11, నవంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో - భండారు శ్రీనివాసరావు

 రచనోద్ఘాతం

‘శ్రీనివాసరావ్! నీ గురించి ఏదో అనుకున్నాకానీ, నువ్వొక బిగ్ జీరోవి

ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్, ప్రముఖ రచయిత, ఇల్లాలి ముచ్చట్లు సృష్టికర్త పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఏమాత్రం మొహమాటం లేకుండా నేరుగా నాతోనే అన్నమాట ఇది.

నార్లగారి సంపాదకత్వంలో, నండూరి వారి సారధ్యంలో నడుస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న రోజులవి. అంటే దాదాపు యాభయ్ అయిదేళ్ళ నాటి ముచ్చట.

పురాణం గారు అలా అనగానే, నాకు కాళ్ళకింది భూమి కదిలినట్టయింది. నిస్సత్తువ ఆవరించింది.

కానీ ఆయన వెంటనే మరో మాట అన్నారు.

‘నువ్వు జీరోవే! అయితే నువ్వు కుడి పక్కన వుంటే ఒకటి, రెండు,మూడు వంటి చిన్న అంకెల విలువ కూడా  పెద్దగా పెరుగుతుంది. అలాంటివాడివి నువ్వు

తటాలున అన్న మాటను వెనక్కి తీసుకోలేక, నన్ను సముదాయించడానికి అలా అని ఉంటారని నాకనిపించింది. ఏ ఉద్దేశ్యంతో అన్నప్పటికీ, పురాణం గారి మాట నాకు ఆస్కార్ తో సమానం. అందుకే డెబ్బయ్ తొమ్మిదో ఏట రాస్తున్న నా ఈ జీవన కధనానికి ఈ శీర్షిక ఎంచుకున్నాను. 

ఆ రోజుల్లో ఆయన ఏదో సినిమాకి కధో, మాటలో రాస్తున్నారు. ఆ సినిమా తాలూకు వాళ్ళు బెజవాడ బీసెంటురోడ్డులోని మోడరన్ కేప్ లో ఒక గది ఏర్పాటు చేశారు ఈ పనికోసం. సాయం రమ్మంటే సాయంత్రాలు ఆఫీసు పని కాగానే ఆయన దగ్గరకు వెళ్ళేవాడిని. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ  పురాణం గారు ఏదో చెప్పేవారు. ఆ చెప్పిన దాన్ని కాగితంపై పెట్టడం నా పని, నన్నయ భట్టారకుని వద్ద నారాయణ భట్టులా. నాకా షార్ట్ హ్యాండ్ తెలియదు. పురాణంగారి ఆలోచనల ఉరవడి వరద గోదారిలా వుంటుంది. అంచేత తప్పనిసరిగా నా రాతలో తప్పులు దొర్లేవి. సుదీర్ఘ కాలం ఎడిటర్ గా పనిచేసిన పురాణం గారికి నేను తప్పులతో సహా దొరికిపోయేవాడిని. సహజంగానే కోపం వస్తుంది. అలాగే వచ్చేది. ఇదిగో ఇలాంటి ఒక సందర్భంలో ఆయన అన్నమాట ఇది.

పురాణంగారి మాట చలవో ఏమో కానీ, ఇన్నేళ్ళ నా జీవితంలో ఎందరెందరో నాకు పక్కన బాసటగా నిలబడి, నేను జీరోగానే మిగిలిపోకుండా నన్ను పెద్దవాడిని చేశారు. నాకు లేని విలువని నాకు కట్టబెట్టారు. వారందరినీ ఒక మారు స్మరించుకోవడం కూడా ఈ రచన లక్ష్యం.

నేనో రచయితను కాను. నేనో సంపాదకుడిని కాను. పెద్ద అధికారినీ కాను. ఆ మాటకు వస్తే పెద్ద జీతగాడినీ కాను. స్వయంకృషితో ఎదిగిన వాడిని కాదు. నిజం చెప్పాలంటే గాలివాటం బాపతు.

ఇక నిజజీవితానికి వస్తే నాకు పాసు మార్కులు కూడా పడవు. రెండుసార్లు తప్పి, ముక్కుతూ మూల్గుతూ మూడోసారి బీకాం డిగ్రీ తెచ్చుకున్నవాడిని.  కొడుకుగా, భర్తగా, తండ్రిగా నేనో బిగ్  ఫెయిల్యూర్. మరి ఏముంది నా గురించి రాసుకోవడానికి. ఒకవేళ రాసినా ఏముంటుంది ఎవరైనా చదవడానికి. అయితే ఇందుకు  నాకు తోచిన కారణం ఒకటి, నా అనుభవానికి వచ్చిన ఉదంతం రూపంలో  చెబుతాను.  ఏ జీవితమైనా అనుభవాల సమాహారమే కదా!

యాభయ్ ఏళ్ళ క్రితం  రేడియోలో  వార్తలు  చదివే  రెగ్యులర్ న్యూస్ రీడర్లను ఎంపిక చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించాము. లిఖిత పరీక్షలో నెగ్గినవారికి కొన్ని నమూనా వార్తలు ఇచ్చి స్టూడియోలోనే రికార్డ్ చేయించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపిక కోసం వచ్చిన  నిర్ణేతల బృందానికి నేతృత్వం వహించిన  నాటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ  వైస్ చాన్సలర్, ప్రసిద్ధ భాషావేత్త, భద్రిరాజు కృష్ణమూర్తి గారు, ఇంటర్వ్యూకు  వచ్చినవాళ్ళల్లో ఓ అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ ని పదికాలాలపాటు భద్రపరచమని సూచించారు. అంత బాగా చదివిందా అని మేము ఆశ్చర్యపోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు. వార్తలు ఎలా చదవకూడదో అన్నదానిని బోధపరచడానికి ముందు ముందు అది  పనికొస్తుందన్నది  ఆయన మాటల  తాత్పర్యం.

అలాగే ఒక మనిషి ఎలా జీవించకూడదో తెలుసుకోవాలంటే, అప్పుడప్పుడు నా వంటివారి జీవన చిత్రాలను కూడా పరిశీలించడం అవసరం. అందుకోసమే ఈ రచనోద్ఘాతం.

తోకటపా: శారీరకంగా, మానసికంగా పటుత్వం తగ్గుతున్న దశలో మొదలు పెడుతున్న ప్రయత్నం ఇది. కొన్ని విషయాలు గుర్తు చేయడానికి ఇన్నేళ్ళు ఈ జీరో కుడిపక్కన ఓ పెద్ద అంకెలా నిలబడ్డ మా ఆవిడ నిర్మల తోడు  ఇప్పుడు లేకపోవడం పెద్ద కొరత. అలాగే ఒకప్పటి సంగతులను స్పురణకు తేవడంలో సహకరించిన  నా మేనల్లుళ్ళు  తుర్లపాటి సాంబశివరావు, కౌటూరి దుర్గాప్రసాద్, కొలిపాక రాజేంద్ర ప్రసాద్ లు కూడా ఇప్పుడు లేరు. అలాగే కొందరు బాల్య స్నేహితులను కూడా పోగొట్టుకున్నాను. ఏతావాతా చెప్పేది ఏమిటంటే, అన్నీ గుర్తు తెచ్చుకుని, నాకుగా నేను తలకెత్తుకున్న  ఈ బాధ్యతను పూర్తిచేయాలనేది నా సంకల్పం. అయితే,  గుర్తు చేసుకునే క్రమంలో కొన్ని విరామాలు, గుర్తుకువచ్చినవి వెంటవెంటనే రాసే ప్రయత్నంలో  కొన్ని కప్పగంతులు,  పాత ఫోటోల వేటలో కొంత కాలయాపనలు, తప్పనిసరి.  

 నాకున్నది ఒక్కటే రోగం. మతిమరపు. మెదడు మొత్తం ఖాళీ కాకముందే ఇది పూర్తిచేసి తీరాలి. 


(ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే)

        

11-11-2024  (కార్తీక సోమవారం)

10, నవంబర్ 2024, ఆదివారం

ప్రభుత్వ ధనం



మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు ఖమ్మం జిల్లాలో జిల్లా పౌర సంబంధ శాఖ అధికారిగా పనిచేస్తున్న రోజుల్లో అప్పటి రెవెన్యూ బోర్డు సభ్యుడు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు. రెవెన్యూ బోర్డు సభ్యుడు అందులోను మొదటి సభ్యుడు అంటే చీఫ్  సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన ఆఫీసరు. ఆ రోజుల్లో ఉన్నతాధికారులు కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే అనంత రామన్ హైదరాబాదు నుంచి రైల్లో ఖమ్మం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ ఆయన్ని రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి గృహం హిల్  బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు అధికారిక సమావేశాలు, సమీక్షలు ముగించుకున్న తర్వాత అనంత రామన్ గారు గుట్ట మీద నరసింహ స్వామి గుడి చూడాలని వుందని కోరిక వెలిబుచ్చారు. ఆ గుడికి తీసుకువెళ్ళి దర్శనం చేయించే బాధ్యతను మా అన్నగారికి ఒప్పగించారు. కలెక్టరు గారి జీపులో అనంత రామన్ గారు, తన వ్యానులో మా అన్నయ్య గుడికి వెళ్లి పూజలు అవీ ముగించుకుని వచ్చారు.  హైదరాబాదు రైలెక్కేముందు అనంత రామన్ గారు కలెక్టర్ గారి చేతిలో కొన్ని నోట్లు పెట్టి చెప్పారు.
‘మీరు జీపు ఇచ్చి నన్ను గుడికి  పంపారు, సంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం. కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయించండి’.
అది విని మా అన్నయ్య కూడా ‘నేను కూడా గుడికి వ్యానులోనే వెళ్లాను. కాబట్టి నా తరపున కూడా డబ్బు ట్రెజరీలో వేయండి’ అని కలెక్టర్ గారితో చెప్పారు. 
ప్రభుత్వ ధనం అంటే పాముగా పరిగణించే రోజులవి. 
మా అన్నయ్య తరవాత అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పీఆర్వో గా పనిచేసారు. సమాచార శాఖ డైరెక్టర్ అయ్యారు. ఫిలిం డెవలప్మెంటు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా  పనిచేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేసి శేష జీవితాన్ని పుట్టపర్తిలో గడపడానికి వెళ్లి అక్కడే ఆకస్మికంగా గుండెపోటుకు గురయి సునాయాస మరణం పొందారు.  
(మా రెండో అన్నయ్య రామచంద్రరావుగారు  చెప్పిన విశేషాలు ఆధారంగా)

8, నవంబర్ 2024, శుక్రవారం

తీరని సందేహం



 ఓరోజు,  ఊబెర్ అద్దె వాహనంలో ప్రయాణించాను. అతడికి బిల్లు చెల్లించాను. తరువాత ఊబెర్ కంపెనీ నుంచి నాకు వచ్చిన మెయిల్ లో ఇలా వుంది:
Before Taxes 112.26
Service tax (4.2%) 4.71
Swachh Bharat Cess (0.15%) 0.17
Krishi Kalyan Cess (0.15%) 0.17
COLLECTED ₹ 117.31

అంటే ఏమిటన్నమాట. సర్వీసు టాక్స్ 4.2 శాతం , నాలుగు రూపాయల డెబ్బయి ఒక్క పైసలు, స్వచ్చ భారత్ సెస్సు 0.15 శాతం పదిహేడు పైసలు, క్రిషి కళ్యాణ్ సెస్సు 0.15 శాతం మరో పదిహేడు పైసలు చెల్లించినట్టు రసీదులో వుంది. నా దగ్గరనుంచి వసూలుచేసిన ఈ సొమ్ము క్షేమంగా సర్కారు ఖజానాకు చేరుతుందని ఆశించడం సగటు పౌరుడిగా నా ఆకాంక్ష.  ఇలా ప్రతి రోజూ, ప్రతి పౌరుడు తాను పెడుతున్న ప్రతి ఖర్చులో సర్కారుకు చెల్లించే పన్ను, సెస్సు వివరాలు ఎప్పటికప్పుడు ఇలా తెలియచేస్తూ సర్కారు ఖజానాలో మనకో ఖాతా తెరిచి అందులో నమోదు చేస్తుంటే కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. ఎందుకంటే ఈదేశంలో ప్రతి ఒక్కరూ అనుమానం ముందు పుట్టి తరువాత వాళ్ళు పుడతారు. ఇంతకీ ఈ సొమ్ము( అక్షరాలా అయిదు రూపాయల అయిదు పైసలు) ఖజానాలో జమ అయినట్టేనా!
ఇది జరిగి ఎనిమిదేళ్లుఅయింది. మెయిల్స్ డిలీట్ చేస్తుంటే కంటపడింది. ఇన్నేళ్లలో ఉబెర్ రేట్లు పెరిగాయి. అలాగే టాక్సులు కూడా. మరి దేశంలో ప్రతి ఒక్కరి నుంచి ప్రతి లావాదేవీ మీద మనం చెల్లిస్తున్న పన్నులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయా? లేక మన నుంచి వసూలు చేసిన పన్ను మొత్తాలను ఆయా వ్యాపార సంస్థలు ఖజానాకు దఖలు పరుస్తున్నాయా? లేదా?
ఈ అనుమానాన్ని ఓ కేంద్ర ప్రభుత్వ పన్నుల అధికారి వద్ద వ్యక్తం చేశాను.
‘మనం దుకాణానికి వెళ్లి ఏదో వస్తువు కొని బ్యాంకు కార్డు మీద చెల్లింపు చేస్తాం. వెంటనే అంత మొత్తం మన బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయినట్టు మన ఫోనుకు మెసేజ్ వస్తుంది. హోటల్ కు పోయి తిన్నదానికి బిల్లు కడతాము. మనం కట్టిన పన్ను వివరాలు ఆ బిల్లులో వుంటాయి. కానీ ఆ పన్ను సరాసరి ప్రభుత్వ ఖజానాకు  చేరిందా లేదా, అసలు చేరుతుందా లేదా   అనే అనుమానం పీకుతూనే వుంటుంది. హోటల్ కు మనం పన్నుల రూపేణా చెల్లించిన డబ్బు హోటల్ బ్యాంకు ఖాతా నుంచి ఎకాఎకి  ఖజానాకు చేర్చే వెసులుబాటు సాంకేతికంగా కల్పిస్తే బాగుంటుంది కదా!  అలాగే మనం చెల్లించిన పన్నులు ప్రభుత్వ ఖజానాకు జమ అయినట్టు ఓ మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తే ఇలాంటి సందేహాలు రావు కదా! ‘
అంతా విని ఆయన ఇలా జవాబు ఇచ్చాడు.
‘మీరు చెప్పేది నిజమే. కానీ దేశంలో ప్రతి రోజు ప్రతి క్షణం, ప్రతి   నిమిషం, లక్షల కోట్ల విలువైన  లావాదేవీలు కోట్ల సంఖ్యలో జరుగుతుంటాయి. అంత భారాన్ని నిభాయించగల భారీ సర్వర్లు ఏర్పాటు చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వున్నాయి’.
ఈ జవాబు విన్న తర్వాత
ఇక నా దగ్గర ప్రశ్నలు ఏముంటాయి?  లేవు.
కానీ అనుమానం మాత్రం అలానే వుండిపోయింది.

4, నవంబర్ 2024, సోమవారం

కాన్పుకయినా, కాటికయినా...



అమెరికాలో వుంటున్న ఫేస్ బుక్ మిత్రులు శ్రీనివాస్ సత్తిరాజు గారు, తమ అత్తగారి మరణం గురించి రాస్తూ, ఆమె పిల్లలు తల్లి చనిపోవడానికి ఆరేళ్ల ముందే అంత్యక్రియల కోసం అడ్వాన్సు గా పన్నెండు వేల డాలర్లు సంబంధిత సంస్థకు చెల్లించి వుంచారని, అదే ఇప్పుడయితే ఇరవై వేలు అయ్యేదని రాసుకొచ్చారు. ఇది చదివిన తర్వాత 
నా చిన్నతనం జ్ఞాపకం వచ్చింది.
 

మా బామ్మ దిండు కింద ఓ రోజు చిన్న మూట కనబడింది. అందులో ఏముంది?
తెలుసుకోవాలని ఆత్రుత. 
ఒకరోజు ఆమెనే  అడిగేశాను ‘ఈ ముల్లెలో ఏముంది బామ్మా’ అని.
‘దానిమీదపడ్డాయి ఏమిట్రా నీ కళ్ళు. అందులో ఏముందిరా అప్పుడప్పుడూ పోగేసుకున్న నాలుగు రాళ్ళుతప్ప’
‘రాళ్ళా! రాళ్ళను దిండు కింద ఎందుకు  పెట్టుకున్నట్టు’
నా మనసులో మాట కనుక్కున్నట్టు౦ది. 
‘రాళ్లంటే గులక రాళ్ళు కాదురా సన్నాసీ. డబ్బులు’
‘డబ్బులా నీకెందుకు? సినిమాకు పోతావా షికార్లు పోతావా. చాక్లెట్లు బిస్కెట్లు నీకక్కరలేదు కదా!’
‘ఇవి  వాటికి కాదు లేరా! కాటికి పోవడానికి’
‘కాటికా! అంటే ఏదైనా గుడా”
‘గుడిలాంటిదే. చివరికి ఎవరైనా ఆ గుడికి వెళ్ళాల్సిందే’
‘గుడికి ఇన్ని డబ్బులెందుకే’
‘నీకెలాచెబితే అర్ధం అవుతుందిరా ఈ వయసులో. కాటికి పోవడం అంటే చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళే చోటు. బతికుండగా మనం ఎవరినైనా అడిగితే డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర వుంటే. అదే ఇంట్లో ఎవరైనా  చనిపోయిన తర్వాత అడిగితే, వాళ్ళ దగ్గర  వున్నా ఇవ్వరు.  దహన సంస్కారాలకు ఎవ్వరూ డబ్బు సర్దరు. అలా చేస్తే కీడు అని నమ్మకం. అందుకని ముందుగానే  ఈ ముల్లెలో ఆ డబ్బులు దాచుకున్నాను’
బామ్మ మాటలు అప్పుడు అర్ధం కాలేదు.
ఇప్పుడు అర్ధం బోధపడింది. కానీ బామ్మ ఆరోజుల్లో  ముల్లెలో దాచుకున్న డబ్బులు ఈరోజుల్లో ఆ కార్యక్రమాలకు ఏ మూలకూ సరిపోవు అని కూడా అర్ధం అయింది. 
ఇప్పుడు పుట్టినా, గిట్టినా అన్నీ లక్షల్లోనే.

3, నవంబర్ 2024, ఆదివారం

ప్రతిఫలాపేక్ష లేని పనివారు

ఆడవాళ్ళ శ్రమకు ఖరీదు కట్టే షరాబు వున్నాడా! - భండారు శ్రీనివాసరావు 
(నవంబరు 3, జాతీయ గృహిణుల దినోత్సవం)
 
దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో అత్యధికంగా పనిచేసేవారు వున్నది ఇళ్ళల్లో, అదీ ఆడవాళ్ళు. నిజానికి ఆడవారివి దశావతారాలు. పని మనుషులు, వంటమనుషులు, పిల్లల్ని కనిపెట్టి చూసే ఆయాలు అన్నీ ఆడవాళ్లే. ఆడవారి శ్రమ కారణంగా మొత్తం ప్రపంచానికి సమకూరుతున్న సంపద వేల లక్షల కోట్లల్లో వుంటుంది. కానీ వారి శ్రమకు ప్రతిఫలం ఎక్కడ! ఏమాత్రం దక్కుతోంది!!

https://www.facebook.com/share/v/1EwCpPS6gH/

29, అక్టోబర్ 2024, మంగళవారం

ఆరు ఆటంబాంబులతో కాపురం

ఆరు ఆటంబాంబులతో కాపురం – భండారు శ్రీనివాసరావు 

1975 లో హైదరాబాదుకు వచ్చినప్పుడు కొత్త కాపురం ఇబ్బందులు  ఎలా ఉంటాయో ఏమిటో తెలియకుండా, అశోక్ నగర్ చమన్ దగ్గర  మా రెండో  అన్నయ్య రామచంద్రరావు గారింట్లో కొన్నాళ్ళు హాయిగా కాలక్షేపం చేశాము. తర్వాత వాళ్ళ పక్కనే ఉన్న  ఇంట్లో చిన్న వాటా దొరికితే అక్కడకు మారాము. ఇల్లుగలవాళ్ళు ఆ ఇంటిని ఎవరికో అమ్మివేయడంతో వాళ్ళకీ, మాకూ ఆ ఇంటితో రుణం తీరిపోయింది. మళ్ళీ ఇల్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి. సరే! ఎక్కువ వెతుకులాట, ప్రయాస లేకుండానే చిక్కడపల్లి త్యాగరాయ గానసభ సమీపంలో ఒక పోర్షన్ దొరికింది. మాస్కో వెళ్ళే దాకా అక్కడే మా ఆల్ మకాం.  ఆ ఇంటి వాస్తు మహిమ ఏమోకానీ ఎప్పుడూ నలుగురు వచ్చేపోయేవాళ్ళతో కళకళలాడుతూ వుండేది. పగలల్లా మా ఆవిడ నడిపే అమ్మవొడి, సాయంత్రం అయ్యేసరికి రచయితలు, కవులు, ఉన్నతాధికారులతో కూడిన  ఆస్థానంగా మారిపోయేది. ఆఫీసునుంచి నా రాకతో నిమిత్తం లేకుండా జనం జమ అయ్యేవారు. వాళ్లకు, కాఫీలు, ఉప్మాలు, కొండొకచో అర్ధరాత్రి భోజనాలతో మా ఆవిడ నిర్మల అన్నీ అమర్చిపెట్టేది. ఇవన్నీ చూసి రేడియోలో నా సహచరులు, న్యూస్ రీడర్,  ప్రముఖ రచయిత డి. వెంకట్రామయ్య గారు, “వండ నలయదు వేవురు వచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌ నతనిగృహిణి” అనేవారు, మనుచరిత్రలో అల్లసాని పెద్దన గారి పద్యాన్ని ఉటంకిస్తూ. అనడమే కాదు తన జీవిత చరిత్ర గ్రంథంలో  పేర్కొన్నారు కూడా.  
ఇదలా ఉంచుదాం. 
‘పొయ్యి పైనా, పొయ్యి లోపలా’ వున్నవాడే కలవాడు అనేది మా బామ్మగారు. అంటే నలుగురికి సమృద్ధిగా  వండి పెట్టే సరుకులు, పొయ్యి వెలిగించడానికి ఎండు కట్టెలు ఎల్లప్పుడూ ఇంట్లో వుండాలి అనేది ఆవిడగారి మన్ కి బాత్.
ఆ రోజుల్లో లాగా కట్టెల బాధ ఇప్పుడు లేదు. వచ్చిన బాధల్లా  గ్యాస్  సిలిండర్ ఖాళీ అయితేనే. సింగిల్ సిలిండర్ సిస్టం కావడం వల్ల గ్యాస్ అయిపోతే ప్రత్యామ్నాయం వుండేది కాదు. ఆ కాలంలో సామాన్య గృహస్తుకు డబ్బుతో పాటు బాగా కటకటగా ఉండేవి  మరో మూడు. కరెంటు, నల్లా నీళ్ళు, గ్యాస్ సిలిండరు.    
ఇంట్లో నిత్యం జరిగే సంతర్పణలు, సమారాధనలు, సంభారాల భారంతో  నిమిత్తం పెట్టుకోకుండా అవన్నీ అంతా మా ఆవిడ భుజాల మీదకు వదిలేసి, కొరతలుగా ఉన్న ఈ మూడింటి సంగతి చూడడానికి, అధికార దుర్వినియోగం ఆనండి, ఏదైనా అనండి ఎంతదూరం అయినా వెళ్ళేవాడిని. నీళ్ళు రాని రోజున ఏకంగా మంచినీళ్ళ మంత్రి, ఆయన్ని అలానే పిలిచేవాడిని,  మునిసిపల్ శాఖ మంత్రి, బండారు సత్యనారాయణ మూర్తిగారికి పొద్దున్నే ఫోన్ కొట్టేవాడిని. ఆయన విసుక్కోకుండా ‘ట్యాంకర్ కావాలి కదా పంపిస్తాను అనేవారు. అన్నట్టే అరగంటలో మంచి నీళ్ళ ట్యాంకర్ వచ్చి సంపులో  నీళ్ళు నింపి పోయేది మా  ఇరుగు పొరుగుకు కూడా సరిపోయేలా.   
అలాగే కరెంటు. పోవడం ఆలస్యం, విద్యుత్ బోర్డుచైర్మన్ నార్ల తాతారావు గారికి ఫోన్. ఆయన నా బాధ పడలేక మా ఇంటి దగ్గరలోనే ఓ ట్రాన్స్ ఫార్మర్ వేయించారు.
పొతే మూడోది మరీ ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్. ఖాళీ అయిందని మా ఆవిడ ఫోన్ చేసి చెప్పడం ఆలస్యం అన్ని పనులు వదిలిపెట్టి ఆ పనిమీదనే  కూర్చొనే వాడిని.        
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో తెలిసిన జనరల్ మేనేజర్లకు ఫోన్ చేసేవాడిని. అరగంటలో సిలిండర్ డెలివరీ అయిన సంగతి తెలిసిన  తర్వాతనే ఆఫీసు పనయినా  ఏదైనా. నా బాధ ప్రపంచం బాధ అన్నట్టు సాగేది నా వ్యవహారం. అదేమిటో ఆ రోజుల్లో ఒక సిలిండర్ ఇరవై రోజులు కూడా వచ్చేది  కాదు. ఇప్పుడు రెండు నెలలు వస్తోంది. ఈ ఖర్చులు అయితే తగ్గాయి. కానీ మరో రూపంలో పెరిగాయి. పక్షి పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరి పోయిన తర్వాత గూడు విశాలమైనట్టు ఇప్పుడు  ఇళ్లు కూడా ఖాళీగా, విశాలంగా  కనిపిస్తున్నాయి.
ఆ తర్వాత అయిదేళ్లు ఇలాంటి ఏ కొరతలు లేని సోవియట్ యూనియన్ లో కాలుమీద కాలేసుకుని దర్జాగా బతికాము. దేనికీ కొరతలేదు, చివరాఖరుకి డబ్బుకు కూడా. పైగా పైపు గ్యాసు, కరెంటు, ఫోను, మూడు పడక గదుల ఇల్లు ఉచితం. దాంతో వారానికి రెండు మార్లు, వారాంతపు రోజుల్లో  మాస్కోలోని తెలుగు విద్యార్ధులతో, తెలుగు కుటుంబాలతో  మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చ తోరణం.
ఇక అయిదేళ్ళ ప్రవాస జీవితం తర్వాత తిరిగి వస్తే, హైదరాబాదు ఎయిర్ పోర్టులోనే నాటి కమ్యూనికేషన్ల మంత్రి రంగయ్య నాయుడు గారు కలిసి ఫోన్ లేకపోతె ఎల్లా అంటూ ఆయనే చొరవ తీసుకుని  ఫోన్  కనెక్షన్  మంజూరు చేశారు. డిపార్ట్ మెంటు వాళ్ళు మర్నాడు  ఫోను, లాంగ్ కార్డు పట్టుకుని రేడియో స్టేషన్ కు వచ్చారు, ఇల్లెక్కడ అడ్రసు చెప్పండని అంటూ. అప్పటికి రెంటుకు ఇల్లే దొరకలేదు. మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారింట్లో ఉంటున్నాము. 
ఆకస్మికంగా వచ్చి పడ్డ ఫోన్ కోసం ఇంటి వేట ముమ్మరం చేశాము. చివరికి పంజాగుట్టలోని మా అన్నయ్య ఇంటికి దగ్గరలోనే దుర్గానగర్ కాలనీలో ఓ ఇల్లు దొరికింది. ఇంట్లో ఏ సామాను లేదు కానీ ఫోను మాత్రం మాతో పాటే కుడి కాలు ఇంట్లో పెట్టింది. అంత తొందరగా కనెక్షన్ ఎలా వచ్చిందని ఇరుగుపొరుగు ఆరాలు. ఓడలో మాస్కో సామాను చెన్నై మీదుగా రోడ్డు మార్గంలో హైదరాబాద్ వచ్చేలోగా  దగ్గరలో ఉన్న మరో పెద్ద ఇంటికి మారాము. అద్దె రెండు వేలు. లంకంత కొంప. ఇంటివాళ్ళు ముస్లిమ్స్. ఎక్కడో ఏదో దేశంలో వుంటారు. ఆ ఇల్లు కట్టిన తాపీ మేస్త్రీకి  చిన్న చిన్న గదులు కట్టడం తెలియదల్లె వుంది. అన్నీపెద్ద పెద్ద  హాల్సే. ఇల్లంతా కట్టిన తర్వాత చూసుకుంటే వంటిల్లు కనబడనట్టుంది. ఏదో చిన్న జాగా చూసి వంట గది అనిపించాడు. ఆ ఇంట్లో మా మాస్కో సామాను భేషుగ్గా సరిపోయింది కానీ సిలిండర్లకు ఆ చిన్న కిచెన్ లో  జాగా దొరకలేదు. దాంతో వున్న ఆరు సిలిండర్లలో  ఒకటి స్టవ్ కు బిగించి, మిగిలిన అయిదింటినీ బయట హాల్లో దసరా బొమ్మల కొలువులా వరసగా పెట్టేవాళ్ళం.
ఆరు సిలిండర్లు కధ ఏమిటంటారా! 
నేను మాస్కోనుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే అప్పటి పెట్రోలియం మంత్రి చింతా మోహన్ గారు ఓ రెండు,  ఎంపీలు డాక్టర్ మల్లు రవి, రాయపాటి సాంబశివరావు గార్లు చెరి రెండు సిలిండర్లు నోరు తెరిచి అడగకుండానే తమ కోటాలో ఇప్పించారు. దాంతో ఆరు సిలిండర్లు గృహ ప్రవేశం చేసాయి. నట్టింట్లో బాంబులు పెట్టుకుని శ్రీనివాసరావు మళ్ళీ కొత్త కాపురం మొదలు పెట్టాడని ఫ్రెండ్స్ సరదాగా అనేవారు. అయితే మా ఆవిడ పబ్లిక్ రిలేషన్స్ కు అవి బాగా ఉపయోగపడ్డాయి. ఎవరికి ఎప్పుడు సిలిండర్ అవసరమైనా వాళ్ళు గ్యాస్ కంపెనీకి కాకుండా మా ఆవిడకు  ఫోన్ చేసేవాళ్ళు. అలా కొన్నాల్టికి ఎవరికి ఇచ్చామో తెలియని పరిస్థితుల్లో చివరికి మా ఇంట్లో అయిదే మిగిలాయి. 
ఈలోగా రూల్స్ మారి ఒక పేరు మీద ఒకే కనెక్షన్ అన్నారు. శాపవిమోచనం అయిన గంధర్వుల మాదిరిగా ఓ మూడు సిలిండర్లు  రెక్కలు కట్టుకుని తమ దేవలోకానికి తరలి పోయాయి. ఆచూకీ దొరక్కుండా పోయిన సిలిండర్ల డిపాజిట్ డబ్బు మా చేత కట్టించుకున్నారు.
 అలా ఆరు సిలిండర్ల కధ కంచికి చేరింది.
ఇక ఇప్పుడు దేనికీ కొరత లేదు, ఒక్క మా ఆవిడ లేదనే చింత తప్ప. అనుభవించే దశలో దాటిపోయింది

Photo courtesy: My journalist friend G.S.Radha Krishna

28, అక్టోబర్ 2024, సోమవారం

నడిచి వచ్చిన దారి – భండారు శ్రీనివాసరావు


ఇక్కడి నా మిత్రులలో అన్ని వయసులవాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది కొంచెం అటూఇటూగా నా ఈడువాళ్ళే. నా తరం వాళ్ళే. కాబట్టి మా పెంపకాల్లో, జీవన విధానాల్లో కొంచెం పోలికలు కనిపిస్తాయి. మొదటి మెట్టు మీద కాలు మోపిన దగ్గరినుంచి పడిన కష్టాలు, ఇబ్బందులు ఇప్పుడు పై మెట్టు మీద నిలబడి చూసుకుంటూ వుంటే చాలా వింతగా వుంటుంది. నడిచి వచ్చినదారి ఇలాంటిదా అని ఆశ్చర్యం వేస్తుంది. 

తెలంగాణా సీ ఎం  కేసీఆ ర్ వద్ద సీ పీ ఆర్వో గా పనిచేసిన    వనం జ్వాలా నరసింహారావు, మా అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు (స్టేట్ బ్యాంక్  చీఫ్ జనరల్ మేనేజర్, రిటైర్డ్)  నేను కొద్ది సంవత్సరాల తేడాతో హైదరాబాదులో కాపురాలు పెట్టాము. ఈ విషయంలో జ్వాలా సీనియర్. ఆయన భార్య అయిన మా మేనకోడలు విజయలక్ష్మి, మా వదిన గారు విమల, మా ఆవిడ నిర్మల కలిసి చిక్కడపల్లిని కాలినడకన చుట్టబెట్టేవారు. మా అన్నయ్య అప్పటికే స్టేట్ బ్యాంకులో రీజినల్ మేనేజర్. . ఉద్యోగ రీత్యా ఎన్నో వ్యాపార సంస్థలకు రుణాలు ఇచ్చి వుంటారు.  కానీ ఆయన అశోక్ నగర్ లో తన ఇంటికి దగ్గరలో వున్న కిరాణా దుకాణంలో రెండు వందలు ఖాతా పెట్టాల్సి వస్తే, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెబితే ఇస్తాను అన్నాడు ఆ దుకాణదారు. చివరికి  అదే ఏరియాలో ఉంటున్న  మా  పెద్ద  మేనకోడలు కూతురు చిన్నపాప   సిఫార్స్ మీద ఆ రెండు వందలు అప్పు పుట్టిందట.

మా మేనకోడలు , మా వదిన గారు అశోక్ నగర్ నుంచి నడుచుకుంటూ త్యాగరాయ గానసభ దగ్గర వున్న మా ఇంటి (అమ్మవొడి)కి వచ్చి మా ఆవిడను తీసుకుని సరుకులు కొనడానికి చిక్కడపల్లి మెయిన్ రోడ్డుకు వెళ్ళేవాళ్ళు. 

ఎండ బాగా వుంటే ముగ్గురూ కలిసి ఒక రిక్షా మాట్లాడుకుని మధ్యలో మా ఆవిడను దింపేసి వాళ్ళిద్దరూ అశోక్ నగర్ వెళ్ళేవాళ్ళు. 

లక్ష్మీ షో రూములో వాయిదాల మీద చీరెలు కొనుక్కునే వాళ్ళు.

ఆ రోజుల్లో లోటస్ స్టీల్ షాపులో నెలకు పది రూపాయలు చొప్పున పది నెలలు కడితే నెలకోసారి లాటరీ తీసి వంద రూపాయల స్టీలు వస్తువు ఇచ్చేవాడు. ప్రతినెలా ఆ షాపు దగ్గరికి పోవడం, బోర్డు మీద చాక్ పీసుతో రాసిన విజేతల జాబితాలో తమ నెంబరు లేకపోవడం, ఉసూరుమంటూ తిరిగివస్తూ సుధా హోటల్లో టు బై త్రీ కాఫీ తాగడం నెలనెలా ఓ తంతుగా మారింది.

ఇంట్లో అందరి పేరు మీద కట్టినా, లాటరీ ఎప్పుడూ తగలకపోవడంతో, మా వదిన గారు ఓ నెల, మా రెండో పిల్లవాడు సంతోష్ పేరు మీద కడితే మూడో నెలలోనే లాటరీ తగిలిందట. వంద రూపాయల వస్తువు తీసుకుంటూ, మా వాడికి కూడా, పాలు పట్టడానికి ఓ స్టీలు గ్లాసు కొనిచ్చింది. 

ఆ రోజుల్లో ఇలా ఇబ్బందులు అందరికీ ఉండేవి కానీ, అవి ఇబ్బందులుగా అనిపించక పోవడానికి కారణం అందరూ ఒకే బోటులో ప్రయాణీకులు కావడమేమో మరి!

న్యూ ఇయర్ గిఫ్ట్ ల కింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.

అలా 1973 లో మార్చి నెల 31 వ తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా ఇది. (అంటే   యాభయ్ ఏళ్ళ కిందటి మాట అన్నమాట)

నూనె : Rs.3-25

నెయ్యి: Rs. 2-75

పెరుగు: Rs.0-20

టమాటాలు: Rs. 0.55

అగ్గిపెట్టె: Rs. 0.10

సబ్బు: Rs.1-00

రిక్షా: Rs. 0-50

వక్కపొడి పొట్లం: Rs. 0-10


(NOTE: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా ఐ నో సీ ఎం - ఐ నో పీఎం బాపతు)