17, అక్టోబర్ 2022, సోమవారం
నిశ్శబ్ద నిష్క్రమణ
పెద్దగీత
ఇంద్రగంటి
హనుమచ్ఛాస్త్రి గారు.
ప్రాతఃస్మరణీయులు.
బీ.ఎస్.రామకృష్ణ.
జర్నలిస్ట్ సర్కిల్ లో బీ ఎస్ ఆర్ అంటారు.
ఫేస్ బుక్ లో బుద్ధవరపు రామకృష్ణ. మంచి జర్నలిస్టు. మంచి రాయసకాడు. చక్కని ధారణ శక్తి.
నా కంటే వయసులో చిన్న అయినా, నేనూ జర్నలిస్టునే అయినా, అతనికి వున్న ఈ గొప్ప లక్షణాలు ఏవీ
నాలో లేవు. నిన్ననో మొన్ననో ఫోన్ చేసి ఓ పెద్దగీత గీసి, కొద్ది రోజులుగా నేను మధన పడుతున్న ఒక అంశాన్ని
రబ్బరు పెట్టి చెరిపేసినట్టు చెరిపేసాడు. ‘ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారికే
తప్పలేదు, ఈ
ఇంటి పేరు గొడవ ఇక మనమెంత’ అంటూ ఎంత పెద్దగీత
గీసి చూపెట్టాడో.
ఆంధ్రపత్రిక
పెట్టిన కాశీనాధుని నాగేశ్వరరావు గారు భారతి సాహిత్య మాసపత్రిక మొదలుపెట్టి రెండు
చేతులూ మోచేతుల దాకా కాల్చుకున్నారు. మంచి
సాహిత్య పత్రికని నడిపారనే మంచి పేరుతొ పాటు మంచి నష్టాలు కూడా ఆయన ఖాతాలో
పడడానికి భారతి కూడా కారణమనేవారు. గొప్ప సాహితీవేత్త అయిన ఇంద్రగంటి
హనుమచ్ఛాస్త్రి గారు భారతి సాహిత్య మాస పత్రికకి అడపాదడపా చక్కటి వ్యాసాలు రాస్తుండేవారు. అయితే ఆయన ఇంటిపేరును
ఎప్పుడూ ఇంద్రగంటి బదులు ఇంద్ర కంటి అని ప్రచురిస్తూ వుండేవారు. ఆయన ఇంటి పేరులో వున్నది ‘గంటి’ నా, ‘కంటి’ నా
అని విడమర్చి చెప్పడానికి ఆయన కుమారుడు, ప్రసిద్ధ రచయిత అయిన ఇంద్రగంటి
శ్రీకాంత శర్మ (గతంలో నేనూ శర్మగారు ఆంధ్రజ్యోతిలో సమకాలీకులం) ఇప్పుడు లేరు.
అయితే అలనాటి భారతి పత్రిక సంచికలు కష్టపడి సేకరించానని రామకృష్ణ చెప్పాడు. చెబుతూ
మరో మాట చెప్పాడు. మీ ఇంటి పేరు భండారు లేక బండారు ఇలా ఎలా రాసినా చింతించడం అనవసరం అంటూ గీతాబోధ చేశాడు.
ఇలాంటి
సమాచారాలు బోలెడు సేకరిస్తూ వస్తున్నానని, ఎప్పుడో సమగ్ర వ్యాసం రాస్తానని ఒక హామీ కూడా ఇచ్చాడు.
(17-10-2022)
16, అక్టోబర్ 2022, ఆదివారం
కొన్ని అంతే! ఊహకు అందవు
కొన్ని అంతే! ఊహకు అందకుండా చకచకా జరిగిపోతుంటాయి.
జర్నలిజంలో జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఏపీ ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఫోను చేసి చెప్పడం, ఆ మరునాడే మేనల్లుడు, మా ఇంటిల్లిపాదికీ పిలవకుండానే పలికే డాక్టరు, డాక్టర్ మనోహర్ కుమార్తె ప్రియ కుటుంబం విదేశాల నుంచి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బంధు మిత్రుల సమావేశంలో నన్ను సత్కరించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మధ్యనే అస్వస్థతకు గురయి కోలుకుంటున్న నాకు, మా కుటుంబ సభ్యుల నడుమ జరిగిన ఈ వేడుక కొత్త ఊపిరులు ఊదింది.
అనుకోకుండా వచ్చిన అవార్డు కన్నా, అనుకోకుండా జరిగిన ఈ కార్యక్రమంలో మా అన్నయ్య రామచంద్రరావు గారు, మేనకోడలు భర్త రావులపాటి సీతారామారావు, మిత్రులు జ్వాలా నరసింహారావు, విజయ శంకర్, పింగిలి శ్రవణ్ కుమార్, టి.ఎస్.ఎన్. మూర్తి, వదిన విమల, మేనకోడళ్ళు శారద, విజయలక్ష్మి ఇంకా పలువురు నా గురించి మాట్లాడిన మాటలు నాకు నా జీవితంలో లభించిన అతి పెద్ద అవార్డుగా భావిస్తూ వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనః పూర్వక ధన్యవాదాలు.
ఈ మొత్తం కార్యక్రమానికి కర్తా కర్మా క్రియ గా వ్యవహరించిన ప్రియ, డాక్టర్ మనోహర్, జ్వాలా, మా కుటుంబంలో ఏకైక మహిళా జర్నలిస్ట్ బుంటి అని మేము ముద్దుగా పిలుచుకునే ప్రేమ మాలిని – వీళ్ళకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా అవి సరితూగవు.
అలాగే, ఫేస్ బుక్ లో, ఇతర మాధ్యమాల్లో మితృలు అనేకమంది శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు, అందరికీ పేరుపేరునా వందనాలు.
16-10-2022
ఇంకానా! ఇకపై సాగదు!- భండారు శ్రీనివాసరావు
రాను రాను, సామాన్యుడనే వాడికి ఓటు వెయ్యడం మినహా ఏ ‘హక్కూ’ లేకుండా పోతోంది. కానీ, అతడ్ని అడ్డం పెట్టుకుని బతికేవారికి మాత్రం అన్ని హక్కులూ హక్కుభుక్తమై పోతున్నాయి.
నిజానికి, పార్టీలూ, పార్టీల నాయకులు, అమాత్యులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసులు వీరందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నుంచి వచ్చిన వీళ్ళే. ఎదిగో, ఎన్నికయ్యో హక్కులు సాధించుకుని అధికారం చెలాయిస్తున్నారు. సామాన్యులు ఎలాంటి హక్కులూ లేకుండా కునారిల్లుతున్నారు. అదే తానులోనుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వృత్తుల పేరిటా, ఉద్యోగాల పేరిటా సంఘాలు పెట్టుకుని, హక్కుల పోరాటాల పేరుతో లేని అధికారాలు అనుభవిస్తున్నారు. పై పదవులకు నిచ్చెనలు వేసుకుంటున్నారు.
సంఘాల కుంపట్లు పెట్టుకోని వర్గాలు ఈనాడు కాగడాలు వేసి గాలించినా కనిపించవు. ఎన్జీవోలకు సంఘాలున్నాయి. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు అసోసియేషన్లు ఉన్నాయి. రిక్షాలు లాగేవారికే కాదు, విమానాలు నడిపేవారికీ యూనియన్లు ఉన్నాయి. అమ్మేవారికి, కొనేవారికి సమాఖ్యలున్నాయి. రాసేవారికి, ఆ రాసిన వాటిని అచ్చేసేవారికీ సంస్థలు ఉన్నాయి. ఆడవారికీ, భార్యాబాధితులకు సయితం సమాజాలున్నాయి. వృత్తుల వారీగా, కులాలవారీగా, మతాలవారీగా ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి. వీటన్న్టిటికీ, సొంతంగా ఏర్పరచుకున్న హక్కులు ఉన్నాయి. లేకపోయినా, వాటికోసం పోరాడగల యంత్రాంగ వ్యవస్తలున్నాయి. వారి భావాలను విప్పిచెప్పగల గళాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి. హక్కుల సాధనకోసం సమ్మెలు, బంద్ లు, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోఖోలు, రైల్ రోఖోలు, ఘెరావ్ లు, ముట్టడులూ, ఊరేగింపులూ, బైఠాయింపులూ, అటకాయింపులూ, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో రూపాల్లో.. సామాన్యుడి సాధారణ జీవనాన్ని అతలాకుతలం చేస్తూ, మరింత దుర్బరంగా మారుస్తూ, పై పెచ్చు తాము పడుతున్న ఈ పడరాని పాట్లన్నీ ఆ సామాన్యుడి కోసమే అని చెప్పి నమ్మించగల టక్కుటమార విద్యలన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ లేనివాడు, అసలేమీ లేనివాడు మాత్రం రాజ్యాంగం తనకు కల్పించిన అన్ని రక్షణలకూ తూట్లు పొడుస్తున్న ఈ అస్తవ్యస్త వ్యవస్థల మధ్య చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ దిక్కుతోచక విలవిలలాడుతున్నాడు.
కారణాలు ఏమైనా, హేతుబధ్దత ఎంత ఉన్నా, బంద్ ల వల్లా, రాస్తారోఖోల వల్ల నష్టపోతున్నదీ, కష్టపడుతున్నదీ సామాన్యులే అన్నది నగ్న సత్యం. నిరసనలూ, ఆందోళనల పేరుతో రాజకీయపార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఇతర సంస్థలూ, ఇష్టారాజ్యంగా నడిరోడ్లపై చేస్తున్న ధర్నాలు, బైఠాయింపులు నిత్యకృత్యంగా మారి జనజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయన్నది కూడా అంతే నిజం.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చే నెపంతో రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు తమ వైఖరులనూ, విధానాలను పునస్సమీక్షించుకోవాలి. ఏ సామాన్య జనం కోసమైతే ఉద్యమాలు, ఆందోళనలూ, నిర్వహిస్తున్నామని ఆయా పార్టీలూ, సంఘాలు అనుకుంటున్నాయో, ఆ సామాన్య జనాన్నే తమ ఈ విధివిధానాలు మరింత చీకాకు పరుస్తున్నాయన్న వాస్తవాన్ని అర్దం చేసుకోవాలి. పోరాటాల పేరుతోనో, ఇతరేతర రాజకీయ కారణాలతోనో బడుగుజీవి నడుం విరుస్తున్న ఈ అపభ్రంశపు విధానాలు ఏ నాగరిక దేశంలోనూ కానరావు. సాటి పౌరులకు ఇబ్బంది కలగని రీతిలో నిరసనలు ప్రకటించే పద్ధతులను సభ్యసమాజం పాటించి తీరాలన్న ప్రాధమిక స్పృహ మనదేశంలో కలికానికి కూడా కానరాదు.
ఒకసారి, సూర్యాపేట మీదుగా బస్సులో ఖమ్మం వెడుతుంటే నడుమ దారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కారణం వాకబు చేయడానికి వెడితే కొంతదూరంలో ఏదో పార్టీకి చెందిన కార్యకర్తలు, పట్టుమని పదిమంది కూడా లేరు, జండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ నడిరోడ్డుపై ధర్నా చేస్తున్నారు. ‘ఇలా ఎంతసేపు మీ తమాషా చూడాలని గద్దిస్తే‘, ‘ఒక్క అరగంట ఓపిక పట్టండి సార్! ఫలానా టీవీ వాళ్ళు దోవలో ఉన్నామని ఇప్పుడే సెల్ ఫోన్లో చెప్పారు’ అని వాళ్ళ నాయకుడు జవాబిచ్చాడు. ఇలాంటి చిన్నాచితకా ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోఖోలు ససేమిరా చూపించేది లేదని ఛానళ్ళన్నీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగల్గితే మెరుగయిన సమాజం కోసం నిజంగా కృషి చేసినట్టవుతుంది. ప్రచారం కోసం కాకుండా ప్రజాక్షేమాన్ని కోరుకునే సంస్థలు కూడా తమ కార్యకర్తల్ని తక్షణం రంగంలోకి దింపి ‘ఇలా ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారికి దయచేసి ఓట్లు వెయ్యవద్దు’ అనే ప్లకార్డులను పట్టుకుని మౌనంగా ఆ పక్కనే నిలబడితే, నవ్యత్వం కోసం పాటుపడే ఛానళ్ళన్నీ ఆ దృశ్యాలను ఒక్కమారైనా ప్రసారం చేయగలిగితే, ఇంకోసారి ఏపార్టీ, ఏ యూనియన్ కూడా ఇలాంటి ఆందోళనలకు సాహసించదు. కానీ సంచలనం ఒక్కటే సమస్తం అనుకునే ఈ పోటాపోటీ ప్రచార వ్యాపార యుగంలో ఇది నెరవేరని కలే.
కానీ, ఏదో ఒకరోజు ‘సామాన్యుడి రోజు’ కూడా వస్తుంది. నిరసనలని వ్యక్తం చేయడానికి ఎంచుకున్న విధానాల ద్వారా వేలాది మంది ప్రజలను అకారణంగా ఇబ్బంది పెట్టే హక్కు వీరికెవరిచ్చారన్న ప్రాధమిక ప్రశ్న ముందుకు వస్తుంది.
అర్భకుడు, అమాయకుడు అనుకున్న ఈ సామాన్యుడే తిరగబడి ‘ఇంకానా’ ఇకపై సాగదు!’ అంటూ హూంకరిస్తూ, తన జీవితంతో ఆటాడుకుంటున్న ‘వర్గాల’ మెడలు వంచే రోజు తప్పక వస్తుంది.
తస్మాత్ జాగ్రత్త!
12, అక్టోబర్ 2022, బుధవారం
దరిద్రం యెలా వుంటుంది? – భండారు శ్రీనివాసరావు
9, అక్టోబర్ 2022, ఆదివారం
వినేవారేరీ! - భండారు శ్రీనివాసరావు
(Published in Andhra Prabha on 09-10-2022, SUNDAY, today)
ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్టుగా రాజకీయం మకిలి సోకని రంగం అంటూ ఏదీ కనబడని రోజులివి. 'రాజకీయ రంగు' వంటి కాస్తంత ఉదాత్తమైన పదం వాడకుండా రాజకీయ 'మకిలి' అనే పరుష పద ప్రయోగానికి పూనుకోవడానికి కూడా కారణం వుంది. ప్రజా సంఘాల పేరుతొ ఏదయినా మంచీ చెడూ చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు వారిని 'నడిపేదీ నడిపించేదీ, కదిలేదీ కదిలించేదీ' ఏదో ఒక రాజకీయ శక్తి అని సందేహిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ధర్మాధర్మవిచక్షణతో కూడిన సద్విమర్శలకు, రాజకీయ కోణంతో చేసే ఆరోపణలకు నడుమ వున్న తేడాను గమనించకుండా వ్యవహరించడం ఈనాటి పాలకుల పద్దతిగా కానవస్తోంది.
నిజమైన ప్రజాసంఘాలకీ, రాజకీయ నేపధ్యం కలిగిన ప్రజా సంఘాలకీ హస్తిమశకాంతరం తేడా వుంది. చాలా ఏళ్ళ క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రాజధానీ నగరం హైదరాబాదులోని ఒక రద్దీ కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల కొద్దిసేపు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం మానేశాయి. దాంతో ఎవరి హడావిడిలో వాళ్ళు పోవడం వల్ల వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ తన పదవినీ, దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది. దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే సంస్థకు చెందిన రాజకీయ కార్యకర్తలు మంచి మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం. రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.
అధికారంలో ఉన్నవాళ్ళకి తాము చేసే ప్రతిపనీ మంచిగానే కనిపిస్తుంది. సమాజ శ్రేయస్సుకోసం తాము అహరహం కష్టపడుతున్నా విమర్శలు చేయడం తగదన్న భావన పాలకులది. నాకు తెలిసిన గతంలో ఆ పనుల్లోని లోటుపాట్లను పాలకులకు ఎత్తి చూపే అధికారులు వుండేవారు. ఇప్పటికాలంలో అలాటి అధికారులూ లేరు. అధవా, ఏ అధికారి అయినా కల్పించుకుని చెప్పబోయినా చెవినబెట్టే పాలకులూ లేరు. చెబితే విననప్పుడు చెప్పడం దండగ అనుకునే వాళ్ళు కొందరయితే, పైవారికి హితవు కాని మాటలు చెప్పి, లేని తలనొప్పి తెచ్చిపెట్టుకోవడం ఎందుకని సర్దుకుపోయే వారు మరికొందరు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారులకి ఆయన అంటే సింహ స్వప్నం. ఆయన మాట వేదవాక్యం. ఎదురు చెబితే, నలుగురి ఎదుటా ఏ మాట పడాల్సివస్తుందో అని బెదిరిపోయేవారు. ఆయన పేషీలో ఎస్.ఆర్. రామమూర్తి అని నిజాయితీకి మారుపేరయిన ఓ ఐ.ఏ.యస్. అధికారి వుండేవారు. చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి విలక్షణం. నిండు పేరోలగం మాదిరిగా, మంత్రులు, శాసన సభ్యులతో కొలువుతీరి కూర్చునేవారు. తన వద్దకు పనుల మీద వచ్చిన అనుయాయులను సంతృప్తి పరచడానికి 'ఖుద్దున ఆ పని పూర్తిచేయాల'ని అధికారులకి తక్షణ ఆదేశాలు ఇచ్చేవారు. వాటిల్లో నిబంధనల ప్రకారం చేయలేనివి కొన్ని వుంటాయి. తన నోటి మాటే 'జీవో' అని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన. అంచేత అలాటి వ్యక్తి ఆర్డరు వేస్తె కాదనే దమ్ము ఏ అధికారికి వుంటుంది. రామమూర్తిగారు తన 'బాసు' మనస్తత్వాన్ని కనిపెట్టి తదనుగుణంగా ప్రవర్తించేవారు. చెన్నారెడ్డి గారు నలుగురిలో వున్నప్పుడు ఒక పని చెప్పీ చెప్పగానే, వెంటనే 'యస్. సర్. తప్పకుండా అలాగే చేద్దాము' అనేవారు. పని మీద వచ్చిన వాళ్ళు కూడా పనయిపోయిందన్న సంతోషంతో వెనక్కి మళ్లేవారు. అధికారులు తన మాట 'తూచ' తప్పకుండా వింటున్నారని ముఖ్యమంత్రి అనుకునేవారు. అయితే, తీరా ఆ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం వెనక్కి వచ్చినప్పుడు, రామమూర్తిగారు అందులోని మర్మాలను, ఇబ్బందులను ముఖ్యమంత్రికి విడమరచి చెప్పి, ఏ పరిస్తితుల్లోనూ సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని చెబుతూ, 'నో సర్! ఇది కుదరదు' అని నిక్కచ్చిగా చెప్పేవారు. చెన్నారెడ్డి గారు కూడా హుందాగా తల పంకించి ఊరుకునేవారు కానీ ఆ విషయం మీద మరింత పట్టుపట్టేవారు కాదు. ఇవన్నీ చూసిన వారు యస్. ఆర్. రామమూర్తి గారిని పరోక్షంలో 'యస్.సర్, రామమూర్తి, నో సర్. రామమూర్తి' అని హాస్యోక్తిగా అనేవారు. అలాటి అధికారులు ఈనాడు అసలు లేరని చెప్పలేము కానీ అరుదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఈ నాటి పాలకులకు ఎదురు చెబితే తట్టుకునే సహనం తక్కువయిపోతోంది. పాలకులే కాదు అధికార గణం సయితం ఇదే తంతు. అందరికీ మెచ్చుకోళ్ళే కావాలి తప్ప విచక్షణతో కూడిన విమర్శ పనికిరాకుండా పోతోంది. 'ఎవరు ఎందుకు చెబుతున్నారు, అలా ఎందుకు చెబుతున్నారు' అని ప్రశ్నలు వేసుకుని సరయిన సమాధానాలు రాబట్టుకోగలిగితే పాలనాసూక్ష్మాలు బోధపడతాయి.
అసలు విషయానికి వస్తే '
పాలక పక్షం ఒక విధానం ప్రకటిస్తుంది. ప్రతిపక్షం అందులో వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా దాని వెనుక ఏదో పైకి కనిపించని రాజకీయ వ్యూహం వుందని ఆరోపిస్తుంది.
ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది. పాలక పక్షం అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా రాజకీయ కుట్ర అంటూ ఒక్క ముక్కలో కొట్టి పారేస్తుంది.
చెడిపోయిన గడియారం సయితం రోజులో రెండు మార్లు సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి వుంటాయి. కానీ ప్రతిపక్షాలు వాటిని గుర్తించవు. అభినందించవు.
ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ నూటికి నూరుశాతం ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా సహేతుకమైనవి కావచ్చు. కానీ అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు.
కారణం ఒక్కటే. 'రాజకీయం'.
ఇక్కడే ప్రజాసంఘాల పాత్ర వస్తుంది. రాజకీయ పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా చేయగలిగే సత్తావున్న ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా ఈ పాత్ర పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు పడి, వాటి విశ్లేషణలకు, అభిప్రాయాలకు, సూచనలకు, సలహాలకు ఒకనాడు వున్న గుర్తింపు మసకబారి పోతోంది.
ఈ దుస్తితి తప్పాలంటే సమస్యతో సంబంధం వున్న అందరూ ఒక మెట్టు దిగాలి. ముందు వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని విశ్లేషించుకోవాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు. మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం అలవరచుకోవాలి.
ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే సాధ్యం కాదు.
సాధ్యమే అని నిశ్చయించుకుంటే అసాధ్యం కాదు.
5, అక్టోబర్ 2022, బుధవారం
దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని – భండారు శ్రీనివాసరావు
(Published in Andhra Prabha on 02-10-2022 SUNDAY)
శ్రీ రామచంద్రుడు
సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తూ ఒకానొక ప్రదేశంలో ఓ శీతల తరుచ్ఛాయకు చేరి
ధనుర్బాణాలను పక్కన బెట్టి విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం లేచి కూర్చున్న
రామునికి తన విల్లుకింద నలిగిపోతూ నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపించింది. ఆ కప్ప
దుస్తితికి తానే కారణం అని మధనపడుతూ ఆ చిరుజీవిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన
వింటి బరువును మోస్తూ, అమితమయిన బాధను భరిస్తూ కూడా ఎందుకలా మౌనంగా వున్నావని ప్రశ్నించాడు.
దానికా మండూకం జవాబు చెబుతూ - ‘సమస్త లోకాలను కాపాడే దేవదేవుడివి నువ్వు. ఏదయినా
కష్టం వస్తే లోకులందరూ నీకే మొరబెట్టుకుంటారు. అలాటిది నీ బాణం కిందే నలిగిపోతున్న
నేను, కాపాడవలసిందని ఇక ఎవర్ని వేడుకునేది?’ అని ఎదురు ప్రశ్న
వేయడంతో శ్రీరాముడు అవాక్కయాడు.
మన దేశానికి
స్వతంత్రం వచ్చి డెబ్బయి అయిదేళ్లు. స్వతంత్ర ఫలాలను భావితరాలకు భద్రంగా అప్పగించే
పవిత్ర లక్ష్యంతో, బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో సొంత రాజ్యాంగాన్ని రాసుకుని, దాన్ని కాపు
కాయడానికి ఒకదానికి మరొకటి దన్నుగా మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఇన్ని
దశాబ్దాల స్వతంత్ర జీవనంలో ఎన్ని అవాంతరాలు
ఎదురయినా, ఎన్నెన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నా, పార్లమెంటు, ఎక్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే ఈ
మూడు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య
దేశమన్న కలికితురాయిని భారత కీర్తి కిరీటానికి అమర్చిపెట్టాయి. ఈ మూడింటికీ
చెదలుపట్టే పరిస్తితే దాపురిస్తే, నేనున్నానంటూ
దీనజనానికి బాసటగా నిలబడే నాలుగో వ్యవస్థ మీడియా వుండనే వుంది. అందుకే దానికి
ఫోర్త్ ఎస్టేట్ అన్న అనధికారిక నామం స్తిరపడింది.
అయితే, ఇటీవలి కాలంలో ఈ
వ్యవస్థలన్నీ రాజ్యాంగం తమపై వుంచిన బాధ్యతలను పాటిస్తున్నాయా, కర్తవ్యాలను
నెరవేరుస్తున్నాయా లేదా వాటినుంచి దూరంగా జరుగుతున్నాయా అన్న అనుమానం సామాన్య
జనంలో కలుగుతోంది. బ్రోచేవాళ్ళే దోచేవాళ్ళుగా మారుతున్న విషాద పరిస్థితుల్లో
భారతావని లోని అశేష జనావళి స్తితి
రాముని కాలంనాటి కధలోని కప్పను తలపిస్తోంది.
ప్రజాధనాన్ని
అప్పనంగా ఆరగిస్తున్న ప్రజాప్రతినిదుల అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడడం, నియమనిబంధనల
చట్రంలో వారిని వుంచాల్సిన బాధ్యత కలిగిన అధికారగణం సయితం అదే అవినీతి కూపంలో
ఇరుక్కునిపోవడం, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్త లోని కొందరు న్యాయకోవిదులు వృత్తి
ధర్మానికి నిలువు పాతర చేసి చట్టానికి తమదైన రీతిలో భాష్యం చెబుతూ అవినీతి పరుల
కొమ్ము కాయడం, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినప్పుడు వాటిని సరిదిద్దే పవిత్ర
కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన మీడియా లోని అత్యధిక భాగం ఈ యావత్తు భాగోతంలో భాగం
కావడం ఇవన్నీ అమృతోత్సవ్ జరుపుకున్న స్వతంత్ర
భారతానికి అంటుకున్న మరకలు. కడిగినా
వొదలని మురికి.
ఈనాటి
పరిస్తితుల్లోని మరో విషాద కోణం ఏమిటంటే-
నిస్సిగ్గుగా
లంచాలు మేస్తున్నవాళ్ళు అందుకు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ప్రజల డబ్బును తేరగా
భోంచేసి త్రేనుస్తున్నవాళ్ళు అందుకు తత్తరపాటు పడడం లేదు. పైపెచ్చు అదొక హక్కుగా
భావించి సమర్ధించుకుంటున్న తీరు మరింత బాధాకరం. విచారణ సంస్తల దర్యాప్తు క్రమంలో
వెలుగు చూస్తున్న వాస్తవాలు జనాలను నివ్వెరపరుస్తున్నాయి. చివరకు నిగ్గుతేలే
నిజాలు న్యాయస్తానాలలో ఏమేరకు నిలుస్తాయో ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటె వ్యవస్థలోని
లోపాలను పసికట్టి, వాటికి తగిన తరుణోపాయాలను కనిపెట్టి కాచుకోవడం ఎలాగన్నది అక్రమార్కులకు
వెన్నతో బెట్టిన విద్య. ప్రజాధనం దోపిడీలో హెచ్చుతగ్గుల తేడాలే కాని అందరూ అందరే
అన్న నగ్న సత్యాన్ని ఎవరికి వారే బయటపెట్టుకుంటున్నారు. కొన్ని అవినీతి పురాణాలు
వెలుగు చూస్తున్న సందర్భాలను గమనిస్తుంటే, వాటివెనుకవున్న
వ్యక్తులను చూస్తుంటే , వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి కంటే కూడా, తాముతిన్న
దానికన్నా ఎదుటి పక్షం వారు నాలుగాకులు ఎక్కువ తిన్నారన్న దుగ్దే వారిని ఎక్కువగా
బాధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక
స్తాయిని దాటిపోయి వెగటు కలిగిస్తున్నాయి. ఇక్కడ వ్యక్తులను పేరు పేరునా
పేర్కొనాల్సిన పని లేదు. అందరూ ఓ తానులోని ముక్కలే. వీరందరూ ఈ గందరగోళ, అవాంఛిత
పరిస్థితులు సృష్టించిన అష్టావక్రులే.
సమస్యతో సంబంధం
వున్న పక్షాల్లో దేన్నో ఒకదానిని గుడ్డిగా సమర్ధించడం మినహా నిష్పక్షపాతంగా
అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేని స్తితి. మీడియాలో జరిగే చర్చల్లో కూడా
అసలు అంశం వెనక్కు పోయి అనవసర విషయాలు తెరమీదకు వస్తున్నాయి. నిజాలకంటే నెపాలకు
పెద్దపీట వేస్తున్నారు.
వీరంతా ఒకరిని
మరొకరు నిందించుకుంటున్న తీరుతెన్నుల్ని చూసి ఆనందించడం కాదు ఈ రోజున మనం
చేయాల్సింది. అందరం ఆలోచించాలి కూడా. ఎందుకంటె, మనం కూడా ఇలాటి
అస్తవ్యస్త వ్యవస్థ నిర్మాణానికి ఏదో ఒకరూపంలో ‘రాళ్ళెత్తి’న కూలీలమే. ఈ దుర్దశ
దాపురించడంలో మనకూ భాగం వుందని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళమే.
ఈ సందర్భంలో, కొన్నేళ్ళక్రితం
మన దేశానికి వచ్చిన ఒక విదేశీ యాత్రికుడు తన అనుభవాలను రాస్తూ పేర్కొన్న విషయాలను
ప్రస్తావించడం సముచితంగా వుంటుంది.
“భారత దేశానికి
రాకముందు నేను నాస్తికుడిని. ఇక్కడకు వచ్చిన తరువాత క్రమక్రమంగా నా కళ్ళు
తెరిపిళ్ళు పడడం మొదలయింది. ఈ దేశంలో బీదా బిక్కీ తాగుతున్న నీళ్ళు చూసిన తరువాత ఈ
జనాలను ఏదో అదృశ్య శక్తి కాపాడుతోందన్న భావన నాలో ప్రబలింది. అలాటి మురికి నీళ్ళు
తాగుతూ కూడా జనం ప్రాణాలతో మనగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ దేవుడి కృప లేనిది అది
సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లమీద వాహనాలు విచ్చలవిడిగా తిరుగాడుతున్న తీరుకు రోజూ
ఎన్నో వందలమంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ వుండాలి. అలా జరగడం లేదంటే వీరిని
భగవంతుడే కాపాడుతూవుండాలి.”
మచ్చలు పడ్డ
ఇంతమంది రాజకీయ నాయకులు, లంచగొండిపరులయిన ఇంతమంది అధికారులు, భ్రష్టుపట్టిపోయిన
ఇంతమంది న్యాయకోవిదులు, సంపాదనే లక్ష్యంగా కలిగిన ఇంతమంది మీడియా వారు, ఇందరు వున్నా కూడా దేశంలో
ప్రజాస్వామ్యం ఇంకా అంతో ఇంతో బతికే వుందంటే ఏదో అదృశ్య శక్తి మాత్రమే దేశాన్ని
కాపాడుతున్నదని అనుకోవాలి.
కవికుల తిలకుడు బాలగంగాధర తిలక్ తన కవితా ఖండిక ‘ప్రార్ధన’ లో
కోరుకున్నట్టు,‘దేవుడా రక్షించు నా దేశాన్ని’.