"ఇలా చేసి చూడండి అని కిందటి వారం ప్రసారం చేసిన కార్యక్రమంపై శ్రోతల స్పందన ఇప్పుడు తెలుసుకుందాం.
9, ఏప్రిల్ 2022, శనివారం
ఇలా చేసి మాడండి – భండారు శ్రీనివాసరావు
8, ఏప్రిల్ 2022, శుక్రవారం
స్టెత్ లెస్ డాక్టర్స్ – భండారు శ్రీనివాసరావు
7, ఏప్రిల్ 2022, గురువారం
మంత్రివర్గాల రాజీనామాలు మూడు ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు
ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.
ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి
శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు
కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్ ! (మొయినుద్దీన్ - ముఖ్యమంత్రి
వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో
చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ
వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ
అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని
లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్ అవుతోందని చెప్పేసి, ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన
పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది! మంత్రులందరూ (రాజీనామాలు)
ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్ మంటూ
బయటకు పరుగెత్తి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్
చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.
అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది
మంత్రులేమిటి, విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల
సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం
ఆయనది. యాదగిరి (హెలికాప్టర్)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే
వ్యంగ్య చిత్రాలను కూడా నవ్వుతూ ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.
ఇక ఇలాంటి మంత్రివర్గ క్షాళన మరోసారి
జరిగింది. అప్పుడు నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేస్తున్నాను. ఆనాడు
ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు. ఇలాగే ఆయన కూడా ఒక రోజు హఠాత్తుగా ముప్పయి ఒక్కమంది
మంత్రుల రాజీనామాలను అడిగి తీసుకుని ఆమోదం కోసం గవర్నర్ కు పంపారు. ఆమోద ముద్ర
పడింది. తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి వారం రోజులు అక్కడే వుండి, తర్వాత కానీ కొత్త
మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పుకున్నారు.
పొతే మూడోది. మంత్రివర్గం రాజీనామా కాదు.
ఇది మరీ విచిత్రం. ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో
ఆకస్మికంగా మరణించిన దరిమిలా కాంగ్రెస్ అధిష్టానం వయసులో పెద్దవాడు అయిన ఆర్ధిక
మంత్రి శ్రీ కె. రోశయ్యను ఆ పదవికి ఎంపిక
చేసింది. శ్రీ రోశయ్య పాత మంత్రులను అందర్నీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
కనీసం వారి శాఖల్లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయేవరకు
అదే మంత్రివర్గం.
ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
శ్రీ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి మండలిలోని ఇరవై నాలుగు మంది మంత్రుల రాజీనామాలు
తీసుకున్నారు. కొత్త మంత్రివర్గం కూర్పు పనిలో వున్నారు.
తోక టపా : పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నరోజుల్లో మొరార్జీ దేశాయ్ వంటి సీనియర్ మంత్రులను తప్పించడానికి కామరాజ్ ప్లాన్ పేరుతొ మొత్తం మంత్రివర్గం చేత రాజీనామా చేయించారు.
(07-04-2022)
‘ఏ’ ‘బీ’ ‘సీ’ ‘డీ’ – భండారు శ్రీనివాసరావు
6, ఏప్రిల్ 2022, బుధవారం
నోబుల్
“మిమ్మల్ని టీవీలో చూస్తూ వుంటాను”
ఎస్సారార్
కాలేజి పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి బుక్
చేసుకున్న ఉబెర్ డ్రైవర్ బాల్ రెడ్డి , కారు ఎక్కిన వెంటనే, ఈ మాట చెప్పాడు.
కొంచెం ఆశ్చర్యం వేసింది. రాత్రీ పగలు తేడా లేకుండా రోడ్ల మీద తిరిగే వారికి టీవీ
చూసే తీరిక ఎక్కడ వుంటుంది అనేది నా సందేహం.
“రోడ్ల
మీదే జీవితం గడిచిపోతుంది. కొత్త బుకింగ్ వచ్చేవరకు రోడ్ల పక్కన చెట్ల నీడలో
ఆగినప్పుడు మొబైల్ ఫోన్ లో చూస్తుంటాను” నా అనుమానాన్ని కనిపెట్టి
చెప్పినట్టున్నాడు బాల్ రెడ్డి.
“ఇంకో
మాట చెప్పనా! రోజు ఎంత మందిని చూస్తుంటాను. లొకేషన్ కు వచ్చి ఫోన్ చేసేదాకా వాళ్ళు
రారు. మీరు మూడు నిమిషాలు ముందే వచ్చి రోడ్డు మీద నిలుచున్నారు’
‘రిటైర్
అయి పనేమీ లేకుండా వున్నాను. కానీ ఈ క్యాబ్ పొరబాటున
తప్పిపోతే ఇంటికి చేరడం ఎల్లా అనే దూరాలోచనతో ముందుగా వచ్చి రోడ్డు మీద నిలబడ్డాను
అనే నిజాన్ని అతడికి చెప్పలేదు.
“అది
సరే! కారులో నీ వెనక కదా! కూర్చున్నాను. నన్నెలా
గుర్తు పట్టావు?”
“దూరం
నుంచే రోడ్డు మీద నిలబడి వున్న మిమ్మల్ని
చూశాను. మీరు కూడా అందరిలా ఆఖరు నిమిషంలో
వచ్చి ఎక్కితే ఏమో మరి”
తర్వాత
ఏం మాట్లాడాలో నాకు తోచలేదు.
‘మళ్ళీ
మీరు కనబడతారో లేదో, ఒక
మాట ఇప్పుడే చెబుతాను. ఈ మధ్య మీరు టీవీల్లో కనబడడం లేదు. అప్పుడప్పుడు తప్ప. అప్పుడూ
ఇప్పుడూ మీది ఒకే వరస. మీరు అనుకున్నదే
తప్ప టీవీల వాళ్ళు కోరుకున్నట్టు చెప్పరు, అందుకే మిమ్మల్ని పిలవడం లేదేమో
అనుకున్నాను. నిజానికి మీలా నిజాలు చెప్పేవాళ్ళు ఉంటేనే కదా జనాలకు నిజాలు
తెలిసేది’
మూడేళ్ల
క్రితం నా భార్య చనిపోయిన తర్వాత టీవీ స్టూడియోలకు పోవడం పూర్తిగా తగ్గించానన్న
విషయం నేను అతడికి చెప్ప లేదు కానీ, అతడు నాకిచ్చిన కితాబు మాత్రం నోబుల్ పురస్కారం కన్నా మిన్న.
థాంక్స్
బాల్ రెడ్డి!
(06-04-2022)
5, ఏప్రిల్ 2022, మంగళవారం
నిజంగా అది రౌడి కాలేజీనా? – భండారు శ్రీనివాసరావు
ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఆరోజుల్లో అంటే ఒక అర్ధ శతాబ్దికి పూర్వం, మొత్తం విజయవాడలో ఇదొక్కటే ప్రభుత్వ కళాశాల. రెండోది ప్రైవేటు యాజమాన్యంలోని లయోలా కాలేజి. స్కూలు చదువు అయిపోయిన తర్వాత పీయూసీ, డిగ్రీలో చేరాలంటే ఈ రెండే దిక్కు. గవర్నమెంటు కాలేజీలో ఫీజులు నామ మాత్రం అయినా రౌడీ కాలేజి అనే పాడు పేరు ఒకటి. లయోలా కాలేజీకి అలాంటి పేరు లేదు కాని సామాన్యులు భరించలేని ఫీజులు గుంజుతారని ప్రతీతి.
ఇదంతా ఎందుకు అంటే ఇవ్వాళ హైదరాబాదులో ఎస్సారార్
కాలేజిలో జంధ్యాల బ్యాచ్ కి చెందిన ముప్పయారు మంది పూర్వ విద్యార్ధులం నారాయణగూడా లోని ఎస్బీఐ గెస్టు హౌస్ లో
కలుసుకున్నాం. అదీ యాభయ్ అయిదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత. వచ్చిన వారిలో ఓ పదిమంది
భార్యా సమేతంగా వచ్చారు.
వారిలో ఒకావిడ గారు చెప్పారు.
‘అసలు ఇలాంటి మీటింగులకు ఆడవాళ్ళం ఎందుకు
అనిపించింది. అదే మా వారితో చెప్పాను, మీరొక్కరు వెళ్లి రండని. ఈలోగా ఆయన స్నేహితులు
కొంతమంది బలవంత పెట్టారు. దానితో రాకతప్పలేదు. వచ్చిన తర్వాత అనిపించింది,
రాకుండా వుండి వుంటే నేను పొరబాటు చేసిన దాన్ని అయ్యేదానినని. ఈ కాలేజి గురించి
విన్నది వేరేగా వుంది. ఇప్పుడు చూస్తుంటే అక్కడ చదువుకున్న వారు చాలా
సంస్కారవంతులు అనిపిస్తోంది”
మా అందరికీ గొప్ప కాంప్లిమెంట్ కదా!
ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, ఈ
పూర్వ విద్యార్ధులలో ఒకరు అయిన సుబ్బరాయ
శర్మ గారు మైకు తీసుకున్నారు. లేదు, మాట్లాడమని అందరు బలవంత పెడితే తీసుకున్నారు.
“ ఈ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన విశ్వనాధ సత్యనారాయణ వంటి ప్రముఖ పండితులు, పురాణం సుబ్రమణ్య శర్మ వంటి ఎడిటర్లు, జంధ్యాల, ఏమ్వీ రఘు, మాధవపెద్ది సురేశ్ వంటి సినీ ప్రముఖులు, వైణిక
విద్వాంసుడు అయ్యగారి శ్యామసుందరం, ఇంకా అనేకమంది బ్యాంకర్లు, మల్లాది
వెంకట కృష్ణ మూర్తి వంటి నవలా రచయితలు, మురళి
దేవరకొండ వంటి కధారచయితలు, కవులు,
కళాకారులు అనేకమందిని ఈ కాలేజి సమాజానికి అందించింది. ఇలాంటి కాలేజీని రౌడీ కాలేజ్
అనడం భావ్యమా!” అంటూ తనదైన రీతిలో స్పందించారు.
బ్రిగేడియర్ శ్రీరాములు ఒక ఆసక్తికర అంశాన్ని బయట
పెట్టారు. ఎస్సారార్ కాలేజీలో కొందరు ‘ఘనాపాటీలు’ వున్న మాట వాస్తవమే అన్నారు.
కాలేజి ఫంక్షన్లలో పాల్గొనడానికి విద్యార్థినులు జంకుతున్నారు, అదీ తమ వల్లనే అనే
విషయం ఆ ఘనాపాటీలకు తెలిసిపోయింది. వెంటనే వాళ్ళు కార్యక్రమాలు ముగిసిన తర్వాత
వాటిల్లో పాల్గొన్న ఆడపిల్లలను రిక్షాలలో కూర్చోబెట్టి,
సైకిళ్ళపై వెంటవెళ్లి, భద్రంగా ఇళ్ళ దగ్గర దింపే పనిని కొందరు జూనియర్లకు
ఒప్పగించారుట. అంటే ఆ కాలేజీలో ఏళ్ళ తరబడి చదువుతూ తిష్ట వేసిన ఆకతాయిలు కూడా
ఆడపిల్లల పట్ల చక్కటి సంస్కారాన్ని ప్రదర్శించే వారన్నది ఆయన కవి హృదయం.
లైలా కాలేజీలో చేరిన వారు కూడా అవకాశం దొరకగానే
ప్రభుత్వ కళాశాలలో చేరడానికి మక్కువ చూపేవారని, దానికి కారణం
ఎస్సారార్ కాలేజి కోఎడ్యుకేషన్ కాలేజి కావడమే అనేది ధర్మవరపు రామ్మోహన రావు గారి చమత్కారం. డెబ్బయి
పై చిలుకు వయసులో కూడా ఆయన సుస్వరంతో కర్ణుడి జన్మ రహస్యం అంకంలోని పద్యాలను
చక్కగా ఆలపించారు. అలాగే, డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ చేసిన దాసు గారు, ఏలేశ్వరపు ప్రసాద్ గారు పాత పాటలు
వినిపించారు. ఈ వయసులో కూడా తమ గాత్ర మాధుర్యం చెక్కు చెదరకుండా చూసుకోవడం
ఆశ్చర్యం అనిపించింది.
వీణా వాయిద్య కళాకారుడు, దేశ
విదేశాల్లో అనేక ప్రశంసలు, అవార్డులు పొందిన అయ్యగారి శ్యామ సుందరానికి పద్మశ్రీ
పురస్కారం లభిస్తే బాగుంటుందని వచ్చిన మితృలు అందరూ అభిప్రాయ పడ్డారు. వస్తే, అంతకంటే కావాల్సింది ఏముంటుంది?
ఇక కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు.
ఆయన స్టేట్ బ్యాంక్ లో ఉన్నత అధికారిగా రిటైర్ అయిన ఎన్.వీ.కే. రావు గారు. ఒక్క
ముక్కలో చెప్పాలి అంటే ఈ యావత్ కార్యక్రమానికి ఆయన కర్తా, కర్మా,
క్రియ.
(05-04-2022)
జంధ్యాల బ్యాచ్ – భండారు శ్రీనివాసరావు
యాభయ్ అయిదేళ్ళ క్రితం నేను ఎలా వుండే వాడినో నాకే తెలియదు. అంటే నా ముఖకవళికలు, రూపు రేఖలు, తలకట్టు, వేసుకునే దుస్తులు, మాట తీరు, నడత, నడవడిక అన్నీ ఖచ్చితంగా మారిపోయే వుంటాయి. నన్ను అప్పుడు చూసిన వారికి ఇప్పుడు చప్పున పోల్చుకోవడం కష్టమే. అప్పుడు బక్కపలచగా ఉండేవాడిని. ఇప్పుడు మరీ బొద్దుగా కాకపోయినా ఒళ్ళు చేశాను. అప్పుడు దుబ్బులా వున్న జుట్టు పలచపడింది. పాపిడి కుడి నుంచి ఎడమకు మారింది. పొట్ట వచ్చింది. ఆహార్యం మారింది. బెల్ బాటమ్స్, పెద్ద కాలర్ చొక్కాలు పోయి ఏదో కొంత పెద్దరికంగా అనిపించే దుస్తులు వచ్చి చేరాయి. సరే అప్పటికీ ఇప్పటికీ మారినది మారండి కాలి చెప్పులే. బూట్లు అప్పుడూ లేవు, ఇప్పుడూ లేవు. కళ్ళజోడు అవసరాన్ని బట్టి కళ్ళమీదకీ, చొక్కా జేబులోకి మారిపోతూ వుండీ లేనట్టు వుంటుంది. మరి ‘వాళ్ళు’ నన్ను ఎలా గుర్తు పట్టేట్టు.
వాళ్ళు
అంటే ఎప్పుడో యాభయ్ అయిదేళ్ళ క్రితం బెజవాడ ఎస్సారార్ కాలేజి బీకాం (జంధ్యాల
బ్యాచ్) వాళ్ళు. మేమందరం మూడేళ్లు కలిసి
చదువుకున్న వాళ్ళం. మా క్లాసులో వందమందిమి వుండేవాళ్ళం. అదొక రికార్డు అప్పట్లో.
నా రోల్ నెంబరు 66. నేను సరే, వాళ్ళు నన్ను ఎలా గుర్తు పడతారు? ఏమో తినబోతూ రుచి అడగడం ఎందుకు?
మా
కాలేజి మేట్స్ బ్రిగేడియర్ శ్రీరాములు, ధర్మవరపు రామ్మోహన రావు, బ్యాంకర్ ఎన్వీకే రావు చొరవతో ఈ కలయిక ఆలోచన పురుడు పోసుకుంది. ఈరోజు
ఆచరణకు నోచుకుంది.
ఈవేళ
పదిన్నరగంటలకు హైదరాబాదు నారాయణ గూడా లోని స్టేట్ బ్యాంక్ గెస్ట్ హౌస్ లో దాదాపు
నలభయ్ మందిమి కలవబోతున్నాం. సాయంత్రం దాకా అక్కడే కబుర్లతో కాలక్షేపం. అలనాటి
ముచ్చట్లు,
చిలిపి చేష్టల పునశ్చరణ.
(05-04-2022)