ఓసారి ముళ్ళపూడి వారు రాసారు. అదృష్టం అంటే ఎవడో కొన్న లాటరీ టిక్కెట్టును వాడు మన జేబులో పెట్టి మరిచిపోయి వెడితే, దానికి మొదటి బహుమతి తగలడం అని. మనం రూపాయో, అర్ధో పెట్టి టిక్కెట్టు కొంటే లాటరీ తగలడం అదృష్టం కాదని ముళ్ళపూడి వారి చమత్కారం.
17, మే 2022, మంగళవారం
అదృష్టం అంటే - భండారు శ్రీనివాసరావు
ప్రతి ప్రభుత్వానికీ అనుసరణీయం గడప గడపకు కార్యక్రమం - భండారు శ్రీనివాసరావు
గడప గడపలో నిరసనలు వెల్లువెత్తినా సరే, గడప గడపకు అనే కార్యక్రమం చాలా మంచి నిర్ణయం. టీవీ చర్చల్లో వెలువడే విమర్శలకు రాజకీయ రంగు ఉండవచ్చు కానీ ఈ గడప గడపకు కార్యక్రమంలో వెలువడే నిరసన నిఖార్సయినది. వీటిని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. కొంత రాజకీయం ఉండవచ్చు కానీ అది చాలా స్వల్పం. దీని ద్వారా లభించే ఫీడ్ బాక్ ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుంది. ఉపకరిస్తుంది కూడా. ప్రజలకు కావాల్సినవి ఇస్తున్నామా లేక ప్రజలకు అనవసరమైనవి పంచి పెడుతున్నామా అనేది తెలిసి వస్తుంది. ఏ పధకం ఎలా అమలవుతోంది, ఏ పధకం అమల్లో విఫలం అవుతోంది అనే విషయాలు వాస్తవ రూపంలో తెలుస్తాయి. రాజకీయాలకు అతీతంగా అందరి గడపలకు కూడా వెడితే పాలక పక్షం నేతలకు వాస్తవాలు బోధపడుతాయి. ప్రజలు తమ సమస్యలను టీవీలకు ఎక్కి అనుదినం చెప్పుకోలేరు. అలాంటి వారికి ఇది వరప్రసాదం. నిరసన తెలిపినా, నిలదీసినా ఆ హక్కు ప్రజలకే వుంటుంది. ఇలాంటి వాటికి నెగెటివ్ ప్రచారం ఎలాగు వుంటుంది. అయితే పొరబాట్లు సరిదిద్దుకునే మహత్తర అవకాశం ప్రభుత్వానికి ముందుగా లభిస్తుంది. నిఘా వర్గాలు కూడా ఇటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని అంచనా వేయలేవు. వేసినా అరకొర సమాచారమే ప్రభుత్వానికి చేరుతుంది. ప్రజల నాడి యధాతధంగా పట్టుకోవడానికి ప్రభుత్వం చేతిలో ఉన్న ఏకైక కొలమానం ఈ గడప గడపకు కార్యక్రమం. అంతా సజావుగా వుంది అనే భ్రమలు ఏమైనా వుంటే అవి తొలగడానికి ఈ కార్యక్రమం పనికి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరకు నేతలు పోవడం అనేది ఆ నాయకులకే ప్రయోజనం. ప్రజలు నిరసన తెలిపినా దానిని ఆ స్థాయిలోనే అదుపు చేయడానికి, అది అసహనంగా మారి ఆగ్రహంగా పరిణమించకుండా జాగ్రత్త పడడానికి నాయకులకు ఇదొక ఆయుధంగా ఉపయోగపడుతుంది. నిరసనలకు కారణం ప్రత్యర్థుల ప్రేరేపణ అని ఎదురుదాడికి దిగడం కన్నా వాటిని సానుకూలంగా మార్చుకోవడంలోనే నాయకుల ప్రతిభ, పరిణతి వెలుగు చూస్తుంది.
తప్పులు
దొర్లడం తప్పుకాదు. ఆ తప్పులను దిద్దుకోవడం ఉత్తమ లక్షణం. కాబట్టి ఈ గడప గడపకు
కార్యక్రమాన్ని ఏదో తూతూ మంత్రంగా కాకుండా ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో చేస్తే ఇటు
ప్రజలకు మంచిది, అటు
ప్రభుత్వానికి మంచిది.
కేంద్రంతో
సహా, దేశంలోని
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దృష్టిలో తమ స్థానం ఏమిటన్నది తెలుసుకోవాలంటే
ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవాలి.
(17-05-2022)
కాటి కాపరిని చూడాలని వుంది - భండారు శ్రీనివాసరావు
15, మే 2022, ఆదివారం
గురు దక్షిణ – భండారు శ్రీనివాసరావు
మనమే దేవుడి సమస్య – భండారు శ్రీనివాసరావు
(Published in Andhra Prabha on 15-05-2022, SUNDAY today)
దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.
వున్నాడని నమ్మేవాళ్ళంటారు.
దేవుడు పేరు చెప్పి సొమ్ములు
పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు
లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు.
దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా
నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు
వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు
కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై
అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.
వీరుకాక మరో రెండు తరగతులవారు
వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ
విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా దేవుడ్ని పూర్తిగా నమ్మేవారు రెండో
రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని
వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను
కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా
వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు
దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం
పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ
దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ
ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.
తొక్కితే రాయి, మొక్కితే సాయి. అంతా
నమ్మకం.
దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో
నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.
దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత
ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె
దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు.
ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ
శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని
నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట
చిక్కి విలవిలలాడుతున్నప్పుడు ‘కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు
పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.
దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది.
వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే
శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో.
(బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)
‘నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటాన’ని ఎంత
మొత్తుకున్నా వినేదెవరు?
‘చెట్టులో,పుట్టలో అంతటా నేనే’ అన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.
మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద
ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం
చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! ‘పూజ
రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి
ప్రశ్న.
పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు
తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు.
ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్
రాకముందు వచ్చిన తరువాత, ఇలా ఏదో ఒక పేరుతొ అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి
యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!
దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని
తమవరకే పరిమితం చేసుకోవాలి.
నమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య
అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు.
బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని
నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమ పని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద)
కాలుష్యం తగ్గిపోతుంది.
సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు
ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు. నిజానికి మనమే ఆయనకు సమస్య.
14, మే 2022, శనివారం
పునరావృతం కానివ్వం – భండారు శ్రీనివాసరావు
గుంటూరు ప్రభుత్వ వైద్య శాలలో ఆరేండ్ల చిన్నారి ఆరాధ్య వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుందని ఆ అమ్మాయి తలితండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన చాలా దురదృష్టం పునరావృతం కానివ్వం అనే ప్రకటనలు వెలువడ్డాయో లేదో తెలియదు.
ఈ నేపధ్యంలో 2015లో అదే ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఓ దుర్ఘటన గుర్తుకు వస్తోంది.
సాధారణంగా
న్యాయస్థానాలు భావోద్వేగాలకు అతీతంగా తామరాకుమీది నీటి బొట్టు మాదిరిగా వ్యవహరిస్తాయి.
అయితే మానవ హక్కుల కమిషన్ ఒక కేసు విషయంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యక్తపరచిన
విధానం ఆ కేసులోని తీవ్రతను తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో
ఒక పసికందును ఎలుకలు కొరికి చంపిన దారుణ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు
కమిషన్ జారీ చేసిన ఆదేశాల్లో ఉపయోగించిన పదజాలం తెలుపుతోంది. మామూలుగా ఏదైనా ఒక
సంఘటన జరిగినప్పుడు కమిషన్ స్పందించి, సంబంధిత
అధికారులకు జారీ చేసే ఆదేశాలు, ఇంగ్లీష్ భాషలో, ఒక నిర్దిష్ట
పద్దతిలో, ఒక రకంగా చెప్పాలంటే పడికట్టు పదాలతో, ఒకే మూసలో
వున్నట్టు కానవస్తాయి. కానీ గుంటూరు సంఘటన విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించిన
తీరు, ఈ సాంప్రదాయక విధానానికి భిన్నంగా వుంది. ఈ సారి కమిషన్ ఆదేశాలు సరళమైన
తెలుగులో, ఉద్వేగ పూరిత భావజాలంతో, అదీ చేతిరాతతో
వెలువడ్డాయి.
‘నిర్లక్ష్యం
కమ్ముకున్న ఈ వ్యవస్థలో ..ఆ తల్లికి బిడ్డను తెచ్చి ఇవ్వగలమా? దీనికి బాధ్యులు
ఎవ్వరు ?’ అని కమి షన్ ప్రశ్నించింది. వైద్యులను ప్రాణదాతలుగా కొలిచే సమాజంలో వాళ్ళు
అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని చీవాట్లు వేసింది. అంతేకాదు, పసికందును ఎలుకలు
పీక్కు తిన్నాయని తెలిసినప్పుడు నిర్ఘాంతపోయిన యావత్ సభ్య సమాజం మాదిరిగానే మానవ
హక్కుల కమిషన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందన్న విషయం ఆదేశాల్లో పొందుపరచిన
అతిలోతయిన భావాలు చదివితే అర్ధం అవుతుంది.
‘అమ్మా! నేను
ప్రపంచంలోకి వస్తున్నా! నాకు భావి పౌరుడిగా ఎదగాలని వుంది. ఎందుకమ్మా నన్ను ఈ
ఆసుపత్రికి తీసుకువచ్చావ్?’ అని ఎలుకలు తన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ శిశువు యెంత మూగవేదన అనుభవించి
వుంటుందో’ అంటూ కమిషన్ అచ్చ తెలుగులో వ్యక్తపరచిన భావాలు సమస్య తీవ్రత పట్ల ఎంతగా
కమిషన్ స్పందించి వుంటుందో అనే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
‘మనిషిని మనిషి
కాటేసే సంఘంలో తామేమీ తీసిపోమని చాటిచెప్పేలా గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఆ పసి
కందుపై దాడిచేశాయి. అవి కొరుకుతుంటే ఆ పసి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయిందో. ఈ ఘటన
మన భాషకు, భావాలకు అందనంత హృదయ విదారకమైనది’ అంటూ కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొన్నది.
‘దవాఖనాలు దెయ్యాల
ఖానాల మాదిరిగా మారిపోయి పసివాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ
ఆసుపత్రుల్లో కుక్కలు పసికందుల్ని పీక్కుతిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ
వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుతాం ?’ అన్నది కమిషన్
సంధించిన ప్రశ్న.
గుంటూరు ప్రభుత్వ
ఆసుపత్రిలో ఓ పసికందును ఎలుకలు అత్యంత పాశవికంగా కొరుక్కు తినడం వల్ల ఆ శిశువు
మరణించిన వార్తపై విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్ తనకు తానుగా సంకల్పించి
సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.
కమిషన్ స్వయంగా
పేర్కొన్నట్టు ఆ పసికందు ప్రాణాలు తిరిగి తేవడం అసాధ్యం. కానీ ఇటువంటి దుర్ఘటనలు
పునరావృతం కాకుండా చేయాల్సింది ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.
ఆ రోజుల్లో
పత్రికలు ఈ దుర్ఘటనపై పుంఖానుపుంఖాలుగా
కధనాలు రాశాయి. మీడియా గగ్గోలు పెట్టింది.
ఇది జరిగి ఏడేళ్లు
దాటుతోంది. ఇన్నేళ్ళుగా ఆ కన్నతల్లి కడుపుకోత గురించి కానీ, ఆ శిశువు కుటుంబం పడ్డ వేదన గురించి కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలా లేదు.
గుంటూరు ఆసుపత్రి
సంఘటనపై జరిగిన విచారణ ఫలితం ఏమిటన్నది ఎవరికీ పట్టదు. కొన్నాల్తికే జనమే ఈ విషయం
మరచిపోతారు. ఎలకలు కొరుక్కు తిన్న ఆ పసిపాప చిట్ట చివరి దైన్యపు చూపు నేతల
జ్ఞాపకాల్లో రూపుమాసిపోతుంది. కడుపుకోతతో విలవిలల్లాడే ఆ మాతృమూర్తి వేదన అరణ్య
రోదనే అవుతుంది.
ఇటువంటి సంఘటనలు
పునరావృతం కావంటూ నాయకులు చెప్పే హామీలు మాత్రం పునరావృతం అవుతూనే వుంటాయి. ఇదొక
విష చక్ర భ్రమణం. ఈ భ్రమణంలో చోటుచేసుకున్న మరో విషాదమే చిన్నారి ఆరాధ్య మరణం.
తోకటపా:
సంఘ విద్రోహ, ఆరాచక శక్తుల్లో
ఎక్కడా కానరాని అవగాహన వుంటుంది. ఒకరినొకరు కాపాడుకోవడం, ఆపదలో పడ్డప్పుడు
‘సర్ప మూషిక న్యాయాన్ని’ పాటించడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. అయితే వాటి నడుమ
ఈ దోస్తీ కొంత మేరకు మాత్రమే. ఒక స్థాయి వరకే.
ఒక పాము, ఒక ఎలుక సమయం
కలిసిరాక ఒకే బుట్టలో ఇరుక్కుపోయాయి. పాముకు ఎలక ఆహారం. తినేస్తే ఒక పనయిపోతుంది.
కానీ బుట్ట నుంచి బయట పడక పొతే అంతే సంగతులు. అంచేత ఆ పాము యుక్తిగా ఎలకకు ఓ సలహా
చెబుతుంది. తన పొడ గమనించి ప్రాణభయంతో గడగడలాడిపోతున్న ఎలకకు హామీ ఇస్తుంది.
‘నావల్ల నీకు ఎలాటి ప్రమాదం వుండదు. ముందు నీ దంతాలతో ఈ బుట్టకు ఓ రంధ్రం చెయ్యి.
ఇద్దరం తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందాం’
ఎలక బతుకు జీవుడా
అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. వెంటనే పాము ఆ ఎలకని ఎంచక్కా నమిలి మింగేసి, తరువాత ఎలక చేసిన
ఆ రంధ్రం ద్వారా బయట పడుతుంది.
ఈ సర్ప మూషిక
న్యాయం ప్రకారం పరస్పర ఆధారిత స్వార్ధపర శక్తులు ఒకమేరకు తమలో తాము
సహకరించుకుంటాయి. ఒక స్థాయికి చేరిన తరువాత తమ స్వార్ధానికి, తమ స్వప్రయోజనాలకు
మాత్రమే పెద్ద పీట వేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. సామాన్యులు మాత్రం ఇందులో
శలభాలుగా మారతారు.
(14-05-2022)
పనికొచ్చే మనిషి – భండారు శ్రీనివాసరావు
(నాదేంలేదు, ఇంగ్లీషు జోకుకి స్వేచ్ఛానువాదం చేయడం తప్ప)
పనిమనిషి ఇంటి
యజమానురాలిని అడిగింది జీతం పెంచమని. పెంచడానికి మూడు కారణాలు చెప్పమంది ఇంటావిడ.
“నేను మీకంటే బాగా
బట్టలు ఇస్త్రీ చేస్తాను”
“అలానా! ఎవరు
చెప్పారు నీతో అలా?”
“ఎవరో కాదు మన సారే
ఆ మాట నాతో చాలా సార్లు చెప్పారు”
“అల్లానా! సరే!
ఇంకో కారణం చెప్పు”
“నేను మీకంటే బాగా
వంట చేస్తాను”
“అలానా తల్లీ
ఇదెవరు చెప్పారు?”
“ఇంకెవరు? మన అయ్యగారే!”
“ఓహో! అలా కూడా
చెప్పారా అయ్యగారు, అది సరే నీ జీతం ఎందుకు పెంచాలో మరో కారణం చెప్పు”
“అది చెప్పడం
బాగుండదండీ! కానీ మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు, మీకంటే నేనే
బాగుంటానుట”
“ఏమిటీ! ఇది కూడా
అయ్యగారే చెప్పారా? ఇంటికి రానీ సంగతి తేలుస్తాను.”
“అయ్యో అలా
అనుకున్నారా! ఈ సంగతి చెప్పింది అయ్యగారు కాదండీ మీ కారు డ్రైవరు”
“సరే! ఇంతకీ యెంత
పెంచమంటావు ముందది చెప్పు”
NOTE: Courtesy Image Owner
