22, మార్చి 2022, మంగళవారం

99– భండారు శ్రీనివాసరావు

 

 

'డెబ్బయి అయిదేళ్లు  వచ్చాయి. సొంత ఇల్లంటూ వున్నట్టు లేదు. ఇలా ఎన్నాళ్ళు' అని శ్రేయోభిలాషులు తరచూ అడిగే ప్రశ్న. మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర వరసగా అయిదేళ్ళ పాటు పీఆర్వో గా పనిచేశారు. రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పదవీవిరమణ చేసి, సొంత గూడంటూ లేకుండా, సిటీ బస్సుల్లో తిరిగేవాడు. ఏవీ కూడబెట్టుకోకుండానే దాటిపోయాడు. ఆయన ముందు పిపీలికాన్ని నేనెంత? పిల్లలు బాగా చూసుకుంటున్నారు. అదే పదివేలు. పోతే, ఈ ప్రశ్న ఎదురయినప్పుడల్లా ఎప్పుడో చదివిన ఓ ఇంగ్లీష్ కధ జ్ఞాపకం వస్తుంది. ఆ కధకు నా స్వేఛ్చానువాదం.

"అనగనగా ఓ రాజుగారు. ఆ రాజుదగ్గర ఓ పనివాడు. వాడిని చూసినప్పుడల్లా రాజుగారికి ఆశ్చర్యంతో కూడిన సందేహం. 'నాకింత హంగూ ఆర్భాటం వుంది. లేదనేది లేదు. అయినా ఏదో లోటు ఎప్పుడూ తొలుస్తూనే వుంటుంది. వీడేమిటి ఎప్పుడూ చూసినా మొహంలో అంత నిశ్చింత. రేపు యెలా గడుస్తుంది అన్న బాధ కనిపించదు. ఏవిటి వీడి వ్యవహారం?'

"రాజుగారి చింత మంత్రిగారు కనిపెట్టాడు. రాజుగారికి చెప్పి తొంభయ్ తొమ్మిది బంగారు మొహరీలు తెప్పించాడు. వాటిని ఓ సంచీలో వుంచి ఆ పనివాడి గుమ్మం ముందు వొదిలి పెట్టి రమ్మని భటులను ఆదేశించాడు.

"తెల్లారి లేచిన తరువాత పనివాడికి తన గుమ్మం ముందు పడివున్న సంచీ కనబడింది. లోపలకు తీసుకు వచ్చి విప్పి చూశాడు. కళ్ళు జిగేల్ మన్నాయి. అన్నీ బంగారు కాసులు. లెక్కబెట్టాడు. 99 వున్నాయి. అనుమానం వచ్చి మళ్ళీ లెక్కించాడు. పొరబాటు ఏమీ లేదు. 99 నాణేలు మాత్రమే వున్నాయి. మరి ఆ ఒక్క మొహరీ ఏమైంది?

"పనివాడికి మరోపని లేకుండా పోయింది. మరో ఆలోచన లేకుండా పోయింది. ఎలాగైనా ఆ ఒక్క నాణెం సంపాదించి మొత్తం నూరు నాణేలు సొంతం చేసుకోవాలి అన్న ధ్యాస పెరిగింది. ఈ యావలో పడి పెళ్ళాం పిల్లలతో అచ్చట్లు ముచ్చట్లు తగ్గిపోయాయి. సర్వం కోల్పోతున్న భావన. తెలియని దిగులుతో నిద్ర పట్టేది కాదు. అన్నం సయించేది కాదు.

"పనివాడిలో కనబడుతున్న మార్పు రాజుగారు గమనించాడు. మంత్రిగారు వచ్చి టీకా తాత్పర్యం చెప్పకుండానే ఆయనకు విషయం బోధపడింది.

ఏవీ లేనప్పుడు అ పనివాడికి ఏ చింతా లేదు. 99 నాణేలు సొంతం కాగానే వాటిని నూరు చేయాలన్న తాపత్రయం బాగా పెరిగిపోయింది. ఆశ దురాశగా మారితే మనుషులు యెలా మారిపోతారన్నది రాజు గారికి తెలిసివచ్చింది."



(22-03-2022)

21, మార్చి 2022, సోమవారం

గరికపాటి - భండారు శ్రీనివాసరావు

 “గరికపాటి నరసింహారావును మాట్లాడుతున్నాను, భండారు శ్రీనివాసరావు గారేనా!”

నిన్న అంటే మార్చి ఇరవై సాయంత్రం ఫోన్ రిసీవ్ చేసుకోగానే వినబడ్డ మాట. నా చెవులని నేనే నమ్మలేకపోయాను ఒక క్షణం.
ముఖ పరిచయం వుండదు, కానీ కొందరు వ్యక్త్లులు బాగా పరిచయం వున్నవారిలా కనబడతారు. ఆధ్యాత్మిక ప్రబోధనలు చేసే గరికపాటి వంటి వారు సదా ఇళ్ళల్లో ఏదో ఒక టీవీలో ఏదో ఒక సమయంలో కనబడుతూనే వుంటారు. వారి స్వరం వినబడుతూనే వుంటుంది. గరికపాటి వారి సుస్వరం చిరపరిచితమే కనుక క్షణంలోనే తేరుకున్నాను.
“నేను ప్రస్తుతం ఢిల్లీలో వున్నాను. రేపు సాయంత్రం ఫంక్షన్ చూసుకుని హైదరాబాదు వస్తాను” అన్నారు ఆయనే. నిజమే! సోమవారం నాడు వారు పద్మశ్రీ అవార్డ్ తీసుకోబోతున్న సంగతి చటాలున గుర్తుకు వచ్చింది.
స్వయంగా
అభినందనలు
నేరుగా చెప్పే అవకాశాన్ని చక్కగా వాడుకున్నాను.
క్లుప్తంగా ధన్యవాదాలు చెప్పి ఆయన సంభాషణ కొనసాగించారు.
“అది అలా వుంచండి. నేను ఫోన్ చేసిన ఉద్దేశ్యం వేరే వుంది. ఉదయం ఫ్లయిట్ లో ఢిల్లీ వస్తుంటే తెలుగు పత్రికలు కనిపించాయి. ఆంధ్రప్రభ తీసుకుని తిరగేస్తుంటే మీరు రాసిన పురుషుల్లో పుణ్య పురుషులు కనిపించింది. ఆసక్తిగా చదివాను. ఒక్క చప్పిడి వెంగయ్య గారు మినహా మీరు పేర్కొన్న మిగిలిన నలుగురితో నాకు వ్యక్తిగత పరిచయం వుంది.
“ఎనభయ్ ఎనిమిదిలో వావిలాల గోపాల కృష్ణయ్య గారి గురించి ఒక సభలో పరిచయం చేసే బాధ్యత నా మీద పడింది. వారిని గురించి పెద్దగా తెలియదు. అసెంబ్లీకి మొదటిసారి ఎప్పుడు ఎన్నికయ్యారు, ఎప్పటిదాకా కొనసాగారు, ఎక్కడ పుట్టారు వంటి సంగతులు తెలుసు. కానీ ఒక పెద్దమనిషిని పరిచయం చేసేటప్పుడు ఈ వివరాలు సరిపోవు. అందుకే వారినే అడిగి తెలుసుకుందామని వావిలాల వారిని కలుసుకుని వారినే అడిగాను.
ఆయన అదోమాదిరిగా నవ్వి నా గురించి ఏమీ తెలియనప్పుడు ఎలా పరిచయం చేస్తావు అని ఎదురు ప్రశ్నించారు. ఏం జవాబు చెప్పాలో అర్ధం కాలేదు. నా మొహం చూసి ఆయనే అర్ధం చేసుకుని చెప్పారు. “సరే! నా గురించి మొదట ఎలా తెలిసింది, నా పేరు ఎప్పుడైనా విన్నావా! అని.
తటాలున గుర్తుకు వచ్చింది. రేడియోలో విన్నాను. అదే చెప్పాను.
“చిన్నప్పటి నుంచి నాకు రేడియో వినడం అలవాటు. రేడియో వార్తల్లో తరచుగా మీ పేరు, మరో సభ్యుడు సీ.వీ. కె. రావు గారి పేరు వినబడుతుండేవి. మీ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు గురించి ప్రస్తావిస్తూ వుండేవారు.”
అప్పుడు వావిలాల వారు ఇలా అన్నారు.
“మరి ఇకనేం! ఇవే చెప్పు. ఇంతకంటే పరిచయం చేసేది ఏముంటుంది కనుక. ఎప్పుడు పుట్టామో, ఎప్పుడు గెలిచామో ఎవరికీ కావాలి. ప్రజలకు ఏమి చేశామో, ఏమి చేద్దామనుకున్నామో అది ముఖ్యం” అని భుజం తట్టి పంపించారు. ఆయన చెప్పిన విషయం నాకు తరువాత జీవితంలో అనుభవానికి వచ్చింది. టీవీ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు స్టూడియోలో మోడరేటర్ అడుగుతాడు, మీ గురించి ఎలా పరిచయం చేయాలని. ఏమీ తెలియకుండా ఎలా పరిచయం చేస్తావని వావిలాల వారు గతంలో అన్న మాటలు గుర్తుకు వస్తాయి” అన్నారు గరికపాటి వారు.
అనుకోకుండా గరికపాటివారు రేడియో ప్రస్తావన తీసుకురావడం, ఆయన పేర్కొన్న వావిలాల, సీ.వీ. కె. రావుల ప్రకటనలు వార్తల రూపంలో ప్రసారం అయిన కాలంలో నేను రేడియో విలేకరిగా వుండడం కాకతాళీయం కావచ్చు కాని మనసుకు సంతోషం అనిపించింది.
“మనం ఒకసారి కలుద్దాం” అన్నారు ముగింపులో.
ఇది మరీ సంతోషం కలిగించింది.

NOTE: Courtesy Image Owner




(21-03-2022)

మహనీయుల హాస్య చతురత – భండారు శ్రీనివాసరావు

 

చక్కటి హాస్యం ఉద్రిక్తతలను తగ్గిసుంది. వాతావరణాన్ని తేలికచేస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవడానికి చక్కని మార్గం కూడా. మనమీద మనం జోకులు వేసుకుంటూ మనసు చల్లబరచుకుంటే అహం ఉపశమిస్తుంది. హాస్యం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి పొసగవని భావించే వారున్నారు కాని ఈ అభిప్రాయం తప్పని చెప్పిన మహర్షులు, మహానుభావులు కూడా వున్నారు. చాలామంది మహనీయులు తాము బోధించేది సామాన్య జనాలకు సులభంగా అర్ధం కావడానికి హాస్యం రంగరించి మరీ చెప్పేవారు. కంచి పరమాచార్య, రమణ మహర్షి, స్వామి చిన్మయానంద, దయానంద సరస్వతి మొదలయిన సద్గురువుల సంభాషణల్లో, అనుగ్రహభాషణల్లో హాస్యం చిప్పిల్లుతూ వుండేది.

ఓసారి చెన్నైలో గీతాజ్ఞాన యజ్ఞం నిర్వహించడానికి సరయిన ప్రదేశాన్ని ఎంపికచేసే ప్రయత్నంలో వున్నారు స్వామి చిన్మయానంద. ఆ నగరంలో అనేక దేవాలయాలు వున్నా, ఎక్కడా కూడా గీతాజ్ఞానయజ్ఞం నిర్వహణకు వీలుపడలేదు. ఆ సమయంలో ఈ యజ్ఞం నిర్వహణకోసం ఖాళీగా పడివున్న తన బంగళాను ఇవ్వడానికి ఒకరు సిద్ధపడ్డారు. కాకపొతే అతడు మహమ్మదీయుడు. ఆ బంగళాను చాలాకాలం ఖాళీగా వుంచడానికి కారణాన్ని కూడా అతడు ముందే చెప్పేసాడు. ‘దెయ్యాలు కాపురం వుండడం వల్లె దాన్ని పాడుపెట్టడం జరిగింద’న్నాడు. దానికి స్వామి ఇలా అన్నారు. “అలాగా! నేను ఇన్నాళ్లబట్టి దెయ్యాలను గురించి వినడమే కాని ఎన్నడూ చూడలేదు. ఇన్నాల్టికి వాటిని చూసే అవకాశం లభించింది. పదండి పోదాం”

రమణ మహర్షి ప్రతిరోజూ ఉదయం వేళల్లో అరుణాచలం కొండవరకు నడిచివెళ్ళేవారు. ఒకరోజు అలా వొంటరిగా నడిచివెడుతున్న మహర్షిని దారినవెడుతున్న ఒక వ్యక్తి గమనించాడు. అతడు ఎన్నాళ్ళనుంచో మహర్షి దర్శనం కోసం తహతహలాడిపోతున్నాడు. అందుకని వేగంగా నడిచి మహర్షిని దాటుకుని వెళ్ళి ఆయన మార్గానికి అడ్డంగా నిలబడి “ ఈరోజు యెంత పుణ్యం చేసుకున్నానో నాకు మీరు దర్శనం అనుగ్రహించారు. జన్మ ధన్యం అయింది స్వామీ” అని ఏదేదో చెబుతుండగా రమణ మహర్షి అతడ్ని వారించి ఇలా అన్నారుట, “ నేను నీకు దర్శనం ఇవ్వడం ఏమిటి? నువ్వే నా ఎదుట నిలబడి నాకు నీ దర్శనం అనుగ్రహించావు”

స్వామి దయానంద సరస్వతి మాటల్లో కూడా చక్కని హాస్యం ఉట్టిపడుతుండేది. ఆయన ఒకరోజు తన శిష్యులకు ఓ కధ చెప్పారు. “ ఓ డాక్టరు గారు తన పేషెంట్లలో ముగ్గురి పరిస్తితి బాగాలేదని, వారికి రోజులు దగ్గర పడ్డాయని గ్రహించి వారితో వున్న విషయం చెప్పి ఆఖరి కోరికలు ఏమన్నా వుంటే చెప్పమని అడిగాడు. మొదటివాడు చనిపోయేలోగా దైవ దర్శనం చేసుకోవాలని కోరాడు. రెండో వాడు తన కుటుంబ సభ్యులను చూడాలనివుందన్నాడు. వారికి సరే అని చెప్పి డాక్టర్ మూడో అతడ్ని వాకబు చేసాడు.

వేరే డాక్టర్ కి నన్ను చూపించండి” అన్నది అతగాడి సమాధానం.

కంచి పరమాచార్య వద్దకు ఒక పండితుడు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. భగవద్గీత ప్రవచనంలో తనకు అద్భుతమైన అనుభవం వుందనీ, పది రోజులపాటు గీతను బోధించడానికి ఏదైనా స్థానిక దేవాలయంలో వసతి కలిపిస్తే తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తానని చెప్పాడు. స్వామి అలాగే అన్నారు. మొదటి రోజు సుమారు యాభై మంది దాకా ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చారు. మరునాడు సగం తగ్గిపోయారు. మూడో నాడు వచ్చిన జనం వేళ్ళమీద లెక్కబెట్టే విధంగా అతితక్కువగా వున్నారు. ఆ పండితుడు పరమాచార్యను కలిసి చెప్పాడు. “ఏమి కాంచీపురం అండీ ఇది. ఇంతకష్టపడి భగవద్గీతను చెబుదామని వస్తే మొదటి రోజు పట్టుమని యాభై మంది కూడా రాలేదు. మర్నాడు ఇంకా పలచపడ్డారు. వరస చూస్తుంటే రేపు ముగ్గురు కూడా వచ్చేట్టు లేరు.”

స్వామి మందహాసం చేసి ఇలా అన్నారు. “నువ్వు అదృష్టవంతుడవే! కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించినప్పుడు వినడానికి వున్నది వొకే వొక్కడు. అందుకు సంతోషించు” 

NOTE: Courtesy Image Owner



19, మార్చి 2022, శనివారం

పురుషులలో పుణ్య పురుషులు – భండారు శ్రీనివాసరావు

 

(Published in ANDHRAPRABHA daily on 20-03-2022, SUNDAY, TODAY)

ప్రజా ప్రతినిధులలో కూడా పుణ్య పురుషులు వుంటారు. అందర్నీ ఒకే గాటన కట్టాల్సిన అవసరం లేదు.

ఇప్పటి సంగతి నాకు తెలియదు. వున్నారేమో! కానీ నేను విలేకరిగా పనిచేసే రోజుల్లో కొంతమంది ఇలాంటి వారు తటస్థపడ్డారు. ప్రస్తుతానికి ఓ అయిదుగురు గురించి చెప్పుకుందాం.

బత్తిన సుబ్బారావు గోదావరి జిల్లానుంచి శాసన సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పేద దళిత కుటుంబం నుంచి మంత్రి స్థాయికి ఎదిగినా ఆయన ఆర్ధిక పరిస్తితిలో ఏమార్పూ లేదు. ఆయన తల్లిగారు కూలీపని చేసుకుని జీవనం గడిపేవారు. రాజ్యసభ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బు తీసుకుంటారని ప్రచారం సాగే రోజుల్లో, అనారోగ్యానికి గురై, నిమ్స్ ఆసుపత్రిలో వుండి కూడా వీల్ చైర్ మీద వెళ్లి పైసా తీసుకోకుండా ఓటు వేసి వచ్చారు. చివరకు ఎంతటి గర్భదారిద్య్రంలో కూరుకు పోయారంటే చనిపోయినప్పుడు దహనం చేయడానికి డబ్బులు లేని దౌర్భాగ్య స్తితి.

ఈ విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభ్యులు శ్రీ వేమా, మరికొందరు గోదావరి జిల్లాల సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి ప్రభుత్వం తరపున కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.

అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన చప్పిడి వెంగయ్య. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అభ్యర్ధిగా 1994 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా సింపుల్ గా వుండేవారు.

‘ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం వుండడం లేదు, కనీసం ఈసారయినా నా పేరు సరిగా రాయండయ్యా’ అని అసెంబ్లీ కవరేజ్ కి వెళ్ళే పాత్రికేయులతో అనేవారు సరదాగా. ఆయన పేరు చప్పిడి వెంగయ్య. వెంగయ్య అయివుండదు, అది వెంకయ్య అయివుంటుందని  హైదరాబాదు రిపోర్టర్లు  తామే తీర్మానించుకుని, చప్పిడి వెంకయ్య అని రాసేవారు.

వెంగయ్య గారి ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయడానికి హైదరాబాదు నుంచి ఒక ఆంగ్ల దినపత్రిక తరపున సుశీల్ కుమార్ అనే విలేకరి  ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. వెంగయ్య గారి ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. రెండే గదులు. టీవీ కాదుకదా, కనీసం రేడియో కూడా లేదు. కాలినడకనే ప్రచారం. అయినా గెలిచారు. కాదు ప్రజలు గెలిపించారు. సుశీల్ ఆ రోజుల్లో  చప్పిడి వెంగయ్య గురించి  తన పత్రికలో రాసిన వార్త చాలా సంచలనాన్ని సృష్టించింది.

మరోసారి ఎన్నికల్లో పార్టీ ఫండ్ స్వయంగా అందచేయడానికి ఒక మంత్రిగారు వెళ్ళారు. కానీ ఆయన పైసా కూడా తీసుకోలేదు. చిత్రం! ఆ ఎన్నికల్లో ఓడిపోయారు’

నేను హైదరాబాదులో రేడియో విలేకరిగా చేరిన కొత్తల్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం ఏర్పడింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, మద్యపాన వ్యతిరేకోద్యమ నేతగా ఆయన పలు పర్యాయాలు రేడియో స్టేషన్ కు వచ్చేవారు. నీరు కావి రంగు ఖద్దరు దుస్తులు, ముతక ధోవతి, ముడతలు పడ్డ అంగీ.  భుజం మీదుగా వేలాడుతూ ఒక గుడ్డ సంచి. దూరం నుంచే చూసి చెప్పొచ్చు ఆ వచ్చేది వావిలాల వారని. ఇక ఆ చేతి సంచిలో వుండేవి నాలుగయిదు వేపపుల్లలు, మరో జత ఉతికిన దుస్తులు, నాలుగయిదు పుస్తకాలు, నోటుబుక్కు. 1955 నుంచి 1967 వరకు ఆయన ఇండిపెండెంటుగా గెలుస్తూ వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆయన కాలినడకనే తిరిగేవారు. యెంత దూరమైనా కాలి నడకే. వూరు దాటి సుదూర ప్రాంతాలు  వెళ్ళాల్సివస్తే ఆర్టీసీ బస్సు లేదా సెకండు క్లాసు రైలు. ఒకసారి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్నప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళారు. గెస్టు హౌస్ లో దిగిన వావిలాల వారిని మర్యాద పూర్వకంగా కలుసుకునే నిమిత్తం జిల్లా కలెక్టర్ వెళ్లి గదిలో చూస్తె ఆయన లేరు. బయటకు వచ్చి వాకబు చేస్తే ఆ సమయానికి వావిలాల గెస్టు హౌస్ దగ్గర కృష్ణా నదిలో స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ కానవచ్చారు. ‘అదేమిట’ని కలెక్టర్ ఆశ్చర్యంతో అడిగితే, ‘వున్నవి రెండే జతలు, ఏరోజుకారోజే ఉతుక్కోవడం తనకు అలవాట’ ని చెప్పారు.

 

రాజ్యసభకు ఎన్నికయిన శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ చాలా సౌమ్యులు. రేడియో విలేకరిగా నాకు పరిచయం వుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా ఆయన నిరాడంబరంగా వుండడం నాకు తెలుసు.

రాజ్యసభకు ఎన్నిక అయిన అనంతరం సుభాష్ చంద్ర బోస్ మాట్లాడుతూ తనని రాజకీయాల్లో ప్రోత్సహించిన వారిని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సందర్భాలలో ఎవరయినా సరే, ముందు తమ పార్టీ నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తిన తర్వాతనే ఇతరులను తలుచుకుంటారు.

కానీ ఆయన ముందుగా తలచుకున్నది రాయవరం మునసబు  ఉండవిల్లి సత్యనారాయణ మూర్తి గారిని. ఆయన  ఎవరన్నది ఈ తరం వారికి తెలియదు. ఆయనే తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించారన్నారు. ఒకానొక కాలంలో రాయవరం మునసబు అంటే జిల్లా మొత్తానికి తెలిసిన పేరు. ఆయన జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. కానీ రాష్ట్ర రాజధాని వరకు ఆయన ఎవరో తెలుసు.

సరే! ఈ విధేయతలు అనేవి పార్టీ వ్యవహారాలు. అవి పక్కన పెడదాం. మరి ఆయన నిరాడంబరత్వం. దాన్ని గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి.

 

గతంలో ఓసారి మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు (అప్పుడు శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్ చైర్మన్)  మా వదినెతో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే ఇవ్వాల్సిందని టీసీని అడిగారు. రాజమండ్రిలో మంత్రి సుభాష్ చంద్ర బోస్ కోసం రిజర్వ్ అయ్యాయి, లాభం లేదు అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదా, ఈ సెకండ్ ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.

రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టం, ఆవిడ, మా ఆవిడ కింద బెర్తుల్లో పడుకుంటారు, మనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.

మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే. కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”

మర్నాడు ఉదయం సికిందరాబాదులో రైలు దిగిన తర్వాత మంత్రిగారి పియ్యే ఈ మాట చెప్పి మా అన్నగారి అనుమానం తీర్చారు.

మరో ఉదంతం చెప్పుకుందాం.

ఓ మంత్రిగారు ఆఫీసులో రివ్యూ మీటింగులో వుండగా ఇంటర్ కం మోగింది.

అవతల పియ్యే.

సార్! ఇంటి నుంచి ఫోన్, మేడం గారు లైన్లో వున్నారు’

మంత్రిగారు విసుగ్గా ఫోన్ తీసుకున్నారు. మరింత విసుగ్గా అన్నారు.

ఎన్ని సార్లు చెప్పాను, ఆఫీసులో మీటింగులో వున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. ఇంతకీ ఏమిటంత అర్జంటు పని’

‘........’

కారు పపించాలా! ఎందుకు ఈమీటింగు కాగానే నేనే ఇంటికి వస్తున్నాను. ఈ అరగంటలో కొంపలేం మునగవ్. డ్రైవర్ అటూ ఇటూ రెండు సార్లు తిరగడం దండగ. నేను వచ్చాక వెడుదువ్ కాని’

ఆరోజు మంత్రి ఛాంబర్లో దివాలా తీసిన ప్రూడెన్షియల్ సహకార పట్టణ బ్యాంకు గురించిన మీటింగ్ జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులయిన సహకార శాఖ కార్యదర్శి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహకార శాఖ రిజిస్ట్రార్ శ్రీ గార్గ్, అందులో పాల్గొంటున్నారు.

నిజానికి మంత్రులు ఇంటి పనులకోసం అధికారిక వాహనాలను వాడుకోవడం అనేది సామాన్యంగా జరిగే విషయమే. అలాటి వాటిని చాలా సాధారణ విషయంగా తీసుకోవడానికి జనం అలవాటుపడ్డారు. ప్రతి మంత్రికీ ఆయన శాఖ కిందికి వచ్చే కార్పొరేషన్ వాళ్ళే వాహనాలు ఒకటో రెండో అదనంగా సమకూర్చడం అనేది బహిరంగ రహస్యమే. మరి ఇదేమిటి ఈ మంత్రిగారు భార్య కారు కావాలంటే ఇలా విసుక్కుంటున్నారు?

ఆయన అంతే! ఆయన మంత్రే కాని అందరివంటి వాడు కాదు. ఆయన పేరే చిక్కాల రామచంద్రరావు. అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు నిర్వహించారు. మంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన సొంత అంబాసిడర్ కారునే వాడేవారు. ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ వాడుకునేవారు.

సింపుల్ గా వుండడం ఆయనకు ఇష్టం. మంత్రిగా వున్నప్పుడు ఈ ఇష్టాన్ని మహబాగా తీర్చుకున్నారు.



(19-03-2022)