13, ఫిబ్రవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో - 82

 బిగ్ జీరోకి బిగ్ బ్రేక్

అయాం ఎ బిగ్ జీరో రాయడం మొదలుపెట్టిన తర్వాత కిందటి నెల చివర్లో బిగ్ బ్రేక్ పడింది. అప్పటికి 81 ఎపిసోడ్స్ అయ్యాయి. జనవరి 27  నుంచి ఈ రోజు వరకు అంటే పదిహేడు రోజుల పాటు దాని జోలికి పోలేదు అంటే నాకే విడ్డూరంగా వుంది.

నిరుడు 2024 నవంబరు పదకొండో తేదీన  ప్రారంభించిన ఈ సీరియల్ ‘రచనోద్ఘాతం’  తోకటపాలో ముందే చెప్పినట్టు, శారీరకంగామానసికంగా పటుత్వం తగ్గుతున్న దశలో మొదలు పెడుతున్న ప్రయత్నం ఇది. కొన్ని విషయాలు గుర్తు చేయడానికి ఇన్నేళ్ళు ఈ జీరో కుడిపక్కన ఓ పెద్ద అంకెలా నిలబడ్డ మా ఆవిడ నిర్మల తోడు  ఇప్పుడు లేకపోవడం పెద్ద కొరత.  అయినా సరే, అన్నీ గుర్తు తెచ్చుకుని, నాకుగా నేను తలకెత్తుకున్న  ఈ బాధ్యతను పూర్తిచేయాలనేది నా సంకల్పం.  

 నాకున్నది ఒక్కటే రోగం. మతిమరపు. మెదడు మొత్తం ఖాళీ కాకముందే ఇది పూర్తిచేసి తీరాలి. దానికి నా ఆరోగ్యం సహకరించాలి.

గత మూడువారాలుగా అనేక మానసిక ఒత్తిళ్ళు. మా రెండోవాడి ఏడూడి మాసికాలు, అమెరికా నుంచి, కటక్ నుంచి పిల్లల రాకలు, వాళ్ళు వెళ్లి ఇల్లు ఖాళీ కాగానే మనసు ఖాళీ కావడం, జలుబు వెలగని బలుబులా  పట్టుకుని ఓ పది రోజులు వదలని రొంప, దగ్గు  నన్ను జీరో రచనకు దూరం చేసాయి.

ఈరోజు, ఫిబ్రవరి పదమూడు ప్రపంచ రేడియో దినోత్సవం. ఈ రోజున, అయాం ఎ బిగ్ జీరో పునః ప్రారంభించాలని సంకల్పం. ఎనభయ్ రెండో ఎపిసోడ్ కి సమాయత్తం. అదే ఇది.

నిజానికి రేడియో అంటే వార్తలు కాదు, సంగీతం. సంగీతం అంటే  ఢమఢమల సంగీతం కాదు. ఎందరో విద్వద్మణులు సమకూర్చిన సంగీతం. ఈ రోజు, ఫిబ్రవరి పదమూడు,  ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక ప్రముఖ దినపత్రిక ఏడుగురు ఆర్జే (రేడియో జాకీ) లతో ఇంటర్వ్యూలు చేసి ఒక పెద్ద ఆర్టికిల్ ప్రచురించింది. సంతోషపడుతూ చదివాను. ఈనాటి తరానికి రేడియో సంగీతం అంటే అదే! మరి  వాళ్ళని ఎలా తప్పుపట్టగలం?  

ఒకప్పుడు రేడియో అంటే అనేక సంగీత దిగ్గజాల పేర్లు వినిపించేవి.                                   

మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి (గాత్రం),  బాలాంత్రపు రజనీకాంతారావు (వాగ్గేయకారుడు), అన్నవరపు రామస్వామి, మారెళ్ళ కేశవరావు, నేతి శ్రీరామ శర్మ (వయొలిన్) దండమూడి రామ్మోహనరావు, ఎల్లా వెంకటేశ్వరరావు  (మృదంగం) ప్రపంచం సీతారాం,  ఎన్ ఎస్ శ్రీనివాసన్ (వేణువు), మంచాల జగన్నాధరావు( వీణ).   మామూలుగా అయితే ఇవి కొన్ని పేర్లు మాత్రమే. కానీ ఆ పేర్లకు వున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు ఇలాటి మహనీయులు నడయాడిన నట్టిళ్లు ఆకాశవాణి కేంద్రాలు. వారు బయట ప్రదేశాలకు వెళ్ళి సంగీత కచ్చేరీలు ఇచ్చినప్పుడు పలానా వారు, బెజవాడ రేడియో కేంద్రం,  హైదరాబాదు కేంద్రం  నిలయ విద్వాంసులు అని కరపత్రాలు ముద్రిస్తే,  అది వారు పనిచేసే కార్యాలయానికి ఒక అదనపు గుర్తింపు తెచ్చిపెట్టేదిగా భావించేవారు. గతంలో రేడియో కేంద్రాలకు అధిపతులుగా పనిచేసిన అధికారులు కూడా వారికి తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. చక్కటి సంగీత కళాకారులు తమ వద్ద పనిచేయడం అనేది గొప్ప విషయంగా పరిగణించేవారు. ఆ కారణంగానే పాత కాలంలో సంగీతానికి రేడియో, రేడియోకు సంగీతం పరస్పర సహకారం ఇచ్చుకున్నందువల్లే కచ్చేరీల ద్వారా కొందరికే అందుబాటులో వున్న సంగీతం రేడియో ద్వారా ఎల్లెడలా వున్న జనాలకు చేరువకాగలిగింది.  కానీ కాలం గడుస్తున్న కొద్దీ అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టే రేడియోలో కూడా పరిస్థితులు మారుతూ వచ్చాయి. తమ సంగీతపాటవాన్ని పదిమందికీ తెలియచేయాలన్న తపనతో ఓ పక్క రేడియోలో పనిచేస్తూనే కొందరు కళాకారులు మరోపక్క తగిన అనుమతులు తీసుకోకుండా బయట సంగీత కచ్చేరీలలో పాల్గొంటూ వుండేవారు. ముందే చెప్పినట్టు వెనుకటి రోజుల్లో ఈ తరహా వ్యవహారాలను అధికారులు ఓ దృష్టితో చూసి, చూసీ చూడనట్టు వొదిలేస్తే, తదనంతరం వచ్చిన అధికారుల్లో కొందరు దీన్ని నిబంధనలకు వ్యతిరేకం అన్న కోణంలో చూడసాగారు. అదిగో అక్కడే రేడియో ఆర్టిస్టులకు, అధికారులకు మధ్య సంఘర్షణలకు దారితీసింది. అయితే సహజంగా ఈ విషయంలో అధికారులదే  పైచేయి కావడంతో ఆర్టిస్టులు మానసికంగా కుంగిపోయేవారు. రేడియోలో తమది ఉద్యోగం కాదు, ఉపాధి అనుకుని వచ్చి చేరినవారిలో కొందరు,  మారిన పరిస్తితులతో రాజీపడలేక రేడియోనే వొదిలేసారు. అలాటివారిలో  ప్రపంచం సీతారాం ఒకరు. దక్షిణ భారతంలో పేరెన్నికగన్న టీ ఆర్ మహాలింగం శిష్యులు. ప్రపంచం అన్నది సీతారాం ఇంటిపెరుకాదనీ, ఎప్పుడో దశాబ్దాల క్రితం తెలుగులో తీసిన 'ప్రపంచం' అనే చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించిన కారణంగా ఆయనకు ప్రపంచం అన్నది ఇంటి పేరుగా మారిపోయిందని చెబుతారు.  

 నిబంధనల  పేరుతొ నిరంకుశంగా వ్యవహరించే అధికారుల చేతుల్లో కళాకారులు యెలా కుంగిపోతారన్నదానికి సీతారాం గారే ఒక ఉదాహరణ.

లోకాన్ని ఒదిలి వెళ్ళిన ప్రపంచం

ప్రసిద్ధ సంగీత విద్వాంసుడుఫ్లూట్ కళాకారుడు ప్రపంచం సీతారాం, 2014లో మరణించినప్పుడు ఆయన సంస్మరణ వ్యాసానికి నేను ఎంచుకున్న శీర్షిక ఇది. 

సంగీతానికి చావు లేదు. అయితేఅజరామరమైన సంగీతాన్ని జనాలకు వొదిలి పెట్టి వెళ్లి, సంగీత కారులు మాత్రం  అమరులుగా మిగిలిపోతుంటారు. అలాంటి సంగీత నక్షత్రమే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫ్లూట్ వాయిద్యకారుడు ప్రపంచం సీతారాం. అంతటి సంగీతకారుడు పనిచేసిన రేడియోలోనే నేనూ పనిచేశాను అనే ఒకే ఒక్క  కారణం తప్ప ఆయన్ని గురించి రాయగల  ఏ యోగ్యతా నాకు లేదనిఆ ఒక్కటే  ఈ వ్యాసానికి ప్రేరణ అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆత్మగౌరవం కలిగిన కళాకారులు సర్కారీ నౌకరీ చేయడంలో ఎదుర్కునే మానసిక సంఘర్షణలు గురించి ప్రస్తావించాలని అనుకోవడం కూడా ఇందుకు దోహదం చేసింది.

 

ఇది జరిగి కూడా పాతిక ముప్పయ్యేళ్ళు అవుతుందేమో. ఇంకా ఎక్కువో.

మంగళగిరి,  నంబూరు నడుమ ఒక జైన దేవాలయం వుంది. ఆ ఆలయం అధికారుల ఆహ్వానం మేరకు ఒకరోజు బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ అయూబీ, న్యూస్ ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారిని వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ వారికి ప్రపంచం సీతారాం తన బృందంతో తారసపడ్డారు. అప్పటికే ఆయన రేడియో కళాకారుడే కాకుండా తదనంతరం సంపాదించుకున్న డిగ్రీల సాయంతో రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా ఎంపికై. ప్రమోషన్ మీద  బెజవాడ రేడియో స్టేషన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఉద్యోగం ఏదైనప్పటికీ, స్వతహాగా ఆయన సంగీతకారుడు.  కచ్చేరీలు చేయాల్సిందిగా ఆహ్వానాలు అందుతూ వుండేవి. అయితే రేడియో ఉద్యోగులు ఇలా కచ్చేరీలు చేయడం అప్పటి స్టేషన్ డైరెక్టర్ కు సుతరామూ ఇష్టం వుండేదికాదు. పైగా అలాటి వారికి  మెమోలు ఇవ్వడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన హయాములో రేడియో కళాకారులు బిక్కచచ్చినట్టు వుండేవారు.

జైన దేవాలయంలో పై అధికారి కనబడగానే కచ్చేరీ నిమిత్తం అక్కడికి వచ్చిన ప్రపంచం సీతారాం కూడా కంగారు పడిపోయారు. మరునాడు స్టాఫ్ మీటింగులో కూడా స్టేషన్ డైరెక్టర్ అదే విషయాన్ని ప్రస్తావించి హెచ్చరిక చేయడంతో,  ఆయన కృష్ణారావు గారితో చెప్పుకుని తెగ మధన పడిపోయారు. ఇలాటి అనేకానేక అనుభవాల దరిమిలా, రేడియోలో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తరువాత కూడా సీతారాం, తన మనస్సుని సమాధాన పరచుకోలేక, తన మనస్సుకు నచ్చని రేడియో ఉద్యోగాన్ని వొదిలి పెట్టి, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడే విభాగాధిపతిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.

ఫ్లూటు వాయిద్యంలో తనకు తానే సాటి అనిపించుకున్న ప్రపంచం సీతారాం గారు, అమెరికాలోని శాండియాగోలో వుంటున్న తన కుమారుడు ప్రసన్నను చూడడానికి  వెళ్ళి, అక్కడే ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా విడిచివెళ్ళారు.

తన సంగీత జ్ఞానంతో తెలుగు  సంగీత ప్రాభవాన్ని ఏనాడో ఎల్లలు దాటించిన ప్రపంచం సీతారాం, దేశం ఎల్లలు  దాటివెళ్ళి అక్కడెక్కడో పరాయి దేశంలో మరణించడం విధి విచిత్రం.

(ఇంకా వుంది)


కింది చిత్రం ప్రపంచం సీతారాం




 

10, ఫిబ్రవరి 2025, సోమవారం

ఓ అర్చకుడి కధ

ఓ అర్చకుడి కధ  - భండారు శ్రీనివాసరావు 

(ఇప్పుడీ పోస్ట్ అవసరం ఏమిటన్నది సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అర్ధం అవుతుందని ఆశిస్తున్నాను )

ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను.
అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది.
గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా  వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని  చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల  హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల మీద ప్రత్యేక దర్శనాలు లేని దేవాలయం అది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు  అనే తేడా లేకుండా అందరూ వరుసగా వెళ్లి దైవదర్శనం చేసుకోవడానికి వీలైన గుడి అది.  అందుకే నాకు ఆ గుడి అంటే మక్కువ ఎక్కువ. గర్భగుడిలో వున్న బాలాజీకి  వీసా దేవుడు అనే పేరుంది. అక్కడికి పోయి పదకొండు ప్రదక్షిణలు తర్వాత దర్శనం చేసుకుని మనసులో  కోరుకుంటే  అమెరికన్ వీసా దొరుకుతుంది అనే నమ్మకం ఆ గుడి విషయంలో వుంది అని విన్నాను.  కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ ఆ గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు అంటారు. 
సువిశాల ప్రాంగణంలో  అనేక ఏళ్ళుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ దేవాలయానికి  ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందర రాజన్ అనే పెద్దమనిషి. ఉన్నత చదువులు అభ్యసించారు. కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త. రిటైర్ అయిన తర్వాత  అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తి స్వీకరించారు. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండరాదని దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. 
నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఆయన తరచుగా  మా దగ్గరకు వస్తుండేవారు. అనేక ఆధ్యాత్మిక  విషయాలు చర్చిస్తూ వుండేవారు. 
ఆయన కుమారుడే  సౌందర రాజన్ రంగరాజన్. ఈ వ్యాసానికి స్పూర్తి. 
తండ్రిలాగే ఆయన కూడా విద్యాధికుడు. ఎప్పుడైనా ఆ గుడికి వెళ్ళినప్పుడు తండ్రీ కొడుకులతో మాట్లాడడం నాకు ఓ వ్యాపకంగా మారింది. పెద్ద చదువులు చదివి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగినప్పుడు రంగరాజన్ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోయారు. అవి ఆయన మాటల్లోనే.  
“మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. నుదిటిమీద పెద్దగా నామాలు పెట్టుకునే బడికి  వెళ్లేవాణ్ణి. క్రైస్తవ పాఠశాలలైనాసరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్పాలి.
“ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంతకాలం చిలుకూరు గుడికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు.
“దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999 లోనే సంవత్సరానికి పది లక్షల రూపాయల జీతం! 
“అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. 1987లో నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో  వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసింది.
“నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.
“మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు నాన్నగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు  ఓ అధికారి ఇలా అన్నారు.
‘సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ వారసత్వపు హక్కుల గురించిన ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా, నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని!
“నాకప్పుడు 35 ఏళ్లు. మంచి జీతం, ఇంకా మంచి భవిస్యత్తు వున్న ఉద్యోగం. ప్రేమించి పెళ్ళాడిన భార్య. చీకూ చింతాలేని సంసారం. 
‘ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నలుగురూ నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా నా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను. 
“రోజూ దేవుడికి సమర్పించిన నైవేద్యం మాత్రమే నా ఆహారం. ఆధునిక వస్త్ర ధారణ వదిలేసి అలా మారిపోయిన నన్ను చూసి మా ఆవిడ మొదట్లో వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది.
“ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను. 
“అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టిక్కెట్టు  దర్శనాలు లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నాం.
“ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా పోయింది.
“1990కి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభై వేల మంది దాకా వస్తున్నారు. గుడికి వచ్చేవారికి సనాతనధర్మం గొప్పతనం గురించి చెబుతుంటాం. సనాతన ధర్మమంటే మూఢాచారాలు, స్త్రీలపట్ల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించడం కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే.
“వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాలసారం అదేనని నేను నమ్ముతా. 
“ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది.  దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను.
(శ్రీరంగం దేవాలయంలో ఓ దళితుడు స్వామి దర్శనం కోసం అల్లాడుతుంటాడు. కానీ అతడికి ప్రవేశం దొరకక పోగా ప్రధాన అర్చకుడు అతడిని గులక రాయితో కొడతాడు. గుడిలోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం స్రవిస్తూ వుంటుంది. దానితో పూజారికి జ్ఞానోదయం అవుతుంది. ఆ దళితుడిని తన భుజాల మీదకు ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లి స్వామి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇలా భుజాలకు ఎత్తుకుని దళితుల చేత దేవాలయ ప్రవేశం చేయించడాన్ని మునివాహన సేవ అంటారు) 
“అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. చెప్పినట్టే చేశాను. ఓరోజు ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అని పాడుకుంటూ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే  ఒక  హరిజన భక్తుణ్ణి గుడిలోకి మోసుకెళ్లాను.
“ఈ విషయం మీడియాలో రావడంతో, బౌద్ధ గురువు దలైలామా ప్రశంసాపూర్వక లేఖ రాసారు. అభినందనలు అనంతంగా సాగాయి. ఇవన్నీ ఆ బాలాజీ  దయ అని నేను నమ్ముతాను.
“వీటన్నింటి వెనక నా భార్య సుధ ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం వదులుకుని, అర్చకత్వం స్వీకరించిన  భర్త వెంట నడవాలంటే  గొప్ప మానసిక బలం కావాలి. బాగా చదువుకుని పైకి వచ్చిన నా పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపింది”
ఇదీ ఒక అర్చకుని కధ. ఆచరించాల్సిన అంశాలతో కూడిన జీవనగాధ.

జ్ఞాపకాల నిమజ్జనం జరిగే పనేనా!

నిరుడు సరిగ్గా ఇదే రోజు.
 
ఆరేళ్ల క్రితం మా వాడు సంతోష్ చేతుల్లో వాళ్ళమ్మ.
ఆరేళ్ల తర్వాత నా చేతుల్లో మావాడు సంతోష్.

 అస్థి నిమజ్జనం ఏమో కానీ జ్ఞాపకాల నిమజ్జనం చాలా కష్టం.

 (వేదాద్రి వద్ద కృష్ణానదిలో)
10-2-2025

8, ఫిబ్రవరి 2025, శనివారం

చనిపోయినవారికి పుట్టిన రోజులు ఉంటాయా!

 ఫిబ్రవరి 29 నాలుగేళ్లకు ఒకసారి. ఫిబ్రవరి 9 మాత్రం ఏటేటా.

ఈరోజు ఫిబ్రవరి తొమ్మిది.

చనిపోయినవారికి పుట్టిన రోజులు ఉంటాయా! పుట్టిన తర్వాతనే కదా వారు చనిపోయింది.


“మిస్టర్ హ్యాపీ బర్త్ డే”

“……………….”

అటునుంచి స్పందన లేదు. వుండదు, రాదు.

నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ లేరు.


ఫిబ్రవరి తొమ్మిది. మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు.


1971లో పెళ్ళయినప్పటి నుంచి 2019 లో   ఆమె  చనిపోయేవరకు నలభయ్ ఎనిమిదేళ్లుగా  నేను మా ఆవిడను పేరు పెట్టి ఎన్నడూ పిలవలేదు. మిస్టర్ అనే పిలిచేవాడిని.

ఎందుకంటే ఆవిడ నాకూ, నా చిన్న  కుటుంబానికీ ‘మాస్టర్’ కాబట్టి.  


కింది చిత్రాలు :

ఫోనులో పిలవాలని నేను 

ఫోను పిలుపుకు అందనంత దూరంలో తాను.







(09-02-2025)

7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

గుర్తొస్తున్న పాత జ్ఞాపకం - భండారు శ్రీనివాస రావు


జీవితంలో కొన్ని సంఘటనలు కధలకు ఏమాత్రం తీసిపోవు.

చాలా ఏళ్ళ క్రితం, 2005లో కాబోలు, తానా వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లాను. 

‘ఎంతకాలం అమెరికాలో వుంటారు’ అనే ఇమ్మిగ్రేషన్ అధికారి ప్రశ్నకు ‘అయిదు రోజులు’ అని జవాబిచ్చాను. ‘ఫైవ్ డేస్ ఓన్లీ’ అన్నాడతగాడు ఒకింత ఆశ్చర్యంతో.  నిజానికి నా రిటర్న్ ఫ్లైట్ కూడా ఐదో రోజునే వుంది. తీసి చూపించాను. ఆల్ ది బెస్ట్ అన్నాడు స్టాంప్ వేస్తూ. 

బయటకి వచ్చి చూసుకుంటే ఆరు నెలలు అని వుంది. పదేళ్ల మల్టిపుల్ విజిటర్స్ వీసా నాది. అమెరికాలో ఉండడానికి ఎక్కువలో ఎక్కువ అనుమతించే ఆరు మాసాల వ్యవధిని  నాకిచ్చినట్టు.


తానా సభలు జరిగే డెట్రాయిట్ నగరంలో విదేశాల నుంచి వచ్చిన అతిధులకు కొన్ని హోటళ్ళలో బస ఏర్పాటు చేశారు. పెద్ద ఆడంబరంగా లేకపోయినా గదిలో అన్ని వసతులు వున్నాయి. ఒక్కో గదిని  ఇద్దరిద్దరికి  చొప్పున కేటాయించారు. నాతో పాటు గదిలో ఉన్న వ్యక్తి వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్ తో వున్నట్టు కనిపించాడు. మర్నాడు డెట్రాయిట్ మాజీ మేయర్ , కీర్తిశేషులు ఆల్బర్ట్ కోబో పేరిట నిర్మించిన సువిశాల సభామందిరంలో తానా సభలు మొదలవుతాయి. 

అతడితో పెద్దగా మాట్లాడానికి నా దగ్గర కూడా విషయాలు లేవు. అంత పరిచయమూ లేదు. అయినా అతడి మొహంలో కనబడుతున్న  టెన్షన్ తగ్గించడానికి వివరాలు అడుగుతూ మాటల్లో పెట్టాను.

‘ఎవరికీ చెప్పకండి. నేను ఈ ఒక్క రాత్రే వుంటాను. తెల్లారేసరికల్లా వెళ్ళిపోతాను’ అన్నాడు. నాకు ఆశ్చర్యం. సభలకోసం వచ్చి తెల్లారి వుండననడం ఏమిటి?  ఎక్కడికి అని అడిగేలోగా అతడే అన్నాడు.

‘ఎక్కడికి పోవాలో సరిగ్గా నాకే తెలియదు. పలానా  చోటుకి వెళ్ళమని హైదరాబాదులో చెప్పారు. అదేమిటో, ఎక్కడో, ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ వెళ్లి తీరాలి’ అన్నాడు.

‘సరిపడా డబ్బులు ఉన్నాయా' అని అడిగాను. అడిగితే ఇవ్వడానికి నా దగ్గరా ఎక్కువేమీ లేవు. ఏదో అయిదు రోజులు, అదీ వాళ్ళ ఆతిథ్యంలో, ఖర్చులు ఏముంటాయి అనే అభిప్రాయంతో ఎక్కువ డాలర్లు కూడా తెచ్చుకోలేదు.

‘అక్కరలేదు. నేను ఆ ఏర్పాటుతోనే వచ్చాను. ఓ మూడు నెలలకు సరిపడా డబ్బులు వున్నాయి. తర్వాత నా అదృష్టం’ అన్నాడతను.

మాటల్లో వివరాలు చెప్పాడు. అతడో ఎలిమెంటరీ స్కూలు టీచరు. పెద్ద సంసారం, చిన్న జీతం. ఎన్నాళ్ళిలా అనుకుంటూ వుంటే ఎవరో చెప్పారు, ‘అమెరికా వెళ్ళు, అది అవకాశాల దేశం, ఏదో ఒక పని దొరక్కపోదు అని.

‘ఎలా వెళ్ళడం?’ అంటే ...

‘అది కూడా అతడే చెప్పాడు. ఏదో ఒక విధంగా విజిటర్ వీసా సంపాదించి వెళ్ళు. ఒక్కసారి అమెరికాలో అడుగుపెడితే రోజుకిన్ని డాలర్లు, గంటకిన్ని డాలర్లు చొప్పున  ఇచ్చే వాళ్ళు వుంటారు. నీ ఖర్చులకు పోను ఇంటికి డబ్బులు కూడా పంపుకోవచ్చు అని ఉత్సాహ పరిచాడు’

‘ఏమి చేయాలని ఆలోచిస్తున్న నాకు అతడిచ్చిన ఈ  సలహా మరేదీ ఆలోచించకుండా చేసింది. అంతే! ఉన్న కొంత పొలం, అమ్మ వద్దంటున్నా వినకుండా అమ్మేసాను. అప్పటినుంచి చేయని ప్రయత్నం లేదు, వీసా సంపాదించడానికి. ఇన్నేళ్ళకు కుదిరింది. ఇంట్లో బయలుదేరిన దగ్గరి నుంచి ఒకటే బెంగ. మళ్ళీ మా ఊరికి తిరిగి వెడతానా! మా వాళ్ళను మళ్ళీ నా కళ్ళతో చూడగలుగుతానా!’

నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. మౌనంగా వుండిపోయాను.

అతడే మొదలు పెట్టాడు మళ్ళీ.

‘ఎవరిదో తెలుగు వాళ్లది ఫాం హౌస్ వుందట, దానికి కేర్ టేకర్ కావాలిట. ఎక్కడో అటవీ ప్రాంతంలో వుందట. పలానా చోటు వరకు రాగలిగితే, వాళ్ళే తీసుకు వెడతారట. ఆరు నెలలు స్టాంప్ వేశారు. ఈలోగా ఏదో ఒక మంచి ఉద్యోగం పట్టుకోవాలి’

మనిషిని చూస్తే పిరికివాడిలా వున్నాడు. ఇంత ధైర్యం ఎలా చేశాడు? దేశం కాని దేశంలో, ఊరు కాని వూళ్ళో, భాష కూడా సరిగా లేకుండా ఎలా నెగ్గుకు రాగలడు?

డబ్బు అవసరాలవల్ల, మరీ పచ్చిగా చెప్పాలంటే డబ్బు యావలో పడి జీవితంలో ఇంత రిస్క్ తీసుకోవాలా!

ఆ రాత్రి ఎక్కడో డిన్నర్ ఏర్పాటు చేశారు. అతడు రాలేదు. ఏదో కొనుక్కుని తింటాను రానన్నాడు. వచ్చేసరికి నిద్ర పోతున్నాడు.

తెల్లారి చూస్తే పక్క మీద లేడు, అసలు గదిలోనే లేడు.

ఇంత పెద్ద సువిశాల దేశంలోకి అతడు ఒంటరిగా నడుచుకుంటూ వెడుతున్న దృశ్యమే నా ఊహకు మిగిలింది.

అతడు ఉద్యోగం సంపాదించుకున్నాడా! ఆ దేశంలో స్థిర పడ్డాడా! ఎప్పటికయినా మన దేశానికి వచ్చి భార్యాబిడ్డలను చూడగలిగాడా! అలా జరిగితే ఎంత బాగుంటుందో కదా!

ఆ తర్వాత ఎప్పుడు అమెరికా వెళ్ళినా నా మదిలో ఈ ప్రశ్నలు తలెత్తేవి. కాకపోతే జవాబు దొరకని ప్రశ్నలు.

6, ఫిబ్రవరి 2025, గురువారం

అన్నీ వుండి ఏమీ లేకపోవడమే జీవితం

 మేరా నాం జోకర్ సినిమాలో రాజ్ కపూర్ పాత్ర చెప్పినట్టు జీవితం ఆగదు, సాగిపోతూనే వుంటుంది.

‘నేను లేకుండా ఈయన ఎట్లా బతుకుతారో ఏమిటో’ అని, తాను  చనిపోయే ముందు ఆఖరు క్షణంలో మా ఆవిడ అనుకునేవుంటుంది. ఏదో రాసుకోవడం, స్నేహితులతో పిచ్చాపాటీ కాలక్షేపాలు చేయడం తప్పిస్తే నా మటుకు నాకు బతకగల తెలివితేటలు ఆ భగవంతుడు ఇవ్వలేదు. నా బనియన్ సైజ్ ఏమిటో కూడా నాకు తెలియదని ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ సొద ఎందుకంటే-

కారు సర్వీసింగ్ చేయించడం, కార్ వాష్ చేయించడం, ఇన్వర్టర్ లో వాడే అదేదో డిస్టిల్డ్ వాటర్ బాటిల్ కొనడం, కారుకు పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికేట్ తీసుకోవడం, బకాయి ఉన్న ట్రాఫిక్ చలానాలు పే చేయడం, వెహికిల్ ఇన్స్యూ రెన్స్ రెన్యూ చేయడం,  నిజానికి ఈ కాలం వారికి ఇవన్నీ  చిన్నపనులే కావచ్చు. కాకపోతే బద్దకమే స్టిరాస్తిగా కలిగిన నా వంటి వారికి పెద్ద పనులే. ఇవన్నీ, ఇవన్నే కాదు, ఇంకా చాలా పనులు, నేను నిశ్చింతగా కాలుమీద కాలు వేసుకుని హాయిగా రోజులు దొర్లించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఎల్లుండి మనుమరాలు జీవికతో కలిసి పుట్టింటికి వెడుతున్న  కోడలు నిషాకు ధన్యవాదాలు. (Gratitude can be expressed in many ways. This is one)

 

ఇది సరే! అన్నీ వుంటే నిశ్చింతగా వుంటుందా! ఏమో నాకు డౌటే!

ప్రపంచంలో అతి భయంకరమైనది ఒంటరితనం!  





  

4, ఫిబ్రవరి 2025, మంగళవారం

ఫిబ్రవరి, నాలుగు, 2024

తెలుగు తిథులు తోసుకువచ్చి, ఏడూడి, మొదటి ఆబ్దీకం  మొదలైన మూడు రోజుల కార్యక్రమాలు అన్నీ పది రోజులు ముందుగానే పూర్తయ్యాయి. కానీ, గుర్తు వుండిపోయేది,  గుండెలో నాటుకుని సెల వేసేది ఇంగ్లీష్ తేదీనే కదా!

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున అపోలో ఆసుపత్రి నుంచి డాక్టర్ బాబీ ఫోను. ‘అందరూ వచ్చేసేయండి’

అందరం  ఎందుకు? అందులోనే వుంది. అర్ధం చేసుకోవాలి. అయినా ముందు రోజు ఆసుపత్రికి బయలుదేరుతుంటే, అక్కరలేదు, ఈ ఒక్క రాత్రి చూసి రేపు డిశ్చార్జ్ చేస్తారు అన్నారు. ఏమి చూశారో మరి ఆ రాత్రి. 

వెళ్ళే సరికి మా చుట్టపక్కాలు, సంతోష్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే వున్నారు. అంటే చిట్టచివర్లో తెలిసింది నాకే అన్నమాట. నా గుండె తట్టుకుంటుందో లేదో అని భయం. నాకసలు గుండె లేదనీ, దాని స్థానంలో ఓ రాతి బండ వుందనీ వాళ్లకు ఏం తెలుసు? ఆరేళ్ల క్రితం ఇదే ఆసుపత్రిలో మా ఆవిడను అంబులెన్స్ నుంచి అలా లోపలకు తీసుకువెళ్ళారు. ఓపీలోనే చెప్పేశారు, బ్రాట్ డెడ్ అని.  కాకపొతే అలా చెప్పడానికి గంట పైన తీసుకున్నారు. చావు కబురు నిదానంగా చెప్పాలి అనుకున్నారేమో! మరి అంతకు ముందు, ఏం లేదు మామూలు వైరల్ ఫీవర్, మూడు రోజులు డోలో  వాడితే తగ్గిపోతుందని అన్నారు. మూడో రోజు ఆ మాత్రల అవసరమే లేకుండా పోయింది.  

ఇక సంతోష్ విషయంలో  ముందు రోజు అలా వెళ్లి చూసి, వెంటనే వచ్చేయండి అని జాగ్రత్తలు చెప్పి ఐ సీ యు లోకి పంపిన వాళ్ళు, ఈరోజు లోపల ఎంతసేపు వున్నా మాట్లాడలేదు. మొహానికి, వంటికి పెట్టిన పరికరాలు, తీగెలు  తీసేస్తున్నారు. వాడేమో వళ్ళు ఎరగని విధంగా నిద్రపోతున్నట్టు పడి వున్నాడు మంచం మీద.  నలభయ్ ఏడేళ్ల జీవితానికి తెర పడిపోయింది.

దేముడికి పునర్జన్మల మీద నమ్మకం వున్నట్టు లేదు. మరుసటి జన్మవరకు వేచి చూడకుండా ఎప్పటిశిక్షలు అప్పుడే, ఆ జీవితకాలంలోనే  వేసేస్తాడులా వుంది. పెద్దవాళ్ళ కళ్ళ ముందే చిన్నవాళ్ళు పోవడాన్ని మించిన శిక్ష ఏముంటుంది?


(దివికేగిన నా భార్య నిర్మల, కుమారుడు సంతోష్)


04-02-2025