9, ఫిబ్రవరి 2023, గురువారం

ఏమండీ నేను గుడికి వెళ్లి రానా!’

(కూడా రావడానికి మీకేమైనా  వీలవుతుందా అనేది అందులో అంతరార్ధం)

మా ఇంటికీ, హనుమంతుడి గుడికి మధ్య ప్రహరీ గోడే అడ్డు.  వెళ్ళిరావడం పది నిమిషాల పని.

‘నువ్వు వెళ్ళు. టీవీ వాళ్ళ కారు కూడా వచ్చింది, ఆగమని చెప్పడం బాగుండదు’  అనేవాడిని, ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ. 

కారులో వెడుతుంటే గుర్తుకు వచ్చేది, ఈరోజు మా ఆవిడ పుట్టినరోజు అని. 

గుడికి రమ్మంది ఇందుకా  అని  నా మట్టి బుర్రకు అప్పుడు అర్ధం అయ్యేది. కానీ ఏం లాభం?

ఇప్పుడు బోలెడు  తీరిక. టీవీ చర్చల్ని నాకు నేనుగానే వదులుకున్నాను. 

కానీ, ఇప్పుడు  ఎన్ని గుళ్ళు తిరిగితే, మనసులో పేరుకుపోయిన ఈ క్షోభ సమసిపోవాలి.

దేవుడ్ని నమ్ముకుంది కనుకే, తను ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా హాయిగా మాట్లాడుతూ మాట్లాడుతూ  దాటిపోయింది.

ముందు ముందు ఎన్ని ఇబ్బందులు పడాలో, ఎంతమందిని ఇబ్బంది పెట్టాలో! ఆ దేవుడు ఏమని నొసట  రాసిపెట్టాడో ఎవరికి తెలుసు.

తెలిసిందల్లా, ఈరోజు ఫిబ్రవరి తొమ్మిది, మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు.

ఇప్పుడు అన్నీ బాగానే జ్ఞాపకం ఉంటున్నాయి, అదేమిటో మరి.



(09-02-2023)

8, ఫిబ్రవరి 2023, బుధవారం

వార్తల ధృవీకరణ అనేది విశ్వసనీయతకు గీటురాయి – భండారు శ్రీనివాసరావు


వార్త ఒక్కటే. ఒక్కో టీవీలో ఒక్కోరకం స్క్రోలింగ్.

ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. వార్త ఇచ్చేముందు నిర్ధారణ చేసుకోవడం అనేది ప్రాధమిక సూత్రం. అలాటి అవకాశాలు ఈనాటి పాత్రికేయులకు లేవనుకోవాలా?
చాలా ఏళ్ళ క్రితం సంగతి. ఏదో కేసు విషయంలో హైకోర్టు జడ్జి పలానా తీర్పు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ భోగట్టా. ఇలాటి అంశాలను నిర్ధారించుకోకుండా రేడియో వార్తల్లో చెప్పే వీలు లేదు. సాయంత్రం వార్తల ప్రసార సమయం దగ్గర పడుతోంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడన్నీ ల్యాండ్ లైన్లు. ఫోన్ చేస్తే, జడ్జి గారు బంగ్లా లాన్ లో కూర్చుని టీ తాగుతున్నారని సమాచారం. ఫోను తీసుకుని వెళ్లి ఇవ్వడం కుదురుతుందా అని అనుమానంగానే అడిగాను. ఏ కళన ఉన్నాడో కాని బంట్రోతు ఫోను జడ్జి గారికి ఇచ్చాడు. ఫోన్లో మాటలు వినపడుతున్నాయి. ఎవరది అని జడ్జి గారు అడుగుతున్నారు. రేడియో నుంచి అనగానే లైన్లోకి వచ్చారు. నేను తీర్పు విషయం అడగగానే ఆయన కొంత అసహనానికి గురయ్యారు. అది సహజం కూడా. ‘ఒక న్యాయమూర్తిని ఇలా డిస్టర్బు చేయడం నేరమని తెలుసా’ అంటున్నారు. నేనన్నాను. ‘తెలియదు. కానీ ఇటువంటి వార్తను నిర్ధారించుకోకుండా ప్రసారం చేయడం మాత్రం నేరం’. ఈ జవాబుతో ఆయన మెత్తపడి నేను కోరిన వివరణ ఇచ్చారు. అది వార్తా సంస్థ ఇచ్చిన సమాచారానికి అనుగుణంగానే వుంది. అయినా కొన్ని సంచలన నిర్ణయాలను ప్రసారం చేసేముందు నిజాన్ని నిర్దారించుకోవడం నా విధి. అది నేను పాటించాను. తప్పిస్తే ఆ వార్తాసంస్థ నిబద్ధతను అనుమానించడానికో, మరో దానికో మాత్రం కాదు.
ఇలా ఉండేవి ఆ రోజులు. నిజంగా ఆ రోజులే వేరు.
రేడియోలో మేమే నయం. పొరబాటు జరిగినట్టు గుర్తించగానే వెంటనే 'క్షమించాలి' అంటాము.
ఇప్పుడు ట్వీట్ చేయడం, ఎవరైనా తప్పు పడితే సింపుల్ గా దాన్ని తొలగించి చేతులు దులుపుకోవడం, ఇదీ వరస!

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

శివైక్యం చెందిన కాశీనాధుని విశ్వనాధ్

1979వ సంవత్సరం లో ఒక రోజు.

మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్ వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు) సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, నాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.


ఆశ్చర్యంగా రెండో వారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.

కొన్ని రోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయనగారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.

ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!


కట్ చేస్తే.....

 మళ్ళీ 2017లో...

‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకా  రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ గారు మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.


శంకరాభరణం గురించి కూడా చెప్పారు.

“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మ ధన్యం అవడం అంటే ఇదే కాబోలు”


చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.



సీన్  కట్ చేసి  కొంత వెనక్కి వెడితే....

1987- 92 మధ్య రేడియో మాస్కోలో పనిచేసిన కాలం నాటి జ్ఞాపకం. ఊలిచ్చవావిలోవాలోని మాస్కో రేడియో భవనంలో నివాసం వుండేవాళ్ళం. మా ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.

సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టిక్కెట్స్ కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా, అది మన శంకరాభరణం సినిమా. 


పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమాలో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల, సోమయాజులు గారే కాకుండా, ఆ సినిమాలో నటించిన తదితర నటీనటులు అచ్చు రష్యన్ భాషలో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది. 

సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను. ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు


(Published in Andhraprabha on 05-02-2023, SUNDAY)



1, ఫిబ్రవరి 2023, బుధవారం

ఈ దొంగ కన్ను దొంగలకోసం కాదు, పిల్లలకోసం

 కరోనా పుణ్యమా అని కార్పొరేట్ ఆఫీసుల్లో మూడేళ్ళుగా వర్క్ ఫ్రం హోం పేరుతొ పసిపిల్లల తల్లులు అయిన మహిళా ఉద్యోగినులకు మంచి వెసులుబాటు లభించింది. అలాగే, ఇంట్లో చూసుకునే పెద్దలు లేక  తల్లీ తండ్రీ ఇద్దరూ ఆఫీసులకు పొతే, ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పిల్లలకు కూడా ఒంటరితనం నుంచి గత మూడేళ్ళుగా  విముక్తి లభించింది. ఏ సుఖమైనా కొన్నాళ్ళే కదా! నెమ్మదిగా వర్క్ ఫ్రం హోం విధానం  గతంలోకి జారుకుంటోంది. ఆఫీసులకు రమ్మని పిలుపులు మొదలయ్యాయి.

మా పిల్లలు కూడా కార్పొరేట్ ఉద్యోగులే. రేపో మాపో ఆఫీసులకు వెళ్ళాల్సి వస్తుందని తెలుసు. అంచేత మా మనుమరాలిని కనిపెట్టి చూసుకోవడానికి ఇరవైనాలుగు గంటలు ఇంట్లోనే వుండే ఆయాని వెతికి పెట్టారు. ఓ నలభయ్ ఏళ్ళక్రితం మా ఆవిడ అమ్మవొడి పేరుతొ చిక్కడపల్లి లో నిర్వహించిన చైల్డ్ కేర్ సెంటర్ లో పాతిక ముప్పయిమంది పసివారి ఆలనా పాలనా ఇలాగే  చూసేది.

కొత్తతరం కదా! కొత్త ఆలోచనలు.

ఆఫీసు నుంచి కూడా జీవిక  బాగోగులు  ఓ కంట కనిపెట్టి చూడడానికి ఇంట్లో, ఇదిగో ఈ కింద ఫోటోలో కనిపిస్తున్న సీ సీ కెమెరాను అమర్చారు.  



1-2-2023

హరికధకు దక్కిన పద్మశ్రీ – భండారు శ్రీనివాసరావు

 

ఒకనాడు తెలుగు పల్లెపదాలను ఉర్రూతలూగించిన హరికధలు, కాలగమనంలో కాలదోషం పడుతున్న దుస్థితిని కళ్ళారా చూస్తూ వేదనపడుతున్న లక్షలాది అభిమానులను, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఒక పద్మశ్రీ పురస్కారం పరమానందభరితులను చేసింది. ఒక తరాన్ని ఉర్రూతలూగించిన, మరో తరానికి బాగా తెలిసిన,  నవతరానికి దూరంగా జరిగిపోతున్న తెలుగు సంస్కృతీ వైభవానికి ప్రతీక అయిన హరికధకు ఆ అయాచిత గౌరవం దక్కింది. పద్మ పురస్కారాల నిర్ణేతలు,  హరికధాగానాలతో తెలుగునాట జనాలను అలరిస్తూ వస్తున్న శ్రీ కోట సచ్చిదానందశాస్త్రిని ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసి, ఆ పురస్కారాలకే కొత్త సొగసులు అద్దింది. వారికి మనః పూర్వక అభినందనలు.

హరికధలు అంటే తెలిసీ తెలియని తరం కోసం ఈ సందర్భంగా కొన్ని విశేషాలు.

హరికధలు, ఒకానొక కాలంలో జనాలను కట్టిపడేసిన భక్తిరస ధునులు. ప్రజలను సమ్మోహితులను చేసిన శ్రవణానందకర ధ్వనులు. 

ఈ నాటి పిల్లలకు కాని ఇంకా చాలామంది పెద్ద వాళ్ళకు కాని హరికథ అనే ప్రసిద్ధ కళా రూపం వొకటి వుందని కూడా తెలియదేమో అనిపించే రోజుల్లో జీవిస్తున్నాము. ఎనభయ్యో దశకములో కూడా హరికథకు ఎంతో కొంత ప్రభావము వుండేది.

యాభయ్, అరవై దశకాల్లో అయితే హరికథ ఎంతో ఉచ్చ స్థితిలో వుండేది. దేవాలయాల ఉత్సవాలలో, వినాయక చవితి, దేవి నవరాత్రుళ్ళు, శ్రీరామ నవమి పందిళ్ళలో, పెద్ద స్థితిమంతుల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలలో హరికథా కాలక్షేపాలు ఉండేవి. మధ్య మధ్యలో వేసవికాలంలో కూడా గ్రామస్తులు అంతా కలసి రామాయణమో, మహా భారతమో సీరియల్ గా చెప్పించుకునేవారు. సాంస్కృతిక కార్యక్రమాలు నెలనెలా నిర్వహించే గాన సభల్లో కూడా ఏడాదికి వోసారి అయినా హరికకధ పెట్టించే వారు.

“హరికధ అనేది సర్వ కళాసమాహారం. హరికథ చెప్పే దాసు గారికి సాహిత్యం, సంగీతం క్షుణ్ణంగా వచ్చి తీరాలి. రామాయణ, భారత, భాగవతాదులు కరతలామలకంగా వుండాలి. కొద్దో గొప్పో నాట్యం తెలిసి వుండాలి. వీటన్నితో పాటు సమయస్పూర్తి, చతురత, రక్తి కట్టించే సామర్ధ్యం అవసరం. అభినయకళ తెలిసివుండడం కూడా ముఖ్యం. ఇన్ని వుంటేనే ఉంటేనే దాసుగారికి బంతిపూల దండలు దండిగా పడేది. హరి కథలు చెప్పే దాసుగారిని భాగవతార్ అని పిల్చేవారు. అమ్ముల విశ్వనాథ భాగవతార్ అలా. హరికథకి వయోలిన్, మృదంగం పక్క వాయిద్యాలు. దాసుగారు కుడిచేతిలో చిడతలు పట్టుకొని కీర్తనలు పాడేటప్పుడు తాళం వేస్తూ వుండేవారు. దాసు గారి ఆహార్యం పట్టు పంచె, పట్టు ఉత్తరీయం, నుదుట సింధూరం. కాళ్ళకు గజ్జెలు. మెడలో పూలదండ. అన్నట్టు దాసుగారు తనతో ఎప్పుడూ తీసుకు వెళ్ళేది శ్రుతి పెట్టె.

“కథా ప్రారంభంలో దాసుగారు పక్క వాయిద్యాల సమేతంగా వేదిక మీద కూర్చుని గణపతి ప్రార్ధనతో మొదలుపెట్టి, తాను ఏ కధ చెప్పదలచుకొన్నారన్నది సూచన ప్రాయంగా తెలియచేస్తూ రెండు మూడు కీర్తనలు పాడేవారు. తర్వాత లేచి నిలబడి, గజ్జెలు కళ్ళకు అద్దుకొని, వాటిని కాళ్ళకు కట్టుకొని, ‘శ్రీమద్రమారమణ గోవిందా’ అని తానంటూ, సభికులందరి చేతా గట్టిగా అనిపిస్తూ కథలోకి ఉపక్రమించే వారు. కీర్తనలు ఆలపించేటప్పుడు పక్క వాయిద్యాల సహకారం తీసుకొనేవారు. సందర్భోచితంగా నాట్యం చేస్తూ కథను రక్తి కట్టించే వారు. నిద్రలో జోగే శ్రోతలను మేలుకొలిపేందుకు మధ్యమధ్యలో గోవిందలు కొట్టించేవారు.

సినిమాల్లో  కూడా హరికథలు పెట్టేవారు. పది పదిహేను నిమషాలు ఉండేవి. విజయా వారి షాహుకారు సినిమా, హరికథ తోనే ప్రారంభం అవుతుంది. నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించిన కవితా వారి వాగ్దానం సినిమాలో రేలంగి హరిదాసుగా ఘంటసాల పాడిన సీతా కల్యాణం చాలా మంది ఇష్టపడే మరపు రాని హరికథ.

“హరికథ అంటే ఆది భట్ల నారాయణ దాసు గారి పేరే అందరికి గుర్తుకు వస్తుంది. విజయనగరం సంస్థానం ఆస్థాన విద్వాంసులు ఆయన. ఫిడేలు ద్వారం వెంకట స్వామి నాయుడు గారికి ముందు విజయనగరం సంగీత కళా శాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు కూడా. హరికధ చెప్పే ప్రతివారు మేము నారాయణదాసు గారి శిష్యులమనో లేదా ఆయన కథలు చెపుతున్నామనో చెప్పుకొనేవారు. ఇప్పటికి కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో నారాయణ దాసు గారి ఉత్సవాలు చేస్తూ వుంటారు.

కూచిభొట్ల కోటేశ్వర రావు అనే ఆయన బక్క పలచగా పొడుగ్గా వుండేవారు. భక్త పోతన హరికథ ఎంతో గొప్పగా చెప్పే వారు. లలిత సరస గాన కళానిధే అంటూ ప్రార్ధన చేసేవారు. లేచి నిల్చున్న వెంటనే వాసుదేవ అని కళ్యాణి రాగంలో త్యాగరాజ కీర్తన ఎంతో శ్రావ్యంగా పాడేవారు. సందర్భానికి తగ్గట్టుగా పిట్ట కథలు చెప్పేవారు. పోతన భాగవతాన్ని అమ్ముకోలేక ఎంత బాధ పడ్డాడో అందరికీ తెలిసిందే. పోతన గారిలాగే కూచిభొట్ల వారుకూడా తమకున్న అద్భుతమయిన హరికథా విద్యను అమ్ముకోలేదు. ఏమిస్తే అది పుచ్చుకొనే వారు. పెద్ద వారయినా పెద్ద మనసు వున్నవారు. ప్రాతఃస్మరణీయులు. అమ్ముల విశ్వనాధం గారు మరో గొప్ప విద్వాంసులు. చల్లపల్లి, అవని గడ్డ ప్రాంతం వారు. స్ఫురద్రూపి. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులు.మండలి బుద్ధప్రసాద్ గారు ప్రచురించిన దివిసీమ రత్నాలలో అమ్ముల విశ్వనాధం గారి గురించి చాలా వివరంగా వుంది. నారాయణదాసు గారి తర్వాత బహుశః శిలా విగ్రహం వేయించుకోగలిగిన గౌరవం పొందింది అమ్ముల వారే. శివధనుర్భంగం కథ చాలా గొప్పగా చెప్పేవారు. 

“సీరియల్ హరికథల గురించి కొంత చెప్పాలి. పొలం పనులు అయిపోయి అందరు తీరిగ్గా వున్నప్పుడు సీరియల్ హరికథలు పెట్టించుకునేవారు. గుళ్ళో కళ్యాణ మండపం వేదికగా రామాయణమో, భారతమో పూర్తిగా చెప్పించే వారు. రాత్రి ఏడు ఎనిమిది మధ్య ప్రారంభమయిన కథ పన్నెండు గంటల దాకా సాగేది. మధ్యలో హారతి పళ్ళెం పట్టే వారు. హరికధ వినడానికి వచ్చినవారు  హారతి పళ్ళెంలో తమకు తోచిన విధంగా అణా, అర్ధణా, బేడా, పావలా కాసులు వేసేవాళ్ళు. పళ్ళెం మధ్యలో చిన్న కుంది పెట్టి వొత్తి వెలిగించి దీపం పెట్టే వాళ్ళు. చీకట్లో కొంతమంది అణా వేసి పావలా కొట్టేసేవారని హాస్యంగా చెప్పుకునే వారు. చిల్లర లేక పోతే హారతి పళ్ళెం పట్టే వాడిని అడిగి తీసుకునే వెసులుబాటు వుండేది. ‘నా దగ్గర పావలా వుంది నేను వో అణా వెయ్యాలి మిగతాది ఇచ్చెయ్యి’ అని అడిగి తీసుకునే వారు.

వీరగంధం వెంకట సుబ్బారావు, రాజశేఖరుని లక్ష్మీపతి రావు, ర్యాలి రామచంద్ర రావు, కంచిభొట్ల వీర రాఘవయ్య, నౌడూరి విశ్వనాధ శాస్త్రి , కడలి వీరదాసు, ముదపాక మల్లేశ్వర రావు, ప్రగడ వీరభద్ర రావు, ముదునూరు శంకర్ రావు, ఎల్లమంద రావు, చోరగుడి పాండురంగరావు గార్లు హరికధలు చెప్పడంలో దిట్టలుగా పేరు తెచ్చుకున్నారు. ములుకోట్ల సదాశివ శాస్త్రి గారు అని తెనాలి అనుకొంటా. హైస్కూల్ లో తెలుగు మాష్టారుగా వుండే వారు. త్యాగరాజ చరిత్రను రామ భక్తి అంతా జోడించి చెప్పే వారు. పాతూరి మధుసూదన్ రావు గారు మొత్తం సంస్కృతంలోనే హరికథ చెప్పే వారు, సంసృతం రాని వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా. రేడియోలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, ఏ కధ అయినా అనర్ఘళంగా చెప్పేవారు. షెడ్యూల్ చేసిన ప్రోగ్రాం లేక పోతే ప్రయాగ వారి హరికథ వుండేది. గాంధీ, నెహ్రు, బోస్ చరిత్రలు కూడా ఆయన హరికధలుగా చెప్పే వారు.

“తర్వాత తరంలో అందరికీ తెలుసున్న వ్యక్తి కోట సచ్చిదానంద శాస్త్రి గారు. చాలా రమణీయంగా హాస్యోక్తులతో ఎన్ని గంటలు విన్నాఇంకా ఇంకా వినాలనిపించేలా చెప్పేవారు. 

“బుర్రా శివరామకృష్ణ శాస్త్రి కూడా మంచి కథకులు. ఆడవారిలో కూడా మంచి విద్వాంసులు వున్నారు. తెనాలి ఉమా చౌదరి భాగవతారిణి  కొన్నేళ్ళపాటు ఆంధ్రదేశంతో పాటు ఇతర రాష్ట్రాలోని తెలుగు వారికి సయితం అభిమాన పాత్రులయ్యారు. నగరాజకుమారి, వజ్రాల విజయశ్రీ , మంత్రిప్రగడ లలిత కుమారి చెప్పే హరికథలు అంటే జనం చెవి కోసుకొనేవారు. 

పోతే, మరో ప్రసిద్ధ హరికధా విద్వాంసులు బుద్ధవరపు కురంగేశ్వర రావు గారు. వీరి గురించిన ప్రస్తావన ‘నియోగి సర్వస్వం’ లో వున్నట్టు తెలియచేసారు. హరి కధలు చెప్పడంలో వీరు అందె వేసిన చేయి. అపర రామ దాసు అని పేరు. రామదాసు హరికధ చెబుతూ రామా రామా అంటూనే కైవల్యం చెందారట. ప్రసిద్ధ రచయిత శ్రీ నిడదవోలు వెంకటరావు గారు శ్రీ కురంగేశ్వర రావు గారి హరికధాగాన ప్రశస్తి గురించి తన రచనల్లో ప్రస్తావించారు. ఆయన తన అనుభవాన్ని ఇలా రాశారు. “ నేను వీరి కధను విని తన్మయత్వము చెందిన వారిలో ఒకడిని. కధ చెబుతూ భక్తి పారవశ్యములో తన్మయత్వములో అట్లే నిలిచెడివారు. అప్పుడు హారతి నొసగిన తరువాత తిరిగి కధ ప్రారంభించెడివారు.”

“రాజమండ్రి దగ్గర కపిలేశ్వరపురం జమీందార్ సత్యనారాయణరావు గారు సర్వారాయ హరికథ గురు కులం ప్రారంభించి, హరికధలపట్ల ఆసక్తివున్న వారికి అక్కడే వసతి కల్పించి రెండు మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేసారు. ఇప్పుడు హరికథ చెపుతున్నవారిలో చాలా మంది కపిలేశ్వరపురం గురుకులం విద్యార్ధులే - ఉమా మహేశ్వరితో సహా. ఉమా మహేశ్వరి చాలా చిన్నతనంలోనే సంసృతంలో హరికధ చెప్పి అందరిని మెప్పించారు. మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు కళా కృష్ణ గారిని వివాహం చేసుకొని ఈ దంపతులిద్దరూ వొకరు పేరిణి నాట్యం ద్వారా, మరొకరు హరికథ ద్వారా కళాసేవ చేస్తున్నారు.

ఆచార్య తూమాటి దోణప్ప గారు హరికధా సర్వస్వం అనే గ్రంధం రాశారు. తెలుగు యూనివర్సిటీ వారు తమ రజితోత్సవాల సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పుస్తకాల్లో ఇది కూడా వుంది. ఇంకా అవి వున్నాయో లేదో కూడా తెలియదు. హరికధను అభిమానించే వారంతా కొని దాచుకోవాల్సిన పుస్తకం.

“రేడియోలో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు గంట సేపు హరికథ వచ్చేది. రేడియో సంగీత సమ్మేళనం, నాటక సప్తాహంలాగా హరికథా సప్తాహం కూడా నిర్వహించే వాళ్ళు. హరిదాసులు అందరు వారి లెటర్ హెడ్స్ పైనా, కర పత్రాల పైనా ‘రేడియో ఆర్టిస్టు’ అని వేసుకొనే వారు. ఇప్పుడు కూడా హరికథలు ప్రసారం చేస్తున్నారో లేదో తెలియదు. చేస్తే చాలా సంతోషం. మానేస్తే అంత కంటే అన్యాయం మరోటి వుండదు. తోలుబొమ్మలాటలు పోయాయి. పౌరాణిక నాటకాలు మరచి పోతున్నారు. హరికథని అలా కానివ్వకూడదు. తమిళనాడులో ఇంకా హరికధ ఆదరణకు నోచుకుంటూనే వుందన్న సంగతి మరచిపోకూడదు.

“గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కధా గాన కళా పరిషద్ ఏర్పాటు చేసింది. సంగీత,సాహిత్య, నాటక అకాడమీల్లాగానే అది కూడా కాలగర్భంలో కలసిపోయింది. అలాగే బుర్రకధలు. ఎన్నికలప్పుడే ప్రచారాలకోసం గుర్తుకొచ్చే విధంగా క్రమంగా మాయమయిపోతున్నాయి . 

ఇదో విషాదం!



30, జనవరి 2023, సోమవారం

మీడియాకు దూరంగా .... భండారు శ్రీనివాసరావు

“నేను పత్రికలు, చదవను, టీవీ చర్చలు చూడను” అని ఓ మిత్రుడు వాట్స్ అప్ సందేశం పంపాడు. నిజానికి ఈ మాటను ఒకప్పుడు మన దేశానికి ప్రధాన మంత్రిగా స్వల్పకాలం పనిచేసిన చరణ్ సింగ్ ఎప్పుడో చెప్పారు. కాకపొతే అప్పటికి ఈ టీవీలు లేవు. అంచేత ఆయన ఇలా అన్నారు.
“నేను పేపర్లు చదవను, రేడియో వినను. అదే నా ఆరోగ్య రహస్యం”
సరే అదలా వుంచి మా వాట్సప్ మిత్రుడి గురించి చెప్పుకుందాం.
టీవీలు, చూడకపోవడానికి, పత్రికలు చదవక పోవడానికి ఆయన చెప్పిన కారణం విచిత్రంగా వుంది. తనకు వచ్చిన ఓ మెసేజ్ తననీ నిర్ణయానికి ప్రొద్బలపరచిందని చెప్పాడు. నిజానికి ఈ సందేశం ఇప్పటికే చాలా సార్లు చాలా మందికి చేరిపోయింది కూడా.
అదేమిటంటే, Nathan Zohner అనే పెద్దమనిషి, తనకు తెలిసిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఇతరుల అజ్ఞానాన్ని అవహేళన చేయడానికి ప్రయోగిస్తుంటాడు. ‘డైహైడ్రోజన్ మోనాక్సైడ్ (diyhydrogen monoxide) అనేది చాలా ప్రమాదకరం అని, దాన్ని తక్షణం నిషేధించాలని ఆయన చెబుతుంటాడు. తీరా చూస్తే diyhydrogen monoxide అంటే మామూలు నీళ్ళు (water). అదొక రసాయనిక నామం మాత్రమే. శాస్త్రవేత్తలు కూడా చాలా అరుదుగా వాడే పదం ఇది. అలాంటి శాస్త్రీయ పదాల పట్ల అవగాహన లేనివాళ్లు నిజమే, అది ప్రమాదకరం కాబోలు అనుకుంటారు అమాయకంగా. ఇలా తమ ప్రజ్ఞతో సాధారణ విషయాలను కూడా మసిపూసి మారేడు కాయ చేసే వ్యవహారాలు ఈనాటి మీడియా చేస్తోందనేది ఆ మితృడి అభిప్రాయం. అందుకే ‘పేపర్లు చదవను, టీవీలు చూడను’ అనే నిర్ణయానికి ఆయన వచ్చాడు.
కానీ మీడియా మీద ఎంత చెడుగా అనుకున్నా, అది necessary evil అంటాడు మరో మిత్రుడు. ఆయన ఓ అయిదు రోజుల పాటు నగరానికి దూరంగా వున్న ఫాం హౌస్ లో గడిపివచ్చారు. ఆయనకి పొద్దున్నే పత్రిక చూడనిదే గడవదు. అక్కడ పత్రిక దొరకదు. ఫాం హౌస్ లో ఉన్న టీవీకి నెట్ సమస్య వచ్చి మౌన ముద్రదాల్చింది. మొదటి రోజు కష్టంగా గడిచింది. మర్నాడు మనసుకు ప్రశాంతంగా వున్నట్టు తోచింది. ఆ మర్నాడు అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయా అనిపించింది. అక్కడే అలానే వుండిపొతే బాగుండు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా అని కూడా అనిపించిందట. షుగర్, బీపీ అదుపులో వుందని పరీక్ష చేసుకుంటే తెలిసిందట.
అయితే ఇంటికి తిరిగి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, గుమ్మం ముందు పడి వున్న పత్రికలను అన్నింటినీ వరసపెట్టి తిరగేయడం.
మరొక మిత్రుడు మరీ విచిత్రమైన విషయం చెప్పాడు. కరోనా గురించిన సమాచారం అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న రోజులు. అది గాలి ద్వారా, ధూళి ద్వారా కూడా వ్యాపిస్తుందని అప్పుడు అనేక రకాలుగా చెప్పుకునేవారు. పేపర్ల ద్వారా కరోనా రాదు అని పత్రికల వాళ్ళే ప్రకటనలు ఇచ్చుకోవాల్సిన స్థాయికి ఈ పుకార్లు చేరుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పేపరు మొహం చూడలేదు. పొరబాటున కూడా పత్రికను చేతితో తాకలేదు. పుట్టడమే పత్రికాసమేతంగా పుట్టాడని ఆయన చుట్టపక్కాలు చెప్పుకొనేవారు. ప్రతిరోజూ రోజూ మూడు నాలుగు పత్రికలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచీ వుంది. అలాంటి మనిషి దాదాపు మూడేళ్లుగా పేపరు చేత్తో పట్టుకోలేదు, ముట్టుకోలేదు అంటే ఆశ్చర్యమే మరి.
ఈ విషయాలన్నీ తలచుకుంటూ వుంటే ఎప్పుడో జ్వాలా చెప్పిన ఓ విషయం జ్ఞాపకం వచ్చింది.
అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కుముద్ బెన్ జోషీ గవర్నర్. తెలుగు దేశం అధికారంలో వుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో. కాంగ్రెస్ గవర్నర్ కాబట్టి టీడీపీ అనుకూల పత్రికలు కొన్ని గవర్నరు ఏం చేసినా వాటిని తూర్పార పడుతూ కధనాలు రాసేవి. ఆవిడ వ్యవహార శైలి కూడా అందుకు దోహదం చేసి వుంటుంది. అది రాజ్ భవన్ కాదు, గాంధీ భవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం) అనే వారు. కాంగ్రెస్ నాయకులు చాలామందికి రాజ్ భవన్ ఓ అడ్డాగా మారింది అని గుసగుసలు వినిపించేవి.
ఉపరాష్ట్రపతి వెంకట్రామన్ గారు కాబోలు, ఒకసారి హైదరాబాదు వచ్చి రాజభవన్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. గవర్నర్ కుముద్ బెన్ జోషీ, గవర్నర్ కార్యదర్శి చంద్రమౌళిగారు వెళ్లి ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
మాటల సందర్భంలో వెంకట్రామన్ అడిగారు జోషీ గారిని, ‘ఏమిటి అలా వున్నారు ఒంట్లో బాగుండలేదా అని.
చంద్రమౌళిగారు గారు కల్పించుకుని అసలు విషయం చెప్పారు, ఆరోజు ఉదయమే ఒక పత్రిక గవర్నర్ కు వ్యతిరేకంగా ఒక కధనం ప్రచురించిందని.
అప్పుడు వెంకట్రామన్ గారు ఇచ్చిన సలహా ఇది.
‘ఓ మూడు రోజులు పత్రికలు చదవడం మానేసి చూడండి, మనసుకు ఎంతటి ప్రశాంతత లభిస్తుందో అర్ధం అవుతుంది”

29, జనవరి 2023, ఆదివారం

ఎవరీ గాంధి? – భండారు శ్రీనివాసరావు

 (జనవరి 30  మహాత్మాగాంధీ వర్ధంతి)

1969

మహాత్మాగాంధీ శతజయంతి సంవత్సరం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జర్మని నుంచి ఒక ప్రొఫెసర్ భారత దేశానికి వచ్చారు. ఆయన ఆ దేశంలోని అతి పురాతనమైన విశ్వవిద్యాలయం హైడల్ బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. పేరు డాక్టర్ మర్ల శర్మ. వారిది కాకినాడ. పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. గాంధి గారు పుట్టి వందేళ్ళు గడుస్తున్న సందర్భంలో భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల వాళ్ళు గాంధీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఒక పరిశోధనా పత్రం తయారు చేసే పని పెట్టుకుని వచ్చారు. ఆరోజుల్లో నేను విజయవాడ ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను. ఆయన పరిశోధనలో చేదోడువాదోడుగా వుండే అవకాశం నాకు లబించింది. అందులో భాగంగా నేను శర్మ గారితో కలిసి (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాలు తిరిగాను.

మహాత్మాగాంధి ఎవరు?’ అనేది శర్మగారు ముందే తయారు చేసుకొచ్చిన ప్రశ్నావళిలో మొట్టమొదటిది. వూరి పేరు గుర్తు లేదు కానీ పట్టుమని పాతిక గడప కూడా లేని ఓ మారుమూల గ్రామంలో ఒక నడికారు మనిషిని ఇదే ప్రశ్న అడిగితే, ఆమె జవాబుగా తన కుమారుడిని చూపించింది. అతడి పేరు గాంధి. మహాత్మాగాంధీ హత్యకు గురైన తర్వాత పుట్టిన తొలిచూలు బిడ్డడు అతడు. మహాత్ముడి మీది గౌరవంతో కొడుక్కి గాంధి అని పేరు పెట్టుకుంది. స్వాతంత్ర ప్రదాత అనే కృతజ్ఞతతో ఆ రోజుల్లో వేలాదిమంది తమ సంతానానికి గాంధీ పేరు పెట్టుకున్నారు. వారిలో ఎంతమంది తమ నడవడికతో ఆ పేరుకు న్యాయం చేకూర్చారో తెలుసుకోవాలంటే మరో విదేశీ యూనివర్సిటీ పూనుకోవాలి.

అది అప్పటి మాట.

దశాబ్దాలు గడిచిన తర్వాత మా పక్కింటి పిల్లవాడు తల్లిని అడుగుతుంటే విన్నాను, ‘మమ్మీ! గాంధి అంటే ఎవరు? ఈరోజు నేను స్కూల్లో మాట్లాడాలి. నా ఫ్రెండ్ గోపి ఏమో, రాహుల్ గాంధి గ్రాండ్ పా అంటున్నాడు, కరక్టేనా!’

ఈ పిల్లవాడి ప్రశ్న కంటే ఆ తల్లి ఇచ్చిన జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ‘నన్ను విసిగించకురా! వెళ్లి గూగుల్ లో వెతుక్కో’

ఈ నేపధ్యంలో మహాత్మా గాంధి ఆయన బోధనలు, ప్రబోధాలు నేటి తరానికి ఏ మేరకు శిరోధార్యాలు అనే పెద్ద ప్రశ్న నా ముందు నిలిచింది.

మహాత్మాగాంధీ తన జీవిత కాలంలో ఎన్నో చెప్పారు. ఎన్నో రాశారు. ఈ విషయంలో ఆయనది ఒక రికార్డు అనే చెప్పాలి. తన దృష్టికి వచ్చిన ప్రతి ఉత్తరానికీ, సామాన్యులు, అసామాన్యులు అనే బేధం లేకుండా స్వదస్తూరీతో ఓ కార్డు ముక్కపై జవాబు రాయడం ఆయనకు ఓ అలవాటు. ఆయన సూక్తులూ, బోధనలు వర్తమానానికి కూడా వర్తిస్తాయంటూ గాంధి జయంతి, వర్ధంతి రోజుల్లో నాయకులు చేసే షరామామూలు ప్రసంగాలతో జాతి జనుల చెవులు చిల్లులు పడివుంటాయి. ఆచరణకు వచ్చేసరికి హళ్లికి హళ్లి. సున్నకు సున్నా.

భారతీయ సమాజంలో వైరుధ్యాలు, అసమానతలు నానాటికి పెరిగిపోతున్నాయి. పెరగడమే కాదు, మరింత తీవ్రస్వరూపం ధరిస్తున్నాయి. సంపదలు పెరుగుతున్నా దేశంలో కోట్లాది సామాన్య ప్రజలకు వాటి పంపిణీ సక్రమంగా జరగడం లేదు. పేదలు నిరుపేదలు అవుతున్నారు. సంపన్నులు కోట్లకు పడగెత్తుతున్నారు. సామాన్యుల జీవన ప్రమాణాలు పాతాళంలోకి దిగజారుతుంటే, కలవారి జీవన ప్రమాణాలు అంతరిక్షాన్ని తాకుతున్నాయి. దేశంలో సంపదలు పెరిగాయి. సంపదలతో పాటు వైరుధ్యాలు, అసమానతలు పెరిగాయి. పెరిగిన సంపదలలో 73 శాతం భారత జనాభాలో కేవలం ఒక శాతం వున్న శ్రీమంతుల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు గాంధి పుట్టిన దేశమా ఇది? అనే అనుమానం కలక్కమానదు. బహుశా ఆయన మళ్ళీ పుట్టి ఈ దేశాన్ని చూస్తుంటే ఆయనకు కూడా తప్పకుండా ఇలాంటి సందేహమే పొటమరించి వుండేదేమో! ఎందుకంటే ఆయన స్వతంత్ర భారతం గ్రామీణ భారత పునాదులపై నిర్మించబడాలి అని బలంగా కోరుకున్నారు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని నమ్మిన నాయకుడాయన.

అలా అని దేశం పరిస్తితి మరీ ఘోరంగా వుందని అర్ధం కాదు. ఎన్నో అవలక్షణాల నడుమ కూడా పురోగతి చుక్కల్ని తాకుతున్నమాట సైతం అవాస్తవం కాదు. కాకపోతే ఆనాడు మహాత్మా గాంధి కన్న కలల ప్రకారం సాగుతోందా అంటే అనుమానమే.

మహాత్ముడి బోధనలలో సర్వకాలాలకు వర్తించేవి వున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సినవీ వున్నాయి. మహాత్ముడు రాట్నం వడికి తీసిన నూలు దుస్తులు ధరించమని ప్రజలకు చెప్పారు. ఆనాడు ఆయన ఉద్దేశ్యం ఖద్దరును ప్రోత్సహిస్తే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం వుండదు అన్నది కావచ్చు. మరి నేటి తరం ‘రాటం మాకిప్పుడు కాదు వాటం’ అంటోంది. విదేశీ వస్తు బహిష్కరణకు గాంధి నాడు పిలుపు ఇస్తే దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్వెత్తున స్పందించి తమ దుస్తులు మూటలు కట్టి తీసుకొచ్చి నడి వీధుల్లో రాశులుగా పోసి తగలబెట్టారు. మహాత్ముడి మాటకు జనాలు ఎలాంటి విలువ ఇచ్చారో తెలుసుకోవడానికి ఇలాంటి దృష్టాంతాలు కోకొల్లలు.

గమ్యం (లక్ష్యం) ఎంత గొప్పదిగా పరిశుద్ధంగా వుండాలని కోరుకుంటామో, ఆ లక్ష్య సాధనకు మనం అనుసరించే మార్గాలు కూడా అంతే పవిత్రంగా వుండాలి’ అని మహాత్ముడు చెప్పిన సూక్తిని, ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా ప్రపంచం పరిగణించిన అమెరికన్  నల్ల జాతి నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ తరచూ పేర్కొంటూ వుండేవారు. మహాత్ముడు ప్రబోధించిన అహింసావాదాన్ని ఆయన మనసా వాచా కర్మణా నమ్మి ఆయన తన ఉద్యమాన్ని నడిపారు. ఏ దేశంలో అయితే వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటాన్ని మహాత్ముడు ప్రారంభించారో, ఆ దేశమే తదనంతర కాలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి నివాళులు అర్పించిందంటే ఆయన బోధనలలోని ప్రభావం అంత గొప్పదని అవగతమవుతుంది.

నిజానికి మహాత్ముడి బోధనల అవసరం ఆనాటి రోజులకంటే ఈనాడే ఎక్కువగా వుంది. కానీ వాటిని విదేశాల్లో వారు పాటిస్తూ, గౌరవిస్తుంటే, మనం మాత్రం జయంతులు, వర్ధంతుల సందర్భాల్లో ఇచ్చే సందేశాలకు పరిమితం చేసి సంతోషపడుతున్నాం. మోహన్ దాస్ కరం చంద్ గాంధి అనే మహానీయుడు నడయాడిన నేలమీదనే మనమూ నడుస్తున్నాం అనే స్పృహను కోల్పోతున్నాం. పైగా ఆయనకు మహాత్ముడు అనే బిరుదు ఎవరిచ్చారు అనే అర్ధరహితమైన చర్చలతో కాలక్షేపం చేస్తున్నాం.

ఇది తగునా!’ అనే ప్రస్తావన మనకు రాదు. ఎందుకంటే మహాత్మా గాంధి అంటే ఎవరు అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే గూగుల్ వెతుక్కోవాల్సిన దుస్తితిలో వున్నాం. ఇక ముందు కూడా వుంటాం. కారణం గాంధీతో కానీ, ఆయన సూక్తులతో కానీ నేటి యువతరానికి అవసరం లేదు. పాత తరం పట్టించుకునే పరిస్తితిలో లేదు.



(28-01-2023)