని.  అసలు ఇంగ్లీష్ తెలియని దేశంలో మెట్రో అనే పేరు ఎందుకు పెట్టారా అనే సందేహం నన్ను ఇప్పటికీ తొలుస్తూనే వుంది. మెట్రో స్టేషన్ వున్న ప్రాంతంలో మనకు ఎక్కడా స్టేషన్ కనపడదు. అక్కడ ‘ఎం’ అని ఇంగ్లీష్ అక్షరంతో ఒక బోర్డు వుంటుంది. అక్కడ అయిదారు ఎస్కలేటర్లు వుంటాయి. పాసు వున్న వారికి నేరుగా వెళ్ళే వీలు వుంటుంది. లేకపోతే అయిదు కోపెక్కులు (అయిదు పైసలు) మిషన్లో వేస్తే ఎస్కలేటర్ ద్వారం తెరుచుకుంటుంది. దాని మీదుగా కిందికి వెడితే అటూ ఇటూ మెట్రో  ప్లాటుఫారాలు కనిపిస్తాయి.

మూడు రూబుళ్ళు పెడితే నెల రోజులు వాడుకునే  ట్రావెల్ పాస్ దొరికేది. దీనికోసం ఎక్కడికో పోయి, ధరకాస్తులు పెట్టి, రుసుములు చెల్లించి కొనుక్కోనవసరం లేదు. ప్రతి చిన్న దుకాణంలో కూడా ఇవి దొరుకుతాయి. ఈ పాసు వుంటే, నెల మొత్తం ఎన్నిసార్లు అయినా, అది మెట్రో కావచ్చు, బస్సు కావచ్చు, ట్రాము కావచ్చు, కరెంటుతో నడిచే ట్రాలీ బస్సు కావచ్చు ఎందులో అయినా ఎంతదూరం అయినా, ఎంత సేపైనా  ప్రయాణం చేయవచ్చు. మరో సులువు ఏమిటంటే ఈ పాసును మనమే కాదు, మనకు అవసరం లేనప్పుడు మరెవరైనా వాడుకోవచ్చు.

రైలు వెళ్లి పోతోందే అని కంగారు అవసరం లేదు. నిమిషాల్లోనే మరో రైలు దాని వెంటనే వస్తుంది. భూగర్భం నుంచి బయటకి రాకుండానే వివిధ ప్రాంతాలకు వెళ్ళే మెట్రో  రైళ్లు మారే ఏర్పాట్లు చేశారు.  ఆ స్థాయిలో అనేక ప్లాటుఫారాలతో  జంక్షన్లు నిర్మించడం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. పైన రోడ్ల మీద కార్లు, బస్సులు, ట్రాములు, ట్రాలీ బస్సులు తిరుగుతుంటే, వాటి కిందనే మెట్రో రైళ్లు ప్రయాణిస్తుంటాయి. మరో అద్భుతం ఏమిటంటే మనం భూగర్భంలో మెట్రోలో వెడుతుంటే మన పైనే మరో మార్గంలో మరో మెట్రో వెడుతూ వుంటుంది. ఆ విషయం మనకు తెలియదు.   (ఇప్పుడు మాస్కో నగరంలో మెట్రో రూట్ల సంఖ్య  రెట్టింపుకంటే  పైమాటే అంటున్నారు)  

వెళ్ళిన కొత్తల్లో మరో విషయం గమనించాను. రైళ్ళలో, కానీ మెట్రోల్లో కానీ సాధారణంగా ఎవరూ ఎవరితో మాట్లాడుకోరు. ఎక్కిన వెంటనే చేతి సంచీలో నుంచి ఒక పుస్తకమో , లేదా దినపత్రికో తీసి చదువుకుంటూ కూర్చుని, తమ స్టాపు రాగానే నిశ్శబ్దంగా దిగిపోయేవారు. దీనికి కారణం నిరంతర నిఘా అనేవారు.  

కేజీబీ అంటే ఎంత భయం అంటే మొగుడి మీద, భార్య, భార్య మీద మొగుడు నిఘా వేస్తారు అనే స్థాయిలో వుండడం,  ఎవరు కేజీబీ ఏజెంటో  అన్నది వాళ్ళకే తెలియకపోవడం ఇత్యాది కారణాలు ఈ నిశ్శబ్ద వాతావరణానికి దారి తీసింది అని నోళ్ళు నొక్కుకునే వారు. నేను వెళ్ళేటప్పటికే మిహాయిల్ గోర్భచేవ్ ప్రకటించిన గ్లాస్ నోస్త్ (దాపరికం లేకపోవడంగా అర్ధం చెప్పుకోవచ్చు) పెరిస్త్రోయికా విస్తృత ప్రచారంలో వున్నాయి. మెల్లమెల్లగా భయం సడలుతున్న రోజులు. అయినా మనసు మూలల్లో పైకి  చెప్పలేని అనుమానాలు. గతంలో ఎప్పుడో, బహుశా  స్టాలిన్ హయాములో కావచ్చు, ఇలాగే,  నా విధానాలు నచ్చని వాళ్ళు నిర్భయంగా  చేతులు పైకి ఎత్తండి, ఏమీ కాదు  అంటే ఆ సమావేశంలో వున్న అతి కొద్దిమంది భయం భయంగానే చేతులు ఎత్తారట. మరునాడు వారి జాడ కనిపించకుండా పోయిందట. సైబీరియాలోని కాన్సంట్రేషన్ క్యాంపులకు వారిని తరలించి ఉంటారని సందేహం. ఇలాంటి కధనాలకు లెక్కే లేదు.  

అయితే నేను వెళ్ళే నాటికి  పరిస్థితితుల్లో మార్పులు మొదలయ్యాయి. ముందు మందకొడిగా మొదలైనా కాలం గడిచే కొద్దీ మార్పులు క్రమంగా వేగం అందుకున్నాయి. ఆఫీసులో నా కొలీగ్ విక్టర్,  ముందు నసుగుతూ, తర్వాత గొణుగుతూ ఏవేవో చెప్పేవాడు. అర్ధం అయ్యేది కాదు. నాలుగేళ్లు గడిచేసరికి బహిరంగంగానే మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఒక రోజు ఏదో రష్యన్ పత్రికలో పడిన వార్తను గురించి నాకు చెప్పడంతో ప్రజల్లో భయసందేహాలు పూర్తిగా తొలగిపోయాయి అని నాకు అనిపించింది. ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఆ స్థాయిలో సాధారణ  పౌరుల నుంచి విమర్శలు రావడం అరుదు. (సోషల్ మీడియా లేని రోజులు అవి)

ఇంతకీ విక్టర్ చెప్పిన వార్త ఏమిటంటే, నిజానికి అది వార్త కాదు, లెటర్స్ టు ది ఎడిటర్ కాలంలో ఒక పాఠకుడు (పౌరుడు) సోవియట్ ప్రధానికి రాసిన బహిరంగలేఖ.

“అయ్యా గౌరవనీయులైన ప్రధాని గారూ! మొన్న ఒక టీవీ కార్యక్రమంలో మీరు కాలికి మేజోళ్ళతో కనిపించారు. అవి ఏ దుకాణంలో దొరుకుతున్నాయో చెప్పి పుణ్యం కట్టుకోగలరు”

ఇదీ ఆ ఉత్తరం సారాంశం. చలి దేశంలో మేజోళ్ళు వంటి నిత్యావసరాల కొరత గురించి ప్రభుత్వానికి తెలియచెప్పడానికి ఆ పౌరుడు  ప్రయోగించిన వ్యంగాస్త్రం అన్నమాట.

ఏ భయం అయినా కొద్ది రోజులే! మనుషులను అణచి వుంచడం అంత సులభం కాదు.         

 

ఉపశ్రుతి:

అన్ని దేశాల్లో ఇతర దేశాల దౌత్య సిబ్బందికి ప్రత్యేక హోదాలు, ప్రతిపత్తి వుంటాయి. అలాగే వారి మీద నిఘా కూడా అదేవిధంగా వుంటుంది. ఒకప్పటి కమ్యూనిష్ట్ రష్యాలో ఈ నిఘా మరింత ఎక్కువ. ఇండియన్ ఎంబసీలో పనిచేసే సిబ్బంది ఇంటినుంచి బయలుదేరి ఆఫీసుకు చేరేసరికి ఉజ్జాయింపుగా యెంత సమయం పడుతుందనేది రష్యన్ గూఢచారి సంస్థ కేజీబీ వాళ్ళు ముందుగానే లెక్క వేసుకునేవాళ్ళు. ఏ రోజున అన్నా, ఎవరయినా దౌత్య ఉద్యోగి ఆఫీసుకు చేరుకోవడం ఆలస్యం అయిందని తెలిస్తే చాలు, అతను ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాడు అనే దానిపై ఆరాలు మొదలయ్యేవి. అలాగే దౌత్య సిబ్బంది కుటుంబ సభ్యుల కదలికలపై కూడా కన్నేసి ఉంచేవారు.

ఇంటికి రాగానే తాళం వేసివుంటే, మా ఆవిడ ఎక్కడికి పోయిందో తెలుసుకోవడానికి అపార్ట్ మెంటు ముందు వున్న సెంట్రీని వాకబు చేస్తే సరిపోయేది, ఆవిడ ఏ సమయానికి ఏ షాపులో వుందో, ఆ సెంట్రీకి యిట్టే తెలిసిపోయేది’ అని ఇండియన్ ఎంబసీలో పనిచేసిన ఒక అధికారి ముచ్చట్ల మధ్యలో చెప్పేవారు. ఇందులో కొంత అతిశయోక్తి వుండవచ్చేమో కానీ వాస్తవ పరిస్తితికి అద్దం పడుతుంది.

దౌత్య సిబ్బంది ఇళ్ళల్లో పనిచేయడానికి రష్యన్ యువతులను ‘ఉపాదిక’ అనే రష్యన్ సంస్థ ఏర్పాటు చేసేది. వినడానికి సంస్కృత పదం మాదిరిగా వున్నా నిజానికి అది కాదు. ఆ రష్యన్ అమ్మాయిలతో యెంత జాగ్రత్తగా వుంటే అంత మంచిది. మన ఇళ్ళల్లో వాళ్ళు, వాళ్ళ పనులు చేసుకుంటూనే ఒక చెవి ఇటు, ఒక చెవి అటు పడేసేవాళ్ళు. రహస్యాలు చేరవేయడంలో సిద్ధహస్తులు అని చెప్పుకునేవాళ్ళు.

 కింది ఫోటో:

మెట్రో సింబల్  



 

(ఇంకావుంది)