23, జనవరి 2023, సోమవారం

జారుడు మెట్లు – భండారు శ్రీనివాసరావు


(Published in ANDHRAPRABHA on 22-01-2023, SUNDAY)


ఏదైనా ప్రధాన పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మరో పార్టీలోకి జారిపోతే ఆ సందర్భాన్ని, 'పార్టీ మార్పిళ్ళకు పరాకాష్ట’  అని గిట్టని పార్టీల వాళ్లు వ్యాఖ్యానిస్తుంటారు. ఇదేదో కొత్త విషయం అయితే ఆశ్చర్య పడాలి. ఈ చేరికలకు, చీలికలకు ఇది మొదలూ కాదు, చివరా కాదు. అందుకే విమర్శించేవారు మరో సందర్భంలో సమర్ధించడానికి సిద్ధంగా ఉండడానికి సిద్ధపడి వుండాలి. సమర్ధించేవారు ఇంకో సందర్భంలో విమర్శించడానికి సంసిద్ధంగా వుండడం కూడా అంతే  అవసరం.  ఎందుకంటే ఈ పార్టీ మార్పిళ్ళు అనేవి అన్ని పార్టీలకి తప్పనిసరి అవసరం కాబట్టి.  ఎవరూ దీనికి అతీతులు కాదు కాబట్టి. మరో 'మార్పిడి' జరిగేవరకు పాత దానిపై దుమారం సాగిపోతుంది, ఆ  తరువాత అది పాత పడిపోతుంది. కొత్తది తెర మీదికి వస్తుంది. చర్చ మళ్ళీ మొదలవుతుంది. ఇదో విష చక్ర భ్రమణం.       

'నిలకడగా  నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా స్వచ్చంగా కనబడుతుంది'   

పార్టీ మార్పిడులను సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. మరి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా తీసుకోవాలేమో.  

పార్టీలు ఏర్పడినప్పుడే మార్పిళ్ళ సంస్కృతికి కూడా బీజాలు పడ్డాయంటారు. పార్టీలు వుంటేనే కదా మార్పిళ్ళు జరిగేది. అందుకే రాజకీయుల అవసరాలకు తగ్గట్టు పార్టీలు కూడా పుట్టుకొస్తుంటాయి.

1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశంలో అందరి నోళ్ళలో నానుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల పుణ్యమా అని అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. కొన్ని కాలపరీక్షకు తట్టుకున్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటూ తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి.

2014 జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విడిపోయింది. విడిపోవడానికి కొద్దికాలం  ముందు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు తెలంగాణాలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రాల చీలిక దరిమిలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టవచ్చినట్టుగా కనిపించిన మార్పు ఒక్కటే ఒక్కటి,  పార్టీ మార్పిళ్ళు. రెండు రాష్ట్రాలమధ్య సహజంగా పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు అలాగే వుండిపోతే, కొత్తగా తెరమీదకు వచ్చిన ఈ పార్టీ మార్పిళ్ళ వ్యవహారం అన్ని సమస్యలను కారుమబ్బులా కమ్మేసి, అనేక అనైతిక, అవాంఛనీయ, అప్రజాస్వామిక పరిణామాలకు దారి తీయడమే కాకుండా వివాదాలు ముదిరి పాకానపడి చివరికి కేసులు, కోర్టుల వరకు వెళ్ళింది. దీనికి ముగింపు ఎప్పుడన్నది కాలమే చెప్పాలి.

పోతే, ఇన్ని సమస్యలకు మూలకారణంగా పేర్కొంటున్న పార్టీ మార్పిళ్ళు ముందే చెప్పినట్టు పార్టీలు పుట్టినప్పుడే పురుడు పోసుకున్నాయి. అసలు కొత్త పార్టీలు పుట్టుకు రావడానికి ప్రధాన కారణం పార్టీల్లో పుట్టుకొచ్చే  రాజకీయ అసంతృప్తులే అనే వాదం వుంది.     

సాధారణంగా  ప్రతిపక్షంలో వున్నవాళ్ళు, పాలకపక్షం వైపు చూడడం సహజం. కానీ,పాలక పక్షం నుంచి ప్రతిపక్షం వైపు దూకే సాంప్రదాయానికి ఎప్పుడో రామాయణ కాలంలోనే విభీషణుడు విత్తు నాటాడు. తటస్థులను తమవైపు తిప్పుకోవడం మహాభారతంలో కానవస్తుంది.      

స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ఏకపక్షంగా సాగిన వ్యవహారం ఏమీ కాదు. స్వతంత్రం తెచ్చిన ఖ్యాతి, తొలి ఎన్నికల్లో అ పార్టీకి బాగా ఉపయోగపడిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఇప్పటితో పోలిస్తే అప్పుడున్న పార్టీల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. జనత పార్టీ, స్వతంత్ర పార్టీ, జనసంఘం పేర్లు  ఈనాడు కొందరికి తెలిసి  వుండవచ్చునేమో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో సోషలిష్టు పార్టీ, ప్రజా సోషలిష్టు పార్టీ,  నేషనలిష్టు డెమొక్రాటిక్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కే.ఎల్.పీ, ఎన్.సీ.ఎఫ్,  జస్టిస్ పార్టీ,  ప్రజాపార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఇలా అనేక పార్టీలు వుండేవి. కమ్యూనిస్ట్ పార్టీ (అప్పటికి ఒక్కటే) సరేసరి. 

కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీల్లో కొన్ని పార్టీల పేర్లు చూడగానే, 'తల్లి పార్టీ ఏమిటి? అందునుంచి  వేరుపడి ఏర్పడ్డ కొత్త పార్టీ ఏమిటి?' అన్న విషయం సులభంగానే బోధపడుతుంది.  (ఉదాహరణకు కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్, జనతా, జనతా దళ్ వగైరా)

విచిత్రం ఏమిటంటే పార్టీ మార్పిళ్ళకు కూడా ముహూర్త బలం వుండాలి అనే వాదన ఒకటి వుంది.      

గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు. 

పార్టీ మార్పిడి కూడా లాటరీ వంటిదే. కొందరికి లాభం. కొందరికి ఖేదం, అని ఈ రకం వాదితులు చెబుతుంటారు.

పార్టీ మారిన వెంటనే చేరిన పార్టీలో తారాజువ్వలా పైకి దూసుకు పోయిన సందర్భాలు వున్నాయి. పార్టీ మారి పుష్కరాలు గడిచినా వేసిన గొంగడి చందంగా చతికిలపడి పోయిన ఉదాహరణలు వున్నాయి. పేర్లు చెప్పుకుంటూ పొతే జాబితా కొండవీటి చేంతాడు అంత అవుతుంది.

పార్టీ మార్పిళ్లలో అర్ధం కానిది ఒకటే.   

రాజకీయుల్లో ఎవరిని కదిలించినా గెలుపు తధ్యం అంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే మనసా, వాచా, కర్మణా సిద్ధమైపోయారని చెబుతారు. ఇంతాచేసి, తమమీద తమకే నమ్మకం లేనట్టు చొక్కాలు మార్చినట్టు  పార్టీలు మారుతుంటారు.

వాళ్ళ వేగం, ఉరవడి  చూస్తుంటే, ఏవిటో అంతా వరదలో కొట్టుకుపోతున్నట్టుగా వుంటుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.

అన్నమైతే ఏమిరా! సున్నమైతే ఏమిరా!

అయినా ఈ పాడు పొట్టకు అన్నమే వేద్దామురా!  అని ఏదో పాత సినిమాలో ఓ గీతం వుంది. 

పార్టీ మారే వారిది కూడా ఇదే బాణీ.

ఆ పార్టీ అయితేనేం ఈ పార్టీ అయితేనేం

పనులు జరిగే అధికార పార్టీయే మేలు కదా! అనేది వాళ్ళ థియరీ.

మరి చేరిన పార్టీ రానున్న ఎన్నికల్లో ఓడిపోతే ఎలా! అన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం సిద్ధంగా వుంటుంది.

“తలుపు తీసుకుని  బయటకు వెళ్ళిన వాళ్లకు, లోపలకు వచ్చే దారి తెలియదని ఎలా అనుకుంటున్నారు?”    


ముక్తాయింపు :       

ఎన్నికలకు  ముందు ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడే మాట:

"ఈరోజు ప్లస్సెంత ? (చేరినవారెందరు) మైనస్ యెంత? (జారినవారెందరు) "




17, జనవరి 2023, మంగళవారం

1996 జనవరి 18 - భండారు శ్రీనివాసరావు

తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది. రైలు రేణిగుంట స్టేషన్లోకి ప్రవేశిస్తోంది. తోటి ప్రయాణీకుల్లో చాలామంది లేచి తిరుపతి స్టేషన్లో దిగడానికి సామానులు సదురుకుంటున్నారు. పక్క బెర్త్ లో పడుకున్న మాజీ మంత్రి, తెలుగు దేశం నాయకుడు శ్రీ ముద్దు కృష్ణమ నాయుడు, నా జర్నలిస్టు మిత్రుడు ఎం.ఎస్. శంకర్ ఇంకా నిద్రలోనే వున్నారు. శంకర్ కి తిరుపతి దేవుడు అంటే తగని నమ్మకం. నిజానికి అతడి ఒత్తిడి తోనే ఈ ప్రయాణం. ఏడాదికి ఒకటి రెండు సార్లు స్వామి దర్శనం చేసుకోవడం అతడికి అలవాటు. రైల్లో రాత్రంతా ముద్దు కృష్ణమ నాయుడి గారితో కబుర్ల తోటే సరిపోయింది. దర్శనానికి ఎవరికయినా చెప్పనా అని ఆయనే అడిగారు. వద్దండి, అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాము అని చెప్పాము.
నా దగ్గర బి.హెచ్. ఇ.ఎల్. వాళ్ళు ఓసారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన సిగరెట్ పెట్టె సైజు బుల్లి ట్రాన్సిస్టర్ రేడియో వుంది. దాన్ని ఆన్ చేశాను. ఢిల్లీ నుంచి ఇంగ్లీష్ వార్తలు మొదలయ్యాయి. వున్నట్టుండి, “హియర్ ఈజ్ ఎ ఫ్లాష్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావ్ ఈజ్ నో మోర్. ఎకార్దింగ్ టు అవర్ హైదరాబాద్ కరస్పాండెంట్ పవని విజయ లక్షి..”
షాక్. కాసేపు మెదడు మొద్దుబారింది. అంతకు ముందు రోజే ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వార్త కూడా నేనే ఇచ్చాను. ఎక్కడా ఆయనలో అనారోగ్యం ఛాయలు కనిపించలేదు. ఇదేమిటే? ఎలా జరిగింది? నిజమా కాదా! వార్త వచ్చింది రేడియో నేషనల్ బులెటిన్ లో. శంకర్ ని, ముద్దు కృష్ణమ నాయుడు గారిని లేపుతుండగానే, రైలు రేణిగుంట స్టేషన్ లో ఆగింది. విషయం వినగానే ముద్దు కృష్ణమ నాయుడు గారు ‘నేను అనాథను అయిపోయాను’ అంటూ గుండెలు బాదుకుంటూ భోరున ఏడవడం మొదలు పెట్టారు. శంకర్ బయటకి పరిగెత్తాడు, పేపర్ కొనుక్కుని రావడానికి. అందులో ఎన్టీఆర్ ప్రెస్ మీట్ తప్పిస్తే వేరే విషయం లేదు. ప్లాట్ ఫారం కూడా మామూలుగానే వుంది. ఇంకా ఎవరికీ విషయం తెలిసినట్టు లేదు. అంటే పత్రికల ఎడిషన్ టైం అయిపోయిన తర్వాత జరిగి వుంటుంది. నాయుడి గారి ఏడుపు గమనించి ఆయన గన్ మెన్ పరిగెత్తుకు వచ్చాడు.
భారంగా రైలు దిగాము. పరికిస్తీ అంతా మామూలుగా ప్రయాణీకుల రణగొణధ్వనులతో వుంది. వెంటనే కొండ పైకి వెళ్ళాము. అక్కడ కూడా అంతాప్రశాంతంగానే వుంది. ఏర్పాట్లు చేసుకున్నాము కనుక దర్శనం త్వరగానే ముగిసింది. బయటకి వచ్చేసరికి వాతావరణంలో పెనుమార్పు. తిరుమలలో అంగళ్లు, హోటల్లు మూసేస్తున్నారు. వెంటనే మిమ్మల్ని పైకి తీసుకువచ్చిన టాక్సీలోనే కిందికి వెళ్ళాము. శంకర్ మూడు నాలుగు అవుట్ స్టేషన్ ఇంగ్లీష్ పత్రికలకి వార్తలు పంపుతుంటాడు. తిరుపతిలో బంద్ పాటిస్తున్నారు. ప్రతి కూడలిలో ఎన్టీఆర్ ఫోటో పెట్టి నల్ల జండాలు కట్టారు. వీధులు అన్నీ నిర్మానుష్యంగా వున్నాయి. ఆఖరికి బండి దుకాణాలు కూడా లేవు. ఇన్ఫర్మేషన్ సెంటర్ కి వెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్ సుభాష్ గౌడ్ అధికారి. ఆఫీసు కూడా మూసేసి వుంది. ఎలాగో లోపలకి వెళ్ళాము. శంకర్ అక్కడే కూర్చుని టైప్ రైటర్ మీద నాలుగు విభిన్న వార్తలు టైప్ చేశాడు. వాటిని ఫాక్స్ చేయడానికి (సుభాష్ గౌడ్ తర్వాత ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు) అతడో మనిషిని ఇచ్చి పెద్ద పోస్ట్ ఆఫీసుకు పంపించాడు. అది మూసేసి వుంది. తలుపు మీద తడితే ఎవరో తలుపు ఓరగా తీసి ఏం కావాలంటే హైదరాబాదు నుంచి వచ్చిన జర్నలిస్టులం ఎన్టీఆర్ వార్త ఇవ్వాలి అంటే లోపలకు రానిచ్చాడు. పని పూర్తయిన తర్వాత ఆకలి సంగతి తెలిసింది. ఎన్ని చోట్ల తిరిగినా ఒక్క హోటల్ తెరిచి లేదు. సుభాష్ గౌడ్ చెబితే అతడి మనిషి ఓ చిన్న రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళాడు. షట్టర్లు వేసి వున్నాయి. వెనుక నుంచి దొంగ దోవన లోపలకి తీసుకు వెళ్ళాడు. భోజనం లేదు, ఒక్క ప్లేట్ సాంబార్ రైస్ మాత్రం ఇస్తాను, సర్దుకోండి అన్నాడు. ఏం చేస్తాం అదే మహాప్రసాదం అనుకుని తినేసి బయట పడ్డాము. సాయంత్రం హైదరాబాదు వచ్చే రైల్లో రిజర్వేషన్ వుంది కాబట్టి ఎక్కాము. రైలంతా ఖాళీ. ఎక్కడైనా ఆపెస్తారేమో అనుకున్నాము కానీ మొత్తం మీద ఇళ్లకు చేరాము.
ఇంటికి రాగానే మా ఆవిడ నిన్నంతా మీకోసం తెగ ఫోన్లు. తెల్లవారుఝామున్నే రోశయ్య గారి ఫోను. మీరు తిరుపతి వెళ్ళారు అని చెప్పాను అంది.
ఇక తరువాతి కధ అందరికీ తెలిసిందే.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం తరువాత ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అనే వార్త మొట్టమొదటిసారి నాద్వారా లోకానికి తెలిసింది. కానీ ఆయన మరణ వార్త ఇవ్వలేకపోయాను.
(18-01-2023)



15, జనవరి 2023, ఆదివారం

ఒక్క రోజు కోటీశ్వరుడు – భండారు శ్రీనివాసరావు

 


కొన్నేళ్ళ క్రితం ప్రముఖ నటుడు చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోఃన రెడ్డిని కలుసుకున్నప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రికి కప్పిన శాలువ రంగుపై కొంత చర్చ నడిచింది. ఆ శాలువా రంగు పసుపు రంగు కావడం ఈ చర్చకు కారణం. అలాగే ఫేస్ బుక్ లో చంద్రబాబుకు అనుకూలంగా రాసే ఓ రచయిత/విశ్లేషకుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ధరించిన దుస్తుల రంగు నీలి వర్ణం అని మరో మిత్రుడు చెప్పారు.  ఏవో ఈ రెండు వాదనలు నాకు నచ్చవు. రాజకీయాల్లో రంగులు మార్చేవారు ఉండవచ్చు. కానీ, రంగుల్లో రాజకీయాలు వుండవు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి కాంగ్రెస్ నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. తొలిరోజుల్లో దూరదర్సన్ ద్వారా  ముఖ్యమంత్రి ఆనవాయితీగా ఇవ్వాల్సిన ఒక సందేశం ముసాయిదా  ప్రతిని ప్లాస్టిక్ ఫోల్డర్ లో తీసుకువెళ్లి, సీఎం పేషీ అధికారికి ఇచ్చాను. ఆయన ఎగాదిగా చూసి, ‘శ్రీనివాసరావు గారూ! ప్రభుత్వం మారిన సంగతి మీరింకా గుర్తించినట్టు లేదు’ అన్నారు. ఎందుకు ఇలా అన్నారని పరకాయించి చూస్తే ఆ ప్లాస్టిక్ ఫోల్డర్ రంగు పసుపు రంగు.

నిజానికి పసుపు రంగు అనేది తెలుగు దేశం ఆవిర్భావానికి ముందు నుంచి వుంది. అలాగే నీలిరంగు వైసీపీ పుటకకు ముందు నుంచీ వుంది. మరి ఎందుకీ వర్ణ వివక్ష!

మనం పెట్టుకున్న కళ్ళజోడు రంగుబట్టి మనకు కనబడే రంగు వుంటుంది.

ఈ రంగులతో నేనూ ఓ సారి ఇబ్బంది పడ్డాను. జెమినీ టీవీలో చర్చాకార్యక్రమాలు నిర్వహించే పాత రోజుల్లో సంగతి ఇది. జెమినీ వాళ్ళు ఆ ఒక్కరోజు నన్ను కోటీశ్వరుడిని చేశారు.

దాదాపు నలభయ్ ఏళ్ళయింది నేను  కోటు వేసుకుని. అదీ మాస్కో చలికోసం.

మళ్ళీ ఇన్నాల్టికి ఆ  టీవీ పుణ్యమా అని కోటు వేసుకోవాల్సిన పని పడింది. బ్లూ మాట్ నేపధ్యంలో బ్లూ కలర్ అక్కడ నిషిద్దం. మామూలుగా షూట్ చేసే స్టూడియో కాకుండా వేరే స్టూడియోలో చర్చ పెట్టడం వల్ల  ఆ రోజు నేను వేసుకున్న బ్లూ కలర్ బుష్ షర్ట్ అక్కడి కెమెరా కంటికి బొత్తిగా నచ్చలేదు. అంచేత అప్పటికప్పుడు వాళ్ళ వాడ్రోబ్ నుంచి ఒక కోటు తెచ్చి నాకు కప్పారు. చలికాలం బాగానే వుంది కానీ మాట్లాడింది రైతుల ఆత్మహత్యల మీద. ఆ చర్చాంశానికి ఈ కోటు అవతారం బొత్తిగా పొసగదని నాకనిపించింది. కానీ ఏం చేస్తాం విధికి తలవంచక తప్పలేదు.

అదృష్టం ఏమిటంటే మా ఆవిడ ఇటువంటి చర్చలు బొత్తిగా చూడదు. లేకపోతే ఈ చొక్కా మార్పిడి, పాత కోటు కప్పుడు  వ్యవహారం మా ఇంట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యేది. మనలో మాట. ఆవిడ ఈ ఫేస్ బుక్ వైపు కూడా కన్నెత్తి చూడదు. (చూసేది కాదు) అదన్నమాట



Disclaimer : ఇది ఏ విధంగాను రాజకీయ పోస్టు కాదు

 

14, జనవరి 2023, శనివారం

జంధ్యాలకో నూలుపోగు- భండారు శ్రీనివాసరావు

(జనవరి 14 జంధ్యాల జయంతి) 

జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల. 

మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ అనే ‘కలం పేరు’ చిరస్థాయిగా వెండి తెరపై స్థిరపడిపోయిన పేరు. తెలుగు హాస్యానికే వన్నె తెచ్చిన పేరు. అందుకే, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకుని అలా వుండిపోయింది.

ఈ భూమ్మీద పడ్డ ప్రతి బిడ్డా ఏడుస్తూనే కళ్ళు తెరుస్తుంది. 1951లో నరసాపురంలో జంధ్యాల పుట్టినప్పుడు బొడ్డు కోసిన మంత్రసాని జాగ్రత్తగా గమనించి వుంటే, ఏడుస్తున్న ఆ పిల్లాడి పెదవుల నడుమ సన్నటి నవ్వుతెర కనిపించి వుండేదేమో.

జంధ్యాల నాన్నగారు జంధ్యాల నారాయణమూర్తి బెజవాడలో పేరుమోసిన వ్యాపారి. అనేక జిల్లాలకు బుష్ రేడియో డీలరు. ఆ రోజుల్లో రేడియోలకి మంచి గిరాకి. అంచేత నారాయణ మూర్తిగారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయింది.

పుటకల నాటికే జంధ్యాల బంగారు పిచిక. బీసెంటు రోడ్డులో ఏడంతస్తుల భవనం.

(ఏడంటే ఏడు అనికాదు, పెద్ద భవనం అని కవి హృదయం. నిజంగానే చాలా పెద్ద ఇల్లు. ఎదురుగా వున్న మోడరన్ కేఫ్ కంటే ఎత్తుగా వుండాలని నారాయణమూర్తిగారు ముచ్చట పడి కట్టించుకున్నారని ఆ రోజులనాటి ముచ్చట) అది కట్టుకున్నాక వాళ్ళ నివాసం, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి దగ్గర నుంచి బీసెంటు రోడ్డుకి మారింది.

మాచవరం ఎస్సారార్ కాలేజీలో మేము, అంటే జంధ్యాల, నేను ఒకే బెంచిలో కూర్చుని బీకాం చదువుతున్నట్టు నటిస్తున్నరోజుల్లో, కాలేజీ ప్రిన్సిపాల్ తో సహా అయ్యవార్లందరూ సైకిళ్ళమీద కాలేజీకి వస్తుండేవారు. మన జేవీడీఎస్ శాస్త్రి మాత్రం, అంబాసిడర్ కారులో వెనక సీట్లో కూర్చుని దర్జాగా వచ్చేవాడు. డ్రైవరు డోరు తెరిచి నిలబడితే కారు దిగి కాలేజీలో కాలు పెట్టే జంధ్యాలకు ‘కారున్న కుర్రకారు’ అని పేరు పెట్టింది కూడా నేనే.

చదువులోనే కాకుండా శాస్త్రి, ఇతర విషయాల్లో కూడా ముందుండేవాడు. కాలేజీ కల్చరల్ అసోసియేషన్ కు ఆయనే మకుటంలేని కార్యదర్శి. కవితలు, గేయాలు గిలికే అలవాటున్న నాకు కూడా ఆ మకుటంమీద కన్నుపడింది. వెనకాముందూ చూసుకోకుండా ఏకంగా ఆయనపైనే పోటీ చేశాను. అయితే ఆయన మకుటం గట్టిది, నేను కొట్టిన దెబ్బ ఓటిది అని ఇట్టే తేలిపోయింది. ఓడిపోతే పోయాను కానీ, ఆయనతో నా స్నేహం గట్టిపడింది. ఆయన మిత్ర బృందంలో నాకూ స్థానం దొరికింది. ఇక ఆ మూడేళ్ళూ కలిసే తిరిగాము చదువయినా, సంధ్యయినా! 

తెలుగు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన నాగయ్య ఒక తరానికి తెలుసు. నాగేశ్వరరావు మరో తరానికి తెలుసు. నాగార్జున ఇంకో తరానికి తెలుసు. ఒక తరానికి తెలిసిన వాళ్ళు మరో తరానికి అట్టే తెలియకపోవడంలో విడ్డూరం ఏమీ లేదు. అన్ని తరాలను నవ్వుల్తో రంజింప చేసిన జంధ్యాల నిజంగా అమరుడు

కింది ఫోటో:  కాలేజి రోజుల్లో జంధ్యాల 


 


దివికేగిన ఆధ్యాత్మికవేత్త -భండారు శ్రీనివాసరావు

 (జనవరి 14 మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి ప్రధమ వర్ధంతి)

నా మొదటి ప్రవచన కార్యక్రమానికి హాజరై విన్నది ఇద్దరంటే ఇద్దరే’

నిరుడు  ఇదే రోజున హైదరాబాదులో తన తొంభయ్ ఆరో ఏట మరణించిన ప్రసిద్ధ ప్రవచనకారులు, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి, ఒక కార్యక్రమంలో స్వయంగా వెల్లడించిన విషయం ఇది.

మల్లాది వారి ప్రవచనం వుందని తెలిస్తే వేలాదిమంది విరగబడి హాజరయ్యే స్థితికి చేరుకున్న తర్వాత, అత్యంత వినయంతో శాస్త్రి గారు ఈ మాట చెప్పారని నా రేడియో సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారు నాతొ చెప్పారు..

భగవంతుడి ఆదేశమో ఏమో తెలియదు, రామాయణ, భారతాలను గురించి ప్రవచనాల ద్వారా ప్రజాబాహుళ్యానికి తెలపాలని ఆయన చిన్న వయసులోనే ఆసక్తి పెంచుకున్నారు.

ఒకానొక సందర్భంలో శాస్త్రిగారు ఆ విషయాలను గురించి ఇలా ప్రస్తావించారు.

రేకు పెట్టెలో ఓ జత పంచెలు, కండువాలు పెట్టుకుని బస్ స్టాండ్ కి వెళ్ళేవాడిని. దొరికిన బస్సు, అది ఎటు పోతుందో కూడా చూడకుండా ఎక్కేసి, అది ఆగిన చోట దిగిపోయేవాడిని. ఆ వూర్లో గుడి ఎక్కడ వుందో వాకబు చేసుకుని వెళ్ళేవాడిని. అక్కడే అరుగుమీద కూర్చుని సాయంత్రాలు ప్రవచనాలు మొదలు పెట్టేవాడిని. జనాలకు బుర్రకదల మీద, నాటకాల మీదా వుండే అనురక్తి ప్రవచనాలపై ఉంటుందని అనుకోలేము. అయినా అలా పట్టువదలకుండా ఊళ్ళు తిరుగుతూ ప్రవచనాలు చెబుతూ ఉండేవాడిని. క్రమంగా ప్రజలకు వీటిపట్ల అనురక్తి పెరగడం మొదలయింది. అలా జీవితం చాలించేవరకూ ప్రవచనాలు చెబుతూ ఉండాలనేది నా కోరిక. ఆ భగవంతుడి అభీష్టం ఎలా వుంటుందో తెలవదు’

మల్లాది వారికి బాచంపల్లి సంతోష్ శాస్త్రి గారు ప్రియ శిష్యులు. వారు ఎక్కడ ప్రవచనాలు చెప్పినా గురుచరణులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శిష్యుడనని మొదట్లోనే చెప్పి ప్రారంభించేవారు. ఒకసారి రవీంద్ర భారతిలో ఉగాది పంచాంగ శ్రవణం. అందులో పాల్గొంటూ, ఒకనాడు నా గురుదేవులు మల్లాది వారు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించడం అంటే నా జీవితం ధన్యమే’ అన్నారు సంతోష్ కుమార్ శాస్త్రి.

సంతోష్ నా శిష్యుడే. గురువు శిష్యుడిని ఎలా చూడాలని కోరుకుంటాడో సంతోష్ కుమార్ శాస్త్రి అలానే తయారయ్యాడు’ అని శాస్త్రిగారు కూడా సగర్వంగా చెప్పుకునేవారు.

ఆధ్యాత్మిక ప్రవచనాల ప్రభావమో ఏమో కాని మల్లాది వారికి ఎటువంటి ఆరోగ్యసమస్యలు ఎదురుకాలేదు. ఒకసారి ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు ఓ సందర్భంలో శాస్త్రిగారి ధాతుపుష్టి గురించి ప్రస్తావించారు.

అశోక్ నగర్ లోని వారి ఇంటికి సాయంత్రాలు ఎవరు వెళ్ళినా ఓ పెద్ద వెండి పళ్ళెం నిండా అరటికాయ బజ్జీలు తెచ్చి పెట్టేవారట. తాను తింటూ, వచ్చిన వారిని కూడా తినమని అంటుండేవారట. అప్పటికే వారి వయసు ఎనభయ్ దాటింది.

శాస్త్రి గారికి సద్గతులు కలగాలని కోరుకోనక్కర లేదు. ఎందుకంటే ధారావాహికంగా వేలాది ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏళ్ళ తరబడి చెబుతూ వచ్చిన మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారి కోసం ఆ సద్గతులే ఎదురు చూస్తుంటాయి. ఇది తద్యం.



(14-01-2023)

రుచి కాదు శ్రమ ముఖ్యం – భండారు శ్రీనివాసరావు

 “రుచి చూసి చెప్పాలి” అన్నారు గీత వెల్లంకి గారు పులిహోర డబ్బా చేతికి ఇస్తూ. దానితో పాటే తాను రాసిన  డార్క్ ఫాంటసి కవితా సంకలనాన్ని కూడా సంతకం చేసి ఇచ్చారు.

భోగి పండుగనాడు ఉదయమే డబుల్ ధమాకా అన్నమాట.

గీత గారెని ప్రత్యక్షంగా కలవడం ఇదే మొదటిసారి. చాలా ప్లెయిన్ మనిషి అని ఫేస్ బుక్ లో రాతలు బట్టి అర్ధం అయింది. నిజమే అని ఈ రోజది స్పష్టం అయింది. కల్మషం లేని ప్రవృత్తి. మా కోడలు, మనుమరాలి కేర్ టేకర్ నేహాతో హిందీలో మాట్లాడారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అదేమిటో హైదరాబాదులో యాభయ్ ఏళ్ళకు పైగా ఉంటున్నా సాట్, ఆట్ కు తేడా తెలియదు. గీత గారు  ఓ ఏడాదో ఎంతో ఢిల్లీలో ఉన్నారుట, ఆ కొద్ది కాలంలోనే హిందీ పట్టేశారు. నేను మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు నాకు రష్యన్ భాష నేర్పడానికి రేడియో వాళ్ళు ఓ పంతులమ్మను పెట్టారు. వారానికి  నాలుగు రోజులు ఇంటికే వచ్చి రష్యన్ ట్యూషన్ చెప్పేది. చివరికి జరిగింది ఏమిటి? ఆమెకు తెలుగు వచ్చేసింది. నాకు వచ్చిన రష్యన్ భాష సున్నకు సున్నా హళ్లికి హళ్ళీ.

ఇక రుచిపచుల సంగతి.

నాకు మొదటి నుంచీ  నాడీ మండలంలో ఈ భాగం పనిచేయదు.  పులిహోర చేసినప్పుడు బాగుందా, కారం ఉప్పూ సరిపోయాయా అని అడిగేది మా ఆవిడ. ఈరోజు శుక్రవారం, పులుపు నాలిక్కి తగలరాదు, అంచేతే అడుగుతున్నాను చెప్పండి అని ఖచ్చితంగా చెప్పాలి సుమా అనే సంకేతం జోడించేది. అయినా నేను మామూలు ధోరణిలో బాగుంది అనేవాడిని ముక్తసరిగా.  ఈ మాట ఆమెకు నచ్చేది కాదు. ఈ జవాబుకన్నా బాగాలేదు అని చెప్పినా సంతోషపడేదేమో.

అయితే నా కారణం నాకుంది.

అది పులిహోర కావచ్చు, మైసూర్ పాకం కావచ్చు. అవి చేయడానికి వెనుక ఎంతో శ్రమ దాగివుంది. బాగాలేదు అంటే ఆడవారి శ్రమను అవమానించినట్టే.

కానీ ఈ విషయం ఎప్పుడూ నేను పైకి చెప్పలేదు. ఇప్పుడు అనిపిస్తోంది, ఈ ఒక్క ముక్కా ఆమె ఉన్న రోజుల్లోనే ఎందుకు చెప్పలేకపోయానా అని.

గీత గారికి మరోమారు కృతజ్ఞతలు,  ఇంకా చదవని పుస్తకానికీ, తినని పులిహోరకీ.

(మా ఇంట్లో  అంతా అపరాహ్ణం.  మధ్యాహ్నం మూడు దాటాలి భోజనాలకి)



14-01-2023   

  

సంక్రాంతికి సొంతూరికి - ఓ జ్ఞాపకం



సంక్రాంతికి సొంతూరుకు వెళ్ళాలనే అభిలాషతో అయిదేళ్ళ క్రితం  హైదరాబాదు నుండి నాలుగు కార్లలో ఉదయమే బయలుదేరి మా వూరు కంభంపాడుకు బయలుదేరాము. టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కువ ఆలస్యం కాకుండానే బయటపడ్డాము. ఒక్క   వాట్సప్ మెసేజ్ తో ఖమ్మం, రెబ్బారం, పెనుగంచిప్రోలు నుంచి కూడా చిన్నా పెద్దా యాభయ్, అరవై మందిమి మా వూరికి సంక్రాంతి అతిధులం.

ఇక మా ఇంట్లో సందడే సందడి. నగరాల్లో పుట్టి పెరిగిన కోడలు పిల్లలు, కొంగులు దోపుకుని అర్దరాత్రివరకు మేలుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దారు. వీళ్ళల్లో సగానికిపైగా ఎప్పుడూ పల్లెటూరు మొహం చూసిన వాళ్లు కాదు.  మిధునం సినిమా చూసిన తరువాత  వీళ్ళందరికీ పల్లెటూరు చూడాలన్న కోరిక పుట్టుకొచ్చింది. ఎన్నడూ రుచి చూడని జొన్నన్నం వండడం కోసం నగరాల్లో పుట్టి పెరిగిన మా కోడళ్ళు జొన్నలు దంచేందుకు రోకళ్ళు చేతబట్టారు. మర్నాడు చుట్టూ పచ్చటి చేలు. పిల్లల హడావిడి చెప్పతరం కాదు. పెద్దవాళ్ళు కూడా వయసు మరిచి పోయి మొక్కజొన్న చేలో కలయతిరుగుతూ ఫోటోలు దిగారు. రేగుపళ్ళు ఏరుకుని తిన్నారు.

వూళ్ళో ఉన్న రెండు రోజులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని, కొత్త జ్ఞాపకాలను మూటగట్టుకుని మళ్ళీ అందరం కార్లెక్కి హైదరాబాదు రోడ్డెక్కాము.

మొత్తానికి పెద్దలకూ, పిల్లలకూ మంచి ఎనర్జీ టూర్!

వీడియో COURTESY:  మా అన్నయ్య కుమారుడు రమేష్ భండారు. 

https://youtu.be/T6zc-Yi1Jio