8, మార్చి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (106) – భండారు శ్రీనివాసరావు

 

క్రమంగా మాస్కోవంటి  కొత్త ప్రదేశంలో, కొత్త జీవితానికికొత్త వాతావరణానికీ అలవాటు పడడం ప్రారంభించాము. మా పిల్లలుసందీప్సంతోష్  ఇద్దర్నీ ఇండియన్ ఎంబసీకి అనుబంధంగా వున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్,  కేంద్రీయ విద్యాలయ్ లో చేర్పించాము. మా అదృష్టం కొద్దీ మేము వెళ్ళిన ఏడాదే ఈ ఇంగ్లీష్ మీడియం  సెంట్రల్ స్కూలు మాస్కోలో ప్రారంభించారు.

రష్యన్ స్కూళ్ళలో విద్య పూర్తిగా ఉచితం. ప్రతి ఏరియాలో ఇంటి నుంచి నడిచిపోయే దూరంలో వుంటాయి ఆ స్కూళ్ళు. ఎక్కడైనా కొంచెం దూరంగా వుంటే, ఉచితంగా తీసుకువెళ్ళే స్కూలు  బస్సులు వుంటాయి. మధ్యాన్న భోజనం, స్కూలు యూనిఫారాలు,  పుస్తకాలతో సహా అన్నీ ఉచితం. పోతేఇండియన్ స్కూల్లో ఇందుకు విరుద్ధం. ఫీజులు వుంటాయి.   రష్యన్ స్కూళ్ళలో చేర్పిస్తే ఇండియాకు తిరిగి వెళ్ళిన తరవాత చదువులకు ఇబ్బంది అవుతుందని ఇండియన్ స్కూల్ నే ఎంచుకోవాల్సివచ్చింది. అలాగే ఇంగ్లీష్  మాట్లాడే మరి కొన్ని దేశాల రాయబార కార్యాలయాల  అధికారుల పిల్లలకు కూడా ఇండియన్ స్కూలు ఉపయోగపడింది.  

 అక్కడా ఎడ్మిషన్లు  అంత సులభంగా రాలేదు. మేము రష్యన్ ప్రభుత్వం పనుపున వచ్చాము కాబట్టి హార్డ్ కరెన్సీ లో అంటే డాలర్లలో ఫీజు కట్టాలని ప్రిన్సిపాల్  గంగల్  కండిషన్ పెట్టారు. మాకిచ్చే జీతం మీలాగా డాలర్లలో కాదు, రూబుళ్ళలో ఇస్తారని యెంత మొత్తుకున్నా ఆ బెంగాలీ బాబు గారు వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక,  ఆ రోజుల్లో ఢిల్లీలో  కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ కు డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న సీనియర్ ఐ ఎ ఎస్ అధికారి కె యస్ శర్మ గారికి (తదనంతర కాలంలో శర్మగారు ప్రసార భారతికి సీ.ఈ.ఓ.గా పనిచేసారు.) ఫోన్ చేసి విషయం వివరించాను.

 ఆయన కూల్ గా విని,  రేపు ఉదయం పోయి ప్రిన్సిపాల్ ని కలవమని తాపీగా చెప్పారు. మర్నాడు నేను వెళ్లేసరికి స్కూలంతా చాలా హడావిడిగా కానవచ్చింది. మాస్కో రేడియో శ్రీనివాసరావు వచ్చాడా అని ప్రిన్సిపాల్ అప్పటికే వాకబు చేయడం మొదలు పెట్టారు. నిబంధనలు ఏ గాలికి పోయాయో తెలియదు కానిమా ఇద్దరు పిల్లలకు మేము అనుకున్న పద్దతిలో ఎడ్మిషన్ లభించింది. ఆ స్కూలు చదువు వాళ్ళిద్దరి జీవితాల్లో పెనుమార్పు తీసుకురాగలదని కలలో కూడా ఊహించలేదు.

 ఎదుగుతున్న దశలో, ఓ విదేశంలో,  వాళ్లకు లభించిన ఎక్స్పోజర్   భవిష్యత్తులో యెంతో ఉపకరించింది. పెద్ద డిగ్రీలు లేకపోయినా,  రకరకాల దేశాలకు చెందిన పిల్లలతో కలిసిమెలిసి తిరుగుతూ పెరగడం వల్ల అలవడిన  కమ్యూనికేషన్ స్కిల్స్, పోటీ ప్రపంచంలో ఎదగడానికి దోహదపడ్డాయి.  ముందు ఇబ్బంది పెట్టిన ప్రిన్సిపాల్ గంగల్  గారు కూడా పిల్లల చదువు విషయంలో తీసుకున్న శ్రద్ధ మరచి పోలేనిది. అలాగే శర్మ గారు. అడగకనే వరాలిచ్చే దేవుడిగా ప్రసార భారతిలో సిబ్బంది మన్ననలందుకున్నారు. 

రేడియో మాస్కో చిన్నపాటి ఐక్యరాజ్య సమితి అనుకోవాలి. ఎనభయ్ దేశాలకు చెందిన వారు అక్కడ పనిచేసేవారు. అందులో మళ్ళీ భాషల తేడా. మన దేశం విషయం తీసుకుంటే పద్నాలుగు భారతీయ భాషల్లో మాస్కో రేడియో ప్రసారాలు జరిగేవి. తెలుగు, గుజరాతీ, కన్నడ భాషల కోసం ఆకాశవాణి న్యూస్ రీడర్లను తీసుకున్నారు. మిగిలిన భాషల కోసం, అక్కడే చదువుకుని ఆయా భాషల్లో ప్రావీణ్యం వున్నవారిని ఎంపిక చేసుకున్నారు.

ఊలిచ్చ వావిలోవాలో వున్న రేడియో మాస్కో భవనంలో వివిధ దేశాలకు చెందిన వారికి వసతి కల్పించారు. మాతో పాటు, దాసన్ (మళయాళం), రామకృష్ణ (కన్నడ), వ్యాస్ (గుజరాతీ), జస్వంత్ సింగ్, వాలియా సింగ్ (పంజాబీ), అరుణ్  మహంతి, (ఒడియా), ఇలా అందరం కుటుంబాలతో ఒకే చోట వుండేవాళ్ళం. ఒకే దేశం నుంచి వెళ్లాం అన్నమాటే కాని, ఒకరి భాష మరొకరికి తెలియదు. ఇంగ్లీషే మళ్ళీ దండలో దారం. ఇదే భవనంలో మాస్కో రేడియోలో పనిచేసే  ఇండొనీషియా, ఫిలిప్పీన్స్, కొరియా, చైనా, క్యూబా తదితర దేశాలకు చెందిన విదేశీయులు కూడా కాపురాలు వుండేవాళ్ళు.  పెద్దల మాతామంతీకి భాష అవాంతరం అయినా, పిల్లల ఆటలకు ఆ అడ్డంకి వుండదు కదా! అందుకే చాలా చిన్నతనం నుంచే అనేక దేశాల వారితో కలిసి పెరిగే  అరుదైన అవకాశం మా పిల్లలకు లభించింది.

మేమున్న రోజుల్లో, మాస్కోలో తెలుగు కుటుంబాలు అనేకం వుండేవి. ప్రగతి ప్రచురణల్లో నిడమర్తి రాజేశ్వరరావు, రాదుగ పబ్లికేషన్స్ లో ఆర్వీయార్, ఇండియన్ ఎంబసీలో కేవీ రమణ, పరకాల సుధీర్, దాసరి రాము, శ్రీధర్ కుమార్, గీతేష్ కుమార్, రమేశ్ చంద్ర, మోహన్ రెడ్డి (ఇండియా తిరిగివచ్చిన తరువాత ఇస్కాన్ లో చేరి మోహన్ దాస్ గా పేరు మార్చుకున్నారు)  రామారావు, స్టేట్ బ్యాంక్ తరపున రాధాకృష్ణ, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచర్ కృష్ణన్ ఈ విధంగా ఇన్ని తెలుగు కుటుంబాలు ఒకేసారి మాస్కోలో వున్న సందర్భం మరోటి లేదు. వీళ్ళకు తోడు తెలుగు విద్యార్ధులు అనేకమంది. డాక్టర్ రావు మల్లు ( మల్లు రవి, మల్లు భట్టి సోదరుడు),  డాక్టర్ సమంత, డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ శశికళ, అర్చన, నన్నపనేని సుధ (నన్నపనేని రాజకుమారి కుమార్తె) ఇలా ఎందరెందరో మా ఇంటి పిల్లలుగా మసిలి మధురానుభూతులను మాకు మిగిల్చారు. శని, ఆది వారాలు వస్తే, చాలు వీరందరితో  మా ఇల్లు సందడే సందడి.  

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను రాసే సంగతులు చదివేవారు దాదాపు నలభయ్ ఏళ్ళ నాటి పరిస్థితులను దృష్టిలో వుంచుకోవాలి. నేను దేశం విడిచి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఉన్నంత  మెరుగ్గా లేవు.  ఈ కోణంలో చూడకపోతే,  పరాయి దేశాన్ని అతిగా పొగిడినట్టు అనిపించడం సహజం.

కొంతకాలం గడిచిన తర్వాత కొన్ని విషయాలు వింటుంటే, విచిత్రంగా అనిపిస్తాయి. కొన్ని ‘ఔనా!’ అనిపిస్తే, మరికొన్ని ‘ఔరా!’ అనిపిస్తాయి. గతానికి వున్న గొప్పతనం అదే!

ఆరోజుల్లో నేను చూసింది మరో ప్రపంచం. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా.

ఆ రోజుల్లో ఇలా వుండేది, అలా వుండేది అని రాస్తే నమ్మలేనంతగా ఈనాడు రష్యన్ల జీవన విధానాలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా మారిపోయాయి.

రతనాలను రాశులుగా పోసి వీధి అంగళ్ళలో విక్రయించిన స్వర్ణ యుగాలు చరిత్ర పుటల్లో ఆనవాళ్ళుగా మిగిలిపోయినట్టే, ఆ నాటి నా అనుభవాలు కూడా.

రేడియో ఉద్యోగంలో వృత్తి రీత్యా అనేక రాజకీయ పార్టీల వాళ్ళతో అంటకాగి తిరిగివుండొచ్చు కానీ ఏ రకమైన రాజకీయ వాసనలను నేను ఒంటబట్టించుకోలేదు. ఒక సామాన్యుడిగా అప్పటి రష్యాలో కాలుమోపాను. అక్కడ నేను గడిపిన జీవనం నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం. నేను, నా భార్యాపిల్లలు అత్యంత సుఖ ప్రదమైన, గౌరవనీయమైన, తృప్తికరమైన రోజులు గడిపింది ఆ రోజుల్లోనే. వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా, గోరంతను కొండంత చేసి చెబుతున్నానేమో అనిపించక తప్పదు. అందుకే ఈ అనుభవాలను అక్షరబద్ధం చేయడానికి పాతికేళ్ళకు పైగా తటపటాయించాల్సి వచ్చింది.

అంతేకాదు, కాలం గడుస్తున్న కొద్దీ, గుర్తుంచుకోవాల్సిన విషయాలు గుర్తుకు రానంతగా మరపున పడడం సహజం. తేదీలు, పేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది. విషయానికి న్యాయం చేయలేక పోతున్నామేమో అన్న సంశయం వెనక్కి లాగుతుంది.

ఏతావాతా జరిగింది ఏళ్లతరబడి కాలయాపన.       

కింది ఫోటోలు:

రెడ్ స్క్వేర్ వద్ద ఇండియన్ స్కూలు పిల్లల సందడి



మాస్కోలో మా  ఇంట్లో శని ఆదివారాల్లో సందడి



 

 

(ఇంకావుంది)                 

 

 


 

7, మార్చి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (105) – భండారు శ్రీనివాసరావు

 మార్చి ఎనిమిదో తేదీ అంటే రేపు అంతర్జాతీయ మహిళాదినోత్సవం.

ఇళ్ళల్లో తల్లిని, భార్యని, అక్కచెల్లెళ్ళని, కుమార్తెలను గౌరవించి, మన్నించి, లాలించి, ఆదరించి, ప్రేమించడం నేర్చుకుంటే ప్రపంచంలోని ఆడంగులు అందరూ సంతసిస్తారు . గ్రీటింగులు తర్వాత.
‘మహిళా దినోత్సవం ఒక్క రోజన్నా ఆడవారిపై వేధింపుల వార్తలు రాకుండా వుంటే బాగుండు’ అనిపిస్తుంది.
దురాశ అని తెలిసీ ఆశ పడడం అంటే ఇదే!
మేము మాస్కోలో వున్నప్పుడు అక్కడి ప్రజలు ఆనందోత్సాహాలతో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం చూశాము. పండగ వాతావరణం ప్రతి చోటా కనబడేది.
ఆ రోజున మగవాళ్లు అందరూ, ఆడవారికి చిన్నా పెద్దా కానుకలిచ్చి సంతోషపెట్టడం ఆనవాయితీ. అయితే పువ్వులు కానుకగా ఇస్తే వాళ్లు అమితంగా సంతోషించేవాళ్లు. అదేమిటో విచిత్రం అనిపించేది. పూలు పెట్టుకునే తలకట్లు కావు అక్కడి ఆడవారివి. అయినా గులాబీ పువ్వు కాడ చేతికి ఇస్తే, ముక్కూ మొఖం తెలియని మహిళలు కూడా ఆదరంగా అక్కున చేర్చుకుని (హగ్ చేసుకుని) చిరునవ్వుతో కృతజ్ఞత తెలిపే వారు. చలి (మంచు) దేశం కాబట్టి పూలు తేలిగ్గా దొరకవు. అంచేత ఆ రోజున పూలకాడలకు చాలా గిరాకీ. పైగా ఖరీదు. అన్ని వస్తువులు కారు చౌకగా లభించే ఆ దేశంలో పూల విషయంలో మాత్రం ఖరీదు అనే ఈ మాట వాడక తప్పదు. ఒక్కో పూల కాడ ఒక రూబులు. అంటే దానితో ఒక రోజంతా తిండీ తిప్పలు తెమిలిపోతాయి. దీనిబట్టి పూలు ఎంత ఖరీదైన వ్యవహారమో అర్ధం చేసుకోవచ్చు. అయినా సరే ప్రతి పౌరుడు తమ కుటుంబంలోని ఆడవారికి మాత్రమే కాకుండా కనపడిన ప్రతి అతివకు పూలు కానుకగా ఇస్తారు. ఈ పూల కాడల కానుక ఇచ్చేటప్పుడు ఓ నియమం పాటించాలి. ఆ కాడలు బేసి సంఖ్యలో వుండాలి. అంటే మూడు, అయిదు, ఏడు ఇలాగన్న మాట. సరి సంఖ్యలో ఇస్తే మొహం చిన్నబుచ్చుకుంటారు.
మహిళల ప్రసక్తి వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాలి. ఆనాటి సోవియట్ యూనియన్ లో అతివలదే హవా! అక్కడ ప్రతి రోజూ మహిళా దినోత్సవమే. అన్ని విషయాల్లో పెద్దపీట వారిదే.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ, వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన కారణంగా, దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది.
చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్లు, మనవద్ద మాదిరిగా ప్లాటుఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపును కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిగే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చాజీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా ఇరవై ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడు కూడా పాత మొగుడేనా ' అనే వారి సంఖ్య పెరిగింది.
సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు, పాత పెళ్ళాంతో, ఆమె తాజాగా కట్టుకున్న కొత్త మొగుడితో కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా చెప్పుకునేవారు.
అయితే అక్కడ 'ఏకపతీవ్రతం' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన గారి ఏకైక భార్య గత కొన్ని దశాబ్దాలుగా ఆయన గారితోనే కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ అనుబంధం ఎంతగా పెనవేసుకు పోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చిన తరవాత కూడా ఆ పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు. గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు. అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు. కాకపొతే, మాస్కోలో వున్నన్ని రోజులు మా పిల్లలే మాకు దుబాసీలు. ఎందుకంటే, ఇండియన్ స్కూల్లో రష్యన్ కూడా నేర్పేవారు.
రేడియో మాస్కో వాళ్ళు నాకు కూడా రష్యన్ భాష నేర్పడానికి ఒక లేడీ టీచర్ ను పెట్టారు. వారానికి రెండు రోజులు మా ఇంటికి వచ్చేది రష్యన్ నేర్పడానికి. చివరికి జరిగింది ఏమిటంటే, నాకు ఒక్క రష్యన్ భాష ఒక్క ముక్కా రాకపోగా, ఆవిడ మాత్రం ఎంచక్కా మా దగ్గర తెలుగు నేర్చుకుని వెళ్ళిపోయింది.
ఇక- చిన్న పిల్లల విషయానికి వస్తే,
ఆ దేశం వారి పాలిట స్వర్గం. వారు ఆడింది ఆట, పాడింది పాట. చదువయినా సంధ్యయినా వారి అభిరుచి ప్రకారమే. మా అబ్బాయిని డాక్టర్ ని చేద్డామనుకుంటున్నాము, మా అమ్మాయిని ఇంజినీరు చదివిద్దామనుకుంటున్నాము అంటే అక్కడ కుదరదు. చిన్న తరగతుల స్తాయిలోనే వారి వారి అభిరుచులను కనుగొనే పరీక్ష, (ఇంగ్లీష్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు) పెట్టి ఆ విద్యార్ధి డాక్టర్ అవాలనుకుంటున్నాడో, ట్రాక్టర్ డ్రైవర్ కావాలనుకుంటున్నాడో, తెలుసుకుని ఆ కోర్సులో చేర్పిస్తారు. ఇందులో తలిదండ్రుల ప్రమేయం ఏమాత్రం వుండదు. చదివించే భాద్యత కూడా సర్కారుదే కావడంవల్ల, డాక్టరుకూ, ట్రాక్టర్ డ్రైవర్ కూ జీతభత్యాలలో పెద్ద తేడాలు లేకపోవడంవల్ల, వారికీ అభ్యంతరాలు వుండవు.
మరో విచిత్రమయిన సంగతేమిటంటే జననాలను ప్రోత్సహించడం. యెంత ఎక్కువ సంఖ్యలో పిల్లల్నికంటే ప్రోత్సాహకాలు అంత ఎక్కువగా వుంటాయి. పదిమందికి పైగా పిల్లల్ని కన్న సంతానలక్ష్ములను జాతీయ అవార్డులతో సత్కరిస్తుంటారు. గర్భవతులయిన ఉద్యోగినులకు , గర్భం ధరించిన సమాచారం తెలిసినప్పటినుంచి, సుఖప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడిబుడి నడకలు నడిచే వయస్సు వచ్చేవరకు, ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు మంజూరు చేస్తారు. ఆ పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యేవరకు ప్రభుత్వం వారికి కల్పించే రాయితీలూ, సదుపాయాలూ కనీ వినీ ఎరుగనివి.
గమ్మత్తేమిటంటే దేవుడి మీద నమ్మకం లేని ఆ దేశంలో పిల్లలే దేవుళ్ళు .
పిల్లలే ప్రత్యేకం అనుకుంటే, వారికి అన్నీ ప్రత్యేకమే.
పిల్లలకు ప్రత్యేక ఆసుపత్రులు, ప్రత్యేక స్కూళ్ళు, ప్రత్యేక ఆహారం, ప్రత్యేక దుస్తుల దుకాణాలు, ప్రత్యేక బొమ్మల షాపులు, కొన్న బొమ్మలకు వేసే చిన్ని చిన్ని గౌన్లు, బొమ్మల జుట్టు శుభ్రం చేసేందుకు షాంపూలు, దువ్వెనలు, బ్యాటరీ సెల్ తో పనిచేసే బుల్లిబుల్లి హెయిర్ డ్రైయర్లు, ఇలాంటివన్నీ అమ్మే ప్రత్యేక దుకాణాలు, విశాలమయిన ఆట మైదానాలు, గడ్డకట్టే చలిలో కూడా వెచ్చని నీళ్ళు వుండే ఈత కొలనులు, ఓ పక్కన జోరున మంచు కురుస్తున్నప్పటికీ, పెరాంబ్యులేటర్లలో పసిపిల్లలను కూర్చోబెట్టి ఆరుబయట తిప్పడానికి వీలయిన దుస్తులు, వారికి వేసే కాలిజోళ్ళు, మేజోళ్ళు, పక్కబట్టలు, మంచాలు, పడక గదులు, ఒకటా రెండా అన్నీ ప్రత్యేకం. వీటిల్లో కొన్ని పూర్తిగా ఉచితం. మరికొన్నింటి ధరలు నామమాత్రం.
మాస్కోలో పనిచేసేవారికి అపార్ట్ మెంట్ల కేటాయింపులో పిల్లలదే కీలక పాత్ర. తలిదండ్రులకు ఎన్ని గదుల ఇల్లు కేటాయించాలనేది వారి హోదాను, ఉద్యోగాన్ని బట్టి కాకుండా, వారి పిల్లల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. మాస్కో వెళ్ళినప్పుడు మాకు రెండు పడక గదుల అపార్ట్ మెంటు ఇచ్చినా, తర్వాత మాకు ఇద్దరు పిల్లలు అని తెలుసుకుని వాళ్ళంతట వాళ్ళే అదే అపార్ట్ మెంటులో మూడు పడక గదుల అపార్ట్ మెంట్ ఇచ్చారు.
కింది ఫోటోలు:
మాస్కోలో మా అపార్ట్ మెంట్ బయట మంచులో ఆడుకుంటున్న మా రెండో అబ్బాయి సంతోష్.




(ఇంకావుంది)

6, మార్చి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (104) – భండారు శ్రీనివాసరావు

 అక్టోబర్ - 31,1987.

ఢిల్లీ నుంచి సోవియట్ ఎయిర్ లైనర్ 'ఎరోఫ్లోట్' లో కుటుంబంతో కలసి మాస్కో బయలుదేరాను. విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత ఎయిర్ హోస్టెస్ లు   ప్రయాణీకులు అందరికీ ఓడ్కా సర్వ్ చేయడం ప్రారంభించారు. విమానంలో చాలామంది రష్యన్ లే వున్నారు. చీరె కట్టుకుని పైన హాఫ్ స్వెట్టర్ వేసుకుని వచ్చింది  మా ఆవిడ ఒక్కతే. అయినా ఎవరూ వింతగా చూడడం కానీ ముసిముసి నవ్వులు నవ్వుకోవడం కానీ నాకు కనపడలేదు. విమానంలో వాళ్ళు పెట్టిన భోజనం చూడగానే మాస్కోలో మావంటి శాకాహారులకు ఎదురు కాబోతున్న ప్రధాన సమస్య ఏమిటో అర్ధం అయింది.

కొన్ని మాసాలుగా ఎదురుచూసిన క్షణం దగ్గర పడుతుంటే విమానం విండో నుంచి కిందకు చూసే ప్రయత్నం చేసాము. కళ్ళు చికిలించుకుని చూసినా దట్టంగా అలుముకున్న పొగమంచులో ఏమీ కనబడలేదు. మరికొద్దిసేపటిలోనే మా విమానం మాస్కో పొలిమేరల్లోని 'షెర్మేతోవా' అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విద్యుత్ దీపాల కాంతిలో ధగధగలాడుతూ, పలుదేశాల ప్రయాణీకులతో ఎయిర్ పోర్ట్ కళకళలాడుతోంది. మాస్కోలో వెజిటేరియన్లకు ఏమీ దొరకవు ఉప్పూ , పాలూ తప్ప,  అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము, లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము. హైదరాబాద్ నుంచి సూటుకేసులనిండా పట్టుకొచ్చిన వంట సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు.  కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణాన గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడుకుంటామనీ ఎన్నోవిదాలుగా చెప్పిచూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంతకూడా అర్ధం కాని ఆ అధికారులముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అయింది. పైపెచ్చు ఘాటయిన ఇంగువ వాసన వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి ప్రమాదకరమూ, మాదక పదార్ధమూ కాదని రుజువు చేసుకున్న తరవాతనే అక్కడనుంచి బయట పడగలిగాము.

బయటపడ్దామని అన్నానే కానీ బయటపడడం అంత సులభమయిన విషయం కాదని మాకు వెనువెంటనే తెలిసివచ్చింది.

మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మాస్కో రేడియో తరపున 'సెర్గీ' అనే ఉద్యోగి ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. అతడి చేతిలో మా పేర్లు ఇంగ్లీష్ లో రాసివున్న ప్లకార్డు చూసి ఒకరినొకరం గుర్తు పట్టాము. హైదరాబాద్ చిక్కడపల్లిలో కొన్న స్వెట్టర్ లతో ప్రస్తుతానికి పని లాగిద్దామని దిగబడిన మమ్మల్ని చూసేసరికి అంత చలిలోనూ అతడికి చెమటలు పట్టినట్టున్నాయి. రష్యన్లో అతడు చెబుతున్నదేదో మాకు అర్ధం కావడం లేదన్న విషయాన్ని అతడే అర్ధం చేసుకుని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి తెచ్చిన వాహనాన్ని ఎయిర్ పోర్ట్ లాంజ్ ఎగ్జిట్ గేటు వరకు తీసుకునివచ్చాడు. అతడే మా లగేజి కారులో ఎక్కించి,  కారు డోరు తెరిచే వుంచి,  ఒకే అంగలో వెళ్లి కారెక్కమని సైగలతో చూపించాడు. మేమంతా ఒక్క ఉదుటున వెళ్లి కారెక్కాము. అప్పుడు అర్ధమయింది మాకు,  మా గురించి అతడు పడిన ఆదుర్దా. ఎగ్జిట్ గేటు నుంచి కారెక్కడానికి మాకు పది సెకన్లు కూడా పట్టివుండదు. కానీ ఆ కాసేపటిలోనే చేతి వేళ్ళన్నీ చలితో కొంకర్లు తిరిగిపోయాయి. మాస్కో చలి పులి విసిరే పంజా దెబ్బ మాకు మొదటిరోజునే అనుభవంలోకి వచ్చింది. అదృష్టవశాత్తూ కారులో హీటరు ఉండడంవల్ల బిగుసుకుపోయిన అవయవాలన్నీ మళ్ళీ స్వాధీనంలోకి వచ్చాయి. కారులో వెడుతున్నప్పుడు పీవీ గారు చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది.

ఢిల్లీలో వీసా పనులన్నీ పూర్తయిన తరువాత  అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉన్నత స్థానంలో వున్న పీవీ నరసింహారావు  గారిని  కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని వచ్చ్చీరాని  హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. 'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.

'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.



మా లెక్క ప్రకారం అది పగటి వేళ అయివుండాలి. కానీ, వీధి దీపాలన్నీ దివిటీలమాదిరిగా వెలుగుతున్నాయి . వాహనాలను హెడ్ లైట్ లు వేసుకుని నడుపుతున్నారు . అదేపనిగా మంచు కురుస్తూ ఉండడంవల్ల, పగలో రాత్రో తెలియని అయోమయావస్తలో ఉండగానే మా కారు పలు అంతస్తుల భవనం ఒకదానిముందు ఆగింది.

 

ఎయిర్ పోర్ట్ అనుభవం ఇంకా  గుర్తు ఉండడంతో ఈసారి అందరం ఎక్కువ ఇబ్బంది పడకుండానే లోపలకు ప్రవేశించాము. మమ్మల్నీ, మా సామానునీ తొమ్మిదో అంతస్తులో వున్న ఒక అపార్ట్ మెంట్ కు చేర్చి, సెలవు తీసుకున్నాడు సెర్గీ.  లోపలకు వెళ్లి చూస్తే కళ్ళు తిరిగేలావుంది. రెండు పడక గదులు, ఒక డ్రాయింగు రూము, పెద్ద పెద్ద షాండిలియర్లు, వంటగది, సామాను గది, మంచాలు, పరుపులు, దిండ్లు, దుప్పట్లు, టీవీ, నాలుగు బర్నర్ల స్టవ్, పైప్  గ్యాస్, బాత్ టబ్, షవర్ ఒకటేమిటి సమస్తం అమర్చి పెట్టి వున్నాయి. ఒక క్షణం ఇది ఇల్లా లేక హోటలా అన్న అనుమానం కలిగింది. ఆ పూటకి వంట జోలికి పోకుండా ఇండియా నుంచి తెచ్చుకున్న తినుబండారాలతోనే సరిపెట్టుకున్నాము.
 సోఫాల్లో సర్దుకు కూర్చుని టీవీ ఆన్ చేస్తే సోవియట్ కమ్యూనిస్ట్ అధినాయకుడు మిహాయిల్ గోర్బచేవ్ అనర్ఘలంగా ప్రసంగిస్తూ కానవచ్చారు. భాష అర్ధం కాకపోయినా వింటూనే నిద్రలోకి జారిపోయాము.

మరునాడు తెల్లవారుతూనే రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేసే లిదా స్పిర్నోవా అనే ఆవిడ మా ఫ్లాట్ కు వచ్చి తనని తాను  పరిచయం చేసుకుంది. 'శ్రీనివాసరావు గారూ! మీ ఆగమనం కోసం ఎన్నో మాసాలుగా ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నాముఅంటూ ఆ రష్యన్ మహిళ - జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి మాదిరిగా తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే, అది చూసి నేనూ మా ఆవిడా అవాక్కయ్యాము. దేశం కాని దేశంలో తెలుగు మాట్లాడే విదేశీ వనిత ఒకరు వున్నారని తెలుసుకుని యెంతో సంతోషపడ్డాము. మాస్కో వాతావరణానికి సరిపడే ఉన్ని దుస్తులుకాలిజోళ్ళు మా అందరికి కొనిపెట్టమని ఆఫీసు వాళ్లు డబ్బులిచ్చి మరీ ఆమెను పంపారన్న సంగతి తెలుసుకుని మరింత సంబరపడ్డాము. లిదా తీసుకెళ్ళి కొనిపెట్టిన ఉన్ని దుస్తులు వేసుకున్న తరవాత మా రూపు రేఖా విలాసాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అవి ధరించి ఉన్ని టోపీలు పెట్టుకుంటే ఆడెవరోమగెవరో ఒక పట్టాన గుర్తు పట్టడం కష్టం. అక్కడి ఆహార్యం విచిత్రంగా వుంటుంది. ఆడా మగా ఎవరయినా ముందు ఉన్నితో చేసిన 'ఇన్నర్లువేసుకోవాలి. వాటిపై పాంటూ షర్టూ కోటూ వేసుకుని 'ఫర్తో చేసిన లాంగ్ కోటు ధరించాలి. మామూలు బూట్లు పనికిరావు. 'ఫర్బూట్లు, 'ఫర్సాక్స్ లేకపోతే ఇంతేసంగతులు.

అయితే ఈ దసరా వేషం ఇంటినుంచి ఆఫీసుకు చేరేవరకే. అక్కడికి వెళ్ళిన తరవాత ఈ చలి దుస్తులన్నీ అక్కడి ప్రత్యేక కౌంటర్లలో ఒప్పగించి, పాంటూ షర్టుతో ఎంచక్కా తిరగగలిగేలా ఎయిర్ కండిషన్ ఏర్పాట్లు చేశారు. ఇక రేడియో మాస్కో విభాగంలో నా సహచరులు,  ముందు చెప్పిన లిదాతో పాటువిక్టర్గీర్మన్ పనిచేసేవారు. ఈ ముగ్గురికీ తెలుగు వచ్చు. మరో ఇద్దరు,  నటాషాసెర్గీలకు రష్యన్ తప్ప మరొకటి తెలియదు. వాళ్ళతో నా సంభాషణ సైగలతోనే సాగేది. సజావుగా పని చేసుకోవడానికి మా మధ్య భాష ఎంతమాత్రం అవరోధం కాలేదు. వీళ్ళల్లో నటాషా మరీ చిన్న పిల్ల. యిరవై నిండకుండానే ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో మొగుడితో కాపురం చేస్తోంది. యివన్నీ రష్యన్లకు చాలా మామూలు. మా ఆవిడ శిలా విగ్రహం మాస్కో పురవీధుల్లో వేయించాలని సరదాగా జోక్ చేస్తుండేది. ఎందుకంటేపెళ్ళయి పదహారేళ్లయినా ఇంకా అదే మొగుడితో కాపురం చేస్తున్నందుకట. 

కింది ఫోటోలు

పట్టపగలు మంచుదుప్పటిలో మాస్కో నగరం

ఇండియన్ స్కూల్ ప్రోగ్రాం లో మా పెద్ద పిల్లవాడు సందీప్ భండారు







 

(ఇంకా వుంది)

5, మార్చి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (103) – భండారు శ్రీనివాసరావు

 అంతకు ముందు వరకు  మాస్కో వెళ్ళడం గురించి ద్వైదీభావం. చలి దేశం. పిల్లలు స్కూలు చదువుల్లోనే వున్నారు. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ స్కూళ్ళల్లో అడ్మిషన్లు మళ్ళీ మొదటికి వస్తాయి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి. ఇన్నేళ్ళ కాపురంలో టీవీలు, ఫ్రిజ్ లు వంటి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయలేదు. మా రెండో అన్నయ్య  కలర్ టీవీ కొనుక్కున్నప్పుడు, అప్పటివరకు వాడిన బ్లాక్ అండ్ వైట్ టీవీ, మా ఆవిడ పిన్ని కొడుకు ప్రకాష్ తాను   పెద్ద ఫ్రిజ్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన పాత సింగిల్ డోర్  ఫ్రిజ్, బెజవాడలో వున్నప్పుడు ఇండియన్ బ్యాంకు వాళ్ళు జర్నలిస్టులకు ఇచ్చిన వెయ్యి రూపాయల రుణంలో ఆరువందలు పెట్టి కొనుక్కున్న స్టీలు అల్మరా. నాలుగు ఇనుప కుర్చీలు, రెండు డెకొలాం మంచాలు ఇవీ మా చరాస్తులు.

హెల్మెట్ సంఘటన తర్వాత మనసు గాయపడింది. పోలీసులు, అరెస్టులు అనే పదాలు సాంప్రదాయ కుటుంబ వాతావరణంలో పెరిగిన మా వారందరికీ ఒక రకమైన మానసిక క్లేశాన్ని కలిగించాయి.

అప్పటికే కొందరం జర్నలిస్టులం మొదలు పెట్టిన యాంటీ హెల్మెట్ ఉద్యమంతో సీనియర్ పోలీసు అధికారులు మా పట్ల మనస్తాపంతో వున్నారు. నన్ను అరెస్టు చేయడంముఖ్యమంత్రి ఎన్టీఆర్  ఈ సంఘటనపై దర్యాప్తు కోసం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటుచేయడంఆ వెంటనే నా మాస్కో ప్రయాణం ఇవన్నీ  మా నడుమ సత్సంబంధాలలో పైకి కనబడని తేడా తీసుకువచ్చాయి.

నేను మాస్కో వెళ్ళేటప్పుడు పీ ఎస్ రామమోహన రావు గారు డీజీపీ. నిఖార్సయిన పోలీసు అధికారి.

అంతకు మునుపు ఆయన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఖమ్మం బస్ స్టాండులో ఒక ఉద్యోగితో సీటు రిజర్వేషన్ విషయంలో పేచీ వచ్చింది. హైదరాబాదు రాగానే ఘాటుగా ఓ పిర్యాదు రాసి పంపించాను. మూడు రోజుల తరువాత అనుకుంటాను, అదే ఉద్యోగి మా మేనల్లుడిని వెంటబెట్టుకుని హైదరాబాదు వచ్చాడు.
ఏదో తెలియక చేసాడుఇప్పుడు ఎమ్డీ గారు నీ పిర్యాదు మీద చాలా దూరం ట్రాన్సఫర్ చేశారునాకు బాగా తెలిసిన వాళ్లు. నువ్వే మళ్ళీ ఏదో సర్ది చెప్పి బదిలీ క్యాన్సిల్ చేయించు’ ఇదీ మా వాడి రాయబారం.
సరేనని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసి విషయం చెప్పాను. అప్పుడాయన ఇలా అన్నారు.
మీరు కంప్లయింటు ఇచ్చారు. మీ మీద గౌరవం కొద్దీ విచారణ కూడా జరపకుండా బదిలీ చేసాను. అదీ నేను చేసిన పొరబాటు. ఇప్పడు మీ మాట విని మరో పొరబాటు చేయడం ఇష్టం లేదు. బదిలీ క్యాన్సిల్ చేయడం చిటికెలో పని. కాని సంస్థలో డిసిప్లిన్ మాటేమిటి. ఎమ్డీ ట్రాన్స్ఫర్ చేస్తే నాకొక లెక్కా! ఒక్క రోజులో మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నానని అందరితో చెప్పుకుంటాడు. క్రమశిక్షణ దెబ్బతింటుంది. ముందు పోయి వేసిన చోట జాయిన్ కమ్మని చెప్పండి. ఓ ఆరు నెలల తరువాత మళ్ళీ వెనక్కు వేస్తాను’
దట్ ఈజ్ రామ్మోహనరావు గారు!

అంత పరిచయం వున్న డీజీపీ రామమోహన రావు గారిని  మాస్కో వెళ్ళబోయేముందు ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసాను. చాలా ఆప్యాయంగా పలకరించి క్షేమ సమాచారాలు కనుక్కుని, వీడ్కోలు చెబుతూ ఒక మాట అన్నారు. ‘మాస్కోలో పోలీసులతో జాగ్రత్త. మన దగ్గరలా హెల్మెట్ల విషయంలో  ఠలాయిస్తే కుదరదు.’ ఆయన శైలి అది.

అయితే  మాస్కో వెళ్ళడం అన్నది అంత సులభంగా ఏమీ జరగలేదు. ఆ రోజుల్లో, రేడియో మాస్కోలో ఆకాశవాణి తరపున తెలుగు విభాగంలో పనిచేస్తున్న శ్రీ ఏడిద గోపాలరావు   మాతృసంస్తకు  తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమయింది.  తెలుగులో వార్తలు చదివే రేడియో న్యూస్ రీడర్లలో, మాస్కోకి  సెకండ్ మెంట్ (డిప్యుటేషన్) మీద వెళ్ళే అర్హత వున్నది కేవలం శ్రీ  డి. వెంకట్రామయ్యకు మాత్రమే. నిజానికి నేను న్యూస్ రీడర్ ని కాదు. రేడియో విలేకరిని. చలి దేశానికి వెళ్ళడానికి ఆరోగ్య కారణాల వల్ల ఆయనకు వీలులేకపోవడంతో ఆ దండ నా మెడలో పడింది.  మా సీనియర్ కొలీగ్ శ్రీ ఆకిరి రామకృష్ణారావు పూనికతో ఆ అవకాశం నాకు దక్కింది. మాస్కోకి వెళ్ళడానికి అవసరమయిన అనుమతులూ గట్రా లభించడానికి దొరికిన వ్యవధిలో,  నాకు తారసపడిన అనేక మంది గొప్ప వ్యక్తులు,  'ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాముఎన్నెన్నో నగరాలు చుట్టబెట్టాము. కానీమాస్కో చూడాలన్నది  మా  చిరకాల స్వప్నం' అనేవారు. దాంతో మాస్కో వెళ్ళాలనే ఆసక్తి నాలో కూడా  బాగా పెరిగిపోయింది.

రేడియో మాస్కోలో పనిచేయడానికి నిర్ణయం జరిగింది కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు రావడంలో జాప్యం జరుగుతోంది. విషయం తెలుసుకుందామని నేనూఅప్పుడు రేడియో న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఆకిరి రామకృష్ణారావు గారు కలిసి రైల్లో  ఢిల్లీ వెళ్లాం. ఏపీ భవన్ లో దిగి బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసుకుని ఆఫీసు పని వేళలకి ఇంకా కొంత సమయం ఉండడంతో, అప్పుడు కేంద్ర మంత్రిగా వున్నపి. శివశంకర్ గారి  ఇంటికి ఫోను చేసి వస్తున్నట్టు ఆకిరి చెప్పారు. ముందే కబురు చేయడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు వెంటనే లోపలకు పంపారు. ముందు గదిలో శివశంకర్ గారు  కూర్చుని వున్నారు. మమ్మల్ని సాదరంగా పలకరించి వచ్చిన పని ఏమిటని వాకబు చేసారు. ఆకిరి సంకోచించకుండా నా మాస్కో ఆర్డర్లు లేటవుతున్నాయని చెప్పారు. ఆయన వెంటనే రాక్స్ ఫోనులో (మాట్లాడే విషయాలు ఇతరులకు తెలిసే అవకాశం లేని ఫోన్లురాష్ట్రపతిప్రధానమంత్రికొందరు కేంద్ర మంత్రులుముఖ్యమైన సీనియర్ అధికారుల ఇళ్ళల్లో మాత్రమే వుంటాయి) సమాచార శాఖ కార్యదర్శితో మాట్లాడి నా విషయం చెప్పారు. ఆయన పదిగంటలకు ఆఫీసుకు పంపించమని చెప్పారు. ఢిల్లీ వచ్చిన పని అనుకోకుండా శివశంకర్ గారిని కలవడంతో పూర్తయింది. దాంతో ఆయనతో కాసేపు అవీ ఇవీ మాట్లాడిఆయన ఇచ్చిన కాఫీ తాగి బయట పడ్డాము. పది గంటలకల్లా శాస్త్రి భవన్ (సమాచార మంత్రిత్వశాఖ కార్యాలయం వుండే సదనం) చేరుకున్నాము. అక్కడ చాలా హడావిడిగా వుంది. హైదరాబాదు స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసి ఢిల్లీలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న  గుంటూరు  రఘురాం (మా పెద్దన్నయ్య పర్వతాలరావుకి మంచి స్నేహితులు)  గారిని  కలుసుకున్నాము. ఆయన మమ్మల్ని చూస్తూనే, ‘రండి రండి మీకోసమే చూస్తున్నానుమీ ఆర్డరు రెడీగా ఉందం’టూ చేతికి అందించారు.

ఆ రోజుల్లో ఢిల్లీ అధికార కారిడార్లలో శివశంకర్ గారి హవా అలా వుండేది.

1987 అక్టోబరు చివరి వారం.

నేను మాస్కో రేడియోలో చేరడానికి తేదీ నిర్ణయం అయింది. నాకు పాస్ పోర్ట్ వుంది కానీ మా ఆవిడకు, పిల్లలకు లేవు. అప్పుడు పాస్ పోర్ట్ ఆఫీసు బర్కత్ పురా నుంచి మెహిదీపట్నానికి మారింది. ఆ రోజుల్లో రోమెల్  అనే పెద్ద మనిషి పాస్ పోర్ట్ అధికారి. సత్యసాయిబాబాకు వీర భక్తుడు. భార్యా పిల్లల్ని తీసుకుని వెళ్లి కలిసి అప్లికేషన్లు ఇచ్చాను.  పాస్ పోర్ట్ దరకాస్తులు తీసుకుని వాటిని ఎవరికో అప్పగించి నాతొ పిచ్చాపాటీ మొదలు పెట్టారు. మా పిల్లలు చాలా చిన్నపిల్లలు. బయటకి పోదాం అంటూ సణుగుడు మొదలు పెట్టారు. దాంతో నేను కల్పించుకుని మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు కలెక్ట్ చేసుకోవడానికి అని అడిగాను. ఆయన దానికి నవ్వి ఇలా అన్నాడు.

మీరు భలే వాళ్లండి. మీ ఫోటోలు అతికించిన జిగురు అయినా ఆరాలా లేదా! అలా తొందరపడితే ఎలా?’

అప్పుడు నాకు అర్ధం అయింది. నాతో ముచ్చట్లు చెబుతూ,  మరోపక్క వాటిని నాకు అప్పటికప్పుడు ఇచ్చే ఏర్పాటు ఏదో చేస్తున్నారని. అలా 1987 అక్టోబర్ 5 న మా ఇంటిల్లిపాదికి గంటలో పాస్ పోర్టులు చేతికి వచ్చాయి.

కుటుంబాన్ని తీసుకుని  ముందు ఢిల్లీ రైల్లో వెళ్లి, సోవియట్ ఎంబసీలో వీసా స్టాంప్ వేయించుకుని, అక్టోబరు 31 రష్యా విమాన సంస్థ ఏరో ఫ్లోట్ లో మాస్కో వెళ్ళాలి.

ఢిల్లీ పోవడం కోసం సికిందరాబాదు స్టేషన్ కు వెళ్ళాము. బంధుమితృలు చాలా మంది వచ్చారువీడ్కోలు పలకడానికి. నేను మా అమ్మతో ప్లాటుఫారం మీద ఓ సిమెంటు  బెంచిపై కూర్చుని ఉన్నాను. ఆమె మొహంలో బాధ కనిపించడం లేదు కానీమనసులో మాత్రం బాధ పడుతోంది. అప్పటికి మా అమ్మకు ఎనభయ్ ఏళ్ళు నిండాయి. బడికి వెళ్లి చదువుకోకపోయినా  పురాణాలు అన్నీ నోటికి వచ్చు.

 రైలు ప్లాటుఫారం మీదకు వస్తూ దూరంగా కనిపించింది. ఆమె నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని మెల్లగా  అంది.

“కూటి కోసంకూలి కోసం దేశాలు పోవాలా!’

ఏం చెప్పాలో తోచలేదు.

కాళ్ళకు దణ్ణం పెట్టి, ఆమె ఆశీస్సులు తీసుకుని రైలు ఎక్కిన తర్వాత కూడా ఆమె మాటలే చెవిలో రింగుమంటున్నాయి.

రామాయణభారతభాగవతాలు కంఠోపాఠం కానీ,  మా అమ్మకు శ్రీశ్రీ కవిత గురించి ఎలా తెలిసిందిటీవీలో ఆకలి రాజ్యం సినిమా చూసి ఉంటుందా! చూసినా ఇంతలా ఎలా గుర్తు పెట్టుకుంది?

ఆ సందేహం ఇప్పటికీ నివృత్తి కాలేదు.

కింది ఫోటో:

1987 లో ఢిల్లీ మీదుగా మాస్కో వెళ్ళడానికి సికిందరాబాదు రైల్వే స్టేషన్ లో మా అమ్మ వెంకట్రావమ్మ గారితో నేనూ, నా కుటుంబం.



 

(ఇంకా వుంది)