12, జులై 2022, మంగళవారం
ఎవడబ్బసొమ్మని – భండారు శ్రీనివాసరావు
11, జులై 2022, సోమవారం
ఎంతమంది చదువుతారు? – భండారు శ్రీనివాసరావు
లక్ష సర్క్యులేషన్ వున్న పత్రికలో మన వ్యాసం అచ్చవుతే ఆ లక్షమందీ దాన్ని చదువుతారు అనుకోవడం ఓ భ్రమ. కాకపొతే ఎక్కువమంది కళ్ళల్లో పడే అవకాశం ఎక్కువ. కాదనను.
నలుగురూ చదవాలనే ఏ
రచయిత అయినా కోరుకుంటాడు. అయితే ఆ ‘నలుగురు’ లక్షమంది కావచ్చు, ‘నలుగురే’ కావచ్చు.
ప్రేమలేఖను
ఎంతమంది చదువుతారు చెప్పండి. ప్రేయసి ఒక్కరు చదివితే చాలని మురిసిపోతాడు ప్రియుడు.
అందుకే నేను
రాసేది ప్రతిదీ ఇటువంటి సాంఘిక మాధ్యమాలలోనే పోస్ట్ చేస్తాను.
నాకిదో ‘తుత్తి’
10, జులై 2022, ఆదివారం
తెలుగు సినీ హాస్యానికి పెట్టని కోట, కోట శ్రీనివాసరావు
(జులై, 10, కోట పుట్టినరోజు)
“రేడియో నుంచి చాలా నేర్చుకున్నాను. ఉచ్చారణ ఎలా వుండాలి? ఏ వాక్యాన్ని ఎక్కడ ఎలా విరవాలి? ఏ పదాన్ని ఎక్కడ ఎంత నొక్కి చెప్పాలి? ఇవన్నీ రేడియో నాటకాల్లో నటిస్తూ నేర్చుకున్నాను”
తన డెబ్బయి నాలుగో పుట్టినరోజున ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఇవి. ఒకప్పుడు రేడియోలో పనిచేసిన మనిషిగా ఈ మాటలు విని నేనూ సంతోషపడ్డాను.
“బ్యాంకులో ఉద్యోగం. సాయంత్రాలు నాటకాలు రిహార్సల్స్. మధ్యమధ్య రేడియో నాటకాలు. రవీంద్ర భారతిలోనే నూట యాభయ్ కి పైగా నాటకాలు వేసిన అనుభవం. ఎవరో అన్నారు, సినిమాల్లో కూడా ప్రయత్నించరాదా అని. నాది నల్లటి ఛాయ. ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకున్నావా అంటారేమో అని బెరుకు”
అలాంటి మనిషి ఒకటీ అరా కాదు, లెక్కకు మించిన సినిమాల్లో వేశారు. అవీ చిన్నాచితకా వేషాలు కావు. నటనా వైదుష్యానికి గుర్తుగా ఎనిమిది నందులు ఆయన సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ ఆకాశంలో ఓ వెలుగు వెలిగారు.
నేను రేడియోలో చేరిన కొత్తల్లో కోట శ్రీనివాసరావు గారు నారాయణ గూడా (దీపక్ మహల్ పక్కన) స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. అప్పుడప్పుడు తోటి నాటకాల నటులతో కలిసి రేడియో ఆవరణలో కనిపించేవారు.
ఒకరోజు అయన అన్నమాటలు నాకు బాగా జ్ఞాపకం.
“మా బ్యాంకు వాళ్లకు ఆటలు ఆడేవాళ్ళు తప్ప మా బోటి నటులు పనికిరారు. (ఆ రోజుల్లోనే స్టేట్ బ్యాంకు ఉద్యోగి మహమ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ క్రీడాకారుడిగా నిలదొక్కుకుంటున్నారు. చిన్నతనంలో విఠల్ వాడీలో గల్లీ క్రికెట్ ఆడేవారని చెప్పుకునేవారు) వాళ్లకు అడగడమే ఆలస్యం సెలవు దొరుకుతుంది. నాకేమో రాకరాక ఓ సినిమా వేషం వచ్చింది. వారం రోజులు సెలవు కావాలంటే దొరకడం గగనం. సరే మేము సినిమాల్లో వేషాలు వేసి డబ్బులు తీసుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళు మాత్రం క్రికెట్ ఊరికే ఆడుతున్నారా! ఎందుకీ వివక్ష?” అనేది ఆయన ఆవేదన.
సినిమాలు పెరిగాక ఆయన ఆ ఉద్యోగం వదిలేశారు, అది వేరే విషయం.
స్టేట్ బ్యాంకులో మధుర బాబుగారని ఓ అధికారి వుండేవారు. (చనిపోయి కొద్ది సంవత్సరాలు అవుతోంది) హైదరాబాదు మెయిన్ బ్రాంచికి మేనేజర్. సమర్ధుడైన ఆఫీసర్ అని పేరు. ఆ రోజుల్లో ఆయన హవా బాగా వుండేది. ఈ రోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అనిపించుకుంటున్న వారిలో అనేకమంది ఆయనకోసం ఆఫీసు బయట వెయిట్ చేస్తుంటే నేను ఆరోజుల్లో చూశాను. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారూ మధురబాబు గారు మంచి స్నేహితులు. మా అన్నయ్య విశాఖ గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా, మధురబాబుగారు నాగార్జున గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా పనిచేశారు. తదనంతర కాలంలో మా అన్నయ్య చెన్నై, పుదుచ్చేరి, కేరళరాష్ట్రాల స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా, మధురబాబు గారు జనరల్ మేనేజర్ గా పనిచేశారు. ప్రపంచ ప్రసిద్ధ కేన్సర్ నిపుణులు నోరి దత్తాత్రేయుడు మధురబాబు గారికి స్వయానా తమ్ముడు.
వేరే విషయం అంటూ వేరే వేరే విషయాల్లోకి పోతున్నానని అనుకుంటున్నారా. లేదు. కోట శ్రీనివాసరావు గారికీ బ్యాంకుకూ సంబంధం ఉన్నట్టే, ఒకప్పుడు ఏ బ్యాంకులో అయితే రెండు రోజులు సెలవు కోసం ఇబ్బందులు పడ్డారో అదే స్టేట్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేసిన ఈ మధురబాబు గారికీ సంబంధం వుంది. అది కూడా అలాంటిలాంటి సంబంధం కాదు. తదనంతర కాలంలో ఈ ఇద్దరూ స్వయానా వియ్యంకులు అయ్యారు.
Below Andhrajyothy link:
నరంలేని నాలుకలు – భండారు శ్రీనివాసరావు
(ఈరోజు ఆదివారం 10-07-2022 తేదీ ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
అడ్లాయ్
స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో
ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్
అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ
ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి అయిన ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం
పాలయ్యారు. 1956 లో మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్
హోవర్ తిరిగి గెలుపొందడంతో వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960 అధ్యక్ష
ఎన్నికలనాటికి డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని
బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధి రిచర్డ్ నిక్సన్ ని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం
స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే, తనకు
ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్
ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్
స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు
ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు
చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు.
‘మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు
వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం
లభించింది.
రాజకీయాల్లో
అసత్యాలు వల్లె వేసి, జనాలను నమ్మించడానికి ప్రయత్నించే సంప్రదాయం ఆ రోజుల నుంచే
వుందనుకోవాలి.
అసత్యాలు సరే
గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు
రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన తెలుగు రాష్ట్రాల రాజకీయాల తీరుతెన్నులను
గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
సోవియట్ యూనియన్
లో స్టాలిన్ అనంతరం అధికారానికి వచ్చిన కృశ్చెవ్ వీలు చిక్కినప్పుడల్లా స్టాలిన్
విధానాలను తూర్పారబడుతుండే వాడు. నిజానికి స్టాలిన్ హయాములో కృశ్చెవ్ ఆయనకు కుడి
భుజంగా ఉండేవాడు. స్టాలిన్ ఏం చెప్పినా పెదవి విప్పి ఏమీ చెప్పలేకపోయేవాడు.
స్టాలిన్ తదనంతరం
కృశ్చెవ్ సోవియట్ కేంద్ర కమిటీ అధినాయకుడిగా పదవి చేపట్టిన తర్వాత ఆయన స్టాలిన్ ను
పదేపదే విమర్శించే తీరు కృశ్చెవ్ అనుయాయులకు విచిత్రంగా తోచేది. స్టాలిన్ జీవించి
వున్న కాలంలో ఆయనకు వీర విధేయుడుగా ఉంటూ, ఆయన ఏమి చెప్పినా
గొర్రెలా తల ఊపే కృశ్చెవ్ ఇతడేనా అనే అనుమానం వారిని తొలుస్తుండేది. ‘ఆ రోజునే ఇలా
ఎందుకు మాట్లాడలేకపోయారు, ఇప్పుడెందుకు ఇలా దుయ్యబడుతున్నారు’ అని అడగాలని వారికి వున్నా ఆ మాట పైకి అనే ధైర్యం ఎవరికీ లేదు. చివరికి ఒకరోజు ఒక యువ నాయకుడు తెగించి మనసులో మాట
అడిగేశాడు. కృశ్చెవ్ నవ్వి ఇలా అన్నాడు.
‘మీరు ఈరోజు నా
ముందు నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నారా! ప్రతిదానికి తందానా అంటున్నారా లేదా!
ఆరోజుల్లో నేనూ అదేపని చేశాను’
ఇది ఒక జోక్
కావచ్చు. కేంద్రీకృత అధికార రాజకీయాలకు అద్దం పడుతుంది.
రోజూ టీవీ
చర్చల్లో “మీరు ఆరోజు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు
నిలదీస్తున్నారు” అని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు ప్రశ్నలు
సంధించుకుంటూ వుంటే ఎందుకో ఏమో ఈ జోకు జ్ఞాపకం వస్తుంటుంది
‘కండవర్ విండిలై
విండవర్ కండిలై’ అని తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు
చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు
మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్.
గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఒకే విషయం
గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి
ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే
దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా
చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు
చూపులు. చూసే వస్తువు ఒక్కటే! కనబడడంలోనే తేడాలు.
'నిజం
చెబుతున్నారా, నిజమే చెబుతున్నారా?' అనే సందేహాలు కలిగేలా వుంటాయి కొందరు రాజకీయ నాయకుల ప్రకటనలు.
ఇంత
అయోమయం గతంలో ఎన్నడూ లేదు.
దొరికిన
దొంగలు, దొరకని దొంగలు, దొరకాల్సిన దొంగలు అని మూడు రకాలు. అందరూ దొంగలే అయితే కింకర్తవ్యం?
'డబ్బులు
తీసుకుని పార్టీలు మారొచ్చు, డబ్బులు తీసుకుని పార్టీలు పెట్టొచ్చు. డబ్బులు తీసుకుని ప్రభుత్వాలు
పడగొట్టొచ్చు, మళ్ళీ వాటిని నిలబెట్టొచ్చు.
కానీ
మేము మాత్రం ఓటేయడానికి వాళ్ళిచ్చే ముష్టి పైసలు, అదీ మేము అడుక్కుని కాదు, వాళ్లిచ్చినవి
తీసుకుంటే, ప్రజాస్వామ్యం మంటకలిసి పోతుందట. ఇదెక్కడి న్యాయం'
అప్పుడప్పుడు
ఇలాంటి మాటలు వద్దనుకున్నా చెవిలో పడుతుంటాయి.
జనం
గమనిస్తున్నారు అని రాజకీయులు తరచూ అంటుంటారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు అనే
సోయి వారికి వుందని ఎవరైనా అనుకుంటారా
వాళ్ళ మాటలు వింటుంటే.
'మేము ఆ
పార్టీని తిడుతుంటే మీరెందుకు తిట్టరు"
'మీకంటే
ఘాటుగానే తిడుతున్నాము,వినబడడం లేదా'
ఈ తిట్ల
పురాణాలు అవసరమా!
ఆత్మస్తుతి, పరనిందలతో
చర్చోపచర్చలు ఇంటింటా డ్రాయింగు రూముల్లో పొంగిపొరలుతున్నాయి
"ప్రజలకు
మనం ఏంచెప్పినా వారికి గుర్తుండదు. ఏం చెప్పినా పర్వాలేదు"
అనేది రాజకీయ
నాయకుల నమ్మకం లాగుంది.
విన్న
లేదా చూసిన వార్త నిజమా! కాదా! అనే సంగతి నిర్ధారణగా చెప్పగలిగినవారికి ఏ బహుమతి
ఇవ్వొచ్చు అంటారు?
తోకటపా:
అరవై ఏళ్ళ కిందట
విన్న సంగతి.
మా నాన్నగారు
గ్రామ కరణమే. అయినా కరణాల గురించి వాళ్ళ పరోక్షంలో ఊళ్ళో వాళ్ళు చెప్పుకునే సంగతి
ఇది.
ఆ వూరికి
తాసీల్దారో గిర్దావరో ఎవరో ఒక పై అధికారి వస్తారు. కరణం, మునసబులతో
మాట్లాడుతుంటారు. ఊళ్ళో వాళ్ళు దూరం నుంచి చూస్తూ వుంటే కరణంగారు అంగీ జేబు నుంచి
ఏదో కాగితం బయటకు తీసి మళ్ళీ జాగ్రత్తగా మడత పెట్టి జేబులో పెట్టేసుకుంటారు. అంతే!
అది చూసిన జనం తలా ఒక రకంగా చెప్పుకుంటారు. ఇన్నాళ్ళుగా సాగు చేసుకుంటున్న బంజరు
భూమికి నీళ్ళు వదులు కోవాల్సి వస్తుందేమో అని కొందరు, వేయని పంటకు అదనపు
శిస్తు వేసే ఆలోచనలో వున్నారేమో అని మరి కొందరు ఇలా ఎవరికి వారు తమ సమస్యను
భూతద్దంలో పెద్దదిగా చేసి ఊహించుకుని భయపడుతుంటారు.
నిజానికి కరణం
గారు జేబులో మడిచి దాచిన కాగితం వాళ్ళావిడ రాసిచ్చిన ఇంటి సరకుల జాబితా!
(09-07-2022)
9, జులై 2022, శనివారం
భర్త అంటే ఎలా వుండాలి? – భండారు శ్రీనివాసరావు
రెండు
నెలల క్రితం ఓ ఉదయం ఫోన్ మోగింది.
‘నేను కృష్ణయ్యను మాట్లాడుతున్నాను’
పరిచయమైన
పేరు, అపరిచితమైన
గొంతు.
ఆయనే
తనని తాను పరిచయం చేసుకున్నారు. పేరు లోకం కృష్ణయ్య. గత ఇరవై ఆరేళ్లుగా హైదరాబాదులో ఆరాధన పేరుతొ ఓ
సాంస్కృతిక సంస్థను నడుపుతున్నానని, ఈ
ఏడాది జులై ఎనిమిదిన ఇరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నాకు పాత్రికేయ పురస్కారం
ఇవ్వాలని అనుకున్నానని ఆయన చెప్పారు.
డెబ్బయ్
ఆరేళ్ల జీవితం, యాభయ్ ఏళ్ళకు పైగా వృత్తి వ్యాపకం. ఇన్నేళ్ళుగా
వినని మాట. ఎవరూ అనని మాట.
పైగా నాకు
అలవాటు లేని ఔపోసనం.
అదే
మాట చెబుతూ, నన్ను
మన్నించండి అని సున్నితంగానే కృష్ణయ్య గారికి
చెప్పాను.
కానీ
ఆయన గట్టి పిండంలా వున్నారు. పట్టిన పట్టు విడవలేదు.
‘అసలు
నా గురించి మీకెవరు చెప్పారు, నా
నెంబరు మీకు ఎలా తెలుసు?’
నా ఈ ప్రశ్నకు
ఆయన చెప్పిన సమాధానం వింతగా అనిపించింది.
‘నాకెవరూ
చెప్పలేదు. ఆదివారం ఆదివారం మీ వ్యాసాలు ఆంధ్రప్రభలో చదువుతూ వుంటాను. ఫేస్ బుక్ లో చూస్తూ వుంటాను’
ఎవరి
సిఫారసువల్లా కాదు. ఇక కాదు అనడానికి కారణం కనపడలేదు.
నిన్న
జులై ఎనిమిది.
చిక్కడపల్లిలోని
త్యాగరాయ గానసభకు వెళ్లాను. డెబ్బయ్యవ దశకంలో అంటే దాదాపు నలభయ్ ఏడేళ్ల క్రితం
గానసభకు కూతవేటు దూరంలో ఓ సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్ లో అయిదేళ్లు కాపురం చేసిన
రోజులు గుర్తుకు వచ్చాయి. గానసభలో నటుడు ఎవరైనా ఆరున్నొక్క రాగంలో పద్యం పాడితే మా
ఇంటికి వినిపించేది. ఆ ఇంటి స్థానంలో ఇప్పుడు
ఓ అపార్ట్ మెంట్ వెలిసింది.
ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి
జస్టిస్ జి. భవానీ ప్రసాద్ ముఖ్య అతిథి. నేనెవరో ముఖతః తెలియకపోయినా నా గురించి
నాలుగు మంచి మాటలు చెప్పారు. రాతల ద్వారా కూడా నలుగురికి తెలుస్తాం అనే ఎరుక
కలిగింది.
వివిధ
రంగాల్లోని వారికి కూడా ఈ సందర్భంగా
సన్మానం చేశారు. కిన్నెర సంస్థ వ్యవస్థాపకులు శ్రీ మద్దాళి రఘురాం వీరిలో వున్నారు. అలాగే, భర్త విజయంలో భార్య, భార్య విజయంలో భర్త పాత్ర లేదా వారి
భాగస్వామ్యం వుంటుంది అనే కాన్సెప్ట్ తో
కొందరు దంపతులను ఈ సందర్భంగా సత్కరించారు. ఆకాశవాణిలో క్యాజువల్ గా న్యూస్ చదివే
సి.హెచ్. సతీష్ కుమార్, అయన
భార్య కల్యాణి సన్మాన స్వీకర్తల్లో వున్నారు.
వారిలో
మరొకరు శ్రీమతి పి. విజయదుర్గ. ఈమె ఎవరో
కాదు ఒకానొక కాలంలో విఠలాచార్య సినిమాల్లో ప్రాచుర్యం పొంది పొట్టి వీరయ్యగా
ప్రసిద్ధులైన నటుడి కుమార్తె. భర్త శ్రీ మల్లికార్జున సన్మాన పీఠం మీద ఆమెను రెండు చేతులతో ఎత్తి కూర్చోబెడుతున్న దృశ్యం చూసి సభికుల కళ్ళు
చెమర్చాయి. శారీరక అంగవైకల్యం కలిగిన భార్యను మనసుతో ప్రేమించే భర్తను చూసి, నేనయితే ఆయనకు రెండు చేతులు జోడించి
నమస్కరించాను.
పొతే, అసలు కార్యక్రమం మొత్తానికి కర్తాకర్మాక్రియ అయిన కృష్ణయ్య గారిని చూడాలనే నా
వెతుకులాట చివరి వరకు కొనసాగింది. వెనుకవుండి అంతా నడిపించిన ఆయన మాత్రం నిజంగా తెర వెనుకనే వుండిపోయారు.
పావలా
ఖర్చుతో పాతిక రూపాయల ప్రచారం కోరుకునే ఈ కాలంలో కృష్ణయ్య గారి లాంటి వ్యక్తులు
అరుదే అని చెప్పాలి.
(08-07-2022)
పన్నెండు కావాలి ఫోను చేయాలి
'నా మాట విను. ఇంత అర్ధరాత్రి వేళ ఫోను చేయాలా! పొద్దున్నే చేస్తే సరిపోదా!'
'లేదు. ఇప్పుడు చేసి మాట్లాడితేనే నాకు తృప్తి'
ఈ ఒక్క విషయంలో నా మాట వినేది కాదు.
'పన్నెండు తర్వాత వాళ్ళ ఫోన్లు బిజీగా వుంటాయి. పన్నెండు గంటలకు కాస్త ముందు
చెప్పరాదా'
'లేదు. నా ఫోను వస్తుందని వాళ్ళకి తెలుసు'
ఇంకేం చెప్పను?
ఇలా మా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు అందరి పుట్టినరోజులప్పుడు గుర్తు పెట్టుకుని, ఆ రాత్రి మేలుకుని వుండి శుభాకాంక్షలు, శుభాశీశ్శులు
చెప్పడం నేను దశాబ్దాలుగా చూస్తూ వచ్చాను.
ఈరోజు పన్నెండు అవుతోంది. జులై
తొమ్మిది నా రెండో కుమారుడు సంతోష్, రెండో
అన్నయ్య పెద్ద మనుమరాలు మాధుర్య పుట్టినరోజు.
మేలుకునే వున్నాను ఒంటరిగా. కానీ మా
ఆవిడలా పనికట్టుకుని మేలుకుని లేను. ఈ గిల్టీ ఫీలింగ్ తో ఫోను ఎలా చేయను?