5, అక్టోబర్ 2022, బుధవారం

దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha on 02-10-2022 SUNDAY)

శ్రీ రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తూ ఒకానొక ప్రదేశంలో ఓ శీతల తరుచ్ఛాయకు చేరి ధనుర్బాణాలను పక్కన బెట్టి విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం లేచి కూర్చున్న రామునికి తన విల్లుకింద నలిగిపోతూ నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపించింది. ఆ కప్ప దుస్తితికి తానే కారణం అని మధనపడుతూ ఆ చిరుజీవిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన వింటి బరువును మోస్తూ, అమితమయిన బాధను భరిస్తూ కూడా ఎందుకలా మౌనంగా వున్నావని ప్రశ్నించాడు. దానికా మండూకం జవాబు చెబుతూ - ‘సమస్త లోకాలను కాపాడే దేవదేవుడివి నువ్వు. ఏదయినా కష్టం వస్తే లోకులందరూ నీకే మొరబెట్టుకుంటారు. అలాటిది నీ బాణం కిందే నలిగిపోతున్న నేను, కాపాడవలసిందని ఇక ఎవర్ని వేడుకునేది?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో శ్రీరాముడు అవాక్కయాడు.

మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బయి అయిదేళ్లు. స్వతంత్ర ఫలాలను భావితరాలకు భద్రంగా అప్పగించే పవిత్ర లక్ష్యంతో, బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో సొంత రాజ్యాంగాన్ని రాసుకుని, దాన్ని కాపు కాయడానికి ఒకదానికి మరొకటి దన్నుగా మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఇన్ని దశాబ్దాల స్వతంత్ర జీవనంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా, ఎన్నెన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నా, పార్లమెంటు, ఎక్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కలికితురాయిని భారత కీర్తి కిరీటానికి అమర్చిపెట్టాయి. ఈ మూడింటికీ చెదలుపట్టే పరిస్తితే దాపురిస్తే, నేనున్నానంటూ దీనజనానికి బాసటగా నిలబడే నాలుగో వ్యవస్థ మీడియా వుండనే వుంది. అందుకే దానికి ఫోర్త్ ఎస్టేట్ అన్న అనధికారిక నామం స్తిరపడింది.

అయితే, ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగం తమపై వుంచిన బాధ్యతలను పాటిస్తున్నాయా, కర్తవ్యాలను నెరవేరుస్తున్నాయా లేదా వాటినుంచి దూరంగా జరుగుతున్నాయా అన్న అనుమానం సామాన్య జనంలో కలుగుతోంది. బ్రోచేవాళ్ళే దోచేవాళ్ళుగా మారుతున్న విషాద పరిస్థితుల్లో భారతావని లోని అశేష జనావళి స్తితి రాముని కాలంనాటి కధలోని కప్పను తలపిస్తోంది.

ప్రజాధనాన్ని అప్పనంగా ఆరగిస్తున్న ప్రజాప్రతినిదుల అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడడం, నియమనిబంధనల చట్రంలో వారిని వుంచాల్సిన బాధ్యత కలిగిన అధికారగణం సయితం అదే అవినీతి కూపంలో ఇరుక్కునిపోవడం, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్త లోని కొందరు న్యాయకోవిదులు వృత్తి ధర్మానికి నిలువు పాతర చేసి చట్టానికి తమదైన రీతిలో భాష్యం చెబుతూ అవినీతి పరుల కొమ్ము కాయడం, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినప్పుడు వాటిని సరిదిద్దే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన మీడియా లోని అత్యధిక భాగం ఈ యావత్తు భాగోతంలో భాగం కావడం ఇవన్నీ అమృతోత్సవ్  జరుపుకున్న స్వతంత్ర భారతానికి అంటుకున్న మరకలు. కడిగినా వొదలని మురికి.

ఈనాటి పరిస్తితుల్లోని మరో విషాద కోణం ఏమిటంటే-

నిస్సిగ్గుగా లంచాలు మేస్తున్నవాళ్ళు అందుకు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ప్రజల డబ్బును తేరగా భోంచేసి త్రేనుస్తున్నవాళ్ళు అందుకు తత్తరపాటు పడడం లేదు. పైపెచ్చు అదొక హక్కుగా భావించి సమర్ధించుకుంటున్న తీరు మరింత బాధాకరం. విచారణ సంస్తల దర్యాప్తు క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు జనాలను నివ్వెరపరుస్తున్నాయి. చివరకు నిగ్గుతేలే నిజాలు న్యాయస్తానాలలో ఏమేరకు నిలుస్తాయో ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటె వ్యవస్థలోని లోపాలను పసికట్టి, వాటికి తగిన తరుణోపాయాలను కనిపెట్టి కాచుకోవడం ఎలాగన్నది అక్రమార్కులకు వెన్నతో బెట్టిన విద్య. ప్రజాధనం దోపిడీలో హెచ్చుతగ్గుల తేడాలే కాని అందరూ అందరే అన్న నగ్న సత్యాన్ని ఎవరికి వారే బయటపెట్టుకుంటున్నారు. కొన్ని అవినీతి పురాణాలు వెలుగు చూస్తున్న సందర్భాలను గమనిస్తుంటే, వాటివెనుకవున్న వ్యక్తులను చూస్తుంటే , వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి కంటే కూడా, తాముతిన్న దానికన్నా ఎదుటి పక్షం వారు నాలుగాకులు ఎక్కువ తిన్నారన్న దుగ్దే వారిని ఎక్కువగా బాధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక స్తాయిని దాటిపోయి వెగటు కలిగిస్తున్నాయి. ఇక్కడ వ్యక్తులను పేరు పేరునా పేర్కొనాల్సిన పని లేదు. అందరూ ఓ తానులోని ముక్కలే. వీరందరూ ఈ గందరగోళ, అవాంఛిత పరిస్థితులు సృష్టించిన అష్టావక్రులే.

సమస్యతో సంబంధం వున్న పక్షాల్లో దేన్నో ఒకదానిని గుడ్డిగా సమర్ధించడం మినహా నిష్పక్షపాతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేని స్తితి. మీడియాలో జరిగే చర్చల్లో కూడా అసలు అంశం వెనక్కు పోయి అనవసర విషయాలు తెరమీదకు వస్తున్నాయి. నిజాలకంటే నెపాలకు పెద్దపీట వేస్తున్నారు.

వీరంతా ఒకరిని మరొకరు నిందించుకుంటున్న తీరుతెన్నుల్ని చూసి ఆనందించడం కాదు ఈ రోజున మనం చేయాల్సింది. అందరం ఆలోచించాలి కూడా. ఎందుకంటె, మనం కూడా ఇలాటి అస్తవ్యస్త వ్యవస్థ నిర్మాణానికి ఏదో ఒకరూపంలో ‘రాళ్ళెత్తి’న కూలీలమే. ఈ దుర్దశ దాపురించడంలో మనకూ భాగం వుందని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళమే.

ఈ సందర్భంలో, కొన్నేళ్ళక్రితం మన దేశానికి వచ్చిన ఒక విదేశీ యాత్రికుడు తన అనుభవాలను రాస్తూ పేర్కొన్న విషయాలను ప్రస్తావించడం సముచితంగా వుంటుంది.

భారత దేశానికి రాకముందు నేను నాస్తికుడిని. ఇక్కడకు వచ్చిన తరువాత క్రమక్రమంగా నా కళ్ళు తెరిపిళ్ళు పడడం మొదలయింది. ఈ దేశంలో బీదా బిక్కీ తాగుతున్న నీళ్ళు చూసిన తరువాత ఈ జనాలను ఏదో అదృశ్య శక్తి కాపాడుతోందన్న భావన నాలో ప్రబలింది. అలాటి మురికి నీళ్ళు తాగుతూ కూడా జనం ప్రాణాలతో మనగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ దేవుడి కృప లేనిది అది సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లమీద వాహనాలు విచ్చలవిడిగా తిరుగాడుతున్న తీరుకు రోజూ ఎన్నో వందలమంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ వుండాలి. అలా జరగడం లేదంటే వీరిని భగవంతుడే కాపాడుతూవుండాలి.”

మచ్చలు పడ్డ ఇంతమంది రాజకీయ నాయకులు, లంచగొండిపరులయిన ఇంతమంది అధికారులు, భ్రష్టుపట్టిపోయిన ఇంతమంది న్యాయకోవిదులు, సంపాదనే లక్ష్యంగా కలిగిన ఇంతమంది మీడియా వారు, ఇందరు వున్నా కూడా దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా అంతో ఇంతో బతికే వుందంటే ఏదో అదృశ్య శక్తి మాత్రమే దేశాన్ని కాపాడుతున్నదని అనుకోవాలి.

కవికుల తిలకుడు  బాలగంగాధర తిలక్ తన కవితా ఖండిక ‘ప్రార్ధన’ లో కోరుకున్నట్టు,‘దేవుడా రక్షించు నా దేశాన్ని’. 

 

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

దేవుడు ఏనాడో చేతులెత్తేసాడు.
దక్షిణాఫ్రికా రచయిత Alan Paton అన్నట్లు Cry, the Beloved Country.

రాముడి ధనస్సు, దాని క్రింద కప్ప కథ
చాలా సార్లు చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటుంది కానీ ఆ కథ నిజంగా వాల్మీకి రామాయణంలో ఉందంటారా? పిట్టకథ అని నా అనుమానం. ఎందుకంటే మొదటి నుంచే రాముడిని నువ్వు దేవుడివి అనటం కథలు వ్రాసే వారి wisdom after the event అనిపిస్తుంది నా మటుకు.

అజ్ఞాత చెప్పారు...

ఏమిటీ నిర్వేదం అదిన్నూ మీ కలం నుండి !

Get out of the negativism my boy !

అజ్ఞాత చెప్పారు...

“my boy” ??????
ఎవర్ని “అజ్ఞాత” గారు, భండారు వారినే 🤔??