25, జనవరి 2022, మంగళవారం

"కాలు"క్షేపం – భండారు శ్రీనివాస రావు

 తొంభయ్ అయిదులో నా స్కూటర్ నా మీదనే పడి నా ఎడమ కాలు విరిగింది. ఆరోజుల్లో యాక్టివ్ జర్నలిష్టుని కదా! వీ ఐ పీ డాక్టరు ఒకాయన వీఐ పీ ఆపరేషన్ చేసిన కారణంగా కోలుకోవడానికి మామూలు కంటే నాలుగయిదు నెలలు ఎక్కువ పట్టింది. అన్ని రోజులూ ఆసుపత్రిలో ఎంచక్కా విరిగిన కాలుతో 'కాలుక్షేపం' చేసాను. ఆ డాక్టరు గారు కూడా నా రోజువారీ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం కోసం  నా రూములోనే విడిగా ఒక ఫోను పెట్టించాడు. అప్పటికింకా ఇంత విస్తృతంగా మొబైల్స్ రంగ ప్రవేశం చేయలేదు.

డిశ్చార్జ్ అయి ఇంటికి చేరిన తర్వాత,  మా రేడియో డైరెక్టర్, న్యూస్ ఎడిటర్ పుణ్యమా అని ఆ రోజుల్లోనే ఇంటి నుండి వర్క్ ఫ్రం హోం చేసే మహర్జాతకం నాకు పట్టింది. ఇంటినుంచే  సచివాలయం  ప్రెస్ రూమ్ కి ఫోన్ చేసేవాడిని. చేసి పలానా మంత్రితో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ వుంది అనే విషయం తెలుసుకోగానే, ఆ పలానా  మంత్రికే నేరుగా ఫోన్ చేసి, మీ టైం నా టైం కుదరడం లేదు, ఆ చెప్పే మాటేదో ఇప్పుడే చెప్పేస్తే మధ్యాన్నం ఒకటీ పది వార్తల్లో ఇవ్వడానికి వీలుంటుంది అనేవాడిని. ఆ మంత్రిగారు చెప్పిన మూడు ముక్కలు ముక్కున పెట్టుకుని, మళ్ళీ  రేడియోకి ఫోన్ చేసి చెప్పేవాడిని. ఆ  తర్వాత కాలు మీద విరిగిన  కాలు వేసుకుని సాయంత్రం వార్తల వరకు కాలక్షేపం చేసేవాడిని.

ఇలా  కొన్ని రోజులు గడిచిన తర్వాత.  

నా కాలక్షేపం కోసం, జ్వాలా పూనికతో, ఎంసీఆర్ హెచ్ ఆర్డీ డైరెక్టర్ జనరల్ పీవీఆర్కే ప్రసాద్ గారు, తెలుగు మాతృభాష కాని ఐఏఎస్ ట్రైనీలకి తెలుగు బోధించే పని ఒప్పచెప్పారు. కాలు విరిగిన మనిషిని, కదల లేని మనిషిని కాబట్టి,  మా ఇంటికి దగ్గర్లోనే గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ (ఇప్పుడు వున్నట్టు లేదు) లో ఉంటున్న ఆ ఉత్తరాది యువ అధికారులు ఉదయం, సాయంత్రం మా ఇంటికే వచ్చి నా వద్ద తెలుగు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. నేను నేర్పిన తెలుగేమో కానీ, మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లకు మాత్రం వాళ్ళు బాగా అలవాటు పడ్డారు.

వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్ కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. ఆ మాఫియాకు ఈ అధికారి గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు. మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెప్పాను. ఆయన రవీంద్రభారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను”

సబ్ కలెక్టర్ గా పనిచేసిన ఆ అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే ‘సమర్ధుడు’ అని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!

24, జనవరి 2022, సోమవారం

కరోనా! పులా! పిల్లా! – భండారు శ్రీనివాసరావు

 

గత పది రోజుల్లో చాలా విశేషాలు జరిగాయి. అందులో ఒకటి కరోనా వచ్చి నాతొ నాలుగు రోజులు సహజీవనం చేయడం.

దీనికి ముందు మరి కొన్ని జరిగాయి. మా కోడలుకు కరోనా. ఆ అమ్మాయి వెంటనే చేసిన పని వంటమ్మాయిని, పని అమ్మాయిని  మళ్ళీ చెప్పినదాకా ఇంటికి రావద్దని చెప్పడం.

వున్న మూడు గదుల్లో ముగ్గురం చేరిపోయాం. అందులో  ఒకటి బెడ్ రూమ్ కాదు, వాళ్లు వర్క్ ఫ్రం హోం చేసుకునే గది.

భయపడవద్దు! భయపెట్టవద్దు!

మొదటి రోజే మా వాడు ఈ మాట చెప్పేశాడు. ‘ఇది ఇంట్లో అందర్నీ చుట్టబెడుతుంది. కానీ కంగారేమీ లేదు. మనకు మనమే దీన్ని ఎదుర్కుందాం’ అని.

ఓ మూడు రోజులు వాడు వంట పని నెత్తికి ఎత్తుకున్నాడు. కోడలుకు నాలుగో రోజు నెమ్మదించింది. ఆ వెంటనే మా వాడికి అంటుకుంది. పాపం ఆ అమ్మాయి వేళకు ఇంత అన్నం వండి పెట్టే బాధ్యత తీసుకుంది. నాకా స్టవ్ వెలిగించడం కూడా రాదు. నేను వెంటనే స్విగ్గీకి మారిపోయాను, కరోనా నుంచి కోలుకుంటున్న అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకని.

నాలుగోనాడు, మా వాడి గది నుంచి బయటకు వచ్చిన కరోనాకు, గదిలో ఒంటరిగా  కంప్యూటర్ ముందు కూర్చొన్న నేను కనిపించాను. నాకు చీకట్లో  రెండు కళ్ళు మెరుస్తూ కనిపించాయి. పిల్లి కాబోలు అనుకున్నా. కానీ వచ్చింది పులే అన్న సంగతి మర్నాడు ఉదయానికి కానీ తెలియలేదు.

ఇప్పుడు ఎలా! అపోలోలో పనిచేసే  మా ఆవిడ అక్కయ్య కొడుకు డాక్టర్ బాబీకి ఫోన్ చేశాను. ఏం భయం లేదు, ఈ మాత్రలు తెప్పించి ఇలా వాడండి అని ఫోనులోనే చెప్పి మళ్ళీ వివరంగా మెసేజ్ పెట్టాడు.  వాట్సప్ పెడితే మందులు ఇంటికి పంపడం మా మెడికల్ షాపు అనిల్ కు అలవాటే.

పనివాళ్లు లేరు. గదిలోకి వచ్చేవాళ్ళు లేరు. పిల్లలకి బాగా లేనప్పుడే  స్విగ్గీ ఆర్డర్ ద్వారా తెప్పించుకోవడం మొదలయింది.  డాక్టర్ ఫోన్లో అందుబాటులో వున్నాడు. నేను బయట ఎక్కడో ఆసుపత్రిలో లేను. పిల్లలు పక్క గదిలోనే వున్నారు. రెండో వేవ్ అప్పుడే  మా వాడు ఆక్సిజన్ సిలిండర్, ఆక్సీ మీటర్లు, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ కిట్లు కొనేసి ఇంట్లోనే  వన్ బెడ్ హాస్పిటల్ సిద్ధంగా ఉంచాడు.  ఇక ఏమిటి భయం! ‘తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు’.

ఒంటరిగా వుండడం మూడేళ్ళుగా  అలవాటే! తోడుగా ఎదురుగా గోడ మీద మా ఆవిడ ఫోటో.


కాలక్షేపానికి లోటు లేదు.  పక్కనే లాప్ టాప్. టీవీ, అడిగిన పాత తెలుగు సినిమా పాటలు  వినిపించే అలెక్సా. కిటికీ నుంచి పగలు కనిపించే పచ్చని చెట్టు. ఎప్పటి మాదిరిగానే రోజూ ఫోన్లు చేసి పిచ్చాపాటీ మాట్లాడే ఫ్రెండ్స్.  కరోనా మీద కత్తి దూయడానికి కడుపులో మూడు డోసులు అదనం.  సీరియస్ అయ్యే అవకాశం లేదని డాక్టర్ ఉవాచ.

అంచేత, నా  గదిలోకి వచ్చింది పులి కాదు, పిల్లి అని  నాకు నేనే  భరోసా ఇచ్చుకున్నాను. అది కూడా నా లెక్కలేనితనం చూసి చిన్నబుచ్చుకున్నట్టుంది. తనదారి తాను చూసుకుంది. ఏమీ హడావిడి చేయకుండా వెళ్ళింది అంటే అది పిల్లి అయినా కావాలి లేదా బూస్టర్ ప్రభావం అయినా కావాలి.

మా వాళ్ళు ఫోన్  చేస్తూనే వున్నారు పిల్లలు  ఎలా వున్నారని. నా సంగతి చెప్పలేదు.

ఏదైతేనేం! ఇప్పుడు ఆల్ ఓకేస్!

దీనితో ఒకటే ఇబ్బంది. చాలా చిరాకు అనిపిస్తుంది. తప్పదు. దాన్ని అధిగమించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

ప్రతి కధకు ఒక నీతి వుంటుంది. ఇందులో ఏమిటంటే :

‘కరోనాకు భయపడవద్దు. గాభరా పడవద్దు, ఇతరులని పెట్టవద్దు. కొన్ని జాగ్రత్తలతో ఈ పులిని పిల్లిగా మార్చవచ్చు

తోకటపా!  ఈ మధ్య ఓ స్నేహితుడు ఫోన్ చేసి అడిగాడు, ఏమిటి రోజుకు రెండు మూడు పోస్టులు పెడుతున్నావు అని.  పైగా సుదీర్ఘ సుత్తులు అంటూ ముక్తాయింపు.

కరోనాతో సహజీవనం చేస్తూ ఈ  కాలక్షేపం ఎంచుకున్నానని అతడికి తెలియదు.

(24-01-2022)

23, జనవరి 2022, ఆదివారం

సబ్సిడీల జంఝాటం

 (ఈరోజు ఆదివారం 23-01-2022  ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అలా  పోగుపడే బియ్యాన్ని సేకరించండి. మీ పేటలోని ఏ ఆలయంలోనైనా  ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకుఇతర  అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది " కీర్తిశేషులు కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఒకనాటి అనుగ్రహభాషణ.

మనకు ఉన్న దాంట్లో, అవసరం వున్న వాళ్లను  కొంచెం ఎక్కువ కనిపెట్టి చూడడం అనేది మహాభారత కాలం నుంచి వుంది.

కౌరవులు కుట్రచేసి పాండవులను లక్కఇంట్లో కాల్చి చంపాలని చేసిన ప్రయత్నంలో, సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్న పాండవులు, కుంతీ సమేతంగా  కొంతకాలం అరణ్యవాసం చేసి, తర్వాత ఏకచక్రపురం చేరుకొని  బ్రాహ్మణ వేషాలతో  తిరుగుతూ యాచన ద్వారా సమకూరిన భోజన పదార్ధాలను తల్లి కుంతీదేవికి తెచ్చి ఇస్తుంటారు. తల్లి మనసుకు భీముడి తిండిపుష్టి తెలుసు కనుక, తెచ్చిన వాటిని రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని భీమసేనుడికి, మిగిలిన సగభాగాన్ని తనకు, నలుగురు అన్నదమ్ములకు పంచి ఇచ్చేదని  పౌరాణికులు చెబుతూ వుంటారు. సరే ఇది పక్కన పెడితే.      

మీరు సంపన్నులు. ప్రభుత్వం వంటగ్యాసు సిలిండర్ పై ఇచ్చే సబ్సిడీ మీకు అవసరంలేదు. దేశంలో అందరూ మీలా సంపన్నులు కారు. కట్టెలపొయ్యి ముందు కూర్చుని, పొగచూరిన కళ్ళతో ఇంటిల్లిపాదికీ వంట చేసిపెట్టే పేద తల్లులకు ఈ దేశంలో కొదవ లేదు. వారి కష్టాలు తీర్చాలంటే మీరు కొంత త్యాగం చేయాలి. చేయాలి అంటే  గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓ పేద కుటుంబానికి వంటగ్యాసు సదుపాయం లభిస్తుంది. దయచేసి ఈ పుణ్యం కట్టుకోండి

నరేంద్రమోడీ ప్రధాన మంత్రి పదవిని స్వీకరించిన కొత్తల్లో  దేశంలోని సంపన్న వర్గాలకు చేసిన విజ్ఞప్తి ఇది.

ఎప్పుడో దశాబ్దాల క్రితం పరమాచార్యుల వారు, ఏడేళ్ల క్రితం నరేంద్ర మోడీ చేసిన ఈ వినతులకు సంపన్నవర్గాల నుంచి  లభించిన స్పందన అంతంత మాత్రమే కావడం విచిత్రం.

దీనికి ప్రధాన కారణం మానవ మనస్తత్వం, ముఖ్యంగా మధ్య తరగతివారి ఆలోచనా ధోరణి. ఈ మధ్య తరగతి వారిలో ఎగువ, దిగువ అని మరో రెండు రకాలు ఉన్నప్పటికీ, మనస్తత్వం మాత్రం ఒక్కటే.

పేరుకు సబ్సిడీ అయినా వంట గ్యాస్ ధరపై ఈ సబ్సిడీ రూపంలో వినియోగదారుడికి చెల్లు పడుతోంది చాలా చాలా తక్కువ మొత్తం. ఇళ్ళల్లోవాడే గ్యాస్ సిలిండర్ తాజా ధర 908 రూపాయలు కాగా , సబ్సిడీ కింద బ్యాంకు ఖాతాలో తనకు జమ చేసింది కేవలం   3.95 రూపాయలు మాత్రమే అనే పోస్టు సాంఘిక మాధ్యమాల్లో చూశాను.  సిలిండర్ మోసుకుని ఇంటికి తెచ్చిన వాడికి ఇచ్చే బక్షీసు ఇరవై వుంటుంది. ఒక్క  నాలుగు రూపాయల కోసం సబ్సిడీని వదులుకోలేని మనస్తత్వం ప్రజలది. ఇందుకు ఈ రచయిత కూడా మినహాయింపు కాదు. దేన్నీ తేలిగ్గా వదులుకోలేని తత్వం ఇందుకు కారణం. పైగా సబ్సిడీ వదులుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగనక్కరలేదు. చేతిలో వున్న మొబైల్ లో గివ్ ఇట్ అప్ అనే ఒక బటన్ నొక్కితే చాలు. సబ్సిడీకి మంగళం పాడవచ్చు.  

క్లిష్టతతోకూడిన విషయం కనుక కొన్ని గణాంకాలు ఉదహరించక తప్పడం లేదు.

దేశం మొత్తంలో సబ్సిడీ వంట గ్యాస్ ఉపయోగించే వినియోగదారులు సుమారు ఇరవై ఎనిమిది కోట్ల మంది వున్నారు. వీరిలో కోటిన్నరమంది వార్షిక ఆదాయం పది లక్షల రూపాయలు ఉన్నందున వారికి సబ్సిడీ వర్తించదు. పొతే, మిగిలిన ఇరవై ఆరుకోట్ల పైచిలుకు వినియోగదారులు సబ్సిడీకి అర్హులు. మళ్ళీ వీరిలో మరో పద్దెనిమిది కోట్ల మందికి ఎలాంటి సబ్సిడీ అందడం లేదు. సబ్సిడీ సిలిండర్ ధరకు, మార్కెట్ ధరకు మార్కెట్లో పెద్ద వ్యత్యాసం లేకుండా పోవడం ఇందుకు కారణం అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే భవిష్యత్తులో ఇక గ్యాస్ సబ్సిడీలు ఉండకపోవచ్చు. మనకు తెలియకుండానే అవి దూరం కావచ్చు.

అయితే ఇలా ఆదా అయిన మొత్తాన్ని(ఇరవై వేల కోట్ల రూపాయలు అని అంచనా) కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలకు మళ్లిస్తోంది. అక్షరాలా తొమ్మిది వేల ఏడువందల కోట్ల రూపాయల పై చిలుకు మొత్తాలను దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది పేద వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం కూడా జరిగిపోయింది. కోవిడ్ సంక్షోభంలో దెబ్బ తిన్న పేదలకు మూడు ఉచిత వంట  గ్యాస్ సిలిండర్లు ఇచ్చే నిమిత్తం ఈ మొత్తాన్ని వినియోగించారు.      

 

నిజమే. అభివృద్ధి చెందుతున్న  దేశాల్లో సబ్సిడీలు తప్పనిసరి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ సబ్సిడీ విధానం అమల్లో వుంది. ఎందుకంటె పెరిగే సంపద సక్రమంగా అన్ని చోట్లా సమానంగా పెరగదు. సంపన్నత పెరిగే కొద్దీ సమాజంలో అసమానతలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తాయి. వృద్ధాప్యంఅనారోగ్యం మొదలయిన అంశాలు వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపుతాయి. అంచేతే సిరి సంపదలు పుష్కలంగా వున్న దేశాల్లో కూడా ఆహార సబ్సిడీలుఆరోగ్య సబ్సిడీలు  ఘనంగానే ఉంటున్నాయి. కాకపోతే సబ్సిడీల విషయంలో ఆయా  దేశాల ప్రజలు స్వచ్చందంగా  పాటించే కొన్ని నియమ నిబద్ధతల కారణంగా అవి దుర్వినియోగం కావడం లేదు. సంపన్నులయినవాళ్ళు సబ్సిడీలకోసం ఆరాటపడని మంచి  సమాజాలను వారు సృష్టించుకున్నారు. సంక్షేమ పధకాలకోసం ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు సంపన్నులకోసం కాకుండా ఆపన్నులకోసం ఖర్చు చేయాలని ఆశించేవారు ఆదేశాల్లో అధికంగా వుండడం దీనికి కారణం. మన దేశంలో పరిస్తితి దీనికి పూర్తిగా భిన్నం. సబ్సిడీ బియ్యం నుంచి  ఆరోగ్యశ్రీ కార్డు వరకు ఇదే తంతు. అన్ని రకాల సబ్సిడీలు ఆదాయాలతో నిమిత్తం లేకుండా తమ ఒళ్ళో వచ్చి పడాలని కక్కుర్తిపడేవారే ఎక్కువ.

మరో విచిత్రం అయిన విషయం ఏమిటంటేఉత్పత్తి ఖర్చుకంటే అనేక వందల రెట్లు అమ్మకం ధర వుండే వస్తుసామాగ్రి కొనడానికి పరుగులు తీసే వారే సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అన్నీ సరఫరా చేయాలని పట్టుబడుతుంటారు. సబ్సిడీ తగ్గించినప్పుడల్లా నానా  కాకి గోల  చేస్తుంటారు.

ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రభుత్వాలు  కొన్ని  కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పుకాదు. అయితే అటువంటి నిర్ణయాల అమలు ప్రభుత్వాధినేతల నుంచే మొదలు కావాలి. పొదుపు చేయండని పిలుపు ఇచ్చేవాళ్ళు దాన్ని ఆడంబరంగా చేయకూడదు. వాటి ప్రచారానికి అట్టహాసంగా ఖర్చు చేయకూడదు. ‘సబ్సిడీ వదులుకోవాలని  పిలుపు బడా నాయకుల ఇళ్ళల్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వాడడం లేదుఅనే విషయం  తెలుసుకోగోరే వారుంటే, అలాటి వారిని అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా అలాటి సందేహాలను నివృత్తి చేయగలిగితే మరింత బాగుంటుంది కూడా.

గతంలో లాల్ బహదూర్ శాస్త్రి  ప్రధాన మంత్రిగా వున్నప్పుడు దేశంలో ఏర్పడ్డ తిండిగింజల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ప్రతి సోమవారం ఒక పొద్దు మాత్రమే భోజనం చేయాలని ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన లభించింది. ఎందుకంటె ఆయన ఆ నియమాన్ని అయన  బతికున్నంతవరకు పాటించారు.

తమ భవిష్యత్తు గురించి ఆలోచించే  రాజకీయ నాయకులు దేశంలో  పుష్కలంగా వున్నారు. రేపటి గురించి, జాతి భవిష్యత్తు గురించి  ఆలోచించే రాజనీతిజ్ఞులే క్రమంగా కనుమరుగయిపోతున్నారు.

ఇదొక విషాదం.

తోకటపా: ఇది రాస్తున్నప్పుడు మా అపార్ట్ మెంటు గ్రూపు మెసేజ్ వచ్చింది. ఇరవై లీటర్ల మంచి నీళ్ళ కోసం ఆధార్ ఇవ్వాలని, వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చారని. అందరూ బిలబిలమని వెళ్ళారు. దేశం సర్వనాశనం కావడానికి ఫ్రీ బీస్ ప్రధాన కారణమని వీళ్ళే మళ్ళీ పోస్టులు పెడుతుంటారు.

రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న లేదా ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు అన్నీ అర్హులకు అందినంతవరకు అంత అనుచితమైనవి ఏవీ కావు. ఇందుకోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీ వాడుకుంటే  నిధులు పక్కదారి మళ్ళడం అంటూ వుండదు.



 

 

22, జనవరి 2022, శనివారం

ప్రధాని గారూ! మీరు బూట్లెక్కడ కొన్నారు? – భండారు శ్రీనివాసరావు

 దాదాపు ముప్పయ్యేళ్ల క్రితం నేను మాస్కోలో, రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో ....

ఓ రోజు ఆఫీసులో పనిచేసే రష్యన్ సహోద్యోగి విక్టర్ పత్రికలో పడిన జోకును రష్యన్ యాసలో తెలుగులోకి అనువదించి చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అది అర్ధం కాగానే. అది జోకేమీ కాదు. నిజానికది ఆ దేశ ప్రధాన మంత్రి నికోలాయ్ రిజికోవ్ గురించిన వార్త. ఇనుపతెర దేశంగా పాశ్చాత్య ప్రపంచం ముద్రవేసిన సోవియట్ రష్యాలో అలాటి వార్త నిజంగా వార్తే.

ప్రధానమంత్రి ఏదో కార్యక్రమంలో పాల్గొన్న ఫోటో ఓ పత్రికలో వేసారు. బూట్లు,సాక్సు వేసుకుని ఫోటోలో కానవస్తున్న ప్రధానికి ఆ పత్రిక పాఠకుడు రాసిన బహిరంగ లేఖను అదే పత్రికలో ప్రచురించారు. నా రష్యన్ సహచరుడు విక్టర్   దాన్ని  ఒక జోకుగా నాకు చదివి వినిపించాడు. ఆ లేఖ సారాంశం ఇది.

అయ్యా! ప్రధానమంత్రి గారు. బూట్లు సాక్సుకోసం గత ఆరుమాసాలుగా నేను తిరగని దుకాణం లేదు. మీరు ఎక్కడ కొన్నారో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి’

నేను మాస్కో వెళ్ళిన కొత్తల్లో ఆఫీసులో ఎవ్వరు కూడా, జోకుల సంగతి అటుంచి, అవసరం అయిన దానికంటే ఎక్కువ తక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. అలాంటిది ఏకంగా దేశ  ప్రధాన మంత్రి గురించి, అందులోను ఆయన వేసుకున్న బూట్లూ సాక్సూ గురించీ, వాటికి ఏర్పడ్డ కొరత గురించీ పత్రికకు అలా బహిరంగ లేఖ రాయడం, దాన్ని వాళ్ళు ప్రచురించడం, మళ్ళీ ఆ విషయం గురించి ఆఫీసుల్లో బాహాటంగా చర్చించుకోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఇండియా నుంచి వెళ్ళే ముందు సోవియట్ యూనియన్ గురించి అప్పటివరకు కర్ణాకర్ణిగా విన్నది వేరు, కళ్ళారా చూస్తున్నది వేరుగా ఉండడమే దీనికి కారణం. సోవియట్ గూఢచారి వ్యవస్థ, కేజీబీకి చెందిన ఏజెంట్లు తమ చారచక్షువులతో సమస్తం గమనిస్తుంటారని, ఆఖరికి భార్యాభర్తల నడుమ జరిగే సంభాషణలను సైతం రహస్యంగా వింటు౦టారని ఎన్నో కధలు అప్పుడు ప్రచారంలో ఉండేవి. నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఓ జర్నలిష్టు మిత్రుడు జోక్ చేశాడు కూడా, “శ్రీనివాసరావు మాట్లాడకుండా బతకలేడు, అక్కడ మాట్లాడితే (నోరు తెరిస్తే) బతకలేరు” అని.   

ఈ నేపధ్యంలో మాస్కో వచ్చిన నాకు,  సోవియట్ రష్యాలో నిత్యావసర వస్తువుల కొరత గురించి ఒక సాధారణ పౌరుడు ఏకంగా దేశ ప్రధాన మంత్రిని ఉటంకిస్తూ వ్యంగ ధోరణిలో పత్రికకు ఉత్తరం రాయడం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం నుంచి వెళ్ళిన చాలా  అబ్బురం అనిపించింది.

ఒక విషయం ఒప్పుకుని తీరాలి. గ్లాస్ నోస్త్, పెరిస్తోయికా పేరుతొ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన సోవియట్ అధినేత మిహాయిల్ గోర్భచేవ్ పౌరులకు చేసిన మేలేమిటో నాకు తెలియదు కానీ, ప్రజలు ప్రగాడంగా కోరుకుంటున్న వాక్స్వాతంత్రం మాత్రం పుష్కలంగా ప్రసాదించాడని నాకు అర్ధం అయింది. నిజానికి జీవించడానికి ఏమేమి కావాలో అవన్నీ అక్కడ వున్నాయి. పైగా కారుచౌకగా. లేనిదల్లా మనసులో మాట బయట పెట్ట గలిగిన స్వేచ్చ ఒక్కటే. గోర్భచేవ్ పుణ్యమా అని అదొక్కటీ దొరకడం వారికి ఎన్నడూ ఊహించని వరప్రసాదంగా భావించి వుంటారు.

ఆ కమ్యూనిస్టు దేశంలో ఇలా మొదలైన మార్పు, మార్పు అనే పదానికంటే గొప్పగా మార్పు చెందడమే నేనున్న అయిదేళ్ళ కాలంలో నేను చూసిన మార్పు. అందుకే నా మాస్కో అనుభవాల సమాహారానికి ‘మార్పు చూసిన కళ్ళు’ అని పేరు పెట్టుకున్నాను.

మార్పు అనేది ఎలా వుంటుందో తెలియకుండా సుమారు ఏడు దశాబ్దాలకు పైగా జీవించిన రష్యన్లకు తమ జీవితాల్లో పెను మార్పులు రాబోతున్నాయని ఏనాడూ ఊహించి వుండరు. చాప కింది నీరులా మార్పులు కనీ కనబడకుండా ప్రవేశిస్తున్న సంగతి మా మాస్కో మజిలీ చివరాఖరు రోజుల్లో మాకు కూడా బోధ పడింది. ఈ మార్పుల పర్యవసానం చివరికి మాస్కో రేడియో విదేశీ ప్రసారాలు మూతపడేంతవరకు దారి తీసింది.

సోవియట్ల అధికారానికి అంతిమ ఘడియలు దాపురిస్తున్నాయనడానికి సంకేతంగా మాస్కో రేడియోనుంచి వెలువడే అనేక ప్రపంచ భాషలు, వివిధ భారతీయ భాషల్లో ప్రసారాలను చాలావరకు నిలిపివేశారు. ఇక ప్రచారం అనవసరం అనుకున్నారేమో తెలియదు. ఆ క్రమంలో  చిట్టచివర్లో నిలిపివేసిన దక్షిణాది భారతీయ భాషల్లో తెలుగు విభాగం ఒకటి.

ఉపసంహారం: రష్యా నుంచి, అంటే అప్పటికింకా సోవియట్ యూనియనే, శాశ్వతంగా సొంత గడ్డకు తిరిగి వచ్చే ముందు  మాస్కో రేడియో తెలుగు విభాగం ఆఖరు బులిటెన్లో   ధైర్యం చేసి చెప్పిన చివరి పలుకులివి:

మాస్కో రేడియో నుంచి తెలుగులో వార్తలు ఇంతటితో ‘శాశ్వతంగా సమాప్తం”

 

21, జనవరి 2022, శుక్రవారం

అత్తా ఒకింటి కోడలే! – భండారు శ్రీనివాసరావు

 యాభయ్ ఏళ్ళ క్రితం ప్రతి ఉద్యోగానికి ఎంప్లాయ్ మెంటు ఆఫీసు నుంచి నెంబరు అడిగేవాళ్ళు. హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వుంది ఆ ఆఫీసు. అక్కడి సిబ్బంది నిరుద్యోగులను కొంత చులకనగా చూసేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన మా బంధువును కూడా హీనంగా చూసారని చెప్పడంతో నేను పై వారికి చెప్పాను. వాళ్ళు అతడికి ఎంప్లాయ్ మెంట్ ఆఫీసులోనే ఉద్యోగం ఇచ్చారు. కొన్ని నెలలు గడిచిన తరువాత అతడి వైఖరిలో మార్పు మొదలయింది. నిరుద్యోగులను చిన్నబుచ్చి కసురుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. గతంలో అతడూ ఇటువంటి తిరస్కారాలకు గురైన వాడే, అదేమిటో కుర్చీలో కూర్చోగానే మారిపోయాడు.

20, జనవరి 2022, గురువారం

ఇచ్చుటలో వున్న హాయీ! – భండారు శ్రీనివాసరావు

 పాండవాగ్రజుడయిన యుధిష్ఠిరుడు ఓ రోజు జూదమాడుతూ ఆనందిస్తున్న వేళ ఓ భిక్షకుడు వచ్చి ధర్మం చేయమని కోరాడు. ధర్మరాజు జూదం ధ్యాసలో వుండి ‘చేయి ఖాళీ లేదు మర్నాడు రమ్మన్నాడ’ట. ఆ పక్కనే కూర్చుని తన గదకు మెరుగులు దిద్దుకుంటున్న భీముడు, అన్నయ్య ధర్మజుడు నుడివిన మాటవిని ఎంతో సంతోషించాడట. ఎందుకటా!

ఎందుకంటే, వాక్శుద్ధి కలిగిన ధర్మరాజు తన తొందరలో వుండి ఆ భిక్షకుడిని మరునాడు రమ్మని చెప్పాడంటే మరుసటి రోజువరకు అగ్రజుడు బతికే వుంటాడని ఆ కండల వీరుడు సంబరపడ్డాడట. ఈ క్షణంవరకు ప్రాణాలతో వున్న మనిషి మరునిమిషం దాకా జీవించివుంటాడో లేదో తెలియని అశాశ్వతమైన బతుకులు మానవులవి. అలాటిది తక్షణం చేయదలచుకున్న దానాన్ని మరో క్షణం వరకు వాయిదా వేయడం మంచిది కాదన్న పెద్ద నీతి ఈ చిన్ని కధలో వుంది.
ఒకరికి ఇవ్వడం, అది దానం అనండి మరోటి అనండి అది ఏమయినా సరే వాయిదా వేస్తే క్షణ భంగుర జీవితంలో అది నెరవేరే వీలుండక పోవచ్చు కూడా. అందుకే ఒకరికి ఏదయినా ఇవ్వాలన్న ఆలోచన కలగగానే దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడం మంచిది.
ఇచ్చుటలో ఎంతో హాయి వుందని బాపూ రమణలు ఎన్నోసార్లు చెప్పారు. ఆ ఇవ్వడానికి కూడా ఓ తరీఖా వుందంటున్నారు ఇవ్వడం తెలిసినవాళ్ళు.
‘నదుల్లో నీళ్ళు పుష్కలంగా వుంటాయి. కానీ నది దాహం వేసినప్పుడు తనలో పారే నీళ్ళను ఎప్పుడూ తాగదు. అలాగే చెట్టుకు యెంత ఆకలేసినా తనకు కాసిన పళ్ళను తినదు. అంటే ఏమిటి. ఏదయినా, తనదయినా ఇతరులకి ఇవ్వడం అన్నదే ప్రకృతి ధర్మం.
అయితే తనకు మాలిన ధర్మం కూడా పనికి రాదని అంటున్నారు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్లు.

19, జనవరి 2022, బుధవారం

యూనియన్ – భండారు శ్రీనివాసరావు

 చదువుకుండే రోజుల్లో మొదటిసారి ఈ మాట విన్నాను. యూనియన్ అంటే  స్టూడెంట్స్ యూనియన్ అనుకునేరు.

ఆంధ్రపత్రికలో కాబోలు ఓ వార్త వచ్చింది. ఎల్.ఐ.సీ. (జీవిత బీమా సంస్థ)లో కంప్యూటర్లు ప్రవేశపెట్టాలనే యాజమాన్యం ప్రతిపాదన, యూనియన్ల వ్యతిరేకత కారణంగా బుట్ట దాఖలు అయిందని. అప్పటికి కంప్యూటర్ అనే పదమే తెలుగు నిఘంటువులో చేరినట్టు లేదు. ఎవరో కాని ఆ దార్శనికుడు, ఆ కాలంలోనే  కంప్యూటర్ గురించి  ఆలోచించాడు అన్నమాట. ఇనుప బీరువాల కన్నా పెద్ద సైజులో ఉంటాయని చెప్పుకునే వారు. కంప్యూటర్లు వస్తే పదిమంది పని అది ఒక్కటే చేస్తుందని, అంచేత తమ ఉద్యోగాలకు ముప్పు అని సిబ్బంది భయం. అప్పటికి కంప్యూటర్ అంటేనే తెలియదు కనుక యూనియన్ల భయం ఏమిటన్నది కూడా జనాలకు పట్టలేదు.

తర్వాత ఎప్పటికో దశాబ్దం తర్వాత, మొదటి ఉద్యోగం ఆంధ్రజ్యోతిలో చేరిన తర్వాత బీమా ఏజెంటు మాధవరావు గారి పుణ్యమా అని  నేనో ఎండోమెంటు  పాలసీ తీసుకున్నాను. పదేళ్లకో, పదిహేనేళ్లకో   మెచూర్ అయ్యే పాలసీ.  ఆ పాలసీ డబ్బులు తీసుకోవడానికి నేను  పడ్డ ఇబ్బందులు ఒకటీ రెండూ కాదు. పైగా డివిజినల్ మేనేజర్ల స్థాయి అధికారులతో మంచి పరిచయాలు వుండి కూడా నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఏ కాగితము ఒక పట్టాన దొరికేది కాదు. వెతికి పెట్టి కబురు చేస్తాం అని పంపించేవాళ్లు.

ఎవరు పాలసీ తీసుకున్నా  చిన్న వయసులో తీసుకుంటారు. ఎప్పుడో నలభయ్ యాభయ్ ఏళ్ళ  తర్వాత  పాలసీ డబ్బులు రావాలి. అప్పటిదాకా ఆ పత్రాలు పదిలంగా వుంచుకోవాలి. ఈ ప్రయాస లేకుండా ఆయనెవరో కంప్యూటర్లు అంటే ఆ ఆలోచన పడనివ్వలేదు. కాలక్రమంలో ఏం జరిగింది? ఇప్పుడు ఆ  సంస్థలో అన్నీ కంప్యూటర్లే. చకచకా పనులు జరిగిపోతున్నాయి.

అది ఏ సంస్థ అయినా  దాని  వినియోగదారులు తమకు దొరికే సేవలు గురించి ఆలోచిస్తారు. అక్కడ  పనిచేసే ఉద్యోగులు సంస్థతో  పాటు తమ గురించి కూడా అలోచిస్తుంటారు. సహజం కూడా.

ఒకప్పుడు హైదరాబాదు నుంచి రైల్లో వైజాగు పోవాలంటే రిజర్వేషన్ నేరుగా చేయించుకోవడానికి వీలుండేది కాదు.  చార్టులో పేరు రాకపోతే ఇంతే సంగతులు. కంప్యూటర్ల ప్రవేశంతో ఇప్పుడు దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా టిక్కెట్టు కొనుక్కోవచ్చు. ఇలాగే ఎన్నో రంగాల్లో కంప్యూటర్లు మనిషి జీవనంలో వున్న సంక్లిష్టతలను బాగా తగ్గించివేసాయి.

అయితే,  ఒకానొక కాలంలో వీటికి ఉద్యోగ సంఘాల నుంచి గట్టి వ్యతిరేకత ఎదురయిన సంగతి బహుశా ఈ కాలపు సంఘాలవారికే తెలియకపోవచ్చు.

నేను పుష్కరం క్రితం యాక్టివ్ జర్నలిజం నుంచి బయట పడ్డాను కాబట్టి  బ్యాంకుల్లో ఇప్పటి పరిస్థితి పట్ల అవగాహన లేదు.

ఓ పాతిక ముప్పయి ఏళ్ళ క్రితం ప్రభుత్వరంగ  బ్యాంకుల్లో యూనియన్లదే రాజ్యం.

రేడియో విలేకరిగా నాకు అనేక బ్యాంకుల యూనియన్ నాయకులతో సన్నిహిత పరిచయం వుండేది. అలాగే బ్యాంకు యాజమాన్యాలతో కూడా. అంటే అత్యున్నత స్థాయి అధికారులు అన్నమాట.

ఈ నేపధ్యంలో  మా కుటుంబానికి బాగా దగ్గరైన వారి నుంచి ఆర్డర్ లాంటి అభ్యర్ధన వచ్చింది. వాళ్ళ అబ్బాయికి కొత్తగా పెళ్లయింది. అతడికి హైదరాబాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో ఉద్యోగం. అతడ్ని చేసుకున్న అమ్మాయికి కూడా అదే బ్యాంకులో ఉద్యోగం. కాకపోతే ఎక్కడో సుదూర గ్రామీణ ప్రాంతంలో. ఆ అమ్మాయిని కూడా హైదరాబాదుకు బదిలీ చేయించాలి. అదీ నా మీద పడ్డ భారం.

ఒకరోజు గన్ ఫౌండ్రీ లోని  బ్యాంకు హెడ్ ఆఫీసుకు వెళ్లి   మేనేజింగ్ డైరెక్టర్ ని కలిసాను. కాఫీ బిస్కెట్లు తెప్పించి మర్యాద చేస్తున్న ఆ పెద్దాఫీసరు, నా అభ్యర్ధన సంగతి  తెలపగానే కొంచెం అనీజీగా ఫీలయ్యారు. నన్ను వెంటబెట్టుకుని వెళ్ళిన బ్యాంకు పీఆర్వో  నన్ను బయటకు తీసుకువచ్చి, ఎండీకి చెప్పారు కదా! ఏదో విధంగా పని జరుగుతుంది లెండి అని హామీ ఇచ్చాడు. ఇస్తూనే  ఒక సలహా చెప్పాడు. బ్యాంకుకు రోడ్డు అవతలే యూనియన్ ఆఫీసు వుంది. ఎందుకైనా మంచిది, ఇక్కడి దాకా వచ్చారు కదా, వారి చెవిలో కూడా ఒక మాట వెయ్యండని  కర్ణుడి జన్మ రహస్యం నా చెవిలో ఊదాడు.

యూనియన్ నాయకులతో నాకు మంచి పరిచయం వుంది కానీ అసలు తాళం చెవి వారిదగ్గర వుందని అప్పటిదాకా నాకు తెలవదు. వెళ్లి కలిస్తే, వాళ్ళు అయ్యో ఇదెంత పని, ఇందుకోసం ఇక్కడి దాకా రావాలా అంటూ ఏదో ఫైలు చూసి ఆ అమ్మాయి మెంబర్ షిప్ తీసుకున్నట్టు లేదు, ఆ మాట చెప్పండి ఆమెతో. వచ్చే బదిలీల్లో తప్పకుండా అవుతుంది. ఆర్డర్ రాగానే ఫోన్ చేసి నేనే చెబుతాను అన్నాడు ఆ నాయకుడు. అన్నట్టే ఆ బదిలీ జరిగింది. ఆమె సభ్యత్వం తీసుకున్నదో లేదో తెలియదు. పని అయినందుకు నేను ఎవరికి కృతజ్ఞత చెప్పాలో తెలియలేదు. ఒక విషయం మాత్రం తెలిసింది. బ్యాంకు ఉద్యోగుల బదిలీల్లో యూనియన్లదే చివరి మాట.

అలాగని యూనియన్ల మీద నాకు చిన్న చూపేమీ లేదు. ఉదాహరణకు గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందికి పేరెంట్ బ్యాంకు సిబ్బంది, అధికార్లతో సమానంగా జీతాలు పెరగడానికి, పెన్షన్ సౌకర్యం  ఏర్పడడానికి కారణం ఆ బ్యాంకుల  యూనియన్లు దశాబ్దాల పాటు చేసిన న్యాయపోరాటం అని  నాకు బాగా తెలుసు. వారి పేరెంటు బ్యాంకు స్టేట్ బ్యాంకులో పనిచేసే వారికన్నా ఎక్కువ పెన్షన్ వాళ్ళు  పొందుతున్నారు అంటే నమ్మడం కష్టమే. ఇదంతా యూనియన్ల చలవే. 

(19-01-2022)